దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పరిస్థితి నాలుగు స్తంభాల ఆటగా మారుతోంది. సొంతగా పోటీ చేసే అవకాశం ఎలాగూ లేదు. కనీసం భాగస్వాములు దొర కడం కూడా రాను రానూ కష్టమయిపోతోంది. ఈ ఏడాది వేసవిలో శాసనసభ ఎన్నికలు జరగబోతున్న తమిళనాడులో కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి నెలకొంది. ఇతర పార్టీలతో పొత్తుకు ప్రయత్నించినా, సీట్ల పంపకం గురించిన ప్రస్తావన వచ్చినా కాంగ్రెస్ తన వెనుకటి విజయాలను, సాఫల్యాలను గుర్తు చేస్తుంది. ఇతర పార్టీలకు మాత్రం ఇటీవలి కాలంలో కాంగ్రెస్ సాధించిన పరాజయాలు, వైఫల్యాలు గుర్తుకు వస్తున్నాయి. ఇంత కాలంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటూ వస్తున్న పాలక డి.ఎం.కె. కి అనేక రాష్ట్రాల శాసనసభ ఎన్నిక లతో పాటు ఇటీవలి బిహార్ శాసనసభ ఎన్నికలు కూడా గుర్తుకు వచ్చి బెంబేలు పడుతోంది.
తమిళనాడు శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో డి.ఎం.కె, కాంగ్రెస్ పార్టీల మధ్య మరోసారి పొత్తు, సీట్ల పంపకం చర్చలు ఇటీవల మొదలయ్యాయి. సాధారణంగా కాంగ్రెస్ గొంతెమ్మ కోరికలతో చర్చలు మొదలుపెడుతుంది. అయిదేళ్ల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో 25 సీట్లు తీసుకుని 18 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో తమకు 40 సీట్లు కావాల్సిందేనని పట్టుబడుతోంది. 32 సీట్లకు మించి ఇచ్చే ఉద్దేశంలో డి.ఎం.కె. లేదు. డి.ఎం.కె మొదటి నుంచి తమకు అన్యాయం చేస్తోందని, వరుసగా ప్రతి ఎన్నికల్లోనూ తమకు కేటాయించే సీట్ల సంఖ్య తగ్గిస్తూ వస్తోందని కాంగ్రెస్ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. 2011లో 63 స్థానాలు (5 మాత్రమే గెలిచింది), 2016లో 41 స్థానాలు, 2021లో 25 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ పరిమితం కావాల్సి వచ్చింది. తమ బదిలీతో గెలుస్తూ వస్తున్న కాంగ్రెస్‌కు సీట్ల కేటాయింపును పెంచవలసిన అవసరం లేదని డి.ఎం. కె అధిష్ఠానం భావిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థుల మీద ప్రత్యర్థులు గెలవడం వల్ల తాము బలహీనపడుతున్నామని కూడా పాలక పక్షం భావిస్తోంది.
కాంగ్రెస్ సత్తాపై అనుమానాలు
ఇటీవలి బిహార్ శాసనసభ ఎన్నికల్లో 61 స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ 6 స్థానాల్లో మాత్రమే విజయం సాధించడాన్ని డి.ఎం.కె విస్మరించలేక పోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు సీట్లను పెంచి ఏ మాత్రం ఉపయోగం లేదని, దీనివల్ల అనామక పార్టీలు కూడా కొద్దో గొప్పో సీట్లు సంపాదించుకోవడానికి అవకాశం కలుగుతోందని డి.ఎం.కె అభిప్రాయపడుతోంది. బిహార్ ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద, ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వం మీద డి.ఎం.కె.కు పూర్తిగా నమ్మకం సడలిపోయింది. డి.ఎం.కె. తమను చిన్నచూపు చూస్తోందనే విషయం కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది. డి.ఎం.కె. తాము కోరినన్ని సీట్లను కేటాయించని పక్షంలో..సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళ వెట్రి కళగం (టి.వి.కె) పార్టీతో పొత్తు పెట్టుకోవడం మంచిదని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ఈ ఆలోచన ఢల్లీిలోని పార్టీ అధిష్ఠానం నుంచే వచ్చింది.
గత సెప్టెంబర్‌లో కరూర్‌లో విజయ్ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన తర్వాత విజయ్‌కి రాహుల్‌గాంధీతో పరిచయం ఏర్పడిరది. ఆ తర్వాత ఇద్దరి మధ్య సఖ్యత, సాన్నిహిత్యం పెరిగాయి. తమ మిత్రపక్షం డి.ఎం.కె.ను గద్దె దించడమే విజయ్ లక్ష్యంగా పెట్టుకున్నారని, రాత్రింబవళ్లు ఆయన డి.ఎం.కె. మీద దుమ్మెత్తి పోస్తూనే ఉంటారని తెలిసి కూడా రాహుల్‌గాంధీ ఆయనతో మంతనాలు జరుపుతోంది. విజయ్ పేరు చెప్పినంత మాత్రాన టి.వి.కె. అభ్యర్థులంతా విజయం సాధిస్తారనే నమ్మకం లేదు. కరూర్ దుర్ఘటన తర్వాత ఆ పార్టీ విజయావకాశాలపై కొద్దిగా అపనమ్మకం పెరిగింది. పైగా ఆ పార్టీలో ఎన్నికల ప్రచారంలో ఆరితేరిన వారెవరూ లేరు. రాజకీయ దురంధరులు కూడా లేరు. ఒకప్పుడు అన్నా డి.ఎం.కెలో ఒక వెలుగు వెలగడంతో పాటు అనేక ఎన్నికల్లో గెలిచిన కె.ఎ.సెంగొట్టియన్ విజయ్ పార్టీలో చేరిన మాట నిజమే కానీ, ఆ పార్టీ గెలవాలంటే ఇంకా 233 మంది సెంగొట్టియన్ల అవసరం ఉంది.
జోడు గుర్రాల సవారీ
విజయ్‌తో రాహుల్ గాంధీ సంప్రదింపులు జరుపుతున్నారంటూ టి.వి.కె నాయకులు బాగా ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారం వల్ల డి.ఎం.కె. కాంగ్రెస్ పార్టీల అనుబంధాన్ని దెబ్బతీయ వచ్చని టి.వి.కె. నాయకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ మద్దతు లేకుండా డి.ఎం.కె గెలిచే అవకాశం లేదని టి.వి.కె. భావిస్తోంది. కాంగ్రెస్ కూడా ఈ పరిణామాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో తమతో చేతులు కలపడానికి ఇతర పార్టీలు తహతహలాడుతున్నాయని డి.ఎం.కె.కు తెలియజెప్పడానికి ఇది పనికి వస్తుందని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. దీన్ని అడ్డం పెట్టుకుని డి.ఎం.కె.తో బేరమాడి ఎక్కువ సీట్లు సంపాదించు కోవచ్చని రాష్ట్ర నాయకత్వమే కాకుండా కేంద్ర నాయకత్వం కూడా భావిస్తోంది. ఈ కారణం వల్లే కాంగ్రెస్ పార్టీ 40 స్థానాల కోసం పట్టుబడుతోంది. అంతగా అయితే ఈ సంఖ్యను 38కి తగ్గించవచ్చని కూడా ఆ పార్టీ ఆలోచిస్తోంది.
విజయ్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవా లనే ఆలోచన చేయడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. బహిరంగ సభలకు జన సమీకరణ జరగాలంటే తప్పనిసరిగా ప్రేక్షకులకు నగదు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ సంస్కృతి తమిళనాడులో మరీ ఎక్కువ. ఈ పరిస్థితుల్లో ఒక్క పైసా కూడా చెల్లించకుండా భారీ జనసంఖ్యతో బహిరంగ సభలు నిర్వహిస్తున్న ఘనత విజయ్‌కే దక్కుతుంది. ఆయన సభలకు హాజరవుతున్న జన సందోహాన్ని చూసిన వారికి వీరంతా విజయ్ పార్టీకి ఓట్లు వేస్తే ఈ ఇళయ దళపతి ముఖ్యమంత్రి కావడం ఖాయమనే అభిప్రాయం కలుగుతుంది. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడుగా పేరున్న ప్రవీణ్ చక్రవర్తి ఇటీవల విజయ్‌ని కలిసి ఆయనను భావి భారత రాజకీయ నాయకుడుగా పొగడ్తలతో ముంచెత్తారు. డి.ఎం.కె.ను ఏదో విధంగా 40 సీట్లకు ఒప్పించడానికి కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా నానా అవస్థలూ పడుతోంది. ఒకపక్క ..డి.ఎం.కె.తో మంతనాలతో పాటు మరోపక్క విజయ్ పార్టీతో కూడా మంత్రాంగం జరుపుతోంది. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను డి.ఎం.కె. నిశితంగా గమనిస్తూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద ఆ పార్టీ నాయకులకు అనుమానాలు పెరుగుతున్నాయి.
తిరకాసు వ్యవహారాలు
కాంగ్రెస్ పార్టీ ఈసారి సీట్ల సంఖ్యను పెంచాలనడమే కాదు… అధికారంలో పెద్ద వాటా కోసం కూడా పట్టుబడుతోంది. కాంగ్రెస్ పార్టీతో అనేక సంవత్సరాలుగా పొత్తు కొనసాగిస్తున్న డి.ఎం.కె. ఏనాడూ ఆ పార్టీతో అధికారాన్ని పంచుకోలేదు. 2004-14 సంవత్సరాల మధ్య అధి కారంలో ఉన్న యు.పి.ఎ. కేంద్రంలో అనేక కీలక పదవులను డి.ఎం.కె.కు కేటాయించేది. రాష్ట్రంలో మాత్రం డి.ఎం.కె అధికారానికి కాంగ్రెస్ పార్టీని వీలైనంత దూరంగానే ఉంచింది. ఈసారి మాత్రం వీటినన్నిటినీ సరిదిద్దాలని కాంగ్రెస్ పార్టీ కృత నిశ్చయంతో ఉంది. ఈ కారణంగానే విజయ్‌ని ప్రత్యామ్నాయంగా చూపిస్తోంది. విజయ్ పార్టీతో పొత్తుపెట్టుకుంటే తాము ఎక్కువ స్థానాలకు పోటీ చేయవచ్చని. ఆ పార్టీ గనుక అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో కూడా చేరవచ్చని కాంగ్రెస్ పార్టీలో కొందరు విజయ్ అనుకూలవాదులు అభిప్రాయపడు తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో మరో ఆలోచన కూడా చోటు చేసుకుంటోంది. విజయ్‌కి ఓ నటుడిగా దక్షణాది రాష్ట్రాలన్నిటిలో పేరు ప్రఖ్యాతులున్నందువల్ల కేరళలో జరిగే ఎన్నికల్లో కూడా తాము విజయ్ వల్ల ప్రయోజనం పొందవచ్చని కొందరు నాయకులు భావిస్తున్నారు. కేరళలో అధికారంలో ఉన్న ఎల్.డి.ఎఫ్ మీద విజయం సాధించడానికి కూడా విజయ్ ఉపయోగపడతారని కాంగ్రెస్ నాయకులు ఆలోచన చేస్తున్నారు. రెండు పర్యాయాలుగా అధికారంలో ఉన్న పినరాయి విజయన్ ప్రభుత్వం ఈసారి విజయం సాధించే అవకాశం లేదని కూడా వారు అంచనా వేస్తున్నారు. డి.ఎం.కెతో కొనసాగాలా లేక విజయ్ పార్టీతో కొనసాగాలా అన్న విషయంలో తమిళనాడు కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలే తప్ప ఏకాభిప్రాయం ఉండడం లేదు. 1996లో పి.వి. నరసింహారావు నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ అన్నా డి.ఎం.కె అధినేత జయలలితతో పొత్తు కుదుర్చుకుంది. పి. చిదంబరం, జి.కె. మూపనార్‌లకు ఇది నచ్చక కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి తమిళ మానిల కాంగ్రెస్ పార్టీ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. ఈ తమిళమానిల కాంగ్రెస్ తమిళ నాడులో డి.ఎం.కెతో పొత్తుపెట్టుకుని విజయాలు సాధించింది.
విజయ్ కోసం పట్టు
ఇప్పుడు కూడా పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు డి.ఎం.కె.తో పొత్తు కొనసాగించాలని, విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకోకూడదని గట్టి పట్టుదలతో ఉన్నారు. తమిళనాడు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను, కోరికలను కాంగ్రెస్ అగ్రనాయకత్వం తప్పనిసరిగా పట్టించు కోవలసిన అవసరం ఉంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ కేవలం డి.ఎం.కెతో మాత్రమే తాము సీట్ల సర్దుబాటు చర్చలు జరుపుతున్నట్టు చెబుతోంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి, డి.ఎం.కె నాయకుడు, ముఖ్యమంత్రి అయిన ఎం.కె. స్టాలిన్‌కు మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహ సంబంధాల దృష్ట్యా ఈ రెండు పార్టీల మధ్యే పొత్తు కొనసాగే అవకాశం కూడా ఉంది. విజయ్‌తో పొత్తు కోరుకుంటున్న యువ కార్యకర్తలు ఈసారి డి.ఎం.కె అభ్యర్థులకు ఓటు వేస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
అన్నా డి.ఎం.కె. పొత్తును కొనసాగిస్తూ, తమ రాజకీయ, ప్రచార వ్యూహాలతో పురోగమిస్తున్న బీజేపీ ఈ కాంగ్రెస్, డి.ఎం.కె, టి.వి.కె. పరిణామాలను ఆసక్తితో గమనిస్తోంది. కాంగ్రెస్ పార్టీతో డి.ఎం.కె పొత్తు కొనసాగని పక్షంలో అల్పసంఖ్యాక వర్గాలతో సహా అనేక వర్గాలు డి.ఎం.కెకు మద్దతిచ్చే అవకాశం లేదు. పైగా, డి.ఎం.కె, టి.వి.కె కూటముల మధ్య ఓట్లు చీలే అవకాశం ఉంది. ఇది ఎన్.డి.ఏకు అనుకూల ఫలితాలనిస్తుంది. ఎన్నికల లోపు తమిళనాడు రాజకీయాలు బాగా వేడెక్కడమే కాకుండా అనేక విధాలుగా రూపురేఖలు, స్వరూప స్వభావాలు మార్చుకునే అవకాశం ఉంది.
– జి.రాజశుక,
సీనియర్ జర్నలిస్ట్