సంపాదకీయం
శాలివాహన 1947 శ్రీ విశ్వావసు ఫాల్గుణ శుద్ధ చతుర్దశి – 2 మార్చి 2026, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
ఢిల్లీలోని భారత మండపంలో భారత జాతే కాదు, ప్రపంచ దేశాల ప్రతినిధులు కూడా ఫిబ్రవరి 20న ఒక వికృత క్రీడను చూడవలసి వచ్చింది. దేశానికి తలవంపులు తేవడం, బీజేపీకి అప్రతిష్టను అంటగట్టడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ యువజన విభాగం, యూత్ కాంగ్రెస్ ఈ వికార చేష్టను నిస్సిగ్గుగా ప్రదర్శించింది. రోడ్డు ఎక్కితే, సమావేశం పేరుతో నలుగురు యూత్ కాంగ్రెస్ సభ్యులు ఒకచోట చేరితే ఎంత విధ్వంసం జరుగుతుందో ప్రజలకు చాలా అనుభవాలు ఉన్నాయి. గతం నుంచి నిన్న మొన్నటి రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర వరకు ఇదే పునరావృత మవుతూ వచ్చింది. వాటన్నిటికీ మించినది భారత మండపంలో జరిగింది. వందలాది మంది విదేశీ ప్రతినిధులు, దేశాధినేతలు, సాంకేతిక దిగ్గజాలు, సీఈఓలు, వ్యాపారవేత్తలు, పరిశోధకులు కొలువుదీరిన ఆ సభా ప్రాంగణంలో చొక్కాలు తీసేసి అర్ధనగ్నంగా ఓ పదిమంది యువజన పోకిరీలు తమాషా చేశారు. దానికే శాంతియుత పద్ధతిలో నిరసన అని పేరు కూడా పెట్టారు. అసలు పార్టీయే సిగ్గూ ఎగ్గూ లేకుండా మాట్లాడుతూ ఉంటే, దాని ముద్దుబిడ్డ యువజన కాంగ్రెస్ నుంచి ఏ సంస్కారాన్ని ఆశించగలం! ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026, ఫిబ్రవరి 16-20 మధ్య ఢిల్లీలో జరిగింది.16వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఐదో నంబర్ సభా ప్రాంగణంలో యువజన కాంగ్రెస్ ఈ వీరంగం వేసింది.
క్యూఆర్ కోడ్‌తో ప్రవేశపత్రాలు సంపాదించిన కొంతమంది యువజన కాంగ్రెస్ సభ్యులు లోపల మోదీ, ట్రంప్ బొమ్మలు ఉన్న చొక్కాలు ధరించి, వాటిపై జాకెట్లతో దొంగదారిలో సమావేశంలో చొరబడ్డారు. హఠాత్తుగా జాకెట్లు తొలగించి, లోపల ఉన్న టీ షర్టులను తొలగించి, అర్ధనగ్నంగా వేదికపైకి చేరారు. మోదీ రాజీపడ్డారు, అమెరికా ఒప్పందాన్ని ఒప్పుకోం, ఎపిస్టీన్ ఫైల్స్ మాటేమిటి వంటి నినాదాలు చేశారు. వీళ్లలో ఐదుగురుని వెంటనే అదుపులోకి తీసుకుని కస్టడీకి కూడా పంపారు. ఇలాంటి దిక్కుమాలిన నిరసనకు మొదటే ఆ యువజన కాంగ్రెస్ సభ్యులు అక్కడ ఉన్నవారి చేత చెప్పుదెబ్బలు తిన్నారు. మండపం ఉద్యోగి ఒకరు ఒక కార్యకర్తను పట్టుకుని చితకబాదినట్టు చూపే వీడియో కూడా దేశం మీదకు వచ్చింది. కృష్ణహరి (బిహార్), కుందన్ యాదవ్ (బిహార్), అజయ్ కుమార్ (ఉత్తరప్రదేశ్), నరసింహ యాదవ్ (తెలంగాణ)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను షిబ్ ఏ మాత్రం వెరవకుండా సంస్థ సభ్యుల చర్యను సమర్ధించారు. ఈయనను, ఇంకో ముగ్గురిని కూడా ఫిబ్రవరి 24న ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధులంతా కూడా తమ యువజన సంస్థ చొక్కాలు విప్పి పశుప్రాయంగా ప్రవర్తించడాన్ని శాంతియుత నిరసనగానే పరిగణిస్తూ వాదనలు వినిపించారు. ఇంకా వినిపిస్తున్నారు. పైగా ఈ ఆగ్రహం తమ సభ్యులదే కాదని, దేశంలో ఉపాధి లేక బాధపడుతున్న ప్రతి యువకుడిదేనని సమర్ధించుకున్నారు.
అధికారంలో ఉన్నది కాబట్టి బీజేపీ ఎడల అంతులేని ద్వేషం పెంచుకున్న కాంగ్రెస్‌కు ఇప్పుడు ఏదీ తప్పుగా అనిపించడం లేదు. కన్నూమిన్నూ కానరావడం లేదు. ఈ నికృష్టపు చర్యను ఇండీ కూటమిలోని సన్నిహితులు కూడా ఛీకొట్టారు. బీజేపీకీ ఎవరు ఏం చేసినా, మోదీకి వ్యతిరేకంగా ఎవరు ఎంత విషం కక్కినా సంతోషంగా వీక్షించే సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ కూడా ఇదేం పని అని చీవాట్లు పెట్టారు. బీఎస్‌పీ అధినేత్రి మాయావతి, నిరసన అంటే ఇదా? ఇంత అసహ్యకరంగానా అని నిలదీశారు. ఇది సరైన పద్ధతి కాదని టీఎంసీ ఎంపీ బాబూలాల్ సుప్రియో ట్వీట్ చేశారు. నిరసన చేసే హక్కు చట్టబద్ధమే కానీ, అందుకు వేదిక అది కాదని ఆర్‌జేడీ ఎంపీ మనోజ్ ఝా అన్నారు. యువజన కాంగ్రెస్ చర్య మనమంతా సిగ్గుతో తలదించుకునే తీరులో ఉందని వైఎసఆర్ పార్టీ నాయకుడు వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఉద్దవ్ ఠాక్రే శివసేన ఎంపీ అరవింద్ సావంత్ దీనిని సమర్ధించలేదు. ఇక బీజేపీ సభ్యులు విమర్శించడంలో ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ నాయకుల వస్త్రాలను భారతీయులు ఏనాడో వలిచేశారు. ఇప్పుడు కొత్తగా చొక్కాలు విప్పి వీరంగం వేయవలసిన అవసరం లేదని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ మురికి రాజకీయాలు ఇక కట్టిపెట్టమని హెచ్చరించారు. ఇదంతా చూసినా కూడా రాహుల్ బుద్ధి మారలేదు. పిడివాదం వదలడం లేదు. మురికి రాజకీయాలు మీవే అంటూ ఎదురు దాడికి దిగారే తప్ప, తన పార్టీ కార్యకర్తలు ఎంత నైచ్యానికి ఒడిగట్టారో, దేశం పరువును ఏ తీరున తీశారో ఆయన ఒక్కడే గమనించేందుకు సిద్ధంగా లేరు. అందుకే ఈ కుట్ర రాహుల్, ప్రియాంక సమక్షంలోనే, వారి నివాసాలలోనే జరిగిందని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా సూటిగానే ఆరోపించారు. యువజన కాంగ్రెస్ సభ్యులు విప్పుకున్నవి చొక్కాలు కాదని, స్వదేశం పట్ల వాళ్ల వైఖరి ఎలాంటిదో ప్రపంచం ఎదుట విప్పారని వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ చక్కగానే వ్యాఖ్యానించారు.
ఏ విధంగా చూసినా రాహుల్ గాంధీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కనిపించే అవాంఛనీయ శక్తి. దేశానికి ఆయనొక ప్రారబ్ధం. సుప్రీంకోర్టును అవమాని స్తారు. బీజేపీని అర్ధంపర్ధం లేకుండా విమర్శిస్తారు. తనకు నచ్చని ప్రశ్న వేస్తే పత్రికారంగానికి కాషాయం పూస్తారు. భారత రక్షక దళాలను, పార్లమెంట్‌ను, సుప్రీంకోర్టును, భారత స్వాతంత్య్రం సమరంలో సర్వం త్యాగం చేసిన వారిని, ఆఖరికి తన పార్టీ వారే అయినా, తన కుటుంబానికి చెందని ప్రధానులను దారుణంగా గేలి చేస్తారు. ఆయన వైఖరే ఆయన పార్టీ వైఖరి. అదే పని యువజన కాంగ్రెస్ చేసింది. కాంగ్రెస్ ముక్త భారత్ పనిని మరింత వేగంగా జరగాలని అంతా ఆశించాలి.