సంపాదకీయం

శాలివాహన 1947 శ్రీ విశ్వావసు ఫాల్గుణ బహుళ షష్ఠి – 9 మార్చి 2026, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్


అనర్హులైన ఓటర్లను తొలగించే ప్రక్రియ ఎసఐఆర్‌ను ఆరునూరైనా అడ్డుకోవలసిందేనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శ్రమిస్తూనే ఉన్నారు. ఈ విషయంలో మొదట కేంద్రంతో ఆమె యుద్ధం ప్రారంభించారు. తరువాత ఎన్నికల కమిషన్ వరకు యుద్ధాన్ని విస్తరించారు. ఆఖరికి నల్లకోటు ధరించి అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా బరిలోకి దిగక తప్పని పరిస్థితి కల్పించారు. నిజానికి ఇప్పుడు మమత యుద్ధం కేంద్రంతోను, ఎన్నికల కమిషన్‌తోను కానేకాదు. సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో ఈ బరిలోకి దిగాక కేంద్రం చాలా తెలివిగా, సరైన సమయంలో పక్కకు తప్పుకున్నది. బంతి సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్రకు పరిమితమైంది. కాబట్టి మమత ఏది తేల్చుకోవాలన్నా ఇప్పుడు అది అత్యున్నత న్యాయస్థానంతోనే. కానీ ఇక వీధి పోరాటాలు, శాపనార్థాలు సాధ్యం కాదు. సుప్రీంకోర్టు చెబుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం, లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం వాటిని ఔదలదాలుస్తుంది. కాబట్టి తను ఆరంభించిన అధర్మ యుద్ధాన్ని ఓటమి దిశగా నడిపించినవారే బెంగాల్ ముఖ్యమంత్రి మమత.

ఫిబ్రవరి 28వ తేదీన ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. తుది జాబితా అంటే ఇక్కడ – పోలింగ్ బూత్‌కి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోగలిగిన వారి పేర్లు మాత్రమే. అనూహ్యంగా మరొక 60 లక్షల ఓట్లకు సంబంధించి ‘తీర్పు చెప్పవలసి ఉన్నవి’గా పేర్కొన్నది. ఫిబ్రవరి 28న విడుదల చేసిన జాబితా ప్రకారం 61.78 లక్షల ఓట్లను తొలగించారు. మరొక 60.06 లక్షల ఓట్లను విచారించి తుది నిర్ణయం తీసుకోవలసినవిగా సందిగ్ధంలో ఉంచారు. అంటే ఆ ఓటర్ల పేర్లను పరిగణనలోనికి తీసుకునేదీ లేనిదీ తేల్చవలసి ఉంది. అంటే 1.2 కోట్ల ఓట్లు అక్కడ దొంగ ఓట్లు తదితర అవాంఛనీయ ఓట్ల జాబితాలో ఉన్నాయి. రాష్ట్రంలో అవాంఛనీయ ఓటర్లు కోటీ ఇరవై లక్షలంటూ ముందు నుంచి బీజేపీ నేతలు చెబుతున్నారనీ, కాబట్టి ఇన్ని ఓట్లు తీసేయాలని మొదటే అనుకుని ఈ ప్రక్రియను ప్రారంభించారనీ తృణమూల్ నేతలు కొత్త వాదన తెచ్చారు. రాష్ట్రంలో 50 లక్షల వరకు చొరబాటు దారులు ఉన్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్ కోల్‌కతాలోనే ఆరోపించారు.

 ఇదంతా కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహించవలసి ఉన్న బాధ్యతే అయినా, వివాదం తిరిగి తిరిగి సుప్రీంకోర్టు పరిధిలోకి వచ్చి, న్యాయమూర్తుల సమక్షంలో తుది జాబితాలు తయారు కావలసి వచ్చింది. సకాలంలో జాబితాల పని పూర్తి కావడానికి వీలుగా పక్క రాష్ట్రాల నుంచి న్యాయాధికారులను తెచ్చుకోవచ్చునని కూడా అత్యున్నత న్యాయస్థానం వెసులుబాటు ఇచ్చింది. అంటే ఈ ఓట్ల తొలగింపు లేదా తుది నిర్ణయం తీసుకోవలసి ఉన్న ఓట్లు వంటి అన్ని అంశాలు న్యాయమూర్తుల సాక్షిగానే జరిగాయి కదా! అయినా ఎసఐఆర్ తదనంతర ఓటర్ల తుది జాబితాకు నిరసనగా మార్చి 6 నుంచి కోల్‌కతా నగరం నడిబొడ్డున ఉన్న ఎస్పల్‌నేడ్ మెట్రో చానల్ దగ్గర బైఠాయింపు కార్యక్రమం మొదలుపెడతారట దీదీ. తరువాత భవిష్యత్ కార్యాచరణ గురించి జాతికి తెలియచేస్తారట. అంటే తన మూర్ఖత్వాన్ని ఇంకా ప్రదర్శించబోతున్నారన్నమాట. ఇప్పుడు జరిగినదంతా ఏకపక్ష నిర్ణయమేనని మమత ఆరోపిస్తున్నారు. అంటే న్యాయవ్యవస్థ ఏకపక్షంగా ఓటర్ల జాబితాను రూపొందించిందని అంటున్నారు. ఇది ‘అదృశ్య రిగ్గింగ’ అని తేల్చారు. ఇన్నాళ్లు గోడ మీద పిల్లిలా కూర్చున్న కాంగ్రెస్‌కు హఠాత్తుగా గొంతు పెగిలింది. 60 లక్షల ఓట్లకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోవలసి ఉందని చెప్పడం దారుణమైన రాజకీయ కుట్ర అంటున్నది. బహుశా ఈ 60 లక్షల ఓట్లలో ఎక్కువ భాగం ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలలో ఉన్నవి కావడం వల్లనే పిల్ల కాంగ్రెస్‌కీ, తల్లి కాంగ్రెస్‌కీ ఇంతటి క్షోభ కలిగి ఉండాలి. వీటిలో 11 లక్షలు ముర్షిదాబాద్ ప్రాంతంలోను, 8 లక్షలు మాల్డా ప్రాంతంలోను ఉన్నాయి. ఈ రెండు జిల్లాలు బాంగ్లాదేశ్‌ను ఆనుకుని ఉంటాయి.

ఫిబ్రవరి 28, 2026 నాటికి రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 6,44,52,609. అక్టోబర్ 27,2025 నాటి ఓటర్ల సంఖ్య 7,66,37,529. ఇది ఎసఐఆర్ నిర్వహించక ముందు సంఖ్య. కేంద్రం, కేంద్ర ఎన్నికల సంఘం పక్కకు జరిగి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓటర్ల జాబితా సవరణ జరగడానికి వీలు కల్పించాయి. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ అనంతరం జరిగిన పరిణామమిది. ఇందులో కూడా అత్యున్నత న్యాయస్థానం మమతా బెనర్జీ వాదనకే అగ్రపీఠం వేసింది. తుది జాబితా ఊడిపడింది. ఇంత జరిగాక మళ్లీ ఇప్పుడు బైఠాయింపు ఏమిటి? ఇది ఎవరిని బెదిరించడానికి? బహుశా ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని, అటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కావచ్చు. వారే కదా పోలింగ్ నిర్వహించవలసింది! మొదట తమిళనాడు, కేరళ కూడా ఇదే తీరున స్వైర విహారం చేసినా తరువాత తగ్గాయి. కానీ మమత మొండితనానికి హద్దులు కానరావడం లేదు.

మమత, పశ్చిమ బెంగాల్ పోలింగ్ శైలి గురించి ఏ అధికారి అయినా చెప్పగలరు. ఇక మిగిలినది ఒకటే. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని రద్దు చేసి, అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టి ఎన్నికలు జరిపించాలి. నిజానికి గడచిన శాసనసభ ఎన్నికల సమయంలోను బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఇదే కోరిన విషయం గుర్తుంచుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు తృణమూల్ కాంగ్రెస్ రక్తపాతాన్ని నమ్ముకుంటుంది. ఇది ఆరోపణ కాదు, చరిత్ర. సుప్రీంకోర్టు కలుగచేసుకుని ఓటర్ల జాబితాలు తయారు చేయించినా నమ్మని మమతా బెనర్జీ రేపు ఫలితాలు తనకు వ్యతిరేకంగా వస్తే ఎలా మాట్లాడతారో ఊహించడం కష్టం కాదు. కేంద్ర పాలనకు ఎలాగూ మమత అంగీకరించరు కాబట్టి, ఎన్నికలు కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిపించే వీలున్నదేమో చూడాలి.

About Author

By editor

Twitter
YOUTUBE