‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన
-మత్తి భానుమూర్తి
ఓ స్వయంపోషిత రాజ్యంలో.. సైనికుడికి కూడా డిండిమ సహాయ పడుతున్నాడు. కారణం రాజ్యం ఇచ్చే మాస జీతం సరిపోవడం లేదు.
గణపతి, అంకాల ముఖాలు చూసుకున్నారు. ఓ మహారాజు అయిన గణపతి చాలా ఖిన్నుడయ్యాడు.
‘‘మరి ఇంతింత పన్నులు విధిస్తారు. భయపెట్టి వసూలు చేస్తారు. ఆ సొమ్మంతా ఏమి చేస్తున్నట్లు?’’
అంకాల సాలోచనగా అన్నాడు.
‘‘వసూలయ్యింది అంతా రాజుగారి కిరీటాలకు, మహారాణి గారి వడ్డాణాలకు సరిపోతుంది. మిగిలితే ఇదిగో ఇలాంటి పనికిరాని కత్తులు కొనడానికి ఖర్చు చేస్తారన్నమాట.’’ అన్నాడు గణపతి.
‘‘అది సరే. ఆ కత్తిని ఏవిటి అలా పిచ్చిమొక్కను విరిచినట్లు విరిచేశావ్ గణా?’’ అన్నాడు ఆశ్చర్యంగా అంకాల.
‘‘అదొక కత్తా. వీళ్లు ఇచ్చే సొమ్ముకు ఇంతకంటే మంచి కత్తులు ఎక్కడినుండి వస్తాయి. వాటితో అమాయక రైతులను భయపెట్టి పన్నులు వసూలు చేస్తారు గాని యుద్ధానికి పనికిరావు మిత్రమా..’’
‘‘సరే సరే.. అసలు డిండిమను ఎక్కడ బంధించారో తెలుసా?’’
అప్పుడే బయట కలకలం వినిపించింది. పహారా సైనికులు ఇద్దరూ అప్రమత్తమయ్యారు.
‘ఏటయ్యిందేమోనని మావోళ్లు వచ్చేశారు. మేం పోతాం. లేకుంటే మీరెవరో ఆళ్లకు సెప్పాలి. ఈయన మా నాయన దేవరయ. నాయనా.. డిండిమను కాపాడ్డానికి ఒచ్చిరంట. ఈ అయ్యలకు సాయం సెయ్యే..’’ అంటూ ఇద్దరూ వడివడిగా బయటకు వెళ్లిపోయారు.
వాళ్లు వెళ్లిపోయాక గణపతి, అంకాల మంచంలో దేవర విగ్రహంలా కూర్చున్న ఆ దేవరయ వైపు చూశారు.
ఆయన చటుక్కున మంచం నుండి ఎగిరి దూకాడు. అతన్ని చూసి ఇద్దరూ ఖంగుతిన్నారు. ఆయన కాళ్లు మోకాళ్ల వరకే ఉన్నాయి. ఆయన అలాగే ఆ ఉన్న కాళ్ల పైనే నడుస్తున్నాడు నేలపై మరుగుజ్జులా. మంచం ఎత్తి మూలనున్న గడ్డపార తీసుకుని గదిలో చకచక తవ్వసాగాడు.
కేవలం ఆ గదిలో చిన్నదీపపు వెలుగులో అతడు ఏకాగ్రతతో చకచకా గుంట ఏర్పడేలా నేల తవ్వాడు. ఆ గుంటలో పెద్ద మోకుతాడు.. బలిష్టమైన పెద్ద కొండచిలవలా చుట్ట చుట్టుకుని ఉంది. దానిని దులిపి ఎత్తి నెత్తిన పెట్టుకున్నాడు.
‘‘పదండి..’’ అంటూ కదిలాడు.
అతడు చకచకా మోకాళ్లపై నడుస్తూ వెళ్లిపోతుంటే తెల్లబోయి చూస్తున్న మిత్రులిద్దరూ గుర్రాలను ఇంటి వెనుక వదిలి అతని వెనుక పరుగు పెట్టారు.
రాత్రి గాఢమైంది. జనం తలుపులు మూసుకుని నిద్రలోకి వెళ్లిపోయారు. పహారా సైనికులు వీళ్లను పట్టించుకోవడంలేదు. చివరికి రాజప్రాసాదం దగ్గరగా చుట్టూ నాలుగైదు మహాభవనాలున్నాయి. వాటిల్లో ఓ భవంతి వెనగ్గా వెళ్లి దాని గోడలను తట్టి చూశాడు. సంతృప్తితో నెత్తిన ఉన్న భారీ తాడుచుట్టను క్రింద పడవేశాడు.
దేవరయ అప్పుడు మొదటసారిగా మాట్లాడాడు. ‘‘ఇదే కారాగారం. నేను ఈడ పాతికేళ్లు కాపలా సైనికుడిగా పని చేశా. ఓ అడవి దొంగల ముఠా ఈ పైనుండే పారిపోయారు. నేను వెంటపడి ఆరుగురిని సంపేశా. మిగిలినోళ్లు నా కాళ్లు నరికేశారు. అప్పటి నుండి ఈ పైనున్న రాయి పక్కకి తొలగే ఉంది. ఆ సంగతి నాకే తెలుసు. డిండిమను కాపాడ్డానికి మీరొస్తే ఆయనగోరి కోసం నేనూ సాయం సెయ్యలని ఒచ్చా..’’
ఆ చీకటిలో అతని ప్రతి మాటా కత్తి ప్రహారంలా గణపతి గుండెల్లో గుచ్చుకుంది. ఇద్దరూ దిమ్మెరబోయి చూస్తుండగా దేవరయ భవంతికి దగ్గరగా ఉన్న పెద్దవృక్షం ఎక్కాడు.
‘‘మీలో ఒకరు నాతో రండి. మరొకరు ఈడే ఉండండి..’’
ఈ చెట్టు నుండి కారాగారం లోపలనున్న మరో పెద్ద చెట్టుకి మోకు విసిరి దాని సాయంతో కారాగారం లోపలికి దిగిపోయాడు. అతని వెనుక గణపతి కూడా కారాగారంలోకి వెళ్లాడు. మోకు చివరి అంచు నడుముకు చుట్టుకుని అంకాల అక్కడే ఉన్నాడు.
మరో గంట తర్వాత నలుగురూ తిరిగి ఊరి వైపు పరిగెత్తసాగారు.
* * *
అనుమకొండ రాజప్రాసాదం.
పండిత సమావేశ మందిరం కిటకిటలాడుతోంది.
ఆరోజు చింతన శిబిరం ప్రారంభం. ఈ మందిరం మహారాజుగారి ప్రధాన సమావేశాలు నిర్వహించే మందిరంలా లేదు. ఇతర పెద్ద పెద్ద సమావేశాలు జరగడానికి తగ్గట్లు.. ఎక్కువమంది అందరూ దగ్గర దగ్గరగా కూర్చుని చర్చించుకునేలా నిర్మాణం ఉంది. విశాలంగా ఉన్న ఆ మందిర మంతా.. అరుగుల్లా కొన్ని ఎత్తుగా.. కొన్ని పల్లంగా.. అందరూ బాసింపట్టు లేదా పద్మాసనం వేసుకుని దగ్గర దగ్గరగా కూర్చునేలా ఉంటాయి. అందరూ నేలపై పరచిన చాపలపై.. లేదా మెత్తని కశ్మీరు కంబళ్లపై కూర్చుంటారు. అందరి మాటలు, ఉపన్యాసాలు, వాటిపై అభిప్రాయాలు, ఖండన మండనాలు, అభినందనలు, హాస్యాలు, కోపాలు, వ్యంగ్యం, తిట్లు.. ఒకటేమిటి పండిత చర్చల్లో వినవచ్చే అన్ని అంశాలు అందరికి వినపడేలా.. అర్ధమయ్యేలా ఆ మందిర నిర్మాణం ఉంది.
అక్కడ మహారాజు.. ప్రధాని, సర్వసైన్యాధ్యక్షుడు, పండితుడు, నిపుణుడు కూడా ఒక్కలాగే కూర్చుంటారు.
మహాప్రధాని గంగాధరమంత్రి అతిథులు ఒక్కొక్కరిని గణపతిదేవునికి పరిచయం చేస్తుండగా ఆయన వినయంగా తలవాల్చి నమస్కరిస్తూ ఆహ్వానం పలికాడు.
అందరూ విశ్రాంతిగా కూర్చున్న తర్వాతనే ఆయన కూర్చున్నాడు.
అందరికి తగిన వింజామరలు, మంచినీరు, ప్రతివారికి అందుబాటులో ఏదైనా వ్రాసుకోవలంటే కొన్ని తాళపత్రాలతో వ్రాత బల్ల.. ప్రక్కనే ఘంఠాలు, సిరా పిడతలు.. కనుసైగతో అడిగింటే తడవుగా ఏదైనా అందించడానికి చురుకైన పరిచారికలు.. వారికి ఆవలగా కొందరు మగ సహాయకులు.. అందరూ జరగబోయే గొప్ప చారిత్రాత్మక చింతనా శిబిరానికి పూర్తిగా సర్వం సిద్ధం చేస్తూ చురుగ్గా పరుగులు పెడుతున్నారు.
మహామహోపాధ్యాయుడు, అపర సరస్వతి రూపం, పుంభావ సరస్వతి, హరిహరతత్వజ్ఞులు, తెలుగుజాతి మరెన్నోతరాల స్మరణీయులు, విక్రమసింహపురి రాజ్య గౌరవ మహామాత్యులు బ్రహ్మశ్రీ తిక్కనామాత్యులను శిబిరానికి అధ్యక్షునిగా నిర్ణయించి వారు అధ్యక్షులుగా ఉండటం తన అదృష్టంగా ప్రకటించాడు చక్రవర్తి.
శిబిరానికి విచ్చేసిన మహామహులంతా హర్షధ్వనాల మధ్య తమ ఏకగ్రీవ ఆమోదాన్ని ప్రకటించారు.
దాదాపు వందమంది వివిధ రంగాలలో నిపుణులైన మహాశాస్త్రవేత్తలు, విషయనిపుణులు, పండితులు, వాణిజ్య శ్రేణి ప్రముఖులు హాజరయ్యారు. కాకతీయ రాజ్య పాలనా ప్రముఖులు, డెబ్బది రెండు నియోగాల అధికారులు, మహాప్రధాని, పదిమంది ప్రధానులు, పాతికమంది అమాత్యులు, మరో పాతికమంది మంత్రులు, మరో యాభై మంది వివిధ రంగాల సలహాదారులు, సామంత రాజులు, మండలేశ్వరులు కూడా హాజరయ్యారు.
ఈ చింతనా శిబిరానికి ఆహ్యావనం అందుకున్న వీరంతా భారతదేశ.. ఏదేని రాజ్యంలో పుట్టిపెరిగినా వారి ప్రతిభ వ్యుత్పత్తులు అన్ని రాజ్యాలలో.. కొందరు సహజసరిహద్దులు దాటి అఖండభారత రాజ్యాలలో కూడా గుర్తింపు తెచ్చుకున్నవారు.
మొత్తంగా రెండువందలమంది విజ్ఞానులతో ఆ సభాప్రాంగణం అంతా కిటకిటలాడుతోంది.
తొలుత తిక్కనార్యుడు తన అధ్యక్షోపన్యాసం చేశారు.
‘‘ఇది కలా నిజమా.. తెలియడంలేదు. గతంలో ఇలాంటి ఒక శిబిరం జరిగినట్లు పురాణాలు, వేదాలు, బ్రాహ్మణాలు.. ఏ అర్వాచీన సంప్రదాయ గ్రంథాలలోనూ.. బౌద్ద, జైన పుస్తకాలోనూ చూడలేదు. భూమండలం ఉన్నంత వరకు చిరస్థాయిగా నిలిచేలా పరిపాలన చేసిన షట్చక్రవర్తులు కూడా ఇలాంటి శిబిరాన్ని నిర్వహించారని నేను చరిత్రలో చదవలేదు. తన పరిపాలన ప్రారంభంలోనే ఇలాంటి శాస్త్ర చర్చ, సమస్త రాజ్య అంశాలు, సహజ వనరులు, రాజ్య లక్షణాలు, ఇందున్న సంపదలు, సమస్యలు తెలుసుకోవాలని ఓ వారసత్వ పాలకుడు కోరుకోవడమే మహా విడ్డూరం. అందుకు మన మహారాజు శీశీశ్రీ గణపతిదేవులవారిని అభినందిస్తున్నాను.
అయితే నా అభిప్రాయంలో మన రాజ్యం.. అంటే కాకతీయ రాజ్యం అనే కదా అర్ధం?!.. మరి నేను ప్రాతినిధ్యం వహించే రాజ్యం వేరు. అది విక్రమ సింహపురి రాజ్యం. ఇక్కడి నుండి వేల యోజనాల దూరంలో ఉంది. ఇప్పుడు మనం నా రాజ్యమంచి చెడ్డలు విశ్లేషించాలా.. లేక కాకతీయ రాజ్యమంచి చెడ్డలు విశ్లేషించాలా..?’’
అందరూ నిశ్శబ్దం. అయోమయంగా చూశారు.
గణపతిదేవుని ముఖంలోనూ ఆశ్చర్యం కనపడింది. నవ్వుతూ అన్నాడు.
‘‘మహాకవీ.. తమరు చెప్పింది అక్షరాలా నిజం. ఇది మా రాజ్యం. అది మీ రాజ్యం. ఇక్కడున్న పెద్దలు పండితులు వేరు వేరు రాజ్యాల నుండి వచ్చారు. కొందరు ఉత్తరాది నుండి, కొందరు దక్షిణాది నుండి కూడా విచ్చేశారు. కాని ఆ రాజ్యమైనా ఈ రాజ్యమైనా ఏ రాజ్యమైనా.. అక్కడి ప్రజల జీవితాలు, బాధలు, ఇక్కడి ప్రజల బాధలు, ప్రజల బాధలన్ని సమాజ సమస్యలన్ని ఎక్కడైనా ఒక్కటే అని నా అభిప్రాయం. కాబట్టి ఈ చిన్న చిన్నరాజ్యాల సరిహద్దులన్నీ చెరిపేసి మన ప్రజలందర్ని ఏకంచేస్తే ఆ రాజ్యం ఎలా ఉంటుందో.. దాని రూపురేఖలు ఎలా ఉంటాయో ఊహించి ఆ రాజ్యపాలన ఇలా ఉండాలో తమరు చెప్పండి మహాకవీ..!’’
రెట్టించిన ఉత్సాహంతో కరతాళధ్వనులతో స్వాగతించారు ప్రముఖులంతా.
మళ్లీ తిక్కన కొనసాగించాడు.
‘‘అద్భుతం మహారాజా! అద్భుతం. నేను కలలు కంటున్నది తెలుగురాజ్యం. తొట్టతొలిగా భాషను ఆధారంగా చేసుకుని ప్రకటిస్తున్న రాజ్యం. ఇప్పటివరకు ఎవ్వరూ భాషాప్రయుక్త రాజ్యం అనే ఆలోచనే చేయలేదు. మా భాష మాట్లాడే వాళ్లంతా ఏక రాజ్యంగా ఉండాలని ప్రవచించిన మహారాజులు గాని, పండితులు గాని, మంత్రాంగ నిష్ణాతులు గాని నా దృష్టికి రాలేదు. భాషారాజ్యం.. తెలుగుభాషా రాజ్యం. అంటే తెలుగు మాట్లాడే ప్రజలందరినీ ఏకంచేసి ఒకే రాజ్యంగా ఏర్పరచాలి. ఇది మనమే కాదు తమిళరాజ్యం, కన్నడ రాజ్యం, మరాఠీ రాజ్యం.. ఇకపై ఇలా భాష ప్రధానంగానే రాజ్యాలను పిలుచుకునే రోజులు రాబోతున్నాయి. అందులో పప్రథమం తెలుగు భాషా రాజ్యం. అదే తెలుగు సామ్రాజ్యం. అదే కాకతీయ సామ్రాజ్యం కావాలి. ఇది నేను కలలు కంటున్నది. దానిని సాధించగల మహావీరులు మీరే అని నా విశ్వాసం. కాబట్టి ఈ చింతన శిబిరం మొత్తం తెలుగు మాట్లాడే ప్రజలున్న ప్రాంతాలన్నింటిని కలగలిపిన ఓ అద్భుత రాజ్యంగా.. తెలుగు సామ్రాజ్యంగా భావించి.. దాని స్వరూపస్వభావాలను ఆకళింపు చేసుకుని.. అందున్న మంచిచెడ్డలపై ప్రసంగించవలసినదిగా మహాను బావులనందరిని కోరుతున్నాను.’’
తిక్కన అధ్యక్షోపన్యాసంతో శిబిర చింతనాపరులకు ఓ స్పష్టత వచ్చింది. అందరి ఆలోచనలూ ఓ స్పష్టమైన హద్దులున్న ప్రాంతాన్ని ఊహించుకుంటూ దానిపై తమ ప్రత్యేక అంశాలకు మెరుగు పెట్టుకుంటున్నారు మనసుల్లోనే. ప్రస్తుత రాజ్యాల వివరాలు, పాలనాంశాలు చెప్పడానికి రాజకీయ ధురంధరుడుగా పేరున్న ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు యల్లరౌతును ఆహ్వానించాడు తిక్కన.
‘‘మహా తంత్రజ్ఞులు, మహాకవులు శీశీశ్రీ తిక్కనామాత్యులకు, కాకతీయ చక్రవర్తి గణపతిదేవుల వారికి ప్రణామములు. మొత్తం తెలుగుభాషా రాజ్యంగా తీసుకుని దానిపై మన చింతనను చర్చించడం ముదావహం. అయితే నేను ప్రస్తుత హద్దులలోపలి రాజ్యాల గురించి చెప్పనా.. హద్దుల లోని రాజ్యాలు, హద్దుల ఆవల రాజ్యాల గురించి చెప్పనా?’’ అన్నాడు.
శిబిరమంతా మళ్లీ మౌనం. అంటే ఈ అంశంలో కూడా స్పష్టత కావాలని అందరికీ అర్ధమౌతోంది.
గణపతిదేవుడు తిక్కనార్యుని వంక చూశాడు.
ఆయన దీర్ఘంగా తలపంకించి, ‘‘ముందు అంతర్గత సమస్యలు, తగవులు సరిదిద్దుకుని హద్డులలోని రాజ్యాల గురించి ఆలోచించడం మంచిది మహారాజా..’’ అన్నాడు.
అందుకు గణపతిదేవుడు కూడా అంగీకారంగా తల ఊపాడు.
అందరూ నిశ్శబ్దమయ్యాక యల్లరౌతు మహారాజుకు, తిక్కనార్యునికి నమస్కరించి ఓ మారు గొంతు సవరించుకుని ప్రారంభించాడు.
‘‘మహాకవులు తిక్కనామాత్యులు ఉద్యమిస్తున్న అంశం తెలుగు భాషారాజ్యం. మొత్తంగా ఓ సామ్రాజ్యం. చిత్ర మేమిటంటే ఇప్పటివరకు సకల భోగభాగ్యాలతో తులతూగుతున్న ఈ తెలుగుసీమను విశాల సామ్రాజ్యరూపంగా పాలించినవారు ఎవ్వరూ లేరు. కారణం ఆ స్థాయి మహావీరులు ఇక్కడ పుట్టకపోవడం. ఆ లోటును భర్తీ చేస్తూ తెలుగు సామ్రాజ్య రూపం స్పష్టమైన మధుర క్షణాన గణపతిదేవుడు లాంటి అచ్చమైన తెలుగువాడు చక్రవర్తిగా ఉండటం మా అదృష్టం. అయితే ఈ తెలుగు భాష మాట్లాడే రాజ్యాలన్నీ చిన్నచిన్నవి. చిన్న చిన్న రాజ్యాలలో సమస్యలు ఇన్ని అన్ని అని చెప్పడానికి మాటలు రావు.
ఒక చిన్న రాజ్యం అష్టైశ్వర్యాలతో తులతూగుతుంటే.. సరిహద్దులో మరో చిన్నరాజ్యం దుర్భర దారిద్య్రంలో కునారిల్లుతుంటుంది. మొత్తంగా చెప్పవలసివస్తే.. చిన్న రాజ్యాలన్నింటి మధ్య సరిహద్దులు తొలగించి ఓ సామ్రాజ్యంగా చూస్తే ప్రజల్లో తీవ్రమైన ఆర్ధిక, సామాజిక వైరుధ్యాలు కనపడుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చిన్నరాజ్యాల వలననే తెలుగు ప్రజలు దుర్భర దారిద్య్రంలో ఉన్నారు మహారాజా..’’
ఏదో గుర్తొచ్చినట్లు గణపతిదేవుడు చెయ్యెత్తాడు ఆపమన్నట్లు.
శిబిరమంతా పరికించి చూసి ఓ వ్యక్తిని గుర్తించి ముందుకు రావలసినదిగా చేయి ఊపి ఆహ్వానించాడు.
ఆ వ్యక్తి డిండిమ.. డిండిమరాయడు!
‘‘ఆ.. డిండిమా.. ఇప్పుడు మీ అభిప్రాయాలు చెప్పండి. తెలుగు మాట్లాడుతున్న చిన్నరాజ్యాల పాలన ప్రస్తుతం ఎలా ఉంది?.. ప్రజల సుఖశాంతుల సంగతి ఏవిటి??’’
కూర్చునే అందరికి నమస్కరించిన డిండిమను మేధావులంతా ఆశ్చర్యంగా.. విచిత్రంగా చూశారు. అతనిది పండిత రూపం కాదు. బలిష్టయోధుని రూపం, సాధారణ ఆహార్యం. జీవితానుభవాలతో రాటు తేలిన వ్యక్తిత్వం అతని ముఖంలో తేజరిల్లుతోంది. అక్కడేవ్వరికి డిండిమ ఎవరో తెలియదు. తిక్కనామాత్యునికి కూడా. చక్రవర్తి గణపతిదేవునికి, అంకాల సెట్టికి మాత్రమే తెలుసు.
చక్రవర్తి గణపతిదేవుడు స్వయంగా పరిచయం చేశాడు. ‘‘డిండిమ ఇతని పేరు. ఈయన గురించి మీకు ఏమి చెప్పాలి.. ఆ.. దాదాపు పాతికరాజ్యాలు ఇతనికి మరణదండన విధించాయి..’’
ఒక్కసారిగా శిబిరమంతా కలకలం. ఇలాంటి వాడు మహారాజుల ఆస్థానంలో.. అందులోనూ కాకతీయ చక్రవర్తి సమావేశంలో ఉండటమే ఆశ్చర్యమని అందరికి లిప్తకాలంలో కలిగిన ఏకాభిప్రాయం.
‘‘డిండిమా.. చిన్నరాజ్యాలలో ప్రజల జీవితాలను చూసిన నీ అనుభవాలు చెప్పు..’’ అన్నాడు చక్రవర్తి.
డిండిమ గొంతు సవరించుకుని పెద్ద కథ చెప్పబోతున్న కథకునిలా తన ఉపన్యాసాన్ని ప్రారంభించాడు.
‘‘నా చిన్ననాడు నేను చూసిన ఓ సంఘటన చెబుతాను.. ఓ నడిరాత్రి నేను మా అమ్మ పక్కలో పడుకుని ఆమె కప్పిన పమిట క్రింద ఆదమరచి నిద్రపోతున్నాను. అప్పుడు హటాత్తుగా ఎవరిదో స్త్రీ ఏడుపులు.. పెడబొబ్బల•. నేను ఉలిక్కిపడి లేచాను. ఎవరో ఆమె హృదయవిదారకంగా ఏడుస్తోంది.. ఎవరో ఇద్దరు ముగ్గురు మగవారి గొంతుకలు ఏవో మంత్రాల్లాంటివి అరుస్తూ చదువుతున్నట్లు వినవస్తున్నాయి. ఆ వినపడేది మొత్తంగా భయపెడుతోందన్నది నిజం.
‘‘అమ్మా..’’ అన్నానేను మెల్లగా భయపడుతున్నట్లు.
అప్పటికే మా అమ్మ మేలుకునే ఉంది కాబోలు చటుక్కున నన్ను తన వైపు గట్టిగా హత్తుకుంది.
‘‘పడుకో.. పడుకో నాన్నా.. నిద్రపోతండ్రి..’’ అంది మెల్లగా ఆదుర్దాగా.
ఆమె గొంతు నా చెవికి ఆనుకుని ఉంది కాబట్టి ఆమె స్వరం నాకు తప్ప మరెవ్వరికీ వినపడదు. కాని ఆ వినపడుతున్న స్త్రీ ఆర్తనాదాలు.. ‘దేవుడో రక్షించు దేవుడో..’ అంటూ ఆమె పెడబొబ్బలు పెడుతూ ఆరుస్తోంది. ఆ మగ గొంతుకల అరుపులను బట్టి ఆమెను కొందరు మగాళ్లు కొడుతున్నట్లు అర్ధమై నాకు భయం ఎక్కువై వణకుపుడుతోంది. నేను అమ్మను మరింత గట్టిగా కరచుకున్నాను. ఆమె నన్ను మరింతగా.. వీలయితే తన లోలోపల దాచుకుని భయం పోగొట్టాలన్న ఆరాటంతో మరీమరీ పొదవుకుంది. ఆమె కళ్ల నుండి కారుతున్న కన్నీరు నా జుట్టును తడుపుతున్నది. ఆ అరువులు ఏడుపులు ‘రక్షించు దేవుడో..’ అంటూ ఆ స్త్రీ ఎవరో .. దేవుడికి పెడుతున్న దండాలు నాకే కాదు మా అమ్మకు కూడా తెలుస్తూనే ఉన్నాయని నాకు తెలుస్తోంది. ‘ఆడ బ్రతుకు..’ ‘ఆడ బ్రతుకు..’ ఆమె పెదవులు వణకుతున్నాయి.
ఎప్పటికో ఆ ఆర్తనాదాలు ఆగిపోయాయి. ఆ మగవాళ్ల భీషణమైన అరుపులు కూడా ఆగిపోయాయి. ఏడ్చి ఏడ్చి అమ్మా, నేనూ ఎప్పుడు నిద్రపోయామో తెలియదు.
ఎప్పటిలాగే ఉదయించింది. ఉలిక్కిపడి లేచాన్నేను. లేచాక బయటకు పరిగెత్తాను. ఆ మా చిన్న గ్రామంలో ఓ విషాద వాతావరణాన్ని నేను మొదటిసారి గుర్తించాను. రెండు డొంకల తర్వాత ఓ వీధిలో ఓ మహిళ.. ఓ అమ్మ.. ఓ అక్క.. ఓ నాన్నమ్మ.. ఎవరైనా కావచ్చు.. మట్టిలో పడి ఉంది.. వివస్త్రగా.. ఆమెపై వేపకొమ్మలు.. ఈగలు. చుట్టూ కుక్కలు. ఆమె చుట్టూ కోసి పెట్టినట్లున్న కోళ్లు, నిమ్మకాయలు. మరేవో కాయలు.. వాటిపై పసుపు కుంకుమ.. వేప కొమ్మలతో కొట్టి కొట్టి ఆమెను చంపేశారు. ఆమె శరీరం ఎర్రగా తోలు తీసిన దూడ పెయ్యలా..
మహాజనులారా.. మహారాజా.. ఆ దృశ్యం ఇప్పటికి ఇదిగో.. ఇక్కడ ఈ గుండెల్లో అలా బ్రతికే ఉంది. అలాంటి హృదయ విదారక స్త్రీ హత్యలు.. మాసానికి ఒకటో రెండో.. మా గ్రామంలో.. చుట్టుప్రక్కల గ్రామాలలో చూస్తూనే పెరిగాను. ఆమెకు దెయ్యం పట్టిందట.. ఆ దెయ్యాన్ని వదిలించే పక్రియలో ఆమె ప్రాణాలు పోయాయట. చస్తే చచ్చింది. ఆ భర్తకు మరో ముగ్గురు పెళ్లాలున్నారట. ముందు ఊళ్లో దెయ్యం పారిపోయిందట. ఈ దయ్యాలను వదలగొట్టే మహానుభావులకు గ్రామ గ్రామం బ్రహ్మరథం పట్టడం ఎంత దారుణం..’’
చెప్పడం ఆపాడు డిండిమ. అతని పెదవులు అదురుతున్నాయి. కళ్లు తడితడిగా మెరుస్తున్నాయి. అనుమానం లేదు అతనిలో ఆ దృశ్యం ఇప్పటికి బ్రతికే ఉంది.
ఆ మందిరమంతా పూర్తి నిశ్శబ్దం ఆవరించింది.
ఆయన చెప్పిన ఈ సన్నివేశం అక్కడున్న అందరికి స్పష్టంగా తెలుసు. మౌనంగా ఉన్నా ఆ అమాయక స్త్రీల హత్యల పట్ల ఎవ్వరికీ సానుభూతి లేదు. కారణం అందరూ దెయ్యాలను, భూత ప్రేత పిశాచాలను నమ్ముతున్నారు. ఒకరిద్దరు నమ్మని హేతువాదులున్నా వాళ్లు నిస్సహాయులు.
ప్రతి గ్రామం ఈ వికృత నమ్మకాలతో నిండి ఉన్నదన్నది ఇక్కడున్న ప్రతి మేధావికి, పాలక వీరులకు, మహా రాజుకు సైతం తెలుసు.
ప్రతి గ్రామంలో చదువుకున్న బ్రాహ్మణ కుటుంబాలుంటాయి. చాలా మంది చదువుకుని సమాజానికి మంచి చెబుతూ గ్రామ సౌభాగ్యానికి సహాయంగా నిలబడతారు. మరి కొందరు దైవభక్తి ద్వారా గ్రామ ప్రశాంత జీవనాన్ని కాపాడుతుంటారు. కొందరు ఈ దెయ్యాలు, భూత ప్రేత పిశాచ క్షుద్రపూజల ద్వారా అమాయక గ్రామీణులకున్న సమస్యలను తొలగించడానికన్నట్లు తతంగం నిర్వహిస్తుంటారు. కేవలం బ్రాహ్మణ వర్గాలు మాత్రమే కాదు, గ్రామ దేవతల పూజారులైన వృత్తిదారుల్లో కొందరు కూడా ఈ క్షుద్ర దేవతలను కొలుస్తూ పూజలు నిర్వ హిస్తుంటారు. ఆనాటి రాత్రి విన్న ఆ మహిళ ఆర్తనాదాలు ఆ చిన్ననాడే నాలో హేతుబద్దతకు బీజాలు వేసింది. హేతువు దృక్కోణంలో చేసే నా ఆలోచనలే నన్ను పోరాటానికి సిద్దం చేశాయి. అందుకు నేను ఆ భూత ప్రేత పిశాచ దెయ్యాల క్షుద్ర పూజారి వర్గాలకు ప్రధాన శత్రువునయ్యాను.’’
అందరూ మౌనంగా విన్నారు. ఒకరిద్దరూ అభినందనగా చప్పట్లు కొట్టారు కాని ఆ శబ్దం చాలా బలహీనంగా వినపడుతోంది.
‘‘మరో ఉదంతం చెబుతాను మహారాజా..’’ అన్నాడు డిండిమ.
ఆ.. చెప్పండి..’’ అన్నాడు గణపతిదేవుడు. అందరూ ఆ క్షుద్ర పూజల ఉదంతం నుండి బయటపడ్డారు.
‘‘అప్పుడు నా వయసు పదేళ్లు ఉండవచ్చు.
నేనొక పెరికె వ్యాపారి కొడుకును. మా తండ్రికి పాతిక ఎడ్ల బళ్లు ఉండేవి. కొందరు వైశ్యులు, బలింజలు మా బళ్లపై వాళ్ల సరుకులతో బిడారు వెళ్లేవారు.
అలా ఓసారి ఓ వైశ్యుని బిడారుతో నేనూ ఓ బండి తొట్లో కూర్చు ని హుషారుగా ఎడ్లను తోలుతూ బండిని పరిగెత్తిస్తున్నాను. ఆ రహదారులు దారుణంగా ఉన్నాయి. బండిచక్రాలు నడిచే గాలు మొత్తం పెద్ద గోతులతో పాతాళం కనిపిస్తోంది. పాపం చాలా శ్రమ కోర్చి అలాగే ఆ బాటలో.. ఇంత లోతు బురదలో.. నా చేతిలోకి చేర్నాకోలాతో దెబ్బలు తింటూ ఎద్దులు బండి లాగుతున్నాయి. నిజా నికి మా ఈ బిడారు చాలా చిన్నది. కేవలం పాతిక అంటే పాతికే బళ్లు ఉన్నాయి. వాటి వెంట ఆయా సరుకులు అమ్మకానికి తెచ్చిన వైశ్యులు ఉన్నారు. అప్పటికి చీకటి పడింది. రానురానూ చీకటి మరింత చిక్కబడుతోంది. బిడారు దట్టమైన అడవిలోకి ప్రవేశించింది. చీకటి ముదిరాక కళ్లకు ఏమీ కనబడటం లేదు. అసలు సమస్య బాట.. రహదారి. అది భయంకరంగా ఉంది. ఎద్దులు ఆ బండిగాలులో మోకాలులోతు బురదలో బండి లాగ లేకపోతున్నాయి. అప్పుడు ఆ చీకటిలో హటాత్తుగా ఫెళఫెళా శబ్దం. అది బండిచక్రం బురదలో కూరు కుపోగా బలంగా లాగడం వల్ల అది విరిగిన శబ్దం. అందరూ బళ్లు ఆపేసి ఆ విరిగిన బండి వద్దకు వెళ్లాం. ఆ బండి ఎద్దులు కూడా ప్రక్కకు ఒరిగిపోయి చావు భయంలో ఉన్నాయి. ముందు వాటిని బండి నుండి విడదీసి కాపాడారు. అందరూ.. మా నాన్న, వణిజులు, పెరికెలు.. అందరూ ఆ బాటలో వాళ్లు పడుతున్న బాధలు, ఇబ్బందులు చెప్పుకుంటూ తిట్టుకుంటున్నారు.
ఎవరిని తిడుతున్నారో నాకు అర్ధం కాలేదు. ఒక దారిబాట బాగులేనప్పుడు ఎవరిని తిట్టాలి. ఆ బాటను బాగు చేయాల్సిన వారెవ్వరూ.. ప్చ్.. ఏమో ఆ ప్రశ్నకు జవాబు అప్పటికి ఇప్పటికి నాకు తెలియదు మహారాజా.
అప్పుడే మరో ఘోరం జరిగిపోయింది.
(సశేషం)