సోమాలియా నుంచి మూడు దశాబ్దాల క్రితం విడివడి స్వాతంత్య్రం ప్రకటించుకున్న సోమాలీల్యాండ్‌ను స్వతంత్రదేశంగా గుర్తిస్తూ డిసెంబర్ 26న ఇజ్రాయెల్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. దీనిపై తక్షణమే స్పందించిన సోమాలియా, ఇది తమ సార్వభౌమాధికారంలోకి తలదూర్చే చర్య అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి, ఇజ్రాయెల్ నిర్ణయాన్ని ఖండించింది. టర్కీ, సౌదీ అరేబియా, ఆఫ్రికన్ యూనియన్‌కు చెందిన డజన్ల సంఖ్యలో దేశాలు ఇజ్రాయెల్ తీసుకున్న ఈ ఆశ్చర్యకర నిర్ణయంపై తమ నిరసనను వ్యక్తం చేశాయి. చైనా కూడా వీటికి వంతపాడటం విశేషం.
ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి లియాంగ్ జియాంగ్ మాట్లాడుతూ, ఒక దేశం మరొక దేశంలోని వేర్పాటువాదశక్తులకు మద్దతివ్వడం లేదా ప్రోత్స హించడం చేయకూడదని సుద్దులు చెప్పారు. చైనా ఎప్పుడూ తాను చెప్పేది చేయదు, చేసేది చెప్పదు! ఇది దాని నైజం! సహజంగానే యు.ఎస్. ఐక్యరాజ్య సమితి అత్యవసర సమావేశంలో ఇజ్రాయెల్‌ను సమర్థించింది. ఈ ఏడాది మొదట్లో పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితిలో చాలా దేశాలు తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా వ్యతిరేకించడం గమనార్హం. ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ డిప్యూటీ రాయబారి మాట్లాడుతూ, ఈ నిర్ణయం సోమాలియాపై వ్యతిరేకతతో తీసుకున్నది కాదనీ, ఆ దేశానికి చెందిన ఇరుపక్షాల మధ్య చర్చలకు తాము తీసుకున్న నిర్ణయం అడ్డంకి కాబోదనీ అన్నారు. గుర్తింపు అనేది తిరస్కారపూరిత చర్య కాదు, ఇది ఒక అవకాశం మాత్రమేనని ఆయన చెప్పుకొచ్చారు.
ఒకప్పటి బ్రిటిష్ వలస
1991లో సోమాలియా సైనికపాలకుడు సయ్యద్ బర్రే పదవీచ్యుతుడయిన తర్వాత గల్ఫ్ ఆఫ్ ఈడెన్ తీరప్రాంతానికి చెందిన సోమాలీల్యాండ్ స్వాతంత్య్రం ప్రకటించుకుంది. అంతకుముందు సయ్యద్ బర్రే దళాలకు, తిరుగుబాటుదార్లకు మధ్య తీవ్రస్థాయిలో జరిగిన ఘర్షణలో వేలాదిమంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా, పట్టణాలు ధ్వంస మయ్యాయి. సోమాలీల్యాండ్ స్వాతంత్య్రం ప్రకటించు కున్నప్పటికీ, ప్రపంచంలో ఏ దేశం గుర్తించలేదు. ఇదేమీ పట్టించుకోని సోమాలీల్యాండ్ సొంతంగా రాజకీయ, పోలీసు, ప్రభుత్వ సంస్థలను నిర్వహించ డమే కాదు, సొంత కరెన్సీని కూడా ఏర్పాటు చేసుకుంది. 19వ శతాబ్దంలో సోమాలియా బ్రిటిష్ వలస దేశం. అప్పట్లో బ్రిటిష్ సోమాలీల్యాండ్ అని పిలిచేవారు. 1960లో ఇది ఇటాలియన్ సోమాలీ ల్యాండ్‌తో కలిసిపోయింది. సోమాలీల్యాండ్‌లో నివసించే ఇసాక్ తెగ, మిగిలిన సోమాలియా భూభాగానికి చెందిన ప్రజలకు భిన్నం కాబట్టి, తమకు స్వాతంత్య్రం కావాలనేది అక్కడి స్వాతంత్య్ర కాంక్షాపరుల డిమాండ్. అదీకాకుండా సోమాలీ ల్యాండ్ జనాభా ఆరు మిలియన్లు. వీరు శాంతి, సుస్థిరతలతో జీవనం గడుపుతున్నారు. ఇస్లామిక్ మిలిటెంట్ల దాడులతో నిత్యం అగ్నిగుండంగా రగులుతున్న సోమాలియాతో కలవడానికి సోమాలీ ల్యాండ్ ప్రజలు ఒప్పుకోవడం లేదు. సోమాలియా ప్రభుత్వం మాత్రం, సోమాలీల్యాండ్ తమ దేశంలో అంతర్భాగమని, దీనిని స్వతంత్ర దేశంగా గుర్తించడమంటే తమ దేశ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించినట్టేనని ప్రకటించింది. సోమాలియా అధ్యక్షుడు హసన్ షేక్ మహమ్మద్, దేశ రాజధాని మొగదిషులో మాట్లాడుతూ, సోమాలీల్యాండ్‌ను ప్రత్యేక దేశంగా ఇజ్రాయెల్ గుర్తించడం తమకు బయట నుంచి ముప్పుగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు.
సోమాలీల్యాండ్‌కు సహకారం
డిసెంబర్ 26న ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు, సోమాలియా అధ్యక్షుడు హసన్ షేక్ మహమ్మద్‌కు ఫోన్ చేశారు. “మేం సోమాలీల్యాండ్; స్వీయ నిర్ణయాధికారానికి మద్దతిస్తున్నాం” అని చెప్పడమే కాదు, ఈ విధంగా తాము గుర్తించడం, ఆ దేశంతో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకునే ప్రయత్నంలో భాగమేనని స్పష్టం చేశారు. వ్యవసాయం, ఆరోగ్యం, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో సోమాలీల్యాండ్‌కు పూర్తి సహాయ సహకారాలందిస్తామని స్పష్టం చేయడం గమనార్హం.
వ్యూహాత్మక కారణం
ఇంతకాలం మౌనం దాల్చిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నదన్న సందేహం రావడం సహజమే. ఇందుకు ఒక వ్యూహాత్మక కారణం ఉంది. ఎర్రసముద్రం ప్రాంతంలో హౌతీలను ఎదుర్కోవడానికి తనకు ఒక సహచర మిత్రదేశం అవసరం. ఇజ్రాయెల్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ మేధావులు ఇటీవల ఒక నివేదికను రూపొందించారు. దీని ప్రకారం యెమెన్‌లో, ఇరాన్ మద్దతులో పనిచేస్తున్న ఉగ్రవాదులను ప్రస్తావిస్తూ, ఇదేమాదిరిగా తన కార్యకలాపాల నిర్వహణకు ఇజ్రాయెల్‌కు కూడా మద్దతుగా ఒక దేశం అవసరమని స్పష్టం చేశారు. సోమాలీల్యాండ్ ఇందుకు అనువైన దేశంగా ఇజ్రాయెల్ గుర్తించింది. హౌతీలను ఎదుర్కొనాలంటే సోమాలీల్యాండ్‌తో చెలిమి తనకు ఉపయోగకరమన్న నిర్ణయానికి రావడమే, దాని స్వాతంత్య్రాన్ని గుర్తించడం వెనుక ప్రధాన కారణం.
హౌతీల హెచ్చరిక
2023 అక్టోబర్‌లో గాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్ పదే పదే యెమెన్‌లోని హౌతీల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహిం చింది. ఇక్కడ తిరుగుబాటుదారులు, పాలస్తీనియన్లకు మద్దతు ప్రకటించడమే తమ దాడులకు కారణమని ఇజ్రాయెల్ సమర్థించుకుంటూ వచ్చింది. ఇదిలా వుండగా సోమాలీల్యాండ్‌ను, ఇజ్రాయెల్ గుర్తించ డాన్ని కేవలం తమను లక్ష్యంగా చేసుకోవడంగానే పరిగణిస్తామని హౌతీలు హెచ్చరించారు. ఇప్పుడు సోమాలీల్యాండ్‌ను తనకు ఒక అసెట్‌గా ఇజ్రాయెల్ భావిస్తే, హౌతీలు దీన్ని తమ టార్గెట్‌గా ఎంచుకోవడం తథ్యంగా కనిపిస్తున్నది. గాజా నుంచి తరిమేసిన పాలస్తీనియన్లకు పునరావాసం కల్పించేందుకు సోమాలీల్యాండ్‌ను ఇజ్రాయెల్ సంప్రదించినట్టు కొద్దినెలల క్రితం వార్తలు వచ్చాయి. వీటిపై ఇజ్రాయెల్ నుంచి ఎటువంటి ప్రతిస్పందన లేనప్పటికీ, సోమాలీల్యాండ్ మాత్రం, తమ స్వాతంత్య్రాన్ని గుర్తించడానికి, పాలస్తీనా సమస్యకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అయితే సోమాలియా, పాలస్తీనా అథారిటీలు మాత్రం సోమాలీల్యాండ్‌ను గుర్తించడం వెనుక పాలస్తీనీయు లను అక్కడికి తరలించే ప్రణాలిక ఉన్నదని గట్టిగా నమ్ముతున్నాయి. పాలస్తీనియన్లను తరలించే ప్రయత్నాలు ఆమోదయోగ్యం కాదని సోమాలియా అధ్యక్షుడు హసన్ షేక్ మహమ్మద్ పార్లమెంట్‌లో స్పష్టం చేశారు. అయితే ఎర్రసముద్రం ప్రాంతంలో ఇరాన్ ప్రాబల్యాన్ని అడ్డుకోవాలన్నది ఇజ్రాయెల్ వ్యూహం. ముఖ్యంగా ఎర్రసముద్రం ప్రాంతంనుంచి ఆయుధాలు, తీవ్రవాదులు యధేచ్ఛగా తూర్పు మెడిటరన్ సముద్రంలోకి ప్రవేశించి అక్కడినుంచి గాజాకు చేరుకుంటున్నారు. ఆవిధంగా గాజాకు ఆయుధాలు, పోరాటదారుల సరఫరాకు ఎర్రసముద్రం ఒక సంప్రదాయక మార్గంగా మారిపోయింది. ఇది తన భద్రతకు పెనుముప్పుగా మారిన నేపథ్యంలో, ఎర్రసముద్రం ముఖద్వారం వద్దనే తమ సైనికులను మోహరించినట్లయితే, ఈ సరఫరాను పూర్తిగా అరికట్టవచ్చునని ఇజ్రాయెల్ విశ్వసిస్తోంది.
ముస్లిందేశాల ఖండన
సోమాలీల్యాండ్‌ను గుర్తించడంలో ఇజ్రాయెల్‌కు బలమైన కారణాలున్నప్ప టికీ, సౌదీఅరేబియా, టర్కీ, ఈజిప్టు, ఆఫ్రికన్ యూనియన్, యెమెన్, సూడాన్, నైజీరియా, లిబియా, ఇరాన్, ఇరాక్, ఖతర్, పాకిస్తాన్, చమురు ఎగుమతి చేసే దేశాలు (ఓఐసీ) దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇజ్రాయెల్ చర్య సోమాలియా ప్రాదేశిక సమగ్రతకు భంగమనేది వాటి వాదన. తమకు తామే స్వేచ్ఛను ప్రకటించుకునే ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వాల ప్రమేయం లేకుండా ఇతర దేశాలతో స్నేహసంబంధాలు నెరపడం, తీవ్ర స్థాయి అస్థిరతలకు దారితీస్తుందనేది కొందరి విశ్లేషకుల అభిప్రాయం. అయితే సోమాలీల్యాండ్ పట్ల సానుభూతి ఉన్న దేశాలు ప్రస్తుత పరిణామంపై మౌనం పాటిస్తున్నాయి. ఉదాహరణకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సోమాలీల్యాండ్‌లో ఒక నౌకా స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయంపై యూఏఈ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ముఖ్యంగా యూఏఈకి, ఇజ్రాయెల్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈవిషయంలో ఆ దేశం, ఇజ్రాయెల్‌కే మద్దతుగా ఉంటుందనేది సుస్పష్టం. ముఖ్యంగా ఎర్రసముద్రం ప్రాంతంలో ఇరుదేశాలకు పరస్పర ప్రయోజనాలు ఉండటం కూడా ఇందుకు కారణం. ఇథియోపియా కూడా ఈ పరిణామంపై ఏవిధమైన వ్యాఖ్య చేయలేదు. ఎందుకంటే ఈ దేశానికి సముద్రతీరం లేదు. గత ఏడాది సోమాలీల్యాండ్, ఇథియోపియాకు తన తీరప్రాంతంలోని కొంత భాగాన్ని లీజుకు ఇచ్చింది. దీనిపై సోమాలియా ఆగ్రహించడంతో టర్కీ రంగంలోకి దిగింది. ఇథియోపియా, సోమా లియాలకు మధ్యవర్తిత్వం వహించి, ఇరుదేశాల మధ్య ఒక ఒప్పందం కుదరడంలో సహాయపడింది. దీని ప్రకారం ఇథియోపియా, సోమాలియా ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తుంది. ఈ నేపథ్యంలో ఇథియోపియా మౌనంగానే ఇజ్రాయెల్ ఏకపక్ష నిర్ణయానికి మద్దతు పలకవచ్చు. కాకపోతే దీనిపై వేచిచూసే ధోరణి అవలంబించే అవకాశముంది. ఇదిలావుండగా డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన నేపథ్యంలో, ఆయన తన పదవీకాలంలో తప్పక గుర్తిస్తాడన్న ఆశ సోమాలీల్యాండ్‌కు ఉంది. ఎందుకంటే రెండోసారి ఎన్నికల ప్రచారంలో డోనాల్డ్ ట్రంప్ నుంచి ఇటువంటి సూచనలు వెలువడ్డాయి. కానీ విచిత్రంగా ట్రంప్ న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో “సోమాలీల్యాండ్ విషయంలో నేను నెతన్యాహు బాటలో వెళ్లను” అని చెప్పడం సోమాలీల్యాండ్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఇక ఐరోపా సమాఖ్య దేశాలు, యు.కె.లు సోమాలియా ప్రాదేశిక సమగ్రతను చూపుతూ, సోమాలీల్యాండ్‌ను గుర్తించడానికి నిరాకరించాయి.
గుర్తించని భారత్
హార్నఆఫ్ ఆఫ్రికాదేశమైన సోమాలీల్యాండ్‌ను భారత్ త్వరలో గుర్తిస్తుందన్న ఊహాగానాలకు మన విదేశాంగశాఖ అడ్డుకట్ట వేసింది. ఈ ఊహాగానాలకు ఒక కారణముంది. సోమాలీల్యాండ్‌కు చెందిన బెర్బరాపోర్ట్ కారిడార్ వాణిజ్యపరంగా ఎంతో కీలకం. ముఖ్యంగా ఇథియోపియా మార్కెట్ దీని ద్వారా అనుసంధానం కాగలదు. ఇప్పుడు సోమాలీల్యాండ్‌ను చైనా గుర్తించని నేపథ్యంలో, వాణిజ్యపరం గా తన ప్రత్యర్థిని దెబ్బకొట్టడానికి భారత్ సోమాలీల్యాండ్‌ను గుర్తిస్తుందన్నది వాటి సారాంశం. అయితే భారత్ అటువంటిదేమీ లేదని నిర్ద్వంద్వంగా చెప్పింది. ఇదిలావుండగా కొన్ని అనధికార వార్తల ప్రకారం, భారత్‌లోని సోమాలియా రాయబారి, సోమాలి ల్యాండ్‌కు మారిపోవడంతో, సోమాలియా పార్లమెంట్ అతడిని సస్పెండ్ చేసిందని ధ్రువీకరించని వార్తలు వెలువడ్డాయి. నిజం చెప్పాలంటే సోమాలీల్యాండ్‌కు చెందిన హర్గేసియా, బెర్బరా, బురావో పట్టణాలు ప్రధాన ఆర్థిక కేంద్రాలుగా ఉన్నాయి. హార్న్ ఆఫ్ ఆఫ్రికా దేశమైన సోమాలీల్యాండ్‌కు పక్కనే ఉన్న గల్ఫ్ ఆఫ్ ఈడెన్, బాబ్ అల్ మండెబ్ జలసంధి హిందూ మహాసముద్రాన్ని, ఎర్రసముద్ర తీరం గుండా మెడిటరన్ సముద్రానికి అనుసంధానిస్తాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీ అయిన నౌకా వాణిజ్య మార్గం ఇది. అయితే 2023 నుంచి హౌతీ తీవ్రవాదులు యెమెన్ నుంచి ఈ మార్గం గుండా ప్రయాణించే ఇజ్రాయెల్, యు.ఎస్.తో పాటు వీటి మిత్రదేశాల వాణిజ్య నౌకలపై డ్రోన్ దాడులకు పాల్పడుతుండటంతో ఈ ప్రాంతంలో పూర్తి అభద్రత నెలకొంది. సోమాలీల్యాండ్‌లో యు.ఎస్, ఇజ్రాయెల్, తైవాన్ దేశాల ప్రతినిధులున్నారు. ఇథియోపియా, యూఏఈ దేశాలు సోమాలీల్యాండ్‌లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాయి. ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నప్పటికీ అంతర్జాతీయ గుర్తింపు లేకపోవడంతో ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల వద్దకు వెళ్లలేకపోవడం సోమాలీల్యాండ్ ఆర్థికాభివృద్ధికి పెద్ద అవరోధంగా మారింది.

జమలాపురపు విఠల్‌రావు
సీనియర్ జర్నలిస్ట్