భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
–సి. యమున
‘‘ఇక్కడ ధరలు అన్నీ ఆకాశం అంటుతున్నట్లే ఉన్నాయి. పిల్లలకి స్పెషల్ కోచింగ్ ఖర్చు భారం కూడా మొదలయ్యింది. తొందరగా ఉద్యోగం వెతుక్కోవాలి’’ బట్టలతో పాటు, గజిబిజిగా ఉన్న తన ఆలోచనలను, అవసరాలను కూడా ఒక పొత్తిగా చేసే ప్రయత్నంలో ఉంది నీలవేణి. ఆ ఫ్లాట్‌ను వాళ్లు మొన్నమొన్ననే కొనుక్కుని గృహప్రవేశం అయ్యారు. సెకండ్ హాండ్ ఫ్లాట్ అయినా బాగుందని పైగా సెంటర్లో ఉందని కొనుక్కున్నారు. ఈ మార్పిడిలో పిల్లవాడి కాలేజీ, భర్త ఆఫీసు దగ్గరైతే నీలవేణి పనిచేసే ప్రైవేట్ స్కూల్ మటుకు దూరమయ్యింది. సంసారంలో భారాన్ని సమర్ధించుకుంటూ, అంత దూరంలో ఉన్న స్కూల్‌కు పొద్దున్నే పరిగెత్తలేక ఉద్యోగాన్ని త్యాగం చేసింది.
మోగిన కాలింగ్ బెల్ శబ్దానికి ఆలోచనలను, చేస్తున్న పనిని వదిలి, తలెత్తి చూసింది నీలవేణి. గ్రిల్ డోర్ నుండి అవతల నిలుచుని ఉన్న మనిషి, ‘ఆకుల మధ్య ఒదిగి ఉన్న కాయలాగా’ పూర్తిగా కనపడటం లేదు. చేతిలో ఉన్న బట్టలను ప్రక్కన పెట్టి, లాక్ చేసి ఉన్న గ్రిల్ డోర్ కేసి నడిచింది.
ఎదురుగా, నవ్వు మొహంతో నిలబడ్డ ముప్పై ఏళ్ల అమ్మాయి.
‘ఎవరు’ అన్నట్లు చూసింది నీలవేణి.
కళ్లతో అడిగిన ఆ ప్రశ్నకు జవాబుగా
‘‘అమ్మా, పనికి అడిగారట’’ అంది ఆ అమ్మాయి.
‘‘ఎవరు పంపారు’’ ఆరాగా అడిగింది నీలవేణి.
‘‘మీ మావగారు,‘మా కోడలికి పనికి మనిషి కావాలి’ అని సెక్యూరిటీకి చెప్పారట. ఆ అబ్బాయే నన్ను పంపాడు’’
ఆ మాటలకు భరోసాగా ఫీల్ అయ్యి, ‘‘అవునా’’ అంటూ గ్రిల్ తాళం తీసింది నీలవేణి.
మనిషిని పరిశీలనగా చూస్తూ ‘‘నీ పేరేమిటీ’’ అంది.
‘‘కళ’’
‘‘పేరుకు తగ్గట్లు మనిషి కూడా కళగా,శుభ్రంగానే ఉంది‘‘ మనసులో ఓ అంచనా వేసుకుంది నీలవేణి.
‘‘చెప్పండి, ఏమేమి పనులు చేయాలి?’’ ఇంటి నాలుగు వైపులా చూస్తూ అడిగింది కళ.
‘‘ఇల్లు ఊడ్చి, తుడవాలి. అంట్లు తోమాలి. అంతే. కాకపోతే కాస్త పొద్దున్నే రావాలి. కుదురుతుందా’’
‘‘మా ఇల్లు ఈ పక్కనే. మీరు చెప్పిన టైంకు వస్తాను’’
‘‘హమ్మయ్యా, తొందరగా కూడా వస్తానంటోంది. నేను ఉద్యోగంలో చేరిన తరువాత కూడా ఇబ్బంది ఉండదు. పెందరాళే పని తెమిలిపోయి, సౌకర్యంగా ఉంటుంది’’ నీలవేణి మనసులో ఓ ఉపశమనం.
‘‘సరే, జీతం ఎంత ఇవ్వాలి’’ ఆలోచనలు పక్కన పెట్టి అడిగింది.
‘‘మూడు బెడ్ రూములు కదా’’
‘‘ఊ’’
‘‘పనికి వెయ్యి రూపాయలు. మీరు రెండు పనులు అడిగారు. అంటే 2000 లు ఇవ్వండి’’
‘‘మరీ అంతలేసి జీతాలా?’’
‘‘అన్నీ పెరిగిపోయాయి. మేమూ కూడా బ్రతకాలి కదాఅమ్మా’’
‘‘కొత్తగా కొనుక్కున్న ఈ ఫ్లాట్‌కి ఇప్పుడే మారాము. మాకు కూడా ‘లోనులు,ఫ్లాట్ మెయింటనెన్స్… పిల్లల ఫీజులు’అలా ఎన్ని ఖర్చులో తెలుసా’’ అంటూ అదోరకంగా కళ్లెగరేసింది నీలవేణి.
‘‘అలా అంటే ఎలా అమ్మా’’
‘‘మరి అత్యాశ గా అడిగితే ఇంకేమంటాను’’
‘‘ఈ చుట్టు పక్కల ఇంతే ధరలు ఉన్నాయి. కావాలంటే కనుక్కోండి’’
‘‘మనిషి నీట్‌గా ఉంది. పొద్దున్నే నాకు అనుకూల మైన సమయంలో వస్తానంటోంది. వదులుకుంటే మళ్లీ వేరే వాళ్లు దొరుకుతారా! కానీ జీతం ఎక్కువ అనిపిస్తోంది…’’ నీలవేణి మనసులో గుంజాటన.
‘‘చెప్పండి. అవతల పనికి ఆలస్యమైతే కోప్పడతారు’’
‘‘మనిషీ,మాట తీరు కూడా బాగానే ఉంది. అంత కచ్చితంగా చెప్పుతోందంటే అందరూ అంతే జీతాలు ఇస్తుండొచ్చు’’ అంటూ మనసులో ఓ లెక్క వేసుకుని…
‘‘జీతం ఏముందిలే, పని బాగా చేస్తే చాలు. చూశావుగా, ఇల్లు ఎలా ఉందో! ఈ గజిబిజిలో పని చేయటం కష్టం. రెండు రోజుల్లో ఇల్లు సర్దుకో వటం అయిపోగానే ఫోన్ చేస్తాను. అప్పుడు పని మొదలుపెడుదుగానీ. మొబైల్ నెంబర్ చెప్పి వెళ్లు
‘‘సరే, అమ్మా’’ అంటూ నెంబర్ చెప్పింది కళ.
ళి ళి ళి
‘‘సెక్యూరిటీ అతనికి చెప్పి వెళ్లాను.మంచిగా పని చేసే మనిషిఎవరన్నా ఉంటే పంపమని, పంపాడా?’’ కూరగాయల సంచీని నీలవేణి చేతికిస్తూ అడిగాడు సుగుణరావు.
‘‘ఆ పంపాడు…మామయ్యా’’
‘‘నీకు నచ్చినట్లు ఉందా’’
‘‘మనిషి శుభ్రంగా పొందికగానే ఉంది. పొద్దున్నే కూడా వస్తానంటోంది’’
‘‘మరి ఇంకేం,పనికి మాట్లాడుకున్నావా’’
‘‘మాట్లాడుకున్నట్లే. కానీ జీతమే ఎక్కువ… ’’
‘‘అంతా బాగుంటే ఓ వందో రెండు వందలో ఎక్కువైనా ఫరవాలేదులేమ్మా. మళ్లీ ఉద్యోగంలో కూడా చేరతానంటున్నావు. ఒప్పేసుకో’’ అంటూ నీలవేణి మాటలకు అడ్డు పడిపోయాడు.
రెండేళ్ల క్రితం అనారోగ్యంతో కొడుకు పంచన చేరాడాయన. తను కోలుకున్నాడు. కానీ గుండె పోటుతో హఠాత••్తగా భార్య దాటిపోయింది. తిరిగి సొంత ఊరు వెడతానన్నా, కొడుకు, కోడలు ఒప్పుకోక పోవటంతో ఉండిపోయాడు. దానితో వారితో మరింత గాఢమైన బంధం ఏర్పడింది.
ఎక్కడో ఉన్న కూతుళ్ల మీద ఉన్న ప్రేమ కూడా ఆయన కోడలి మీదే చూపుతాడు. చేదోడు వాదోడుగా ఉంటాడు.
‘‘మీరన్నది నిజమే. కాకపోతే మన ఖర్చులు కూడా చూసుకోవాలిగా’’
‘‘కొన్ని తప్పవు కదా తల్లీ’’
‘‘అవును, తప్పవు. పైగా ‘కావాలంటే చుట్టు పక్కల వాళక్లను అడిగి తెలుసుకోండి. ఇక్కడ ఇంతే ఉన్నాయి జీతాలు’ అని ఖరాకండీగా చెప్పింది. ఇంకే మంటాను. అయినా, నేను ఎవరినడుగుతాను’’
‘‘ఇంతకూ ఏమి తేల్చుకున్నావు’’
‘‘‘ఇల్లంతా సామాను కాలికీ వేలికీ అడ్డు వస్తున్నట్లు ఉంది కదా! రెండు రోజుల్లో కొంచెం ఇల్లు సర్దుకుని నీకు ఫోన్ చేస్తాను. అప్పుడు రా’’’ అని చెప్పాను.
‘‘మంచి నిర్ణయం తీసుకున్నావు’’ మెచ్చుకోలుగా అన్నాడు ఆయన.
ళి ళి ళి
‘‘ఏమ్మా, ఇల్లు సర్దటం అయ్యిందిగా. ఆ అమ్మాయికి కాల్ చేశావా మర్చి పోయావా’’ సాయంత్రం నడక ముగించుకుని వచ్చిన సుగుణరావు ఆరాగా అడిగాడు.
‘‘ఇందాకా ఫోన్ చేద్దామనుకున్నాను. కానీ అసలు విషయం తెలిసి ఇహ వద్దని నిర్ణయం తీసుకున్నాను’’
‘‘ఏమయ్యిందీ’’ ఆతృతగా అడిగాడు.
‘‘మనల్ని పరిచయం చేసుకుందామని, ఇప్పుడే పక్క ఫ్లాట్ లో ఉంటున్న ఆవిడ వచ్చి వెళ్లారు’’
‘‘అయితే’’ అర్థంకానట్లు చూశాడు.
‘‘మాటల మధ్యలో పని వాళ్ల జీతాల గురించి అడిగాను.
‘మాదీ, మీ ఫ్లాట్‌లాగే మూడు బెడ్‌రూమ్‌లే. మీరు చెప్పిన పనులే నేను చేయించుకునేది కూడా! పనికి ఎనిమిది వందలు చొప్పున…రెండు పనులకి పదహారు వందలు ఇస్తున్నాను’అని చెప్పింది ఆవిడ’’
‘‘మనమ్మాయి ఎంత అడిగింది’’
‘‘చెప్పానుగా,పనికి వెయ్యి చొప్పున భయంకరంగా రెండు వేలు జీతం అడిగింది’’
‘‘వాళ్లకు ఎప్పటినుండో చేస్తోందేమో’’
‘‘అవును. రెండేళ్లుగా చేస్తోందట. ‘జీతం పెంచమని గొడవ చేస్తుంటే, ఈ మధ్యే ఓ యాభై రూపాయలు పెంచాను. అదేదో మీకు కథ చెప్పింది. నాకు తెలిసి, ఇంతకు మించి ఎవరూ జీతాలు ఇవ్వటం లేదు’ అని చెప్పిందావిడ’’.
‘‘ఓ’’
‘‘పైగా ఈ చుట్టు పక్కల, ఇంతకన్నా తక్కువకు ఎవ్వరూ చెయ్యరని దాని దబాయింపు ఒకటి. తలుచుకుంటే ఒళ్లుమండుతోంది.’’
‘ఊపిరి పీల్చుకోవటానికా’ అన్నట్లు ఒక్క క్షణం ఆగింది నీలవేణి.
‘‘ ‘కళ’ పేరుకు తగ్గట్లు కళగా ఉందనుకున్నాను కానీ ఈ అబద్దాల కళలు ఉన్నాయనుకోలేదు. ఎంత అన్యాయంగా అడిగింది. ఫోన్ చేసి వద్దని చెపుతాను’’ రెండు రోజుల క్రితం కళలో కనపడ్డ సద్గుణాలని కొట్టి పారేస్తూ కచ్చగా చెప్పింది నీలవేణి.
‘‘నువ్వు ఏమనుకోకపోతే ఒక విషయం. కళది అన్యాయం అంటున్నావు. రెండేళ్లుగా చేస్తుంటే, జీతం యాభై రూపాయలేనా పెంచేది. అది మటుకు న్యాయమా?’’
తనకు సానుకూలంగా మాట్లాడుతారనుకున్న మామగారు, అలా మాట్లాడేసరికి మరింత చిరాకు వచ్చింది నీలవేణికి.
దాంతో ‘‘నిన్నగాక మొన్న సిటీకి వచ్చిన మీకు ఇక్కడ విషయాలు అర్థం కావులెండి’’ అంటూ మామగారి మాటలను మధ్యలోనే కొట్టిపడేసింది నీలవేణి.
నిస్సహాయంగా నిట్టూర్పు విడిచాడు సుగుణరావు.
ఆ సాయంత్రం జరిగినది మొత్తం భర్త మోహన్ ముందు కూడా వెళ్లగక్కింది నీలవేణి.
‘‘పైగా ‘న్యాయం… అన్యాయం’ అంటూ మీ నాన్నగారి సపోర్ట్ ఒకటి. పాపం, బతికున్న రోజుల్లో మీ అమ్మగారు ‘పాలవాళ్ల దగ్గరనుండి పూల వాళ్ల దాకా… ప్రతి విషయంలో చొరబడతారు’ అని మొత్తుకునేవారు. ఈయనతో ఎట్లా వేగారో నాకు అర్థం కాదు’’ అంటూ ఏడాది క్రితం చనిపోయిన అత్తగారి మీద సానుభూతి కూడా కుమ్మరించింది.
‘‘ప్లీజ్,ఎవరో ఒకరిని చూసుకో. రేపటి ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ కావాలిగా. నన్ను డిస్టర్చ్ చేయకు’’ విసుగ్గా చెప్పాడు మోహన్.
‘‘సారీ, బాగా ప్రిపేర్ అవ్వండి. మనకు డబ్బులు అవసరం కూడా మరింత పెరిగింది’’ అంది తేలికగా నవ్వేస్తూ.
ళి ళి ళి
‘‘ఏమండీ, కొత్త కంపనీలో చివరి రౌండ్ ఇంటర్వ్యూ అంటే, దాదాపు సెల్సెక్ట్ అయిపోయి నట్లేగా’’
‘‘అలాగే అనుకోవచ్చు’’ ష్యూ లేస్ బిగిస్తూ అన్నాడు మోహన్.
‘‘నేనొకటి చెపుతాను వింటారా’’
‘‘చెప్పు’’
‘‘జీతం కాస్త దబాయించి ఎక్కువ అడగండి’’
‘‘ఏమిటీ దబాయించి అడిగేది? చేస్తున్న ఉద్యోగ వివరాలు, వస్తున్న జీతం పేమెంట్ స్లీప్ వాళ్లకు సబ్మిట్ చేశాను కదా! ఎంత అడిగినా ఇప్పటి శాలరీ మీద పదిహేను మహా అయితే ఇరవై శాతం మించి పెంచరు’’
‘‘ఇప్పుడు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చి జీతం పెరగబోతోంది అని ఆ పెరగబోయే జీతాన్ని చెప్పండి’’
‘‘వాట్, ఇప్పట్లో నాకు ప్రమోషన్ వచ్చే ఛాన్స్ లేదని నీకు తెలుసుగా’’ అన్నాడు మోహన్.
‘‘కానీ, అది ఆ కొత్త కంపనీ వాళ్లకు తెలియదుగా’’ ధీమాగా అంది నీలవేణి.
‘‘అలా చెపితే ఏమిటీ లాభం’’ అయోమయంగా అడిగాడు మోహన్.
‘‘హు, అన్నీ నేనే చెప్పాలా ? ఆ పెరగబోయే అంత జీతమే మీరు ఇచ్చేటట్లు అయితే నాకు లాభం ఏముండదు. అక్కడే కొనసాగిస్తాను. పైగా అలవాటు అయిన కంపెనీ. నాకు సౌకర్యంగా కూడా ఉంటుంది. నా పెరగబోయే జీతం మీద మీరు ఎంత పెర్సంటేజ్ ఎక్కువ చేసి ఇస్తారు? దాన్ని బట్టి నేను ఉద్యోగంలో చేరతాను అని చెప్పండి’’
‘‘చాలా స్మార్ట్‌గా చెపుతున్నావే. నా బదులు ఇంటర్వ్యూకి నువ్వు వెడితే సరిపోతుందేమో’’ అంటూ నవ్వాడు మోహన్.
‘‘జోక్స్ పక్కన పెట్టి, చెప్పింది ఆలోచించండి’’ అని నొక్కి చెపుతూ భర్తకు ‘ఆల్ ది బెస్ట్’ చెప్పి పంపించింది నీలవేణి.
అప్పటిదాకా జరిగింది అంతా విన్న సుగుణ రావు.. ఇహ ఆగలేనట్లు ‘‘జీతాలు ఇంతలేసి పెరగాలని మనం కోరు కుంటున్నపుడు, ఇళ్లల్లో పని చేసే కష్ట జీవులకి కూడా ఏడాదికి పదో, పదిహేనో శాతం జీతం పెంచటం న్యాయమేమో’’ అన్నాడు ఖంగున. జవాబు లేనట్లు చూసింది నీలవేణి.
‘‘శ్రమజీవుల కష్టం అర్థం చేసుకుని,దానిని గౌరవించటం మన అందరి బాధ్యత’’ తన మనసులోని అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు ‘విశ్రాంత కార్మికుడు’ సుగుణరావు.
ఆయన అంతర్గతం అర్థ•మయ్యి, అంతర్మథనానికి లోనైంది ఆమె.
కొన్ని నిమిషాల తరువాత, ‘రేపటినుండి పనిలోకి రమ్మని’ నీలవేణి నుండి కళకు కాల్ వెళ్లింది.