‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన
మత్తి భానూమూర్తి
వర్తక బిడారు రాత్రివేళ అడవి మధ్యలో ఆగిపోయింది. ఆ చిమ్మచీకటిలో ఎక్కడినుండి వచ్చిపడ్డారో దారిదోపిడీగాళ్లు..ఓ యాభైమంది ఉంటారనుకుంటా.. వచ్చి మా బిడారుపై పడేవరకు ఎవ్వరూ చూడలేదు.వాళ్లు రావడం రావడమే కత్తులు బల్లెలతో వచ్చి మాపై దాడి చేశారు. మా నాన్న మెరుపువేగంతో ఆ చీకట్లో నన్ను గుంజుకుని లాక్కొని అడవిలోకి పరుగులు పెట్టాడు. వణిజులందరూ ఆ దోపిడీ ముఠాను గుర్తించడంతో అలాగే బళ్లను వదిలేసి అడవుల్లోకి పరుగులు పెట్టి ప్రాణాలు కాపాడుకున్నారు. ఒకరిద్దరి హాహాకారాలు నాకు వినబడ్డాయి. వాళ్లు దొరికిన వాళ్లను నిర్దాక్షిణ్యంగా చంపేస్తారని మా నాన్న నాకు చెప్పాడు. అలాగే ఆ రాత్రి వాళ్లు ఇద్దరిని చంపేశారు. ఎడ్లబళ్లను లాక్కుని పోయారు. సరుకులు అన్ని దోచుకున్నారు.
ఎవరు వాళ్లు అని మా నాన్నను అడిగాను. వాళ్లు దోపిడీ దొంగలని.. నిజానికి వాళ్లు ఆయా చుట్టుప్రక్కల గ్రామవాసులేనని.. ఏదో చిన్నతప్పు దొరికితే చాలు.. ఎవరో గ్రామ న్యాయస్థానానికి ఫిర్యాదు చేస్తారని,..వెంటనే గ్రామ సమయశెట్టిలు సాధారణంగా గ్రామ బహిష్కరణ విధిస్తారని.. వాళ్లు దూరంగా పోలేక.. ఆ చుట్టు ప్రక్కల అడవుల్లో ఉంటూ ఇలా బిడారులపై పడి దోచుకుంటారని.. వణిజులను, పెరికలను నిర్దాక్షిణ్యంగా చంపి వేస్తారని.. వాళ్ల ఆగ్రహానికి దుర్మార్గానికి కారణం ఎవరు? అంటే గ్రామ పెద్దలేనని నాన్న చెప్పాడు. అప్పటి నుంచి ఇలా గ్రామ బహిష్కరణ చేసే గ్రామపెద్దలపై నా ఆగ్రహం అలా స్థిరపడిపోయింది.
ఆ రాత్రి ఆ చీకటిలో ఆ అడవిలో బిక్కు బిక్కు మంటూ గడిపి మరునాడు చావు తప్పి కన్నులొట్ట పోయినట్లు మిగిలిన ఏవో నాలుగైదు పెరిక సంచులతో పెంటకు చేరాము. అక్కడ అప్పటికే అమ్మకాలకు ఏర్పాట్లు చేసిన అధికారులు అమ్మకాలకు ముందు చెల్లించవలసిన పన్నులు చెల్లించవలసినదేనని ఖరాఖండిగా చెప్పారు.
‘మిమ్మల్ని దారిదోపిడి గాళ్లు దోచుకున్నందుకు మా సానుభూతి ఉంది కానీ మేము మా కర్తవ్యం నిర్వహించవలసిందే కాబట్టి మీరు పన్నులు సుంకాలు చెల్లించవలసిందే మేము వసూలు చేయవలసిందే..’ అన్నారు. పెద్ద గొడవయ్యింది. నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి వచ్చిన గ్రామస్తులు కూడా మాపై సానుభూతి చూపడమే కాదు ఆ సుంకాల వసూలుగా
ళ్లతో వాదనకు దిగారు.
ఈ సంఘటన మొత్తం నాపై తీవ్రం ప్రభావం చూపింది.
ఆ బాటలు అలా ఎందుకు ఉన్నాయి..! ఉన్నాయి సరే..!! వాటిని బాగుచేసేవారు ఎవ్వరు?ఆ బాటలకిరు పక్కలా దట్టమైన అడవులు ఉండడం వల్లనే ఆ దోపిడీ వర్గాలు మనుషులను నిర్దాక్షిణ్యంగా చంపివేసి దోచుకుంటున్నాయి. వాళ్లను కట్టడిచేసేవారు ఎవరు..? వణిజులు కాపలాగా పెట్టుకుని బిడారు వెంట తీసుకువచ్చే ముమ్మూరు దండు బృందాలు ఉన్నాయని.. వాళ్లకు చెల్లించడానికి తమకు లాభాలు తక్కువ అని సెట్టిలు వాపోతున్నారు. మా ప్రాణాలకు, మా ఎడ్ల ప్రాణాలకు రక్షణ లేదని మా నాన్న లాంటి పెరికెలు ఏడుస్తున్నారు.
ఈ నా చిన్ననాటి దుర్ఘటన నాపై తీవప్రభావాన్ని చూపింది. నేను ఎదుగుతున్నకొద్దీ సమాజంలో దైనందినంలో జరుగుతున్న ఇలాంటి సంఘటనలు పరిశీలనగా చూడడానికి.. నాకొక సామాజిక దృక్పథం ఏర్పడడానికి ఈ సంఘటన కారణం.’’
మొత్తం ఆసక్తిగా విన్న చక్రవర్తి ‘‘నీపై మరణశిక్షలు, రాజ్య బహిష్కరణలు.. ఉన్నాయని విన్నాను. వాటి వివరాలు చెబితే పెద్దలు వింటారు’’ అన్నాడు.
‘‘నాపై పాతిక రాజ్యాలలో రాజ్య బహిష్కరణ విధించారు. పదిమంది మహారాజులు నాకు ఉరిశిక్ష విధించారు..’’
‘‘ఎందుకు.. కేవలం వణిజుల్ని దోచుకోవడం వల్లనేనా?’’
‘‘ప్రధానంగా నాపై మహారాజులకు ఫిర్యాదు చేసిన వాళ్లు వణిజులే కాని.. ఇతరులు కూడా ఉన్నారు. అందులో అత్యంత బలమైనవర్గం పండితవర్గం. అందులోనూ మతమూఢత్వం. చదువుతున్న మంత్రానికి అర్థ్ధం ఏమిటి అని అడిగితే చాలు గ్రామ బహిష్కరణ విధించే మహాజనులు చేసే ఫిర్యాదులు కూడా బోలెడు మహారాజా! ప్రతి గ్రామంలోని ప్రధాన రైతువర్గాలు ఈ పండితుల అభిప్రాయాలు, సలహాలు, సూచనల మేరకు మసలుకుంటాయి. ఇంతవరకు నాకు పేచీ లేదు. కాని ఇందులో కొందరు భూత ప్రేత పిశాచాలను పూజించే, ఆరాధించే వారుంరు. వారు ఈ అగ్ర శూద్రులను పీడించి భయపెట్టి ఆధిపత్యం నెరపుతూ ఉంటారు. వీళ్ల వల్ల అమాయకులైన గ్రామీణులు.. ముఖ్యంగా మహిళలు దారుణ హత్యల పాలవుతున్నారు.
మరో ఉదంతం చెబుతాను. హరిణపురం గ్రామం.
అర్ధరాత్రి అమావాస్య కూడా. కన్ను పొడు చుకున్నా ఏమీ కనపడటం లేదు. ఊరిలోని ఇళ్ల వివరాలు తెలిసిన వారు మిణుగురు పురుగుల వెలుగులో సైతం అక్కడి నివాసాలు గుర్తించగలరు.
ఓ ఆజానుబాహుడు నల్లని పెద్దగుడ్డ భుజాల మీదుగా తిప్పి ముఖం కనిపించకుండా కప్పుకొని అక్కడికి చేరుకున్నాడు. ప్రతి గ్రామానికి ఓ గ్రామ దేవతగుడి త•ప్పకుండా ఉంటుంది. శైవవై వైష్ణవుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది కాబట్టి మతాలకు సంబంధించి ఏదో ఒక్క గుడి మాత్రమే ఉంటుంది. ప్రతి గ్రామాన్ని ఆవరించుకుని భూత ప్రేత పిశాచాలున్నాయని అందరూ ఏకగ్రీవంగా నమ్ముతారు. గ్రామదేవత లేదా ఆమె సోదరుడు పోతురాజు, వాటిని ఊరి మీదికి రాకుండా అడ్డుకుంటాడని నమ్ముతారు. అంతేకాదు శివుడే ఆ భూతాప్రేతాలను తరిమికొట్టి మనల్ని కాపాడు తున్నాడని కూడా.. నమ్ముతారు.
రోలదేవుడు అనే పండిత గ్రామస్తుడు ఆ చుట్టు ప్రక్కల గ్రామాలలో బాగా పేరు ప్రఖ్యాతులు గడించినవాడు. ఆయన పేరు చెబితే చాలు దగ్గరలోని పాతిక గ్రామాల ప్రజలు భయంతోనో భక్తితోనో లెంపలు వేసుకుంటారు. ఆయన చెప్పింది చెప్పినట్లుగా నూటికి నూరు శాతం నమ్ముతారు. ఆయన తన పూజలతో తన కబంధహస్తాలతో భూతప్రేతాలను బంధించి ఉంచడం వల్లనే ఈ పాతిక గ్రామాలు సుభిక్షంగా ఉన్నాయని ఆ గ్రామాల ప్రజలు గాఢంగా ఏకగ్రీవంగా నమ్ముతారు.
ప్రస్తుతం ఆ హరిణపురం గ్రామంలో సదరు రోలదేవుడి ఇంటిముందు నిలబడి ఉన్నాడా ఆజానుబాహుడు. ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమో.. తెల్లగా తెల్లారి వీధులను, ఎదురొచ్చే మనుష్యులను గుర్తించే సమయానికి ఆ రోలదేవుడి ఇంటి ముందు దృశ్యం చూసిన గ్రామవాసులు పిచ్చి కేకలు పెట్టారు.
ఆ కేకలకు మరి కొందరు అక్కడికి చేరారు. అందరూ అక్కడున్న దృశ్యం చూసి గుండెలులు బాదుకుంటూ ఏడవడం మొదలెట్టారు.
ఆ దృశ్యం ఏవిటంటే సదరు రోలదేవుడు ఆయన ఇంటిముందున్న చెట్టుకు చేతులు విరిచికట్టి ఉన్నాడు. చెట్టు చుట్టూ ఎండుకట్టెలు, ముళ్ల కంపలు వేసి ఉన్నాయి. దాని ముందున్న రాయిపై తాపీగా ఆకుచుట్ట కాల్చుతూ కూర్చుని ఉన్నాడు రాత్రి అక్కడికి వచ్చిన ఆజానుబాహుడు.
వెలుగు పెరిగేకొద్దీ ఆ ఆజానుబాహుడిని కొందరు గ్రామస్తులు గుర్తించసాగారు.
అప్పుడాయన నోట్లోంచి ఆకుచుట్ట తీసి చెప్పాడు, ‘‘నేనే! మీరు అనుకుంటున్న డిండిమనాయడిని..
అందరూ ఆశ్చర్యపోతూ డిండిమకు చేతులెత్తి నమస్కరించారు. తన మాటలకు డిండిమ కొనసాగించాడు.
‘‘ఈ రోలదేవుడిని నేను మంటల్లో వేసి కాల్చేయబోతున్నాను. వీడు అమాయక మహిళలను దెయ్యం పట్టింది అంటూ వేపాకులతో కొట్టి కొట్టి చంపడంలో ఆరితేరాడు. ఈ ఊరి స్త్రీలకు దెయ్యం పట్టలేదు. వీడే పట్టాడు. వీడే అసలు సిసలు దెయ్యం. వీడికి నేను పలుమార్లు చెప్పాను. ఆ దుర్మార్గం మానెయ్యమని. వినలేదు చెప్పి చెప్పి విసుగొచ్చింది. మీ ఊరికి పట్టిన ఈ దెయ్యాన్ని వదిలించ బోతున్నాను..’’
చెబుతూనే కాలుస్తున్న చుట్టతో ఆ ఎండు కట్టెలకు మంట పెట్టాడు. రాత్రి డిండిమ తలుపు తట్టినప్పటి నుండి ఏడుస్తూనే ఉన్న రోలదేవుడు పిచ్చికేకలు పెట్టసాగాడు. రక్షించమంటూ గ్రామస్తులను వేడుకోసాగాడు. అప్పటి వరకూ అతడిని దేవుడుగా కొలిచిన గ్రామస్తుల భక్తీ గౌరవాలు ఈ డిండిమ ముందు చిన్నబోయాయి. నాకు ఏ రాజ్యంలోనయినా సాధారణ ప్రజల్లో అంతటి అభిమాన గౌరవాలు ఉన్నాయి. వేదమూర్తులయిన మా పండితులను అవమానిస్తావా ?అంటూ ఆ మహారాజు నాకు మరణ దండన విధించాడు ప్రభూ..’’
ముగించాడు డిండిమ.
డిండిమ చెబుతున్న అంశాల పట్ల గణపతిదేవుడు తనకు కలిగిన ఆశ్చర్యాన్ని ఎవ్వరూ గుర్తించకుండా దాచుకుంటూ సభికుల ముఖాలలో తేజరిల్లుతున్న భావాలను చదవసాగాడు. అందరికి తినుబండారాలు, మంచినీళ్లు, చెరకు పానీయాలు అందిస్తున్న పరిచారికలు, దౌవారికులు సైతం అబ్బురంగా వింటున్నారు. ఇక పండితులు, యుద్ధవీరుల ఆశ్చర్యం సరేసరి.
ఇలా రాజాస్థానాలలో మాట్లాడినవారు, ఇలా అచ్చమైన ప్రజల సమస్యలను తానుగా అనుభవించి మహారాజు ముందు స్పష్టంగా విప్పి చెప్పినవారు.. ఒక్కడు.. ఒక్కడిని కూడా వాళ్లెప్పుడూ చూడలేదు.
ముఖ్యంగా పండిత వర్గాన్ని. భూత ప్రేతాలను నియంత్రించి, దెయ్యాలను పారద్రోలే పండితులకు అన్ని రాజ్యాలలో ఎనలేని గౌరవం. వాళ్లకు చిన్నపాటి శిక్ష వేయడానికి మహారాజులు కూడా జంకుతారు. అలాంటి దెయ్యాలను పారద్రోలే మహిమలున్న రోలదేవుడిని ఆ గ్రామ ప్రజలముందు మంటల్లో తోసి చంపినవాడట .. ఈతగాడు.. అమ్మో!! అందరికి ఊహించనలవి కానిది.
‘ఇలాంటి వాడినే రాజ్యద్రోహి అంటారు. వీడిని ఇక్కడికిక్కడే నరికి పారెయ్యాలి. వీడి తలను వీధులలో ఊరేగించాలి..’ అనుకుంటున్నారు సైనిక వీరులు. ‘వీడు మాకు చేసిన,చేస్తున్న ద్రోహం ఇంతా అంతా కాదు. వీడిని మహారాజు తప్పక శిక్షిస్తాడు..’ అనుకుంటున్నారు వణిజశెట్టిలు.
‘ఇవన్నీ మనకు తెలిసినవే. అయితే గ్రామస్థాయి అధికారులు, సమయ సెట్టిలు, పండితులు చేసే ప్రతి పని రాజధాని స్థాయి అధికారులమైన మాకు తెలియదు కదా.. అయినా అవన్నీ స్థానిక సమయాల వారి బాధ్యత కదా..’ అనుకుంటున్నారు నియోగులు, అమాత్యులు.
అంతిమంగాఅడిగాడు డిండిమ..
‘‘ఒక్క చిన్న ప్రశ్న మహారాజా! రాజులకు.. ఈ అధికార వ్యవస్థ నిర్వాహణకు, ఇన్ని విభాగాలకు సొమ్ము ఎక్కడి నుండి వస్తోంది? వారి ఆదాయ మార్గం ఏవిటి? ఈ కోటలు, ఈ ప్రాసాదాలు, ఈ రత్నఖచిత సింహాసనాలు, ఈ మహా భవంతులు, కిరీటాలు, ఆ బంగారు నగా నట్రా, ఆ పట్టు చీనీ చీనాంబరాలు, ఈ పరిచారికలు, ప్రతి క్షణం కంటికి రెప్పవెయ్యకుండా మీకు కాపలా కాసే ఈ మహాయోధులు, మీ కోసం.. అంటే మీ రాచరికం కోసం అను నిత్యం ప్రాణాలు వదలడానికి సిద్ధ్దపడుతున్న ఈ సామంత మండలేశ్వరులు మీకు ఎలా సంప్రాప్తమయ్యారు?
అన్నింటికీ మూలం మీరు వసూలు చేస్తున్న సొమ్ము!! అవును కదా.. ఆ సొమ్ము ఎలా వస్తోంది? కేవలం ప్రజలపై విధించే పన్నుల ద్వారా.. మీరు మీ అనుచరగణం పేద, ధనిక ప్రజల ముక్కుపిండి వసూలు చేసి మీ ధనాగారాన్ని నింపుతున్నారు..’’
కాకతీయ రాజ్య భాండాగారాధిపతి వసుదేవ పాలుడు ఒక్క పెట్టున అరిచాడు.
‘‘తప్పు. పన్నుల సొమ్ము, ప్రథమంగా గ్రామ సమయానికి, స్థల సమయానికి, విషయ సమయానికి ఇంత.. ఇంత..చొప్పున మినహాయించుకుని ఆఖరున కోటలోని ధనాగారానికి చేరుతుంది. మహారాజావారి వాటా అందులో కేవలం ఆరవవంతు మాత్రమే. పన్నుల రూపంలో వసూలయ్యే సొమ్మంతా మహా రాజు గారే తీసుకుంటున్నట్లు పేలడం అవివేకం. అందుకు నీకు..’’ రెచ్చిపోతున్నారు.
మహారాజును దైవస్వరూపుడుగా కొలిచే భక్తవర్గానికి అతడు అలా రెచ్చిపోవడం కత్తి దూయడం మహదానందాన్ని కలిగించింది. కాని డిండిమ ఇలాంటివి తనకు మామూలే అన్నట్లు నిమ్మకు నీరెత్తినట్లు మౌనాన్ని ఆశ్రయించగా,వసుదేవపాలుడిని ఆపమన్నట్లు గణపతిదేవుడు చేయెత్తాడు.
లిప్తకాలంలో సభ మొత్తం మౌనమై పోయింది.
‘‘డిండిమా! నీ పై ఎన్నిరాజ్యాలలో ఏయే అభియోగాలున్నాయి?’’ అన్నాడు.
‘‘ఈ అనుమకొండ చుట్టుప్రక్కల.. అంటే ఈ పీఠభూమి ప్రాంతంలో చిన్నా పెద్ద కలిపి నలభై రెండు రాజ్యాలున్నాయి మహారాజా. అందులో దాదాపు అన్ని రాజ్యాలలో నాపై అభియోగాలున్నాయి. కొందరు మరణశిక్ష విధించా రు. కొందరు యావజ్జీవ కారాగారం అన్నారు. కొందరు తలనరకాలి అన్నారు. కొందరు గ్రామ బహిష్కరణ శిక్ష అంటే మరికొందరు బహిరంగ ఉరి అన్నారు..’’
‘‘మరణ శిక్షలకు కారణం ఏవిటి?’’
‘‘శిక్షలకు కారణాలను హైందవ ధర్మశాస్త్రాలు, బౌద్ధ్ద, జైన శాస్త్రాలు కూడా. ఏవేవో నీతిమంత జీవిత విలువలను చెబుతూ శిక్షలను రాసేశారు. అవన్నీ ప్రజల దైనందిన సమస్యలను దృష్టిలో ఉంచుకుని రా•సినవి కాదని నా అభిప్రాయం. కేవలం కొన్ని ఆదర్శ భావాలను పేర్కొంటూ అవి ఉల్లంఘిస్తే ఇదిగో ఈ శిక్ష అంటూ చాంతాడంత శిక్షలు పేర్కొన్నారు. నిజజీవితంలో వాస్తవ పరిస్థితులకు, ఆ ఆదర్శ జీవితాలకు లంకె కుదరదు. అది ఇప్పటి న్యాయమూర్తులకు అనవసరం. వాళ్లు ధర్మశాస్త్రం అనే ఓ తాటాకులకట్టను తెరచి ఆ శిక్ష ఏదో చదివి నాపై విధిస్తారు. మనం అనుభవించి తీరాల్సిందే. హాస్యం ఏమిటంటే ఈ మహారాజులు, ఈ పండితులు ఈ న్యాయ, ధర్మశాస్త్రాలకు అతీతులట.వాళ్లు తప్పులు చేయరు. చేసినా శిక్షార్హులు కాదట. ఇదేమి న్యాయం?’’
చెప్పి పకపకా నవ్వాడు. అతని అభిప్రాయంతో ఏకీభవించిన వాళ్లు కూడా పకపకా నవ్వారు. కొందరు పండితులు మూతిముడుచుకున్నారు. కొందరు నవ్వీ నవ్వకుండా ఉన్నారు.
అందులో గణపతిదేవుడు కూడా ఉన్నాడు.
‘‘సరే సరే. నువ్వు చేసిన కొన్ని తప్పులు.. అంటే న్యాయసభలవారు పేర్కొన్నవి, వాటికి వేసిన శిక్షలు చెప్పు.’’
‘‘ఉదాహరణకు..’’ గుర్తు తెచ్చుకోవడానికి యత్నించి, ‘‘ఆ.. ఓ మహారాజు గారు కోట వద్ద ఓ ధర్మగంట పెట్టించాడు. అంటే ఏ పౌరుడైనా తనకు అన్యాయం జరిగినప్పుడు వచ్చి న్యాయంకోసం ఆ గంటను మోగిస్తే మహారాజు గారొచ్చి వాడికి న్యాయం చేస్తారన్నమాట..’’ ఆపాడు.
కొందరి ముఖాలలో ఆనందంగా కనిపించింది. ఆరాజుగారు ఎంత మంచివారో కదా అనే భావనలు సదరు పండితుల ముఖాలలో కదలాడాయి.
‘‘ఈ రాజుగారి ఆలోచన ప్రజల్లో కలకలం రేపింది. అది చూసి ఆ రాజ్య ప్రజల సంగతి అలా ఉంచి మిగతా రాజులు కూడా వెనువెంటనే తమ రాజ్యాలలో కూడా గంటలు పెట్టించారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు భట్రాజుల పొగడ్తల్లో చెప్పించుకుని మురిసిపోయారు.’’
‘‘మంచి ఆలోచన. ప్రజల సమస్యలు సగానికి సగం తీరిపోయినట్లేగా..’’ ఓ మేధావి అన్నాడు.
‘‘అవును. తీరిపోయి పాపం ఆ పౌరుడు సరాసరి నరకానికి పోయాడు. ఏ సామాన్యుడైనా వచ్చి గంట మోగిస్తే ఆయన సమస్య ఏవిటో విని దానిని పరిష్కరించాలి అనేదే కదా దాని ఆశయం. కానీ వాయించడానికి దానిని ఎవరి కీ అందనంత ఎత్తులో కడతారు. కట్టినా దానికి గంట ఉండదు. గంట ఉన్నా దానిని అందుకుని మ్రోగించాలంటే ఓ పెద్దతాడు ఉండాలి. అది ఉండదు. సరే ఎలాగోలా వాయించగానే మహారాజుగారు బయటకు పరిగెత్తుకు వచ్చేస్తాడు అనుకుంటే అది మన భ్రమ. గంటపక్కనే ఉన్న భటుడు మనలను పక్కకు లాగి పనీపాటా లేదా అని ఉగ్రుడౌతాడు. వాడి చేతిలోని శూలంతో పొడిచి చంపేస్తానని బెదిరిస్తాడు..’’
డిండిమ చెప్పిన విధానానికి అందరూ ఫక్కున నవ్వారు. కొందరు విస్తుపోయారు. ‘ఎవడైనా మహారాజుగారి నిర్ణయాలను మహత్తర కార్యాలుగా వర్ణించాలి కానీ ఇలా వ్యంగ్యంగా అనడం..ఛ..ఛ. కలికాలం వచ్చేసింది..’ అనుకున్నారు కొందరు.
‘‘అది సరే.. ఈ ధర్మగంట సంగతి సరే. నీకెందుకు మరణశిక్ష విధించారు?’’
‘‘అసలు పౌరుల కోసం ధర్మగంట పెట్టాలి అని ఉద్యమం చేసినవాడిని నేనే మహారాజా.’’
‘‘అందుకని నీకు మరణశిక్ష విధించారా..?’’
‘‘అవును. ప్రజలకు మంచి చేయడానికే కదా మహారాజులు, రాజ నియోగాలు ఉన్నది!? కాబట్టి నువ్వు అడగడం.. గట్టిగా.. గోలగోలగా ఊరు వాడా అల్లరి చేయడం.. రాజద్రోహం. అందుకు మరణశిక్షే తగినది’ అని నన్ను చెరశాలలో పెట్టిన మహారాజు గారు.. ఏమనుకున్నాడో ఏమో ధర్మగంట పెట్టించాడు. నా సంగతి వదిలేయండి. రాజుగారికి మంచి పేరు వచ్చింది. అశోకుడి తర్వాత పౌరుడికి సహాయపడే ఓ పని చేసిన మహారాజుగా పొగి డించుకొన్నాడు. చేయవలసినది చేయకుండా.. చేస్తున్నట్లు చెప్పుకోవడం ఇప్పుడే మొదలయ్యింది మహారాజా.. ’’
అందరూ తలోమాటా అనసాగారు.
మళ్లీడిండిమ చెప్పాడు. ‘‘తర్వాత కోవెలకుండ్ల మహారాజుగారు కూడా ఇదే అంశం మీద నాకు ఉరిశిక్ష విధించారు..’’
‘‘అయ్యో.. అదేవిటి?’’
‘‘ఆ మహారాజుగారు పెట్టించిన ధర్మగంట ఎవరో కొడితే ఆయనకు నిద్రాభంగం అయ్యిందట. అందుకు పాతిక కొరడా దెబ్బలు కొట్టేలా శిక్ష ధర్మశాస్త్రంలో రాయించాడు. అలా న్యాయశాస్త్రంలో ఉన్నదని నాకు తెలియదు కదా! కొరడాదెబ్బల శిక్ష అన్యాయం అని ఆ రాజ్యంలో ఉద్యమం చేసినందుకు వారు నాకు ఉరిశిక్ష వేశారు..’’
అందరూ నవ్వారు.
‘‘గ్రామాలన్నీ రాత్రివేళ చీకట్లలో మగ్గుతున్నాయి. అనేకానేక నేరాలు ఘోరాలు అ చీకటి వల్లే జరుగుతున్నాయి కాబట్టి ప్రతి గ్రామంలో వీధి దీపాలు ఏర్పాటు చేయించండి అన్నందుకు పానుగల్లు మహారాజు మరణశిక్ష విధించాడు..’’
దాంతో ఇతర రాజ్యాల్లో కూడా అన్ని గ్రామాలలో వీధి దీపాలు వచ్చాయి.
‘‘కొణిదెన రాజ్యంలో ప్రతి గ్రామంలో వైద్యశాల ఉండాలని కోరాను. కోరడం అంటే..అదే.. ఉద్యమం చేశాను. వైద్యులు అక్కడక్కడా ఉంటారు.. ప్రతి గ్రామంలో ఉండటం ఏవిటి? అన్నారు. చివరికి ప్రజా ప్రతిఘటన వల్ల ప్రతి గ్రామంలో వైద్యుడు, వైద్యశాల వచ్చాయి. కానీ ఉద్యమం చేసినవాడు రాజద్రోహి కాబట్టి నాకు శిక్ష తప్ప లేదు.’’
‘‘వెలనాడు రాజ్యంలో కూడా గ్రామ గ్రామాన వైద్యుడు వచ్చాడు గాని వాడికి పశు వైద్యం రాదు. గ్రామంలో వంద ఇళ్లు, వెయ్యిమంది జనాబా ఉంటే ఒక్కొక్క ఊళ్లో పదివేల జంతువులుంటాయి. మరి పశువైద్యుడు లేకుంటే ఎట్టా? నిజానికి చాలా గ్రామాల్లో మాదిగలే పశువైద్యులు.. వాళ్లు చచ్చిన జంతువులనే లాక్కూపోతారా! వైద్యం కూడా చేస్తారా! ప్రతి గ్రామానికి వైద్యునితో పాటు పశువైద్యుడు కూడా ఉండాలి అని ఉద్యమం చేశాను. మరి శిక్ష వెయ్యరా.. వేశారు మహారాజా..!?’’
‘‘దగ్గరలో నదులు ప్రవహిస్తుంటే కాలువలకు నీటికి లోటులేదు. కానీ నీటి వసతి ఏమీ లేని రాజ్యాలు బోలెడు. నీటిచుక్క లేని గ్రామాలలో చెరువులు, బావులు తవ్వించాలని రేనాడు రాజ్యంలో ఉద్యమం చేస్తుంటే నేనూ వాళ్లతో కలిశాను. కాకపోతే రాజులకు భయపడి అందరూ నా వెనుక నిలబడ్డారు. బావులు, చెరువులు తవ్వించక తప్పని మహారాజులు ముందున్న నన్ను వదిలిపెట్టలేదు.’’
‘‘చెరువులు తవ్వించారు సరే. రైతులు, గ్రామీణులు ఆ నీరు మాకు ముందు.. అంటే మాకు ముందు.. అంటూ తగవులు పడుతుంటే నాకెందుకు అని ఊరుకోలేదు. నీటి నిర్వహణకు ప్రతి గ్రామంలో నీరుకట్టు ఉద్యోగిని నియమించ మన్నందుకు నాకు శిక్ష తప్పలేదు..’’
ఇలాంటివే మరెన్నో ఉదాహరణలు డిండిమ చెప్పాడు.
అందరూ నిబిడాశ్చర్యంతో విన్నారు. ఓ మహారాజుగారి సమక్షంలో ప్రజా సమస్యలను చర్చించే సమావేశంలో ఇలా నిర్మొహమాటంగా ఉన్నది ఉన్నట్లు నిజమైన ప్రజాసమస్యలు చెప్పిన వాళ్లెవ్వరూ లేరు. ఒకవేళ అలాంటివారు ఉన్నారని తెలిసినా రాజ సమావేశాలలో మాట్లాడించింది లేదు.
డిండిమ చెప్పడం ముగించాక ఎవ్వరూ చాలాసేపు మాట్లాడలేకపోయారు. ఉద్వేగంతో అలా ఉండిపోయారు. గణపతిదేవునితో సహా.
‘‘అంటే అన్ని రాజ్యాలలోనూ నువ్వు మహా రాజులకు వ్యతిరేకంగా ప్రవర్తించినట్లేగా??’’
‘‘అదేమో నాకు తెలియదు. నాకు తెలిసింది పేదవాడికి వ్యవస్థ చేస్తున్న అన్యాయం. పరిపాలనా వ్యవస్థ సామాన్యుడికి అండగా ఉండాలి. ఉండి తీరాలి. వాడిపై న్యాయం, చట్టం అంటూ అధికా రులు చెలాయిస్తున్న పెత్తనం. ఏమీ చేసినా వాడి కడుపునిండక పోవడం.. పైపెచ్చు ఆ పన్ను, ఈ పన్ను అంటూ తలకు మించిన పన్నులు. వాడి ఆదాయం చిటికెడు. వాడి అప్పులచిట్టా మాత్రం బారెడు. ఇలా ఎంతకాలం? అది నాప్రశ్న!’’
గణపతిదేవుడు దీర్ఘాలోచనలో ఉండగా శిబి రాధ్యక్షుడు తిక్కనామాత్యుడు కలగజేసుకున్నాడు.
‘‘మంచిది డిండిమ. మీరు పూర్తిగా ప్రజాపక్షం వహించి మీ అనుభవాలు చెప్పడం సంతోషం. ప్రభువులు ఆసాంతం విన్నారు. వారి పాలనలో ఇలాంటి వాటిని తప్పక పరిష్కరిస్తారని నేను నమ్ముతున్నాను..’’ అంటూ సాలోచనగా గణపతిదేవుని చూశాడు.
ఆయనకు కూడా తిక్కనామాత్యుడు చేసిన ముక్తాయింపు నచ్చింది. అవునన్నట్లు తల ఊపాడు.
తర్వాత తిక్కనామాత్యుడు చెప్పాడు.
‘‘గొప్ప సంగతి మహారాజా! ఓ మహారాజు ఇలాంటి చింతనా సమావేశంలో ప్రజా ప్రతినిధి లాంటి డిండిమతో మాట్లాడించడం.. అతడు ప్రజలు పడుతున్న బాధలను నిస్సంకోచంగా వివరించడం నిజంగా గొప్ప సంగతి..’’ అభినందనగా ఆయన చప్పట్లు చరచగా గణపతిదేవునితో సహా అందరూ చప్పట్లతో తమ అంగీకారాన్ని తెలి పారు.
‘‘ప్రజలకు ఈ తరహా సమస్యలకు కారణం దుర్మార్గులైన మహారాజులే అని కదా నీ అభిప్రాయం డిండిమా?!’’ తిక్కన అడిగాడు మళ్లీ…
‘‘నిస్సంకోచంగా. మొదటి కారణం ఉచ్ఛల కుంటల్లాంటి చిన్నచిన్న రాజ్యాలు. సహజంగా మంచివాడయినా మంచి చేయలేని మహారాజులే ఎక్కువ మహామాత్యా! చిన్నచిన్న రాజ్యాలలో ఎప్పుడూ ఈ సమస్యలు తప్పవు. ప్రతి చిన్న రాజ్యంలో సహజ వనరులు ఉండవు. అప్పుడది స్వయం పోషితం కానేరదు. రాజు మంచివాడయినా.. చెడ్డవాడయినా ఆ రాజ్యప్రజలకు సమస్యలు తప్పవు కదా మహారాజా? ఇది నేను ఎన్నో రాజ్యాలలో చూశాను. వణిజుల్లో అంకాలశెట్టి లాంటి ఉత్తములు ఎంతమంది ఉంటారు!.. కాబట్టి?!..’’
‘‘ఊ.. కాబట్టి..’’
‘‘రాజ్యం వీలయినంత పెద్దదిగా ఉండాలి. చిన్నరాజ్యం వల్ల రాజులు ఐశ్వర్యంతో కులుకుతు న్నారు కాని ప్రజలు బాధలతో కుంగి కృశించి పోతున్నారు. రాజ్యం చాలదు సామ్రాజ్యం ఏర్పడాలి. అప్పుడు మొత్తం వనరులన్నీ ఒకే ఛత్రం కిందికి వస్తాయి. అప్పుడే ప్రజల సాధారణ జీవితం ఒడుదిడుకులు లేకుండా సాగిపోతుంది.’’
ఉన్నట్టుండి సముద్రం పొంగినట్లు సమావేశం హోరెత్తిపోయింది.
‘‘అది మీ నేతృత్వంలోనే ఏర్పడాలి చక్రవర్తి..’’ ఎవడో అరిచాడు,
మళ్ళీ హోరు మూడింతలయ్యింది.