భారత రాజ్యాంగం ఆవిర్భవించి సరిగ్గా 75 సంవత్సరాలు! రాజ్యాంగ దినోత్సవం లేదా సంవిధాన్‌ ‌దివస్‌ ‌లేదా నేషనల్‌ ‌లా డేను ఏటా నవంబర్‌ 26‌న జరుపుకుంటున్నాం. ముఖ్యంగా రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజును గుర్తు చేసుకుంటూ ఈ సంవిధాన్‌ ‌దివస్‌ను జరుపుకోవడం కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015 నుంచి మొదలైంది. రాజ్యాంగ సభ దృష్టి కోణాన్ని, భారత ప్రజాస్వామ్యానికి ఒక రూపు కల్పించడంలో రాజ్యాంగ విలువల పాత్రను గౌరవిస్తూ ఈ రాజ్యాంగ దినోత్స వాన్ని జరుపుతున్నది.

క్రమం తప్పకుండా ఈ ఏడాది కూడా రాజ్యాంగ దివస్‌ను న్యూఢిల్లీలోని సంవిధాన్‌ ‌సదన్‌ ‌సెంట్రల్‌ ‌హాలులో నిర్వహించారు. ఈసారి రాజ్యాంగ దివస్‌ ఇతివృత్తం ‘‘హమారా సంవిధాన్‌-‌హమారా స్వాభిమాన్‌’’ (మన రాజ్యాంగం- మన ఆత్మగౌరవం). రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా రాజ్యాంగ పీఠికను చదివి వినిపించారు. మన దేశ రాజ్యాంగాన్ని ఈ ఏడాది 9 భాషల్లో డిజిటల్‌లో ఆవిష్కరించడం ప్రత్యేక ఆకర్షణ. ఈ భాషలు వరుసగా మలయాళం, నేపాలీ, మరాఠీ, పంజాబీ, బోడో, తెలుగు, కశ్మీరీ, ఒడియా, అస్సామీ. ఈ సందర్భంగా ‘‘భారత్‌కీ సంవిధాన్‌ ‌సే కలా ఔర్‌ ‌క్యాలిగ్రఫీ’’ పేరుతో హిందీ భాషలో ఒక బుక్‌లెట్‌ను విడుదల చేశారు. ‘‘హమారా సంవిధాన్‌- ‌హమారా స్వాభిమాన్‌’’ అనే అంశంపై ఆన్‌లైన్‌ ‌క్విజ్‌, ‌వ్యాసరచన పోటీలను కూడా నిర్వహిం చారు. కేంద్ర మంత్రిత్వశాఖలు/విభాగాలు/రాష్ట్ర-కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంట్‌ ‌స్థాయి వరకు చర్చా గోష్టులు, ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్ర మాలు, పోస్టర్‌/‌పెయింటింగ్‌, ‌రంగోలీ పోటీలు వంటి రాజ్యాంగ-కేంద్రీకృత కార్యక్రమాలను నిర్వహించారు. భారత రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, 56వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) ‌నిర్వహించారు. రాజ్యాంగ దివస్‌ను గౌహతి హైకోర్టు ఐజ్వాల్‌ ‌బెంచ్‌ ‌నిర్వహించింది. మిజోరం గవర్నర్‌ ‌విజయ్‌ ‌కుమార్‌ ‌సింగ్‌ ‌ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇదిలా వుండగా వివిధ రాష్ట్రాల్లో న్యాయసేవామేళాలు నిర్వహించారు. రాష్ట్ర స్థాయి న్యాయ సేవా ఉత్సవాలు, టెలి-లా కార్యక్రమాలతో ప్రాంతీయ భాషల్లో అవగాహన కల్పించాయి. నిర్దిష్ట జాతీయ లక్ష్యాలకు కట్టుబడి ఉండటానికి, బానిస మనస్తత్వాన్ని నిర్మూలించడానికి, బాధ్యతలను గుర్తెరగడానికి వీలుగా ‘‘పంచ్‌ ‌ప్రాణ్‌ ‌ప్రతిజ్ఞ’’లు నిర్వహించారు. దైనందిన జీవితంలో రాజ్యాంగ ప్రభావాన్ని వివరిం చేందుకు వీలుగా కామిక్‌ ‌పుస్తకాలు, పాడ్‌కాస్ట్‌లు, మ్యాగజైన్‌లు (సంవిధాన్‌ ‌కట్టా) వంటివాటిని విడుదల చేశారు. ఈ విధంగా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరిగాయి.

రాజ్యాంగం నిర్మాణానికి గొప్ప చరిత్ర ఉంది. నవంబర్‌ 26, 1949‌న భారత రాజ్యాంగసభ, రాజ్యాంగాన్ని ఆమోదించింది. అయితే ఇది అమల్లోకి వచ్చింది జనవరి 26. 1950 నుంచి మాత్రమే. జనవరి 26, 1930న భారత జాతీయ కాంగ్రెస్‌ ‌సంపూర్ణ స్వరాజ్యాన్ని, మొట్టమొదటి స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రకటించింది. ఈ తేదీన గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ఇదీ కారణం! ప్రపంచంలో అత్యంత సుదీర్ఘ రాజ్యాంగం మనదే!! మనదేశ రాజ్యాంగ రచన సుదీర్ఘకాలం పాటు- 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు సాగింది. అంటే డిసెంబర్‌ 9, 1946 ‌నుంచి నవంబర్‌ 26, 1949 ‌వరకు కొనసాగింది. ఈ కాలంలో రాజ్యాంగ సభ 11 సార్లు సమావేశమైంది. ఈ సమావేశాలు 165 రోజులపాటు జరిగాయి. రాజ్యాంగ ముసాయి దాకు సభ్యులు సుమారు 7635 సవరణలు ప్రతి పాదించగా 2473 సవరణలను సభ ఆమోదిం చింది. ఎట్టకేలకు నవంబర్‌ 26, 1949‌న రాజ్యాం గాన్ని ఆమోదించిన తర్వాత రాజ్యాంగ సభ వాయిదా పడింది. అనంతరం అప్పటి హోంశాఖ మంత్రి సర్దార్‌ ‌వల్లభభాయ్‌ ‌పటేల్‌ ‘‘అన్ని రాష్ట్రాలు ఈ రాజ్యాంగానికి ఆమోదం తెలిపాయి. ఈ నేపథ్యంలో దీన్ని ఆమోదించేందుకు ఈ సభ ఏర్పాటైంది’’ అని ఒక సంక్షిప్త ప్రకటన చేశారు. తర్వాత తొలి రాష్ట్రపతి బాబూ రాజేందప్రసాద్‌ ‌రాజ్యాంగ సభ సభ్యులను అభినందిస్తూ ప్రసంగించారు. తన ప్రసంగంలో ప్రధానంగా అంబేడ్కర్‌, ‌జవాహర్‌లాల్‌ ‌నెహ్రూ, సర్దార్‌ ‌వల్లభయ్‌ ‌పటేల్‌లను ప్రత్యేకంగా ప్రశంసించారు.

రాజ్యాంగ సభ-కమిటీలు

కేబినెట్‌ ‌మిషన్‌ ‌ప్లాన్‌ ‌ప్రకారం 1946లో రాజ్యాంగ సభ ఏర్పాటైంది. ఇందులో మొత్తం 389మంది సభ్యులు కాగా, దేశ విభజన తర్వాత వీరి సంఖ్య 299కి తగ్గింది. ఇందులో ముఖ్యంగా నాలుగు కమిటీలను ఏర్పాటు చేశారు. 1. డా।। బి.ఆర్‌. అం‌బేడ్కర్‌ ‌ఛైర్మన్‌గా డ్రాఫ్టింగ్‌ ‌కమిటీ, 2. జవాహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ నేతృత్వంలో కేంద్ర అధికారాల కమిటీ, 3. వల్లభాయ్‌ ‌పటేల్‌ ‌నాయ కత్వంలో ప్రాథమిక హక్కులు, మైనారిటీల కమిటీ, 4. డా।। రాజేందప్రసాద్‌ ‌నేతృత్వంలో నిబంధనలు- విధివిధానాల కమిటీ. ప్రస్తుతం మనం పాటిస్తున్న సంవిధాన్‌ ‌దివస్‌ (‌రాజ్యాంగ దినోత్సవం) సందర్భంగా ఈ నాలుగు కమిటీలకు నేతృత్వం వహించిన నాయకులను సంస్మరించుకుంటాం. వీరిలో అంబేడ్కర్‌ ‌భారత రాజ్యాంగ నిర్మాత కాగా, జవాహర్‌లాల్‌ ‌నెహ్రూ ప్రజాస్వామ్యం, దేశ నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించారు. ఇక సర్దార్‌ ‌పటేల్‌ ‌దేశ ఏకీకరణ, సమాఖ్య నిర్మాణంలో కీలకంగా వ్యవహరించారు. చివరిగా డా।। రాజేందప్రసాద్‌ను రాజ్యాంగ సభ నాయకుడిగా గౌరవించుకుంటాం.

ముందుగా ఆగస్టు 29,1947న డా।। బి.ఆర్‌. అం‌బేడ్కర్‌ ‌నేతృత్వంలో ఏర్పాటైన రాజ్యాంగ రచనా కమిటీ (డ్రాఫ్టింగ్‌ ‌కమిటీ), రాజ్యాంగానికి సంబం ధించిన ప్రాథమిక పాఠ్యాంశాన్ని రూపొందించింది. నవంబర్‌ 4,1948‌న సవివరమైన చర్చ జరిపేందుకు వీలుగా పూర్తిస్థాయి రాజ్యాంగాన్ని రాజ్యాంగసభ ముందుంచారు. తర్వాత సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత నవంబర్‌ 26, 1949‌న దీనికి ఆమోదం తెలుపగా, జనవరి 26, 1950 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటినుంచి ఏటా జనవరి 26వ తేదీని గణతంత్రదినోత్సవంగా జరుపుకుంటున్నాం. స్వాతంత్య్రానంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాలు రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబర్‌ 26, 1949 ‌వ తేదీని సంస్మరణ దినోత్సవంగా జరుపుకోవడంపై దృష్టి పెట్టలేదు. 2014లో ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ‘‘సంవిధాన్‌ ‌దివస్‌’’ ‌పేరుతో దీన్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈమేరకు నంబవర్‌ 19, 2015‌న భారత ప్రభుత్వం గెజిట్‌ ‌నోటిఫికేషన్‌ ‌ద్వారా ‘‘నవంబర్‌ 26’’ను రాజ్యాంగ దివస్‌గా ప్రకటించింది.

లీగల్‌ ‌డే

అధికారికంగా ప్రకటించకముందు రాజ్యాంగ దివస్‌ను కేవలం న్యాయసంస్థలు ‘‘లీగల్‌ ‌డే’’గా జరుపుకునేవి. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో దీని నిర్వహణ సామాజిక-రాజకీయ రంగాలకు విస్తరించిందనే చెప్పాలి. ముఖ్యంగా ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వాల పట్ల భారత్‌ ‌నిబద్ధతను ఈ రాజ్యాంగ దివస్‌ ‌వెల్లడిస్తుంది. అంతేకాదు రాజ్యాంగం అనేది కేవలం చట్టబద్ధమైన ప్రతి కాదు, పౌరుల జీవన విధానానికి, పాలనకు మార్గదర్శకం వంటిది. రాజ్యాంగ అధికరణల్లో ఇది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి వాటిల్లో మనకు అవసర మైన వాటిని సేకరించినప్పటికీ, ప్రధానంగా మనది బ్రిటిష్‌ ‌రాజ్యాంగ స్ఫూర్తితో రూపొందించినదే. రాజ్యాంగ రచనలో భారత ప్రభుత్వ చట్టం-1935, బ్రిటిష్‌, ఐరిష్‌, ‌కెనడా రాజ్యాంగాల్లోని పలు అంశాలు, భారత సామాజిక-సాంస్కృతిక అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. రాజ్యాంగకర్తలు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగంలో సవరణ లకు 348వ అధికరణ ద్వారా వీలు కల్పించారు. బలమైన కేంద్రంతో పాటు సహకార సమాఖ్య వ్యవస్థకు ప్రాధాన్యం ఇచ్చారు. బ్రిటిష్‌ ‌నమూనా మన రాజ్యాంగానికి ఆధారం. న్యాయ సమీక్ష, రాజ్యాంగ సాధికారత, ప్రాథమిక హక్కుల పరిరక్షణలకు మన రాజ్యాంగం హామీ ఇస్తున్నది. 12-35 అధికరణాలు ప్రాథమిక హక్కులకు సంబంధించినవి కాగా 51ఎ అధికరణం ప్రాథమిక విధులను, 36-51 వరకు ఆదేశిక సూత్రాలను వివరిస్తాయి.

నరేంద్రమోదీ ప్రకటన

అక్టోబర్‌ 11, 2015‌వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ముంబయిలోని ఇందు మిల్స్ ఆవరణలో ‘‘స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ’’ పేరుతో అంబేడ్కర్‌ ‌మెమోరి యల్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా నవంబర్‌ 26‌వ తేదీని ‘‘సంవిధాన్‌ ‌దివస్‌’’గా నిర్వహించ నున్నట్టు ప్రకటిం చారు. తర్వాత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ఏర్పాటైన ఒక ప్రత్యేక కమిటీ దీనిపై తుది నిర్ణయం తీసుకుంది. ఇందుకనుగుణంగా భారత ప్రభుత్వం అదే ఏడాది నవంబర్‌ ‌నెలలో ‘‘సంవిధాన్‌ ‌దివస్‌’’ ‌నిర్వహణను అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో 2015లో రాజ్యాంగ నిర్మాత డా।। బాబాసాహెబ్‌ అం‌బేద్కర్‌ 125‌వ జయంతి సందర్భంగా (1891 ఏప్రిల్‌ 14- 1956 ‌డిసెంబర్‌ 6) ఆ ‌సంవత్సరం పొడవునా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వేడుకలు జరపాలని కేంద్రం నిర్ణయించింది. దీని ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖలు మొట్టమొదటి ‘‘రాజ్యాంగ దివస్‌’’వివిధ కార్యక్రమాలు నిర్వహిం చాయి. ‘‘సంవిధాన్‌ ‌దివస్‌’’ అం‌టే కేవలం ప్రభుత్వ సెలవు దినాన్ని ప్రకటించడం కాదు. కేంద్ర విద్య- అక్షరాస్యత మంత్రిత్వశాఖ నిర్దేశం ప్రకారం వివిధ పాఠశాలల్లో విద్యార్థుల చేత రాజ్యాంగ పీఠికను చదివింపజేశారు. అంతేకాకుండా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో రాజ్యాంగంపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలను కూడా నిర్వహించారు. ప్రతి పాఠశాలలో రాజ్యాంగంలోని ముఖ్యాంశాలపై ఉపన్యాసాలిప్పించారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో మాక్‌ ‌పార్లమెంట్‌ ‌కార్యక్రమాలను నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. లక్నోలోని అంబేడ్కర్‌ ‌విశ్వవిద్యాల యంలో అఖిల భారత స్థాయిలో క్విజ్‌ ‌కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన క్విజ్‌ ‌పోటీల విజేతలు ఈ కార్యక్రమంలో పాల్గొ న్నారు. విదేశాంగశాఖ ఇతర దేశాల్లోని భారతీయ పాఠ శాలల్లో, నవంబర్‌ 26‌న రాజ్యాంగ దివస్‌ను నిర్వహించాలని, దేశ భాషల్లోకి రాజ్యాంగాన్ని అనువదించి వివిధ విద్యా సంస్థలు, లైబ్రరీలు, ఇండాలజీ శాఖకు చెందిన వేర్వేరు విభాగాల్లో భద్ర పరచాలని కూడా ఆదేశాలు జారీచేసింది. అంతేకాదు భారత రాజ్యాంగాన్ని అరబిక్‌ ‌భాషలోకి కూడా అనువదించారు. ‘‘రన్‌ ‌ఫర్‌ ఈక్వాలిటీ’’ పేరుతో క్రీడా మంత్రిత్వశాఖ సింబాలిక్‌ ‌రన్‌ను నిర్వహించింది. నవంబర్‌ 26, 2015‌న పార్లమెంట్‌ ‌ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి అంబేడ్కర్‌కు ఘన నివాళులు అర్పించారు. 2019 నవంబర్‌ 27‌న, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విశాఖపట్టణం బీచ్‌ ‌వద్ద ‘‘రన్‌ ‌ఫర్‌ అం‌బేడ్కర్‌’’ ‌ర్యాలీ నిర్వహించారు. 2023లో నిర్వహించిన రాజ్యాంగ దివస్‌ ‌సందర్భంగా మణిపూర్‌ ‌నాటి ముఖ్యమంత్రి నంగ్తోంబామ్‌ ‌బైరేన్‌ ‌సింగ్‌, ‌రాజ్యాంగాన్ని అధికారికంగా రెండు భాషల్లో విడుదల చేశారు. మొదటిది మైతేయీ భాష (మణి పూర్‌ అధికార భాష)లో ‘మీతేయి మాయెక్‌’ (సంప్రదా యిక మైతేయీ లిపి)లో ఈ రాజ్యాంగాన్ని అనువదిం చగా, రెండవది ఇంగ్లీషు భాషలో రూపొందించింది. రాజధాని ఇంఫాల్‌లోని ముఖ్యమంత్రి సచివాల యంలో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యకమ్రంలో ఈ రెండు భాషల్లో రాజ్యాంగ ఆవిష్కరణ జరిగింది. ఇందులో 105వ రాజ్యాంగ సవరణ వరకు పొందు పరచారు. ఈ రకమైన రాజ్యాంగ ప్రచురణను ఇంతటి స్థాయిలో ప్రచురించడం ఇదే ప్రథమం. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్‌ ‌లైబ్రరీలలో ఈ రాజ్యాంగ ప్రతులను అందుబాటులో ఉంచారు.

జమలాపురపు విఠల్‌రావు

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE