‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన

మత్తి భానుమూర్తి

గురిందల స్థలంలో జరుగుతున్న సమయశెట్టిల సమావేశంలో ప్రసంగిస్తున్నాడు తిక్కనార్యుడు.

‘‘ఈ ఆధునిక కాలానికి స్పష్టమైన అంశాలు రెండు. మన జాతి ఆంధ్ర జాతి. మన భాష తెలుగు భాష. కాబట్టి మన రాజ్యం కూడా తెలుగు రాజ్యం.. ఆంధ్ర సామ్రాజ్యం కావాల్సి ఉంది. అదే నా ఉద్యమం. అందుకు సమాయత్తమౌవలసినది మొదలుగా గ్రామ సమయాల వారు. ఇక్కడికి వచ్చిన వారంతా మీ మీ గ్రామాలలో మీ సమయ పెద్దలతో సమావేశమవ్వండి. వాళ్లకు వివరించండి. అష్టాదశ సమయాల పెద్దలతో చర్చించండి. అతి త్వరలోనే మనం తెలుగుభాషా రాజ్యం.. ఆంధ్ర సామ్రాజ్యం స్థాపించాలి’’

ఇది తిక్కనార్యుని ఉద్వేగ ప్రసంగం. తెలుగు మాట్లాడే ప్రతి పల్లెకు ఆయన సందేశం ఉద్యమంలా వెళుతోంది. పైన కళింగ నుండి దిగువ మధుర వరకు.. పడమర సముద్రం, ఇటు తూర్పు సముద్రం వరకూ అన్ని రాజ్యాలలో, అన్ని మండలాలలో, అన్ని స్థలల్లో సమావేశాలు నిర్వహించి తెలుగు మాట్లాడే ప్రజలను ఆయన ఉత్తేజితులను చేస్తున్నారు.

ఈ సమావేశం కూడా వాడిగా వేడిగా ఆశ్చర్యంగా అబ్భురంగా సాగింది.

చాలామంది మహాజనులు, సమయశెట్టిలు ఈ కోణం నుండి ఎప్పుడూ ఆలోచించలేదని ఆశ్చర్య పోయారు. నిజమే కదా అన్నారు. రేపటినుండి మా గ్రామాన్ని పూర్తిగా తెలుగుదనంతో నింపేస్తాం అన్నారు.

ఇక సమావేశం ముగుస్తుంది అనగా ఓ మూలనుండి ఓ పెద్ద కేక వినబడింది.

‘‘అయ బాబో..’’

అది భీరువు గొంతులా కాస్తంత భయంతో దుఃఖ మిళితమైనట్లుంది.

ప్రసంగిస్తున్న తిక్కన మాత్రమే కాదు.. సభాసదు లంతా అతని వైపే చూశారు. మంచిభట్టోపా ధ్యా యుడు చివ్వున లేచి అతని దగ్గరగా వెళ్లబోయాడు. కాని అతడు కనుసైగ చేయడంతో మధ్యలో ఆగిపోయాడు.

తిక్కనామాత్యుడైతే ఉపన్యాసం ఆపి అడిగాడు, ‘‘ఏమైంది సోదరా..! ఎందుకు ఆ అరుపు.. కారణం ఏవిటి??’’

‘‘తవరు గుక్కపట్టి తెలుగు తెలుగు అంటున్నారు. మరి తెలుగబ్బాయిలు మరో బాస అమ్మాయిల్ని మనువాడవచ్చా.. ఉప్పుడికే పెళ్లయిపోతే ఎట్టా.. మరేట్టా..??’’ అన్నాడు అమాయకంగా.

సభికులు అతని మాటలకు పగలబడి నవ్వారు. యువకుడు వీరునిలా, స్ఫురద్రూపిలా,కండలు తిరిగిన జబ్బలతో ఇంతెత్తున బలిష్టంగా చాలా ఆకర్షణీ యంగా ఉన్నాడు కాని అతని మాటలలో నిజమైన భయమో.. నాటకీయ భయమో.. ప్రవహిస్తోంది. అది నాటకీయ భయమని గుర్తించిన తిక్కనకు కూడా నవ్వొచ్చింది.

‘‘అబ్బీ.. ఇంతకీ నీకు పెళ్లయ్యిందా.. పెళ్లి అవ్వాల్సివుందా?’’

‘‘అయ్యిందిగా.. అందుకేగా నా ఏడుపు??’’

‘‘ఎవరు అమ్మాయి.. ఏ బాస?’’ ఎవరో జనాంతికంగా అన్నారు.

‘‘మరాఠా అమ్మాయండి. పెద్ద పెద్ద మారాజులే కూడబలుక్కుని పెళ్లి కుదిర్చి లగ్గం చేశారండి బాబో.’’

అందరూ మళ్లీ నవ్వారు కాని అతనినే పరిశీలనగా చూస్తున్న తిక్కన కాస్త గొంతు సవరించుకుని అన్నాడు.

ఈ సమావేశం ప్రధాన నిర్వాహకుడైన మంచి భట్టోపాధ్యాయుడు అతనికి దగ్గరగా.. అతని పట్ల వినయంతో చేతులు కట్టుకుని నిలబడటం ఆయన దృష్టిని దాటిపోలేదు.

‘‘మనం తెలుగువాళ్లం. తెలుగు మాట్లాడే మన రాజ్యాలలో ఇకపై తెలుగే ఉండాలి. అలాగే తెలుగు మాట్లాడే రాజ్యాలన్నీ ఏకం కావాలి. అలా అని ఇతర భాషా ప్రజలు మనకు శత్రువులు కాదు. ఆయా ఇతర భాషా రాజ్యాలలో కూడా మన తెలుగు వాళ్లున్నారు కదా. అందువల్ల ఇతర భాషా రాజ్యాల వాళ్లతో మనకు కయ్యం లేదు కాని వియ్యం ఉండొచ్చు..’’

ఆయన చమత్కృతికి అందరూ చప్పట్లు చరచి తమ ఆమోదం వెలిబుచ్చారు.

ఆ అడిగిన యువకుడు హమ్మయ్య అన్నట్లు ఆనందంగా నవ్వి మీసాలు దువ్వుకుంటూ తిక్కనకు నమస్క రించి కూర్చున్నాడు. అతని ముందు వినయంగా వంగి వెనక్కు అడుగులు వేస్తూ మంచోభట్టు వెనుదిరిగడం

తిక్కన గారి దృష్టిని ఆకర్షించింది.

అతగాడెవరో సాధారణవేషంలో ఉన్న రాజ్యాధికారి అని ఆయన భావించాడు. ఎంతో నమ్మకం పెట్టుకుని.. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తన ఆశయాన్ని కలను నిజం చేయగల మహావీరుడు, రాజకీయ దురంధరుడు అయిన కాకతీయ సార్వభౌముడు గణపతిదేవ చక్రవర్తి ఆయనే అని అప్పటికి తిక్కనార్యునకు తెలియదు.

 చాగిరాజ్య రాజధాని బృహత్కంచిపురంలో తిమ్మరుసు కొట్టారం వద్ద పరిచయమైన పండితుడే ఈ మంచి భట్టోపాధ్యాయుడు. ఆ రోజు ఇద్దరూ జనాంతికంగా మాట్లాడుకున్నారే కానీ ఎవరెవరో ఇద్దరికి తెలియదు. కాని ఆ భట్టోపాధ్యాయుడు వదలిపెట్టే రకం కాదు. తను మాట్లాడింది సాధారణ వేషంలో ఉన్న గణపతిదేవుడని తెలుసుకున్నాడు. అనుమకొండ రాజనగరికి వెళ్లి నానా ప్రయత్నాలు చేసి గణపతిని కలుసుకున్నాడు.

ఆయనను చూసి గణపతి కూడా సంతోషించాడు. తెలుగు భాషావ్యాప్తి కోసం విక్రమపురిరాజ్య మహామాత్యుడైన తిక్కన సోమయాజి నిర్వహిస్తున్న ‘స్థల’ స్థాయి మహాజనుల, కవి పండితుల, వీరయోధుల సమావేశం రాగల భానువారమే ‘గురిందల స్థల’ వద్ద నిర్వహించబోతున్నామని, దానిని తను సమన్వయ పరుస్తున్నట్లు చెప్పాడు.

ఆ సమావేశం పట్ల ఆసక్తి చూపిన గణపతి దేవుడు.. తానూ కూడా పాల్గొంటానని అయితే తను మహారాజునని తెలిస్తే బావుండదని, మారువేషంలో సాధారణ పౌరునిలా సమావేశంలో పాల్గొంటానని చెప్పి అలాగే వచ్చి ఓ మూలాన కూర్చున్నాడు.

సమగ్ర తెలుగు సామ్రాజ్యస్థాపనే తన ధ్యేయంగా కలిగిన మరొకరు.. అందునా సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేయగల ఓ మహాకవి, మహా మాత్యుడు ఉండటం గణపతిదేవునికి ఎంతో ఆనందం కలిగించింది. అంతేకాదు తిక్కన అప్పటికే కార్య రంగంలోకి దూకి అన్ని రాజ్యాలలోని సమయశెట్టిలతో సమాలోచన సమావేశాలు జరుపు తున్నాడని తెలిసి కాస్తంత పులకరింపు కలిగింది.

ఇంతటి ఆధునిక కాలంలో కూడా మహారాజులకు ఎంతటి గౌరవ ప్రపత్తులున్నాయో.. పండితులకు, మహాకవు లకు కూడా అంతటి గౌరవప్రపత్తులు సాధారణ సమాజంలో ఉన్నాయని తెలియనివాడు కాదు గణపతిదేవుడు.

తిక్కనామాత్యుని ఆలోచన! గణపతిదేవుని ఆచరణ!!

ఈ భావన అతన్ని ఎంతో ఉత్తేజితుడ్ని చేసింది.

తిరిగి అనుమకొండకు వెళ్లగానే తన దైనందిన రాజ్యపాలనా కార్యక్రమం ప్రణాళికను సిద్ధం చేయవలసినదిగా మహా ప్రధాని వెల్లంకి గంగాధరునికి వర్తమానం పంపాడు.

                                                                                                      *         *         *

 రెండవ మెట్టు: చింతనా శిబిరం

‘‘ఓం శ్రీశ్రీ నమః శివాయ.. నమః రుద్రాయ

సకల గుణాలంకార.. పరనారీదూర

అనుమకొండ పురేశ్వరా సోమలదేవీ నిజేశ్వరా

దోర్భలభీమా రణరంగ రామా

వితరణకర్ణా శౌర్య సౌవర్ణా

పతిహితాంజనేయా శౌచగాంగేయా

సత్యరత్నాకరా దుష్ట జనభీకరా

స్వామిద్రోహరగండ శ్రీశ్రీశ్రీ కాకతి వంశాబ్ది కులచంద్రమా

శ్రీశ్రీశ్రీ గణపతిదేవ మహారాజులుంగారు

వేం చేయుచున్నారోహో.. వేం చేయుచున్నారోహో

వేం చేయుచున్నారోహో.. వేం చేయుచున్నా రోహో…

భట్రాజుల స్తోత్రపాఠాలకు తోడు పంచమహా వాద్యాల ఉద్వేగధ్వనులు.. రుజలు, బూరలు, బాకాల హోరు ఆ ప్రాంగణమంతా ప్రతిధ్వనిస్తుండగా, అందరూ విభ్రాంతిగా రెప్పవెయ్యకుండా చూస్తుండగా గణపతిదేవుడు హుందాగా నడచివచ్చి తన సింహాసనం వద్ద నిలబడ్డాడు. వెంటవచ్చిన లెంకలు వెనక్కు వెళ్లారు. ఆ హోరు తగ్గాక ఆయన చేతులు జోడించి సభకు నమస్కరించాడు. అప్పుడు ఆయన వంక చూడటం అందరికి ఎంతో ఉత్తేజంగా కన్నుల పండువగా ఉంది.

తిరుచూర్ణపు అంచున్న వెండిరంగు పట్టుపంచె కట్టి.. పైన బంగారు, ఎరుపు కలనేత కంచుకం ధరించి, వజ్రవైఢూర్యాలు పొదిగిన హారం, పొడుగైన ముత్యాలదండ ఎదపై కదలాడుతుండగా, నడుముకు ఉత్తరీయం చుట్టి దానిలో వజ్రాలపిడిగల చురకత్తి దోపాడు. ముఖాన విభూతిరేఖలపై నిలువు ఎరెర్రనిబొట్టు. తలపై బంగారు రంగు తలపాగా.. నిండైన కోరమీసం. నవ యవ్వనంతో తుళ్లిపడుతున్న ఉత్కృష్టరూపం. విశాలమైన నవ్వు. ఆరడుగుల అజానుబాహువు. అన్నివైపులా తల తిప్పుతూ అందరినీ చూస్తున్నాడు. కానీ ముఖంలో తొలిసారి సింహాసనం అధిష్టించినప్పటి చిన్న తొట్రుపాటు, అనుకంపన.. కిటకిటలాడుతున్న పెరోలగం.. అందరూ రెప్పవేయకుండా తననే చూస్తు న్నారన్న స్పృహ వల్ల వచ్చిన బెదురు..

ఆ ఉత్కృష్ట సింహాసనం అన్ని పల్యంకాల కంటే ఎత్తున ఉంది.

క్రిందివరుసలో మొదటి స్థానంలో మహాప్రధాని కుడివైపు, సర్వసైన్యాధ్యక్షుడు ఎడమవైపు ఉండగా వారి తర్వాతి వరుసలో కుడివైపు ప్రధానులు, అమాత్యులు, మంత్రులు.. తదితర పాలనా నియోగ ముఖ్యులు కూర్చోగా ఎడమ వైపు వివిధ స్థాయి సైనిక యోధులు కూర్చుని కనిపించారు.

ఓహో ఇదన్నమాట సభలో అందరు కూర్చునే విధానం! అనుకున్నాడు తొలిసారి సింహాసనం ఎక్కిన గణపతి దేవుడు.

తొలి సమావేశంలోనే తొలి అంశమే రుద్ర సేనానికి కృతజ్ఞతతో కూడిన గౌరవస్థానం ఇవ్వడం. ఆయనకు గంగాధర మహాప్రధాని సలహాతో ‘‘కాకతీయ రాజ్య సమ్మర్ధ్ద’’, ‘‘కాకతీయ రాజ్యభార ధౌరేయ’’ అనే బిరుదులను ప్రకటించాడు.                  సైనిక అంశాలలో యుద్ధ తంత్రాలలో మహామేధావి అయిన రుద్ర సేనాని వయస్సు పైబడుతున్నా ఇప్పటికీ.. మరింత కాలం.. శత్రు దుర్భేద్య కాకతీయ మహా సైనిక పారావరాన్ని నడిపించగల మహాయోధుడు. కాబట్టే రేచర్ల రుద్రసేనానిని ఆయన జీవితాంతం వరకు ఆయనే ‘కాకతీయ సకల సైన్యాధికారి’గా ప్రకటిస్తూ ఆయన ముందు సాగిలబడి సాష్టాంగ నమస్కారాలు సమర్పించాడు గణపతి దేవుడు.

సమస్త కాకతీయ రాజ్యలోకం హర్షధ్వానాలు అందజేసి రుద్రసేనానికి కృతజ్ఞతా కైమోడ్పులు చేసింది.

అనంతరం మహాప్రధాని గంగాధరమంత్రి లేచి మహారాజును ఉద్దేశించి ఆహ్వాన ప్రసంగం చేశాడు. రాజ్యపాలన సజావుగా సాగ•డానికి అన్ని నియోగాల ద్వారా పూర్తి సహకారం అందించగలమని హామీ ఇచ్చారు. తర్వాత సకల సైన్యాధికారి రేచర్ల రుద్రయ, సైనిక వీరత్వ ధోరణితో ప్రసంగించి రాజ్యభద్రత కోసం సర్వకాల సర్వావస్థలలో మహారాజు ఆజ్ఞలకు అనుగుణంగా పూర్తి సన్నద్ధంగా ఉంటామని ప్రతిజ్ఞ లాంటి ఉపన్యాసం చేశాడు.

ఆ తొలి రోజు మొత్తంగా పెద్దలిద్దరూ వెంట ఉండి నిత్యం జరిగే నాలుగు సమావేశాలు, వాటి తీరుతెన్నులు గణపతికి వివరించారు. అన్నిటిరి క్షుణ్ణంగా పూర్తి ఆసక్తితో విన్నాడు.. తెలుసుకున్నాడు.

‘‘మరోసంగతి మహారాజా.. రాచరిక సంప్రదా యాలలో తమరు మమ్మల్ని సభా సముఖంగా ఎప్పుడూ పెదనాన్నగారు లాంటి వ్యక్తిగత అనుబంధాలలో పిలువరాదు. కేవలం పదవి నామంతో పిలవడం సంప్రదాయం..’’ అన్నాడు గంగాధర మంత్రి. రెండు లిప్తల నిశ్శబ్దం అనంతరం తల ఊపి ఊరుకున్నాడు గణపతిదేవుడు.

దినమూ జరిగే నాలుగు సమావేశాలను ప్రత్యక్షంగా పరికించి సాయంత్రం చివరిది అయిన కళాసాహితీ సమావేశం కూడా పూర్తయిన తర్వాత ‘‘ప్రభుత్వ పరిపాలన విధివిధానాలు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. అలాగే ప్రస్తుత రాజ్యాల స్థితిగతులు.. ఎవరు మిత్రుడు, ఎవరు శత్రువు.. ప్రజల సమస్యలు ఏవిటి? వాటిని ఎలా నిర్వహించాలి?’’ అని అడిగాడు. ‘‘ఇవన్నీ నేను నిర్ణయించుకోవాలి. పాలన ప్రారంభించే ముందు పాలనా వ్యవస్థపై నాకొక పూర్తి స్థాయి అవగాహన కావాలని భావిస్తున్నాను. అందుకు తగిన మేధావులతో, పండితులతో ఓ సమా వేశం.. ఒక టేమిటి.. కొన్ని రోజులపాటు మేధోమధన చింతనా శిబిరం నిర్వహించాలని నేను వాంచిస్తున్నాను పెద్దనా.. ప్రధాని.. మహాప్రధానీ!!’’ అని వివరించాడు.

ఇద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు. గణపతిదేవుని ఆలోచనల ధార ప్రత్యేకమైనదని.. ఆయన ఏది చెప్పినా.. చేసినా పూర్తిగా ఆకళింపు చేసుకుని నిర్వహిస్తాడని వాళ్లకు తెలిసిన సంగతే.

‘‘అది ఎప్పుడైనా.. రాత్రి పగలు అనేవి లేవు మహారాజా. మన రాజ ప్రాసాదంలోనే. మీ అభీష్టం మేరకు..’’

‘‘అయితే రేపే శిబిరం ఏర్పాటు చేయండి.’’

‘‘ఇప్పటికిప్పుడు అంటే కష్టం మహారాజా. ఆయా రంగాలలో మహా పండితులను, శాస్త్రవేత్తలను, నిపుణులను గుర్తించి ఆహ్వానించాలి. వారు మన్నిం చాలి. ఇక్కడకు చేరుకోవాలి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని వెనువెంటనే తేదీ తమరికి తెలియజేస్తాను..’’ అన్నాడు మహాప్రధాని గంగాధరుడు.

నిజమేనన్నట్లు తల పంకించాడు గణపతిదేవుడు.

‘‘మతపెద్దలు.. శైవ వైష్ణవ బౌద్ద జైన మత మఠ పెద్దలను కూడా..’’ గంగాధరుడు అన్నాడు,

ముఖం చిట్లించి ఆపమన్నట్లు చెయ్యెత్తాడు. ‘ఇప్పుడు చర్చించేది మత సమస్యలు కాదు కదా. ప్రజల సమస్యలు. రాజ్య సమస్యలలో మత పెద్దలు ఏమి చేస్తారు.. వారిని పక్కన పెట్టండి.’’

ఆయన వెనుదిరిగాడు. అప్పుడన్నాడు గణపతిదేవుడు, ‘‘ఆ.. అయ్యా మహాప్రధానిగారు. ఒక్కరి పేరు చెబుతాను. వారిని మా ప్రత్యేక అతిథిగా ఆహ్వానించండి..’’ అంటూ ఆ ఒక్కరి పేరు చెప్పాడు.

ఆ ఒక్కరు విక్రమసింహపురి మహామాత్యుడు తిక్కనార్యుడు!

                                                                                                      *         *         *

గణపతిదేవుడు సింహాసనం అధిష్టించడం. మేధోమధన శిబిరం గురించి పట్టుబట్టడం వెనువెంటనే జరగలేదు.

పట్టమహిషి సోమలదేవిని దేవగిరిలో దింపి వచ్చాక మిత్రుడు అంకాలశెట్టి నివాసానికి వెళ్ళాడు.

గణపతిని చూసి అంకాల ఆశ్చర్యపోయాడు. ‘‘అరె.. మిత్రమా నువ్వు.. తమరు స్వయంగా రావడం మా ఇల్లు పావనమయ్యింది.’’ అన్నాడు ఆనందంగా.

‘‘ముందు తమరు.. తీసెయ్‌.. ఎప్పటిలాగే నువ్వు.. గణా.. అను చాలు.’’

‘‘నువ్వు అంగీకరిస్తావు మిత్రమా! కాని రాచ విధానాలు అంగీకరించవు. సరే. మన ఏకాంతంలో నువ్వు నువ్వే.

బయట నువ్వు తమరు..’’

ఇద్దరూ ఆప్యాయంగా చేతులు కలుపుకుని నవ్వుకున్నారు.

సాధారణ పౌరుని దుస్తులలో వచ్చాడు గణపతిదేవుడు. అప్పుడే ఎక్కడికో వెళ్లే హడావిడిలో ఉన్నాడు అంకాల.

‘‘ఏవిటి అంకాలా.. ఎక్కడికో వెళ్లబోతున్నావా??’’

‘‘ఆ.. చిన్నపని. డిండిమ అనే మిత్రుడొక డున్నాడు. అతనికి ఉరిశిక్ష వేసింది చాగిరాజ్య న్యాయ మహామండలి. మహారాజు గారితో ఆ విషయమై మాట్లాడాలని వెళ్లబోతున్నాను. సరే. రేపటికి వాయిదా వేసుకుంటాను. నువ్వు నా ఇంటికి వచ్చావు. అదే మహద్భాగ్యం. ఆ సత్యా.. మన ప్రయాణం రేపటికి వాయిదా వెయ్యండి.’’ అంటూ సహాయకునికి చెప్పాడు.

 అంకాలశెట్టి తండ్రి అల్లంశెట్టి. అల్లం వ్యాపారంలో ప్రతిష్టుడు. నతవాడి మహారాజు ఒక్కమల్లరుద్ర బావ గారికి మణిమాణిక్యాలు కుదువ పెట్టుకుని సొమ్ము ఇచ్చింది ఈ అల్లంశెట్టే. అందుకు కారణం అంకాలశెట్టి, గణపతి చిన్ననాటి మిత్రులు కావడం.

అంకాలశెట్టి ఎగుమతి దిగుమతి వణిజుడు. అతని కోష్టాగారమే ఓ పట్టణమంత పెద్దగా ఉంటుంది. ఆ ప్రాంగణం ఓ చిన్న రాజ్యపాలకుని రాజప్రాసాదం కంటే పెద్దదే. దాదాపు ఐదారొందల ఎడ్లబళ్లు ఎల్లప్పుడూ అనేకానేక వస్తువులను లోపలికి తెస్తూ.. బయటకు తీసుకుపోతూ ఉంటాయి. వేలమంది పనివాళ్లు, చిన్నచిన్న వస్తు ఉత్పతిదారులు, సరఫరాదారులు, వాళ్లు వేరు వేరు వస్తు నిపుణులు, గణికులు, కడిత లేఖకులు, సహాయకులు.. వేలాదిమంది ఉన్నారు.

ఏవేవో చర్చలు.. ధరల నిర్ణయం, లాభ శాతపు ఉజ్జాయింపులు.. ఓ మహారాజు యుద్ధానికి బయలుదేరుతున్నప్పటికి కంటే ఎక్కువ హడావిడి, జాగ్రత్తలు.. అరుపులు.. కేకలు.. ఎడ్ల మెడల్లో గంటలు, బళ్లవాళ్ల అదిలిం పులు..

ఇక అంకాలశెట్టి ప్రయాణమంటే నిజంగానే ఓ మహారాజు ప్రయాణం లాంటిదే. ఆయనకు సహాయకులే పాతిక మంది ఉంటారు. అందరూ గుర్రబ్బళపై• సిద్ధ్దమయ్యారు కాని గణపతిని చూసి అంకాలశెట్టి ఆగిపోయాడు.

ఈలోగా తేరుకున్న గణపతి, ‘‘ఎవరు.. ఆ మనిషి పేరు ఏవిటి అన్నావ్‌ అం‌కాలా.. డిండిమ??’’

‘‘అవును మిత్రమా. అతని పేరు డిండిమ నాయడు..’’ అన్నాడు వివరంగా.

‘‘అతడు.. నీబోటి వణిజుల కోష్టాగారాలను బద్దలుకొట్టి..’’

‘‘అవునవును. అతడే. వాడు ప్రజాహితైషి. ప్రజలను దోచుకుని దాచుకున్న వాళ్ల కోష్టాగారాలను ప్రజల మద్దత్తుతో కొల్లగొడతాడు. అది సహజంగా వణిజులకు, మహారాజులకు నచ్చదు కదా. అందువల్ల తిమ్మరుసు ఫిర్యాదుపై తనికి ఉరిశిక్ష విధించాడు మహారాజు. కాని అతడు చేస్తున్నది ప్రజల కోసమేనని నేను చెప్పదలచుకున్నాను. నా అభ్యర్ధనపై ఆయన నాకు ఈ రోజు కలవడానికి సమయం ఇచ్చాడు. వెళ్లబోతుండగా నువ్వు వచ్చావు.’’

అప్పుడే అంకాలశెట్టి ప్రధాన గణికుడు వచ్చి చెప్పాడు, ‘‘క్షమించండి శెట్టి. మహారాజు మీతో మాట్లాడడానికి.. ఈ విషయంపై మాట్లాడడానికి సుముఖంగా లేరట. ఇప్పుడే వార్త పంపారు.’’

మిత్రులిద్దరూ ముఖాలు చూసుకున్నారు.

అంకాల దీర్ఘంగా నిశ్వసించి, ‘‘ప్చ్.. ‌డిండిమను ఇక ఎవ్వడూ రక్షించలేడు..’’ అన్నాడు.

గణపతి చురుకయ్యాడు, ‘‘అతడు.. డిండిమ మంచివాడని నీ అభిప్రాయమా అంకాలా?!’’

‘‘నిస్సందేహంగా. ప్రజల కోసం తన జీవితాన్ని పణంగా పెట్టినవాడు డిండిమ. ఎంతమంది రాజులు నిజంగా ప్రజల కొరకు పాటుపడుతున్నారు?! ఎప్పుడో ఒకప్పుడు ఏ మహారాజో తనను నిజంగానే ఉరి తీస్తాడని అతడు అతడెప్పుడూ భావిస్తుంటాడు. గతంలో నాతో అన్నాడు కూడా..’’

రెండులిప్తల కాలం.. కేవలం రెండులిప్తల కాలం ఆలోచించాడు గణపతి దేవుడు.

‘‘మనం అతన్ని రక్షిద్దాం అంకాల. కదులు. వస్త్రాలు మార్చుకో. నాలాగా సాధారణ బట్టలు కట్టుకో. సహాయకుల్ని వదిలేయ్‌. ‌మనిద్దరమే వెళదాం. నేనున్నానుగా.. కదులు..’’

ఆశ్చర్యంగానూ ఉత్తేజంగానూ చూశాడు అంకాల. గణపతి అసాధారణ శక్తియుక్తులు అతనికి తెలుసు. కాని

కాని.. అంటూ ఊగిసలాడుతున్నాడు.

‘‘ఏవిటి ఆలోచిస్తున్నావ్‌.. ‌సమయం లేదు మిత్రమా!యముడి మహిషం అతన్ని చేరే లోపలే మనం అతన్ని తీసుకుని ఇక్కడికే నీ నివాసానికే తిరిగి వద్దాం.. పద..’’ తొందరపెట్టాడు గణపతిదేవుడు.

అతడు ఉద్వేగంతో ఉన్నాడని గుర్తించిన అంకాల మరికొద్ది సేపటిలోనే సాధారణ దుస్తుల్లో తన అశ్వాన్ని ఎక్కి గణపతిని అనుసరించాడు. ఇద్దరు చాగి రాజధాని బృహత్కంచి పురం వైపు సాగిపోయారు.

రాత్రివేళకు బృహత్కంచి చేరారు.

చేరడమైతే చేరారు కాని డిండిమను రక్షించడం అంటే చీకట్లో నల్లపిల్లిని పట్టుకోవడమే. ఇద్దరూ వీధిలో నిలబడిపోయారు.

రాజకోటకు వెళితే.. ‘మీరెవరు? ఎందుకు వచ్చారు?’ అని అడుగుతారు. ఏమి చెప్పాలి.. డిండిమ పేరు సామాన్యులకు బాగా తెలుసు. అడిగితే వాళ్ల్ళు గుండెలు బాదుకుంటూ పెద్దపెట్టున ఏడుస్తారు. అల్లరి అవుతుంది.

అక్కడ ఆగిపోయాడు గణపతి. అల్లరి అయితే.. అవుతుంది. అవనీ!! రాజభటులు వస్తారు. పట్టుకెళతారు. అలా కోటలోకి ప్రవేశించవచ్చు.

అంకాలతో అదే చెప్పాడు.

అతడు పూర్తిగా వణిజుడు. ఇలాంటివి ఏ మాత్రం తెలియదు. కాకపోతే అందరిలా ఉదయాన్నే వ్యాయామాలతో బలిష్టమైన శరీరుడు. గణపతి చెప్పింది మంచో చెడో చెప్పలేక దిక్కులు చూస్తున్నాడు. కాకపొతే పక్కనున్న వాడి ఆలోచనలను పసిగట్టి తనకు లాభమో, నష్టమో లిప్తలకాలంలో నిర్ణయించుకోగల వ్యాపారి.

దాదాపు ఊరు నిద్రకు ఉపక్రమిస్తున్నవేళ.

ఇద్దరు బలిష్టులైన యువకులు గణపతి, అంకాలశెట్టి.. బాట మధ్యలో గుర్రాలపై ఆగి ఎటు వెళ్లాలో తెలియక దిక్కులు చూడటం రాత్రి కాపలాభటుల దృష్టిలో పడింది. మరి కాసేపటికి ఇద్దరు పహారా సైనికులు కత్తులు పట్టుకుని.. ఆ•టిని ఎత్తి చూపిస్తూ ఝుళిపిస్తూ రాసాగారు. వీళ్లు భయపడిపోవాలని వాళ్ల ఆలోచనగా గణపతి, అంకాలశెట్టి గుర్తించారు.

తన గుర్రాన్ని ఎక్కడెక్కడో చేతితో తడుతూ, ‘‘నువ్వేమీ అల్లరి చెయ్యకు..’’ అని దానికి చెబుతూనే.. ఆ ఇద్దరూ దగ్గరకు రాగానే ఊహతీతంగా లాఘవంగా ఎగిరి ఒకడ్ని దొరకబుచ్చుకుని వాడి కత్తికి దొరకకుండా వాడి వెనగ్గా నడుము పట్టుకుని చేతులు విరిచి బిగించాడు. మరొకడు పెద్ద పెద్దగా అరుస్తూ కత్తి విసిరాడు. గణపతి లాఘవంగా తప్పుకున్నాడు. ఒకటి.. రెండు.. మూడు.. ఊహు.. తిప్పి తిప్పి అలసిపోయాడు గాని గణపతిని ఏమీ చెయ్యలేకపోతున్నాడు. వాడి కత్తి విసుర్లు గణపతికి తగలడంలేదు. గణపతి పట్టులో ఉన్న మరొకడు కనీసం కదలలేకపోతున్నాడు. అలావాడిని బంధించాడు. కత్తి విసిరి విసిరి విసుగొచ్చి.. కత్తివాడు రొప్పుతున్నాడు. అప్పుడు మరొకసారి ఎగిరి వాడి కత్తిని గట్టిగా పట్టుకున్నాడు గణపతి. ఆయన చేయి తెగుతుందేమో అని అంకాల పిచ్చికేక వేసి కళ్లు మూసుకున్నాడు. చిత్రం..ఆ కత్తి గణపతిని ఏమీ చెయ్యలేకపోయింది. ఆయన దానిని లాక్కుని ఒక్క చేతిలో దానిని లేత వరి మొక్కను వంచినట్లు వంచాడు.

అంకాలకి అంత చీకట్లోనూ వెన్ను వెంట చమట పట్టింది.

గణపతి ఒక్కచేతితో శత్రువు కత్తి గుంజుకుని అదే చేతితో దానిని పుల్లముక్కలా వంచడం.. జీవితంలో ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. వినలేదు కూడా.

ఆ కత్తివీరుడిని కూడా లాఘవంగా పట్టి ఇద్దరిని తన కబంధ కౌగిలిలో బంధించేశాడు. రాత్రి పహారా సైనికులయిన ఆ కత్తివీరులిద్దరూ గణపతి ఉక్కు కారాగారం లాంటి కౌగిలిలో గిలగిల కొట్టుకుంటు న్నారు. బయటపడే మార్గం ఏమాత్రం లేదు.

ఈ కలకలం.. గుర్రాల కదలిక దూరానికి కూడా తెలుస్తున్నాయి. దూరాన కాగడాల వెలుగులో మరో ఇద్దరు కాపలా సైనికులు ఇటే రాసాగారు.

గణపతి, అంకాల కంటే ఈ కత్తివీరులిద్దరూ వణికిపోసాగారు.

‘‘అయ్యా.. బాబో.. తమరెవరు? కత్తిని పూచిక పుల్లలాగ నలిపేశారంటే తవురు మావూలోళ్లు కాదు..’’ అంటూ ఇద్దరూ ఆ వచ్చేవాళ్లను చూస్తూ గుంజుకోసాగారు.

 ‘‘ఆళ్లు వొస్తే మా కొలువు ఊడతది. అటు అదిగో ఆ పక్క సందులోనే మా ఇల్లు. ఆడకి.. అటుపోదాం.’’ అంటూ ఇద్దరూ భయంతో వణికిపోతూ ఆ వైపు గుంజుకోసాగారు.

గణపతి వాళ్లిద్దరిని వదలకుండానే వాళ్లు చెప్పిన సందులోకి ఈడ్చుకుంటూ పోసాగాడు.

రెండు గుర్రాలను పట్టుకుని వాళ్ల వెంట అంకాల నడవసాగాడు.

పక్కసందులో ఓ గుడిసెలోకి వెళ్లారంతా. లోపల ఓ మహిళ, ఇద్దరు పిల్లలు.. కుక్కిమంచంలో ముసలివాడు ఉన్నారు. అందరూ బిక్కచచ్చిపోయి దిమ్మెరపోయి చూడటం గుడ్డిదీపం వెలుగులో తెలుస్తోంది. తలుపులాంటి మేదరి తడికె మూశాక ఇద్దరిని తన భల్లూకపు పట్టునుండి విడిచాడు గణపతి. వాళ్లిద్దరూ గణపతి

కాళ్ళపై పడిపోయారు.

‘‘తమరెవరో.. ఈ రాజ్యం వొళ్ళు కాదు సావి. సెప్పుర్రి. ఎందుకొచ్చారో??’’

ఇద్దరు ఆజానుబాహులు రావడంతో ఆ చిన్న గుడిసె నిండిపోయింది.

‘‘డిండిమ.. డిండిమ తెలుసా?!’’ అన్నాడు గణపతి.

అంతే. పిల్లల మొదలు అందరిలో గొప్ప చైతన్యం!! తెలుసన్నది వారి శరీర భాష చెబుతోంది.

‘‘డిండిమ మా దేవుడు సావి. నేను నా కుటుంబం ఇంత తింటన్నావంటే అది ఆ దేవుడి సలవే సావి..’’

‘‘డిండిమకు ఉరిశిక్ష విధించారని రేపో ఎల్లుండో..’’ …చెబుతున్న అంకాలను ఆపుతూ ఓ కత్తివీరుడు అన్నాడు.

‘‘ఎల్లుండి సావి. ఆ దేవుడే దుర్మార్గుడు సావీ. లాపోతే అట్టాంటి గొప్పోడికి ఉరి సిచ్చా??’’

అంకాల కొంత ఆశ్చర్యపోగా గణపతి ఎక్కువ ఆశ్చర్యపోయాడు. డిండిమ పేదల ఆర్తత్రాణ పరాయణుడు అని అంకాలకు తెలుసు. కాబట్టే అతన్ని రక్షించా లని బయలుదేరాడు.

‘‘నువ్వు రాజ్య ఉద్యోగివి కదా. నీకు జీతం గీతం ఉంటుంది కదా? నువ్వు తిండికి లేనివాడివి కాదే!?.. అతడు నీకు సహాయం చెయ్యడం?’’ గణపతి గొంతుకలో చిన్న ఉత్సుకత.

‘‘పేరుకే జీతం. నెలసరి జీతం. ఒక మాసం ఇస్తే మూడు మాసాలు ఇవ్వరు. ఏమి చేస్తాం. పస్తులే. డిండిమ మా నాయనకు శిష్యుడు. అతనికి యుద్ధం నేర్పింది మా నాయనే. అందుకని మాకేమీ తక్కువ కాకుండా అంత ఇంత వడ్లు, బట్టలు ఇచ్చిపోతాడు.’’

(సశేషం )

About Author

By editor

Twitter
YOUTUBE