స్వతంత్ర భారతదేశం ఎలా ఉండాలి? స్వరాజ్య సమరం సాగుతున్న దశలో దురదృష్టవశాత్తు ఈ ప్రశ్న వైపు దృష్టి సారించడంలో భారతీయ సమాజం వెనుకబడిరది. అందుకు కారణం స్వాతంత్య్రోద్యమంలో ఒక దశ తరువాత భారతీయ చింతన ద్వితీయ శ్రేణికి వెళ్లడమే. ఇంకా – మొదట దేశానికి స్వాతంత్య్రం, తరువాతే మిగిలిన విషయాలు, రాజకీయ స్వాతంత్య్రమే సర్వరోగ నివారిణి అన్న భావాలు ఆ ప్రశ్న తగినంత పదును తేరకుండా ఆపి ఉండవచ్చు. కానీ స్వాతంత్య్రం ఆకాంక్షిచినప్పుడు స్వతంత్ర భారతదేశ రూపురేఖలు ఎలా ఉండాలో, ఆ ప్రశ్న ఎంత ప్రధానమో గమనించి ఉండాలి. అలా యోచించిన సంస్థ ఆర్‌ఎస్‌ఎస్. ఆ సంస్థ జాతికి ఇచ్చిన రుషితుల్యులు దీనదయాళ్ ఉపాధ్యాయ మేధస్సు నుంచి వచ్చినదే ఏకాత్మ మానవ దర్శనం. విదేశీ పాలనల నుంచి విముక్తమైన భారతదేశాన్ని భారతీయత ఆధారంగా మాత్రమే పునర్ నిర్మించుకోగలమని చాటిన ఏకైక సిద్ధాంతం.
నవభారత చరిత్ర తొలి వాక్యం; సామ్రాజ్య వాదం కింద నలిగిన భారత చరిత్ర ఆఖరివాక్యం మధ్య గుణాత్మకమైన మార్పు ఉండాలన్న ఒక గొప్ప ఆకాంక్ష అతి కొద్దిమందిలో ఉండడం ఒక అదృష్టం. ఆ విధంగా చూస్తే ఈ కీలక ప్రశ్నను మథించడం ద్వారా వచ్చిన సమాధానమే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అని చెప్పవచ్చు. పరమపూజనీయ డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గెవార్ ఈ ప్రశ్న వేసుకున్నారు. ప్రపంచ పరిస్థితులు మారుతున్నాయి. ఎవరి ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా ప్రపంచ యుద్ధాలు దేశదేశాల రాజకీయ చింతనలను, సామాజిక దృక్పథాలను, రకరకాల ఆకాంక్షలతో సాగుతున్న ఉద్యమ పంథాలను మార్చాయి. వలస రాజ్యాలు ఒక్కొక్కటి విముక్తమవుతున్నాయి. ఆ క్రమంలోనే వలసవాదుల నుంచి భారత్ విముక్తి సమీప భవిష్యత్తులోని నిజమని తేలిపోయింది. అయినా స్వతంత్ర భారతదేశం ఎలా ఉండాలి అన్న నిర్మాణాత్మకమైన మౌలిక ప్రశ్న భారత జాతీయ కాంగ్రెస్ వంటి ప్రధాన పోరాట సంస్థలో, ఇతర పంథాల ఉద్యమ సంస్థలలో బలంగా వినిపించలేదు. ఆ ప్రశ్నను అత్యంత శ్రద్ధతో పరిశీలించిన నాటి విజ్ఞులలో ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్‌జీ ఒకరు. వందేళ్ల ఆర్‌ఎస్‌ఎస్ చరిత్ర, నిర్మాణం, చింతన, ప్రస్థానం ఆ ప్రశ్న కేంద్ర బిందువుగానే ఉంటాయి. ఆ సంస్థ నుంచి వచ్చిన మన కాలపు మహా చింతనాశీలి, రాజకీయ తత్త్వవేత్త దీనదయాళ్ ఉపాధ్యాయ (సెప్టెంబర్ 25, 1916 – ఫిబ్రవరి 11, 1968) ఆ ప్రశ్నకు కాలిక స్పృహతో సమాధానం కోసం చేసిన గొప్ప అన్వేషణ ఫలితమే ఏకాత్మ మానవ దర్శనం. ఆర్‌ఎస్‌ఎస్ చరిత్రలోను, అసలు స్వతంత్ర భారతదేశ రాజకీయ చింతనలోను ఈ రాజకీయ తాత్త్వికత విశిష్టమైనది. మట్టివాసనలతో పుట్టిన భారతీయ జనసంఘ్, దాని తరువాతి రూపం భారతీయ జనతా పార్టీలకు ఇది జీవనాడి, చోదకశక్తి.
దేశ నిర్మాణంలో జాతీయాత్మకు స్థానం ఇచ్చిన ఇలాంటి సిద్ధాంత ప్రతిపాదన జరిగి ఇప్పటికి 60 ఏళ్లు. పైగా ఏకాత్మ మానవతా దర్శనాన్ని విజయ వాడలో ప్రతిపాదించారు. అదొక్కటే ఈ సందర్భానికి ఉన్న ఘనత కాదు. ఆరు దశాబ్దాల చరిత్రను స్మరించుకుంటున్నాం. విదేశీ దురాక్రమణదారుల వలెనే ఈ దేశంలోకి ప్రవేశించి స్థానీయతను ధ్వంసం చేసి పోయినవే విదేశీ రాజకీయ, ఆర్థిక సిద్ధాంతాలు. ఇప్పుడు వాటిని తలచేవారు లేరు. తలుచుకున్నా మారుపేర్లతోనే. కాబట్టి విదేశీ సిద్ధాంతాలన్నీ కాలం చెల్లిపోయాయని నిర్ధారించుకోదగిన, రూఢ అయిన ఒక వర్తమాన వాస్తవ ఘడియ వద్ద మనం ఏకాత్మ మానవతా దర్శనాన్ని సమీక్షించుకుంటున్నామని గుర్తుంచుకోవాలి.

ఏకాత్మ మానవ దర్శనాన్ని కృష్ణాతీరంలోని విజయవాడలో 1965, జనవరిలో జరిగిన సభలలో ప్రతిపాదించారు. నిజానికి అప్పటికి ఒకటిన్నర దశాబ్దంగా దీనదయాళ్‌జీ తన మేధస్సుతో మథించారు. సామాన్యుడే కేంద్ర బిందువుగా ఆర్థిక వ్యవస్థ, రాజకీయ రంగ నమూనాను స్వప్నించినది ఏకాత్మ మానవ దర్శనం. ఆర్‌ఎస్‌ఎస్ నుంచి జనసంఘ్ నిర్మాణ బాధ్యతలు స్వీకరించిన వారిలో దీనదయాళ్‌జీ ప్రముఖులు. స్వతంత్ర భారతం అని అంటున్నా, అందులో ‘స్వ’ లేదన్నది ఆర్‌ఎస్‌ఎస్ చింతనాపరులు చిరకాలంగా చేస్తున్న పెద్ద ఆరోపణ. రాజకీయ దృక్పథంలో, ఎంచుకున్న ప్రజాస్వామ్య పంథాలో, ఆర్థిక వ్యవస్థ సృష్టిలో దేశీయమైన ఆలోచనలు లేవు. సోవియెట్ రష్యా ప్రణాళికా వ్యవస్థ, ఇంగ్లండ్ పాలనా వ్యవస్థ, సోషలిజం, కమ్యూనిజం, ఉదారవాదం, సెక్యులరిజం తలా ఒకవైపు లాగిలిన కాలమది. ఇవి కాక మరేమి ఎంచుకుని ఉండాలంటారు అని ప్రశ్నించేవారు, చరిత్ర ఫలితాన్ని చూడడం అవసరం. ప్రపంచంలో చాలా చోట్ల కనిపించిన దేశీయమైన ఉత్పత్తులను, తద్వారా దేశాన్ని సమున్నత నిలుపుకున్న భవ్యమైన రుజువులను చూసి కూడా ఇప్పటికి మనదైన ప్రతి వ్యవస్థను, ఉత్పత్తిని, సూత్రాన్ని పనికిరానిదిగా, కాలం చెల్లినదిగా పదే పదే చెప్పడంవల్ల దేశం యాభయ్ ఏళ్లు వెనక్కిపోయిన వాస్తవాన్ని గుర్తించాలి. అదే వారికి సమాధానం. ఏకాత్మ మానవ దర్శనం అనే ఆ రాజకీయ తాత్త్వికత లోతుపాతులేవో విజయవాడ సభల తరువాత నాలుగు ఉపన్యాసాల ద్వారా దీనదయాళ్ స్వయంగా దేశానికి వివరించారు. వలస రాజ్యం నిష్క్రమించిన మాటను కాదనలేం. కానీ వలసవాదం నుంచి మన ఆలోచనలు విముక్తం కాలేదని కచ్చితంగా అంగీకరించాలి. దేశం రాజ కీయంగా స్వాతంత్య్రమైంది. కానీ వలసవాద మత్తును వీడలేకపోతోంది. అందుకు విరుగుడు అనివార్యం. ఎందుకంటే జాతిని ఆత్మన్యూనతా భావంలో కట్టిపడేస్తున్నది అదే. ఆత్మగౌరవం గురించి పట్టించుకోకుండా చేస్తున్నదీ అదే. ఇవి వీడితేనే మనదైన చింతనకు, సృజనాత్మకతకు విలువ.
బ్రిటిష్ జాతి నుంచి విముక్తమైన తరువాత నిజానికి దేశంలో రాజకీయ తాత్త్వికతకు సంబం ధించి ఒక శూన్యం ఉంది. కాంగ్రెస్ ఒక ఉద్యమ సంస్థగా ఉన్నప్పుడు గాంధీజీ మాట కొంత చెల్లుబాటు అయింది. దేశ పాలన చేపట్టిన రాజకీయ పార్టీగా కాంగ్రెస్ ఏ విధంగానూ గాంధీజీ సిద్ధాంతాలను మన్నించలేదు. అదొక సంధియుగం. విదేశీ రాజకీయ సిద్ధాంతాలు, సంఘర్షణను ప్రతిపాదించే, హింసను వ్యవస్థీకృతం చేసే రాజకీయ సిద్ధాంతాల వైపు అమాయక ప్రజలు మొగ్గడం ఒక విచిత్ర పరిస్థితి. అది ఎలాంటిదంటే దాస్యం నుంచి దాస్యానికి ప్రయాణమే. కానీ రాజ్య వ్యవస్థను విజయవంతంగా నడిపిన చరిత్ర మనకు ఉంది. పాలనకు సంబంధించిన నమూనాలు ఉన్నాయి. కానీ వాటిని తలచుకోవడమే తిరోగమనం అన్న దృక్ప థానికి ప్రజలను తెచ్చారు. కచ్చితంగా చెప్పాలంటే స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ప్రపంచ దేశాల నుంచి మనం అరువు తెచ్చుకున్న వ్యవస్థలు, సిద్ధాంతాలు అవి పుట్టిన చోటే మచ్చుకైనా ఈనాడు కానరావు.
ఏకాత్మ మానవ దర్శనం దీనదయాళ్‌జీ రూపొందించిన శాస్త్రీయతతో కూడిన రాజకీయ తత్త్వం. దేశాభివృద్ధికి భారతీయ మూలాలు ఉన్న నమూనాలను తీసుకోవాలని, ఈ అభివృద్ధి చక్రంలో సాధారణ మానవుడు కేంద్రంగా ఉండాలని ఈ సిద్ధాంతం ప్రధానంగా చెబుతుంది. పాశ్చాత్య దేశాలకు ప్రీతిపాత్రమైన పెట్టుబడిదారి విధానాన్నే కాదు, మార్క్సిస్టు సోషలిజం చెప్పే కృత్రిమ సమష్టి వాదాన్ని కూడా ఏకాత్మ మానవ దర్శనం నిరాకరి స్తుంది. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే, దేశాన్ని యాంత్రీకరణ చేయవచ్చు. కానీ పౌరుడిని కూడా యంత్రంలో పరికరంగా మార్చే వ్యవస్థను దీనదయాళ్ అంగీకరించలేదు. అలాగని హక్కులే తప్ప బాధ్యతలు గురించి పట్టని, తన జీవితం, తన విలాసాలు, తన భోగాలు, స్వేచ్ఛకు హద్దులు ఉండవన్న వాదనను కూడా ఆ సిద్ధాంతం తిరస్కరించింది. అయితే పాశ్చాత్య దేశాలదే అయినా శాస్త్ర పరిజ్ఞానాన్ని మాత్రం స్వాగతించింది. మనుషుల మధ్య సంబంధం సామాజిక ఒప్పందంలా కాకుండా, జాతీయ ఆత్మతో లేదా దేశీయమైన నైతికతతో కలిపి ఉంచేది కావాలన్నదే దీనదయాళ్ సిద్ధాంతం.
వ్యక్తి అంటే శరీరం, మనసు, బుద్ధి, ఆత్మల సమ్మేళనం. వ్యక్తుల సమూహం, అంటే సమాజం కూడా శరీరం, మనసు, బుద్ధి, ఆత్మల సమ్మేళనమే నంటారు దీనదయాళ్‌జీ. వ్యక్తి ‘నేను’కు మాత్రమే పరిమితం కాలేడు. సమాజంతో అతడికి సంబంధం ఉంటుంది. కాబట్టి తన గురించి ఆలోచిస్తూనే, సమాంతరంగా సమాజంగా గురించి ఆలోచించాలి. వ్యక్తి, వ్యక్తుల సమూహం ఒకే ఆత్మ కలిగి ఉంటాయని దీనదయాళ్ చెబుతారు. కాబట్టి ఘర్షణ తలెత్తే అవకాశం రాదు అన్నది ఆయన వాదం. సాటి మనుషులలోను అంటే సమాజంలోను, తనలోను ఉన్నది ఒకటే ఆత్మ కాబట్టి ఒక స్పృహతో అతడి ప్రవర్తించవలసి ఉంటుంది. ఇది సమాజానికి మేలు కలిగించే స్పృహ తప్ప మరొకటి కాలేదు. మనిషి అంటే భౌతికమైన అభివృద్ధితో పాటు, నైతిక, ఆధ్యాత్మిక పరిణతిని సాధించాలి అన్న మన ధార్మికదృష్టి కలిగిన మనిషినే దీనదయాళ్ తన సిద్ధాంతానికి కేంద్ర బిందువును చేశారు. మన ధార్మికదృష్టి లేదా సంస్కృతి నాలుగు పురుషార్థాల గురించి చెబుతుంది. కాబట్టి దీనదయాళ్‌జీ దృష్టిలో మనిషికి నాలుగు పురుషార్థాలు ఉన్నాయి. అవే ధర్మార్థకామమోక్షాలు. వీటిలో ఏ ఒక్కదాని సాధనకే మనిషి పరిమితం కాకూడదన్నదే ఏకాత్మ మానవ దర్శన సందేశం. నిజానికి భారతీయ సంస్కృతి ఆ నాలుగు పురుషార్థాల గురించి ప్రస్తావించిందంటే జీవితంలో వాటన్నిటికి సమ ప్రాధాన్యం ఉండాలనే. ధర్మబద్ధంగా సాధిస్తేనే అర్థం, కామం ఆనందాన్ని ఇస్తాయి అంటుంది మన సంస్కృతి. దీనిని స్వీకరిం చారు దీనదయాళ్‌జీ.
జనవరి 23,24 తేదీలలో విజయవాడ సభలలో తన సిద్ధాంతాన్ని దీనదయాళ్‌జీ ప్రతిపాదిస్తూ ఏమన్నారు? అప్పటికి ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి.
ఇందులో కొత్త విషయాలేమీ చెప్పలేదు అని ఆయన వినమ్రంగా చెప్పుకున్నారు. ఇంతకు ముందు మనం ఎన్నికల ప్రణాళికలలో పేర్కొన్నవేనని చెప్పారు. వాటిలోని తాత్కాలిక అంశాలు తొలగించి ఈ సిద్ధాంతాన్ని రూపొందించామని అన్నారు. తను ప్రతిపాదించిన సిద్ధాంతం మాత్రం పూర్తిగా భారతీయ మని తెలియచేశారు. పశ్చిమ దేశాలలో కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానం వంటి వాదాలు ఉన్నాయి. వాటికీ, భారతీయతకు ఉన్న తేడాను వివేచన చేశా మని, ఆ రెండు సిద్ధాంతాలు పరస్పరం కలహించు కుంటాయి, కానీ వాటి మూలాలు మాత్రం ఒక్కటేనన్నా రాయన. ఏదైనా సమాజాన్ని గందరగోళ పరిచేదే. మనం తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలతో సిద్ధాంతాలను ఆశ్రయించే ధోరణిని విడనాడాలని స్పష్టం చేశారు. ఇంకా – ఒక వర్గం హితం, స్వార్థ ప్రయోజనాలను మాత్రమే ఎప్పుడూ దృష్టిలో ఉంచుకో కూడదు. మనం సంపూర్ణ సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లే పద్ధతిని ఎంచుకోవాలి. ఈ పద్ధతిలో కొన్ని వర్గాలకు అన్యాయం జరగవచ్చుకదా? అన్న ప్రశ్న కొందరికి రావచ్చు. అలా అనుకోవడం వాస్తవికతకు దూరం. ఏకాత్మ, ఏకాత్మ శాసనపద్ధతి అంటే నియంతృత్వాన్ని ఆహ్వానించడం అని భావించరాదని దీనదయాళ్ స్పష్టం చేశారు. మనకు కావలసినది ఏకాత్మక సమాఖ్య కాదు, సమాఖ్యలో ఏకాత్మత మాత్రమే అన్నారాయన.
ఏకాత్మ మానవ దర్శనం అంటే దేశీయమైన అభివృద్ధి నమూనాలో ఆధ్యాత్మిక ఉన్నతి, వ్యక్తి, సమాజాల మధ్య సమన్వయం సాధించే కృషి సూచిత మైంది. దేశమంటే సామరస్యం, సాంస్కృతిక విలువల, స్వావలంబన కూడికగా భావించింది. వ్యక్తికీ, సమాజానికీ నడుమ సమతౌల్యంతో వ్యక్తి సగౌరవంగా జీవించే అవకాశం కల్పించడమే దీని పరమోద్దేశం. విదేశీ సిద్ధాంతాలు, నమూనాల అంధానుకరణం కాకుండా, భారతీయమైన పరిజ్ఞానంతో దేశాభివృద్ధికి ఇది పెద్దపీట వేసింది. చరిత్రలో అలాంటివన్నీ పాటించిన కాలానికే స్వర్ణ యుగమని పేరు. ఇప్పుడు దీనినే సాంస్కృతిక జాతీయ వాదం అన్నారు. అంత్యోదయ, అంటే సమాజంలోని చిట్టచివరి వ్యక్తి కూడా సమన్యాయం, సమానత్వం, అందరికీ విద్య, కేవలం పారిశ్రామికీ కరణ, పట్టణీ కరణే ధ్యేయంగా ఉంచుకోకుండా దరిద్ర నారాయణుల సేవకు సమున్నత ప్రాధాన్యం ఇవ్వాలి. ఇది దీనదయాళ్ స్వప్నించారు. అధికార వికేంద్రీకరణ, గ్రామాల స్వయంసమృద్ధిని ఆయన సిద్ధాంతం ప్రతిపాదించింది. వ్యక్తి, సమాజం, దేశం, ప్రపంచం అనే నాలుగు అంశాలు ఏకాత్మ మానవ దర్శనాన్ని ప్రభావితం చేశాయి. మొత్తం చూస్తే ఈ సిద్ధాంతం వసుధైవ కుటుంబకం అన్న మహోన్నత భారతీయ ఆదర్శాన్ని పునాదిగా స్వీకరించినట్టు అవగతమవు తుంది.
– జాగృతి డెస్క్