ఎక్కడైనా దేవుడు మనకు అండగా ఉంటాడని భక్తులు అనుకోవడం పరిపాటి. అందుకని పూజలు, వ్రతాలు, నోములు ఇలా చెప్పుకుంటూ పోతే ఇలవేలుపును ప్రసన్నం చేసుకోవడానికి, ఇష్టకామ్యార్థ సిద్ధి కోసం భక్తులు తలనీలాల సమర్పణ నుంచి తులాభారం దాకా అనేక మార్గాలను అనుసరిస్తుంటారు. నాకు ఊహ తెలిశాక ఐదు దశాబ్దాల లౌకిక జీవనంలో జనవరి 10వ తేదీ వరకు అనుభవంలోకి వచ్చిన విషయాలు ఇవి. అదే రోజున సోమనాథ్ సందర్శనం నా ఇన్నేళ్ల అనుభవాలను నీటి మీద రాతల్లాగా మార్చేసింది.
అలాగని అక్కడేదో తపస్సంపన్నులు, జఠాధరులు, జంగమదేవరలు, అఘోరాలు, నాగ సాధువులు అనుచర గణంతో శిబిరాల్లో వేంచేసి భక్తజనకోటిని ఆశీర్వదిస్తూ, మంచి మాటలు చెబుతూ ఉంటారని కాదు. వీధికో గుడితో తెల్లవారకముందే భక్తిగీతాలతో పురజనులను మేల్కొలిపే వాతావరణం మచ్చుకైనా కనిపించ లేదు. భక్తుల నుదుటన అడ్డనామాలు, నిలువు నామాలు పెడతామంటూ వెంటపడేవారు ఒక్కరంటే ఒక్కరు లేరు. దేవుడి పేరును సొమ్ము చేసుకుందామనే ఆలోచన వారిలో లేదు. ఎందు కంటే అక్కడి వారికి మహాదేవుడైన సోమనాథుడు తన గూడును కాపాడుకోవడానికి పడిన కష్టాలు ఎవరో చెబితే కాకుండా, ఏవో పుస్తకాల్లో చదివితే కాకుండా అనుభవపూర్వకంగా తెలుసు కాబట్టి. మన ఇళ్లల్లో(ఇప్పుడు చెబుతున్నారో లేదో తెలియదు కానీ) పసిపాపలకు చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తే, సోమనాథ్‌లో అమ్మలు, అమ్మమ్మలు మహాదేవుడి గుడిని కాపాడుకోవడంలో తమ పూర్వి కులు చేసిన త్యాగాలను చెబుతూ, ఆధ్యాత్మికతను, శౌర్యాన్ని రంగరించిన ఉగ్గుపాలను పిల్లలకు పడుతుంటారు. అక్కడి వారితో యథాలాపంగా మాట్లాడుతున్నప్పుడు నేను తెలుసుకున్న విషయాల్లో ఇది మొదటిది.
ఎవరిని కదిలించినా సరే, వారు సోమనాథ్ మందిరం రక్షణకు పూనుకున్న యోధుల్లో ఒకరికి వారసులై ఉండటం విశేషం. సోమనాథ్‌ను సందర్శిం చడం నాకిదే తొలిసారి. సోమనాథ ఆలయం మీద దురాక్రమణదారుల దాడి జరిగి వెయ్యేళ్లు అయిన సందర్భంగా జరిగిన పండుగను ప్రత్యక్షంగా చూద్దామని పాత్రికేయ పాత్రలో ఆ నగరంలోకి అడుగుపెట్టాను. ఆరుగురితో కూడుకున్న బృందంలో ఒకడిగా నేను జనవరి 10 సాయంత్రం అక్కడికి చేరుకున్నాను. డయ్యూ ద్వీపం నుంచి సోమనాథ్‌లోకి ప్రవేశిస్తుండగా నగరం మొదట్లో వేడుకలకు సంబంధించిన అతిపెద్ద సభావేదిక ఫ్లై ఓవర్ మీద నుంచి కనిపించింది. అదే రోజు మందిర ప్రాంగణంలో అనేక విశేష కార్యక్రమాలకు మేం హాజరుకావాల్సి ఉంది. అందుకని మాకు కేటాయించిన రిసార్టుకు చేరుకొని తయారై వెంటనే సోమనాథ్ మందిరానికి చేరుకున్నాం. దారిపొడుగునా కనిపించిన భక్తజన సందోహాన్ని చూసి మాలో ఒకరు ‘‘ఇదేదో మినీ కుంభమేళాలా ఉంది’’ అని అనడం బాగాగుర్తుంది. అంత మంది ఉన్నప్పటికీ ఎలాంటి అపశ్రుతికి చోటు లేకుండా జరిగిన ఏర్పాట్లను మనసులోనే మెచ్చుకుంటూ మందిర ప్రాంగణంలోకి అడుగుపెట్టాం. పసిడి వర్ణంలో మెరిసిపోతున్న మందిరానికి మరింత శోభను తెస్తున్నట్టుగా రంగురంగుల విద్యుత్ దీపాలతో యావత్ ప్రాంగ ణాన్ని అలంకరించారు. మేం నగరానికి చేరుకున్నప్పటి నుంచి మాకు ఓంకార ప్రణవనాదం వినిపిస్తూనే ఉంది. అందుకు కారణం మహాదేవుడికి నీరాజనాలు అర్పిస్తూ గుజరాత్ నలుమూలల నుంచి వేలాదిగా వచ్చిన సంస్కృత విద్యార్థులు నిరంతరా యంగా, అవిశ్రాంతంగా చేపట్టిన 72 గంటల సామూహిక ప్రణవనాద జపం. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పాల్గొనడం ద్వారా పరమశివుడికి ప్రీతిపాత్రమైన మహత్ కార్యక్రమాన్ని సంపూర్ణం చేశారు. సంస్కృత విద్యార్థుల్లో కొందరైతే ప్రధాని తమతో కలిసి జపం చేయడం, తమను ఆప్యాయంగా పలకరించడం ఒక మరపురాని అనుభవమని ఆనందంగా చెప్పారు. సంస్కృతం తోడుగా ఘనమైన మన సంస్కృతిని కాపాడుకోవడం తన లక్ష్యమని ఒక విద్యార్థి చెప్పాడు.
ఆ కార్యక్రమం ముగిసిన కాసేపటికే సంక్రాంతి పండుగ వేళ చీకట్లు కమ్ముకున్న ఆకాశంలో బియ్యపు పిండితో వెలుగు జిలుగుల చుక్కల ముగ్గులు పెడుతున్నట్టుగా వేలాదిగా డ్రోన్లు ప్రత్యక్షమయ్యాయి. ఓంకారం, సోమనాథ్ మందిరం, మహాదేవుడు, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఇలా రకరకాల రూపాను సంతరించుకుంటూ మందిర పునర్ని ర్మాణ విశేషాలను బొమ్మల పుస్తకంలో పేజీలను తిప్పుతున్న తీరుగా డ్రోన్లు వివరించాయి. ఆ తర్వాత తామేమీ తీసిపోలేదన్నట్టుగా ధ్వని ముందా? దృశ్యం ముందా? అన్న సందేహంతో చూస్తుండగానే గగనంలో బంతిపూలు విరబూసినట్టుగా బాణసంచా సందడి చేశాయి. ఈ కార్యక్రమాలు జరుగు తున్నంతసేపూ అక్కడ పెద్ద సంఖ్యలో చేరుకున్న ప్రజలు ‘‘హర్ హర్ మహదేవ్’’ అని పెద్దగా అంటూ సోమనాథ్‌ను స్మరించుకుంటూనే ఉన్నారు. ఆ విధంగా వెయ్యేళ్ల వేడుక పట్ల వారి భక్తిపారవశ్యం ప్రత్యక్షంగా కనిపించింది, వినిపించింది. ప్రధాని వెళ్లిపోతున్నప్పుడు కూడా ఆయన్ను దగ్గరగా చూడాలనే ఆరాటం, ఆత్రుత, తొందరపాటును ప్రదర్శించకుండా అప్రకటిత క్రమశిక్షణను, సంయమనాన్ని వారు పాటించడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. సోమనాథ్ మందిర పరిరక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన హమీర్‌జీ గోహిల్ అశ్వారూఢుడై అతి పెద్ద ఆయుధాన్ని చేబూనిన భారీ విగ్రహం పట్ల ప్రజలు ప్రదర్శించిన భక్తి, శ్రద్ధలు అబ్బురపరిచాయి. ఆప్తులతో కలిసి విగ్రహం ఎదుట సెల్ఫీలు దిగడం అక్కడ సర్వసాధారణమైన ఘట్టంగా మిగిలిపోయింది. ఆ విగ్రహం ఉన్న కూడలికి హమీర్‌జీ కూడలి అని పేరు.
జనవ10 (శనివారం) నాటి వేడుకలకు ఎంతమంది వచ్చిందీ కచ్చితంగా చెప్పలేను కాని మందిరం నుంచి ఏడు కి.మీ.ల దూరంలో ఉన్న మేం బస చేసిన రిసార్టుకు కారులో చేరుకోవడానికి దగ్గర దగ్గర మూడు గంటలు పట్టింది. అలా తిరిగి వస్తున్నప్పుడు గుజరాత్‌లో వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తాము వచ్చిన బస్సుల దగ్గర వంటలు చేసుకుంటూ కనిపించారు.
మర్నాడు ఆదివారం ఉదయాన్నే నగరంలో శంఖ్ కూడలి నుంచి హమీర్‌జీ కూడలి వరకు శౌర్యయాత్ర ఉంటుందనే సమాచారం మాకు అందింది. ఉదయం ఏడున్నర కల్లా అక్కడికి చేరుకున్నాం. ప్రధాని పాల్గొంటున్న కారణంగా శంఖ్ కూడలికి అర కిలో మీటరు దూరంలోనే ఫ్లై ఓవర్‌కు దగ్గరగా మా వాహనాన్ని ఆపివేశారు. పూర్తిగా తెల్లవారలేదు. ఈలోగా నడియాడ్‌లో బ్రహ్మర్షి సంస్కృత విద్యా యకు చెందిన వందలాది విద్యార్థులు సంప్రదాయ వస్త్రాలను, శంఖాన్ని, డమరుకాన్ని ధరించి మేం ఆగిన చోటుకు వరుసకట్టి వచ్చారు. వీరంతా 72 గంటల సామూహిక ఓంకార జపంలో పాల్గొన్నవారే. ఈ సందర్భంగా ఆ బృందానికి నోడల్ ఆఫీసర్, విద్యాలయ ప్రిన్సిపల్ సంజయ్ బ్రహ్మభట్‌తో మాట్లాడినప్పుడు, సంస్కృతంలో పట్టభద్రులైన వారికి ఉద్యోగావకాశాల గురించి ప్రస్తావించినప్పుడు పండితులు, అర్చకులు, అధ్యాపకులతో పాటుగా సైన్యంలో ధర్మ గురువు వంటి ఉద్యోగాలు ఉన్నాయని, ఇటీవల తమ విద్యాలయకు చెందిన విద్యార్థుల్లో కొందరు ధర్మగురువులుగా సైన్యం చేరారని ఆయన చెప్పడం విశేషం. ఆ తర్వాత వారంతా డమరుకాన్ని మోగిస్తూ, శం•నాదం చేస్తూ శంఖ్ కూడలి వైపు సాగిపోయారు. వారిని దాటుకొని మా బృందం వెళుతుండగా కుడివైపున నిర్మాణ పనులు జరుగుతున్న సోమనాథ్ రైల్వే స్టేషన్ కనిపించింది. అక్కడివారిని అడిగినప్పుడు భక్తుల రద్దీకి తగ్గట్టుగా అయోధ్య రైల్వే స్టేషన్ తరహాలో అధునాతన సౌకర్యాలతో ఇక్కడ రైల్వే స్టేషన్‌ను తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. అలా నడుచుకుంటూ శంఖ్ కూడలికి చేరుకునేసరికి ఆ కూడలి నుంచి హమీర్ జీ కూడలి వరకు దేశంలో వేర్వేరు రాష్ట్రాలకు చెదిన కళాకారులు వారికి కేటాయించిన వేదికలపై కళారూపాల రిహార్సల్స్ చేస్తూ కనిపించారు. వారిలో గుజరాత్‌కు చెందినవారితో పాటుగా కేరళ, జమ్మూకశ్మీర్, ఒరిస్సా, తదితర రాష్ట్రాల వారు ఉన్నారు. యాత్రా మార్గానికి కుడివై పున బస్తీ ఉన్న కారణంగా భద్రత దృష్ట్యా అటువైపు నకు అడ్డుగా మందపాటి పరదాలను అధికారులు కట్టారు. అయినప్పటికీ అటువైపున పరదాల మధ్య చిన్నపాటి కంతల నుంచి శౌర్య యాత్రను చూడటానికి బస్తీకి చెందిన పసిపిల్లలతో పాటుగా వృద్ధులు వేచి చూడటం కనిపించింది. యాత్రామార్గం మొత్తాన్ని ఒకసారి తిరిగి చూసిన తర్వాత శంఖ్ కూడలి దగ్గరకు చేరుకున్నాను. పులివేషాలు కట్టిన కేరళ కళాకారులు, స్థానిక వస్త్రధారణలో కనిపించిన కశ్మీర్ నాట్యకారులు ప్రజలను ఎక్కువగా ఆకర్షించారు. వారితో సెల్ఫీలు దిగారు. వారి ప్రదర్శనను కెమెరాల్లో బంధించారు. ఈలోగా శంఖ్ కూడలి వద్ద హడావిడి మొదలైంది. సోమనాథ్ పరిరక్షణకు బలిదానం చేసిన యోధులను తలపిస్తున్నట్టుగా అప్పటి సైనిక వస్త్రధారణలో చేతిలో ఆయుధాలను ధరించిన వందలాదిగా వ్యక్తులు అశ్వాలపై అక్కడికి చేరుకున్నారు. వారంతా గుజరాత్ రాష్ట్రంలోని పోలీస్ అకాడమీలలో శిక్షణ పొందిన అధికారులు. అలా వచ్చిన అశ్వికదళం రెండు జట్లుగా విడిపోయింది. ఈలోగా ఆదివారం అన్న విషయాన్ని పట్టించుకోకుండా వేర్వేరు పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు అక్కడికి చేరుకున్నారు. వారిలో కొందరి గుప్పిట గులాబీ రేకులు ఉన్నాయి. మరి కొందరి చేతుల్లో విజయోత్సవానికి సంకేతంగా చిన్నపాటి పతాకాలు కనిపించాయి. విద్యార్థినీ విద్యార్థులంతా యాత్ర ఆరంభమయ్యే చోట కట్టిన బారికేడ్ల వద్ద ప్రధాని రాక కోసం ఎదురుచూస్తూ నిలబడ్డారు. పక్కనే ఖాళీగా ఉన్న వేదిక మీద కూర్చొని కొందరు యువకులు కనిపించారు. వారితో మాట్లాడినప్పుడు ఇంజినీరింగ్ పూర్తి చేసి సామాజిక సేవలో భాగంగా యాత్ర విధుల్లో పాల్గొంటున్న స్వచ్ఛంద సేవకలని తెలిసింది. ఆ పక్కనే గుజరాత్ లోని ఒక పంచాయతీ నుంచి వచ్చిన పట్వారీ కనిపించారు. ఆయన మాటల్లో సోమనాథ్ పట్ల భక్తిభావన, యోధులపైన ఆరాధన వినిపించింది.
వారితో వీరితో మాట్లాడుతుండగానే మరోసారి హడావిడిగా మొదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి తోడురాగా ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. యాత్రకు ఉద్దేశించిన టాప్ లేని ప్రత్యేక వాహనాన్ని అధిరోహించారు. అలా వాహనాన్ని ఎక్కడమే ఆలస్యం ఎవరో ఆయన చేతికి ఢమరుకాన్ని అందించారు. ముందువైపున అశ్వికదళం, శంఖారావంతో సంస్కృత విద్యార్థులు సాగుతుండగా ఢమరుకాన్ని మోగిస్తున్న మోదీతో వాహనం నెమ్మదిగా ముందుకు సాగింది. అక్కడి వాతావరణంలో ఒక్కసారిగా ఉత్సాహం నెలకొంది. విద్యార్థినీవిద్యార్థులు ప్రధానిపై పూలవర్షం కురిపించారు. యాత్ర మొదట్లో వేదికపై సీతారామ లక్ష్మణ రూపధారులైన కళాకారులను మోదీ పలకరించారు. కేరళ కళాకారుల నుంచి చండా వాయిద్యాన్ని తీసుకొని మోగించారు. వారి యోగక్షేమా లను అడిగి తెలుసుకున్నారు. అలా 20 నిమిషాలపాటు సాగిన శౌర్యయాత్ర హమీర్ జీ కూడలికి చేరుకోగానే విజయానికి గుర్తుగా కాషాయ రంగులను ప్రధాని వెదజల్లారు. అనంతరం మోదీ పాల్గొన్న సభావేదిక వద్ద కూడా ఇలాంటి ఉత్సాహ పూరితమైన వాతావరణమే కనిపించింది. ప్రధాని తన ప్రసంగంలో సోమనాథ్ చరిత్ర ఓటమి చరిత్ర కాదు. ఇది విజయం, పునర్నిర్మాణం చరిత్ర, మన పూర్వికుల ధైర్యం, త్యాగం, సంకల్ప బలం చాటే చరిత్ర. ఇప్పుడు ఆక్రమణదారులు ఖడ్గాలతో రాకపోయినా భారత్‌ను బలహీనపరిచే కుట్రలు జరుగుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించి నప్పుడు సభికులంతా ‘‘హర్ హర్ మహదేవ్’’, ‘‘హర్ హర్ భోలే’’, ‘‘జై సోమనాథ్’’ అంటూ నినదించారు.
మోదీ చేసిన భావోద్వేగ ప్రసంగంలో వారికి సోమనాథ్ మందిరానికి మరో వెయ్యేళ్ల కాలానికి భరోసా వినిపించింది. సభ విజయవంతంగా ముగిసింది. సభ వెలుపల పోలీసుల ఏర్పాట్లు కూడా అంతే బేషుగ్గా ఉన్నాయి. ఉదాహరణకు సభా వేదిక దగ్గర్లో ఉన్న విరావల్ కూడలి వద్ద ఒక వృద్ధురాలు తప్పిపోయింది. గుజరాత్‌లో ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి తమవారితో కలిసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో సోమనాథ్ వేడుకల్లో పాల్గొనటానికి వచ్చింది. అక్కడ ఉన్న పోలీసులు వెంటనే స్పందించారు. ఆమెకు ధైర్యం చెప్పారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైర్‌లెస్ సెట్లకు పనిచెప్పారు. కొద్దిసేపటికి ఆమె ఎక్కాల్సిన బస్సు ఆమె ముందు వచ్చి ఆగింది. పోలీసులకు దండాలు పెడుతూ మరీ అయినవారు బస్సులో నుంచి చేయి అందించగా ఆమె నవ్వుతూ బస్సు ఎక్కింది. నాకు అనుభవంలోకి వచ్చింది ఇదొక్కటే. అంత పెద్ద కార్యక్రమంలో అందరి బాగోగులు చూసుకుంటూ, వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమనేది కత్తి మీద సాము. ఈ విషయంలో గుజరాత్ పోలీసులు అభినందనీయులు. అప్పటికి మధ్యాహ్నం దాటిపోయింది. దక్షిణ భారత్ నుంచి వచ్చిన మా బృందంతో పాటుగా యావత్ దేశం నుంచి వచ్చిన 22 మందితో కూడిన పాత్రికేయ బృందానికి సోమనాథ్ వాయులింగ దర్శనాన్ని సాయంత్రం ఏడు గంటలకు కేటాయించారు. ఈ లోగా మా బృందంలో ఒకరికి ఇంటర్నెట్ సెంటర్‌తో పనిపడింది. ఆయనతోపాటుగా సెంటర్‌ను వెదికే పనిలో నేనూ చేరాను. అలా వెదుకుతుండగా ఒక టీ కొట్టు దగ్గర ముగ్గురు మిత్రులు కనిపించారు. వారి వయస్సు 50 ఏళ్లకు పైమాటే. సోమనాథ్ గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఆ ముగ్గురు ఉండేది విరావల్‌లో. ఒకప్పుడు ఎనిమిది కి.మీ.ల దూరంలో ఉన్న సోమనాథ్ మందిరానికి కాళ్లకు చెప్పుల్లేకుండా నడుచుకుంటూ వచ్చి మరీ దర్శనం చేసుకునేవారట. కార్తికమాసం, ఇతర విశేషదినాల్లో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు బండ్లు కట్టుకొని వచ్చేవారట. పర్వదినానికి మూడు రోజుల ముందే అలా వచ్చే భక్తులు మందిరానికి సమీపంలో గుడారాల్లో విడిది చేసేవారు. జనవరి 12 (సోమవారం) సోమనాథుడి దర్శనం చేసుకొని తిరిగి వెళ్లేవారు. అలాంటి సమయాల్లో తాము మందిరం ఛాయలకు వెళ్లేవారం కాదని ఆ ముగ్గురు చెప్పారు. అప్పట్లా ఇప్పుడు నడిచి వెళ్లే పరిస్థితి లేదని, సోమనాథ్ చాలా మారిపోయిందని, రోడ్లు వెడల్పు అయ్యాయని, కొత్త కొత్త వ్యాపారాలు వచ్చాయని, భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిందని చెప్పారు. ఆదివారం సాయంత్రమైంది. మా బృందానికి మందిరాన్ని సందర్శించుకునే సమయం ఆసన్నమైంది. మందిరం దగ్గర శనివారం అంత సందడి లేదు కానీ భక్తుల సంఖ్య బాగానే ఉంది. మందిర ప్రాంగణానికి ఒకవైపున భక్తులు వారి మొబైల్ ఫోన్లు భద్రపరచు కోవడానికి ప్రత్యేక కౌటర్లు ఏర్పాటు చేశారు.
మరోవైపు మెటల్ డిటెక్టర్ల మధ్య భక్తులను మందిరంలోకి పంపించే ఏర్పాటు ఉంది. మేమంతా ఆ ఏర్పాటు గుండా లోపలకు వెళ్లాం. మమ్మల్ని లోపలకు తీసుకొని వెళ్లిన వారు మాకు గంగాజలంతో కూడిన చిన్న డబ్బాను చేతికి అందించారు. మందిరంలోకి అడుగుపెట్టాం. లోపలకు వెళ్లగానే బూడిద రాసుకొని, శ్మశానం లో తిరిగేవాడికి ఇంత వైభోగం ఏమిటీ ముక్కంటి అని నాకైతే అనిపించింది. మందిరాకృతి, శిల్పకళా వైభవం అద్భుతమని పించింది. గర్భగుడి, ఆ చుట్టు పక్కల గోడలన్నీ బంగారు రేకులతో తాపడం చేసి ఉన్నాయి. కళ్లెదుట వాయులింగ రూపధారి శ్వేతవర్ణంలో మెరిసిపోతు న్నాడు. మహారాజులాగా వస్త్రంతో చేసిన గుజరాతీ సంప్రదాయ కిరీటంతో వెలిగిపోతున్నాడు. వాయులింగానికి అభిముఖంగా మూడు అడుగుల దూరంలో బంగారు తాపడం చేసిన గట్టు మీద ఏర్పాటుచేసిన రంధ్రాల్లో ఒక దాని నుంచి గంగాజలాన్ని సమర్పించుకున్నాను. మారేడు దళపు భక్త సులభుడు రాజకోట లాంటి సువిశాలమైన మందిరంలో కొలువు దీరి ఉండటాన్ని చూడటం నాకిదే మొదటిసారి. అది కూడా వెయ్యేళ్ల వేడుకల సమయంలో చూడటాన్ని మించిన అవకాశం ఇంకేమి ఉంటుంది. ఇంతటి మహోత్సవాన్ని చూసిన తర్వాత సోమనాథ్ మందిరానికి మరో వెయ్యేళ్ల వరకు ఢోకా లేదని నాకైతే అనిపించింది.