అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏకకాలంలో గ్రీన్‌లాండ్ పైనా, వెండిపైనా కన్నేశారు. గ్రీన్‌లాండ్ కొనుగోలు వ్యవహారం ఈ మధ్య మళ్లీ తెర మీదకొచ్చినదైతే, వెండి నిల్వలను పెంచుకునే కసరత్తు ఏడాది కాలంగా అమెరికాలో జరుగుతోంది. గ్రీన్‌లాండ్ కోసం అమెరికా పట్టు బట్టిన కారణంగా వెండి ధరలకూ రెక్కలొచ్చాయంటే విస్తుపోవాల్సిందే మరి.
2025లో అమెరికా కీలకమైన ఖనిజాల (క్రిటికల్ మినరల్స్) జాబితాలో వెండిని చేర్చింది. యుఎస్ జియాలజికల్ సర్వే`యూఎస్ జీఎస్ నవంబర్, 2025లో కీలకమైన ఖనిజాల జాబితాను ఖరారు చేసింది. ఇందులో వెండితో పాటు టంకం (బోరాన్), రాగి, సీసము, బొగ్గు, ఫాస్ఫేట్, పొటా షియం, రీనియం, సిలికాన్, యురేనియం వంటి 10 కొత్త ఖనిజాలను జోడించారు. దీంతో మొత్తం జాబితా 60 ఖనిజాలకు చేరుకుంది. ఈ జాబితాతో వెండిని కేవలం బంగారం లాంటి విలువైన లోహం లేదా పెట్టుబడికి పనికివచ్చే ఆస్తిగా మాత్రమే కాకుండా జాతీయ భద్రత, ఆర్థిక భద్రత, పారిశ్రా మిక, రక్షణ, స్వచ్ఛమైన ఇంధనానికి అత్యవసర వ్యూహాత్మక ఆస్తిగా అమెరికా పరిగణించడం మొదలుపెట్టింది. వెండిని ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, బ్యాటరీలు, సోలార్ సెల్స్ (ఫోటోవోల్టాయిక్ ప్యానెల్స్), ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ), సెమీకండ క్టర్స్, 5జీ టెక్నాలజీ, యాంటీ-బ్యాక్టీరియల్ మెడికల్ ఇన్‌స్ట్రుమెంట్స్, డిఫెన్స్ సిస్టమ్స్‌లో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఈ లోహానికి పారిశ్రామిక గిరాకీ 60%కి పైగా ఉండటం వల్ల సప్లై చైన్ సెక్యూరిటీ అత్యంత ముఖ్యమైందిగా మారింది.
చైనా ఆధిపత్యం నుంచి వెండి సప్లై చైన్‌ను మళ్లించడం కోసమని దేశీయ ఉత్పత్తిని పెంచడం, విదేశాలతో ఒప్పందాలు చేసుకోవడంపై అమెరికా ప్రధానంగా దృష్టి పెట్టింది. 2025లో ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ల ద్వారా ఖనిజాల ఉత్పాదకతను వేగవంతం చేయడానికి నియంత్రణలను సడిలిం చారు. దేశీయ మైనింగ్‌కు ప్రోత్సాహకాలు ఇచ్చారు. ఆస్ట్రేలియా, జపాన్, మలేషియా, థాయ్‌లాండ్, అర్జెంటీనా వంటి దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకం చేశారు.
జనవరి 14, 2026న ట్రంప్ వైట్ హౌస్ నుంచి ఒక సాధికార ప్రకటన (ప్రొక్లమేషన్)జారీ చేశారు. ఇందులో వెండి సహా 41 కీలకమైన ఖనిజాల ఎగుమతులు జాతీయ భద్రతకు ముప్పుగా ఉన్నాయని పేర్కొన్నారు. వాణిజ్య విస్తరణ చట్టంలో సెక్షన్ 232కు లోబడి వాణిజ్య మంత్రి, అమెరికా వాణిజ్య ప్రతినిధులు విదేశీ సరఫరాదారులతో ఒప్పందాలు కుదుర్చుకునే అంశంపై చర్చలు జరపాలని ఆదేశించారు. ఇందులో కనీస ధరలు నిర్ణయించడం, వాణిజ్యపరమైన ఆంక్షలు వంటి చర్యలు పరిగణన లోకి తీసుకున్నారు. తద్వారా అమెరికా సరఫరాను తనకు అనుకూలంగా మార్చు కోవడానికి అధిక ధరలు చెల్లించేందుకు సైతం సిద్ధంగా ఉన్నాననే స్పష్టమైన సంకేతాన్ని అంతర్జాతీయ సమాజానికి ఇచ్చింది.
అయితే సుంకాల విషయంలో మొదట్లో ఆలస్యం చేశారు. బదులుగా సంప్రదింపుల ద్వారా సరఫరాను భద్రపరుచుకోవాలని నిర్ణయించారు. అయితే, ఎగుమతులపై చైనా నియంత్రణలు, వాణిజ్య వివాదాల వల్ల ఉద్రిక్తత పెరిగింది. కాంగ్రెస్‌లో ద్వైపాక్షిక బిల్లు ద్వారా కీలకమైన ఖనిజాలకు సంబం ధించి 2.5 బిలియన్ డాలర్ల విలువైన నిల్వలను సృష్టించాలని ప్రతిపాదన వచ్చింది. ఇది పెట్రోలియం నిల్వలాంటిది. ఈ ప్రతిపాదన వెండి సహా కీలకమైన ఖనిజాలను నిల్వ చేసి దేశీయ మార్కెట్‌ను బలోపేతం చేసే లక్ష్యంతో ఉంది. ఇది ఫెడరల్ రిజర్వ్ లాంటి పాలనా వ్యవస్థతో నడుస్తుంది.
ఈ వ్యూహం వల్ల వెండి ధరలు 2025లో 130% పెరిగాయి, 2026లో కూడా రికార్డు స్థాయిలకు చేరాయి స్పాట్ సిల్వర్ 90 డాలర్ల నుంచి 94 డాలర్లు/ఔన్స్‌కు చేరుకుంది). ఇది సరఫరా లోటు, పారిశ్రామిక గిరాకీ పెరుగుదల, జాతీయ భద్రతా ఆందోళనల వల్ల జరిగింది. భవిష్యత్తులో దేశీయ మైనింగ్, రీసైక్లింగ్, మిత్రదేశాలతో భాగస్వామ్యాలను పెంచడం ద్వారా దిగుమతులపై ఆధారపడటం తగ్గించాలనేది అమెరికా లక్ష్యం. మొత్తంగా, ట్రంప్ ప్రభుత్వం వెండిని జాతీయ భద్రతా సమస్యగా చూస్తూ, సప్లై చైన్ సెక్యూరిటీ, దేశీయ ఉత్పాదకత, సంప్రదింపులు, కనీస ధరలు, వ్యూహాత్మక నిల్వల ద్వారా భద్రపరుచు కునే వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇది వెండి మార్కెట్‌ను దీర్ఘకాలికంగా బలోపేతం చేసే అవకాశం ఉంది. అయితే ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయాలనే తన ప్రణాళికకు సంబంధించి యూరప్ దేశాలపై టారిఫ్ బెదిరింపులు జారీ చేయడం వల్ల ప్రపంచ మార్కెట్లలో భారీ ఒడుదొడు కులు ఏర్పడ్డాయి. ఈ టారిఫ్ బెదిరింపులు బులియన్ మార్కెట్‌ను (బంగారం, వెండి) రికార్డు స్థాయికి తీసుకెళ్లాయి. జనవరి 17న ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ద్వారా ప్రకటన ఇచ్చారు. గ్రీన్‌లాండ్‌ను అమెరికా పూర్తిగా కొనుగోలు చేసే ఒప్పందం జరిగే వరకు, డెన్మార్క్ సహా ఎనిమిది ఐరోపా దేశాల నుంచి వచ్చే వస్తువులపై 10% టారిఫ్ విధిస్తామని చెప్పారు. ఈ టారిఫ్ ఫిబ్రవరి 1 నుంచి అమలవుతుంది. జూన్ 1 నాటికి ఇది 25%కి పెరుగుతుందని హెచ్చరిం చారు. అమెరికా అధ్యక్షుడు హెచ్చరించిన దేశాల్లో డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్‌డమ్, నెదర్లాండ్స్, ఫిన్‌లాండ్ ఉన్నాయి.
గ్రీన్‌లాండ్ డెన్మార్క్ ఆధీనంలో ఉంది. ట్రంప్ దీనిని అమెరికా జాతీయ భద్రత కోసం కొనాలని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనను డెన్మార్క్, గ్రీన్‌లాండ్ ప్రజలు, ఐరోపా దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ టారిఫ్ బెదిరింపుల వల్ల ఐరోపా నుంచి ప్రతీకార టారిఫ్‌లు వచ్చే భయంతో ట్రేడ్ వార్ ముప్పు పెరిగింది. దీంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన ఆస్తుల వైపు వైపు మొగ్గు చూపారు. ఫలితంగా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి.
అమెరికా డాలర్ బలహీనపడటం, స్టాక్ ఫ్యూచర్స్ పడిపోవడం, ఐరోపా దేశాల నుంచి ప్రతిస్పందనలు రావడం వల్ల ఈ బంగారం-వెండి ర్యాలీ మరింత బలపడింది. అమెరికా ఇలా టారిఫ్‌లు విధించడం తప్పు అని, నాటో మిత్రదేశాలు ఇలాంటివి విధించడం సరికాదని ఐరోపా నాయకులు, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ వంటివారు విమర్శించారు. ఈ ఘటన గ్రీన్‌లాండ్ విషయంలో ట్రంప్ ఒత్తిడి తీవ్రతను చూపిస్తోంది. మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురవుతాయని అంచనా. భవిష్యత్తులో ట్రేడ్ వార్ తీవ్రమైతే బంగారం, వెండి ధరలు మరింత ఎగబాకే అవకాశం ఉంది. కాగా జనవరి 20 నాటికి వెండి ధర కిలో రూ.3 లక్షలకు చేరింది.
– జాగృతి డెస్క్