సంపాదకీయం
శాలివాహన 1947 శ్రీ విశ్వావసు మాఘ బహుళ అష్టమి – 09 ఫిబ్రవరి 2026, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ఆయుధానికి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పదును లేకుండా చేశారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నారన్న సాకు చూపించి, భారత్ ఉత్పత్తులపై అమెరికా 50 శాతం వరకు ప్రతీకార సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. 2026`27 సంవత్సరానికి ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి బడ్జెట్ సమర్పించిన రెండు రోజులకే ప్రతీకార సుంకాలను 18 శాతం తగ్గించినట్టు అమెరికా ప్రకటించింది. ఇది యాదృచ్ఛికం కావచ్చు. లేదా ఒక క్రమంలోనే జరిగి ఉండవచ్చు. ఏమైనా అమెరికా సుంకాల బెది రింపులకు భారత్ లొంగబోదన్న సంకేతం మాత్రం ప్రపంచమంతటికీ ఈ బడ్జెట్ ప్రతిపాదనతో వెళ్లింది. ఇది భారత సార్వభౌమాధికారం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనం. నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం మొదటి నుంచి చెబుతున్నట్టు 2047లో వికసిత్‌భారత్‌ను చూడాలన్న లక్ష్యంతోనే ప్రతి బడ్జెట్‌ను సమర్పిస్తున్నది. ఈ బడ్జెట్ కూడా ఆ బాటలో నడిచిందని నిపుణులు చెబుతున్నారు.
ఈ బడ్జెట్‌లోను ఆత్మ నిర్భర భారత్ తాత్త్వికత సుస్పష్టం. ఆత్మ నిర్భర భారత్‌లో అంతర్లీనంగా ఉండేదే సార్వభౌమాధికారం ఎడల తిరుగులేని నిబద్ధత. పాశ్చాత్య దేశాలు భారత్ పట్ల పైకి ఎలాంటి ప్రేమ కనపరిచినా, ఈ దేశం ఎదుగుదల మీద గుర్రుగానే ఉన్నాయి. ఆ ఎదుగుదల వేగం తగ్గించడానికి చూస్తున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ, తమ మాటను అలక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నది ఇదే. ఆ సుంకాలతో ఔషధరంగం, జౌళి పరిశ్రమ, సముద్రం నుంచి వచ్చే ఆహారోత్పత్తులు దారుణంగా దెబ్బతిన్నాయి. కానీ ఇందుకు పరిష్కారం అమెరికా షరతులకు పూర్తిగా తలొగ్గి మన విధానాల నుంచి వెనక్కి తగ్గడం కాబోదు. అందుకే ట్రంప్ సుంకాల దెబ్బ పడిన ఆయా రంగాలకు బడ్జెట్‌లో చేయూతనిచ్చారు. వాటి ఎగుమతులను ప్రోత్సహించేందుకు పూనుకున్నారు. మూడం చెలలో దిగుమతులు తగ్గించాలని కూడా ప్రతిపాదించారు. ఆ విధంగా అమెరికా బాధిత రంగాలకు కస్టమ్స్ నుంచి ఊరట కల్పించారు సీతారామన్. ప్రపంచ మార్కెట్‌తో దీటుగా ఎగుమతులను విస్తరించాలన్న వ్యూహాన్ని కూడా అమలు చేస్తున్నారు.
స్వదేశీ స్ఫూర్తిని బడ్జెట్‌లో ప్రతిఫలింపచేస్తూ మూడంచెల వ్యూహాన్ని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. మొదటిదశలో ఇతర దేశాలపై ఇప్పటికే ఆధారపడిన రక్షణ, ఇంధన, ఆరోగ్య రంగాలలో స్వయంసమృద్ధిని సాధించడానికి తక్షణమే కృషి ప్రారంభిస్తారు. రెండోదశలో ఇతర దేశాలతో పోటీ పడే విధంగా సెమీ కండక్టర్, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చురింగ్ ఎగుమతులను పెద్ద ఎత్తున ప్రోత్సహి స్తారు. మూడోదశలో దేశీయంగా సరసమైన ధరలకు దొరకని ఉత్పత్తులను మాత్రం దిగుమతి చేసుకుంటారు. భారత్ సహా ప్రపంచ దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య చిప్‌ల కొరత. దీని పరిష్కారం కోసం భారత్ ఇంత క్రితమే సెమీ కండక్టర్ మిషన్‌ను విస్తరించుకుంది. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు 2.0ను కొత్త బడ్జెట్‌లో ప్రకటించింది.
మోదీ ప్రభుత్వం మొదటి నుంచి దేశ భద్రతకు అగ్రతాంబూలం ఇస్తున్నది. గతంలో చైనా, పాకిస్తాన్ నుంచి సరిహద్దులకు ఉన్న ముప్పు ఇప్పుడు బాంగ్లాదేశ్ వైపు కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో రక్షణ రంగానికి నిధులు పెంచడం ఆహ్వానించదగినది. ఇదే బడ్జెట్ పరిభాషలో చెప్పాలంటే స్థూల జాతీయోత్పత్తిలో రక్షణ బడ్జెట్‌ను రెండు శాతానికి పెంచారు.
అనుత్పాదక వ్యయాలకు సాధ్యమైనంత దూరంగా ఉండడమే మొదటి నుంచి బీజేపీ, ఎన్‌డీఏ విధానంగా పాటిస్తున్నాయి. బడ్జెట్ ప్రతిపాదనకు, శాసనసభల ఎన్నికలకు మధ్య వ్యవధి తక్కువగా ఉంటే బడ్జెట్ నిండా తాయిలాలు తాండవించడం చూస్తాం. కానీ బీజేపీ ప్రభుత్వాలు ఈ అవాంఛనీయ పోకడకు ఆది నుంచి దూరంగానే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ నియమాన్ని మరింత కఠినంగానే అమలు చేస్తున్నది. ఈ బడ్జెట్‌లోను అలాంటి క్రమశిక్షణనే ప్రతిపాదన వేళ పాటించారు. ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి, నాలుగు రాష్ట్రాల శాసనసభలకు వచ్చే రెండు మూడు నెలలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో పశ్చిమబెంగాల్, తమిళనాడులలో తన ఉనికిని బలంగా చాటుకోవడం ఒక రాజకీయపక్షంగా బీజేపీకి అత్యవసరం. అక్కడి పరిస్థితులు అలాంటివి. పశ్చిమ బెంగాల్ ఒక అరాచక రాష్ట్రం. వేర్పాటు వాదానికి అధికారికంగా మద్దతు ఉన్న రాష్ట్రం. పొరుగు దేశం నుంచి చొరబాట్లు ఆపడానికి కంచె నిర్మించే పనికి కూడా అడ్డం పడుతున్న పార్టీ అక్కడ రాజ్యమేలుతున్నది. ఇక సెక్యులరిజం మాటున మెజారిటీ ప్రజల మనోభావాలను పదే పదే దారుణంగా అవమానిస్తున్న డీఎంకే అధికారంలో ఉన్న రాష్ట్రం తమిళనాడు. దేశ సమైక్యతకు డీఎంకే ముమ్మాటికీ ముప్పు. వీటిని ఓడించాలి. అయినా ఇందుకు కేంద్ర ప్రభుత్వం, దానిని నడిపిస్తున్న బీజేపీ ప్రజాకర్షక బడ్జెట్‌ను రుద్దలేదు. ప్రజాధనాన్ని తమ పార్టీ గెలుపునకు, పరోక్షంగా ఓట్లు కొనుగోలుకు ఉపయోగించే నీచత్వానికి దిగజారలేదు. ఓట్ల కోసం ఉచితాల బడ్జెట్‌ను దేశం మీదకు వదలలేదు.
ఇది పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన ఏకాత్మ మానవ దర్శన స్వర్ణోత్సవ సంవత్సరం. ఆత్మ నిర్భర భారత్ ఆశయం ఆ దర్శనం నుంచి అందినదే. ప్రపంచ దేశాలలో భారత్ ప్రత్యేకతను చాటడానికి, దేశీయ మైన ఆలోచనలతో, స్వదేశీతో ముందుకు సాగడానికి ఆత్మ నిర్భర భారత్ రాచబాట అని ఇప్పుడు రుజువు అవుతున్నది. భారతీయుల ఆత్మగౌరవాన్ని, భారత సార్వభౌమాధికారాన్ని ఆ సిద్ధాంతం నిశ్చయంగా నిలుపుతుంది. వరసగా 9వసారి బడ్జెట్ సమర్పించినందుకు నిర్మలా సీతారామన్‌ను అభినందించాలి. సార్వభౌమాధికార స్పృహను నిర్ద్వంద్వంగా ప్రకటించిన మొదటి బడ్జెట్ ఇదే కావచ్చు.