ప్రపంచ వ్యాప్తంగా ఈ బుక్స్, ఆడియో పుస్తకాలు, పాడ్‌కాస్ట్‌లు విరివిగా వాడకంలోకి వచ్చిన తరువాత కూడా భారతదేశంలో సంప్రదాయ పుస్తకాలకు ఆదరణ తగ్గలేదు. అందుకు దేశంలో ఏటా జరిగే పుస్తకోత్సవాలు నిదర్శనం. దేశమంతటా కాకున్నా కొన్ని రాష్ట్రాలలో పుస్తకోత్సవాలు విజయవంతంగా జరుగుతున్నాయి. వాటి గురించి క్లుప్తంగా.

హైదరాబాద్‌ ‌బుక్‌ ‌ఫెయిర్‌ను ఏటా డిసెంబర్‌లో నిర్వహిస్తున్నారు. 1985లో సిటీ సెంట్రల్‌ ‌లైబ్రరీలో తొలి బుక్‌ఫెయిర్‌ ‌నిర్వహించారు. మొదటి కొన్నేళ్లు దీనికి అంత ఆదరణ రాలేదు. కానీ గడచిన నాలుగు సంవత్సరాలుగా ఎన్‌టీఆర్‌ ‌గ్రౌండ్స్‌లో వైభవంగానే జరుగుతున్నది. ఇప్పుడు దేశంలో జరుగుతున్న ముఖ్య పుస్తకోత్సవాలలో ఒకటిగా ఖ్యాతి గాంచింది.

విజయవాడ పుస్తక మహోత్సవం ఏటా జనవరి నెలలో పది రోజుల పాటు జరుగుతుంది. ఇది కూడా దేశంలో జరిగే ముఖ్య పుస్తకోత్సవంగా చెబుతారు. 1909లో నేషనల్‌ ‌బుక్‌ ‌ట్రస్ట్ ‌సౌజన్యంతో ప్రాంభమైన ఈ పుస్తకాల పండుగ ఇప్పటిదాకా నిర్విఘ్నంగా సాగుతోంది. విజయవాడ పుస్తక ప్రదర్శనకు ప్రవేశ రుసుము లేకపోవడం విశేషం. తెలుగు ప్రచురణ రంగంలో ప్రసిద్ధమైన విశాలాంధ్ర, నవోదయ, వంటి ఎన్నో ప్రచురణ సంస్థలు విజయవాడ పుస్తక ప్రదర్శన విజయవంతం కావడానికి దోహదం చేశాయి. కుష్వంత్‌సింగ్‌, ఆర్‌.‌కె. లక్ష్మణ్‌, ‌బాలాంత్రపు రజనీకాంతరావు, బాపు-రమణ, ఎస్‌.‌పి. బాలసుబ్రహ్మణ్యం, సి.నారాయణరెడ్డి, సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి ప్రముఖులు ఈ ప్రదర్శనకు విచ్చేసి, ప్రశంసించాడు. ప్రసిద్ధ రచయితల శతజయంతులను పురస్కరించుకొని వారి సంస్మరణ సభలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తూంది. ప్రదర్శనలో భాగంగా కథ, కవిత, నవల, నాటకం వంటి వివిధ సాహితీ పక్రియలపై సదస్సులు, పుస్తకావిష్కరణలు, విద్యార్థులకు సాహిత్య సంబంధమైన అంశాలపై పోటీలు, అనువాద సమస్యలపై చర్చా గోష్ఠులు కూడా నిర్వహిస్తారు. కలకత్తా పుస్తకప్రదర్శన స్ఫూర్తిగా ఒక రోజున పుస్తక ప్రియుల పాదయాత్ర జరుగుతుంది. పురవీధుల గుండా జరిగే ఈ పాదయాత్రలో సమాజంలోని వివిధ వర్గాల నుంచి వంద మంది పుస్తకాభిమానులు పాలొన్నారు. విజయవాడ పుస్తక ప్రదర్శన నిర్వాహకులు నగరం నడి బొడ్డున పెద్ద గ్రంథాలయాన్ని నిర్మించి, విజయవంతంగా నడపడం చెప్పకోదగిన విశేషం.

చెన్నై బుక్‌ ‌ఫెయిర్‌ ఏటా ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. బుక్‌ ‌సెల్లర్స్ అం‌డ్‌ ‌పబ్లిషర్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ‌సౌత్‌ ఇం‌డియా దీనిని నిర్వహిస్తుంది. భారతదేశంలో జరిగే పుస్తకోత్సవాలలో చెన్నై బుక్‌ ‌ఫెయిర్‌ ‌రెండో అతి పెద్దది పుస్తకోత్సవం. దాదాపు అన్ని ముఖ్య తమిళ, ఆంగ్ల ప్రచురణ సంస్థలు ఇందులో పాల్గొంటాయి. 1977లో కేవలం 22 స్టాళ్లతో ఇది మొదలయింది. బీఐ ప్రచురణల సంస్థ అధిపతి కేవీ మాథ్యూ చొరవతో మద్రాస్‌ ఇ ఆజమ్‌ ‌పాఠశాల మైదానంలో ఆరంభించారు (మాథ్యూ కేవలం విద్యార్థుల కోసం పుస్తకోత్సవం నిర్వహించారు. కానీ ఐదేళ్ల తరువాత ఆగిపోయింది). 2021లో 578 స్టాల్స్ ఏర్పాటు చేశారు. 14 రోజులలో 11 లక్షల మంది సందర్శకులు వచ్చారు. మరొక రెండేళ్లలో అర్థ శతాబ్ది ఉత్సవాలకు ఇది సిద్ధమవుతున్నది. అంతకు రెండు సంవత్సరాల ముందు అంటే 2019లో కొవిడ్‌ ‌ప్రభావం ఉన్నప్పటికీ 15 లక్షల మంది దర్శించారు. 2.5 మిలియన్‌ అమెరికన్‌ ‌డాలర్ల మేరకు పుస్తకాల కొనుగోళ్లు జరిగాయి. బుక్‌ ‌సెల్లర్స్ అం‌డ్‌ ‌పబ్లిషర్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ‌సౌత్‌ ఇం‌డియా ఆధ్వర్యంలోనే ఉదగమండలం, తిరువనంతపురం, పుదుచ్చేరి, తిరుచునాపల్లిలో కూడా పుస్తకోత్సవాలు మొదలయ్యాయి.

ఈరోడ్‌ ‌పుస్తకోత్సవం తమిళనాడులోనే ప్రముఖమైనది. మక్కల్‌ ‌సింధనై పెరావై అనే సామాజిక సంస్థ దీనిని నిర్వహిస్తూ ఉంటుంది. దీనిని జూలై ఆఖరి వారం లేదా ఆగస్ట్‌లో ఏర్పాటు చేస్తారు. 230 స్టాల్స్ ‌వరకు ఉంటాయి. సగటున రూ. 6 కోట్ల విలువైన వ్యాపారం జరుగుతుంది. ఇందులోనే సాంస్కృతికోత్సవాలు జరుగుతూ ఉంటాయి. వీటిలో స్వర్గీయ ఏపీజే అబ్దుల్‌ ‌కలాం రెండుసార్లు ప్రసంగించారు. విజ్ఞానశాస్త్రంలో విశేష కృషి చేసిన ఒకరికి గోపాలస్వామి దొరైస్వామి నాయుడు పేరిట లక్ష రూపాయల నగదు పురస్కారం కూడా అందిస్తారు.

తమిళనాడులోనే కోయంబత్తూర్‌ ‌బుక్‌ ‌ఫెస్టివల్‌ను ఏటా జూలైలో నిర్వహిస్తారు.

ప్రతి ఏటా చండీగఢ్‌ ‌బుక్‌ ‌ఫెయిర్‌ను ఫిబ్రవరిలో నేషనల్‌ ‌బుక్‌ ‌ట్రస్ట్ ఏర్పాటు చేస్తుంది.

ఫిబ్రవరిలోనే కొచ్చిన్‌లో కృతి అంతర్జాతీయ పుస్తకోత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవంలో కొత్త పాత రచయితలంతా పాల్గొంటూ ఉంటారు.

ఏటా జనవరి మాసంలో ఢిల్లీ వేదికగా నేషనల్‌ ‌బుక్‌ ‌ట్రస్ట్ అం‌తర్జాతీయ పుస్తకోత్సవం నిర్వహిస్తుంది. ప్రగతి మైదాన్‌లో జరిగే ఈ పుస్తకోత్సవంలో దేశంలోనే అతి పెద్దది. ఇండియా ట్రేడ్‌ ‌ప్రమోషన్‌ ఆర్గనైజేషన్‌ ‌చేయూతతో ఈ భారీ ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 1972లో నాటి రాష్ట్రపతి వీవీ గిరి దీనిని ప్రారంభించారు. మొదట రెండేళ్లకు ఒకసారి నిర్వహించేవారు. ఇప్పుడు ఏటా జరుపుతున్నారు. ఇందులో రచయితలు, పుస్తక విక్రేతలు, ప్రచురణ సంస్థల వారు, సాధారణ పాఠకులు అంతా పాల్గొంటారు.

కోల్‌కతా బుక్‌ ‌ఫెయిర్‌ ‌కూడా ఫిబ్రవరిలోనే మొదలవుతుంది. ఇది కూడా అంతర్జాతీయ పుస్తకోత్సవమే. దీనికి ఎంతో ఖ్యాతి, ప్రత్యేకత ఉన్నాయి. ఇది హోల్‌సేల్‌ ‌కొనుగోలుదారుల కంటే సాధారణ ప్రజలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. ఈ ఉత్సవాన్ని కోల్‌కతా జీవనంలో ఒక భాగంగా భావిస్తారు. కొన్ని వారాల పాటు జరిగే ఈ ఉత్సవానికి కొందరు పాఠకులు నిత్యం హాజరై తమ మద్దతును తెలియచేస్తూ ఉంటారు. దాదాపు 20 లక్షల మంది పుస్తక ప్రియులు దీనికి వస్తారు. దీనిని ప్రపంచంలోనే పెద్దవైన పుస్తకోత్సవాలలో ఒకటిగా కూడా గౌరవిస్తారు.

బెంగళూరు బుక్‌ ‌సెల్లర్స్ అం‌డ్‌ ‌పబ్లిషర్స్ అసోసియేషన్‌ ‌ది బెంగళూరు బుక్‌ ‌ఫెయిర్‌ను నిర్వహిస్తుంది. ఆ నగరంలోని పేలస్‌ ‌మైదానంలో అక్టోబర్‌లో, అంటే దసరా సందర్భంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవం 1988లో ప్రారంభించారు. మెసర్స్ ‌గంగారామ్‌ ‌బుక్‌ ‌బ్యూరో, హిగ్గిన్‌బోథమ్స్, ‌యూబీఎస్‌ ‌పబ్లిషర్స్ ‌మెసర్స్ ‌సతీశ్‌ ఏజెన్సీస్‌ ‌సంస్థలు ఈ ఉత్సవానికి శ్రీకారం చుట్టాయి. ప్రస్తుతం ఈ పుస్తకోత్సవంలో 110 ప్రచురణ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. గడచిన ఆరు సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా జరుగుతున్నది.

త్రిపుర రాజధాని అగర్తలాలో ఏటా జనవరి, ఫిబ్రవరి లేదా మార్చి మాసాలలో పుస్తకోత్సవం జరుగుతుంది. మార్చి 30, 1981న ఈ ఉత్సవ నిర్వహణ మొదలయింది. ముంబై, కోల్‌కతా, బాంగ్లాదేశ్‌, ‌గౌహతి, ఢిల్లీల ప్రచురణ సంస్థలు ఇందులో పుస్తకాలను విక్రయిస్తాయి.

బిహార్‌ ‌రాజధాని పట్నాలో ఏటా సెంటర్‌ ‌ఫర్‌ ‌రీడర్‌షిప్‌ ‌డెవలప్‌మెంట్‌ అనే ప్రభుత్వేతర సంస్థ పుస్తక మేళా ఏర్పాటు చేస్తున్నది. సాధారణంగా నవంబర్‌ ‌మధ్యలో జరుగుతుంది. 1985లో ఈ ఉత్సవానికి శ్రీకారం చుట్టారు.

వేగంతో తల్లడిల్లుతున్న ఆధునిక ప్రపంచంలో పుస్తకోత్సవాలు మనిషికి చక్కని సాంత్వన చేకూరుస్తున్నాయి. పుస్తకాల స్టాళ్లతో పాటు ఉత్సవాలలో ఇతర కళా ప్రదర్శనలు, పిల్లలకు ఉద్దేశించిన కార్యక్రమాలు, చర్చలు కూడా ఆసక్తిని పెంచుతున్నాయి. అటు డిజిటల్‌ ‌పరిజ్ఞానంతో పరిచయం పెంచుకుంటూనే ఇటు సంప్రదాయక పుస్తక ప్రచురణను కూడా విశేషంగానే ఆదరిస్తున్నారు. ప్రచురణకర్తలు కూడా రీసైకిల్డ్ ‌పేపర్‌ను ఉపయోగించడం, తక్కువ విద్యుత్‌ ‌వినియోగంతో అచ్చుకు వీలయ్యే పరిజ్ఞానాన్ని తెచ్చుకోవడం, ప్లాస్టిక్‌ ‌రహిత పేకేజింగ్‌ను కూడా అలవాటుపడుతున్నారు. పుస్తకోత్సవాలతో జరుగుతున్న మరొక మేలు – చిన్నా పెద్దా ప్రచురణకర్తలకు ఇవి లబ్ధి చేకూరుస్తున్నాయి. ప్రచురణ కార్యకలాపాలను ఆటంకం లేకుండా చేస్తున్నాయి. ఆ విధంగా అచ్చు, కాగితం పరిశ్రమలకు తోడ్పాటునందిస్తున్నాయి. కళాకారులకు, ఈవెంట్‌ ‌మేనేజర్స్‌కు, ఆహార సదుపాయం కల్పించే సంస్థలకు కూడా ఈ ఉత్సవాలు మేలు చేస్తున్నాయి. 2025 సంవత్సరం

రూ. 80,000 కోట్ల వ్యాపారం జరిగింది.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE