ఏకాత్మ మానవ దర్శనం చేసిన మహనీయుడి జీవితం విషాదాంతం కావడమే గొప్ప విషాదం. ఫిబ్రవరి 11, 1968న ఆ మహనీయుని భౌతిక కాయం వారణాసి సమీపంలోని మొగల్‌సరాయ్‌ రైల్వే స్టేషన్‌ వద్ద లభించింది. ఇప్పుడు ఆ స్టేషన్‌ను పండిత్‌ దీనదయాళ్‌ జంక్షన్‌ అని పిలుస్తున్నారు. ఆయన సీల్డా ఎక్స్‌ప్రెస్‌ రైలులో లక్నో నుంచి పట్నా వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. అప్పుడు ఆయన వయసు 51 సంవత్సరాలు. భరత్‌లాల్‌, రామ్‌ అవధ్‌ అనే ఇద్దరు ఆయన వద్ద నుంచి విలువైన వస్తువులు లాక్కుని బోగీ నుంచి నెట్టివేశారని నమ్ముతు న్నారు. ఆ రాత్రి 2.10కి ఆయన కనిపించకుండా పోయారు. తరువాత ఆయన భౌతికకాయం కనిపించింది. 58 ఏళ్లు గడిచినా ఆయన మరణ కారణాలు ఇంతవరకు స్పష్టం కాలేదు. ఈ హత్యో దంతం మీద నాటి కేంద్రం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. వాళ్లు తేల్చినదేమిటంటే, చిల్లర దొంగలు ఆయన వద్ద ఏదో ఆశించి, ప్రతిఘటించే సరికి బోగీ నుంచి గెంటివేశారు. అప్పటికి ఆయన జనసంఘ్ అధ్యక్షుడు. అరెస్టయిన భరత్‌లాల్‌, రామ్‌ అవధ్‌లను కూడా సరైన సాక్ష్యాలు లేక హత్య ఆరోపణలను కోర్టు కొట్టి వేసింది. తరువాత ప్రజాగ్రహం, 70మంది పార్లమెంటు సభ్యుల డిమాండ్‌ మేరకు ప్రభుత్వం జస్టిస్‌ వైవీ చంద్రచూడ్‌ నాయకత్వంలో కేసును మరింత లోతుగా పరిశీలించేందుకు నియమించింది. ఈ కమిటీ నివేదిక కూడా సీబీఐ దర్యాప్తు నివేదికనే పోలింది.

దీనదయాళ్‌ స్వతంత్ర భారతదేశంలో చింతనా పరులని చెప్పదగిన కొద్ది మంది రాజకీయవేత్తలలో ఒకరు. ఆయన ప్రజా జీవితం ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి ప్రారంభమైంది. 1951లో శ్యామాప్రసాద్‌ ముఖర్జీతో కలసి భారతీయ జనసంఘ్ స్థాపనలో భాగస్థు లయ్యారు. శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ తరువాత స్వయంసమృద్ధి, సాంస్కృతికవాదం, గ్రామీణ ప్రజల వికాసం అనే అంశాలు ప్రాతిపదికగా ఆయన జనసంఘ్‌ను నడిపించారు. 1953 నుంచి 1968 వరకు అంటే తుదిశ్వాస వరకు ఆయన ప్రయాణం ఆ పార్టీలోనే సాగింది. ఇప్పుడు బీజేపీ ఆశ్రయించిన ఆత్మనిర్భర భారత్‌ నినాదం ఆయన ప్రతిపాదించిన ఏకాత్మ మానవ దర్శనంలోనిదే. ఆయన పేరుతోనే పిలుస్తున్న పథకాలు – దీనదయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజన, దీనదయాళ్‌ గ్రామజ్యోతి యోజన. గ్రామీణ యువత సాధికారత గురించి దీనదయాళ్‌ యోచించారు.

(జాగృతి, ఫిబ్రవరి 19, 1968)

సెప్టెంబర్‌ 25, 1916న మధుర జిల్లా (ఉత్తరప్రదేశ్‌) నాగ్లాచంద్ర భాను దీనదయాళ్‌ జన్మించారు. సికార్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. సికార్‌ మహారాజా ఉపాధ్యాయకు బంగారు పతకం, రూ. 250 విలువ చేసే పుస్తకాలు, నెలకు పది రూపాయలు విద్యార్థి వేతనం ఇచ్చారు. పిలానీలో ఇంటర్మీడియెట్‌ డిస్టిక్షన్‌లో ఉత్తీర్ణులయిన దీనదయాళ్‌ బీఏలో చేరడానికి కాన్పూర్‌ వెళ్లారు. అక్కడి సనాతన ధర్మ కళాశాలలో చదువుతుండగానే ఆయన మిత్రుడు బల్వంత్‌ మహాశాబ్దే ప్రోద్బలంతో 1937లో ఆర్‌ఎస్‌ఎస్‌కు చేరువయ్యారు. అదే సంవత్సరం బీఏలో బంగారు పతకం సాధించిన దీనదయాళ్‌ తరువాత ఎంఏ చేయడానికి ఆగ్రా వెళ్లారు. ఇక్కడే ఆయనకు నానాజీ దేశ్‌ముఖ్‌, భావూ జుగాడే పరిచయ మయ్యారు. అక్కడ ఉండగానే సోదరి వరస అయిన రమాదేవి అనారోగ్యంతో మరణించారు. దీనితో ఆయన ఎంఏ పరీక్షకు హాజరు కాలేకపోయారు. దీనితో సికార్‌ మహారాజా విద్యార్థి వేతనం రద్దుయింది. చదువు ఆగిపోయింది. తరువాత పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులై బీటీ కోసం ప్రయాగ వచ్చారు. అక్కడ నుంచి ఆయన పూర్తి సమయం ప్రచారక్‌గా మారారు. ఆయన లక్నోలో రాష్ట్రధర్మ పత్రిక స్థాపించారు. తరువాత పాంచజన్య వారపత్రిక ప్రారంభించారు.

 నెహ్రూ-లియాఖత్‌ అలీ ఒప్పందానికి నిరసనగా డాక్టర్‌ శ్యామాప్రసాద్‌ ముఖర్జీ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. తరువాత గురూజీ సహకారంతో దీనదయాళ్‌ తదితరులతో కలసి భారతీయ జనసంఘ్ ను స్థాపించారు.  వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ ముఖర్జీ కశ్మీర్‌లోను (1953), పదో అధ్యక్షుడు దీనదయాళ్‌ ఉత్తరప్రదేశ్‌లోను (1968) హత్యకు గురయ్యారు.

– జాగృతి డెస్క్‌

About Author

By editor

Twitter
YOUTUBE