భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

-మహ్మద్‌ ‌షరీఫ్‌


‘ఊరోల్లందరికీ తెలియజేసుడేమనగా! రేపు తోట్లకు వంటలకు పోవాలె! ఎవరింట్లోనన్నా పొయ్యి ఎల్గిందంటి ఊరొల్లంతా ఎలేస్తరు! గిది ఊరిలోని పెద్దలందరి నిర్ణయం ఓహో!’ అంటూ డప్పు కొట్టి సాటిస్తున్నడు మస్కూరి సాయిలు. డప్పు సప్పుడుకు పోరాగాల్లంతా వాని సుట్టూ జేరి ఇంటున్నరు. సాయిలు ఆడ ఆడ నిలవడి సాటింపేస్తున్నడు.

‘నానమ్మ తోట్లకు పోవుడంటే ఏందే!’ కొత్త మాటలను తెలుసుకోవాలని ఉరుక్కుంటూ వచ్చి అడిగిండు సాయి.

‘నాకు ఎరికే! నాకు ఎరికే! ఎవరి చేన్లకు వాళ్లు ఏవుడు గంతే కదా! నాన్నమ్మ?’ అని తన తెలివిని చూపించు కోవాలని అన్నది సింధు.

‘అవునర్రా ప్రతి ఏడు ఊరంతా అనుకోని ఊర్ల వంటలు చేయకుండా వాళ్ల వాళ్ల చేన్లల్లకు, పడ్ల తోట్లల్లకు ఏవాలి. పొద్దుగాల సంధి పొద్దుగూకేదాకా గాడనే ఉండి, వొంటలు శేస్కోని తిని శీకటి పడ్డాక ఇంటికి రావాలి’

‘గట్ల ఎందుకు పోతరే నాన్నమ్మ’ అని గావురంగా అడిగిండు సాయి.

‘ఏడాది కొక్క రోజైనా ఇడ్లల్లో కెళ్లి బయటికెళ్లనోళ్లు గిట్లనన్న తోట్లల్లకు పోయి తన శేను శెలక చూసు కొనుడుకు. ఆ పచ్చని చెట్లు పంటల నడుమ తిరుగుతూ మంచి గాలి పీల్చుడు, అందరితోని కలుసుడు, మాట్లాడు కొనడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నయి’ అని చెప్పవట్టింది భూలచ్చమ్మ.

‘అమ్మ మనం రేపు తోట్లకు వంటలకు పోతున్నామా!’ వంట శాలలున్న తల్లిని అడిగింది సింధు.

‘తోట్లకు లేదు ఏమి లేదు పోయి బయట ఆడుకొన్రి!’ కసురుకుంటూ అన్నది వనజ.

గప్పుడే ఇంట్లకొస్తున్న తండ్రిని సూషి ‘బాపు..! మనం తోట్లకు పోదామా రేపు?’ పిల్లలు అడుగుతుంటే మధ్యలోనే అందుకుని ‘వద్దని’ కోపమయింది వనజ.

‘గదేంటిదే పిల్లల్ని గట్ల కసురుతవు గాళ్లు గిప్పుడే మడిగిండ్రు ఊరొల్లందరి లెక్క తోట్లకు పోదాం అన్నరు’ కొడుకు మొఖాన్ని సూసుకుంటూ కోపంగా అంది భూలచ్చమ్మ.

‘అత్తమ్మ నువ్వు మధ్యలకు రాకు ఆయన కేమన్న అయితే నా గతి నా పిల్లల గతి ఎట్లా గానాటి పంచాది తలుచుకుంటేనే నాకు శెమటలు పడుతున్నయి’ భయంతో శెప్పింది వనజ.

‘ఎద్దు లేని ఎవుసము’ యజమాని సూసుకోని ఎవుసము ‘ఏట్ల వడ్డ ఎరువు లెక్క’. ఏడాది కెళ్లి శేను మొఖం చూసుడు లేదు జీతగాళ్లు ఏం శేస్తున్నరు? ఏం పండిస్తున్నారు. సూసుడే లేకపోయా.. గట్ల అయితే అంతా అమ్ముకోవాలి. నలుగురికి కూడుబెట్టిన ఇల్లు గిట్ల అయితే మనమే అడుక్కొని తినాలె’ కళ్లల్ల గంభీరం కొట్టొస్తుంటే మాట్లాడుతూనే ఉంది భూలచ్చమ్మ.

‘నువ్వు తోట్లకు పోతా అంటే పో! నీ కొడుకును పొమ్మనకు నువ్వు బలిమి జేసి తీస్కపోత నేను ఈడనే పానం తీసుకుంటా!’ కండ్లల్ల నీళ్లు తీసుకుంటూ పిల్లలను దగ్గరకు తీసుకుంది వనజ.

‘నీకు గంత భయం ఎందుకే? శేన్లున్నప్పుడు గెట్లు, పంచాయతీలు ఉండనే ఉంటయి. ఒస్తనే ఉంటయ్‌ ‌పోతనే ఉంటయ్‌, ‌దానికి భయపడతమా?’

‘ఏమో అత్తయ్య.. అతన్ని ఒంటరిగాన్ని జేసి ఆళ్లు కొట్టి సంపితే! ఎప్పుడైతే గేట్ల పంచాయతీ అయ్యిందో ఆళ్లు సంపుతామని ఖరాఖండిగా అప్పుడే శెప్పిండ్రు! ఎప్పుడు ఎవరు తగాదా పడ్తరో అని నేను భయంతో సస్తున్న’ కండ్లు తుడుచుకుంటూ అంది వనజ.

‘నీ మొఖం వాళ్లేం జేస్తరే! మీ మామ భుజం మీద కండువా, శేతి కర్ర పట్ట్కోని ఇండ్లకెళ్లి బయట కెల్లంగనె ఎవ్వరు ఎదురు నడిచే టొల్లు కాదు! నమస్తే పటేలా! నమస్తే దొరా! అని దూరం దూరం లిలవడేటొల్లు గటువంటి ఆయన కడుపున పుట్టినోడు పులి లెక్కనే ఉంటడు’.. కొడుకు రాజిరెడ్డి మొఖం సూసుకుంటూ రోషంతోని చేతులు ఊపుకుంటూ అన్నది భూలచ్చమ్మ.

‘గ•దంతా ఏమి కాదే గెట్లు జరిపినప్పుడే వాళ్లను గెదిమి! గెదిమి! కొట్టిన గాళ్లు నన్ను కొట్టేంత మొనగాల్ల? మీరేమి భయపడొద్దు’ మీసాలను తిప్పుకుంటూ అన్నడు రాజిరెడ్డి.

‘మీరందరూ తోట్లకు పోతమంటే నేను గింత ఇసం తాగి సస్తా!’ ఏడుస్కుంట వంట గదిలకెల్లింది వనజ.

ళి       ళి       ళి

ఊరు ఊరంతా కదిలిపోతున్నరు తోట్లల్లకు. బండ్ల మీద, కచ్రాల మీద, సైకిల్ల మీద, వంట సామాను తీసుకొని ఇండ్లకు తాళాలు వెట్టి పోతున్రు. ఊరంతా సడీ సప్పుడు లేకుండా శీమ శిట్కు మన్నా ఇనిపించినట్టాయె.

పానాజీల నడుస్కుంటు, గీశేను గీల్లది, గీశేను గీల్లది అని పిల్లలకు శెప్తుంది భూలచ్చమ్మ. పానాజిల ఇస్కల నడుస్కుంటు, పచ్చని శెట్ల గాలికి, వాటిపై కూర్చున్న పక్షులను సూస్తూ కేరింతలు కొడుతూ వారి శేనుకు శేరుకున్నరు.

జీతగాళ్లు, పనొళ్లు సామాన్లు దించుకొని వంటకు అన్ని తయ్యార్‌ ‌శేయవట్టిండ్రు. చాలా రోజుల తర్వాత తోటకు రావడం వల్ల యవ్సం ఎట్లుందో సూద్దామని తల్లి కొడుకులు తిరుగుకుంటు సూస్తున్నరు. ఆళ్ల ఎంట మనుమడు, మనుమరాలు ‘ఇదేమి పంట, ఇదేం చెట్టు’ అని అడుగుతున్నరు.

ఒక్కసారి పెద్ద దిగుడు బావిని సూడంగనే పిల్లల పాణాలు పైపైకే పోయినట్ల య్యింది. ‘నాయనమ్మ గింత పెద్ద బాయి చూస్తే భయమేస్తుంది అంటూ పిల్లలు దూరం జరిగిండ్రు.

‘మీ తాత ఎవ్సం జేసినప్పుడు నేను దిగి నీళ్లు ముంచుకొచ్చేదాన్ని. సుట్టుముట్టు ఎవ్వరు ఉండేటోళ్లు కాదు. గట్ల ధైర్యంతోని బతికినోళ్లం’ అంటూ ఆనాటి ముచ్చట చెప్పవట్టింది భూలచ్చమ్మ.

‘నానమ్మ నీవు పొరపాటున కాలు జారిపడితే ఎట్లా నీళ్లలో?’ అని అడిగింది సింధు.

‘పడితే ఏమైతది నాకు ఈతొచ్చు సిడీల దాక ఈదుకుంట వచ్చి పైకెక్కి వస్తా’ అంది భూలచ్చమ్మ.

‘నానమ్మ నీకు ఈతొచ్చా’ అంటూ ఆశ్చర్యంగా అడిగిండ్రు పిల్లలు.

‘నాకే కాదు రా! మా కాలంలో ఆడమగ తేడా లేకుండా అందరికీ ఈతొస్తుండే. ఎందుకంటే బట్టలుత్కుడు నీళ్లు తెచ్చుడు చెల్డ్రు, బాయిల మీదనే ఆధారం. ఇండ్లల్ల బాయిలు లేవు. అక్కడక్కడ ఊర్ల సర్కార్‌ ‌బాయిలుండె. ఆడ ఎప్పుడు నిండుగా మనుషులు. అందుకే శెర్ల కెళ్లి బట్టలు ఉత్కుడు, బల్రను గడుక్కునేటొల్లము. గందుకే అందరు ఈత నేర్చుకునేటోళ్లు’

భూలచ్చమ్మ కొడుకును మనుమన్ని మనుమరాల్ని తనెంట తీసుకొని చేను ఆ కొన నుంచి ఈ కొన దాక ఏమేమి పంటలున్నాయో ఏయే పనులు నౌకర్లకు శెప్పాలో కొడుకుకు శెబ్త్తుంది.‘మంటి కైనా ఇంటోడు’ ఉండాలె బిడ్డ్యా ! లేకుంటే పాడైతది అన్నది.

వనజ ఇద్దరి పనొల్లను తీసుకొని వంటపని చేస్తున్నది.

గంతలనే పక్క చేన్ల కెళ్లి వీరారెడ్డి భార్య వంట చేస్తున్న వనజ దగ్గరికి రావట్టింది. తన దిక్కుకే అస్తున్నామెను సూపి వనజకు చెమ్దలు పట్టినై.

‘పటేలమ్మా! ఎందుకు భయపడుతున్నౌ మేమున్నం’ అని ఇద్దరు పనోళ్లు దైర్యం శెప్పినా ! ఆమెకు భయం తగ్గలేదు.

‘నేను ముందే శెప్పిన. ఈ తోట్ల వొంటలు వొద్దని. నేను జెప్పితే ఎవ్వరు ఇనిపించుకోరు. ‘పాలిపగ పాము పగ’ లెక్కుంటది. ఎంత మొత్తుకున్నా తల్లి కొడుకులు నా మాటలను ఖదర్‌ ‌శేయలేదు. దేవుడా ఇప్పుడు ఎట్లన్నా కాపాడు ’ అని వనజ తన మనసులోనే దేవుండ్లను తల్వవట్టింది.

దూరం నుండే ఇది గమనించిన భూలచ్చమ్మ అడుగులు పెద్దపెద్ద గేసుకుంటూ రానే వొచ్చింది.

 ‘ఏందే ఏంది? గిట్లొచ్చినవు మా వొంటకాడికి ఏమి సంగతి’ అని గద్దించినట్లు అడిగింది.

తలకాయ దించుకొని ‘అత్తమ్మ! అత్తమ్మ! గది పులుసు, పులుసు విస్కెతందుకు చిన్న బగోనె కావాల్నని వొచ్చిన’ అని వొనుక్కుంటూ శెప్పింది వీరారెడ్డి భార్య.

‘నీకు ఎవరే అత్త? నీ మొగడు నా భూమిని గట్టు దాటి దున్ని తప్పని శెప్పిన నా కొడుకుని సంపుత నంటడా! వానికి గంత మదమా?’అని ఊగిపో సాగింది భూలచ్చమ్మ.

‘ఇది శైలికి శిలికి గాలివాన కావట్టి దేవుడా దీన్ని సల్లవడగొట్టు’ అని మనుసుల మొక్కవట్టింది వనజ.

‘గట్టుపంచాతి అయినప్పటి సంది మా పశువుల్ని, నాగళ్లను మీ చేన్లో నుంచి రాణిస్తలేరు మీ జీతగాళ్లు. మా చేన్లకు పోవాలంటే సుట్టూ తిరిగి పోవాలి శాలా కష్టమైతంది’

‘మీతోని కొట్లాడి పెద్ద తప్పు శేషినమని మీ తమ్ముడు రోజు దల్చుకుంట బాధపడుతున్నడు క్షమించు. పాల్యొల్ల కొట్లాట అయితది కలుస్తము. ఎప్పటి కైనా మాట్లాడకుండా ఎండా ఉంటే నడుస్తదా బావా!’ అని రాజిరెడ్డిని బతిమాలింది వీరారెడ్డి భార్య.

‘అప్పుడు ఏమైందే వీరి గాని సోయి! వాని తెలివి ఏటువొయ్యింది! నా కొడుకును సంపుత నంటడా వాడు!’ కోపంతో అరిచింది భూలచ్చమ్మ.

‘ఆయన దోస్తులు తాగిపిచ్చి మీ మీదికి ఉపిగొల్పి తెచ్చిండ్రు. అది ఒక శని గడియ పెద్ద మనసుతోని తప్పు కాయిండి’ అని వీరారెడ్డి భార్య ఎళ్లిపోతుంటే!

‘ఆగు! వనజ దానికి కేమవసరముందో అది ఇచ్చి పంపు’ అని కోడలికి శెప్పింది భూలచ్చమ్మ.

చిన్న పాత్రనిస్తూ ‘మళ్లీ తెచ్చి ఇవ్వు’ అంది వనజ.

‘తేవడమే గాదు… మీరు చమిస్తామంటే అందరిని తీసుకొచ్చి మీకు చమాపణ శెప్పిస్తా! వాళ్లు దాని గురించే ఎదురు సూస్తున్నరు’ అంటూ జవాబుకు చూడకుండా పాత్రను తీసుకొని వెళ్ల సాగింది.

‘రమ్మను. ఇప్పుడు కాకున్నా ఎప్పుడైనా కలిసేటోల్లమే కదా!’ హుందాగా పలికింది భూలచ్చమ్మ.

కొంతసేపటికి వీరారెడ్డి తమ్ముళ్లు మర•ళ్లు, పిల్లలు అందరూ గుంపు లెక్క ఇక్కడికి రావట్టిండ్రు.

మల్ల వనజకు సల్లశెమ్టలు రావట్టి! ‘నిజంగా కల్వడాని కొస్తుండ్రా? లేకుంటే కొట్లాట కోస్తుండ్రా?’ మళ్లీ దేవున్ని మనసుల తల్వవట్టి.

అందరు వరుసగా భూలచ్చమ్మ, రాజిరెడ్డి కాళ్ల మీద పడి చెమించమని అడిగిండ్రు.

పిల్లలందరు రాజిరెడ్డి పిల్లలతో మాట్లాడడం జరిగాక ఒక కొత్త ఖుషి వొచ్చినట్లయింది.

మనుషులలో ఇసం లేకుండా మాట్లాడుకుంటు పగమర్చి ఉల్లాసంగా ఉండటం వలన సంతోషంగా బత్కొచ్చు. ‘పగతో బత్కితే పాము పక్కలున్నట్లు పగ మర్చిపోయి బత్కితే పరమేశ్వరునితో’ ఉన్నట్లు అందుకే ‘సంతోషమే సగం బలం’ అన్నరు. ‘కలిసి ఉంటే కలదు సుఖం సంతోషం’ అందరికి

‘అందరు ఈడనే భోంచేయండ్రి’ ఆర్డరేసి•ంది భూలచ్చమ్మ.

‘అక్కడి వంటలు అట్లనే ఉంటయి!

ఎట్లా?’ అన్నది వీరారెడ్డి భార్య.

‘అవి అన్ని ఈడ్కి తీస్కరండ్రి. అందరం కలిసి భోజనం చేద్దాం’ అంది వనజ.

ఆక్కడి వొంటలు తెస్తందుకు వీరారెడ్డి కుటుంబం సభ్యులు వారి శేను వైపు అడుగులు వేశారు.

About Author

By editor

Twitter
YOUTUBE