గత ఏడాది మన దేశంలోకి వెండి దిగుమతులు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా పారిశ్రామిక అవసరాల కోసం వెండికి గిరాకీ పెరగడం, దీనికి అనుగుణంగా ఈ లోహం సరఫరా లేకపోవడం, భౌగోళిక రాజకీయాల సంక్లిష్టతల నేపథ్యం వెండి దిగు మతులు పెరగడానికి ప్రధాన కారణ మని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆరఐ) నివేదిక పేర్కొంది. శుద్ధి చేసిన వెండిని ప్రపంచంలోనే అత్యధికంగా దిగుమతి చేసుకున్న దేశం భారత్! 2025లో మనదేశం 9.2 బిలియన్ డాలర్ల విలువైన వెండి దిగుమతి చేసుకున్నదని ఒక అంచనా. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 44శాతం అధికం. విచిత్రమేమంటే వెండి ధర విపరీతంగా పెరిగినప్పటికీ ఈ దిగుమతులు ఆగకపోవడం! ఉదాహరణకు 2025 ప్రారంభంలో మన దేశంలో కిలో వెండిధర రూ.80`85వేల మధ్య వుండగా, 2026 జనవరి నాటికి ఏకంగా రూ.2.43లకు చేరింది. అంటే కేవలం ఏడాది కాలంలో కేజీ వెండి ధర మూడురెట్లు పెరిగింది. వెనిజులాలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఏర్పడిన భౌగోళిక అస్థిరత ఇందుకు కారణమని కొన్ని విశ్లేషణలు వచ్చినప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా ఈ లోహానికి అపరిమితంగా డిమాండ్ పెరగడం ఈ ధర పెరుగుదలకు ప్రధాన హేతువని చెప్పక తప్పదు.
ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్, సౌరవిద్యుత్, విద్యుత్ వాహనాలు, రక్షణ రంగ పరికరాలు, వైద్య పరికరాల్లో వెండి వాడకం పెరిగిపోవడంతో, పారిశ్రామికంగా ఈ లోహానికి డిమాండ్ విపరీతంగా ఉంది. మొత్తం డిమాండ్‌లో 15 శాతం వాటా సౌరవిద్యుత్ రంగానిదే! 2000 సంవత్సరం నుంచి పరిశీలిస్తే వెండి డిమాండ్ ఎనిమిది రెట్లు పెరిగింది. ఇందుకు ప్రధాన కారణం అప్పటివరకు దీన్నొక ఖరీదైన లోహంగా పరిగణిస్తూ వచ్చినా, తర్వాత క్రమంగా పరిశ్రమల్లో దీని వాడకం పెరగడమే! అయితే పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేదు. వెండి మైనింగ్ పరిమితంగానే కొనసాగడంతో ఏటా 200-250 మిలియన్ ఔన్స్‌ల వరకు వెండి సరఫరాలో కొరత సుస్థిరంగా కొనసాగి, మార్కెట్లలో వెండి లభ్యత క్రమంగా తగ్గిపోయింది. వెండిని శుద్ధి చేయడంలో చైనాదే అగ్రస్థానం. ముడి వెండి ప్రాసెసింగ్‌లో ప్రపంచంలో చైనా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండగా, భారత్ ఈ విషయంలో ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉండటం గమనార్హం. కానీ శుద్ధి చేసిన వెండిని పెద్దమొత్తంలో దిగుమతి చేసుకునేది మన దేశమే! జీటీఆరఐ నివేదిక ప్రకారం 2024లో మనదేశం దిగుమతి చేసుకున్న శుద్ధి చేసిన వెండి విలువ 6.4 బిలియన్ డాలర్లు! ఇది ప్రపంచం మొత్తంమీద దిగుమతుల్లో 1/5శాతం! ఇదే సమయంలో కేవలం 500 మిలియన్ డాలర్ల విలువైన వెండి ఉత్పత్తులను మాత్రమే ఎగుమతి చేయగలిగింది. ఎగుమతి` దిగు మతుల మధ్య కొనసాగిన ఈ విపరీత వ్యత్యాసం, భారత్ ఈ లోహం దిగు మతులపై ఎంతగా ఆధారపడుతున్నదీ వెల్లడిస్తున్నది.

దిగుమతి కష్టాలు
ఈ ఏడాది జనవరి 1 నుంచి చైనా లైసెన్స్ ఆధారంగా వెండి ఎగుమతులు కొనసాగాలన్న నిబంధనను ప్రవేశపెట్టడంతో, వెండి దిగుమతికి కష్టాలు మొదలయ్యాయి. అంటే వెండికి సంబంధించిన ప్రతి ఎగుమతికి చైనా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి! ఫలితంగా అంతర్జాతీయంగా వెండి సరఫరా శృఖలాల్లో తీవ్ర అనిశ్చితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో జీటీఆరఐ మనదేశానికి ఒక సలహా ఇచ్చింది. వెండిని కేవలం ఒక విలువైన లోహంగా కాకుండా, పారిశ్రామిక ఉత్పత్తి అవసరాలను తీర్చేదిగా పరిగణించాలన్నది ఆ సలహా సారాంశం. అంతేకాదు స్వచ్ఛ ఇంధనం (పర్యావరణ మిత్ర)గా ఇతర ఖనిజాలతో కలిపి దీన్ని పరిగణించాలని స్పష్టం చేసింది. ఇందుకోసం దీర్ఘకాల వ్యూహం అవసరం. ముఖ్యంగా సముద్ర మార్గం ద్వారా నిరంతరం మనదేశానికి సరఫరా అయ్యే విధంగా, దేశీయంగా వెండి రీసైక్లింగ్, శుద్ధి విధానాలను ప్రోత్సహించడం ద్వారా శుద్ధి చేసిన వెండి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలి. ఇదే సమయంలో వెండి దిగుమతి కోసం కేవలం కొన్ని హబ్‌లపై ఆధారపడకుండా, విభిన్న మార్గాలను ఎంచుకోవాలి. మారిన కాలమాన పరిస్థితుల్లో వెండి ఇంధన భద్రతకు అత్యంత కీలకంగా పరిణమించడం గుర్తించాల్సిన ప్రధానాంశం. ఇందుకు అనుగుణంగా మన దేశం ఇప్పటి వరకు అనుసరిస్తున్న వెండి విధానంలో మార్పులు, చేర్పులు చేపట్టక తప్పదు.
గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యం
ప్రస్తుతం మనదేశం గ్రీనఎనర్జీకి అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఇందులో భాగంగా సౌరవిద్యుత్ ఉత్పత్తికి అవసరమైన సౌర ఫలకాల్లో వెండి అవసరం. దీనికితోడు ఎలక్ట్రానిక్స్, రక్షణ రంగాన్ని మరింత ఆధునికీకరించే చర్యలను ప్రభుత్వం చేపట్టింది. ఇందులో వైరింగ్, సెన్సార్‌లలో వెండిని వినియోగిస్తారు. ఇక శిలాజ ఇంధనాల ద్వారా నడిచే వాహనాల వల్ల వాయుకాలుష్యం అధికంగా ఉండటంతో, దీన్ని అరికట్టడానికి మన ప్రభుత్వం విద్యుత్ వాహనాలకు ప్రాధాన్యతనిస్తోంది. వెండికున్న అద్భుతమైన వాహక లక్షణం వల్ల ఈవీ సెన్సార్లు, వైరింగ్, అత్యధిక పనిసామర్థ్యం కలిగిన కనెక్టర్ల కోసం అవసరం. మన భారతీయ సంస్కృతిలో వెండి, బంగారాలకున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. మతపరమైన కార్యక్రమాలు, పండుగలు పబ్బాలకు వెండి, బంగారు ఆభరణాలు, వస్తువులకు విపరీత మైన డిమాండ్ ఉంటుంది. బంగారంతో పోల్చిన ప్పుడు తక్కువ ధరలో సులభంగా లభ్యం కావడం కూడా దీనికున్న ప్రత్యేకత! ఇది ద్రవ్యోల్బణం, కరెన్సీల హెచ్చు తగ్గుల నుంచి రక్షణగా ఉండగలదు కూడా! ప్రస్తుత ప్రపంచ రాజకీయాల నేపథ్యంలో మదుపర్ల ఆలోచనాధోరణిలో మార్పు వచ్చింది. బంగారం ధర ఆకాశాన్నంటుతున్న కారణంగా వెండిని ఒక సురక్షిత మార్గంగా భావిస్తున్నారు. అయితే వెండిని మైనింగ్‌లో నేరుగా లభ్యం కాదు. కేవలం ఉప ఉత్పత్తిగా మాత్రమే లభిస్తుండటం వల్ల దీని ఉత్పత్తిని తగిన విధంగా పెంచడం సాధ్యం కావడంలేదు. ప్రపంచం ఇప్పుడు వెండి సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కొనడానికి ఇదే ప్రధాన కారణం.
డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి లేదు
మనదేశంలో ఏటా 5 నుంచి 7 మిలియన్ టన్నుల వరకు వెండికి డిమాండ్ ఉండగా కేవలం 700 నుంచి 800 టన్నులు ఉత్పత్తి అవుతోంది. ఇందులో సింహభాగం రాజస్థాన్‌లోని హిందుస్తాన్ జింక్ ఉత్పత్తి చేస్తోంది. ఈ సంస్థ జింక్ కోసం చేసే మైనింగ్‌లో ఉప-ఉత్పత్తిగా వెండి లభ్యమవుతోంది తప్ప, ప్రత్యేకంగా వెండి మైనింగ్ సాధ్యం కాదు. అయితే ఈ సంస్థ రాబోయే కాలంలో తన వార్షిక వెండి ఉత్పత్తిని 1500 టన్నులకు పెంచుతామని చెబుతోంది. ఇది కూడా మనదేశంలోని డిమాండ్‌కు ఏమూలకు సరిపోదు.ఈ కారణంగానే వెండి అవసరాలకోసం మన దేశం 80-90 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. మనకు అత్యధికంగా వెండి సరఫరా చేసే దేశం మెక్సికో. ప్రపంచంలో వెండి ఉత్పత్తిలో ఈ దేశం అగ్రగామిగా కొనసాగుతోంది. మెక్సికో తర్వాత ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే వెండి చాలా తక్కువేనని చెప్పాలి. ప్రస్తుతం మనదేశంలో వెండి వినియోగంలో కూడా వేగంగా మార్పులు వచ్చేస్తు న్నాయి. గతంలో 30-40% వరకు వెండిని ఆభరణాలు, వస్తువుల తయారీలో వినియోగించే వారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో పరిశ్రమల్లో వెండి వినియోగం 20-30% పెరిగింది. అదేవిధంగా వెండిపై పెట్టుబడి డిమాండ్ కూడా 20-30% వృద్ధి నమోదు చేసింది. ఇక మతపరమైన కార్యకలాపాల్లో వెండి వినియోగం తగ్గలేదు. సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్ వస్తువులు, విద్యుత్ వాహనాల ఉత్పత్తిపై ప్రభుత్వం మరింత దృష్టి కేంద్రీకరించే కొద్దీ రాబోయేకాలంలో వెండికి డిమాండ్ మరింతగా పెరగడం ఖాయం.
భారత్, రష్యా, చైనాల వ్యూహం
అమెరికా మదుపర్లు క్రిప్టోకరెన్సీ, ఈక్విటీలు, టెక్నాలజీ స్టాక్‌లపై దృష్టి కేంద్రీకరిస్తున్న తరుణంలో భారత్, చైనా, రష్యాలు వెండి నిల్వలు పెంచుకో వడానికి తీసుకుంటున్న చర్యలు నిజంగా వ్యూహాత్మకం మాత్రమే కాదు ఎంతో దూరదృష్టితో కూడిన వని చెప్పాలి. ముఖ్యంగా డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా అపనమ్మకం పెరుగుతున్న తరుణంలో, పారిశ్రామిక అవసరాలకు వెండి ప్రాధాన్యతను గుర్తించి ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. బంగారాన్ని మానిటరీ నిల్వగా పరిగణిస్తుండగా, 60 శాతం వెండి పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో వెండి ఉత్పత్తిలో అగ్రస్థానంలో మెక్సికో ఉండగా, లోహాన్ని శుద్ధి చేయడంలో చైనా ముందంజలో ఉంది. అయినప్పటికీ చైనా ఇప్పుడు పెద్ద మొత్తంలో వెండిని దిగుమతి చేసుకోవడం విశేషం. ముఖ్యంగా మైనింగ్ చేసేవారితో నేరుగా సంప్రదిం పులు జరుపుతూ, ఇతర ప్రీమియంల చెల్లింపుల ద్వారా ముడి వెండిని సేకరించి, దేశీయంగా శుద్ధి చేస్తోంది. ముఖ్యంగా పశ్చిమదేశాల నియంత్రణలో వున్న ‘సీఓఎంఈఎక్స’, ‘ఎల్‌బీఎంఏ’ వంటి ఎక్స్చేంజ్‌లపై ఆధారపడటం తగ్గించడం, సౌరఫలకాలు, విద్యుత్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీకి అవసరమైన ముడివెండిని సేకరించడం, డాలర్ ఆధారిత ఆస్తులు బలహీనపడుతున్న తరుణంలో ఇందుకు ప్రత్యామ్నాయంగా వెండిని ఒక ప్రత్యా మ్నాయ ఆస్తిగా అభివృద్ధి చేయడం, కరెన్సీ పరంగా ఉత్పన్నమయ్యే సంఘర్షణలను, వాణిజ్య వివాదా లను, ఆంక్షలను తట్టుకునే రీతిలో స్వయం సమృద్ధి సాధించడం లక్ష్యంగా చైనా వెండి నిల్వలను పెంచు కుంటోంది. ఆవిధంగా పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థల నుంచి తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకుం టోంది. అందువల్ల దీన్ని కేవలం పెట్టుబడిగా పరిగణించడానికి వీల్లేదు. ఇక భారత్ విషయానికి వస్తే గత ఐదేళ్ల కాలంలో 900 మిలియన్ల ఔన్స్‌ల వెండిని సమకూర్చుకుంది. సంప్రదాయిక, మతపర మైన కార్యకలాపాల కోసం మాత్రమే ఈ విధంగా చేయడం గమనార్హం. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలన్న దృష్టితో భారత్ సౌరవిద్యుత్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. దీంతోపాటు డిఫెన్స్, ఎలక్ట్రానిక్, విద్యుత్ వాహనాల తయారీ వంటి వాటిపై కూడా పెట్టుబడులను కొనసాగిస్తోంది. ఇందుకు వెండి పెద్ద ఎత్తున అవసరం. చారిత్రకంగా పరిశీలిస్తే భారత్ బంగారం, వెండిలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం మనకు తెలిసిందే. ఇప్పుడు కరెన్సీ విలువ పతనాన్ని నిరోధించేందుకు, డిజిటల్ లావాదేవీలకు మరింత వెన్నుదన్నుగా ఉండేందుకు వీలుగా వెండి సేకరణను కొనసాగిస్తోంది. రష్యా కూడా భారత్, చైనాల మాదిరిగానే పశ్చిమదేశాల నియంత్రణలోని చెల్లింపుల వ్యవస్థ నుంచి బయట పడటానికి, ఆంక్షల నేపథ్యంలో డీడాలరైజేషన్ కోసం, దేశీయ అత్యాధునిక సాంకేతికతపై ఆధారపడే పరిశ్రమలకు వెన్నుదన్నుగా నిలిచేందుకు వెండిని సేకరిస్తోంది. ముఖ్యంగా వస్తుమార్పిడి ఆధారిత ఆర్థికవ్యవస్థ నిర్మాణానికి కృషిచేస్తోంది.
నూతన ప్రపంచ క్రమం
ఎప్పుడైతే పేపర్ ఆధారిత కరెన్సీపై విశ్వాసం కోల్పోవడం జరుగుతుందో అప్పుడు, విలువైన లోహాలు మార్కెట్ నుంచి మాయమైపోతాయి. ఈవిధంగా కరెన్సీ విలువలు తగ్గిన సంఘటనలు గతంలో మూడుసార్లు చోటుచేసుకున్నాయి. అంటే కరెన్సీ విలువ పడిపోయినప్పుడు ఇటువంటి లోహాలను ప్రజలు తమ వద్ద భద్రపరచు కుంటారు.1960లో బ్రెట్టన్ వుడ్స్ వ్యవస్థ (డాలర్ వ్యవస్థ) దెబ్బతిన్నప్పుడు వెండి నాణేలు, ఇతర నాణేలలోని వెండి అంతర్గత విలువ, నాణెం ముఖ విలువను మించి పోవడంతో, ప్రజలు ఈ నాణేలను కరిగించడం మొదలుపెట్టారు. దీంతో యు.ఎస్. ప్రభుత్వం నాణేలలోని వెండి శాతాన్ని తగ్గించడం ద్వారా, వీటిని ప్రజలు నిల్వచేయకుండా, స్థిరమైన కరెన్సీ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. ఇక 1970లో బంగారం కంటే డాలర్ విలువ తగ్గింది. ఫలితంగా బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. పర్యవసానంగా వెండి ఔన్సు ధర 1.95 డాలర్ నుంచి 1980 నాటికి ఏకంగా 50 డాలర్లకు పెరిగింది. మదుపర్లు ఈ ద్రవ్యోల్బణం నుంచి రక్షణకోసం వెండి కొనుగోళ్లకు మొగ్గు చూపడమే ఈ పెరుగుదలకు కారణం. 1920ల్లో కూడా అతి ద్రవ్యోల్బణం కారణంగా కరెన్సీలకు విలువలేకుండా పోయింది. ఫలితంగా చెలామణిలో వున్న కరెన్సీ కంటే కర్మాగారాలు ఉత్పత్తి చేసిన వస్తువులకే ఎక్కువ విలువ నమోదైంది. ఇక ప్రస్తుత పరిస్థితికి వస్తే, డీడాలరైజేషన్ ప్రక్రియ ఊపందుకుంటోంది. మల్టీ పోలార్ కరెన్సీల దిశగా ప్రపంచ దేశాలు అడుగులు ముందుకేస్తున్నాయి. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకుల నిర్దేశిత లక్ష్యాల కంటే అధికంగా ద్రవ్యోల్బణం కొనసాగుతోంది. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలు తలకుమించిన అప్పుల్లో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో క్రమంగా వెండి ఒక భౌగోళిక రాజకీయ అస్త్రంగా మారుతోంది. అందువల్ల వివిధ దేశాలు వెండి ప్రాముఖ్యతను గుర్తిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్పత్తి దేశాల ఎగుమతి నియంత్రణలను అడ్డుకునేందుకు, సంప్రదాయంగా వస్తున్న డాలర్ వినియోగాన్ని తప్పించేందుకు వెండి ఉపయోగపడుతుంది. భారత్, చైనా, రష్యాలు ఈ విధంగా వెండి నిల్వలను పెంచుకోవడం వెనుక ప్రపంచ వ్యవస్థలను క్షుణ్ణంగా అంచనా వేయడం ప్రధాన కారణం. ముఖ్యంగా రానున్న కాలంలో ప్రస్తుత శిలాజ ఇంధన వినియోగం నుంచి పర్యావరణ హిత ఇంధన వినియోగానికి మారాలంటే వెండి అత్యంత అవసరం. మానిటరీ వ్యవస్థ కూడా క్రమంగా మార్పునకు లోనవుతున్న కారణంగా ఇప్పటివరకు పట్టించుకోని వెండి కీలక పాత్ర పోషిస్తుందన్న సత్యాన్ని ఈ దేశాలు గుర్తించాయి. ఉదాహరణకు వెనిజులాపై అమెరికా దాడిని ముందు గానే పసిగట్టిన రష్యా, చైనాలు రహస్యంగా అక్కడి వెండి నిల్వల్లో చెరో 400 టన్నులను తమ దేశాలకు తరలించేశాయి. మదురోను అరెస్ట్ చేసిన తర్వాత వెండిని తరలిద్దామనుకున్న ట్రంప్ తెల్లమొగం వేయాల్సివచ్చింది. వస్తు మార్కెట్ల పరంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు చోటుచేసుకునే అవకాశాలు మెండుగా ఉన్న నేపథ్యంలో, దేశ రక్షణలో వనరుల భద్రత కూడా ఒక భాగమైందని గుర్తించే రీతిలో ఈ దేశాల ఆలోచనా సరళిలో వచ్చిన మార్పులకు ఇదొక గొప్ప ఉదాహరణ. ప్రపంచంలో బలీయమైన ఆర్థికశక్తుల మధ్య పోటీ నెలకొన్న తరుణంలో, వ్యూహాత్మక అవసరాలు, భౌతిక కొరతల మధ్య సంఘర్షణ ఏర్పడినప్పుడు వెండిధర పెరగడం ప్రధానాంశం కాబోదు. ప్రస్తుతం అమెరికన్లు ఆర్థిక మార్కెట్లపై దృష్టి కేంద్రీకరించిన తరుణంలో ఇతర దేశాలు భవిష్యత్తు సైనిక, ఆర్థిక అవసరాలపై దృష్టి కేంద్రీకరించడం ఇక్కడ కీలకం. ఇప్పుడు వెండిని నిల్వచేసుకుంటున్న దేశాలు అధిక ధరలను పట్టించు కోవడం లేదు. కేవలం నూతన ప్రపంచ క్రమానికి తమను తాము సిద్ధం చేసుకుంటున్నాయన్నది అక్షర సత్యం. ఈ విషయంలో పశ్చిమదేశాలు ఇప్పటివరకు వెనుకబడి ఉన్నాయనే చెప్పాలి.

జమలాపురపు విఠల్‌రావు
సీనియర్ జర్నలిస్ట్