దేశంలో రాజ్యాంగానికి ముప్పు ఏర్పడిందని, ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలుతోందని, అధికార పక్షం నియంతృత్వ ధోరణులను ప్రదర్శిస్తోందని కొన్ని ప్రధాన ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతుండడం దాదాపు నిత్యకృత్య మైపోయింది. ఇటువంటి ఆరోపణలకు వంత పాడే విదేశీ పత్రికలు, విదేశీ సంస్థలకు కూడా కొదువ లేదు. అంత వరకూ రాజ్యాంగం గురించి అణుమాత్రంగా కూడా ఆలోచించనివారు 2014 తర్వాత మాత్రం నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాజ్యాం గాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, పౌర హక్కుల్ని క్రమంగా భూస్థాపితం చేస్తోం దంటూ ప్రసంగాలు చేయడం, వ్యాసాలు రాయడం ఎక్కువైంది. దాదాపు అరవయ్యేళ్ల పాటు దేశంలో రాజ్యాంగం బలహీనపడు తున్నా, ప్రజాస్వామ్య విలువలు మట్టి కరుస్తున్నా, లౌకికవాదం తప్పుదోవ పడు తున్నా ఏమాత్రం పట్టించుకోని, కొద్దిగా కూడా నోరు మెదపని కాంగ్రెస్‌ ‌పార్టీ, వామపక్షాలు, పౌరహక్కుల సంఘాలు, విదేశీ పత్రికలు ఇటీవలి పదేళ్ల పాలనకు సంబంధించి మాత్రం కళ్లకు గంతలు కట్టు కుని వక్ర భాష్యాలను కుమ్మరిస్తున్నాయి.

నిజానికి ఇంత ధైర్యంగా, ఇంత ధీమాగా, ఇంత ఎక్కువ మంది పాలక వ్యవస్థ మీద విమర్శలు, వ్యాఖ్యానాలు, ఆరోపణలు చేయడమంటే దేశంలో ప్రజాస్వామ్య విలువలు, సూత్రాలు పరిపుష్ఠం అవుతున్నాయనే అర్థం. కోవిడ్‌ ‌సంక్షోభాన్ని ప్రభుత్వం విజయవంతంగా అదుపు చేసినప్పుడు, ప్రభుత్వం ఈ విషయంలో ఘోరంగా విఫలమైందంటూ విమర్శలు గుప్పించారు. తప్పుదోవ పట్టిన లౌకికవాదాన్ని తిరిగి పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అల్ప సంఖ్యాక వర్గాలకు అన్యాయం జరిగిపోతోందంటూ గొంతులు చించుకున్నారు. రాజ్యాంగ వ్యవస్థలను ప్రక్షాళన చేస్తున్నప్పుడు వాటిని దుర్వినియోగం చేసే ప్రయత్నం జరుగుతోందంటూ గగ్గోలు పెట్టారు. ఇవన్నీ గురివింద గింజ సామెతను గుర్తు చేస్తున్నా అవేవీ పట్టించుకోలేదు. భారతదేశం బీజేపీ హయాంలో ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశం వైపుగా దూసుకుపోతోందని విమర్శలు సాగించడం ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైంది.

అనవసర ప్రచారాలు

భారతదేశంలో రాజ్యాంగానికి ముప్పు ఏర్పడిందని, ప్రజాస్వామ్యం బలహీనపడుతోందని, పౌర హక్కులకు భంగం కలుగుతోందని చేస్తున్న ప్రచారాలు నిరాధారమైనవి, దురుద్దేశంతో కూడుకున్నవి. డాక్టర్‌ ‌బి.ఆర్‌. అం‌బేద్కర్‌ ‌నాయకత్వంలో రూపుదిద్దుకున్న రాజ్యాంగం ఇంతవరకూ చెక్కు చెదరలేదు. ఇటువంటి దుష్ప్రచారాలు ప్రమాదకరమైనవి. భారతదేశంలో ఏ ప్రజాస్వామిక సంస్థను చూసినా అది మరింత పటిష్ఠం కావడమే కనిపిస్తుంది. ఉదాహరణకు, న్యాయస్థానాలు ఇదివరకటి కంటే మెరుగ్గా, పటిష్ఠంగా, స్వతంత్రంగా పని చేస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలోనూ, ప్రాంతీయ స్థాయిలోనూ ప్రజాస్వామ్యం చైతన్యవంతంగానే కొనసాగుతోంది. అనేక రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల్లోనే కాక, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రతిపక్షాలు అధికారంలోకి రావడం, పాలక పక్షం ఓడిపోవడం జరిగింది. భారతీయ సమాజం బహుళ జాతుల, బహుళ సంసృ్కతుల సమాజంగానే కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఒకే పార్టీ ప్రభుత్వం ఏర్పడడం జరగలేదు.

రాష్ట్రస్థాయిలో ప్రజాస్వామ్యం పటిష్టంగానే కొనసాగుతోంది. కేంద్రంలో సరైన పోటీ లేనందువల్లే బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. పాలక పక్షానికి సరైన పోటీ ఇవ్వలేని ప్రతిపక్షాలు బీజేపీ నిరంకుశ విధానాలను అవలంబిస్తోందంటూ విమర్శలు సాగించడం జరుగుతోంది తప్ప, కేంద్ర ప్రభుత్వంలో నిరంకుశ విధానాలను అనుసరిస్తున్నాయని చెప్పడానికి ఆధారాలేమీ లేవు. బీజేపీకి పోటీ ఇవ్వగలిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్‌ ‌పార్టీ అంతర్గత సమస్యలతో అతలాకుతలం అవుతోంది. చర్వితచర్వణంగా ఈ పార్టీ బీజేపీ మీద మత ద్వేష పార్టీ అని, దేశాన్ని మతపరంగా విభజిస్తోందని విమర్శలు సాగిస్తోంది. పౌర హక్కులను బీజేపీ హరిస్తోందంటూ విమర్శించే నైతిక హక్కులేదు. నిజానికి ఈ పార్టీకి అధికార యంత్రాంగాన్ని తన గుప్పిట్లో ఉంచుకుందంటూ ప్రభుత్వం మీద ఆరోపణలు సాగించే హక్కు కూడా లేదు. బీజేపీ కేవలం ధనవంతులు, పారిశ్రామికవేత్తల హక్కులను మాత్రమే కాపాడుతోందని విమర్శించే నైతిక హక్కు అసలే లేదు. ప్రజాస్వామిక విలువలను కాలరాస్తోందనే విమర్శలు కూడా ఈ పార్టీ నోటి వెంట రాకూడదు.

రాజకీయ దురుద్దేశాలు

కాంగ్రెస్‌ ‌పార్టీ ఆరున్నర దశాబ్దాల పాలనలో ఇవన్నీ జరిగాయి. వారసత్వ పాలనకు అలవాటుపడిన కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడకపోవడం మంచిది. బీజేపీ హిందూ సిద్ధాంతాల ఆధారంగానో, మత ద్వేషం ఆధారంగానో అధికారంలోకి రాలేదు. అభివృద్ది, సంక్షేమం, సమర్థ పాలన వంటి అంశాల ఆధారంగా అధికారంలోకి వచ్చింది. అభివృద్దికి, సంక్షేమానికి పాటుపడుతూనే, ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగసూత్రాలను, లౌకికవాదాన్ని పట్టాల మీదకు ఎక్కించడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. దేశాభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించడం వల్లే కాంగ్రెస్‌ ‌పార్టీ నుంచి సైతం పలువురు సీనియర్‌ ‌నాయకులు బీజేపీలోకి మారడం జరిగింది. భారతదేశం ఇదివరకటి మాదిరిగా కాకుండా, వడివడిగా అభివృద్ధి చెంది, ఒక అంతర్జాతీయ శక్తిగా ఎదగడంతో పాటు, ఒక అగ్రరాజ్యంగా దూసుకుపోవడానికి అభివృద్ధి మంత్రమే కారణం. కాంగ్రెస్‌ ‌పార్టీ సహా ఇతర ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలే నిజమైతే దేశం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.

కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న మిషతో దేశాన్ని ఇతర దేశాలలో చులకన చేసి మాట్లాడడం, ఈడీ, సీబీఐ, ఎన్నికల కమిషన్‌ ‌వంటి రాజ్యాంగబద్ధమైన సంస్థల మీద బురద చల్లడం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారడం, కేవలం ఒక మతానికి అనుకూలంగా పది పన్నెండు చట్టాలు చేయడం, అత్యధిక సంఖ్యా ప్రజల హక్కులను, అధికారాలను కాలరాయడం ప్రజాస్వామ్య విలువలకు అనుగుణమైనవి కావు. ఇవి రాజ్యాంగబద్ధమైనవి కూడా కావు. అంబేద్కర్‌ ఆశయాలను, ఆయన ప్రవచించిన విలువలను కాలరాయడానికి జరిగిన ప్రయత్నాలు మాత్రమే. ఇక దేశంలో అత్యవసర పరిస్థితిని విధించి ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం, పౌర హక్కులను కాలరాయడం, రాజ్యాంగాన్ని స్తంభింపజేయడం, వేలాది మంది సిక్కులను ఊచకోత కోయడం వంటివి రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఏమాత్రం అనుగుణమైనవి కావు.

సహజసిద్ధమైన ప్రజాస్వామ్యం

బహుళ జాతులు, బహుళ సంసృ్కతులతో కూడుకున్న సమాజం సహజసిద్ధమైన ప్రజాస్వామ్య వ్యవస్థగానే కొనసాగుతుంది తప్ప, నిరంకుశానికి దారితీసే అవకాశం లేదు. ప్రజాస్వామ్య విలువలు భారతీయ సంసృ్కతి, నాగరికతల్లో ఒక భాగమైపోయాయి. అనేక మతాలున్నా, అనేక కులాలున్నా వందలాది సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలు కలిసిమెలిసి జీవించడం, సహనం, సామరస్యాలతో వ్యవహరించడం సహజసిద్ధంగా వస్తున్నాయి. అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ, అనేక దేశాలకు మార్గదర్శకంగా మారిన భారతదేశంలో ప్రజాస్వామిక విలువలు, రాజ్యాంగ సూత్రాలు మరింతగా పటిష్ఠం కావడానికే అవకాశం ఉంది తప్ప కాంగ్రెస్‌ ‌పార్టీ, వామపక్షాలు, విదేశీ పత్రికలు వ్యాఖ్యానిస్తున్నట్టుగా దేశం నిరంకుశం వైపుగా అడుగులు వేసే అవకాశం లేదు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని 96సార్లు సవరించిన కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రభుత్వం రాజ్యాంగ విలువల గురించి మాట్లాడడంలో అర్థం లేదు.

దేశంలో రాజ్యాంగానికి ఎటువంటి ముప్పూ లేదు కానీ, దేశంలోని పలు ప్రతిపక్షాలు తమ సొంత రాజ్యాంగంతో పాలన సాగించడం మాత్రం దేశానికి తప్పకుండా ముప్పు తీసుకు వచ్చే అవకాశం ఉంది. కొందరు ప్రతిపక్ష నాయకులు రాజ్యాంగం ముప్పులో పడిందంటూ గావు కేకలు పెడుతుంటాయి. అంబేద్కర్‌ ‌రూపొందించిన రాజ్యాంగం ముప్పులో పడిందనడం వారి ఉద్దేశం కాదు. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రతిపక్షాలు తమ సొంత రాజ్యాంగం గురించి ప్రస్తావిస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు, తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అధినేత, పశ్చిమబెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే తీసుకోండి. ఆమె ఉద్దేశంలో తన రాజ్యాంగం అంబేద్కర్‌ ‌రూపొం దించిన రాజ్యాంగం కంటే ఉన్నతమైనది. సుమారు 20 లక్షల మంది బాంగ్లాదేశీయులకు పౌరసత్వం ఇవ్వాలని మంకుపట్టు పట్టడం ఆమె రాజ్యాంగంలో భాగమే. తమ పార్టీవారు నేరానికి పాల్పడినా, అక్రమాలు సాగించినా ఆమె రాజ్యాంగం ప్రకారం వారు నిర్దోషుల కిందే లెక్క. రాష్ట్రంలో తమ మంత్రులు, తమ అధికారులు, తమ పార్టీవారి వల్ల ఏదైనా అవినీతి వ్యవహారం జరిగే పక్షంలో వారిని రాష్ట్ర పోలీసులు మాత్రమే విచారించాలనడం ఆమె రాజ్యాంగమే. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఆమె రాజ్యాంగం ప్రకారం లెక్క చేయాల్సిన అవసరం లేదు. అత్యాచారాలు, అవినీతి, అక్రమాలకు ఆమె రాజ్యాంగంలో శిక్షేమీ లేదు.

రాజ్యాంగాన్ని మరింత పటిష్ఠం చేయడం అనివార్యం అనడంలో సందేహం లేదు. అందుకు సంబంధించిన సూచనలు, సిఫార్సులు, సలహాలు, అభిప్రాయాలు ప్రస్తుత ప్రతిపక్షాల నుంచి వచ్చే అవకాశం లేదు. రాజ్యాంగాన్ని రాజకీయాలకు ఉపయోగించుకోవడం తప్ప కాంగ్రెస్‌ ‌వంటి జాతీయ పార్టీకి మరో నిర్మాణాత్మక, ఆచరణాత్మక దృష్టేమీ లేదు. ఇతర దేశాల రాజ్యాంగాల్లో మాదిరిగా రాజ్యాంగంలోనే రాజ్యాంగానికి సరైన భద్రత కల్పించే వ్యవస్థలను, అంశాలను పొందుపరచవలసిన అవసరం ఉందని నానీ పాల్కీవాలా వంటి న్యాయ కోవిదులు అనేక పర్యాయాలు సూచించారు. రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేయకుండా, తప్పుడు అర్థాలు, భాష్యాలకు అవకాశం లేకుండా రాజ్యాంగంలో కొన్ని తిరుగులేని అంశాలను చేర్చవలసిన అవసరం ఉంది.

జి.రాజశుక
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE