భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతి పొందిన రచన

-పి. చంద్రశేఖర అజాద్


నిరంజన్‌ ‌ముఖం సీరియస్‌గా వుంది. ఎదురుగా కూతురు రంజిత ఉంది. ఆమె తండ్రినే చూస్తోంది. అప్పటి దాకా ఆలోచిస్తున్న అతను  రంజిత కళ్లల్లోకి సూటిగా చూస్తూ… ‘‘శ్రీరామ్‌ని నువ్వు ప్రేమించావన్నావు. మేం కలిసి బతకాలనుకుంటున్నాం అన్నావు. అతని గురించి నీకెంత వరకు తెలుసు అన్నాను. మేం డేటింగ్‌ ‌చేశాము అన్నావు. మా ఇద్దరికీ ఒకరి గురించి మరొకరికి తెలుసు అన్నావు. డేటింగ్‌తో పాటు సహజీవనం చేశావా? అని నిన్ను అడగలేదు. ఎందుకో తెలుసా?’’ రంజిత మాట్లాడకుండా చూస్తోంది.

‘‘చిన్నప్పటి నుంచి నీకు స్వేచ్ఛనిచ్చాను. నువ్వు అడిగింది ఏదీ కాదనలేదు. నా కూతురికి ఓ మంచి మిత్రుడిగా ఉండాలనుకున్నాను. కొన్ని విషయాల మీద నా అభిప్రాయాలు చెప్పాను తప్ప నా భావాలను ఎప్పుడూ నీ మీద రుద్దలేదు. ఎవరి జీవితాలను వారు దిద్దుకోవాలి. మనం అవసరం అనుకున్నప్పుడు ఓ సలహా ఇవ్వాలి. అంతేగాని ఎదుటివారి అభిరు చులను, అనుభవాలను, అవగాహనను తక్కువగా చూడకూడదు. మనం అంగీకరించినా, అంగీకరించక• పోయినా వారిని గౌరవించాలి అని నమ్మే నేను ఎప్పుడన్నా ఇలానే చేయమని నిన్ను శాసించానా?’’ అన్నాడు.

రంజితకు తన బాల్యం, యవ్వనం గుర్తు వచ్చింది.

ఠాగూర్‌ని చదివింది. శరత్‌ ‌చంద్రుడ్ని చదివింది. అలాంటి స్త్రీ పాత్రలను ఊహించుకుంది. మైదానాల్లోకి పరుగులు తీసుకుంటూ పోయి, అక్కడి చెట్లు తలలూపి ఆహ్వానిస్తుంటే, తను వాటిని ఎక్కేది. కొమ్మల మధ్యకు చేరిపోయేది. చల్లటి గాలిని, ఆకాశంలో తేలిపోతున్న మబ్బుల్ని పలకరిస్తూ ఎందాకా మీ పయనం? మీ ఇల్లు ఎక్కడ? మీది ఏ దేశం? ఎప్పుడు వర్షిస్తారు? ఎప్పుడు తేలిపోతారు. కొన్ని నెలలూ, సంవత్సరాలు మీరు ఎందుకురారు? మీకు పిల్లలు ఉంటారా? మళ్లీ మళ్ళీ మీరు పుడుతుంటారా? పువ్వుల్లా కొన్ని గంటలు, కొన్ని రోజులు మాత్రమే అలరించి అంతరిస్తుంటారా?

ఇవే ప్రశ్నలు నిరంజన్‌ని అడుగుతుంటే హాయిగా నవ్వేవాడు.

‘‘తల్లీ… నేను కూడా చిన్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు అడిగేవాడిని. గాలిలో, నీడలో, వానలో, చలిలో, ఎండలో మొత్తంగా ప్రకృతిలో నాకు స్త్రీ మూర్తులే కనిపిస్తున్నారు. నేను మగవాడిని అయినందుకా? ఆడపిల్లలు కూడా అంతేనా? ప్రకృతిలో పురుషుడ్ని చూసుకుంటారా? వెన్నెల్లో ఆడుకునే మగపిల్లల్ని ఊహించుకుంటారా అనిపించేది.’’

‘‘మీరు ఏ ఆడపిల్లలనూ ఈ ప్రశ్నలు అడగలేదా?’’

‘‘లేదు. బిడియం. అది జయించటానికి చాలా సంవత్సరాలు, దశాబ్దాలు పట్టాయి. ఎవరి ప్రశ్నలకు వారు సమాధానాలు వెతుక్కోవడంలో ఆనందం ఉంటుంది రంజితా!’’

అదో ఫేజ్‌. ‌తర్వాత రంజని చదివే పుస్తకాలు మారాయి. చదువుల కోసం అమ్మానాన్నలకు దూరంగా రకరకాల నగరాలు వెళ్లింది. అప్పటి వరకూ ఉన్న తన భావాలు వేగంగా మారుతూ వచ్చాయి.

‘‘నువ్వు సైలెంట్‌గా ఉంటే కాదు. మాట్లాడు’’ అన్నాడు నిరంజన్‌.

ఉలిక్కిపడింది.

‘‘లేదు’’ అంది.

‘‘శ్రీరామ్‌తోనీ పెళ్లిని నేను కాదన లేదు. మీ అమ్మకు అసంతృప్తి ఉన్నా నీ సంతోషాన్ని కాదనటం ఎందుకని సరిపెట్టుకుంది. మీ పెళ్లి జరిగి ఎన్ని నెలలు అయింది. ఇప్పుడు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నావు?’’

‘‘శ్రీరామ్‌తో నేను కొన్ని విషయాల్లో డిఫర్‌ అవుతున్నాను.’’

‘‘నాతో, మీ అమ్మతో నూరుశాతం ఏకీభవిస్తు న్నావా? అందుకని మాతో కూడా విడిపోదలుచు కున్నావా? అమ్మానాన్నల బంధాన్ని తెంచేసు కుంటున్నావా?’’

నిశ్శబ్దం.

‘‘అవున్లే. ఆడపిల్లలకు పెళ్లి అయ్యేంత వరకు మాత్రమే కదా పుట్టింటితో అనుబంధం. ఆ రోజు నిన్ను అడిగాను. శ్రీరామ్‌ ‌గురించి నీకు ఎంత వరకు తెలుసు అన్నాను. ఇద్దరికీ ఒకరి గురించి ఇంకొకరికి తెలుసు అన్నావు. ఇదేనా తెలియటం. నువ్వు కూడా వయసు తాలూకు మోహానికి లోనయ్యావా?’’

‘‘నాన్నా… నేను పొరపాటుపడ్డాను అని తెలిసి నప్పుడు ఆ బంధాన్ని కొనసాగించాలా?’’

‘‘అవసరం లేదు. నువ్వు పొరపాటు అనుకున్నది పొరపాటేనా! అనేది కూడా తెలియాలి.

ఇంకా ఈ విషయం గురించి నేను మాట్లాడను. మేం కూడా పొరపాటు పడ్డాం. మా అమ్మాయితో మేం పరిమితులకు మించి ప్రవర్తించాం. అది కేవలం ఆదర్శం అనుకున్నాం. ఇప్పటి నుండి నీ జీవితం నీది. నీ నిర్ణయాలు నీవి. మనం లా ప్రకారంగా విడిపోకపోవచ్చు. బంధం పరంగా విడిపోతున్నాం. చివరిసారిగా చెబుతున్నాను. నీకు మేం జన్మనిచ్చాం. కొంతవరకు నీ బాగోగులు చూశాం. ఇప్పుడు నువ్వు సర్వస్వతంత్రురాలివి. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అది నీకు సంతోషం ఇవ్వాలి. అప్పుడు ఈ ప్రపంచాని పట్టించుకోనవసరం లేదు.’’

రంజిత తండ్రికేసి కొద్ది క్షణాలు చూసి అతని అక్కడి నుంచి వెళ్లిపోయింది. అప్పుడు అతని భార్య వసుంధర అతని దగ్గరకు వచ్చింది.

‘‘మొదటి నుంచి మనం ఇలా ఉంటే బాగుండేదా?’’ అంది మెల్లగా.

‘‘ప్రతి అయిదు సంవత్సరాలకూ కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి వసూ… ప్రతి పదానికి, ప్రతి ఆచారానికీ, పద్ధతికీ అర్థాలు మారుతున్నాయి. ఇవన్నీ వ్యక్తులకు చెందినవి. వారి పరిణతిని బట్టి నిర్ణయాలు ఉంటాయి. అవి వారి బతుకుల్ని ప్రభావితం చేస్తాయి. ఇప్పటి వరకు రంజిత మన కూతురు. ఇప్పుడు అలాంటి తరంలో ప్రయోగం చేస్తున్న ఓ అమ్మాయి’’ అన్నాడు.

                                                                                               *          *          *

సరిత రంజితను కాస్త ఆశ్చర్యంగా చూస్తూ ఆహ్వానించింది.

‘‘ఏంటోయ్‌… ‌సూట్‌ ‌కేసుతో వచ్చేశావు. డివోర్స్ అయ్యేంత వరకు కూడా శ్రీరామ్‌తో కలిసి ఉండలేక పోయావా’’ అంది.

‘‘అవి రావటానికి సమయం పడుతుంది. అయినా ఓసారి మనం కాదనుకున్నాక అయిదు నిమిషాలు కూడా అయిదు యుగాల్లా అనిపిస్తాయి.’’

‘‘అవును రంజితా! అయినా అత్తవారింటికి కాకపోతే అమ్మ వారింటికి దారి ఉంది కదా! అందు లోనూ మీ నాన్న పోగ్రెసివ్‌ ‌కదా!’’

‘‘ఛాదస్తంలోనా! ఎంత బాగా కబుర్లు చెప్పే వారయినా ఆడవాళ్ల విషయంలో ఇలానే వుంటారు. శ్రీరామ్‌ని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా అన్నారు. ప్రేమ చచ్చేంత వరకూ ఉండాలని వారు అనుకుంటారు. ప్రేమ వేరు. డిఫరెన్సెస్‌ ‌వేరు అనుకోరు. అయినా నేను ఎవరి మీదా ఆధారపడి బతకటం లేదు కదా!’’

‘‘అవును. మగవాళ్లలోనే కాదు. ఆడవారిలోనూ ఇలాంటి వారున్నారు. ఇప్పుడు మనం అలాంటి ఓ మహిళను కలుస్తున్నాం. ఆమె పేరు శ్వేతాదేవి. వయసు తొంభై సంవత్సరాలు. మాకు దూరపు బంధువు.’’

‘‘అవసరమా వారిని కలవటం?’’

‘‘నాకూ ఇంట్లో సమస్యలు ఉన్నాయి రంజితా. మన ఇద్దరం ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాం. మా అమ్మ ఓసారి ‘ఆమెని కలువు. తర్వాత నువ్వు విడిగా ఉంటావో, ఏం చేస్తావో నీ ఇష్టం అంది’. ఆమె గురించి వినటం తప్ప నేను ఇంత వరకు కలవలేదు. క్లాసులు వాళ్లే కాదు. మనమూ తీసుకోవాలి’’ అంది సరిత.

                                                                                                            *          *          *

ఇద్దరూ శ్వేతాదేవిని కలిశారు. రంజితకు ఆమెను చూడగానే టైటానిక్‌ ‌సినిమా హీరోయిన్‌ ‌గుర్తు వచ్చింది. సినిమా ప్రారంభంలో, ముగింపులో అత్యంత వృద్ధురాలిగా కనిపిస్తుంది. ఆమె ముఖంలో అన్నీ ముడతలుంటాయి. అయినా ఓ అందం. అక్కడ నుండి దర్శకుడు ప్రేక్షకుల చేతిని అందుకుని ఓ మహాస్వప్న లోకంలోకి తీసుకు వెళ్తాడు. అప్పుడు యవ్వనంలో ఉన్న కథానాయికను పరిచయం చేస్తాడు.

శ్వేతాదేవి ముఖంలో అలాంటి ముడతలు లేవు. ఆమె దేహచ్ఛాయను చూసి ఆ పేరు పెట్టారా అనిపించింది. ఆమెలో అలనాటి నటీమణులు వైజయంతిమాల, నర్గీస్‌, ‌పద్మిని, సావిత్రి ఇంకా ఎందరెందరో కనిపిస్తున్నారు. ఆమె కంఠస్వరంలో లతా మంగేష్కర్‌ ‌వినిపించింది.

రంజిత రవివర్మ బొమ్మలను చిన్నప్పుడు చూసింది. అప్పటి భావోద్వేగాలు గుర్తులేవు. ఆ బొమ్మల్లో ఏదో దివ్యత్వం ఉంది. అర్థం కాకపోయినా! ఆమె ఇంటిని చూశారు. గోడల మీద చిత్రాలు చూస్తుంటే నాలుగయిదు తరాల చరిత్రను చూస్తున్నట్లు ఉంది. ఎంత వద్దనుకున్నా రంజితకు ఒకప్పటి బ్రిటిష్‌ ‌యువరాణి ‘డయానా’ గుర్తు వచ్చింది.

ఆమెతో పాటు పెద్ద కుటుంబం ఉంటుందను కున్నారు. ఓ సహాయకురాలు ఉంది. తను ఒంటరిగా ఉండటం ఆశ్చర్యం కలిగించింది. అంటే ఈమె వెనుకాల ఏదో కథ ఉంది. సరిత అమ్మ ఇక్కడికి పంపటం వెనుక ఈ విషాదాన్ని చూస్తే నీకు కొన్ని విషయాలు అర్థం అవుతాయి అనుకునుంటుంది.

ఇంటి ముందు అందమైన తోట ఉంది. ముగ్గురూ నడుస్తున్నారు. అక్కడ ఎన్నెన్నో రకాల పూలమొక్కలు. అప్పుడే వికశిస్తున్నవి, రాలిపోతున్నవి. రాలి పోయినవి. రంగులు మారుతున్న ఆకులు. మొక్కలు, చెట్లు రాలిన వాటిని చూసి కన్నీరు పెడుతున్నాయా అనిపిస్తోంది. అక్కడున్న కుర్చీల్లో కూర్చొన్నారు.

‘‘మీరు ఒంటరిగా ఉంటున్నారు. ఇది మీకు…’’ అంటుంటే,

‘‘నేనే కాదు. మనుషులందరూ ఒంటరిగానే వస్తారు. ఒక్కోసారి కవలలు, ఇంకొంతమంది. ఒకరి తర్వాత ఒకరు వస్తారు. అలాగే ముందుగానో, వెనకాలో అందరూ వెళ్లిపోతారు. ఇది సహజం. సమూహంలో ఉన్నా ఒంటరితనంలో మనుషుల మనసులు వుంటాయి.’’

‘‘ఇది మనుషుల జీవితంలో విషాదం అంటారా?’’

‘‘ఎందుకు అనాలి! మొదట్లో ఓ స్త్రీ-ఓ పురుషుడు, ప్రకృతి మాత్రమేగా. అసలు ప్రకృతి ఉన్నంత కాలం ఎవరయినా ఒంటరివారెలా అవుతారు. బతకటం ఓ కళ. కలిసి బతకటం, ఒంటరిగా ఉండటమూ అంతే. అందుకే అనేక మంది పది మందితో ఉన్నా, ఒక్కరే ఉన్నా విషాదంతో ఉంటారు. అయినా నన్ను చూడటానికి నాలుగు తరాల వారు వస్తుంటారు. మీ గురించి చెప్పండి’’ అంది శ్వేతాదేవి.

ఇద్దరూ తమ భర్తలతో గల విభేదాల గురించి చెప్పారు. అప్పుడు నవ్వింది. ‘‘ఎందుకు నవ్వు తున్నారు’’ అన్నారిద్దరు.

‘‘ఇవన్నీ ఇప్పుడు మీ ఇద్దరే అనుభవిస్తున్నారా?’’

‘‘నిన్నటి తరాలు వేరు బామ్మగారూ… వారు బానిసలుగా బతికారు. రాజీ పడి బతికారు. వారు స్వేచ్ఛ గురించి ఆలోచించలేదు. అలా పుట్టి, ఏ మాత్రం గుర్తింపు లేకుండా, ఏ మాత్రం స్వతంత్రత లేకుండా కాలగర్భంలో కలిసిపోయారు.’’

‘‘స్వేచ్ఛ అంటే ఏమిటి?’’ అందామె సూటిగా.

‘‘మీరు రాజీపడటం లేదా? మీరు ఎవరికీ బానిసలు కాదా? ప్రేమ గురించి మీ అభిప్రాయాలు ఏమిటి? మీ చిన్న అనుభవంతో మీరు పరిపూర్ణత సాధించాం అనుకుంటున్నారా?’’ అని ఆగింది.

‘‘ఏ సంఘర్షణా లేకపోతే అది కుటుంబం ఎలా అవుతుంది? మనుషులంతా ఒకే రకంగా ఉండరు. ఒకే రకంగా ఆలోచించరు. పాతతరం వారిని బానిసలు అంటున్నారు. స్వేచ్ఛ, బానిసత్వాలకు కూడా లెక్కలున్నాయి. అప్పట్లో కుటుంబాల కోసం వారు రాజీపడకపోతే ఈ సమాజం ఇలా ఉండేదా? మీరు కేవలం పురుష అహంకారం గురించే మాట్లాడ తారా? అహంకారం స్త్రీలలో లేదా? మీరు కుటుం బాన్ని, మీరు పని చేస్తున్న సంస్థలని విడిగా ఎందుకు చూస్తున్నారు. కేవలం స్త్రీలు మాత్రమే యజమానులుగా ఉన్నా ఇవే పరిస్థితులు’’ అంది.

సహాయకురాలు జ్యూస్‌లు తీసుకుని వచ్చింది.

శ్వేతాదేవి అమ్మా నాన్నల గురించి, తన అన్న దమ్ముల గురించి, అక్కా చెల్లెళ్ల గురించి, అత్తవారింటి గురించి, తర్వాత తరాల గురించి చెప్పింది. నేను చిన్న చిన్న విషయాలకు ఇలా ఆలోచించుకుంటూ బయటకు పోవాలనుకుంటే ఎన్ని పెళ్లిళ్లు చేసుకోవాలి. ఎంతమందితో సహ జీవనం చేయాలో అంటూ నవ్వింది.

‘‘అంటే అసలు ఏ పోరాటాలు వద్దు అంటారు. ఈ రోజుల్లో అది కుదురుతుందా?’’ అంది సరిత.

‘‘నేను వద్దు అనటం లేదు. గత కాలం వారు ఏ పోరాటాలూ చేయకుండానే ఇన్ని ఆలోచనలు వచ్చాయా? ఇన్ని మార్పులు వచ్చాయా? పోరాటాలు కుటుంబాల్లోనేనా? వ్యక్తుల మధ్యనేనా? చివరికి ప్రకృతితో మనం అనుభూతి చెందుతూనే మనకు తగిన రీతిలో మార్చుకుంటున్నాం. వద్దన్నా ఏ పోరాటం ఆగదు తల్లులూ… నేను నచ్చనివారు చాలా మందున్నారు. నా కుటుంబంలో అనేక రకాల వారున్నారు. అందరికీ ఒకటే చెబుతాను. మీ పోరాటాలు మీవి మాత్రం కాదు. పక్కవారితో ముడిపడుంటాయి. ఇప్పుడు మీ ఇద్దరూ మీ భర్తలతో విడిపోవాలనుకుంటున్నారు. మంచిదే. సర్దుకుపోయే దారులు మూసుకుపోతే ఎవరూ కలిసి ఉండరు. చివరిగా ఓ విషయం చెబుతాను. ప్రపంచమంతా అంగీకరించేది అంటూ ఏదీ వుండదు. మీకు తృప్తి కలిగించే నిర్ణయాలు తీసుకోండి.’’

                                                                                                            *          *          *

సరిత, రంజితలు గదిలో వున్నారు.

‘‘ప్రేమంటే ఏమిటి? స్వేచ్ఛ అంటే ఏమిటి? ఇవన్నీ ఎందుకు?’’ అంది సరిత.

‘‘అన్వేషిద్దాం.’’ ‘‘ఒంటరిగానా? సామాజికం గానా? కుటుంబ పరంగానా?’’

‘‘ఆలోచిద్దాం. శ్వేతాదేవి గారు చెప్పారు కదా. ఇక్కడ కంప్లీట్‌ ‌మాన్‌లూ, ఉమన్లూ ఉండరని. అదే నిజం అనిపిస్తోంది. ఇప్పుడు అమ్మా నాన్నలను చూడాలి. తర్వాత శ్రీరామ్‌ ‌దగ్గరకు వెళ్తాను. మనసు విప్పి మాట్లాడతాను.’’

‘మీటూ’ అంటూ, ‘మా వారితో మరోసారి శ్వేతాదేవి గారిని కలుస్తాను’ అంది సరిత.

About Author

By editor

Twitter
YOUTUBE