ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడిన రాష్ట్రంలో ప్రభుత్వాలు తీసుకొచ్చిన కొత్త విధానాలు దోపిడీకి దారులు తెరిచాయన్న విమర్శలకు తావిస్తూ ఆధారాలు కూడా దొరుకుతున్నాయి. ముఖ్యంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకురాగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి పోర్టల్‌ను అమలు చేస్తోంది. కొందరు దళారులు, అక్రమార్కులు వీటిని దుర్వినియోగం చేస్తూ, ఊహించని రీతిలో నిధులు మళ్లిస్తున్నారు. భూ బదలాయింపుల•, ఇతర అవసరాలకు సంబంధించి ప్రజలు చెల్లించే రుసుములు ప్రభుత్వ ఖజానాకు కాకుండా పక్కకు మళ్లిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా, పక్కా ప్రణాళిక ప్రకారం దోపిడీకి తెగబడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో ధరణి పోర్టల్ ద్వారా దోపిడీ జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం హోదాలో పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిం చింది. తాము అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని ప్రకటించి, అన్నట్లుగానే పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే ‘ధరణి’ని రద్దుచేసి, భూ భారతి పోర్టల్‌ను ప్రయోగాత్మకంగా తీసుకొచ్చింది. కొన్ని రకాల సేవలను ధరణి నుంచి భూ భారతికి బదలాయించింది. తర్వాత క్రమక్రమంగా అన్ని సేవలను ధరణి నుంచి భూ భారతికి మార్చేసింది. ఇంతకుముందు లేని మరికొన్ని సేవలను కూడా భూ భారతి కిందికి తీసుకు వస్తున్నామని, భూ భారతిని ప్రజల అవసరాలకు తగినట్లు త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా ఇటీవలే ప్రకటించారు.
అయితే, ప్రస్తుతం పోర్టల్ పేరు మారిందే కానీ దోపిడీలో మార్పులేదు. ఈ పరిణామం రాష్ట్రంలో మరోసారి ప్రకంపనలు రేకెత్తిస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో జరుగుతున్న దోపిడీని రాష్ట్రస్థాయిలో గ్రహించకపోవడం, సచివాలయం స్థాయిలో ఉన్నతాధి కారులు పసిగట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఏదో ఒక చిన్న జిరాక్స్‌సెంటర్ కేంద్రంగా బయటపడ్డ ఈ దోపిడీని పసిగట్టి తీగ లాగితే డొంకంతా కదలినట్లయింది. అధికారుల పర్యవేక్షణ లోపం, నిఘా వ్యవస్థ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఖజానాకు ఇప్పటికైతే సుమారు రూ. యాభై కోట్లు చిల్లు పడిందని ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తిస్థాయిలో విచారిస్తే.. ఈ దోపిడీ విలువ మరింత పెరిగే అవకాశాలున్నాయంటున్నారు విశ్లేషకులు.
భూముల రిజిస్ట్రేషన్ల పక్రియలో సాఫ్ట్‌వేర్‌లోని లోపాలు, చెల్లింపుల మార్గంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకున్న కొన్ని ముఠాలు ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో సాగు భూముల రిజిస్ట్రేషన్లు మ్యుటేషన్ల పోర్టల్ ధరణి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి పోర్టల్‌లలోని లోపాలను తమకు అనుకూలంగా మలచుకుని రూ.కోట్లు దోపిడీ చేశాయి. అతి తెలివితో మాల్‌వేర్ ఉపయోగించి పెద్దఎత్తున డబ్బు దారి మళ్లించాయి. కొద్దిరోజుల క్రితం జనగామ జిల్లాలో బయటపడిన చిన్న అంశం ఆధారంగా తీగడంతో రాష్ట్రవ్యాప్తంగా డొంక కదిలింది. ఇప్పటి వరకు 4,800 లావాదేవీల్లో సొమ్ము దారిమళ్లినట్లు గుర్తిం చారు. రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలలో ఇది అత్యధికమని చెబుతున్నారు. ఈ వ్యవహారంలో కొందరు రెవెన్యూ అధికారుల పాత్ర కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జనగామ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా భూభారతి పోర్టల్లో సాగు భూముల రిజిస్ట్రేషన్ల సొమ్ము పక్కదారి పడుతున్నట్లు గుర్తించి, యాదగిరిగుట్టకు చెందిన ఓ ఆన్‌లైన్ సెంటర్ నిర్వాహకుడు అందుకు సహకరిస్తున్నట్లు తేల్చారు. రైతులు భూమి రిజిస్ట్రేషన్‌కు ఆన్‌లైన్ సెంటర్‌కు వస్తుంటారు. సర్వే నంబరు ఆధారంగా విస్తీర్ణాన్ని బట్టి మార్కెట్ విలువ ప్రకారం ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లిస్తుంటారు. అయితే ఆన్ లైన్ నిర్వాహకులు ఆ మొత్తం ప్రభుత్వ ఖజానాకు వెళ్లకుండా సాఫ్ట్‌వేర్ ఉపయోగించి కొల్లగొడుతున్నారు. ప్రతి రూ.లక్షకు కేవలం రూ. 10 వేలు మాత్రమే ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యేలా చేసి, మిగిలిన మొత్తాన్ని తమ సొంత ఖాతాల్లో వేసుకుంటున్నారు.
గత ప్రభుత్వం 2020లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతను రిజిస్ట్రేషన్ శాఖ నుంచి తహసీల్దార్లకు అప్పగించినప్పటి నుంచి ఈ లొసుగులు మొదలయ్యాయి. ఈ వ్యవహరంపై సీసీఎల్‌ఏ విచారణకు ఆదేశించగా.. పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు తేలింది. ధరణి నుంచి మొదలై.. భూ భారతి దాకా గడచిన ఆరేళ్లలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 52 లక్షల లావాదేవీలు జరిగాయి. వీటికి సంబంధించి స్టాంప్ డ్యూటీ కింద రూ. 13 వేల కోట్లు వచ్చిందని సీసీఎల్‌ఏ ఆడిట్‌లో తేలింది. ఈ మొత్తం లావాదేవీల్లో..4,300 లావాదేవీలకు సంబంధించి నగదులో వ్యత్యాసం ఉన్నట్లు, సుమారు రూ.42 కోట్లనుఏ వి•-సేవ కేంద్రాల నిర్వాహకులు, కొందరు మధ్యవర్తులు తమ ఖాతాలకు మళ్లించుకున్నట్లు అధికారులు గుర్తించారు.
రాష్ట్రంలో నవంబరు 2, 2020 నుంచి ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చింది. టెర్రా ఐసిస్ అనే ప్రైవేట్ సంస్థ దీని నిర్వహణ చేపట్టింది. కాంగ్రెస్ ప్రభత్వం ఆ సంస్థ నుంచి ధరణి డేటాను కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘నేషనల్ ఇన్‌ఫర్మేటిక్ సెంటర్’(ఎన్‌ఐసీ)కి మార్చింది. భూముల లావాదేవీలకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ని ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు అనుగుణంగానే రూపొందించినప్పటికీ.. అందులోని కొన్ని లొసుగుల ఆధారంగా, ఈ-చలానా చెల్లించినట్లే చెల్లిస్తూ తిరిగి వెనక్కి తీసుకోవడం, ఆ చెల్లించిన మొత్తంలో కూడా చివర ఉన్న అంకెలను మార్చి తక్కువ మొత్తానికి చలానా సృష్టించి పోర్టల్‌లోని అప్లికేషన్‌కు చెల్లింపుల అప్లికేషన్ జత చేయడం చేస్తున్నారు. ఇందుకోసం దోపిడీదారులు ఒక మాల్‌వేర్ గానీ, ఏదైనా యాప్‌ను గానీ తయారుచేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ-చలానా చేరాల్సిన బ్యాంక్ గేట్‌వే దగ్గర ఇలా దోపిడీ చేస్తున్నారా? లేక..స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు డబ్బులు జమ అయ్యే సమయంలో దాన్ని మార్చుతున్నారా? అనే అంశంపై సాఫ్ట్‌వేర్ నిపుణులు పరిశోధన చేస్తున్నారు. 10 నుంచి 40 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పక్రియ పకడ్బందీగా జరుగుతుండగా, అంత తక్కువ సమయంలో ఎలా దోపిడీ చేస్తున్నా రన్నది అంతుచిక్కడం లేదు..
రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ప్రింట్ అయ్యే డీడ్ పత్రాలపై భూమి మార్కెట్ విలువ, చెల్లించాల్సిన ఛార్జీ మొత్తం, రైతు చెల్లించిన వివరాలన్నీ ప్రచురిత మవుతాయని సీసీఎల్‌ఏ అధికారులు చెబుతున్నారు. పోర్టల్ నుంచే ఆటోమేటిక్ విధానంలో ఈ వివరాలు తహశీల్దారు వద్ద ప్రింట్‌లో వస్తాయని, ఆ తరువాత తహశీల్దారు సంతకం చేయాల్సి ఉంటుందని తెలిపారు.
ఆ సమయంలో గుర్తించే వీలున్నా ఎందుకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే అంశంపైనా ఇప్పుడు విచారణ చేస్తున్నారు. సాధారణంగా రిజిస్ట్రేషన్ శాఖలో ప్రతి చలానా వి•ద మూడు దశల్లో తనిఖీ ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా చలానా మొత్తం తగ్గినట్లు సిస్టమ్ గుర్తిస్తే.. రిజిస్ట్రేషన్ పక్రియ అక్కడే ఆగిపోతుంది. కానీ, తహసీల్దార్లకు అప్పగించిన పోర్టల్‌లో స్టాంప్ డ్యూటీకి సంబంధించిన చెల్లింపుల వి•ద క్రాస్‌చెక్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. దీంతో దస్తావేజుల్లో ఉన్నదానినే ఆమోదించే పరిస్థితని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో ఈ తరహా కార్యకలాపాలకు అవకాశం లేదని అంటు న్నారు. గిఫ్ట్ డీడ్ అయితే.. ఎవరు, ఎవరికి గిఫ్ట్ చేస్తున్నారు? చట్టపరిధిలో గిఫ్ట్ డీడ్ చేశారా? లేదా? అనేది రిజిస్ట్రేషన్ శాఖలో పక్కాగా తనిఖీ జరుగు తుందని పేర్కొంటున్నారు. అయితే ఈ తరహా తనిఖీని తహసీల్దార్లు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా.. స్టాంప్ డ్యూటీ విషయంలో మార్కెట్ విలువలో ఏది ఎక్కువ ఉంటే ఆ మొత్తాన్నే పరిగణనలోకి తీసుకుని రిజిస్ట్రేషన్ శాఖ సాఫ్ట్‌వేర్ స్టాంపు డ్యూటీని లెక్కిస్తుంది. రెవెన్యూలో మాత్రం మార్కెట్ విలువతో సంబంధం లేకుండా ఏది తక్కువ ఉంటే దానినే పరిగణనలోకి తీసుకునే వెసులుబాటు ఉండటం అక్రమార్కులకు వరంగా మారింది. గత ఆరేళ్లుగా ఎలాంటి ఆడిట్ జరగకపోవడం వల్ల ఈ అక్రమాలు నిరాటంకంగా సాగాయి. ఎమ్మార్వో కార్యాలయాల్లో రోజువారీ రిజిస్ట్రేషన్లు, జమైన చలానా సొమ్మును సరిచూసే వ్యవస్థ లేకపోవడం మరో ప్రధాన లోపం.
ధరణి పోర్టల్ ఏర్పాటె•నప్పటి నుంచి రైతులు భూ బదలాయింపులు, ఇతర సేవలకు సంబంధించి ఎంత చెల్లిస్తున్నారు? ఎన్ని లావాదేవీలు జరుగు తున్నాయి? రెండింటికి మధ్య పొంతన ఉందా? అనే వివరాలను గుర్తించే ఆడిటింగ్ వ్యవస్థ ఇప్పటి వరకు లేదు. నిందితుల ఈదోపిడీకి ఇదే కారణంగా నిపుణులు అంచనా వేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ల లావాదేవీల్లో 4,300 అవకతవకలు జరిగినట్లు గుర్తించగా, వాటిలో రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలు ముందు వరుసలో ఉన్నట్లు అధికారులు ఇప్పటికే గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలోనే 2,100 లావా దేవీలు జరిగాయని, ఆ తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,300, జనగామ, ఇతర జిల్లాల్లో మిగిలిన 900 లావాదేవీల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు సీసీఎల్‌ఏ అధికారులు వెల్లడించారు. రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాల్లో భారీ ధరలున్న భూముల లావాదేవీల విషయంలో పెద్దఎత్తున దోపిడీ జరిగినట్లు, ఇందులో పలువురు తెరవెనుక ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ జిల్లాలు హైదరాబాద్‌ను ఆనుకొని ఉండడం, భూముల విలువ రూ.కోట్లలో, రిజిస్ట్రేషన్ చార్జీలు లక్షల్లో ఉండడంతో రెవెన్యూ అధికారుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. ఈ అవకతకవల తీవ్రతను గుర్తించిన సీసీఎల్‌ఏ.. పక్కదారి పట్టిన రూ. 48 కోట్లు వెంటనే తిరిగి రాబట్టాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు భూ భారతి పోర్టల్‌ను రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
‘భూ భారతి’ రిజిస్ట్రేషన్ చార్జీల చెల్లింపులో అక్రమాలు చోటుచేసుకున్న అంశంపై లోకాయుక్త స్పందించి, ఈ అంశంపై సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆదేశించింది. సమగ్ర నివేదికలను సమర్పించాలని కీలక శాఖలకు నిర్దేశించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ, భూపరిపాలన శాఖ చీఫ్ కమిషనర్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఇన్‌స్పెక్టర్ జనరల్, ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (వి•సేవ) కమిషనర్, జనగామ జిల్లాలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన కేసులో జనగామ, వరంగల్ సీసీఎస్ పోలీసులు కూపీ లాగుతున్నారు. జనగామ జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో విచారణ చేపట్టారు. ఆయా కార్యాలయాల్లో భూభారతి పోర్టల్‌లో ఎవరెవరు ఎక్కువ స్లాట్లు బుక్ చేశారనే కోణంలో ఇంటర్నెట్ కేంద్రాల నిర్వాహకుల సమాచారం సేకరించారు.
సుజాత గోపగోని
సీనియర్ జర్నలిస్ట్, 6302164068