రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ దశాబ్దాలుగా కొనసాగుతున్న జటిలమైన సమస్య. రాష్ట్ర విభజన అనంతరం జలవివాదాలు మరింత తీవ్రరూపం దాల్చాయి. అయితే, ఇటీవల రెండు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రంలో వచ్చిన మార్పులతో ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు (ఆంధప్రదేశ్), రేవంత్ రెడ్డి (తెలంగాణ) తీసుకుంటున్న సానుకూల నిర్ణయాలు ఈ సమస్యల పరిష్కార దిశలో కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. గొడవలు పడడం క•ంటే చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికే ఇద్దరు నేతలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే, ఈ సానుకూల వాతావరణాన్ని చెడగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలు, ముఖ్యంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో చంద్రబాబునాయుడిపై చేస్తున్న ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. వాస్తవానికి రాయలసీమ ప్రాజెక్టు నిలిచిపోవడానికి కారణం ఎవరు? అనే విషయాన్ని లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది.
కృష్ణా నదీ జలాల వాటా కోసం రెండు తెలుగు రాష్ట్రాలు వాదులాడుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఈ రాజకీయ, న్యాయపరమైన వివాదాల మధ్య అమూల్యమైన నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది. అటుఇటుగా దాదాపు 650 టీఎంసీల నుండి, వరదలు వచ్చినప్పుడు ఏకంగా 1000 టీఎంసీల వరకు నీరు ఎవరికీ ఉపయోగపడకుండా సముద్రం పాలవుతోందని గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవా నికి ఈ నదీ జలాల్లో తెలుగు రాష్ట్రాలకు దక్కిన మొత్తం వాటా 811 టీఎంసీలు. ఇందులో తాత్కాలిక కేటాయింపుల ప్రకారం తెలంగాణకు 299 టీఎంసీల వాటా ఉండగా, ఆ రాష్ట్రం కేవలం 116 నుంచి 117 టీఎంసీలను మాత్రమే వాడుకోగలుగుతోంది. ఆంధప్రదేశ్‌కు 512 టీఎంసీల కేటాయింపులు ఉన్నప్పటికీ, గట్టిగా ప్రయత్నించినా 100 టీఎంసీలకు మించి వాడుకోలేకపోతున్న దుస్థితి. కృష్ణా నీటిని సమర్ధంగా వాడుకునే వ్యవస్థలు లేకపోవడం, ఒకరి ప్రాజెక్టులను మరొకరు అడ్డుకోవడం, కోర్టులు, ట్రైబ్యునళ్ల చుట్టూ తిరగడం వల్ల ఈ పరిస్థితి దాపురిం చింది. ‘‘ఆ ప్రాజెక్టును ఆపండి, ఈ ప్రాజెక్టును నిలిపివేయండి’’ అంటూ రాజకీయ అగ్గి రాజేసు కోవడం వల్ల నష్టపోతున్నది అంతిమంగా రెండు రాష్ట్రాల రైతులే.
ముఖ్యమంత్రుల సానుకూల దృక్పథం
‘‘పంచాయితీల కంటే పరిష్కారాలే ముఖ్యం’’ అంటూ ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి ఒక మెట్టు దిగి వచ్చి మాట్లాడుతుండటం శుభపరిణామం. చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా మండపేటలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సముద్రంలోకి వెళ్లే నీళ్ల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య గొడవలు ఎందుకు? నాకు గొడవలు కాదు.. తెలుగు జాతి ప్రయోజనాలు ముఖ్యం’’ అని స్పష్టం చేశారు. పోలవరం పూర్తయితే తెలంగాణ కూడా నీటిని వాడుకునే అవకాశం ఉంటుందని, పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాలో నీటిని వినియోగించుకుని, శ్రీశైలం నీటిని పొదుపు చేసి రాయలసీమకు మళ్లించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొందరు కావాలనే నీళ్లు వద్దు, గొడవలే కావాలని కోరుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అటు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.‘‘తెలంగాణ రాష్ట్రానికి పంచాయితీ కావాలా? నీళ్లు కావాలా? అని అడిగితే నేను నీళ్లే కావాలని కోరుకుంటాను. వివాదాల కంటే శాశ్వత పరిష్కారాలకే మొగ్గు చూపుతా’’ అని రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో తేల్చిచెప్పారు. ఆంధప్రదేశ్ ఒక అడుగు ముందుకు వేస్తే, తెలంగాణ పది అడుగులు ముందుకు వేస్తుందని, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి వంటి ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులు వచ్చాయని, ఇప్పుడు వాటికి అడ్డంకులు సృష్టించవద్దని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ కోసం, మచిలీపట్నం పోర్టు నుండి ఫ్యూచర్ సిటీ వరకు రవాణా సదు పాయాల కోసం ఏపీ సహకారం అవసరమని ఆయన గుర్తు చేశారు.
‘సీమ’ ప్రాజెక్టుపై వైసీపీ ఆరోపణలు
రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు చిగురి స్తున్నవేళ, రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడంపై వైసీపీ విషం చిమ్మే ప్రయత్నం చేస్తోంది. రాయలసీమ ప్రాజెక్టును ఆపిన ద్రోహి చంద్రబాబు అంటూ అసత్య ప్రచారాలకు తెరలేపింది. రేవంత్ రెడ్డి ప్రకటనను సాకుగా చూపి, చంద్రబాబు వల్లే ప్రాజెక్టు ఆగిపోయిందని బురద చల్లే ప్రయత్నం చేస్తోంది. అయితే, ఈ ప్రాజెక్టు ఆగడానికి గల కారణాలను, గత ఐదేళ్లలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే అసలు కారకుడు ఎవరో స్పష్టమవుతుంది.
•యలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోవడానికి కారణం ఎవరు? తాను ఆపించానని రేవంత్‌రెడ్డి అంటుంటే, తమ పోరాట ఫలితమని బీఆర్‌ఎస్, ఎన్జీటీ ఆపిందని చంద్రబాబు, కేంద్రం ఆపిందని బీజేపీ ఎవరికి వారు చెప్పుకుంటున్నారు. కానీ, వాస్తవాలను లోతుగా పరిశీలిస్తే జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే ఈ ప్రాజెక్టు కొంపముంచాయని అర్థమవుతుంది.
‘సీమ’ జీవనాడి: ముచ్చుమర్రి పథకం
రాయలసీమ ప్రాంతానికి సాగు, తాగునీరు అందించాలనే లక్ష్యంతో, శ్రీశైలం జలాశయం ఎగువన 790-800 అడుగుల వద్ద కృష్ణా జలాలను ఎత్తిపోసేందుకు ‘‘ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం’’ను గతంలోనే చేపట్టారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు దేశం ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసి, 2017 ఆగస్టు 8న జాతికి అంకితం చేసింది. అక్కడితో ఆగకుండా, వరద సమయాల్లో రోజుకు మూడు టీఎంసీల చొప్పున నీటిని బనకచర్ల ఎగువన ఉన్న శ్రీశైలం కుడి మెయిన్ కాలువ (ఎస్.ఆర్.ఎమ్.సి)లో ఎత్తిపోసి పోసేలా ప్రణాళిక రూపొందించారు. అక్కడి నుంచి తెలుగుగంగ, ఎస్సా ర్బీసీ, కేసీ కెనాల్, కుందూ నదికి నీటిని మళ్లించేలా ‘‘ముచ్చుమర్రి-బనకచర్ల ఎత్తిపోతలకు డిజైన్ చేయించారు.
ఈ పథకం నిర్మాణానికి దాదాపు రూ.3,600 కోట్ల అంచనా వ్యయంతో 2018 చివరలో సమగ్ర ప్రాజెక్టు నివేదిక కూడా సిద్ధమైంది. అయితే, ఎన్నికల కోడ్, ప్రభుత్వం మారడంతో ఈ పనులు ముందుకు సాగలేదు.
2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ, ఇది పూర్తయితే చంద్రబాబు పేరు వస్తుందనే దురుద్దేశంతో ఆ ప్రాజెక్టును వివాదాస్పదం చేసింది. పథకాన్ని పక్కనబెట్టింది. వాస్తవానికి ముచ్చుమర్రి నుండే లిఫ్ట్ చేపట్టి ఉంటే, అది ఇప్పటికే ఉన్న ప్రాజెక్టు కాబట్టి న్యాయపరమైన చిక్కులు గానీ, పర్యావరణ అనుమతుల సమస్యలు గానీ తలెత్తేవి కావు. కేవలం 13-14 కిలోమీటర్ల లింక్ కెనాల్ తవ్వకానికి భూసేకరణ చేస్తే సరిపోయేది. కానీ, జగన్ ప్రభుత్వం పాత ప్రతిపాదనను, ముచ్చుమర్రి దిగువన ఉన్న ‘సంగమేశ్వరం’ వద్దకు హెడ్ వర్క్ పాయింట్‌ను మార్చేసింది. దానికి ‘‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్’’ అని పేరు మార్చి, ఇది తామే కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టుగా ప్రచారం చేసుకుంది. రోజుకు 3 టీఎంసీల నీటిని సంగమేశ్వరం నుండి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువకు ఎత్తిపోసేలా డిజైన్ మార్చారు. ఈ మార్పే ప్రాజెక్టు పాలిట శాపంగా మారింది.
న్యాయ వివాదాలు-ఎన్జీటీ ఆంక్షలు
ప్రాజెక్టు స్థలాన్ని, డిజైన్‌ను మార్చడం వల్ల ఇది ‘‘కొత్త ప్రాజెక్టు’’గా పరిగణనలోకి వచ్చింది.దీంతో తెలంగాణకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి జాతీయ హరిత ట్రెబ్యునల్‌లో ఫిర్యాదు చేశారు. జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని బెంచ్ దీనిపై విచారణ చేపట్టింది.
రూ.3,825 కోట్ల అంచనాతో 2020 మే 5న జగన్ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది కానీ, దానికి కనీస పర్యావరణ అనుమతులు లేవు.
పనుల నిలిపివేత
పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేపట్టడాన్ని ఎన్జీటీ తీవ్రంగా పరిగణించింది. 2021 ఆగస్టు 7న, డీపీఆర్ తయారీ ముసుగులో ఎలాంటి నిర్మాణ పనులు చేయరాదని ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. దీంతో అప్పటి నుండే పనులు ఆగిపోయాయి.
ఉల్లంఘనలు – జరిమానా
తాగునీటి అవసరాల పేరుతో పనులు చేస్తున్నా మని ఏపీ ప్రభుత్వం చెప్పినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయడంతో పనులు పూర్తిగా ఆగిపోయాయి. అనుమతులు లేకుండా పనులు చేసినందుకుగాను, 2024 మార్చి 22న ఎన్జీటీ ఏపీ ప్రభుత్వానికి రూ.2.65 కోట్ల భారీ జరిమానా (అపరాధ రుసుం) విధించింది.
సీమ ద్రోహి ఎవరు?
పై పరిణామాలను గమనిస్తే, రాయలసీమ ప్రాజెక్టు ఆగిపోవడానికి ప్రధాన కారణం జగన్ ప్రభుత్వమేనని స్పష్టమవుతుంది.చంద్రబాబు పూర్తి చేసిన ముచ్చుమర్రిని వినియోగించుకోకుండా, కేవలం రాజకీయ దురుద్దేశంతో సంగమేశ్వరానికి మార్చడం మొదటి తప్పు. అనుమతులు లేకుండా పనులు ప్రారంభించి, ప్రాజెక్టును న్యాయపరమైన చిక్కుల్లోకి నెట్టడం రెండో తప్పు.ఎన్జీటీ మొట్టికాయలు వేసి, పనులు ఆపేయాలని ఆదేశించింది 2021 లో జగన్ అధికారంలో ఉన్నప్పుడే. జరిమానా పడింది కూడా ఆయన హయాంలో చేసిన తప్పులకే.
‘‘ముచ్చుమర్రి-బనకచర్ల’’ ద్వారా రాయలసీమకు సులువుగా అందాల్సిన నీటిని, డిజైన్ మార్పుల పేరుతో జగన్ ప్రభుత్వం దూరం చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రకటనను అడ్డం పెట్టుకుని, ఆ పాపాన్ని తెలుగుదేశం ప్రభుత్వంపై నెట్టాలని చూడటం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం.
ప్రస్తుతం చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డిల మధ్య గల సయోధ్య వాతావరణం తెలుగు రాష్ట్రాలకు ఒక సువర్ణావకాశం. నీటి కోసం తగువులాడుకుంటూ సముద్రం పాలు చేసే కంటే, చర్చల ద్వారా, ఇచ్చి పుచ్చుకునే ధోరణి ద్వారా నీటిని సమర్ధంగా వాడుకోవడం ఇద్దరు నేతల లక్ష్యంగా ఉండాలి. నీటి అవసరాలకు తెలంగాణ సహకారం ఏపీకి అవసరం అలాగే నీటి అవసరంతో పాటు పోర్టు అనుసంధానత తెలంగాణకు అత్యంత అవసరం. అందుకు ఏపీ ప్రభుత్వ సహకారం తప్పదు. పోలవరం, అమరావతి, మచిలీపట్నం పోర్టు వంటి అంశాల్లో సహకరించు కుంటూ ముందుకెళ్లాలని వారు నిర్ణయించుకోవడం ఆశావహ దృక్పథం. ఈ తరుణంలో, రాయలసీమ ప్రాజెక్టు విషయంలో వైసీపీ చేస్తున్న విషప్రచారాన్ని నమ్మి ప్రజలు మోసపోకూడదు. రాయలసీమకు నీళ్లు రాకుండా అడ్డుపడింది గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే తప్ప, ప్రస్తుత ప్రభుత్వం కాదు. వివాదాలు సృష్టించడం కాకుండా, పరిష్కారాల దిశగా అడుగులు వేస్తున్న ప్రస్తుత నాయకత్వానికి మద్దతు తెలపడం ద్వారానే తెలుగు జాతి ప్రయోజనాలు నెరవేరుతాయి. రాజకీయాలకతీతంగా, వాస్తవాలను గ్రహించి, రెండు రాష్ట్రాల అభివృద్ధిని కాంక్షించాల్సిన సమయం ఇది.