‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన
మత్తి భానూమూర్తి
డిండిమ చెబుతున్న అంశాలు ఆ పండితుల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి.
ఉద్వేగాలు కాస్త చల్లారాక గణపతిదేవుడు అడిగాడు.
‘‘అవునూ.. నీకు ఉరిశిక్ష వేసి అమలు చేయబోయింది బృహత్కంచిలో. ఇప్పటి వరకు నువ్వు చెప్పిన ప్రజాకంటకుల్లో ఆ మహారాజు కూడా ఉన్నాడా?’’
‘‘నేను అన్ని రాజ్యలలోని పేదల కోసం కృషి చేస్తాను. ఇప్పుడు మహారాజుల తర్వాత ప్రజలను పీడించుకుతినే వాళ్లు వణిజులు. ప్రజల నిత్యావసరా లను దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టించి ప్రజల కష్టం కొల్లగొడుతున్న వణిజుల కోష్టాగారాలను పగులగొట్టి ప్రజలకు పంచుతాను. నా జన్మభూమి ముదిగొండ. నేను చెప్పిన దుర్మార్గాలు ఎక్కువగా జరుగుతున్న రాజ్యం కూడా అదే.’’
అప్పటివరకు చర్చలో మౌనంగా వింటున్న సైనిక వీరులు చివ్వున లేచారు. ముఖ్యంగా రేచర్ల రుద్రసేనాని అత్యంత వేగంగా ఒర నుండి కరవాలాన్ని లాగి పైకెత్తి వికటాట్టహాసం చేశాడు.
‘‘వాడ్ని అప్పుడే ఖండఖండాలుగా నరికి కాకులకు గద్దలకు వేయాల్సింది. తప్పు చేశానయ్యా డిండిమా..’’
మహావీరుడు రుద్రయ అంతగా ఉద్వేగపడటంతో అంతా నిర్ఘాంతమై ఆయనను చూడసాగారు. గణపతి కూడా ఆశ్చర్యంగా రుద్రయను చూడసాగాడు.
‘‘మీరు దేవగిరి వారికి బందీగా ఉన్నప్పుడు వాడు.. వాడే ఆ పాపి ముదిగొండ పాలకుడు నాగతి భూపాలుడు అనుమకొండపై దాడి చేశాడు..’’
చివ్వున తన నడబంధంలోని కత్తి ఒరపై చెయ్యి వేశాడు గణపతిదేవ చక్రవర్తి.
‘‘కాని వాడికి మన కాకతీయ పౌరుషం రుచి చూపి తరిమి తరిమి కొట్టాం చక్రవర్తీ. అందుకు రుద్రసేనానుల వారిని తమరు అభినందించి తీరాలి..’’ అన్నాడు మల్యాల చౌండసేనాని.
గణపతిదేవుడే కాదు శిబిరంలోని ప్రతి ఒక్కరూ రేచర్ల రుద్రయను అభినం దనగా చూశారు.
‘‘అనుమకొండ పురవీధులలోనే ముదిగొండ సైన్యాన్ని ఊచకోత కోసి మన పౌరులకు యుద్ధం ఎలా ఉంటుందో చూపించాడు అన్న రుద్రయ..’’ ఆయనకు వినయంగా నమస్కరిస్తూ గౌరవం, అభిమానం ముప్పిరిగొన్న గొంతుకతో మరింత వివరంగా చెప్పాడు చౌండ. తన గుబురు మీసాలను సవరించుకుంటూ చిద్విలాసంగా చూస్తున్నాడు రుద్రసేనాని.
‘‘ప్రస్తుతం.. వాడెక్కడున్నాడు మహా ప్రధానీ..!’’ గణపతిదేవుని గొంతు కరుగ్గా అడిగింది.
‘‘రుద్రయ దెబ్బకు కొన్నిరోజులు రాజ్యాన్ని విడిచి కొలని రాజ్యంలో దాక్కొని.. తిరిగి ముదిగొండ చేరి తన దుష్పరిపాలనను కొనసాగిస్తున్నాడు. అదే సమ యంలో మనపై వాడి నోటికి ఎప్పటిలాగే హద్దుపద్దూ లేదు..’’
క్షణక్షణానికి గణపతిదేవునిలో అసహనం పెరిగిపోతోంది.
‘‘అయితే వాడికి తగిన బుద్ధి చెబుదాం. సంధి విగ్రహి గారెక్కడ??’’
శిబిరమంతా కలయజూస్తూ అడిగాడు చక్రవర్తి. సంధి విగ్రహి జంఘాల భట్టు ముందుకు వచ్చాడు.
‘‘తక్షణమే మీరు ముదిగొండ వెళ్లి ఆ మహా రాజుకు మా మాటగా చెప్పండి. ‘తమరి పాలన ప్రజా కంటకంగా ఉందన్న సమాచారం మాకు అనుమకొండ చేరింది. ముదిగొండ ప్రజల హితైషుల మైన మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మీ పాలన ఏ మాత్రం మాకు సమ్మతం కాదు. మీ ప్రవర్తన మార్చుకోవాలి. కొంతకాలం మీ ప్రవర్తన, పాలన మేము పరిశీలిస్తాం. ఏమైనా మార్పు కనిపించిందా.. సరే. లేకుంటే ప్రజాశ్రేయస్సు దృష్ట్యా మీ రాజ్యాన్ని మా సామ్రాజ్యంలో కలిపేసుకునే అవకాశం ఉంది..’ అని మా మాటగా చెప్పండి.’’
మహారాజుగారు చెబుతుండగానే ప్రక్కనున్న రాజలేఖకుడు బిరుసుగుడ్డపై అప్పటికప్పుడు వేగంగా రాసి ఆయనకు చూపగా ఆయన చదివి తల పంకించి చూపుడు వ్రేలికి ఉంగరరూపంలో ఉన్న రాజ ముద్రికను తీసి రాజవ్యవహారాల సహాయకుడు మయ భట్టుకు అందించగా.. ఆయన దగ్గరగా ఉన్న గాజు బుడ్డిలోని సిరాలో దానిని తడిపి ఆ గుడ్డపై ముద్రిం చాడు. తర్వాత దానిని మడిచి తనవద్దనున్న పెట్టెలో ఉంచి జంఘాల భట్టుకు అందించాడు. అంతా సంభ్రమంగా చూస్తుండగా దానిని అందుకున్న సంధివిగ్రహి జంఘాలభట్టు చక్రవర్తికి నమస్కరించి వెనుదిరిగి బయటకు వెళ్లిపోయాడు.
అనంతరం శిబిరం మరి కాసేపు విభిన్న అంశాలపై చర్చలు జరిపాక ఆ రోజుకి సమావేశం ముగించారు.
అందరూ నిష్క్రమించాక సర్వసైన్యాధ్యక్షుడు రుద్రసేనానిని దగ్గరకు పిలిచాడు గణపతిదేవుడు.
‘‘సంధి విగ్రహి వెనుక మందడి పరాంతకుని నాయకత్వంలో ఓ మెరుపు బృందాన్ని రహస్యంగా ముదిగొండ రాజప్రాసాదానికి పంపండి. వాడు.. నాగతి భూపాలుడు ఏ మాత్రం వెకిలిగా మాట్లాడి మన జంఘాలభట్టును అవమానించినా వెంటనే వాడిపై మెరుపుదాడి చేసి బంధించి మా ముందు నిలబెట్టండి!!’’
ళి ళి ళి
మూడవనాడు మేధోమధన శిబిర మందిరం.
‘‘అందరూ.. సైనిక వీరులంతా వచ్చి ఈ నీచుడిపై కాండ్రించి ఉమ్మండి. మీ ఉమ్ములతో వాడు తడిసిపోవాలి’’
మేధోమధన శిబిరం మధ్యగా ఓ కుడ్యానికి తాళ్లతో కట్టేసి ఉన్న ముదిగొండ మహారాజు నాగతిభూపాలుని చూస్తూ భరించరాని అసహ్యంతో అరిచాడు గణపతి దేవచక్రవర్తి.
చక్రవర్తి సందేశాన్ని తీసుకుని ముదిగొండ రాజప్రాసాదానికి వెళ్లిన కాకతీయ సంధివిగ్రహి జంఘాలభట్టును ముఖాన ఊసి తీవ్రంగా అవమా నించాడు ముదిగొండ పాలకుడు నాగతిభూపాలుడు. వెనువెంటనే కాకతీయ మెరపువీరుల దళం ఆ ముదిగొండ సభాభవనాన్ని చుట్టుముట్టి నాగతి అంగ రక్షకులను అక్కడికక్కడే సంహరించి నాగతి భూపాలుని మెరపువేగంతో పట్టి బంధించారు. ముదిగొండ సైనికాధికారులు, సైన్యం సమాయత్తం అయ్యేలోగా ముదిగొండ పురం దాటి కాకతీయరాజ్య హద్దులలోకి వచ్చేశారు.
నాగతి భూపాలుడు సంధివిగ్రహి ముఖాన ఉమ్మి అవమానించాడని చెప్పగానే తీవ్రంగా చలించి పోయాడు గణపతిదేవుడు. అతనికి ఆ ఉమ్ములతోనే జవాబి వ్వాలని ప్రకటించాడు.
సైనికులు, సైన్యాధ్యక్షులు, సేనానులు, దళపతులు, సాహిణిలు, యుద్ధ మంత్రి ఇతరత్రా సైనిక అధికారులు, ఉత్సాహంతో ఉద్రేకంతో లేచి అతనిపై ఉమ్ముల వర్షం కురిపించసాగారు.
తిక్కనామాత్యుడు, ఇతర పండితులు .. ఆ దృశ్యాన్ని చూడలేక తల తిప్పుకుని దూరం జరిగారు.
సైనికులకు, వీరులకు శత్రువును రకరకాలుగా అవమానించడం అనుభవమే. అది వారి విజయానికి చిహ్నంగా భావిస్తారు. అందువల్ల అలాంటి అవకాశాన్ని వీరుడు అనే వాడు వదులుకోడు.
ఆ ఉమ్ముల వర్షంతో అతని ముఖం నిజంగానే తడిసిపోయింది. శిరస్సు నుంచి ఎదురొమ్ము వరకు అతని శరీరం చూడరానంత రోతగా కనిపిస్తోంది. శత్రువు అవమానంతో మరింత కుంగిపోయేలా ఉమ్మిన వీరులంతా వికటాట్ట హాసాలుచేస్తూ గంతులు వేశారు. కాకతీయసైనికుల అరుపులతో వికటాట్ట హాసాలతో ఆ భవనమంతా మారుమోగుతోంది.
‘‘గణపతిదేవ చక్రవర్తి జయహో.’’
‘‘జయహో గణపతిదేవ చక్రవర్తి..’’
‘‘కాకతీయ సామ్రాజ్యాధినేతా.. జయహో..’’
కాని అప్పుడో ఊహించని సంఘటన జరిగింది.
కుడ్యానికి బంధించి ఉన్న నాగతి భూపాలుడు గొంతెత్తి గట్టిగా అరిచాడు.
‘‘ఆపండి..’’
‘‘ఆపండి మీ పిచ్చి వాగుడు..’’
‘‘ఆపండి..’’
‘‘నోరుముయ్యండి..’’
అతడేదో అంటున్నాడని గుర్తించిన వాళ్లంతా నిశ్శబ్దమైపోయారు.
గణపతిదేవుడు చెయ్యెత్తగా మందిరమంతా నిశ్శబ్దమైపోయింది. సైనికుల ఉమ్మితో కళ్లు ముక్కు నోరు కూడా మూసుకుపోగా తల విదిలింపుతో ఉమ్మి కారిపోయేలా చేసి ఊపిరి పీల్చుకున్నాడు నాగతి.
మళ్లీ అరిచాడు. క్రోధంతో బాధతో దుఖంతో మళ్లీమళ్లీ అరిచాడు. రౌద్ర దృక్కులతో గణపతిదేవుని చూస్తూ అన్నాడు.
‘‘నువ్వు చక్రవర్తివా!ఎవడు చెప్పాడు.? నాబోంటి చిన్న రాజును బంధించి తెచ్చి అవమానించి నీ సైనికు లతో పొగిడించుకుంటే నువ్వు చక్రవర్తివి ఐపోతావా.. నువ్వూ నాలాంటి ఓ రాజ్యానికి ఓ రాజువి మాత్రమే. నీ రాజ్య విస్తీర్ణమెంత..? నీ రాజ్యపు ఆదాయమెంత? సైన్య పటాలం లెక్కలేవిటి? అశ్వాలు ఎన్ని?గజ సైన్యం ఎంత?ప్రత్యేక వీరు లెందరు? లెంకలు, ఎక్కటీలు, ఒంటరులు.. ఎందరు? చక్రవర్తి అని పిలిపించుకోవడానికి నీకున్న అర్హత ఏవిటి? పిల్ల కుంకా!. నిన్నగాక మొన్న దేవగిరి చెరశాల నుండి జైత్రపాలుని కనికరంతో బయట పడిన నువ్వు.. హహ్హహ.. నువ్వు చక్రవర్తివా! ఏమీ పొగరు.. ఏమి మదాంధత.. ఏమి అల్పానందం.. శాతవాహనులు, చాళిక్యులే చక్రవర్తులుగా పిలిపించు కోలేదు. చోళులు, పల్లవులు ఏదో వంధిమాగదులు కీర్తిస్తే వినీ వినన ట్లు ఆనందించారు కాని నీలాగా బాహాటంగా సైనికులతో జయహోలు కొట్టించుకో లేదు.. పిల్లకుంకా!!’’
అంతా.. మందిరమంతా నిర్ఘాంతపోయి మాన్పడి పోయినట్లు కళ్లప్పగించి చూడటం చెవులప్పగించి వినడం మినహా మరేమీ చేయలేనట్లు అచేతనమై పోయింది.
కొన్నిలిప్తల కాలం..
ముందు తేరుకున్నవాడు రుద్రసేనాని. చివ్వున లేచి ఒరనుండి ఖడ్గాన్ని మెరుపువేగంతో లాగి ఒక్క ఊపున నాగతి వైపు దూకాడు. ‘‘రేయ్.. ధూర్తుడా.. వాచాలుడా.. నిన్ను ఇప్పుడే ఇక్కడే..’’ అరుస్తూ అతని మీదికి వెళ్లాడు. మరి లిప్తకాలంలో నాగతి తల తెగిపడేదే. గణపతిదేవుడు, గంగాధరుడు, తిక్కన అంతే వేగంగా దూకి రుద్రసేనాని నడుము పట్టి ఒకరు, కత్తి దొరకబుచ్చుకుని ఒకరు, చేతులు పట్టి ఒకరు నిలువరించారు.
కాని నాగతి.. తన వాచాలతను ఆపడం లేదు. అతని తీరు చూస్తుంటే అనాల్సిన నాలుగు మాటలు అనేసి జరిగిన అవమానానికి వాళ్ల చేతుల్లోనే చావాలని చూస్తున్నట్లుంది.
‘‘ఏమి ఆగిపోయావేం రుద్రయా..! నన్ను చంపడం ఓ వీధికుక్కను చంపడం లాంటిది కదా. నువ్వు కుక్కల్ని చంపడానికి మాత్రమే పనికి వస్తావ్. ఓ చాళుక్యవీరుడ్ని సంహరించగలవా.. చోళచక్ర వర్తిని బంధించి తేగలవా.. కనీసం వెలనాడు మహా రాజునో.. బల్లాలదేవుడ్నో.. కళింగ చక్రవర్తినో.. అంతెందుకు దేవగిరి యువరాజు సింఘణదేవుడ్ని పట్టి బంధించు చూద్దాం.. హహ్హహ్హ.. హహ్హహ్హ హహ్హహ్హ..’’
నాగతిభూపాలుడు అలా రకరకాలుగా గణపతిని రెచ్చగొడుతూ అరుస్తూ పగలబడి నవ్వుతూ పిచ్చెక్కి నట్లు మాట్లాడుతూనే ఉన్నాడు.
గణపతిదేవుడు అచేతనుడిలా ఉండిపోయాడు. రుద్రసేనాని కూడా స్థాణువులా నిలబడిపోయాడు.
తిక్కన, గంగాధరుడు ముఖాలు చూసుకుని కనుసైగలపై భటులను పిలవగా వాళ్లు నాగతి కట్లువిప్పి కారాగారం వైపు తీసుకుపోయారు.
దాదాపు రెండు వందల మంది మేధావులున్న మందిరం చాలాసేపు అలా అచేతనంగా ఉండి పోయింది. తిక్కన కదిలి అన్నాడు, ‘‘సభాధ్యక్షుడిగా ప్రకటిస్తున్నాను. ఈరోజుకు సమావేశం ముగిసింది. రేపు ఉదయం ఎప్పటిలాగే సమావేశం జరుగుతుంది. అందరూ మీమీ అతిథి మందిరాలకు వెళ్లవలసినదిగా ప్రార్థన.
అందరూ మౌనంగా కదిలారు.
అంగరక్షకులైన లెంకలు ముందుకొచ్చి వినయంగా తలవంచి నిలబడగా గణపతిదేవుడు కదలక తప్ప లేదు. మౌనంగా మందిరాన్ని వీడి అంతఃపురం వైపు నడిచాడు. గంగాధరుడు భుజంపై చేయి వేయగా రుద్రసేనాని కూడా కదిలాడు.
ఎవ్వరి నోటా ఒక్కమాట కూడా రాలేదు.
మరునాడు శిబిరం మొదలయినా అంతా మౌనం.. ఎవరి ముఖంలోనూ చిరునవ్వు లేదు.
నాగతి మాటలు ఆ మందిరంలో ప్రతిధ్వనిస్తు న్నట్లు.. అందరూ అతని మాటలతో తీవ్రాతితీవ్రమైన ఆలోచనలతో గంభీరంగా ఉన్నారు. ఎవ్వరి ముఖం లోనూ రక్తపు చుక్క లేదు.
గణపతిదేవుడు శిబిరంలోకి ప్రవేశిస్తున్నప్పుడు కూడా వందిమాగధులు తమ స్తోత్ర పాఠాలు ప్రారంభించగా, ఆయన ఆపమన్నట్లు చేయెత్తాడు. దాంతో ఈరోజు వాళ్లు చదివే స్తోత్రపాఠాలు ఎలా ఉంటాయో అనే ఉత్కంఠకు తెరపడింది.
శిబిరం అధ్యక్షుడు తిక్కనామాత్యుడు మాత్రం ఎప్పటిలాగే ఆనాటి చర్చాంశం ప్రకటించారు.
‘‘ఈరోజు చర్చనీయాంశం మన సహజవనరులు అంటే మన నదులు, పర్వతాలు, భూములు, పంటలు. దీని పై మన విశిష్ట ప్రవీణులు శ్రీ స్కంధనాథయ మహోపాధ్యాయులు ఉపన్యసిస్తారు.’’ అన్నాడు.
స్కంధనాథయ మాట్లాడడానికి సిద్ధ్దమౌతుండగా గణపతి దేవమహారాజు కలగజేసుకున్నాడు.
‘‘శిబిర అధ్యక్షులకు.. పండిత ప్రకాండ్రులకు నమస్సులు. అసలు ఈ రాజు, మహారాజు, రాజాధి రాజు, చక్రవర్తి.. ఈ బిరుదులకు వివరణ కోరుతు న్నాను. ఈ పదాలు వీటి అర్థాలు ఏవిటి.. ఎవరిని మహారాజు అనాలి.. ఎవరిని చక్రవర్తి అనాలి. నిన్న ఆ ధూర్తుడు మమ్మల్ని అవమానించాడు. నేను చక్రవర్తి అన్న మాటకు అర్హుడిని కాదు అని. అలా పొగిడించుకోవడం.. నేను పొగిడించుకుంటున్నానని.. వాడు అనడం నన్ను బాధించింది. కాస్త ఆ అంశాలపై వివరణ ఇవ్వవలసినదిగా మనవి..’’
వెంటనే తిక్కనామాత్యుడు స్పందించారు.
‘‘మహారాజా.. నిన్నటి ఆ దురదృష్ట సంఘటన మిమ్మల్ని ఎంత బాధించిదో మా అందరిని అంతే బాధించింది.’’
సభలోని పండితులంతా అవునవునన్నట్లు స్పందించారు.
‘‘అయితే నిజానికి ఆ పదాలు పొగడ్తలు కాదు మహారాజా. అవన్నీ పాలకులకున్న పదవులు లేదా హోదాలు.
చాలా పవిత్రమైనవి. వాటి వివరణలు హైందవ గ్రంథాలలోనే కాదు బౌద్ద జైన గ్రంథాలలో కూడా ఉన్నాయి. వాటిని సభకు వివరించి చెప్పగల ప్రతిభా మూర్తులు ఇక్కడే.. మన మధ్యే ఉన్నారు.’’
తల తిప్పి శిబిరానికి హాజరయిన పండితులను పరికించి చూస్తూ అన్నాడు.
‘‘సంకల్పభట్టుగారూ, జినేంద్రరాయుడు గారు, బేతనప్రగ్గడ గారు ఎన్నో ధర్మశాస్త్రాలను మధించిన వారు. దక్షిణావర్తంలోనే కాదు ఉత్తరభారతంలోని అనేకానేక రాజాస్థానాలలో పండితప్రకాండ్రులతో చర్చలతో తలపడిన.. తల పండినవారు. మీరు.. మన మహారాజుగారికే కాదు.. మా అందరికి ఈ పదాలు, హోదాలపై కొంత వివరణ ఇవ్వవలసి నదిగా మహాపండితులారా.. మిమ్మల్ని కోరుతు న్నాను..’’
సంకల్పభట్టు గోదావరి తీరస్తగ్రామం ముంగడ నుండి వచ్చారు. ఆయన పండిత సంచారి. కాస్త కురచగా.. ఛామన చాయలో కనిపిస్తున్నారు. లేచి మహారాజుకు, తిక్కనకు నమస్కరించి మాట్లాడబోగా కూర్చుని మాట్లాడ వలసినదిగా తిక్కన చేయితో సౌంజ్ఞ చేశారు. సంకల్పభట్టు పద్మాసనంలో కూర్చుని మాట్లాడారు.
‘‘మహాకవులు తిక్కనార్యులు చెప్పినట్లు ఈ పదాలు బహు పవిత్రమైనవి. ప్రపంచ నాగరికతలలో ఒకటైన భరతఖండంలో గణరాజ్యాల కాలంలోనే గణ నాయకుడిని ‘రాజన్’ అనే పదంతో గౌరవించేవారు. అప్పుడే హైందవ, జైన, బౌద్ద ప్రవక్తలు, చార్వాకులు, లోకాయుతులు, వైతండికులు, పాషండులు, కాపాలికులు, దిగంబరులు, పాశుపతులు.. మొదలైన ప్రవక్తలు కూడా పాలకుడు అంటే రాజు పదమే చెప్పారు. రాచరిక వ్యవస్థను సమర్థించారు. భారతీయ రాజ్యవ్యవస్థకు సరైన దిశానిర్దేశం చేసినవాడు చాణక్యుడు. ఆయన రాసిన అర్థ్ధశాస్త్రమే ఇప్పటికీ మన పాలకులకు ప్రధాన రాజనీతి శాస్త్రం. ‘‘రాజా రాజ్యం ఇతి ప్రకృతి సంక్షేపః’’ అంటాడాయన. అంటే ‘రాజ్యం అంటే రాజు.. రాజు అంటే రాజ్యం’ అన్నాడు కాని చక్రవర్తి పదాన్ని వాడలేదు. అప్పటికి రాజే గొప్ప. తర్వాత కాలంలో ‘నా విష్ణుః పృధ్వీపతిః’ అనే మాట పుట్టింది. కాని చక్రవర్తి పదం వరకు వచ్చేసరికి పాలకుని గుణగణాలు మారిపోయాయి. చక్రవర్తి అనే పాలకునికి నిజంగానే దైవత్వ స్థాయి ఉండాలన్నారు రాజనీతి శాస్త్ర కారులందరూ.’’
తర్వాత జినేంద్రరాయడు జైనమత గ్రంథాలలోని అంశాలను వివరించాడు.
‘‘మతాలలో అత్యంత ప్రాచీన మతం జైనం. అసలు భరతుడు అనే మహారాజు లేదా చక్రవర్తి పాలించిన నేలనే భారతదేశం అన్నది జైన గురువులే. అబ్బో.. జైన గ్రంథాలలో కూడా చక్రవర్తిని మహోన్నతంగా చిత్రీకరించారు. ప్రాచీన జైన రచనల్లో ఈ చక్రవర్తి అనేవాళ్లు నాలుగు వర్గాలు.. బంగారు చక్రాల రథం కలిగినవాడు, వెండి చక్రాల రథం, రాగి చక్రాల రథం, ఇనుపచక్రాల రథం కలిగినవాడు అనే నాలుగు వర్గాలుగా చెప్పారు. బంగారు చక్రవర్తి నాలుగు ఖండాలతో పరివేష్టితమై ఉన్న సుమేరు పర్వత రాజ్యానికి పాలకుడు. వెండి చక్రవర్తి తూర్పు, పడమర, దక్షిణ ఖండాలను పరిపాలకుడు, రాగి చక్రవర్తి ఉత్తర, దక్షిణ ఖండాల పాలకుడు, ఇనుప చక్ర రథి•కుడు కేవలం దక్షిణ ఖండం… అంటే జంబూద్వీప పాలకుడు. ఇలా జైనం చక్రవర్తిని నిర్వ చించింది. అంటే సర్వ మానవ సమాజాన్ని పరిపా లించగల గొప్ప నాయకుడినే చక్రవర్తి అనాలని జైనమతం చేసిన నిర్వచనం.’’
తర్వాత బేతన ప్రగ్గడ ప్రసంగిస్తూ బౌద్ధంలో చక్రవర్తి గురించి చెప్పిన అంశాలు వివరించాడు.
‘‘బౌద్ధంలో చక్రవర్తికి ఇచ్చిన గౌరవం, హోదా, స్థాయి చాలా ఎక్కువ. బౌద్ధ జాతకకథల్లో బుద్దుని ముందు దశల్లో వచ్చే రాజులంతా చక్రవర్తులే. దైవానికి ప్రతీక అయిన చక్రవర్తి హోదాకు తగ్గట్లు మరికొన్ని విలువలను జోడించారు. చక్రవర్తి హోదాకు తగ్గట్లు కొన్ని రాచరిక విలువలను కల్పించారు. చక్రవర్తి అంటే చక్రం, ఏనుగు, గుర్రం, రత్నరాసులు, రత్నం లాంటి భార్య/భార్యలు, గొప్ప మంత్రులు, గొప్ప యుద్ధయోధులు.. అనే ఈ ఏడు సంపదలు కలిగి ఉండాలి. గొప్ప పరిపాలకుడైన చక్రవర్తి పూర్తిగా మతాతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. బౌద్ధం రాచరికాన్ని ఒప్పుకున్నా ఎవడు పడితే వాడ్ని చక్రవర్తి అనడం.. అంగీకరించలేదు.’’
తర్వాత తిక్కనామాత్యుని అనుజ్ఞతో మరికొందరు తమ తమ అభిప్రాయలు చెప్పారు.
చివరగా ఆయన ముక్తాయించాడు.
‘‘హైందవం కూడా చక్రవర్తి అనే హోదా దాదాపు భగవంతునితో సమానమన్నది. మహారాజు సాక్షాత్తూ దైవం.. లేదా దేవుని ప్రతిరూపం. అలాగే చక్రం రాజుకు, ధర్మానికి, శౌర్యానికి, సత్పరిపాలనకు ప్రతీక. చక్రవర్తి అనిపించుకోవాలి అంటే అశ్వమేథ•యాగం చెయ్యాలి. అంటే యాగాశ్వాన్ని వదలినప్పుడు దానిని ఎవ్వరైనా బంధిస్తే మహారాజు అతన్ని ఓడించాలి. అతని రాజ్యాన్ని తన సామ్రాజ్యంలో కలిపేసుకోవాలి. అలా అలా జయించుకుంటూ మొత్తం విశ్వాన్ని జయించిన వాడే చక్రవర్తి. చక్రం అంటే కదిలేది. రాజ్యాన్ని కదిలించే వాడు, ఎదుటి వాడెవ్వడూ కదిలించలేనివాడు చక్రవర్తి. చక్రం అనేది ఎదురులేని శక్తి. అది యుద్ధశక్తి కావ చ్చు పరిపాలనా శక్తి కావచ్చు. ఎవ్వడినైనా జయించే శక్తి కావచ్చు. ఎవ్వడూ జయించ లేని శక్తి కావచ్చు.‘వర్తి అంటే కదిలించేవాడు. అది రాజ్యం కావచ్చు రథం కావచ్చు. మాట కావచ్చు. చక్రవర్తి రథాన్ని ఎవ్వడూ ఆపలేడు. అంటే ఆయన రథానికి ఎదురులేదు. ఆయన మాటకు తిరుగులేదు. అలా రథానికి, రాజ్యానికి, ఇచ్చిన మాటకు ఎదురు లేకుండా అంటే దుర్నిరీక్ష్యంగా అద్భుతంగా పాలించ గలవాడు మాత్రమే చక్రవర్తి.
రాజు నుండి మహారాజు, రాజాధిరాజు, రాజేంద్రుడు.. ఇలా వంది మాగధులు, భట్రాజులు పాలకుని రకరకాలుగా పొగడటం అంటే స్తోత్ర పాఠాలలో వర్ణనలు ఉండొచ్చు. కాని చక్రవర్తి అనే పదాన్ని మాత్రం ఆచితూచి వాడాలి.
మహారాజు.. రాజాధిరాజు అని పిలిపించుకున్న రాజులు కూడా చక్రవర్తి అనిపించుకోవడానికి తటపటాయించే వారు. ఈ ఆధునిక కాలంలో చక్రవర్తి పిలుపు సాధారణ రాజులకు కూడా వాడటం.. ప్చ్.. విలువల పతనమే మహారాజా! అందుకే ఎక్కడైనా అలాంటి పిలుపులు విన్నప్పుడు కొందరు రాజులు తమ శత్రురాజులను నాగతి మహారాజులాగా హేళన చేస్తున్నారు..’’
‘‘మహారాజు, రాజాధిరాజు అనే గౌరవ సంబోధనలు కూడా రాజ్య వైశాల్యాన్ని బట్టి ఆ రాజు విజయాలను బట్టి ఉండేవి. రాజ్య వైశాల్యం పెంచుకోవడం తేలికే కాని పాలించడం చాలా కష్టం. చక్రవర్తి అనిపించుకోవడం నిజంగా అందుకు తగిన గొప్ప శక్తిసామర్ధ్యాలు.. పరిపాలనా ప్రతిభ ఉండాలి మహారాజా.’’
ఆ రోజంతా సుదీర్ఘంగా ఉపన్యసించి రాజు అనే పాలకుని ఏయే ప•దాలతో.. ఏయే స•ందర్భాలలో.. సంబోధించాలో పండితులు చెప్పారు. చక్రవర్తి అంటే సామాన్య పదవి, హోదా కాదని.. చక్రవర్తిగా నిజంగా పిలిపించుకోవాలంటే అసామాన్యులై ఉండాలని శిబిరం మొత్తంగా అభిప్రాయపడింది.
చర్చ పూర్తయ్యాక గణపతిదేవుని ముఖంలో కొంత ప్రసన్నత ఏర్పడింది. ఆయన దీర్ఘాలోచనలో ఉండి పోయాడు. కాసేపటికి కదిలి చర్చలో పాల్గొన్న సంకల్పభట్టుకి, బెతనప్రగ్గడకు, జినేంద్ర రాయనికి.. తదితర పండితులకు నమస్కరించాడు.
అనంతరం తన సభాసహాయకుడు మయిదేవుని పిలిచి ఏదో చెప్పాడు. అతడు పరుగున బయటకు వెళ్లాడు.
కాసేపటికి బందీగా ఉన్న నాగతి మహారాజును మందిరంలోకి తీసుకునివచ్చి గణపతిదేవుని ముందు నిలబెట్టాడు. పూర్తిగా తలవాల్చి నిలుచున్నాడు నాగతి భూపాలుడు.
సభ అంతా నిశ్శబ్దంగా చూస్తోంది. గణపతి దేవుడు ఆ నాగతిమహారాజును మళ్లీ ఎందుకు సభలోకి పిలిపించాడు అని పెద్దలంతా గుసగుస లాడుతున్నారు. గణపతిదేవుడు సింహాసనం దిగివచ్చి నాగతి బంధనాలు స్వయంగా తొలగించాడు. అతన్ని గౌరవంగా నడిపించి దగ్గరున్న మరో ఉచితాసనంపై కూర్చోబెట్టాడు.
సభనుద్దేశించి…‘‘నాగతిమహారాజు నా కళ్లు తెరిపించాడు. నన్ను ఎవరు.. ఎందుకు.. ఏ అధికార నామంతో పిలుస్తున్నారో.. ఆ నామం అర్థ్ధం నిన్న ఈ మహారాజు నన్ను హేళనగా మాట్లాడినప్పుడు అర్థమైంది. స్తోత్ర పాఠంలోని పదాలకు అర్థాలు నాకు నిజంగా తెలియదు. నాగతి తన మాటలతో నా కళ్లు తెరిపించాడు. చక్రవర్తి అనే పదానికి నేను ఏ మాత్రం అర్హుడిని కాదు. నేను తెల్లవార్లు ఆలోచించాను. ఇప్పుడొక ప్రకటన చేస్తున్నాను. ఇకపై నన్నెవ్వరూ చక్రవర్తిగా సంబోధించరాదు. నేను కేవలం రాజును, మహారాజును మాత్రమే. వేరువేరు మండలాలను పాలించేవారు మండలాధ్యక్షులయితే నేను మహా మండలాధ్యక్షుడను లేదా మహా మండలా ధీశుడను. అంతేకాని ఇతర ప•దవులతో పొగడ్తలతో నన్ను పిలువరాదు. సంభోదించరాదు. అని ఈ శిబిరం ద్వారా నేను అర్థం తెలుసుకుని.. అర్థం చేసుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. సమస్త నియోగాలకు, సామంతులకు, మహా సామంతులకు, మన మండలా ధ్యక్షులకు అధికారిక వర్తమానం పంపించండి. ఇది నా ఆజ్ఞ!!’’
శిబిరం గంభీరంగా ఆలకించింది. లేచి నిలబడి తలవంచి శిరసా వహించినవాడు మహాప్రధాని గంగాధర మంత్రి!
అప్పుడు శిబిరాధ్యక్షుడు తిక్కనామాత్యుడు ‘‘ఏదో ఒకనాడు మిమ్మల్ని చక్రవర్తి అని పిలిచే భాగ్యం మాకు లభిస్తుంది ప్రభూ! మీరు మొత్తం తెలుగుసీమను ఏకం చేసి తెలుగుసామ్రాజ్యాన్ని.. ఆంధ్రసామ్రాజ్యాన్ని స్థాపించాలి. తెలుగు మాట్లాడే ఈ భూమిపై గతంలో విస్తృత రాజ్యాన్ని స్థాపించి పాలించిన శాతవాహ నులు, చోళులు, చాళిక్యులు, రాష్ట్రకూటులు.. ఎవ్వరూ తెలుగువా రు కాదు. తమ మాతృభాష తెలుగు కాదని ఇటీవల వారే విస్పష్టంగా ప్రకటిం చారు. తెలుగు సామ్రాజ్యాధినేత కాగలిన.. తెలుగు మాతృభాషగా కలిగిన మహారాజు, మహామండలేశ్వ రులు మీరొక్కరే. ఆ అర్హతలు, ఆ సమర్థత మీకొక్కరికే ఉన్నాయి. మీరొక్కరే ఏకైక తెలుగుజాతి కన్న మహా నాయకులు. కాబట్టి మీరొక్కరే అందుకు అర్హులు. నేను.. మేము బతికి ఉండగా మీరు తెలుగు సామ్రా జ్యాన్ని స్థాపిస్తారని మనసా వాచా కర్మణా నమ్ము తున్నాము. మా నమ్మకాన్ని నిలబెట్టవలసినదిగా చేతు లెత్తి మొక్కుతున్నాము..’’