1965 నాటి విజయవాడ జనసంఘ్ మహాసభలపై జాగృతి 08.02.1965 వెలువరించిన సమీక్ష

విజయవాడ జనసంఘ మహాపభలు ప్రజానీకానికొక నూతనానుభవం. రాజకీయ మహాసభలంటే ప్రజానీకానికి కొన్ని నిశ్చితాభిప్రాయా లున్నాయి. కాంగ్రెసు మహాసభలంటే లక్షలాది వ్యయం, అధికార వినియోగం, పోలీసుమయమైన వాతావరణం. కమ్యూనిస్టు మహాసభలంటే తడికల మాటున ఏవేవో చర్చలు, బహిరంగంగా భారీ ఎత్తున సభ. కాంగ్రెసు ఊరేగింపంటే ఎడ్లబండ్ల ఊరేగింపు, ఊరంతా కాగితాల అంటింపు. లేదా జనం రోడ్ల ప్రక్కన మూగి ఉంటే ఏ ప్రధానమంత్రో కారులో నమస్కరిస్తూ వెళ్లిపోవడం. కమ్యూనిస్టుల ఊరేగింపంటే పార్టీకి చెందినవారు, చెందనివారు కూలీకి నినాదాలు చేసుకుంటూ వెళ్లడం. ఇవీ సర్వసామాన్యంగా ఉన్న అభిప్రాయాలు.


జనసంఘ మహాసభలు, ఊరేగింపు ఎలా ఉంటాయనేది ఇంతకు పూర్వం స్థానిక ప్రజానీకానికి ఊహలో లేని విషయమేగాని, నేడు వారి అనుభవం లోకి వచ్చిన విషయమది.

అధికార వినియోగం అనేది లేకుండా కేవలం స్వశక్తి మీద ఆధారపడి జనసంఘ నాయకుల సంచాలకత్వం, యువకుల కార్యశక్తి, ప్రజల సహకారం మీద ఆధారపడి నిర్వహించుకున్న కార్యక్రమమిది. తంతితపాల, విద్యుచ్చక్తి, రైల్వే మున్నగు ప్రభుత్వ శాఖలు, మున్సిపల్‌ అధికార్లు తమ బాధ్యత మేరకు పరిమిత సహకారం ఇచ్చారు. ఆయా శాఖల వారు కాంగ్రెసు సభలకు వళ్లు విరుచు కున్నంతగా వళ్లు విరుచుకొనడం, బలవంతాన పని చేయవలసి రావడం ఇత్యాదులు లేకుండా ప్రాణానికి హాయిగా పనిచేసి, ‘మనం ఒకరికి సహకరించాం’ అనే సంతృప్తితో, సంతోషంతో వెళ్లే అవకాశం కల్గింది. పోలీసు శాఖ అనుభవం కూడా అదే. ఆ విషయాన్ని కొందరు అధికార్లు స్వయంగా వ్యక్తంచేశారు కూడా.

రాజకీయ మహాసభలంటే లక్షల ఖర్చుండాలనే దుబారా భావనకు సవాలు ఈ మహాసభ. కనీసం ఒక లక్ష కూడా ఖర్చు లేకుండా అత్యంత నిరాడంబ రంగా, కాని వైభవంగా అందంగా, శోభాయ మానంగా, ప్రయోజనాత్మకంగా జరిగిన సభలివి. కేవలం అరే ఆరు రూపాయలతో స్వంతంగా భోజన పుటేర్పాట్లు జరిగాయి. వడ్డన కూడా ప్రతినిధులే నిర్వహించారు. ఎం.ఏ.లు, ఎం.ఎల్‌.ఏ.లు నాయకులు నైతం నడుం బిగించి వడ్డన చేస్తుంటే కలిగే ఆ సంతృప్తి, ఆ అనందం, ఆశ్చర్యం, ఆదర్శం అనుభవించవలసినట్టివి. నేతృత్వం వహించడం, అనుసరించడం అనే అంశంలో తప్ప మిగిలిన వ్యవహారాలలో నాయకులు, అనుచరులు అనేక అంతస్థులు లేని శిబిర జీవితం ఆది. కాంగ్రెసు సభలలో ఒక్కొక్క నాయకుడు స్వంత వంట మనుషు లతో సభలకు విచ్చేసిన సందర్భాలుండగా ఇక్కడ జనసంఘ అధ్యక్షులు సైతం శిబిరంలో ఒక విభాగంలో నివసించారు. గౌరవం, హోదా, అంతస్థులనేవి ప్రతినిధులకు దూరంగా ఉండటం లేదని ప్రతినిధులతో కలిసిమెలసి ఉంటూనే వారికి నేతృత్వం వహించడంలా ఉంటుందనిపించింది.

సభామంటపం విషయానికి వస్తే అది నిరాడంబ రమైన విశాలమైన పందిరి. ప్రశాంత వాతావరణం కల్గిస్తూ స్వచ్ఛమైన తెల్లగుడ్డ పందిరి నిండా వేశారు. వేదిక వెనుక భాగాన భారతీయ మహిళామణి చంకన బిడ్డతో నిలచి ఉంటుంది. ఆమెకు ఇరు పార్శ్వము లందు గల విశాల మైదానంలో మన వ్యవసాయము, పరిశ్రమల రంగాలను సూచించారు. 23వ తేదీ నేతాజీ, వివేకానందల జన్మదినం కావడాన వారి పెద్ద తైలవర్ణ చిత్రాలు రెండు వేదిక ముందుభాగాన ఉంచారు. జనసంఘ నాయకులైన కీ.శే. డా. ముఖర్జీ, డా.రఘువీరల పెద్ద తైలవర్ణ చిత్రాలు వేదిక వెనుక భాగంలో ఉంచారు.

23వ తేదీ ఉదయం వేదమంత్రోచ్చారణల మధ్య అఖండ జ్యోతిని అధ్యక్షుడు వెలిగించడం, ఆ తర్వాత వందేమాతరం ప్రార్థనతో ప్రారంభమైన సమావేశాలు ఆ వేదికపై 28 సాయంత్రం వరకు జరిగాయి. 23, 24 మహాసభలు జరిగాయి, 25, 26 ప్రతినిధుల చర్చలు జరిగాయి. మహాసభలలో దేశాన్ని ప్రభావితం చేసే ప్రతి ముఖ్య సమస్య చర్చకు వచ్చి, తీర్మానాలు వెలువడ్డాయి. అంతకుపూర్వం 21,22 తేదీలలో ఆఖిల భారత కార్యవర్గం.. ఆర్థిక విధానం, విదేశాంగ విధానం, భాషా విధానం, ఆంతరంగిక పరిస్థితి మున్నగు ముఖ్య విషయాలన్నిటిపైన తీర్మానాలు చేసింది. వాటిని మహాసభవారు చర్చించి ఆమోదించారు. కార్యవర్గం ప్రతిపాదించింది కనుక మిగిలినవారు కేవలం చేతులెత్తే ఆమోదంకాదది. ప్రతి విషయాన్ని సమగ్రంగా చర్చించి ఆమోదిం చడం. అలాగే కార్యవర్గం కూడా తాను చెప్పిందే వేదవాక్కు అన్నట్లు వప్పించే పరిస్థితి కూడా కాదు. ప్రతినిధులనుండి చక్కని సూచనలు వచ్చినప్పుడు అవి కార్యవర్గ తీర్మానాన్ని మరింత అందం చేసే అవకాశం ఉన్నప్పుడు దానిని స్వీకరించే ప్రజాస్వామిక ధోరణి అది. భాషా తీర్మానానికి సంబంధించి సంస్కృతానికి మానవీయ స్థానం ఇవ్వాలనే సవరణను స్వీకరించారు. ఈ ప్రతిపాదన అనధికార తీర్మానంగా మొదట వచ్చింది. దానిలోని విజ్ఞతను కార్యవర్గం, అన్యులు గుర్తించారు. అందుకే మూల తీర్మానంలో భాగంగా ఆమోదించి, ఏకగ్రీవంగా ఆమోదించారు. హిందీభాషకు సంబంధించిన సవరణను స్వీకరిం చారు. భాషావిధానం విషయంలో దేశంలో జనసంఘాన్ని అనేకమంది అపార్థం చేసుకున్నారు. కొందరు వ్యతిరేక ప్రచారం చేశారు. కాని జనసంఘ భాషా తీర్మానాన్ని సమగ్రంగా ప్రశాంతంగా తదివితే స్వభాషా వికాసానికి జనసంఘం ఎంత ఆతృత పడుతున్నదో అంత ప్రశాంతంగా కూడా ఆలోచిస్తున్నదని అర్థమవుతుంది. రాజకీయ తీర్మానంపై ప్రసంగించిన వారిలో స్వామి రామేశ్వరానంద ఒకరు. ఇంతకు పూర్వం జరిగిన ప్రచారాలను బట్టి ఆయన హేతువాదంలేని పట్టుదల మనిషిగా పేరుపడ్డారు. కాని ఆయన ప్రసంగం విన్న తర్వాత ఆభావం మారిపోయింది. తాను లోక్‌సభకు వెళ్లిన మొదటిసారి సభాకార్యక్రమాలను జాతీయభాషలో నిర్వహించాలని కోరితే సభావతి స్థానంలో కూర్చున్న సేఠ్‌ గోవింద దాన్‌ ‘‘స్వావిూ, నేడున్నస్థితిలో అది కష్టం. అందుకు విూరు పోరాడక తప్పదు’’. అన్నారట. దానివిూద స్వామి తను చమత్కరిస్తూ ‘‘నాకు జీవితమంతా పోరాటం తప్పలేదు. ఇక్కడ వచ్చి హాయిగా కూర్చుంటా ననుకుంటే ఇక్కడా తప్పలేదు’’ అన్నారు. విదేశాంగ తీర్మానం విషయంలో కూడా మలేసియా రక్షణ విషయంలో దానిలో భారత్‌ ఏకీభవిస్తున్న విషయాన్ని బహిరంగంగా వ్యక్తపరచాలని ప్రభుత్వాన్ని కోరే సవరణ కూడా స్వీకరించారు. ఈ విధంగా ప్రతి చిన్న విషయాన్ని సమగ్రంగా చర్చిస్తూ రెండురోజుల వ్యవధిలో చక్కని పది తీర్మానాలు చేశారు. మొత్తం రోజున్నరలో 14 గంటలు దీనిపై చర్చ జరిగింది. ఇదే రెండు రోజుల సమయంలో మొదటిరోజు మధ్యాహ్నం నుండి రాత్రి 11 గంటల వరకు ఊరేగింపు, ఆధ్యక్షోపన్యాసం వగైరాలు జరిగాయి, అంతేకాదు, రెండురోజు మధ్యాహ్నం 2 గంటలు మహిళాసభకు వినియోగమైంది. ఆ సమయంలో ఇటు ప్రధాన వేదిక వద్ద ఈ సమావేశం అవతల భోజన మండపంలో ప్రతినిధుల చర్చలు జరిగాయి. ఇదంతా చూచినప్పుడు కార్యక్రమాలు ఎంత నిర్విరామంగా జరిగిందీ, సమయం ఎంత పొదుపుగా, చురుకుగా వినియోగమైందీ అర్థమవు తుంది. చర్చల సరళిని చూస్తే విసుగు అనే ప్రశ్న లేకుండా ముఖ్యులైన ప్రతి ఒకరు భాగం వహించారు. ఇది రాజకీయ మహాసభలలో అద్భుత విషయం. గుంటూరులో ఇటీవల జరిగిన ఎ.ఐ.సి.సి. సభలలో రెండు రోజులలో ఈ తీర్మానాలు మాత్రం సాధ్యం కావడంతో దీనిని పోలిస్తే ఇది ఎంత ప్రశంసనీయ మైన విషయమో అర్థమవుతుంది.

25, 24 తేదీలలో జరిగిన ప్రతినిధుల సమావేశం చూసే మరింత ఆశ్చర్యము, ఆనందమూ కలుగుతుంది. సభల మొత్తంలో అతి ముఖ్య మైన, చారిత్రకమైన భాగం ఇది. భారత రాజకీయరంగంలో ఈ సంస్కృతిపై ఆధార పడిప ఏకాత్మ మానవతావాదం (Iఅ్‌వశ్రీస్త్రతీaశ్రీ నబఎaఅఱంఎ) (మొదటి పేరు) జనసంఘం ప్రతిపాదించిన మహాక్షణాలని, అంతకు పూర్వం అది వివిధ స్థాయిలలో ఏడాదిగా చర్చించి నేడు ప్రతినిధుల స్థాయిలో మళ్లీ చర్చకొచ్చి ఆమోదించిన మహా సిద్ధాంతమిది. 51 పుటలు గల ఈ సంపూర్ణ సిద్ధాంతం మొదటి నుండి చివరివరకు పరిశీలించాక ఆమోదానికి నోచుకుంది. సభలోవున్న 450 మంది ప్రతినిధులలో 150మంది వరకు చర్చలో పాల్గొన్నారు. దాదాపు 15 గంటలు చర్చ జరిగింది. చర్చల నిర్వహణ శ్రీ దీనదయాళ్‌ ఉపాధ్యాయ చేశారు. ఈ సిద్ధాంతాన్ని మొదట రచించినది కూడా వీరే. ఈ చర్చల వారి రాజకీయ పక్షాల చరిత్రలో అపూర్వం. నెహ్రూ బంట్లు కాంగ్రెస్‌ వంటి సంస్థలలో సోషలిస్టిక్పటర్న్‌ వంటి ప్రతి పాదనలు చేసినప్పుడు కేవలం గద్దించి, సవరణలను టెక్నికల్‌ కారణాలవల్ల కూడా త్రోని వేసి ఎలాగోలా ఆమోదం పొందడం పరిపాటి. ఇక్కడ జరిగినదందుకు పూర్తి విభిన్నం. ప్రారంభంలో శ్రీ దీనదయాళ్‌జీ ఈ సిద్ధాంతంపై స్థూలంగా అభిప్రాయబేధాదులు వుంటే ముందు చర్చిద్దామన్నారు. కొందరు కొన్ని ప్రసంగాలు చేశారు, కాని అవి స్థూలంగా దీనిని సమర్థిస్తూ జరిగాయి! ఇక రెండవ భాగంలో వివరాలపై చర్చలు. సవరణల స్వీకారాలు జరిగాయి. సవరణలు అన్నీ 20వ తేదీ లోపునే రావాలని నిర్ణయించారు. కాని సమయంలో తమ ఆలోచనలను ప్రతిపాదించదల్చినవారు కొందరు ఉన్నారు. మరికొందరు సభ్యులు అలా నిబంధనలకు భిన్నంగా వారి సవరణలు స్వీకరించ రాదని భావించారు. వారందరికి శ్రీదీనదయాళ్‌జీ ముక్తసరిగా ఇలా సమాధానం ఇచ్చారు. ‘‘నిబంధనల ప్రకారం మనం ఉండడం అవసరం. అయితే నిబంధనల పేరుతో, టెక్నికల్‌ కారణాలవల్ల ఆయా అంశాలను మనం వదలి వేయడం కన్న పరిగణించడం మంచిది. ఇది మనకే ఉపయోగకరం. మనదొక నిబంధనలతో కూడిన పార్టీ మాత్రమే కాదు. ఒక సహజమైన కుటుంబం కూడా. ఇంతవరకు వచ్చిన సవరణలు. కొత్తగా పచ్చే సలహాలు అన్నీ జోడిరచుకొని ఈ సిద్ధాంతాన్ని పరిశీలిద్దాం. అయితే కొత్తగా సలహాలిచ్చేవారు తమ ప్రతిపాదనలలోని యోగ్యతను గురించి ఒకటికి రెండుసార్లు యోచించుకుని, క్లుప్తంలో ప్రతిపాదించాలి. ఆ బాధ్యతను వారికే వదలివేస్తున్నాను’’ అనేసరికి సభవారు ముగ్ధులైపోయినారు. సభికులపై అద్భుతమైన బాధ్యత పడ్డట్లయింది. కార్యవర్గ సభ్యులు కూడా కొందరి చర్చలలో పాల్గొనడం కనిపించింది. నిజానికిది కార్యవర్గం ఆమోదించిన ముసాయిదా కనుక వారు చర్చించడం పద్ధతికాదు. దీనదయాళ్‌జీ ఈ విషయం గుర్తుచేస్తూ కూడా వారూ స్వేచ్ఛగా పాల్గొనడాన్ని ఆహ్వానించారు. అనేక సలహాలు వచ్చాయి. కాని ఎక్కడా ఉద్రేకాలు, పట్టుదలలు లేవు. చెప్పుకొనదగిన చర్చ అది.

ఈ చర్చకు పూర్వం ఒక ప్రతిపాదన వచ్చింది. శ్రీ రామేశ్వరానంద అసలీ చర్చను వాయిదా వేసి ఈ సిద్ధాంతాన్ని నిపుణుల ముందుంచాలన్నారు. మరి ఒకరిద్దరు వాయిదా వేయడం, సమయం తీసుకొనడం మనకే మంచిదన్నారు. ఆ విషయంలో కూడా శ్రీ దీనదయాళ్‌జీ ‘‘విూరే బాధ్యతాయుతంగా ఆలోచించి చెప్ప’’మన్నారు. ఇది నిపుణులతో సంప్రదించకుండా వచ్చిన ప్రతిపాదన కాదు. మొదటి ముసాయిదా ఏడాది క్రితం గ్వాలియర్లో ప్రతినిధుల ముందుకు వెళ్లింది. స్థూలమైన వారి అనుమతితో ప్రజల ముందుకు వచ్చింది. పత్రికలలో పూర్తిగా ప్రచురితమైంది. ప్రజల నుండి (జనసంఘేతరులు) కూడా అభిప్రాయం సేకరించారు. వివిధ జనసంఘ జిల్లా శాఖలు తీర్మానాల రూపంలో తమ అభిప్రా యాలు పంపారు. ఆ తర్వాత ప్రత్యేక ఉపసంఘం వాటన్నిటిని పరిశీలించి రూపం ఇచ్చింది. దేశంలోని నిపుణుల అభిప్రాయాలు ప్రత్యేకంగా స్వీకరించాం. చివరకు అఖిల భారత కార్యవర్గం అంతిమ రూపం తీరిన ఈ రూపం గురించి చర్చించి నిర్ణయించకుండా మళ్లీ నిపుణుల సంఘం ముందుంచాలనడం లేదా ఇంకా సమయం తీసుకుందామనడం సభలో ఎవరికీ నచ్చలేదు. ఒకరు ‘‘అంతా తయారైన తరువాత వాయిదా కోరడం అర్థంలేదు. అది ఆత్మవిశ్వాసం చాలక తప్పించుకోవడంవంటిదే. వ్యవధి చాలక పోతే రాత్రంతా కూడా సమావేశం జరుపుకుందాం. ఈ చారిత్రక సిద్ధాంతాలపై ఈ చారిత్రక సమావేశంలో నిర్ణయం తీసుకుని తీరుదాం. అందుకు సిద్ధంగా వచ్చారు ప్రతినిధులందరూ’’ అనేసరికి సభికులు కరతాళధ్వనులు చేశారు. ఆ తర్వాత చర్చ ప్రారంభమైంది. శ్రీ దీనదయాళ్‌జీ కూర్చొనే చర్చకు సారథ్యం వహించవలసిందిగా అధ్యక్షులు చేసిన సూచనపై వారు రెండు రోజులూ చర్చకాలమంతటా పద్మాసనంలో ప్రత్యేకమైన మైకు ముందు ఉపవిష్టులై చర్చను నడిపారు. అధ్యక్షులు శ్రీ బచ్‌రాజ్‌ వ్యాస్‌ ఈ నాలుగురోజులపాటు నిమిషమైనా తెరపిలేకుండా తమ ఆసనంలోనే కూర్చొని సభా వ్యవహారాలను నిర్వహించారు. ఇక ప్రతినిధుల సంగతి వారు మామూలు రాజకీయపక్షాల ప్రతినిధులవంటి వారు కాదు. సభ ప్రారంభమైన క్షణం నుండి ఆ సమావేశం ముగిసేవరకు కూర్చున్న స్థానాలు వదిలేవారు కాదు. అత్యవసరమయితే తప్ప, తమ ప్రసంగాలలో క్లుప్తంగా ఉండడం సమయానికి తగిన అంశాలు మాత్రమే ప్రస్తావించడం, చర్చలలో ఉద్రేకం లేని గాంభీర్యం ఇత్యాదులు అధిక భాగం కానవచ్చాయి. అయితే ఇందుకు భిన్నంగా అన్య రాజకీయ పక్షాలవలె ముందుగా ఆలోచించుకొనకుండా అక్కడ అవసరంలేని విషయాలపై సమయం తీసుకున్నవారు చెప్పిందే చెప్పడం చేసినది చాలా చాలా తక్కువమంది. దీనదయాళ్‌జీ చర్చ నిర్వహించిన తీరు జనసంఘ నేతృత్వంపై విశ్వాసం పెంచింది. చర్చ ముగిసిన తరువాత ‘వందేమాతరం’ నినాదంతో ఆమోదం తెలియచేశారు.

ప్రజానీకానికి, పత్రికలవారికి ఈ సభలు, చర్చలు జనసంఘాన్ని అర్థం చేసుకొనడానికి గొప్ప అవకాశంగా ఇచ్చాయి. అంతకు పూర్వం జన సంఘాన్ని గురించి వ్యతిరేకులు చేసే ప్రచారపు ప్రభావన పొరపాటు భావనలు కల్గినవారు చాలా మంది తమ అభిప్రాయాలు మార్చుకున్నారు ‘‘ఏమో అనుకున్నాం. చాలా గట్టివారే’’!, ‘‘వీరికేమిశక్తి ఉందనుకున్నాం. అబ్బ చాలామంది వచ్చారే’’ అ ప్రతి చిన్న విషయంలోను నైపుణ్యం’’. ‘‘ఆ దీనదయాళో చర్చను ఎంత చక్కగా నడిపారు’’, ‘‘ఇంతకుపూర్వం మనకిది తెలిసింది కాదు’’, ‘‘కాంగ్రెసు కమ్యూనిష్టులకు జవాబీయగలిగితే వీరే ఇవ్వాలి’’ ` ఇది ప్రజలమధ్య పత్రికలవారి మధ్య విన వచ్చిన వ్యాఖ్యల ధోరణి.

చర్చలలో అధికభాగం హిందీలో జరిగాయి. ఇంగ్లీషులో మాట్లాడినా (పత్రికలవారికి మినహా) మరికొందరికి ఈ చిక్కు తప్పనిసరి అయ్యేదే. తెలుగులో కూడా కొందరు మాట్లాడారు. అవకాశ మున్నంతవరకు క్లుప్తమైన తర్జుమా ఏర్పాటు చేశారు. పత్రికలవారి సౌకర్యార్థం తెలుగులో వివిధ కార్యక్రమాలు రాసి అందించారు. ఇంగ్లీషులో కూడా రాసి ఇవ్వడం అనేది తీర్మానాల వరకు జరిగింది.

25 మధ్యాహ్నం జరిగిన మహిళాసమా వేళం అక్కడి ప్రముఖుల మాటల్లో చెప్పాలంటే… విజయవాడలో అపూర్వం. భారతీయ సంస్కృతి ఆధారంగా వేలమంది మహిళలు సమావేశమై భారతీయ సంస్కృతి ఆధారంగా నవయుగ నిర్మాణాన్ని గురించి యోచించడం ఎప్పుడు జరిగింది కనుక? రెండుగంటలపాటు స్త్రీలే స్వయంగా నిర్వహించుకున్న ఈ కార్యక్రమంలో పురుషులు సైతం అతిథులుగా పాల్గొన్నారు. 3 వేల మందివరకు పురుషులున్నారు. మూడు తీర్మానాల గురించి చర్చించారు. శ్రీమతి శకుంతలానయ్యర్‌, డా. శారదారాణి, శ్రీమతి హైమవతి ప్రభృతులు చక్కని ప్రసంగాలు చేశారు. శ్రీమతులు పర్వతవర్ధని విజయలక్ష్మి ప్రభృతులు ప్రాంతంలో మహిళా కార్యకలాపాల నేతృత్వానికి మచ్చుతునకలనిపించుకున్నారు.

డా. రఘువీర జీవితమంతా వివిధ దేశాలలోను భారతీయ సంస్కృతీ వ్యాప్తికి సాక్ష్యమిచ్చే చిత్రాదులు సేకరించారు. వాటిలో కొన్ని ఈ ప్రదర్శనలో ఉంచారు. ప్రదర్శనను డా. రఘువీర కోడలు శ్రీమతి డా. శారదారాణి నిర్వహించారు. వివరణతో చూడవలసిన చిత్రాలివి. ఆ వివరం విన్నప్పుడు వివిధ దేశాలలో భారతీయ సంస్కృతి వ్యాప్తిని గురించి ఎంతో చదివినంత విజ్ఞానం లభిస్తుంది.

సభ ఏర్పాట్లకు సంబంధించి కార్యకర్తల శ్రద్ధాభక్తులు స్పష్టంగా కానవచ్చాయి. ఏర్పాటులన్ని పకడ్బందిగా జరిగాయి. అన్ని పనులూ కార్యకర్తలే నిర్వహించారు. కాంగ్రెసు సభలకూ దానికీ హస్తిమశకాంతరం కనిపించింది. పోలీసులు కొందరు మహాసభల వద్ద ఉండక తప్పదు. వారికి మహాసభల వెలువల తప్ప, గేట్లవద్దగాని, లోపలగాని పని చేయవలసిన అవసరం కలుగలేదు.

మహాసభలంతా ఒక ఎత్తు – 23 మధ్యాహ్నం జరిగిన ఊరేగింపు ఒక ఎత్తు. నగరాన్ని కదలించి వేసిన కార్యక్రమమది. ఊరేగింపు చూచిన తరువాత వృద్ధులైన కాంగ్రెసు ప్రముఖులొకరు ఇలా అన్నారు. ‘‘నా జీవితం ధన్యమైనట్లు భావిస్తున్నాను. దేశభక్తులైన యువశక్తిని మళ్లీ ఒక్కసారి భారీ ఎత్తున చూడగలి గాను. ఇక నాకు నిశ్చింత’’ ఈ మాటలు ప్రజావాణికి సంకేతంగా స్వీకరించవచ్చు. ఇటీవలికాలంలో దేశభక్తి శక్తులకు భారీ ఎత్తున చక్కని ఊరేగింపు నిర్వహించడం కూడా అసాధ్యమై పోయినట్లయింది. భారీఎత్తు ఊ రేగింపు నిర్వహించేశక్తి ఉండవలసిన కాంగ్రెసు ‘‘బుడ్డా’’ ఆయిపోయింది. మిగిలిన పార్టీలలో ఊరేగింపు తీయగల్గుతున్నది కమ్యూనిస్టు పార్టీ. ఆది దేశద్రోహ పార్టీ. కూలీకి జనాన్ని తోలుకువచ్చి, విదేశీ జండాలు చేతికిచ్చి, జాతీయశక్తులకు, జాతీయ పక్షాలకు వ్యతిరేకంగా నినాదాలిస్తూ, తామూ ఒక దేశసేవక శక్తేనన్నట్లు కపటంగా ప్రవర్తిస్తుండడం చూచినప్పుడు అసహ్యం కల్గుతుందేగాని సానుభూతి కలుగదు.

ఊరేగింపు 23 మధ్యాహ్య 3.30 గంటలకు పి.డబ్ల్యు.డి. గ్రౌండ్సులో ప్రారంభమైంది. అంతకు పూర్వమే నగరమంతా జనసంఘ అభిమానులు తమతమ ఇండ్లలపై దీపికాధ్వజాల (జనసంఘ్ చిహ్నం ఉన్న దీపం జెండాలు) నావిష్కరించారు. వీధివీధినా మహానాయకుల పేర్లు విూద ద్వారము లమర్చారు. పెద్దబజారులో అడుగడుగునా అమర్చా రంటే అతిశయోక్తి కాదు. వివేకానంద, రఘువీర, శ్యామాప్రసాద్‌ ముఖర్జీ, గాంధీజీ మున్నగు వారి ఫొటోలతో కొత్తపద్ధతిలో నిర్మించారు. ఊరేగింపులో డా. ముఖర్జీ, డా. రఘువీర, సుభాశ్‌ చంద్రబోస్‌. వివేకానంద మున్నగు వారి పెద్దచిత్రాలు పట్టుకు న్నారు. భారతమాత, కృష్ణదేవరాయ, రaాన్సీ లక్ష్మీబాయ్‌, శివాజీ, రాణా ప్రతావ్‌ మున్నగు వేషధారులను వేర్వేరు బండ్లపై కూర్చోపెట్టారు. మరొక శకటంపై అధ్యక్షులు శ్రీబచ్‌రాజ్‌ వ్యాస్‌ ఉన్నారు. వారికి ఇరుప్రక్కల స్వాగత సమితి అధ్యక్షులు శ్రీ టి. ఎస్‌. రామారావు, మాజీ అధ్యక్షులు శ్రీ ఘోష్‌బాబు ఉన్నారు. వారికి ముందు సారథిó స్థానంలో శ్రీ గోపాలరావు ఠాకూర్‌ ఆసీనులైనారు. అధ్యక్షునికి ముందు అశ్వారూఢుడైన యువకులొకరు గంభీరంగా దీపికా ధ్వజాన్ని చేత ధరించారు. ఊరేగింపుకు పూర్తిగా ముందు కర్రసాముచేసే యువకులు కోలాహలం చేశారు. అధ్యక్షుని వాహనం ముందు మంగళవాయిద్యం, ఇతరచోట్ల బ్యాండు వగైరా వాయిద్యాలు ఉన్నాయి. అధ్యక్షుని వాహనానికి వెనుకనే 1500 మందితో స్త్రీ విభాగం నడచింది. ఊరేగింపు పొడుగునా అధ్యక్షునికి హారతులు, పూలమాలల అలంకరింపులతో సాగి వెళ్లింది, పెద్దబజారులో పలుపురు దుకాణాదార్లు ఊరేగింపునకు స్వాగత సూచకంగా నినాదాలిస్తున్నవారికి డబ్బాలకు డబ్బాలు పిప్పరమెంట్లు, నిమ్మతొనలు దాహం తీర్చుకునేందుకు అందించ నారంభించారు.

ఇక పాల్గొన్నవారి ఉత్సాహం, కోలాహలం చూచి తీరవలసిందేగాని వర్ణించ సాధ్యం కాదు. వివిధ ప్రాంతీయులకు చెందిన ప్రతినిధులు వివిధ దళాలు తమతమ భాషలలో నినాదాలిచ్చు కుంటు, అట్టలను, ధ్వజాలను చేత ధరించి సాగివెళ్లారు. ఢల్లీి, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ అనేక ప్రాంతాల వారు తమ తమ భాషలలో హలంతములగు నినాదా లిస్తుంటే వీనులవిందైన సంగీతం వినవచ్చింది. ఆ సంగీతంలో తన్మయులై నృత్యాలు చేశారు. ప్రతినిధులు, డాక్టర్లు, లాయర్లు, లెక్చరర్లు, ఇతర ఉద్యోగస్తులు, విద్యాధికులునైన యువకులు జానపద నృత్యాలు స్వీకరించి తన్మయులై ఊరేగింపులో పాల్గొనడం ప్రజానీకానికి ఊహకందని విషయ మైంది. నాయకులు అనుచరులూ కలసి ఊరేగింపులో సాగి వెళ్లడం ప్రజలకు కొత్త విషయమైంది.

‘‘నాయకులందరు ఎక్కడ? అన్నాడొక ప్రేక్షకుడు ‘‘అరుగో శ్రీ యజ్ఞదత్తశర్మ’’ అన్నాను. ‘‘అఖండ భారత్‌ అమర్‌ రహే’’ అంటూ నినాదం ఇస్తున్నారప్పుడాయన. ‘‘ఇదుగో కేదారనాథ్‌ సహాని, ఢల్లీి నగరానికి మాజీ డిప్యూటీ మేయరు’’ అన్నా. చేయెత్తి జైకొడ్తున్నారాయన ఉత్తమరావ్‌ పాటిల్ను చూచావా? వారు పార్లమెంటు సభ్యులుగా పనిచేశారు’’ అన్నాను చిరునవ్వుతో చప్పట్లు చరుస్తూ. గీతం పాడుతున్నవారిని చూపి. ఆ మైకు ముందు ‘‘ఎద్దుల్‌ రాజ్యం వద్దుర బాబు అంటున్నారు మన ఆంధ్ర ఎం.ఎల్‌.సి. శ్రీ రంగారెడ్డి’’ అన్నాను, ఆయన ప్రశాంతంగా నిరాడంబరంగా వివాదాలు అంటూ సాగివెళ్తున్నారు. ఈ ప్రకారం నాయకులంతా పాదచారులై, పూర్తిగా ఊరేగింపులో మునిగిపోవడం ఆశ్చర్యం వేసింది ప్రేక్షకులకు. ‘వద్దుర బాబు ఎద్దుల రాజ్యం’ అంటూ తెలుగు జట్టు ప్రారంభించిన వివాదం తరతర అన్ని ప్రాంతాల జట్లలోకి ప్రాకి పోయింది. వినేవారికి వినోదం అది. ప్రజాహృదయా నికి ప్రతిధ్వని అది. ఉత్తరప్రదేశ్‌ జాగృతి గీతాలు మరొక వీనుల విందు. ఈ ప్రకారం 5 గంటల సేపు సాగింది. మైలున్నర పొడవున ఉన్న ఆ ఊరేగింపు, త్వరగా నడచిన ఒక గవర్నరుపేట కేంద్రంలో 40 నిముషాలు పట్టింది. సగం దూరం వెళ్లేసరికే ప్రొద్దుగుంకి పోయింది. రాత్రి 8 గంటలకు సభాస్థలిని చేరారు. ఆ వెంటనే స్వాగతాధ్యక్షుని ఉపన్యాపం, అధ్యక్షుని ప్రసంగం మున్నగు కార్యక్రమాలు రాత్రి 11 గంటలవరకు సాగాయి.

క్లుప్తంలో ఈ మహాసభలు దక్షిణ భారతంలో స్వీయ సంస్కృతీ శంఖారావం. ఇక్కడ జనసంఘానికి బలంలేదని గాని, బలపడే అవకాశం లేదనిగాని వాదించేవారికి గట్టి జవాబు. కాంగ్రెసు, కమ్యూనిస్టులు తప్ప వేరే బలవత్తరమైన పక్షం లేదని నిరాశ చెందుతున్నవారికి ఉత్తేజకరం ఇది. తమ ఆటలకు తిరుగులేదని భావించేవారికి సింహస్వప్నం. ఈ మహాసభలు ఈ ప్రాంతంలో ఒక అద్భుత విజయం. శ్రీ దీనదయాళ్‌జీ సభల ఆఖరున చేసిన ప్రసంగంలో అన్న ప్రకారం ‘‘ఇది ఊహించినదానికన్న ఎక్కువ విజయం. అయితే దీనితోపాటు కార్యకర్తలపై పెద్ద బాధ్యత కూడా వచ్చింది. దీనితోపాటు ఈ విజయానికి తగినస్థాయిలో కార్యవిస్తరణ జరగడంలో ఈ మహాసభల సంపూర్ణ సార్థక్యం ఉంటుంది.’’

– జాగృతి విలేఖరి

About Author

By editor

Twitter
YOUTUBE