భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతి పొందిన రచన
– సుంకోజి దేవేంద్రాచారి
చెయ్యేరు నిండుగా పారుతోంది. ఏటి ఒడ్డున ఇసుకలో దాదాపు రెండువందలకు పైగా గోవులు ఉన్నాయి. ఏటిలో పారుతున్న నీళ్లకు నాలుగు బారల దూరంలో కూర్చుని నెమరు వేస్తున్నాయి. ఏ ఒక్కదాని మెడలోనూ తాడు లేదు. ముకుతాడూ లేదు. తొగూరుపేటలో సుమారు ఇంటికి నాలుగైదు ఆవులుంటాయి. వాటిని ఎవ్వరూ వ్యవసాయం పనులకు వాడుకోరు. పాలు కూడా పితకరు. దూడలకే వదిలేస్తారు. ఆ ఆవులను రోజూ కొండకు తోలుకునిపోయి మేపుకుని వచ్చేది శివరామయ్య. అతడు ఉచితంగానే ఈ పనిచేస్తాడు. అతడి తాతల కాలం నుంచి ఆలమందలను మేపడమే వృత్తి. అప్పట్లో వ్యవసాయంలో పశువులదే ప్రధాన పాత్ర. యాంత్రీకరణ పెరిగాక.. ఎగువన అన్నమయ్య డ్యాం వచ్చాక.. పశువులతో వ్యవసాయం చేయడం లేదు. అయినా ఎవ్వరూ తమ ఇంట్లో ఉండే పశువులను అమ్ముకోలేదు. వాటిని మేపడం అలవాటైన శివరామయ్యా…ఆ పని మానుకోలేదు. ఇప్పటికీ రోజూ పొద్దున్నే తొమ్మిది గంటలకంతా వాటిని తోలుకుని పోయి పులికొండ ఎక్కిస్తాడు. తిరిగి సాయంత్రం కొండ నుంచి ఊర్లోకి తోలుకుని వస్తాడు. నీటి ప్రవాహం వాటి దగ్గరకు రావడంతో గోవులన్నీ లేచి తిరిగి కాస్త దూరం వెళ్లి ఇసుకలో కూర్చున్నాయి. అవి రోజూ రాత్రిపూట అక్కడే ఇసుకలో సేదతీరుతాయి.
దబదబా తలుపు బాదుతున్న చప్పుడు కావడంతో మెలకువ వచ్చింది రాజేంద్రకు. పక్కనున్న సెల్‌లో టైమ్ చూశాడు. రెండుగంటలు. ఈ టైమ్‌లో ఎవరబ్బా! అనుకుంటూ లేచి లైటు వేశాడు. ఇంకా తలుపు బాదుతూనే ఉన్నారు. దొంగలు కాదు కదా! అనే అనుమానం వచ్చింది రాజేంద్రకు. ఆ బాదుడు శబ్దానికి అప్పటికే రాజేంద్ర భార్య, కొడుకు, కోడలు, కూతురు కూడా నిద్ర లేచేశారు.
‘‘ఎవురాడ?’’ అన్నాడు గట్టిగా.
‘‘అన్నా.. నేను.. తొందరగా తలుపు తీన్నా’’
ఆ గొంతు శివరామయ్యది. ‘‘ఓరి పిచ్చోడా.. ఈ యాళ ఎందుకురా వచ్చినావు.. దబదబా తలుపు కొట్టకపోతే నా సెల్లుకు ఫోన్ చేసిండచ్చు కదా’’ అంటూ రాజేంద్ర గెడి తీసి తలుపు తెరిచాడు.
గుమ్మం బయట నుంచే లోపలికి తొంగి చూసి.. పడకలోంచి లేచి కూర్చొని కళ్లు నులుముకుంటున్న రాజేంద్ర భార్యతో ‘‘ఒదినా.. అన్నమయ్య డ్యాం తెగిపోతాదంట.. నీళ్లు నిండిపొయ్యి నిండుకుండాల ఉందంట. ఆ పక్క పించా డ్యాం నుంచి నీళ్లు వస్తాండాయంట.. అన్నమయ్య డ్యాం తెగిపోయిం దంటే మన ఊరు మునిగిపోతాది. ముందు పాణాలు కాపాడుకుందాం. అందురూ దాసాలమ్మ గుట్టపైకి పాండి.. నేనింగా దిగవీధిలో వాళ్లకు చెప్పేసి వస్తా’’ అంటూ గుక్క తిప్పుకోనంత వేగంగా గబగబా చెప్పి అట్నుంచటే వీధిలోకి వెళ్లిపోయాడు శివరామయ్య.
ఆ ఇంట్లో అందరిలో నిద్రమత్తు ఎగిరిపోయింది.
రాజేంద్ర గుమ్మం దాటి వరండాలోంచి వీధిలోకి చూశాడు. అప్పటికే ఊర్లో జనం పది మందికి పైగా వీధిలో నిలబడుకుని మాట్లాడుకుంటున్నారు. కొందరు ఫోన్లల్లో ఉన్నారు. అక్కడున్న వారిలో ఒకతను ‘‘రాజేంద్రా.. రాప్పా’’ చేయూపుతూ పిలిచాడు. రాజేంద్ర గబగబా వారి వద్దకు వెళ్లాడు.
ఆకాశం మొత్తం మాసిపోయిన తెల్లటి దుప్పటిలా ఉంది. సన్నటి జల్లులు కురుస్తున్నాయి. మూడు రోజులుగా వాన ఆగి ఆగి కురుస్తూనే ఉంది. చెయ్యేరులో నీళ్లు గలగలా పారుతున్నాయి. ఎగువనున్న అన్నమయ్య డ్యాంకు ఎనిమిది గేట్లున్నాయి. వాటిలో అప్పటికే నాలుగు గేట్లు ఎత్తేశారు. పై నుంచి వస్తున్న వరద నీరు చాలా ఎక్కువగా ఉండటంతో.. అన్నమయ్య డ్యాం ఎప్పుడైనా తెగిపోతుందని అక్కడ పనిచేసేవాళ్లలో భయం పట్టుకుంది. ఆ డ్యాం వద్ద లష్కర్‌గా పనిచేసే రామయ్యది తొగూరుపేట. ఊర్లో జనాలంతా సుమారు అర్ధరాత్రి వరకు మేలుకునే ఉన్నారు. కొందరు వీధిలోకి వచ్చి.. మరికొందరు వాళ్ల ఇంట్లోనే.. ఇంకొందరు ఫోన్లల్లో మాట్లాడుతూ.. మేలుకునే ఉన్నారు. అందరి మాటలూ వాన.. వరద గురించే. ఎప్పుడో అమాసకో పున్నమికో అన్నట్టు ఐదేండ్లకో పదేండ్లకో ఇట్లా వానపడతాదిలే.. ఏం కాదులే అని ఒకరికొకరు ధైర్యం చెప్పుకుని ఇళ్లల్లోకి వెళ్లి పడుకున్నారు. నిద్ర పట్టీపట్టకముందే.. ఇలా డ్యాం తెగిపోతుందనే సమాచారం లష్కర్ రామయ్య నుంచి అందడంతో అందరిలో కంగారు పుట్టింది.
‘‘డ్యాం తెగిపోతాదా..?’’ భయంగా అడిగాడొకతను.
‘‘రేయ్.. డ్యాం ఎందుకు తెగతాదిరా.. తెగినా మనూరుదాంకా నీళ్లు వస్తాయా…ఆ దిగదాల చెట్లుండాయే.. ఆడికొస్తాయేమో నీళ్లంతే’’ ఒకతను ఏమీకాదన్నట్టు చాలా తేలిగ్గా చెప్పాడు.
‘‘లేదు మామా.. ఉత్తరాఖండ్‌లో వరదల వీడియోలు చూసినావా.. అక్కడ డ్యాం తెగిపోయిం దంటే ఒగేసారి ఎల్లవ ముంచేస్తాది. ఐదారు అంతస్తుల ఎత్తుతో నీళ్లు వచ్చేస్తాయి.. చూసేదానికి పులికొండ రయ్యిమని జారుకుంటూ మన ఇళ్లమీదికి వచ్చేసినట్టే ఉంటాది’’ చెప్పాడో యువకుడు.
వాళ్లున్న చోటుకు వంద మీటర్ల దూరంలో ఏటి ఇసుకలో ఉన్న ఆవుల్లో కొన్ని నిలబడుకుని ఆకాశం వైపు చూస్తూ ఎవరినో పిలుస్తున్నట్టుగా ఆగి ఆగి గట్టిగా అంబా అంటున్నాయి.
వీధిలో మాటలు చెప్పుకుంటున్న వారి చెవుల్లో ఆవుల అరుపులు చేరడం లేదు. ఇప్పుడింకా చాలామంది వీధిలోకి వచ్చేశారు.
‘‘ఇంగా ఈన్నే ఉండారా.. ఇదేమన్నా పెండ్లి సాంగెమా.. తోడు పెండ్లికొడుకొచ్చి చెయ్యి పట్టుకోని పిల్చుకోని పోవాల్నా.. పాండి పాండి.. దాసాలమ్మ గుట్టపైకి పాండి’’ అంటా పరుగులాంటి నడకతో వచ్చాడు శివరామయ్య.
కరెంటు పోవడంతో వీధి దీపాలు వెలగడం లేదు. ఆ రోజు పౌర్ణమి. చంద్రుడి కిరణాలకు మబ్బులు అడ్డంగా ఉన్నా.. ఇరవై ముప్పై బారల దూరంలో ఉన్న మనుషులు కూడా కనిపించేంత వెలుగు ఉంది. ఆ మసక వెలుగులో శివరామయ్య గుడిలోని నల్లరాతి విగ్రహంలా ఉన్నాడు.
అప్పటికే కొంతమంది దాసాలమ్మ గుట్టపైకి చేరుకున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న చెయ్యేరు అందరి గుండెల్లో గుబులు రేపుతోంది.
ఆ ఊరుపేరు తొగూరుపేట. నలభై నుంచి యాభై ఇళ్లుంటాయంతే. ఊరికి ఒక చివర దాసాలమ్మ గుట్ట ఉంది. ఏటిని అనుకుని ఆ గుట్టపై దాసాలమ్మ గుడి ఉంది. ఊర్లో అందరికీ ఆమే ముఖ్యదైవం. రెండేళ్ల క్రితమే దాదాపు రూ.50 లక్షలు ఖర్చుపెట్టి గుడిని బాగా కట్టుకున్నారు. దాసాలమ్మ గుట్టకు ఆనుకునే శేషాచలం కొండలు. వాటిలో ఒక కొండను ఊర్లో వాళ్లు పులికొండ అని పిలుస్తారు.
అందరి మాటలు కలగా పులగంగా వినిపిస్తు న్నాయి. నిద్రలో ఉండే పిల్లలను లేపడంతో వారు ఏడుస్తూ పెద్దల వెంట వస్తున్నారు. కొందరు పిల్లలను భుజాన వేసుకుని నడుస్తున్నారు. మెట్లెక్కి ముందుగా.. గుడిలో దీపం వెలుగులో చిరునవ్వులు చిందిస్తున్న దాసాలమ్మను దర్శించుకుంటున్నారు. ‘‘దాసాలమ్మ తల్లీ! మమ్మల్ని నువ్వు కాపాడాలి’’ అని మొక్కుకుని గుట్టపైకి పోతున్నారు.
తెల్లవారుజామున మూడు గంటలు అయ్యేప్పటికి ఊర్లో జనం అంతా గుట్టపైకి చేరుకున్నారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వానతో నేలంతా చెమ్మగా ఉంది. కొంతమంది ఆ చెమ్మ నేలలోనే కూర్చున్నారు. చాలామంది నిలబడుకునే ఉన్నారు. ఎవరేం మాట్లాడుతున్నా.. అందరి దృష్టీ ఏటినీటిమీదే ఉంది.
‘‘ధైర్యంగా ఉండండిప్పా.. ఇంతకంటే పెద్దపెద్ద వానలు పన్నేయి. ఎల్లవలు వచ్చినాయి. మా తాతల కాలం నించీ చెయ్యేరు ఏ పొద్దూ మనూరిని ముంచింది లేదు’’ తమ పూర్వికులు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఎనభై ఏళ్ల వృద్ధుడు చెప్పాడు.
‘‘ఆ కాలం వేరు తాతా.. మనం కూడా పైన డ్యాం లేకుండా ఉంటే భయపడే అవసరం లేదు. వచ్చిన నీళ్లు వచ్చినట్టు పోతాంటాయి. పైన్నుంచి ఎన్ని ఎక్కువ నీళ్లు వచ్చినా ఏట్లో ఐదారడుగుల ఎత్తుకు మించి వచ్చిండవు. ఇప్పుడు ఆ డ్యాం తెగిపోయిందంటే.. ఒగేసారి వచ్చి మిందపడతాయి’’ అన్నాడో యువకుడు.
‘‘మనకు ఐదారుమైళ్ల దూరంలో కదా డ్యాం ఉండాది. ఆట్నించి ఈడికి వచ్చేలోపల నీళ్లు తగ్గిపోతాయిలే’’ ఒకతని సమాధానం.
‘‘ఎట్ల తగ్గతాయి. నాలుగు దినాల నుంచి వాన పడతానే ఉండాది. ఏటి నీళ్లు పొయ్యేదానికి వేరే దావేముండాది..? ఆ పక్కా ఈ పక్కా కొండలే.. డ్యాం కాన్నించి నీళ్లు కదిలినాయంటే.. ఏటిగడ్డన ఉండే తొలిఊరు ఆ పక్కన పులపత్తూరు…ఈపక్కన మనదే..’’
‘‘అవును.. అయినా మనం భయపడే అవసరం లేదు’’
‘‘గ్లాసు నీళ్లు ముఖాన ఒకేసారి పడేదానికి.. కుండడు నీళ్లు ఒకేసారి ముఖాన పడేదానికి తేడా లేదా.. ఇదీ అంతే.. భయపడమని కాదు.. జాగ్రత్తగా ఉండాల’’
‘‘ఏం భయం లేదులేప్పా.. అందరం ఒగేతావన ఉండాంలే… గుట్టపైన్నే ఉండాం’’ ఒకామె ఫోన్‌లో ఎవరికో చెప్తోంది.
‘‘డ్యాం తెగిపోయి నీళ్లన్నీ వచ్చేస్తాయంట కదా.. డ్యాంలో పెద్ద పెద్ద చేపలు ఉంటాయేమో’’ పదేళ్ల పిల్లాడి సందేహం.
‘‘పెద్ద చేపలేందిరా.. సినిమాలో చూళ్లా.. అనకొండలు, డాల్ఫిన్లు, క్రోకడైల్స్ ఉంటాయి’’ పన్నెండేళ్ల పిల్లాడి సమాధానం.
‘‘అనకొండలు ఉంటే మనల్ను మింగేస్తాయా..’’ పదేళ్ల పిల్లాడిలో భయం.
‘‘మనం ఈడుండామని వాటికి తెలీదు కదా.. అయ్యి నీళ్లల్లో ఎళ్లిపోతాయి’’
‘‘నేను ఇంట్లో నించి ఏమీ తెచ్చుకోలేదు ఒదినా.. ముక్కల్లో చెవుల్లో ఉండే వాటితోనే వచ్చేసినానే’’ ఒక మహిళ ఆందోళన.
‘‘ఇదేమన్నా పేరంటమా ఒంటిమింద నగలేసుకుని వచ్చేదానికి.. అయినా ఏం కాదులేమ్మా.. మనం ఎందుకైనా మంచిదని గుట్టమిందికి వచ్చినాం.. ఎన్ని నీళ్లొచ్చినా ఊర్లోకి రావులే’’ మరో మహిళ ధైర్యం వాక్కు.
రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఒకరితో ఒకరు భయాన్ని పంచు కుంటున్నారు. ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకుంటున్నారు. మొత్తానికి అందరిలోనూ ఒక ఉద్వేగం. అలజడి.. ఏమవుతుందో.. ఏమో..? డ్యాం పరిస్థితి ఏమైందో కనుక్కుందామంటే లష్కర్ రామయ్య ఫోన్ స్విచ్చాఫ్.
ఏటి ఒడ్డున ఉన్న ఆలమందలో కొన్ని ఆవుల అరుపులు లీలగా వినిపించాయి. వాటి అరుపులు దాసాలమ్మ గుట్టపైన ఉండే మనుషుల చెవుల్లో చేరడం లేదు. ఏటికి అటువైపున్న పాలేశ్వరుడి గుడిలో గంట మోగింది. ఏటి నీటి చప్పుడు.. ఊరందరి మాటల మధ్య గుడిగంట చప్పుడు వినిపించీ వినిపించనట్టుగా ఉంది. అయినా సరే.. అందరికీ ఆ గంటానాదం వినపడింది. ఒక్కసారిగా అందరూ చేతులెత్తి ‘‘పాలేశ్వరా.. కాపాడు తండ్రీ’’ అంటూ మొక్కుకున్నారు.
అందరూ మాటలు చెప్పుకుంటున్నారు. తెల్లవారుజామున ఐదు గంటలయింది. ఆడవాళ్ల ధ్యాస ఇంటిమీదకు మళ్లింది. కార్తిక పౌర్ణమి.. ఇళ్ల ముందు అలికి ముగ్గులేయాలి. స్నానం చేసి నిమ్మకాయలు, ఒత్తులు, నూనె తీసుకుని పాలేశ్వరా లయం పోయి దీపాలు వెలిగించి స్వామిని మొక్కుకుని రావాలి అని చెప్పుకుంటున్నారు.
‘‘ఏందో శబ్దం ఇనిపిస్తాందే’’ అన్నాడో యువకుడు.
‘‘ఏం శబ్దమప్పా.. ఆ.. అవును ఏందో ఇనిపిస్తాంది..’’
‘‘అద్దో.. ఏందది నల్లమోడం మాదిర్తో వస్తాంది..’’
‘‘రేయ్.. ఇంగా పైకి పాండి.. పైకి పాండి..’’
‘‘ఓయమ్మో.. పాండి పాండి..’’ అరుపులు కేకలు.
అన్నమయ్య డ్యాం తెగిపోయింది. నీళ్లు సునామీ అలల్లా రెండు తాటిచెట్లు ఎత్తుతో వేగంగా వస్తున్నాయి. అటూ ఇటూ ఉండే శేషాచల కొండలను ఒరుసుకుంటూ వస్తున్న ఆ నీళ్లను చూడగానే అందరిలోనూ ఒక్కసారిగా వణుకు. కొందరు గుట్టలో మరింత ఎత్తుగా ఉండే వైపు పరుగులు తీశారు. ధైర్యవంతులు అక్కడే ఆగి గంగ ఉధృతిని కళ్లప్పగించి చూస్తున్నారు. క్షణాల్లో నీళ్లు వచ్చేశాయి. ఏటికి అటువైపుండే పులపత్తూరును సగం ముంచేశాయి నీళ్లు. ముందుగా పులపత్తూరును తాకి అటు నుంచి అటే పాలేశ్వరాలయాన్ని ఊడ్చుకుంటూ వంపు తిరిగి నీళ్లు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దాసాలమ్మ గుడి ప్రహరీ గోడవరకు వరద నీరు వచ్చింది. తొగూరు పేటలో ఇళ్లన్నీ మునిగిపోయాయి. పులపత్తూరులో వీరు చూస్తుండగానే ఏటిని ఆనుకుని బండపైన ఉన్న సగం ఇళ్లు గోడలతో సహా నీటిలో కొట్టుకు పోయాయి. ఆ ఊర్లో నుంచి జనం అరుపులు కేకలు స్పష్టంగా వినిపించాయి.
ఆ దృశ్యం చూసిన వారందరిలో భయంతో కాసేపు మాటలే రాలేదు. వెలుగు విచ్చుకుంటూ చీకటి కనుమరుగు అవుతోంది. అరగంటలోనే వరద ఉధృతి తగ్గింది. తొగూరుపేటలో ఇంకా ఐదారడు గుల ఎత్తుతో నీళ్లు పారు తున్నాయి. అటువైపు గుట్టపైనున్న పాలేశ్వరాలయాన్ని గంగమ్మ పూర్తిగా మింగేసింది. అక్కడ సుబ్రహ్మణ్యస్వామికి కొత్తగా కట్టిన చిన్న గుడి మాత్రం నీటి ధాటికి తట్టుకుని నిలబడింది. పులపత్తూరులో ఏటికి అనుకుని బండపైన ఉన్న ఇళ్లు దాదాపు వందకు పైగా ధ్వంసం అయిపోయాయి. నీళ్లు రాకముందే వాళ్లూ అప్రమత్తమై ఎగువ ప్రాంతానికి వెళ్లిపోయారు.
‘‘శివరామయ్య మంచి పనిచేసినాడు.. ఇంటింటికి వచ్చి తలుపులు దబదబా కొట్టి నిద్రలేపి గుట్ట ఎక్కించినాడు.. లేకుంటేనా..’’ అన్నాడు రాజేంద్ర.
‘‘అవును.. తిక్కలోడే అయినా.. మనుషులకు సాయం చేసేదాంట్లో ముందుంటాడు. మనం ఇండ్లల్లో పొనుకోనున్నింటే.. ఈ పాటికి ఎన్ని పాణాలు గంగలో కలిసిపోయింటాయో..’’ మరొకతను అన్నాడు. ఆ మాటలంటున్నప్పుడు భయంతో అతని గొంతులో వణుకు స్పష్టంగా వినిపించింది.
అందరూ శివరామయ్యను పొగిడేవాళ్లే..
‘‘ఇంతకూ శివరామయ్య యాడా..’’ అడిగింది ఒకామె.
యాడా.. యాడా.. అంటూ ఒకర్నొకరు.. అందరినీ అడిగారు. అక్కడున్న ఊరి జనంలో శివరామయ్య లేడు.
‘‘శివరామయ్య లేడే.. ఈ తిక్కలోడు ఏమై పోయినాడో’’ ఒక పెద్దాయన బాధ వ్యక్తం చేశాడు.
‘‘ఊరందరినీ కాపాడి వాడు గంగకు బలైపోలా కదా’’ ఇంకో పెద్దాయన అనుమానం వ్యక్తం చేశాడు.
‘‘శివరామయ్య తిక్కమాలోకం…ఏటిలో గొడ్లకాడికి పోయినాడేమో’’ అందొకామె.
‘‘అయ్యో.. గొడ్లు.. శివరామయ్య..’’ ఒక యువకుడు అన్నాడు.
బాగా తెల్లవారిపోయింది. ఏటిలో నీళ్లు జోరుగా ప్రవహిస్తున్నాయి. ఏటి ఒడ్డున ఇసుక మీద మాత్రమే కాదు.. ఊరిలోనూ ఐదారడుగుల ఎత్తుతో నీళ్లు పారుతున్నాయి. అయితే పశువులన్నీ ఏమై పోయాయి..?
‘‘అయ్యో.. ఆ గొడ్లన్నీ మనయే అయినా.. ఇంతకాలం వాటిని కంటికి రెప్పలా కాపాడు కుంటాన్నింది శివరామయ్యే.. వాటితో పాటు నీళ్లలో కొట్టకపాయనేమో’’ అందొకామె.
అందరూ అయ్యో.. అయ్యో.. అంటున్నారు.
* * *
ఏటిలో నీళ్లు మరో రెండడుగులు తగ్గాయి. ఊర్లోకి పోదామని కొందరు.. వద్దని మరికొందరు అంటున్నారు. ఒక్క ఆవూ కనిపించకపోవడంతో అందరూ నిట్టూరుస్తున్నారు. మనం దాదాపు నూటేభై మంది ఉన్నే మూగజీవాలను కాపాడుకోలేక పోయామే అనుకుని బాధపడుతున్నారు.
దాసాలమ్మ గుట్ట ఎగువన.. పులికొండ దిగవ నుంచి ఈల వినిపించింది. ఊరి జనమంతా ఒక్క సారిగా అటువైపు చూశారు. అలా ఈల వేసేది శివరామయ్యే. సాయంత్రం పూట కొండ వద్దకు పోయి ఈల వేశాడంటే.. మేతకు పోయిన ఆవులన్నీ అతడుండే చోటుకు వచ్చేస్తాయి.
గుట్టపైన ఉండే జనాన్ని చూసి పులికొండ దగ్గర పెద్ద గుండుపై నుంచి శివరామయ్య చేయి ఊపుతున్నాడు. అతడుండే చోట చుట్టూ ఆలమంద.
ఊరి జనం సంతోషంగా కేకలు వేశారు. కిందకు రా అన్నట్టు చేతులు ఊపారు. శివరామయ్య ఐదు నిమిషాల్లో వాళ్ల వద్దకు చేరుకున్నాడు.
కొందరు ఆయనను గట్టిగా హత్తుకున్నారు. అందరూ కలిసి శివరామయ్యను చేతులపైకి ఎత్తుకుని నువ్వు మా దేవుడివి అన్నారు సంతోషంగా. అందరి కళ్లల్లో ఆనందబాష్పాలు.
‘‘నువ్వు నీళ్లల్లో కొట్టకపోయినావేమో అని భయపడినాము’’ అన్నారు.
వాళ్ల చేతుల్లోంచి కిందకు దిగిన శివరామయ్య.. ‘‘నీళ్లు.. కొండలు.. గుట్టలు.. పులులు మా వంశానికే మన్నా కొత్తా.. దేనికీ భయపడేది లేదు. అయితే.. అన్నింటి కాడా ఒళ్లు దెగ్గిర పెట్టుకోని ఉండాల’’ అన్నాడు.
‘‘నువ్వు ఈన్నే మాతోపాటు ఉన్నేవు కదా.. ఎప్పుడు పోయినావు ఆవుల తోలుకోని’’ అడిగాడొక యువకుడు.
‘‘మనమంటే మనుషులం. మాట్లాడతాం. ఒగరినొకరం హెచ్చరించుకుంటాం. ఫోన్లల్లో అయినా చెప్పుకుంటాం. అయ్యి.. మూగజీవాలు కదా.. ఎగదాల డ్యాం ఉండాది… తెగితే నీళ్లు ముంచే స్తాయని మనకు తెలుసు. మూగజీవాలకేం తెలస్తాది.. వాటికి ఎవరు చెప్తారు..? అందుకే ఊర్లో వాళ్లంతా గుట్టమిందికి వస్తానే నేను గుట్ట దిగి ఏట్లోకి పోయినా.. వాటిని కొండమిందికి తోలకపోదామంటే కదలవే.. ఏట్లో నీళ్లు పెరగతాంటే నాలుగడుగుల దూరం పోతాయే కానీ ఆట్నుంచి రామంటాయి.. ఏం చేసేది.. వాటిని అడుక్కున్నే ఇనలా.. దేవుడికంటే దెబ్బే గురువంటారు కదా.. కట్టి ఎత్తుకుని రెండు దెబ్బలేసినానంతే.. అన్నీ ఆట్నించి కదిలినాయి.. ఊరెనకాల దొంకలోంచి పులికొండ ఎక్కించేసినా.. వాటిని అట్ల కొండ ఎక్కించినా.. ఇట్ల నీళ్లు వచ్చేసినాయి ఏట్లో’’ అన్నాడు శివరామయ్య.
‘‘నువ్వు శివరామయ్య కాదు.. గోపాలకృష్ణుడివి. కలకాలం చల్లగా ఉండు నాయనా’’ ఒక పెద్దాయన ఆశీర్వదించాడు. ‘‘అయ్యో.. ఎవరో నీళ్లల్లో కొట్టుకోనొ స్తాండారు..’’ అరిచాడొక పిల్లవాడు. అందరూ ఏటివైపు చూశారు.
ఒక వ్యక్తి నీళ్లల్లో కొట్టుకొస్తున్నాడు. అతడికి ప్రాణం ఉందో లేదో తెలీడం లేదు. శివరామయ్య క్షణం కూడా ఆలస్యం చేయకుండా గబగబా దాసాలమ్మ గుడి వద్దకు వెళ్లి.. అక్కడున్న పొడవాటి తాడు తీసుకుని నీళ్లల్లో మనిషి కొట్టుకొస్తున్న వైపు అడుగులు వేశాడు.