ఎత్తయిన మంచు కొండలకు నెలవై ఆహ్లాదకరమైన చల్లని వాతావరణంలో ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకట్టుకునే నేపాల్‌ ‌దేశంలో ప్రస్తుతం అనిశ్చితి రాజ్యమేలుతోంది. ఒకప్పుడు ప్రపంచంలో ఏకైక హిందూ దేశంగా గుర్తింపు పొందిన నేపాల్‌ ‌పలు ఉద్యమాల అనంతరం రిపబ్లిక్‌ ‌దేశంగా మారిన తర్వాత అక్కడి ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయలేదు. గత సెప్టెంబర్‌లో యువత చేపట్టిన ‘జెన్‌-‌జెడ్‌’ ఉద్యమం, ప్రస్తుతం జరుగుతున్న మతకలహాలు రెండింటికీ సోషల్‌ ‌మీడియా ‘టిక్‌ ‌టాక్‌’ ‌వేదికయే కారణమైంది. అగ్రదేశాలు అక్కడ అగ్నికి ఆజ్యం పోస్తుంటే భారతదేశంతో కీలక సరిహద్దు కలిగిన నేపాల్‌లో అనిశ్చితి మనకు ఆందోళనకరమే.హిందూ దేశంగా గుర్తింపు పొందిన నేపాల్‌లో ఇప్పుడు ప్రజాస్వామ్యం పేరుతో అధికారంలోకి వచ్చిన పార్టీలు ఒకవైపు భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటే, మరోవైపు మతకలహాల పేరుతో హిందువులు లక్ష్యంగా మారడం విచారకరం. అక్కడ జరుగుతున్న అల్లర్లు ఆ దేశం అంతర్గత వ్యవహారంగానే పైకి కనిపిస్తున్నా, నిగూఢంగా పరిశీలిస్తే భారత దేశం ఆచితూచి అడుగులేయాల్సిన అవసరం ఉంది.

‌ప్రజాస్వామ్యంగా మారిన నేపాల్‌లో ఐదు నెలల క్రితం అవినీతి, అక్రమాలపై ప్రజాగ్రహం అట్టుడికింది. ఇప్పుడు నూతన సంవత్సరం-2026 జనవరి తొలి వారంలో నేపాల్‌గడ్డపై ఎన్నడూ లేని విధంగా మతకలహాలు జరగడం ఆందోళన కరం. బిహార్‌ ‌రాష్ట్రానికి సరిహద్దులో నేపాల్‌ ‌దక్షిణాన ఉండే పరాస, ధనుశా జిల్లాల్లో మతకలహాలు జరగడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశ సరిహద్దులో ఉండే ఈ రెండు ప్రాంతాల్లో ముస్లిం, హిందూ వర్గాల మధ్య చెలరేగిన అల్లర్లు భారత్‌లో ప్రభావం చూపకుండా మన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని సరిహద్దు మూసేసింది. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా అల్లర్లు, మత కలహాలు సర్వ సాధారణంగా మారినా హిందువులపై దాడులతో భారతదేశాన్ని రెచ్చగొట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని గమనించవచ్చు. నేపాల్‌ ‌దేశంలో ముస్లిం జనాభా సంఖ్య అత్యల్పమే. 2021 గణాంకాల ప్రకారం దాదాపు 3 కోట్లకు పైగా జనాభా గల నేపాల్‌ ‌దేశంలో ముస్లింలు సుమారు 5 శాతం దాదాపు 15 లక్షలు ఉంటారు. అదీ కూడా దక్షిణ నేపాల్‌లోనే అధికంగా ఉన్నారు. తక్కువ జనాభా ఉన్నా ముస్లింలు కొందరు పరాస జిల్లా బీర్‌గంజ్‌లో ఘర్షణకు కాలుదువ్వడం గమనార్హం. అక్కడ హిందువులకు వ్యతిరేకంగా కొన్ని వీడియోలను సోషల్‌ ‌మీడియా వేదికగా ‘టిక్‌ ‌టాక్‌’‌లో వైరల్‌ ‌చేశారు. దీంతో కొందరు హిందువులు ధనుస్‌లో ఒక ప్రార్థనా మందిరాన్ని ధ్వంసం చేశారని సోషల్‌ ‌మీడియాలో వైరల్‌ అవడంతో రెండు వర్గాలు బాహాబాహీ తలపడిన నేపథ్యంలో కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
‘జెన్‌-‌జెడ్‌’ ఉద్యమం తర్వాత గందరగోళం నెలకొన్నా ఇప్పుడిప్పుడే పరిస్థితులు కొంత సద్దుమణుగుతూ వచ్చే మార్చి నెలలో ఎన్నికకు సిద్ధ్దమవుతున్న నేపాల్‌లో అనిశ్చితిని కొనసాగించాలనే కుట్రలతో ఇప్పుడు హిందువుల కేంద్రంగా కుట్రలకు విదేశీశక్తులు తెరలేపాయి. అక్కడ తక్కువ శాతం ఉన్న ముస్లింలు హిందువుల లక్ష్యంగా మత కలహాలకు ఆజ్యం పోయడం వెనుక భారత్‌ ‌ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడంలో భాగమే. ప్రస్తుతం ఆ దేశంలో జరుగుతున్న మతకలహాలతో ఆ ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకుంటున్న, కూలీ పనులు చేసుకుంటున్న భారతీయ హిందువులు ఆందోళనతో నేపాల్‌ ‌సరిహద్దులు దాటి మన దేశంలోకి ప్రవేశిస్తున్నారు. అక్కడ హిందువులను లక్ష్యంగా చేసుకొని చేస్తున్న దాడులు చూస్తుంటే బాంగ్లాదేశ్‌ అల్లర్లు గుర్తుకొస్తున్నాయి. ఎన్నడూలేని విధంగా నేపాల్‌లో మత కలహాలు జరగడం వెనుక కచ్చితంగా భారత్‌ ‌వ్యతిరేక శక్తులున్నాయి. ఇప్పటికే బాంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులతో భారత్‌లో ఆందోళన నెలకొంది. ఇప్పుడు అదే తరహా నేపాల్‌లోనూ వ్యవహరించాలని చూస్తున్నారు. బాంగ్లాదేశ్‌లో భారత్‌కు వ్యతిరేకంగా శక్తులను ఉసిగొల్పుతున్నట్టే నేపాల్‌, ‌భారత్‌ ‌సరిహద్దు ప్రాంతాల్లో అల్లర్లతో అక్కడి హిందువులను, వ్యాపారం చేసుకొనే భారతీయులను భయాందోళనలతో తరిమి కొట్టేందుకు యత్నిస్తున్నారు.
మతమౌఢ్యంతో ఊగిపోతున్న బాంగ్లాదేశ్‌లో అక్కడి ప్రభుత్వం, అరాచక శక్తులు అమెరికా, చైనా, పాకిస్తాన్‌ ‌వ్యూహాల్లో కీలుబొమ్మై భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ అక్కడ మైనార్టీలైన హిందువులపై భయంకర దాడులు చేస్తున్నారు. 2024 జూలై, ఆగస్టు నెలల్లో బాంగ్లాదేశ్‌ అం‌తర్గత రాజకీయాల గొడవల్లో హిందువులపై దాడులు చేస్తూ బలిపశువులను చేసిన బాంగ్లాదేశీయులు ఇప్పుడు మళ్లీ గత పక్షం రోజులుగా హిందువుల లక్ష్యంగా దాడులు చేస్తూ పదిమందికిపైగా హత్య చేశారు. బాంగ్లాలో భారత్‌ ‌వ్యతిరేక శక్తులకు అక్కడి తాత్కాలిక ప్రభుత్వం అధినేత యూనుస్‌ ‌పరోక్షంగా అండగా ఉంటూ వారిని రెచ్చగొడుతూ అక్కడ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. బాంగ్లాదేశ్‌లో అరాచక ఘటనలతో భారత్‌లో నిరసనలు జరగడమే కాకుండా బాంగ్లాదేశ్‌ అల్లర్లపై కఠినంగా స్పందించాలనే ఒత్తిడి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై పెరిగింది. ఇదే తరహాలో ఒత్తిడి నేపాల్‌ ‌ఘటనలతో కూడా తెచ్చి అంతర్గతంగా భారత్‌లో ఆందోళనలు పెంచాలనే కుట్రలకు విదేశీ శక్తులు తెరలేపుతున్నాయి.
ప్రపంచంలో ఒక్కప్పుడు ఏకైక హిందూ దేశంగా గుర్తింపు పొందిన నేపాల్‌లో అల్లర్లు, రాజకీయ అనిశ్చితి ఇప్పుడు కొత్తగా ప్రారంభమైంది కాదు. ప్రజా ఉద్యమాలతో 2008లో నేపాల్‌ ‌దేశంలో రాచరిక కుటుంబ పాలనకు ముగింపు అనంతరం గణతంత్ర ప్రజాస్వామ్యంగా ఆవిర్భవించింది. రిపబ్లిక్‌ ‌నేపాల్‌లో వామపక్షాలు, నేపాలీ కాంగ్రెస్‌, ‌రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ అధికారంలో అవినీతి అక్రమాలతో యువతలో ఆక్రోశం పెల్లుబుకింది. నేపాల్‌లో రాచరిక వ్యవస్థ 2008లో రద్దయి ఆధునిక పార్లమెంట్‌ అవతరించిన తర్వాత యువత, సమాజం భారీ ఆశలు పెట్టుకున్నా పదిహేడు సంవత్సరాలు గడిచినా అక్కడి ప్రజల జీవన పరిస్థితులు రోజు రోజుకు దిగజారడంతో వారిలో నిరాశ నిస్పృహలు పెరిగిపోయాయి. ప్రజాస్వామ్యం, సామ్యవాదం పేరుతో అధికారంలోకి వచ్చిన వామపక్షాలు సహా ఇతర పార్టీలు కూడా మోసం చేశాయనే ఆక్రోశం ప్రజల్లో రెట్టింపయ్యింది. నేపాల్‌ ‌దేశంలో మావోయిస్టులు దశాబ్దం పాటు భీకరమైన పోరాటం సాగించి తర్వాత ఆయుధాలు విడిచారు. 2008 నుండి 2025 వరకు 17 సంవత్సరాల్లో 12 సంవత్సరాల వామపక్షాల పాలనలో నేపాల్‌ ‌భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారిన ఫలితమే ‘టిక్‌-‌టాక్‌’ ఉద్యమం.
దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడం, పేదరికం, ఆర్థిక సంక్షోభం, రాజకీయ నాయకులతో పాటు అధికారుల అవినీతి అక్రమాలపై నేపాల్‌ ‌యువత ఆగ్రహానికి నిదర్శనం ‘జెన్‌-‌జెడ్‌’ ఉద్యమం. సోషల్‌ ‌మీడియాపై ఓ.పి.శర్మ ఓలీ నేతృత్వంలోని కమ్యూనిస్టు ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని ప్రారంభమైన ‘టిక్‌-‌టాక్‌’ ఉద్యమం దాదాపు పక్షం రోజులు కొనసాగి సుమారు 40 మంది మృతి చెందారు. అనంతరం సుశీల కార్కీ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం ఆధ్వర్యంలో వచ్చే మార్చి నెలలో ఎన్నికలు రాబోతున్నాయి. ‘జెన్‌-‌జెడ్‌’ ఉద్యమం అనంతరం నేపాల్‌లో తరచూ గతంలో లేని విధంగా అక్కడక్కడ మతకలహాలు జరుగుతున్నాయి. ఎన్నికల వేళ అక్కడ మళ్లీ సోషల్‌ ‌మీడియా కారణాలతో మత కలహాలు చెలరేగాయి. అయితే ఇక్కడ కూడా బాంగ్లాదేశ్‌, ‌నేపాల్‌ అల్లర్ల మధ్య సారూప్యం కనిపిస్తోంది. ఫిబ్రవరిలో బాంగ్లాదేశ్‌ ‌లో ఎన్నికలు జరగనున్న వేళ అక్కడ హిందువులపై దాడులు జరుగుతున్నాయి. ఈ రెండు దేశాల్లో భారత్‌ ‌తో పాటు హిందువులను లక్ష్యంగా చేసుకొని అక్కడ రాజకీయ లబ్ధి పొందాలని ఆ దేశాల్లోని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుంటే అదే సమయంలో ఆ అగ్నికి భారతదేశ వ్యతిరేక విదేశీ శక్తులు కూడా ఆజ్యం పోయడానికి కాచుకొని కూర్చున్నాయి. బాంగ్లాలో వలే నేపాల్‌లో కూడా సరిహద్దు ప్రాంతాల్లోనే ఘర్షణలు జరగుతున్నాయి. దక్షిణ నేపాల్‌ ‌పారస్‌ ‌జిల్లాలోని బీర్‌గంజ్‌ ఆ ‌దేశంలో కీలకమైన వాణ్యి ప్రాంతం. ఇది రెండు దేశాల మధ్య నిత్యం రద్దీగా ఉండే సరిహద్దు ప్రాంతం. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్దేశపూర్వకంగా ఘర్షణలు సృష్టించి భారత్‌లో కూడా అశాంతి నెలకొల్పాలనే పన్నాగాలు ప్రారంభమయ్యాయి.
నరేంద్ర మోదీ నేతృత్వంలో దాదాపు పుష్కర కాలంగా భారతదేశం అగ్రరాజ్యాలకు దీటుగా మారుతున్న దశలో ప్రధానంగా అమెరికా, చైనా కక్షగట్టాయి. వీరికి నక్కజిత్తుల పాకిస్తాన్‌ ‌తోడైంది. అంతర్జాతీయంగా తమ ఆధిపత్యాన్ని చెలాయించాలని చూస్తున్న అగ్రరాజ్యాల సంస్థలు ప్రమాదకరమైన ఆటను సాగిస్తూ అమాయకులను పావులుగా వాడుకోవడంలో భాగంగానే భారత్‌ ‌చుట్టు పక్కల దేశాల్లో అల్లర్లను ప్రేరేపిస్తోంది. అమెరికాకు చెందిన గూఢచారి సంస్థలు యువతను వివిధ అంశాలతో రెచ్చగొట్టడం, ఆ అగ్నికి ఆజ్యం పోసినట్లు చైనా, పాకిస్తాన్‌ ‌వంటి దేశాలు వ్యవహరించడంతో బాంగ్లాదేశ్‌, ‌నేపాల్‌ ‌దేశాల్లో అనిశ్చితికి దారితీస్తు న్నాయి. నేపాల్‌ ‘‌జెన్‌-‌జెడ్‌’ ‌తరహాలో భారత్‌లో కూడా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు ప్రారంభం కావాలని దేశంలోని ప్రతిపక్షాలు, కొన్ని ప్రజా సంఘాలు, మేధావులు పిలుపిచ్చిన సందర్భాలు మనం చూశాం. గతంలో బాంగ్లాదేశ్‌, ‌నేపాల్‌ ‌దేశాల్లో ఇలాంటి తరహా ఉద్యమాలకు అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తూ ఆర్థికంగా వెనుదన్నుగా ఉన్న విదేశీ శక్తులు భారతదేశంలో కూడా ఇలాంటి వ్యూహాలకు విఫలయత్నం చేస్తున్నాయి.
భారత దేశ సరిహద్దు దేశాల్లో నిత్యం అశాంతి అలజడులు సృష్టించేందుకు అగ్రరాజ్యాలు ప్రణాళిక బద్ధంగా కుట్రలు పన్నుతున్నాయి. భారత్‌కు పాకిస్తాన్‌ ‌తో నిత్యం వివాదాస్పదమే. మనమంటే పొసగని చైనా కూడా కాలుదువ్వడానికి ఎప్పుడూ సిద్ధ్దంగా ఉంటుంది. ఈ రెండు దేశాలతో ఉన్న సమస్యలే కాకుండా శ్రీలంకలో, బాంగ్లాదేశ్‌లో, తర్వాత నేపాల్‌లో అంతర్గత ఘర్షణలు సృష్టిస్తూ అక్కడి అరాచక శక్తులను భారత్‌కు వ్యతిరేకంగా ఉసిగొల్పడానికి అగ్రరాజ్యాలు అమెరికా, చైనా ముందు వరుసలో ఉంటాయి. బాంగ్లాదేశ్‌లో హిందువులను అతి కిరాతకంగా హత్యలు చేస్తున్న వార్తలను నిత్యం చూస్తూనే ఉన్నాం.
ఇలాంటి కుట్రలను, పన్నాగాలను దృష్టిలో పెట్టుకొని భారత్‌ ‌బహు జాగ్రత్తగా వ్యవహరిం చాల్సిన ఆవశ్యకత ఉంది. బాంగ్లాదేశ్‌ అం‌తర్గత వ్యవహారాలను అటుఇటు తిప్పి భారత్‌పై, హిందువులపై ఉసిగొల్పినట్టే, ఇప్పుడు నేపాల్‌లో కూడా అంతర్గత రాజకీయ సంక్షోభానికి మత కలహాల రంగుపులిమి భారత్‌కు, హిందువులకు వ్యతిరేకంగా ఘర్షణలు సృష్టించే అవకాశాలున్నాయి. ఇంటర్నెట్‌ ‌దాడులు భౌతికదాడులుగా మారిన నేపథ్యంలో సోషల్‌ ‌మీడియా పుణ్యమా అని మంచు దేశం నేపాల్‌ ‌దేశంలో జరుగుతున్న టిక్‌ ‌టాక్‌ ‌మత కలహాల మంటలపై భారతదేశం బహుపరాక్‌గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

– శ్రీపాద

About Author

By editor

Twitter
YOUTUBE