సోమలింగం నరో దృష్ట్వా సర్వపాపైః ప్రముచ్యతే!
లభతే ఫలం మనోవాంఛితం మృతః స్వర్గం సమాశ్రయేత్!!..
(సోమనాథ్ శివలింగ దర్శనంతో జీవుడు పాప విముక్తుడై సదాశయాలను నెరవేర్చి, మరణానంతరం స్వర్గ ప్రాప్తి పొందుతాడు.)
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిది సోమనాథ్. పశ్చిమ భారత తీరంలోని గుజరాత్ రాష్ట్రం ప్రభాస పట్టణంలోని ఈ దివ్యక్షేత్రం పేరు వినగానే మన హృదయాలు పులకరిస్తాయి. ఈ క్షేత్రం చరిత్రలో, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. అనేకమార్లు విదేశీ దండయాత్రల్లో ధ్వంసమై తిరిగి నిలబడింది. 1026లో తొలిసారి దాడి జరిగి వేయి సంవత్సరాలు కాగా.. 1951లో ఆలయ పునరుద్ధరణ జరిగి 75 వసంతాలు పుర్తవుతున్నాయి. కోట్లాది భారతీయులు, హైందవుల ఆత్మగౌరవ పర్వం, అఖండ విశ్వాసాలకు ప్రతీకగా నిలిచింది సోమనాథ ఆలయం. సోమనాథ్ స్వాభిమాన్ పర్వం ఎంతో వైభవంగా నిర్వహించారు.
ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది సోమ నాథ్. హిరణ్, కపిల, సరస్వతి మూడు నదులు కలిసే త్రివేణీ సంగమంలో చంద్రుడు అంటే సోముడు నిర్మించినందుకు సోమనాథ జ్యోతిర్లింగమనే పేరు వచ్చింది. శివపురాణం ప్రకారం దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు. వీరే 27 నక్షత్రాలుగా విరా జిల్లుతున్నారు. చంద్రుడు వారిని వివాహం చేసు కుంటాడు. కానీ వారిలో రోహిణి పట్ల మాత్రమే అచంచల ప్రేమను ప్రదర్శిస్తుంటాడు. కలత చెందిన దక్షప్రజాపతి చంద్రుని కళలు క్షీణించిపోతాయని శపిస్తాడు. ఇందుకు అనుగ్రహించిన శివుడు చంద్రుడు తాను కోల్పోయిన కళలను తిరిగి ప్రసాదిస్తాడు. ఆనందభరితుడైన చంద్రుడు బంగారంతో దివ్య క్షేత్రాన్ని నిర్మించాడు. చంద్రుని విన్నపం మేరకు శివుడు అక్కడ స్వయంభువు సోమనాథుడిగా వెలిశాడు. త్రేతాయుగంలో రావణుడు వెండితో ఆలయాన్ని నిర్మిస్తే… ద్వాపరంలో శ్రీకృష్ణుడు చందనంతో, భీముడు రాతితో దివ్యమందిరాన్ని పునర్నిర్మించారని ఇతిహాసాల ద్వారా తెలుస్తోంది
సోమనాథ్ ఆలయంలో ‘శ్యమంతకమణి’ అనే అద్భుత రత్నం ఉందని చెబుతారు. వినాయక వ్రత కథ ప్రకారం శ్రీకృష్ణుని వద్ద ఉన్న శ్యమంతకమణి ఇదే. ఆ మణిని తాకిన ప్రతిదీ బంగారంగా మారిపోతుందని పురాణాలు చెబుతున్నాయి. ఆలయ పరిరక్షణలో భాగంగా ఈ మణిని జ్యోతిర్లింగం లోపల దాచారని తెలుస్తోంది.
సోమనాథ వైభవం
కాలక్రమంలో శిథిలమైన సోమనాథ ఆలయాన్ని తొలిసారిగా 649 సంవత్సరంలో యాదవ రాజైన వల్లభాయి పునర్మించారు. చాళుక్యుల కాలంలో ప్రభాస నగరం మంచి ఓడరేవుగా భాసిల్లింది. కనౌజ్ పాలకులైన ప్రతీహారుల కాలంలో ఈ క్షేత్రం కాశీతో సమానంగా విలసిల్లింది. మధ్య యుగాల నాటికే సోమనాథ ఆలయం గొప్ప ఆధ్యాత్మిక, విద్యా సాంస్కృ తిక కేంద్రం. అద్భుత శిల్ప సంపదతో,ఆకాశాన్నంటే గొప్ప నిర్మాణమని చరిత్రకారులు అభివర్ణించారు. అత్యంత బరువైన 56 రాతిస్తంభాల పైకప్పు అపూర్వం. స్తంభాలు, కుడ్యాలు, తోరణాలకు వజ్రవైఢూర్యాలు, బంగారు, వెండి తాపడం చేశారు. ఆలయం మధ్యలో15 అడుగుల ఎత్తులో జ్యోతిర్లింగం ఉండేది. చిన్న దీపం మొత్తం గర్భగుడిని ప్రకాశింప జేసింది. ఈ ఆలయ నిర్వహణకోసం రెండు వేల గ్రామాల ఆదాయాన్ని కేటాయించారు. దాదాపు రెండు వేల మంది పూజారులు ఉండేవారు. ఇంతటి వైభవం, సంపద మరెక్కడా లేదు. దీనితో విదేశీ దురాక్రమణదారుల కన్ను కుట్టింది.
వెయ్యేళ్లనాటి విషాదం
భారతదేశం మీద మహ్మదీయుల దాడులు ప్రారంభమైన రోజులవి. వీరిలో అత్యంతక్రూరుడు అప్ఘానిస్తాన్‌కు చెంది టర్కీ సుల్తాన్ గజనీ మహమ్మద్. హైందవమతం, విగ్రహారాధన నిర్మూలించి, ఇస్లాం ఆధారిత సామ్రాజ్యాన్ని స్థాపించడం ఇతడి లక్ష్యం. ఆనాటి రాజుల అనైక్యత ఆధారంగా చేసుకొని అనేక రాజ్యాలను ఓడించి కొల్లగొడుతూ హత్యలు, అత్యాచారాలు, మత మార్పిడులు కొనసాగించాడు. 1000 సంవత్సరం నాటికి భారతదేశంలో ప్రవే శించాడు. మన దేశం మీద 17 సార్లు దండయాత్రలు సాగించిన గజనీ ప్రతీసారి పట్టణాలు, ఆలయాలతో సహా దోచుకొని తన దేశానికి తరలించాడు. మధురతోపాటు అనేక ఆలయాలను ధ్వంసం చేసి అపార సంపదను కొల్లగొడుతూ వచ్చాడు. గజనీ మహమ్మద్ దృష్టి సోమనాథ్ ఆలయం మీద పడింది.
గజనీ తొలిసారి దండయాత్రకు వచ్చినప్పుడు ఆ ప్రాంత ప్రజలు.. అక్కడి సామంత రాజులు కలిసికట్టుగా ప్రతిఘటించారు. రాజపుత్రరాజు భోజుడు భారీ సైన్యంతో వచ్చి విరుచుకుపడటంతో గజనీ సైన్యం పారిపోయింది. రెండోసారి గజనీ మార్గం మార్చాడు. సింధ్ ప్రాంతం మీదుగా ధార్ ఎడారి మార్గంలోనే దొంగచాటుగా దాడి చేశాడు. ఈ దాడిని ప్రతిఘటించిన 50 వేల మంది ప్రాణ త్యాగం చేశారు. గజనీ మహమ్మద్ స్వయంగా విగ్రహాన్ని ముక్కలు చేసి అపవిత్రం చేశాడు. జ్యోతిర్లింగాన్ని కాపాడటానికి అక్కడ పూజారులు బ్రాహ్మణులు చేయని ప్రయత్నం లేదు. పెద్ద ఎత్తున బంగారం ఇస్తామని… విగ్రహాన్ని మాత్రం ఏమీ చేయవద్దని ప్రాధేయపడ్డారు. గోడలను తొలిచి పొదిగిన రత్నాలు, బంగారు.. వెండి ఆభరణాలను దోచుకొన్నాడు. ఈ సంపదనంతా తన రాజ్యం గజనీకి తరలించాడు. ఆ రోజు జనవరి 6,1026.. (సోమ నాథ క్షేత్రం మీద దండయాత్ర జరిగి 2026కి వేయి సంవత్సరాలు పూర్తయింది). సోమనాథ్ మందిరం ఏ విధంగా ముస్లిం దోపిడీదారుల దాడులకు గురైందో కె.ఎం మున్షీ ‘జై సోమనాథ్’ చారిత్రక నవలలో చూడవచ్చు (భండారు సదాశివరావు అదే పేరుతో తెనిగించారు).
సోమనాథ్ ఆలయ చరిత్రను గమనిస్తే ఇప్పటి వరకూ ఆరుసార్లు దాడులకు గురై మళ్లీ నిర్మాణం జరిగింది. మాల్వా రాజు భోజి, చోళంకి రాజు భీమ్‌దేవ్ 1026-1042ల మధ్య తిరిగి నిర్మించారు. కుమరపాలుడు చేత 1143-1172ల మధ్య కాంలో కొయ్యతో పునర్నిర్మితమైంది. అతడు సోమనాథ్ ఆలయాన్నీ, ప్రభాస పట్టణాన్నీ పూర్తిగా పునరుద్ధరించాడు. 1296లో సుల్తాన్ అల్లాయుద్దీన్ ఖిల్జీ సైన్యాలు మరోసారి ఆలయాన్ని కూల్చేశాయి. 1308లో సౌరాష్ట్ర రాజు మహీపాదావ తిరిగి నిర్మించారు. 1326-1351 మధ్య ఈ ఆలయంలో లింగ ప్రతిష్ఠ జరిగింది. 1375లో ఈ ఆలయం మరొకసారి సుల్తాన్ మొదటి ముజాఫర్ షాహ్ కూల్చాడు.1451లో ముహమ్మద్ మళ్లీ కూల్చి వేశాడు. మరమ్మతులకు వీలుకానంతగా ధ్వంసం చేయమంటూ మొగల్ చక్రవర్తి ఔరంగజేబు ఇచ్చిన ఆదేశాలతో 1701లో ఆఖరిసారి ధ్వంసం చేశారు. ఆ శిథిలాలతో ఔరంగజేబు మసీదును నిర్మించాడు. 1783లో ఇందోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ సోమనాథ్ సమీపంలో తాత్కాలిక పూజల కోసం ఆలయం నిర్మించారు.
సగర్వంగా పునర్నిర్మాణం
1026లో మొదలైన దండయాత్ర, ఇతరులను కూడా ప్రేరేపించింది. దేశ ప్రజలను, సంస్కృతిని దాస్య శృంఖలాల్లో బంధించే ప్రయత్నాలకు నాంది పలికింది. కానీ, దాడి జరిగిన ప్రతి సందర్భంలోనూ రక్షణ కుడ్యంలా నిలిచి, ఆత్మార్పణకూ వెరవని వీరపుత్రులు, పుత్రికలు ఎందరో ఉన్నారు. స్వామి వివేకానంద 1890 దశకంలో సోమనాథ్‌ను సందర్శించినపుడు అనిర్వచనీయ అనుభూతికి లోనయ్యారు. సోమనాథ్ క్షేత్రం వంటివి మనకెంతో విజ్ఞానాన్ని అందిస్తాయని, పుస్తకాల్లో లేని చరిత్రను చెబుతాయని పేర్కొన్నారు. ఈ దేవాలయాలు అనేక దాడులను తట్టుకుని కూడా ఎలా తలెత్తుకు నిలిచి ఉన్నాయో గమనించడం ఒక అద్భుతం. అదే జాతీయ మనస్సు, అదే జాతీయ జీవన ప్రవాహం. దానిని అనుసరించండని సందేశం ఇచ్చారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. సోమనాథ్ జునాఘడ్ సంస్థానంలో ఉండేది. అక్కడి జనాభాలో 80 శాతానికి పైగా హిందువులున్నప్పటికీ సంస్థానాన్ని నవాబు పాకిస్తాన్‌లో కలిపేందుకు ప్రయత్నించారు. తొలి హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ దీన్ని వమ్ముచేసి నవంబర్ 9,1947న భారత్‌లో విలీనం చేశారు. దీపావళి రోజున సర్దార్ పటేల్ సోమనాథ్‌లో పర్యటించారు. అక్కడి పరిస్థితులను చూసి చలించి పోయారు. పురాతన కాలంలో ఉన్న చారిత్రాత్మకమైన మందిరం ఉన్న స్థంలో ఆలయాన్ని పునర్నిర్మి స్తామని, జ్యోతిర్లింగాన్ని పునః ప్రతిష్ఠింపజేస్తామని ప్రకటించారు. కానీ ప్రధాన మంత్రి ప్రతిఘటించారు. విద్యామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఈ మందిరాన్ని పురావస్తు శాఖకు ఇవ్వాలని సూచించారు. ఇందుకు పటేల్ అంగీకరించలేదు. ‘ఈ మందిరానికి సంబంధించి హిందువుల మనోభావాలు బలంగా విస్తరించి ఉన్నాయి. కేవలం మందిరాన్ని పునరుద్ధరించడం ద్వారా ప్రజల మనోభావాలకు ఊరట కలగదు. ఈ మందిరంలో విగ్రహాన్ని పునరుద్ధరిస్తేనే హిందువుల గౌరవాన్ని, మనోభావాల్ని కాపాడినట్లు అవుతుంది’ అన్నారు. మందిర పునర్నిర్మాణాన్ని మహాత్మాగాంధీ పూర్తిగా సమర్థించడమే కాక ఆశీర్వాదాలు కూడా అందజేశారు. అయితే మందిర పునర్నిర్మాణానికి నిధులు ప్రభుత్వం ఖజానానుండి కాక ప్రజలనుండి సేకరించాలని సూచించారు. పనులను పర్యవేక్షిం చేందుకు కేంద్రమంత్రిగా ఉన్న కేఎం మున్షీ ఆధ్వర్యంలో ఓ కమిటిని నియమించారు. ఇంతలో డిసెంబర్ 15,1950న సర్దార్ పటేల్ అకాల మరణంతో ఆటంకాలు మొదలయ్యాయి.
కొత్త మందిరాన్ని ప్రారంభించి, జ్యోతిర్లింగాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించేందుకు తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేందప్రసాద్‌ను మున్షీ ఆహ్వానించారు. నెహ్రూ మాత్రం రాష్ట్రపతి వెళ్లేందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. ‘నన్ను ఆహ్వానిస్తే ఒక మసీదుకైనా, చర్చికైనా వెళతా. భారతీయ లౌకిక వాదంలోని ఉద్దేశం అదే. మన రాజ్యం మత వ్యతిరేకం కాదు. మతం లేనిదీ కాదు’ అని చెప్పారు. సోమనాథ మందిర పునర్నిర్మాణాన్ని జాతీయ విశ్వాసానికి ప్రతీకగా రాష్ట్రపతి అభివర్ణించారు. అలా మే11, 1951న సోమనాథ్‌లో భవ్యమైన ఆలయ ద్వారాలు 75 ఏళ్ల నాడు భక్తుల కోసం తెరచుకున్నాయి. సోమనాథ్ పునర్‌నిర్మాణం హైందవ చైతన్యం, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. అయోధ్యలో రామమందిర పునర్నిర్మాణా నికి కూడా ప్రేరణ అయింది. అయోధ్య రథయాత్రను బీజేపీ నాటి అధ్యక్షుడు లాల్‌కృష్ణ ఆడ్వాణీ సెప్టెంబర్25, 1990న సోమనాథ ఆలయంలో పూజలు చేసి ప్రారంభిం చారు. అయోధ్య ఉద్యమం సోమనాథ్ స్ఫూర్తికి కొనసాగింపు అని వెల్లడించారు.
సోమనాథ్ ఆలయం మీద 1026లో మొదటి దాడి జరిగి వెయ్యేళ్లు గడిపోయాయి.. సోమనాథ్ వద్ద సాగరం నేటికీ అంతే గంభీరంగా గర్జిస్తోంది. సోమనాథ్ తీరాన్ని తాకే అలలు అద్భుతమైన కథలను చెబుతున్నాయి. నిరంతర దాడులను ఎదుర్కొన్న సోమనాథ ఆలయం మళ్లీ మళ్లీ సగర్వంగా నిలిచి నేడు కోట్లాది భారతీయులు, హిందువుల స్వాభిమానా నికి, ధైర్యానికి నిర్వచనంగా నిలుస్తోంది.
నాటి దురాక్రమణదారులు గాలిలో కలిసిన ధూళి కణాలయ్యారు. కాలగర్భంలో కలిసి పోయారు. సోమనాథ్ క్షేత్రం మాత్రం దివ్యత్వానికి ప్రతీక. దిగంతాలకు అతీతంగా దేదీప్యమై వెలుగులు విరజిమ్ముతోంది. చారిత్రక వైభవానికి సాక్షీభూతంగా నిలిచిన సోమనాథ్ క్షేత్రాన్ని జనవరి 11 తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందర్శించారు. ఆలయాన్ని ధ్వంసం చేసి వెయ్యేళ్లు అవుతున్న సందర్భంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ నిర్వహించారు.

క్రాంతిదేవ్ మిత్ర
సీనియర్ జర్నలిస్ట్