సంపాదకీయం
శాలివాహన 1947 శ్రీ విశ్వావసు మాఘ బహుళ పాడ్యమి – 02 ఫిబ్రవరి 2026, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
మనం ఎక్కడ నుంచి బయలుదేరామో తెలియాలంటే చరిత్రను ఆశ్రయించాలి. మన పయనం ఎక్కడికో, లక్ష్యం ఏమిటో తెలియాలన్నా చరిత్రలో మనం బయలుదేరిన బిందువునే అడగాలి. జనవరి 23,24 తేదీలలో విజయవాడలో జరిగిన బీజేపీ సభల ఉద్దేశం ఇందుకు సబంధించినదే. తన మూలాలు భారతీయ జనసంఘ్‌లో ఉన్నాయన్న సంగతిని బీజేపీ ఏనాడూ విస్మరించలేదు. విస్మరించదు. జనసంఘ్ ఆశ యాలను కాలానుగుణమైన కొన్ని మార్పులతో బీజేపీ స్వీకరించింది. ఇందులో దాపరికం, దాగుడుమూతలు లేవు. దేశానికి ప్రథమ స్థానం అన్నమాట ఆరోజు లేకపోవచ్చు. వినిపించకపోవచ్చు. కానీ జనసంఘ్ గుండె ఘోష అదే. కశ్మీర్‌ను ప్రత్యేక ప్రతిపత్తి నుంచి రక్షించాలన్నది ఆ పార్టీ నినాదం. దేశమంటే భక్తి ఉన్నవారు ఎవరైనా ఆ ఆశయంలోని వాస్తవికతను గుర్తించగలుగుతారు. జనసంఘ్ ఇచ్చిన ఆ నినాదాన్ని బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆచరణలో చూపించింది. ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణాన్ని తొలగించింది. భారత్ నుంచి కశ్మీర్‌ను విడదీయాలన్న వేర్పాటువాదుల కుట్రలను చివరి క్షణాలలో భగ్నం చేయగలిగింది. హిందూత్వ పార్టీ అన్న ముద్ర ఉంటే ఉండవచ్చు గాక. విమర్శలు వెల్లువెత్తితే ఎత్తి ఉండవచ్చు గాక. కానీ ఆ చర్య దేశానికి, దేశ సమగ్రతకు ఎంత అవసరమో భావితరాలు గుర్తించి తీరతాయి. చరిత్ర శ్లాఘిస్తుంది.
1965 నాటి జనసంఘ్ విజయవాడ సభలలో ప్రతిపాదించిన ఏకాత్మ మానవ దర్శనం (ఏకాత్మ మానవవాదం) ఎన్నో కోణాల నుంచి విశిష్టమైనది. కశ్మీర్ అంశం అందులో ఒకటి మాత్రమే. ప్రచ్ఛన్నయుద్ధం ప్రపంచానికి నిద్ర లేకుండా చేస్తున్న కాలంలో ఈ సిద్ధాంతం ఉద్భవించింది. కమ్యూనిజం కోట్ల మందిని వర్గశత్రువుల పేరుతో నిర్మూలిస్తుంటే, రాజ్యాల పాలనకు, పాలన ఇచ్చే ఫలితాలకు మనిషి కేంద్ర బిందువుగా ఉండాలని ప్రతిపాదించిన గొప్ప మానవతా దృష్టి కలిగిన సిద్ధాంతం ఏకాత్మ మానవ దర్శనం. పెట్టుబడిదారీ విధానం మనిషిని నైతిక విలువల నుంచి, మనశ్శాంతిని ఇచ్చే, సాంత్వన కూర్చే ఆధ్యాత్మిక చింతన నుంచి వేరు చేస్తే, వాటిని పునఃప్రతిష్ఠించుకోవలసిన అవసరాన్ని ఏకాత్మ మానవతా దర్శనం లోకానికి చాటింది. సోవియెట్ రష్యా, చైనా, వియత్నాం, కంబోడియాలలో జరిగిన మానవ హననం అమానుషం. ఆ రక్తపాతం దారుణం. ఏడుపదులు లేదా ఆరుపదులు మాత్రమే మనగలిగిన రాజకీయ సిద్ధాంతం కోసం ఇంత మధ్యయుగాల రక్తదాహాన్ని కొనసాగించాలా? పెట్టబడిదారీ విధానం అంటే ప్రచ్ఛన్నయుద్ధాన్నీ, కమ్యూనిజాన్నీ నిలువరించే పేరుతో జరిగిన సామ్రాజ్య విస్తరణ. నిజానికి రెండు సిద్ధాంతాల అంతిమ లక్ష్యం సామ్రాజ్యకాంక్ష మాత్రమే. వీటిని సవాలు చేసినవారే దీనదయాళ్.
సిద్ధాంతాలను ప్రవచించడం వేరు. వాటిని ఆచరించడం వేరు. సమాజాల మీద వాటి ప్రభావం ఎంతో గుర్తించగలగడం అసలైన రాజనీతిజ్ఞత. అలాంటి రాజనీతిజ్ఞతను నాడు దీనదయాళ్ ఉపాధ్యాయ, దత్తోపంత్ ఠేంగ్డీ వంటివారు ప్రదర్శించారు. అందుకు కారణం ఒక్కటే. దిగుమతి చేసుకున్న సిద్ధాంతాలు మన నేలను ఉద్ధరించవు. దేశ సమస్యలకు దేశీయమైన పంథాలు మాత్రమే అక్కరకు వస్తాయన్న విజ్ఞత. ఇలాంటి జ్ఞానదృష్టి వారికి ఇచ్చినది, మాతృసంస్థ ఆరఎసఎస్.ఈ దేశానికి ఘన చరిత్ర ఉంది. ఈ మాట అంటే చాలు వెక్కిరింపులు వచ్చాయి. ఈ దేశానికి రాజనీతి, పాలనావిధానం సమున్నత శిఖరాలను చూసిన చరిత్ర ఉంది. ఈ మాట అంటే అవహేళనలే. కానీ కాలం మారింది. కాలం కప్పిన పొరల నుంచి ఇప్పుడు ఏకాత్మ మానవ దర్శనం విశ్వరూపం దాల్చింది. దానిని ఔదలదాల్చిన భారత్ సాధిస్తున్న విజయాలు విశ్వాన్ని విస్తుపోయేటట్టు చేస్తున్నాయి.
అంత్యోదయ అన్న సూత్రం స్వతంత్ర భారతదేశంలో వినిపించలేదు. సోషలిజం అన్న మాట విన్నాం. కమ్యూనిజం అన్న నినాదం విన్నాం. కానీ అవి అతి తొందరగా రంగువెలిశాయి. లేదంటే రంగే మార్చుకున్నాయి. స్వదేశీని కూడా జోడించుకున్న ఏకాత్మ మానవ దర్శనం ఇచ్చిన మార్గదర్శనంలో భారతావని నిశ్చయంగా సమున్నత శిఖరాల వైపు సాగిపోతున్నది. ఆర్థికవ్యవస్థ, రక్షణ వ్యవస్థ, దేశభద్రత నిలకడగా ఉన్నాయి. ఏకాత్మ మానవ దర్శనం అరు దశాబ్దాలక్రితమే దేశం ముందుకువచ్చి ఉండవచ్చు. కానీ పదిమంది ప్రధానులు చేకూర్చలేని మేలును ఇద్దరు బీజేపీ ప్రధానులు కూర్చారు. అలా నిలకడగా సాగుతున్న వ్యవస్థలను ధ్వంసం చేయాలన్న దుర్బుద్ధి మాత్రం స్వైరవిహారం చేస్తున్నది.
అద్దెకు తెచ్చిన గుర్రాలు అగడ్తలు దాటవు. అరువు తెచ్చుకున్న విదేశీ సిద్ధాంతాలైనా అంతే. విదేశీ దురాక్రమణదారులు మిగిల్చిన సమస్యలను విదేశీ సిద్ధాంతాలు పరిష్కరిస్తాయా? ఒకప్పుడు ప్రపంచ జీడీపీలో దాదాపు 25 శాతం ఉన్న భారత్ వాటా 1947 నాటికి కేవలం 4 శాతం. స్వతంత్ర భారతదేశంలో ఓడలలో విదేశాల నుంచి ఆహార పదార్థాలు మన రేవులలో దిగిన తరువాతనే ఇళ్లలో పొయ్యిల మీదకు కుండలు ఎందుకు ఎక్కేవి? సోవియెట్ రష్యా నుంచి దిగుమతి చేసుకున్న పంచవర్ష ప్రణాళికలు ఏం చేశాయి? చైనా చేతిలో దేశం ఎందుకు ఓడింది? పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న తీరులో సామ్యవాద వ్యవస్థలు ఎందుకు కునారిల్లాయి? ఈ ప్రశ్నలకు భారతీయ హృదయంతో సమాధానాలు వెతికిన ఫలితమే ఏకాత్మ మానవ దర్శనం. ఆ దర్శనం భారత్‌కు ఇచ్చిన వైభవం ఎలాంటిదో, అందుకు ఇటీవల సాగిన ప్రయాణం గురించి విజయవాడ పునర్దర్శన సభలు సమీక్షించుకున్నాయి. అందుకు అరవై ఏళ్ల సందర్భాన్ని ఎంచుకోవడం స్ఫూర్తిదాయకం. సిద్ధాంతకర్త దీనదయాళ్ ఉపాధ్యాయకు నమోవాకాలు. దాని అమలుకు శ్రీకారం చుట్టిన అటల్ బిహారీ వాజపేయికి నమశ్శతములు. మరింత ఉధృతంగా ముందుకు తీసుకువెళుతున్న నరేంద్ర మోదీకి ధన్యవాదాలు.