భారతీయ జనతా పార్టీ నిబంధనావళి (రాజ్యాంగం)లోని 3వ అధికరణం ప్రకారం పండిత్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయ రూపొందించిన ఏకాత్మ మానవ దర్శనాన్ని సంస్థ తన మౌలిక సిద్ధాంతంగా ప్రకటించుకుంది. కొన్ని శతాబ్దాలు దురాక్రమణదారుల పాలనలో ఉండి, శతాబ్దాల పాటు వాటికి వ్యతిరేకంగా జరిపిన పోరాటాల ద్వారా విముక్తమైన దేశం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయమిది. దిగుమతి చేసుకున్న సిద్ధాంతాలతో, రాజకీయ ప్రయోగాలతో తల్లడిల్లుతున్న ప్రజానీకానికి ఆ నిర్ణయం గొప్ప సాంత్వన. భారతీయ జనసంఫ్‌ు అనే రాజకీయ పక్షం భారతదేశంలో ఆవిర్భ వించడం వెనుక విస్తృత నేపథ్యం ఉంది. తరువాత అదే భారతీయ జనతా పార్టీగా మార్పు చెంది, అధికారం చేపట్టడం వెనుక కూడా ఘనమైన భూమిక ఉంది. వాటి కల ఏకాత్మ మానవ దర్శనం. నాటి జనసంఫ్‌ు గుర్తు దీపం. ఇవాళ్టి బీజేపీ గుర్తు కమలం. దీపం ఇచ్చిన ఏకాత్మ మానవ దర్శనం అనే వెలుగులో కమలం వికసిస్తున్నది.

అటల్‌ బిహారీ వాజపేయి, నరేంద్ర మోదీల నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అవే దేశంలో గుణాత్మకమైన మార్పునకు నాంది పలికాయి. ఇక్కడ విలసిల్లిన నాగరికత, రాజకీయ చింతన, విలువలు పునాదిగా స్వతంత్ర భారతదేశానికి అభివృద్ధి నమూనాలను స్వీకరించిన తొట్టతొలి ప్రభుత్వాలు అవి. ఆ నమూనాను ఇచ్చినదే ఏకాత్మ మానవ దర్శనం. దాని రూపశిల్పి పండిత్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయ. స్వాతంత్య్రం వచ్చిన తరువాత జాతీయ విధానాలన్నింటిని దిగుమతి చేసుకున్న సిద్ధాంతాలు శాసించాయి. సుదీర్ఘ కాలం పాలించినప్పటికీ, తన రాజకీయ ఆదర్శం గాంధీజీయే అని చెప్పుకున్నప్పటికీ కాంగ్రెస్‌ ఆయన ప్రవచించిన హింద్‌ స్వరాజ్‌ను తన అభివృద్ధి పంథాకు ఏనాడూ నమూనాగా స్వీకరించలేదు. దేశ పునర్‌ నిర్మాణంలో భారతీయత పునాదిగా ఉండాలని హింద్‌ స్వరాజ్‌ సిద్ధాంతం ఆశించింది. నాటి, నేటి బీజేపీ ప్రభుత్వాలు పాలనకు ఏకాత్మ మానవ దర్శనాన్ని కేంద్ర బిందువుగా ఎంచుకున్నాయి. అభివృద్ధి అంటే ఆర్థికాభివృద్ధి మాత్రమే కాదు, మనిషి నైతిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక పురోగతి కూడా అని నమ్ముతుంది ఈ దర్శనం. ఆధునికత రూపురేఖలను సంప్రదాయమే నిర్దేశించాలని చెబుతుంది. ప్రపంచంతో పోటీ పడడం అనేది స్వావలంబనతోనే జరగాలని అంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే భారతీయ మూలాలతోనే దేశ నిర్మాణం సాగాలని కోరుతుంది. ఆ ఇద్దరు బీజేపీ ప్రధానుల ముఖ్య ఆశయాలు – గ్రామీణ, పట్టణ అంతరాల తొలగింపు; అంత్యోదయ, స్వావలంబన, సమగ్ర దేశ నిర్మాణం – ఏకాత్మ మానవ దర్శనం నుంచి వచ్చినవే. పౌరుడి ఆత్మ గౌరవం, కనీస వసతుల కల్పన ఆ సిద్ధాంతం ఇచ్చిన స్ఫూర్తి ఫలితమే.

భారతదేశం అంటే ప్రపంచ దేశాలకు ఒక కల్పన ఉంది. ఆ కల్పనకు మూలం మన చరిత్ర, సాంస్కృతిక వారసత్వం. ధర్మం పునాదిగా సాగిన జీవనం. విదేశీ పాలనలో సరే, స్వతంత్ర భారతదేశంలోను ఈ కల్పనకు గౌరవం దక్కకపోవడమే ఏకాత్మ మానవ దర్శన జననానికి కారణం. పాశ్చాత్య రాజకీయ చింతనలు` కమ్యూనిజం, సెక్యులరిజం, వ్యక్తివాదం (ఇండివిడ్యువలిజం) వంటి సిద్ధాంతాలను ముందుకు తెచ్చాయి. స్వతంత్ర భారత తొలితరం పాలకులకు ఈ ‘ఇజా’ల మీద ఎనలేని భక్తిప్రపత్తులు ఉండేవి. భారత భవితవ్యం వీటితోనే తీర్చిదిద్దాలన్న భ్రమలు కూడా ఉండేవి. కానీ మనం పాశ్చాత్య సామ్రాజ్య వాదాలను నిరాకరిస్తున్నప్పుడు అక్కడి నుంచే దిగుమతి అయిన సిద్ధాంతాలను ఆశ్రయించడంలో అర్థం ఏమిటన్నదే పండిత్‌ దీనదయాళ్‌ ప్రశ్న. వాటి అనివార్యత మన భూమి మీద ఏమిటి అని ఆయన నిలదీశారు.

భారతదేశంలోని దాదాపు అన్ని రాజకీయ పక్షాల దృష్టి ఒకే విధంగా ఉండేది. ఆ పాశ్చాత్య ఇజాలను మనం ఆమోదించి తీరాలి. అంతకు మించిన ప్రత్యామ్నాయాలు లేవు. పాశ్చాత్యుల రాకతోనే మనలో జాతి భావన అంకురించింది. కాబట్టి మనది ఒక కొత్త జాతి. లేదా రూపొందుతున్న జాతి అనే ఆయా పార్టీల నిశ్చితాభిప్రాయం. కానీ చరిత్రను సమ్యక్‌ దృక్పథంతో చూసిన, సంస్కృతిని గౌరవ దృష్టితో వీక్షించిన భారతీయ జనసంఘ్, తరువాత భారతీయ జనతా పార్టీ ఈ సమాజాన్ని ఒక అజరామర, పురాతన వారసత్వం ఉన్న జాతిగా భావించాయి. నిజానికి భారతదేశంలోని సాంస్కృతిక జాతీయవాదం పాశ్చాత్యులు నిర్వచించే జాతిరాజ్యం కంటే పురాతనమైనదే కాదు, భిన్నమైనది. కాబట్టి వర్తమాన తరం చేయవలసినది, గుర్తించవలసినది మన పురాతన సంస్కృతీ సంప్రదాయాలు ప్రసాదిం చిన జ్ఞానంతోనే భావి భారతదేశాన్ని నిర్మించుకోవాలి. ఆ జ్ఞానమే భావిని తీర్చిదిద్దాలి.

జాతిని ఆవరించిన ఆత్మవిస్మృతి కారణంగా భావి భారత నిర్మాణానికి అనుసరించవలసిన చాలా పంథాలలో తడబాటు కనిపిస్తుంది. లోతుగా ఆలో చించకుండానే పాశ్చాత్య ఇజాలను స్వీకరించడం దాని ఫలితమే. కానీ అవి ఒకదానితో ఒకటి సంఘర్షిస్తూ ఉంటాయి. ఒక దేశంలో ఒక ఇజానికి ఉన్న అర్థం వేరొక దేశంలో మారిపోతూ ఉంటుంది.

కమ్యూనిజం చూడండి! ఇది ఒక దశలో ప్రపంచాన్ని శాసించింది. కానీ మనిషి ఆలోచనలను మొరటుబార్చింది. సాటి మనిషి మీద సమాజాల మీద ఉండవలసిన దృష్టిలో సున్నితత్వాన్ని నాశనం చేసింది. కారణం` హింసాపథమే పునాదిగా ఉన్న సిద్ధాంతమది. అదొక వైరుధ్యాల పుట్ట. దత్తోపంత్‌ ఠేంగ్డీ ఒక ఉపన్యాసం (కమ్యూనిజం` అపనీ హి కసౌటీ పర్‌)లో ఇలా చెప్పారు. అసలు కమ్యూనిజం అంటే ఏమిటో కమ్యూనిస్టులు తమతో తాము చర్చించుకోవాలన్నారు. చైనా వాళ్లది నిజమైన కమ్యూనిజం కాదంటుంది (నాటి) రష్యా. రష్యాది తప్పుడు తోవ అంటుంది చైనా. యుగోస్లోవియాది నిజమైన కమ్యూనిజం కాదని ఎలుగెత్తడానికి వీళ్లిద్దరూ ఏకమవుతారు. మన దేశంలో నంబూద్రి పాద్‌ను దారి తప్పిన కమ్యూనిస్టు అని డాంగే భావిస్తారు. ఈ ఇద్దరు చారు మజుందార్‌ నిజమైన కమ్యూనిస్టు కాదనడానికి ఏకమవుతారు. ప్రపంచ కార్మికుల ఐక్యతకు పిలుపునిచ్చిన కమ్యూనిస్టులు పార్టీలు రెండు కూడా ఏకం కాలేవు.

వీటన్నిటి సిద్ధాంతాలు కలిపిన పంచకూళ్ల కషాయాన్ని జాతి గొంతులో పోసే ప్రయత్నం మన తొలితరం స్వతంత్ర భారతదేశ రాజకీయ పక్షాలు చేశాయి. మానవుడి మీద వ్యక్తివాదం, సోషలిజాల దృష్టి ఏమిటి? ఆ దృష్టి పరస్పరం సంఘర్షిస్తుందన్నది వాస్తవం. వ్యక్తివాదాన్ని సోషలిజం శత్రువుగా చూస్తుంది. సోషలిజాన్ని వ్యక్తివాదం ప్రజా వ్యతిరేకిగా భావిస్తుంది. ఆ సిద్ధాంతాలు ప్రకృతి మీద మనిషి విజయమే ప్రధానంగా ఆశించాయి. కానీ మనం మనిషికీ, ప్రకృతికీ నడుమ పరస్పర గౌరవాన్ని ఆశిస్తాం. సమతౌల్యం అనివార్యమని అంటాం. అక్కడ రూపుదిద్దుకున్న సెక్యులరిజం ప్రజాజీవితానికి, దైవభావనకు సయోధ్య తేవడానికి బదులు భౌతిక వాదానికీ`మతానికీ, చర్చ్‌కీ` రాజ్యానికీ, మతానికీ` విజ్ఞానశాస్త్రానికీ మధ్య యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. ఇలాంటి వాతావరణాన్ని ఏనాడూ చూడని భారతదేశం మీద సెక్యులరిజాన్ని రుద్ది నిరర్ధకమైన, అవాంఛనీయమైన వాతావరణాన్ని తెచ్చి పెట్టారు. వాళ్లు మభ్య పెట్టిన తీరులో ఆ సెక్యుల రిజంలో సర్వమత సమ భావన కూడా కనిపించదు. సరికదా, సాంస్కృతిక వారసత్వంతో వర్తమానానికి ఉన్న, ఉండవలసిన బలమైన బంధాన్ని అది నీరసపరిచింది. ఆఖరికి సెక్యులరిజం బుజ్జగింపు రాజకీయాలకు రాజపోషకురాలైంది.

ఈ తమాషాలోని విధ్వంసాన్ని, శుష్క విన్యాసాన్ని గమనించి ప్రతిఘటించడానికి ఉద్యమిం చిన సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌. ఆ సంస్థ అందించిన మహత్తర మేధావి దీనదయాళ్‌ ఉపాధ్యాయ మన చరిత్ర, మనదైన దృక్పథం ఆధారంగా ఒక ప్రత్యా మ్నాయం కోసం ఆలోచించారు. అందుకు ఆయనను సంకల్పించే టట్టు చేసినది భారతీయ జనసంఫ్‌ు. దీనదయాళ్‌ స్వీకరించిన ఈ మహత్తర కర్తవ్యంలో సహకరించ డానికి నాటి జనసంఫ్‌ు నాయక శ్రేష్టులు, సోదర సంస్థల నేతలు, ఎందరో సాధారణ కార్య కర్తలు ముందుకు వచ్చారు. వారిలో దత్తోపంత్‌ ఠేంగ్డీ, ప్రభాకర్‌ పంత్‌, పట్వర్ధన్‌, ప్రొఫెసర్‌ జీబీ కానిట్కర్‌, రామదాస్‌జీ కలాస్కర్‌ వంటివారు ప్రముఖులు. ఈ కృషిని స్మరించుకునేటప్పుడు పూనా అభ్యాసవర్గ, (1959), గ్వాలియర్‌ అభ్యాస వర్గ (1964), సంఘ శిక్షావర్గ (1964) ప్రస్తావనకురావాలి. ఆయా సమావేశాలలో దీనదయాళ్‌ తన సిద్ధాంత ముసాయి దాను ఏకాత్మ మానవతావాదం (ఇంటెగ్రల్‌ హ్యూమనిజం) పేరుతో చర్చకు పెట్టారు. తరువాత 1965 నాటి విజయవాడ జనసంఫ్‌ు మహా సభలు పార్టీ మౌలిక రాజకీయ సిద్ధాంతంగా స్వాగతించాయి. తాను ఈ సిద్ధాంతంలో కొత్తగా ప్రవేశపెట్టినదేమీ లేదని విజయవాడలో పండిత్‌ దీనదయాళ్‌ సవిన యంగా చెప్పుకోవడం కనిపిస్తుంది. కానీ మన ధార్మికధారలోని, సాంస్కృతిక వారసత్వంలోని విషయాలను ఎలా ఒక ఆధునిక సమగ్ర రాజకీయ చింతనగా వారు ఆవిష్కరించారో, బానిసత్వం నుంచి బయటపడిన దేశానికి మార్గదర్శకంగా మలిచారో గమనించాలి.

విజయవాడ (1965) సభల తరువాత ఆ సిద్ధాంత మూలాల గురించి బొంబాయిలో దీనదయాళ్‌ నాలుగు ఉపన్యాసాలు ఇచ్చారు. అవి చరిత్రాత్మకమైనవి. స్వతంత్ర భారత రూపురేఖల గురించిన కల్పన బాలగంగాధర తిలక్‌ ‘గీతారహస్య’, గాంధీజీ ‘హింద్‌ స్వరాజ్‌’లలో చూడవచ్చు నంటారా యన. భారత జాతీయ కాంగ్రెస్‌, ఇతర పార్టీలు చేసిన తీర్మానాలలోను ఈ భావన కనిపిస్తుంది. కానీ అవి శతాబ్దాల బానిసత్వంలో భారతావనికి తగిలిన గాయాలను మాన్పడానికి ఉపకరించే స్థాయిలోనివి కావు. నాడు మొదట దేశాన్ని విదేశీ పాలన నుంచి విముక్తం చేయడమే ప్రధాన నినాదమైంది. తీరా స్వరాజ్యం వచ్చింది. ఒకటిన్నర దశాబ్దం గడిచినా పునర్నిర్మాణానికి మూల సూత్రం ఏదీ అవతరించ లేదు. పైగా విదేశీయులను పోరాడి పంపించేశాం. కాబట్టి జీవితాల మీద, ఆలోచనల మీద వాళ్ల ప్రభావం తగ్గిపోవాలి. అందుకు విరుద్ధంగా, పెరిగింది. అంధానుకరణ ఎక్కడికీ పోలేదు. వేదాలు, ఉపనిషత్తులు, గీత, పురాణాల సంగతి, కౌటిల్యుడి గురించి విస్మరించి, మిల్‌, హెగెల్‌, ఆడమ్‌ స్మిత్‌, మార్క్స్‌, ఏంగెల్స్‌ అంటూ పాశ్చాత్య తత్త్వవేత్తలను జపించారు. ఈ అసంబద్ధత గురించే దీనదయాళ్‌ జీవితమంతా మథించారు. ఏకాత్మ మానవ దర్శనాన్ని ప్రతిపాదించడానికి ముందు పాంచజన్య, రాష్ట్రధర్మ పత్రికలకు రాసిన వ్యాసాలలోను, రాష్ట్ర చింతన్‌, రాష్ట్ర జీవన్‌కీ దిశా పుస్తకాలలోని వారి వ్యాసాలలోను, ఆర్‌ఎస్‌ఎస్‌ శిబిరాలలో ఇచ్చిన ప్రసంగాలలోను ఈ సిద్ధాంతం ఛాయామాత్రంగా దర్శనమిస్తూనే ఉంటుంది. దీనదయాళ్‌జీకి ప్రీతిపాత్ర మైన దైశిక్‌ శాస్త్ర (బద్రీషా తుల్ధారియా రచన) పుస్తకంలోను ఆ సిద్ధాంత ఛాయలు కనిపిస్తాయి.

 1975-77 మధ్య దేశాన్ని అతలాకుతలం చేసిన దేశ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా భారతీయ జనసంఫ్‌ు పాత రూపాన్ని త్యాగం చేసి, కొత్త పాత్ర ధరించవలసి వచ్చింది. దేశమే సర్వోత్కృష్టం అని మనసావాచా నమ్మే జనసంఫ్‌ు భారతీయ జనతా పార్టీగా అవతరించింది అందుకే. జనసంఫ్‌ుకు, బీజేపీకి నడుమ స్వల్ప మార్పులు ఉన్నా, ఏకాత్మ మానవదర్శనం విషయంలో దృష్టి మారలేదు. 1980లో ఏర్పడిన బీజేపీ 1985లో ఏకాత్మ మానవ దర్శనమే తమ మౌలిక రాజకీయ చింతనగా ప్రకటించుకుంది.

సిద్ధాంతానికి పెట్టిన పేరే ఆ చింతనలోని ఆత్మను మన ముందు ఉంచుతుంది. అది ఏకాత్మ మానవ దర్శనం. అది వ్యవస్థకీ, వ్యక్తికీ నడుమ సంఘర్షణను ఊహించదు. సృష్టించాలనీ అనుకోదు. వ్యవస్థకీ` వ్యక్తికీ; మనిషికీ`ప్రకృతికీ నడుమ కూడా ఏకాత్మను దర్శిస్తుంది. ఈ దృష్టినే మన సంస్కృతిలో ధర్మం అని గౌరవించుకుంటున్నాం.

అటల్‌జీ, మోదీజీ అందించిన ఎన్నో పథకాలు ఏకాత్మ మానవ దర్శనం స్ఫూర్తితో రూపు దిద్దుకున్నవే. ఆ సిద్ధాంతం వారి పాలన మీద చూపిన ప్రభావం నిరుపమానమైనది. అంత్యోదయ అన్నయోజన, సర్వశిక్ష అభియాన్‌, ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన, జాతీయ రహదారుల అభివృద్ధి, కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్స్‌, గిరిజన అభివృద్ధి మంత్రిత్వ శాఖ, వాల్మీకి అంబేడ్కర్‌ ఆవాస్‌ యోజన, సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్‌ యోజన, ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన, పీఎం ఉజ్జ్వల్‌ యోజన, ఆయుష్మాన్‌ భారత్‌, ముద్రా యోజన, స్వచ్ఛభారత్‌, అటల్‌ పెన్షన్‌ యోజన, దీనదయాళ్‌ అంత్యోదయ యోజన, పీఎం కిస్మాన్‌ సమ్మాన్‌ నిధి, ఆత్మ నిర్భర భారత్‌, జల్‌జీవన్‌ మిషన్‌, విశ్వకర్మ యోజన.. ఇంకా ఎన్నో! ఇవన్నీ భావి భారతాన్ని క్రమపద్ధతిలో నిర్మిస్తున్న సంగతి తిరుగు లేని వాస్తవం. అందుకు నిదర్శనమే పార్టీకి దక్కుతున్న విజయాలు.

ఫోటోలు: ‘జాగృతి’ 19.02.1968 నుంచి

– పీవీఎన్‌ మాధవ్‌

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ

About Author

By editor

Twitter
YOUTUBE