‘‌వందేమాతరం…’ అదొక గేయంలోని తొలి పదబంధం మాత్రమే కాదు. ఒక సమర నినాదం. ఆత్మవిస్మృతి నుంచి విముక్తమవుతున్న జాతి ఆత్మకు గొంతు. మాతృభూమీ! నీకు వందనం- అంతే దాని అర్ధం. కానీ దానికి మతం రంగు అద్దారు. భారతజాతిలో జాతీయ భావాల ఆవిష్కారాన్ని భరించలేని శక్తుల వక్ర భాష్యమది. అయినా, ఖండిత భాగాలే చదువుతున్నా.. ఈనాడు వందేమాతరం దేశం పాడుకుంటున్న జాతీయగీతం. ‘మూడు ఉద్యమాలు సృష్టించిన ఒక వాతావరణంలో నేను పుట్టి, పెరిగాను. ఆ మూడు ఉద్యమాలు కూడా చైతన్యాన్ని తట్టి లేపినవే. అందులో రెండవది బంకించంద్ర చటర్జీ. బెంగాలీ సాహిత్యంలో వచ్చిన చైతన్యానికి ఆయనే ఆద్యుడు’ అన్నారు రవీంద్రనాథ్‌ ‌టాగూర్‌ (‌ది రెలిజియన్‌ ఆఫ్‌ ‌ది ఆర్టిస్ట్, 1924). 1937‌లో నెహ్రూ తదితర కాంగ్రెస్‌ ‌నేతలు ఆ  మహా గేయాన్ని ఖండించినా గడచిన 150 ఏళ్లు ఆ గేయం భారత జాతికి ఐక్యతా సూత్రంగానే పనిచేస్తోంది.

విదేశీ పాలన నుంచి దేశాన్ని విముక్తం చేయడానికి జరిగిన మహోద్యమాన్ని  ఐక్యం చేసిన గీతమే, ‘వందేమాతరం సుజలాం సుఫలాం…’ బంకించంద్ర చటర్జీ అనే జాతీయవాద ప్రవక్త సరిగ్గా 150 ఏళ్ల క్రితం నవంబర్‌ 7, 1875‌న అక్షరబద్ధం చేశారు. అక్షయ నవమి శుభ ఘడియలలో ఆయన కలం నుంచి వందేమాతర గీతం ప్రభవించిందని చెబుతారు. స్వరాజ్య సమరానికి ఉత్తేజాన్ని ఇచ్చిన గీతం. అలాగే స్వతంత్ర భారతదేశ జాతీయగీతం కూడా.

ఆనందమఠంలోని గేయం

ఈ గీతం బంకించంద్ర ప్రఖ్యాత నవల ‘ఆనంద మఠం’లో కనిపించే గీతం. మొదట ‘బంగదర్శన్‌’ ‌సాహిత్య పత్రికలో ధారావాహికంగా వెలువడిన ఆనందమఠం నవల 1882లో పుస్తక రూపంలో వెలువడింది. నిజానికి ఆ గేయాన్ని బంకింబాబు (1838-1894) నవల కోసం రాయలేదు. 1870లో రాసిన గేయాన్ని తరువాత నవలలో చేర్చారు. ఆనందమఠం నవల ఇతివృత్తం 18వ శతాబ్దంలో వంగదేశమే కేంద్రంగా సాగిన సన్యాసి తిరుగుబాటు. ఎందుకీ తిరుగుబాటు? బక్సర్‌ ‌యుద్ధం తరువాత (1765) బెంగాల్‌లో పన్ను వసూలు అధికారం ఈస్టిండియా కంపెనీకి వచ్చింది. ఈ అధికారాన్ని రాబర్ట్ ‌క్లయివ్‌ ‌రెజాఖాన్‌ అనేవాడికి అప్పగించాడు. అంటే బెంగాల్‌కు వాస్తవ పాలకుడు ఇతడే. తొలి గవర్నర్‌ ‌జనరల్‌ ‌వారన్‌హేస్టింగ్స్ ‌రెజాఖాన్‌ను తప్పించి, కలెక్టర్లను నియమించి పన్ను వసూలు చేయించాడు.పైగా పది శాతం పెంచాడు. ఈస్టిండియా కంపెనీ వచ్చిన తరువాత బెంగాల్‌ ‌దారుణ దుర్భిక్షాన్ని ఎదుర్కొన్నది (1763-1800) కూడా అప్పుడే.దీనికి ఎదురైన ప్రతిఘటనలలో ఒకటి సన్యాసీ తిరుగుబాటు. దశనామి నాగాలు అనే సన్యాసులు ఇందులో కీలకం. ఇదే ఇతివృత్తంగా సాగే నవల ఆనందమఠం. ఏడు ఎనిమిది వందల ఏళ్లగా ఉన్న ఆత్మవిస్మృతిని ఖండఖండాలుగా చీల్చే పదబంధాలు ఆ గేయంలో ఉన్నాయి. మట్టికీ, మనసుకీ మధ్య ఒక వారధిని నిర్మించే తాత్త్వికత ఆ గేయంలో సుస్పష్టం. అందుకే జాతీయతను మేల్కొలిపింది. దేశమాతను స్మరించుకోవడం కొత్త శక్తిని ఆవాహన చేసుకోవడమేనన్న స్పృహను ఆ గేయమే కలిగించింది. భారతీయుల కళ్లు తెరిపించి ఆత్మ గౌరవమనే అరుణోదయాన్ని దర్శింపచేసింది. భారతదేశ బానిసత్వం వెనుక ఉన్నది స్వయంకృతా పరాధం. అనైక్యత, ఆత్మ గౌరవ విస్మరణ, ఆత్మ విస్మృతులన• జాతీయ ఆత్మ ద్వారా, భారతీయత ద్వారా పున:ప్రతిష్ఠించే గొప్ప ప్రయత్నం ఆ గేయంలో కనిపిస్తుంది.

బంకించంద్ర

కవి జీవించిన కాం, ఆ కాలం పట్ల ఆ కవి లేదా రచయితకు ఉన్న స్పృహ ఆయన రచనలను ప్రభావితం  చేస్తాయి. వందేమాతరం గీతానికీ, ఆ గీతం నిక్షిప్తమైన ఆనందమఠం నవలకు ఇదే వర్తిస్తుంది. బంకించంద్ర చటర్జీ జూన్‌ 27,1838‌న జన్మించారు. బెంగాల్‌లోని 24 పరగణాలలోని కాంటాలపడ ఆయన స్వస్థలం. 1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం సమయానికి ఆయన నవయువకుడు. తరువాత ఆయన ఆధునిక బెంగాలీ సాహిత్యంలో మకుటం లేని మహారాజు అయ్యారు. హృదయాలను కదలించే, కదలిన హృదయాలు ఏకాత్మతో సాగే విధంగా ఆయన రచించిన గేయమే వందేమాతరం. ఆయన భారత్‌ ‌స్వతంత్ర దేశం కావడానికి ఏమి కావాలో ఒక దృష్టి కలిగినవారు. అది కూడా సానుకూల దృక్పథాన్ని నిర్మించు కున్నారాయన. దేశాన్ని ఆయన దశప్రహరణ ధారిణి దుర్గ రూపంలో దర్శించారు. ఆనందమఠం నవల కంటే చాలాముందే ఈ పాట పుట్టిందని ముందే అనుకున్నాం. ఒకసారి బంకించంద్రుడు రైలులో తన స్వస్థలానికి వెళుతున్నారు. దారంతా పచ్చదనంతో, సరస్సులతో అద్భుతంగా ఉంది. ఆ సమయంలో ఈ గీతం ఆయన గుండెలో జనించింది. పాట పుట్టిన ఏడేళ్లకు గాని అది ప్రపంచం ముందుకు రాలేదు. ఆ పాట సంగతి బంకింబాబు మొదట బారిసాల్‌లో ప్రస్తావించారు. అప్పుడు అది బ్రిటిష్‌ ‌వ్యతిరేక ఉద్యమాలకు ఆలవాలంగా ఉండేది. ఇంకొక చిన్న ఉదంతం కూడా బంకింబాబులో ఆత్మ గౌరవాన్ని మేల్కొల్పిందంటారు. డిప్యూటీ కలెక్టర్‌గా ఏదో పని మీద బెర్హంపూర్‌ ‌వెళ్లి తిరిగి వస్తుంటే, ఆయన ఎక్కిన పల్లకి వల్ల కలెక్టర్‌ ‌పాల్గొన్న క్రికెట్‌ ఆటకు ఆటంక మైంది. దీనితో కలెక్టర్‌ ‌కర్నల్‌ ‌డఫిన్‌ ‌బంకింబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదేశించాడట. 1880 తరువాత దేశంలో కొత్త చైతన్యం అంకురిస్తున్నది. అప్పటికి సరిగ్గా పాతిక సంవత్సరాల క్రితం జరిగిన ప్రథమ స్వాతంత్య్ర పోరాట నినాదాలు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. రాజకీయంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా కొత్త చింతన ఆరంభమైంది. వలస పాలన మీద వైముఖ్యం రూపుకడుతున్నది.

చిత్రం ఏమిటంటే ఈ గేయం రాసినప్పుడే ఆయన కుమార్తె, మిత్రులు ఇంత కఠిన పదాలతో అది కూడా బెంగాలీ, సంస్కృతం కలిపి ఇంత కఠినంగా రాస్తే ఎవరికి అర్ధమవుతుంది అని ప్రశ్నించారట. ఇది ఆశువుగా రాసిన పాట. కానీ దీనిని జనం ఎంతగా ఆదరిస్తారో చూసే అవకాశం నాకు ఉండకపోవచ్చు. కానీ ఈ పాటను ప్రతి భారతీయుడు కూడా వేదమంత్రంలా పఠిస్తాడు అని ఆనాడే చెప్పారట.వందేమాతర గేయం బెంగాలీ, సంస్కృతాల సంగమం. నాటి ప్రముఖ సంగీత విద్వాంసుడు పంచేతగఢ్‌ ‌జదునాథ్‌ ‌భట్టాచార్య ఈ పాటకు మొదట బంకించంద్ర కోరిక మేరకు బాణీ కట్టారు. తరువాత ఎందరో వేర్వేరు బాణీలు కట్టారు.

తొలి ఆలాపన

ఈ గేయాన్ని 1896 నాటి కలకత్తా కాంగ్రెస్‌ ‌సభలలో మొదటిసారి గానం చేసిన వారు విశ్వకవి రవీంద్రనాథ్‌ ‌టాగూర్‌. 1905 ‌నాటి బెంగాల్‌ ‌విభజన వ్యతిరేకోద్యమానికి ఆ గేయమే మార్చింగ్‌ ‌సాంగ్‌ అయింది. బెంగాల్‌ ‌విభజన వ్యతిరేకోద్యమం ఆరంభమైన తరువాత ప్రతి ఆదివారం ఉత్తర కలకత్తాలోని వందేమాతరం సంప్రదాయాలయంలో ప్రభాత భేరీ పేరుతో సామూహికంగా పాడేవారు. కొన్నిసార్లు రవీంద్రకవీంద్రుడు కూడా పాల్గొన్నాడు. 1905  నవంబర్‌ ‌లోనే బెంగాల్‌లోని రంగపూర్‌లో ఈ గీతం పాడిన 200 మంది విద్యార్థులకు  ఒక్కొక్కరి మీద రూ. 5 జరిమానా విధించారు.   మొదట దీనిని అరవిందుడు బెంగాల్‌ ‌జాతీయ గీతమని కీర్తించారు. జాతిని కదిలిస్తున్న ఈ గీతాన్ని ఆనాడు బ్రిటిష్‌ ఇం‌డియా ప్రభుత్వం నిషేధించింది. అదే తరువాత భారతదేశానికి జాతీయ గీతమై అలరారుతోంది. 1906లో బిపిన్‌చంద్రపాల్‌ ‌సంపాదకునిగా వందేమాతరం పత్రిక ఆవిర్భ వించింది. తరువాత ఇందులోనే అరవింద్‌ ‌ఘోష్‌ ‌చేరారు. 1907లోనే ఆ గీతం చరిత్రలో మరొక మలుపు కనిపిస్తుంది. జర్మనీలోని స్టట్టర్‌గార్ట్ అనే చోట ఆ ఆగస్ట్ 22‌న జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్  ‌సమావేశంలో మేడమ్‌ ‌కామా భారత జాతీయ పతాకం పేరుతో ఒక జెండా ఎగరవేశారు. దాని మీద దేవనాగరి లిపిలో వందేమాతరం అని రాశారు. ఒక్కసారిగా ఆ పదబంధం ప్రపంచ ప్రజల దృష్టికి వెళ్లింది.

 1907లో రవీంద్రుడి చేత హేమేంద్ర మోహన్‌ ‌బోస్‌ ఈ ‌పాట పాడించి రికార్డు చేశారు. బోస్‌  ‌గ్రామఫోన్‌ ‌తయారు చేసిన తొలి భారతీయుడు. ఆ సంవత్సరమే మరొకరు కూడా ఆ పాట పాడారు. 1906లో కూడా ఆ పాట రికార్డు రూపంలో వచ్చింది. నారాయణచంద్ర ముఖర్జీ పాడారు. సత్యభూషణ్‌ ‌గుప్తా అనే ఆయన కూడా పాడారు. ఆనాడు కలకత్తాలో జరిగిన ప్రతి రాజకీయ, సాంస్కృతిక సభలకు ముందు, నాటకాలకి ప్రార్థనా గీతంగాను వందేమాతరమే పాడేవారు.భారత జాతీయ కాంగ్రెస్‌ ‌బెంగాల్‌ ‌శాఖ ప్రాంతీయ సమావేశం ఇదే బారిసాల్‌లో ఏప్రిల్‌ 14, 1906‌లో జరిగింది. విభజనకు వ్యతిరేకంగా పోరాడతామని అక్కడ ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. విభజనకు విత్తనాలు వేసిన కర్జన్‌ ‌దిష్టిబొమ్మను దహనం చేయడమే కాకుండా, వందేమాతరం అంటూ ప్రజలు నినదిం చారు. దానితో వందేమాతరం అంటూ పలకరించు కోవడం, ఆ గేయం పాడడం కూడా జిల్లా కలెక్టర్‌ ‌నిషేధించాడు. బారిసాల్‌ ‌సమావేశం జరుగుతున్న స్థలం వరకు సురేంద్రనాథ్‌ ‌బెనర్జీ, బిపిన్‌చంద్రపాల్‌, అరవింద ఘోష్‌ ‌వంటివారు ఊరేగింపుగా వెళ్లారు. నిరాయుధులు జరుపుతున్న ఆ ఊరేగింపు మీద పడి పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ వార్త బెంగాల్‌ను వేడెక్కించింది. అప్పుడే ముస్లిం మతోన్మాదం కూడా వేళ్లూనుకున్నది కాబట్టి ఇది హిందూధర్మాన్ని కీర్తించే పాట అంటూ విమర్శలు రాకపోలేదు. అయినా భారత జాతీయ కాంగ్రెస్‌ 1937 ‌నుంచి ఈ గీతంలోని మొదటి రెండు చరణాలను జాతీయ గీతంగా స్వీకరించింది. వందేమాతరం గేయం ప్రాచుర్యం పొందక ముందు గాడ్‌ ‌సేవ్‌ ‌ది కింగ్‌/‌క్వీన్‌ అనే పాట పాడేది భారత జాతి.

ఆగస్ట్ 15, 1947 ఉదయం ఆకాశవాణి ఈ గేయాన్ని ప్రసారం చేసింది.  పండిట్‌ ఓం‌కార్‌నాథ్‌ ‌ఠాకూర్‌ ‌పాడారు. జనవరి 24,1950న రాజ్యాంగం అమలులోకి రావడానికి రెండు రోజుల ముందు జనగణ మన అధినాయక గీతంతో పాటు వందే మాతరం కూడా రాజ్యాంగ పరిషత్‌ ఆలపించింది. జనవరి 24, 1950న భారత ప్రథమ రాష్ట్రపతి డాక్టర్‌ ‌బాబూరాజేంద్ర ప్రసాద్‌ ‌వందేమాతరం గీతం గురించి చెప్పిన మాటలు అద్వితీయమైనవి. వందేమాతర గేయం జాతీయోద్యమానికి ఎంతో స్ఫూర్తిని ఇచ్చిందని, జనగణమనతో సమానంగా ఆ గేయానికీ గౌరవం ఉండాలని ఆయన రాజ్యాంగ పరిషత్‌లో స్పష్టం చేశారు. ఉత్తర భారతదేశంలో పండిత్‌ ‌విష్ణుదిగంబర్‌ ‌పాలూస్కర్‌ (1872-1931) ఈ ‌పాటను గానం చేసి ఉర్రూతలూగించేవారు. తెలుగు ప్రాంతంలో కౌతా రామశాస్త్రి పాడేవారు.

అరవిందులు వందేమాతర గేయానికి ఇచ్చిన కొత్త భాష్యం అపూర్వమైనది. ఆ గేయం ఇప్పుడు ఆనందమఠం నవల నుంచి బయటపడి స్త్రీపురుష భేదం లేకుండా, శిశువులకు సహా పెదాల మీద నడయాడుతున్నది’ అని సోదరి నివేదిత వ్యాఖ్యా నించారు. వందేమాతరం గీతం నుంచి ఎలాంటి ప్రేరణ పొందాలో గొప్పగా వ్యాఖ్యానించినవారు బ్రహ్మబాంధవ ఉపాధ్యాయ. ఆయన జీవితమంతా సన్యాసాశ్రమంలో ఉన్నారు. ఆనందమఠం నవలలో చిత్రించినట్టుగానే ప్రతి ఇంటి నుంచి ఒకరు వచ్చి దేశం కోసం త్యాగం చేయాలి. అలాగే ప్రతి తండ్రి తన సంతానంలో ఒకరిని మాతృభూమి సేవ కోసం అర్పించాలి అని చెప్పారు.

వందేమాతరం గేయం తీవ్ర జాతీయోద్యమ కారులను, సంస్థలను మరింతగా ప్రభావితం చేసింది. బెంగాల్‌ ‌కేంద్రంగా 1902లో సతీశ్‌చంద్ర బోస్‌ అనుశీలన్‌ ‌సమితి అనే విప్లవ సంస్థను నెలకొల్పారు. ఈ సంస్థల సభ్యులకు ఒక నియమం ఆనందమఠం నవల కరతలామలకంగా ఉండడం. తరువాత ఇదే సంస్థ ప్రేరణతో మహారాష్ట్ర, పంజాబ్‌, ‌మద్రాస్‌ ‌ప్రావిన్స్‌లలోను విప్లవ సంస్థలు జన్మిం చాయి. పులీన్‌బిహారీ దాస్‌, ‌పి. మిత్రా, బాబూరావ్‌ ‌సావర్కర్‌, ‌వినాయక్‌ ‌దామోదర్‌ ‌సావర్కర్‌, ‌మదన్‌లాల్‌ ‌థింగ్రా, డాక్టర్‌ ‌హెడ్గెవార్‌, ‌జతీంద్రనాథ్‌ ‌ముఖర్జీ, ఎంఎన్‌ ‌రాయ్‌, ‌రాస్‌ ‌బిహారీ బోస్‌, ‌భగత్‌సింగ్‌, ‌చంద్రశేఖర ఆజాద్‌, ‌వీవీఎస్‌ అయ్యర్‌ ‌విప్లవోద్యమాలలో మమేకమైనపవారే. మేడమ్‌ ‌కామా రూపొందించిన జాతీయ పతాకం మీద వందే మాతరం అని దేవనాగరి లిపిలో రాయించారు.  1905లో కవయత్రి సరళాదేవి చౌదురాణి బెనారస్‌ ‌కాంగ్రెస్‌ ‌సమావేశాలలో పాడారు. లాలా లాజ్‌పతి రాయ్‌ ‌లాహోర్‌ ‌నుంచి ప్రారంభించిన పత్రిక పేరు వందేమాతరం.

 అయితే 1915 నుంచి కాంగ్రెస్‌ ‌సమావే శాలలో వందేమాతరం గానాన్ని విష్ణు దిగంబర్‌ ‌పాలూస్కర్‌ ఒక సంప్రదాయంగా ప్రవేశపెట్టారు. 1923లో కాకినాడ కాంగ్రెస్‌ ‌సమావేశాలకు పాలూస్కర్‌ ‌హాజరయ్యారు. అయితే ఆ సభలకు అధ్యక్షత వహించిన మౌలానా మహమ్మద్‌ అలీ ఆ పాట పాడేందుకు వ్యతిరేకించాడు. అయితే పాలూస్కర్‌ అధ్యక్షుడి మాట పక్కన పెట్టి గానం చేశారు. సహాయ నిరాకరణోద్యమంలో ముస్లింలను తృప్తి పరచడానికి డాక్టర్‌ ‌మహమ్మద్‌ ఇక్బాల్‌ ‌పాట సారే జహాసె అచ్చా పాడించడం మొదలుపెట్టారు. అయితే అప్పటికి ముస్లింలు తృప్తి పడలేదు. వందేమాతరం పూర్తిగా ఆపేసి, ఇక్బాల్‌ ‌పాటనే ఉంచాలని కోరారు. ఆ రకంగా 1937 కేవలం మొదటి రెండు చరణాలు పాడడం మొదలయింది. 1938లో మహ్మద్‌ అలీ జిన్నా కూడా వందేమాతరం గేయం తొలగించాలని నెహ్రూకు ప్రతిపాదించాడు. మళ్లీ ఇంకొక అడుగు వెనక్కి వేసి కాంగ్రెస్‌ ‌బషీర్‌ అహమ్మద్‌ ‌గీతాన్ని పాడించడం మొదలుపెట్టారు. ఇంకా ఇంగ్లిష్‌లో ఖురాన్‌ ‌ప్రార్థన కూడా మొదలు పెట్టారు. ఆఖరికి దేశం విడిపోయినా వందేమాతరం గురించి ముస్లిం లీగ్‌లకు ఉన్న అభ్యంతరాలను గౌరవించడం కాంగ్రెస్‌ ‌మానలేదు.

నెహ్రూకూ, ఆయన భక్తులకూ చాలా విషయాలు ఇష్టం లేదు. కానీ అవన్నీ జాతికి జవజీవాలను కూర్చేవి. చైతన్యం కలిగించేవి.వారసత్వ ప్రతీకలు. 150 ఏళ్లలో దేశానికి వందేమాతరం చేసిన సేవ ఏమిటి? ఈ దేశం ఒక్కటిగా కదలడానికి అంత స్సూత్రంగా పాత్ర నిర్వహించింది. నవంబర్‌ 7‌న జరిగిన సభలో  ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టు వందేమాతరం అంటే భారతజాతికి  ఒక మంత్రశక్తి. ఒక కల, ఒక సంకల్పం.


పాలూస్కర్‌ ‌కృషి

పాలూస్కర్‌ ‌హిందుస్తానీ సంగీతం ప్రపంచంలో ఒక విప్లవం. జాతీయోద్యమంతో ఆ సంగీత ప్రపంచాన్ని అనుసంధానం చేయడమే కాదు, కచేరీలలో, సాధనలో కొత్త మార్గాలను ప్రవేశపెట్టారు. హిందుస్తానీ సంగీత కుటుంబం నుంచి వచ్చిన పాలూస్కర్‌ ‌సంగీత సాధనకు మొదటిసారి అందరికీ అందుబాటులో ఉండే విధంగా పాఠశాలను నెలకొల్పారు. అంతవరకు ఆలయాలకు పరిమితమైన సంగీతం బయట ప్రపంచంలోకి వచ్చింది. అలా జాతీయోద్యమంలో భాగమైంది. ఆగస్ట్ 18,1872‌న పాలూస్కర్‌ ‌మహారాష్ట్రలోని రాజ సంస్థానం కురుంద్‌వాడ్‌లో జన్మించారు. తండ్రి దిగంబర్‌ ‌గోపాల్‌ ‌పాలూస్కర్‌ ‌ప్రముఖ కీర్తనాచార్యుడు. అంటే భక్తిగీతాలకు ప్రసిద్ధి చెందినవారు. తండ్రి ప్రభావం కొడుకు మీద పడింది. ఈయన పదో ఏట గోకులాష్టమి జరిగే ఉత్సవంలో పాల్గొని చిన్న ప్రమాదానికి గుర య్యారు. దానితో కంటి చూపు పాక్షికంగా దెబ్బ తిన్నది. ఆ తర్వాత తన జీవితమంతా సంగీతానికే అంకితం చేశారు. తొలి సంగీత పాఠాలు బాల కృష్ణబువ ఇచ్చాలికరంజికర్‌ ‌వద్ద సాగింది. బాలకృష్ణబువ గ్వాలియర్‌కు చెందిన ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు ఉస్తాద్‌ ‌కరీంఖాన్‌ ‌శిష్యుడు.

 2003లో బీబీసీ ప్రపంచ వ్యాప్త సర్వే ఒకటి నిర్వహించింది. విశ్వవ్యాప్తమైన పది గేయాలు ఏవి అనే అంశం మీద జరిగిన సర్వే అది. మొత్తం 7000 పాటలు వచ్చాయి. 155 దేశాలు, ద్వీపాల లోని ప్రజలు ఈ సర్వేలో పాల్గొన్నారు. మొదటి పది గీతాలలో రెండవదిగా వందేమాతరం ఎంపికయింది. ఇంత గొప్పగా హృదయాలను కదిలించే పాట కాబట్టే భారత స్వాతంత్య్రోద్యమాన్ని నడిపింది.


‘స్వ’ కు ప్రేరణ!

భారత్‌ ‌దేశీయ సాంకేతికత, వస్తువులు, సేవలతో తన సమస్యలను పరిష్కరించుకోవడంలో ‘స్వ’ నుండి ‘స్వదేశీ’ స్ఫూర్తిని వేడుకగా జరుపుకుంటుంది! బ్రిటిష్‌ ‌పరిపాలనకు వ్యతిరేకంగా ‘స్వరాజ్యం’ కోరుతూ ఐక్య భారతదేశం కోసం పోరాడిన అందరు స్వాతంత్య్ర సమరయోధుల మనసులను ఆకర్షించిన జాతీయగీతం ‘వందేమాతరం’ 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1875లో బంకించంద్ర చటోపాధ్యాయ ఈ గీతాన్ని రాశారు. ఇది పూర్తి స్వేచ్ఛ కోసం, విదేశీ పాలన, వస్తువులు, సేవలను తిరస్కరించడం కోసం హంస గీతంగా మారింది.

ఈ గీతం అంతర్గత, బాహ్య సవాళ్లను అధిగ మించి, 140 కోట్ల జనాభా కలిగిన ఐక్య, అభివృద్ధి చెందిన దేశానికి ప్రేరణగా ఉపయోగపడుతుంది.

ఇటీవల జబల్‌పూర్‌లో మూడు రోజుల సమావేశం నిర్వహించిన రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) ‌కేంద్ర కార్యనిర్వాహక మండలి ‘వందేమాతరం’ స్ఫూర్తిని వేడుకగా జరుపుకోవడానికి, దానిని పునరుద్ధరించడానికి ఒక సంవత్సరం పాటు ప్రచారం చేయాలని ప్రకటించింది. దీనిని మొట్ట మొదట 1896లో జరిగిన కాంగ్రెస్‌ ‌సమావేశంలో రవీంద్రనాథ్‌ ‌ఠాగూర్‌ ఆలపించినప్పుడు  ప్రతినిధులు ఆకర్షితులయ్యారు. ఇది బ్రిటిష్‌ ‌వారిని వ్యతిరేకించే ఒక ‘మంత్రం’ గా మారింది.  మహర్షి అరబిందో, మేడమ్‌ ‌భికాజి కామా వంటి దిగ్గజాలు, విఖ్యాత కవి సుబ్రమణ్య భారతి, లాలా హర్‌దయాళ్‌, ‌లాలా లాజపతిరాయ్‌ ‌వంటి సమరయోధులు, దయానంద సరస్వతి వంటి సంస్కర్తలు కూడా దీనిని ఆలపిం చారు. మహాత్మా గాంధీ తోటి స్వదేశీయులకు  స్వాతంత్య్ర సమరయోధులకు రాసిన లేఖలలోనూ, ప్రజలను పలకరించడానికి ‘వందేమాతరం’ ను నేర్పుగా ఉపయోగించారు.

1975లో ‘వందేమాతరం’ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు, అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ అంతర్గత అత్యవసర పరిస్థితిని విధించారు. పౌరుల ప్రాథమిక, ప్రజాస్వామ్య హక్కులను తుంగలో తొక్కారు. కాంగ్రెస్‌ ‌నేతృత్వం లోని ప్రభుత్వం ‘వందేమాతరం’ గీతాలాపనపై ఆంక్షలు విధించింది. పార్లమెంటు ఉభయ సభలు సహా చాలా ప్రజాస్వామ్య సంస్థలను రద్దు చేసింది. రెండేళ్ల పాటు వెర్రి అప్రజాస్వామిక పాలన చేస్తూ అధికారంలో ఉండటానికి  రంగం సిద్ధం చేసుకుంది.

అందువల్ల, న్యూఢిల్లీలో నేరపూరిత పాలన భారాన్ని చవిచూసిన యావత్‌ ‌సంఘపరివార్‌, 50 ‌సంవత్సరాల తర్వాత ‘వందేమాతరం’ స్ఫూర్తిని వాడవాడలా  వినిపించాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. వందేమాతరం జాతీయ గీతం జనగణమనకు దీటుగా కులం, మతం, లింగం, ప్రాంతం, విశ్వాసం ప్రాతిపదికగా సమాజపు ప్రాథమికాలను బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్న విభజన శక్తులకు వ్యతిరేకంగా యావత్‌ ‌దేశ పౌరులను తిరిగి ఏకం చేసేందుకు ప్రయత్నిస్తుంది.

వందేమాతరం విదేశీ శక్తులతో సంబంధాలు కలిగి ఉన్న విధ్వంసక శక్తులకు వ్యతిరేకంగా  ‘స్వ’,  భారతీయత స్ఫూర్తిని తిరిగి రగిలించే గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంది.

వందేమాతరం గ్రామాల నుంచి నగరాల వరకు మొత్తం దేశంలోని ప్రజల్లో తాము భారతదేశానికి చెందినవారమనే భావన కలిగించగలదు. దేశ నాగరికత విలువలను పునరుజ్జీవింపజేయగలదు. దాని వైవిధ్యాన్ని వేడుకగా జరుపుకోగలదు. దేశాన్ని ఐక్యంగా ఉంచగలదు. భారత్‌ను ఇతర దేశాలు కూడా ముందుకు సాగడానికి ఒక పటిష్టమైన మార్గాన్ని చూపించే అభివృద్ధి చెందిన దేశంగా మార్చగలదు.

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌ ‌కార్యవాహ దత్తాత్రేయ హోసబలే కొన్ని వర్గాలలోని తేడాలను పక్కనపెట్టి జాతీయ పునరుజ్జీవనం, అభివృద్ధి, భారతదేశంలో సమ్మిళిత శ్రేయస్సును తీసుకురావడానికి ప్రాతిపదికగా ‘స్వ’ స్ఫూర్తిని పునరుద్ధరించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు.

‘స్వ’లో దేశీయ వనరులు, ప్రతిభ, ఆలోచనలు, ఆవిష్కరణలు ఉంటాయి. అది భారతీయతను నిర్వచించే సాంకేతికతపై ఆధారపడటం ఉంటుంది. ఉదాహరణకు, వాట్సాప్‌కు వ్యతిరేకంగా శ్రీధర్‌ ‌వెంబు ప్రవేశపెట్టిన సారట్టై మన ప్రాథమిక కమ్యూనికేషన్‌ ‌మాధ్యమం కావచ్చు. ఉదాహరణకు, రష్యా ఎస్‌జే-100 విమానాలను నిర్మించడం కంటే ప్యాసింజర్‌, ‌యుద్ధ విమానాలకు చోదక శక్తినిచ్చే మన స్వంత కావేరీ ఇంజిన్‌ను నిర్మించడం మన ప్రాధాన్యతగా ఉండాలి.

దత్తాత్రేయ హొసబలే చెప్పినట్లుగా, ‘స్వ’ లేదా ‘స్వదేశీ’ అనేది భారత్‌ ‌దృక్కోణం నుండి పూర్తి వేరుపడిపోకూడదు. దీని అర్థం దేశీయ వనరులు, దేశీ ప్రతిభ, స్వదేశీ సాంకేతికతలు, ఆవిష్కరణలు, మానవ మేధస్సుపై పూర్తిగా ఆధారపడాలని.

ఏరోస్పేస్‌ ఇం‌జనీరింగ్‌, ‌రక్షణ రంగంలో ఉత్పాదకత నుండి సమాచార సాంకేతికత వరకు, స్వావలంబన అనేది కంటెంట్‌ ‌లేదా పక్రియలలో ఇలా అన్నింటా ఒక కీలకమైన పదం- కీ వర్డ్‌గా మారాలి. స్వచ్ఛమైన ‘స్వదేశీ’ పంథా ప్రపంచంలో అనేక భాగస్వామ్యాలతో మిళితమై, భారత్‌ ‌తన సామాజిక-ఆర్థిక పునరుజ్జీవనం కోసం చేపట్టిన ప్రచారానికి వేగాన్ని పెంచుతుంది.

అమెరికా ఒత్తిడికి గురైన రష్యా భారత్‌కు రాకెట్లు, క్షిపణులకు శక్తినిచ్చే క్రయోజెనిక్‌ ఇం‌జిన్ల సాంకేతికతను నిరాకరించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. రష్యన్‌ అం‌తరిక్ష సంస్థ గ్లావ్‌కాస్మోస్‌ ‌క్రయోజెనిక్‌ ఇం‌జిన్ల సాంకేతికతను తిరస్కరించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)తో 1994లో చేసుకున్న ఒప్పందాన్ని సవరించింది. సరఫరాను తొమ్మిది ఇంజిన్లకే పరిమితం చేసింది. అయినప్పటికీ ఇస్రో శాస్త్రవేత్తలు ప్రపంచ అంతరిక్ష శక్తులను అధిగమించారు. అంతరిక్ష రంగంలో ఆధిపత్యం చెలాయించారు.

ఇందులో ప్రధాన సానుకూల అంశం ఏమిటంటే, నరేంద్రమోదీ  నేతృత్వంలోని ప్రభుత్వం పరివార్‌ ‌చేపట్టిన ‘వందేమాతరం’  ప్రచార కార్యక్రమంలో భాగం పంచుకోవడం. ఇందుకు నిదర్శనంగా నవంబర్‌ 7, ‌శుక్రవారం నాడు, అక్షయ నవమి రోజున ప్రధానమంత్రి మోదీ స్వయంగా ‘వందేమాతరం’ స్ఫూర్తిని దేశ ప్రజలలో తిరిగి రగిలించారు.

గత నెలలోనే, కేంద్ర మంత్రివర్గం ఒక తీర్మానం ద్వారా వచ్చే ఏడాది నవంబర్‌ 7 ‌వరకు ‘వందే మాతరం’ను వేడుకగా జరుపుకోవాలని నిర్ణయించింది. పాలనా యంత్రాంగం ప్రతీ స్థాయిలోనూ ‘స్వదేశీ’ని ఒక ‘మంత్రం’గా స్వీకరించి నట్లయితే ఈ ప్రచారం మరింత ప్రయోజనకరంగా మారుతుంది.

భారత్‌ ‌ప్రతి రంగంలోనూ ‘స్వ’ స్ఫూర్తిని వర్తింపజేస్తే, అభివృద్ధి చెందిన దేశాల్లో జపాన్‌ ‌లేదా జర్మనీని అధిగమిస్తూనే, ఆర్థిక రంగంలో అగ్ర స్థానం కోసం చైనా, అమెరికాలకు గట్టిపోటీని ఇవ్వడం కష్టసాధ్యం కాదు.

పాలనా సంస్కరణల నుండి భారత ప్రజల విభిన్న భాషలను వినియోగించుకోడం వరకు ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, వాటి నాయకత్వం ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి.

 కె.ఎ.బదరీనాథ్‌

 ‌డైరెక్టర్‌ & ‌చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌,

‌సెంటర్‌ ‌ఫర్‌ ఇం‌టిగ్రేటెడ్‌ అం‌డ్‌

 ‌హోలిస్టిక్‌ ‌స్టడీస్‌, ‌న్యూఢిల్లీ.


120 ఏళ్ల నుంచి వ్యతిరేకమే

వందేమాతరం గీతం మీద ముస్లింల వైఖరి దాదాపు 120 సంవత్సరాల నుంచి ఒకే విధంగా ఉంది. 1908లో ముస్లిం లీగ్‌ ‌వందేమాతరం ఆలాపనను వ్యతిరేకించింది. ఆ సంవత్సరం జరిగిన లీగ్‌ ‌వార్షిక సమావేశాలు సయ్యద్‌ ఇమామ్‌ అధ్యక్షతను జరిగాయి. దేశాన్ని మాతృభూమిగా పూజించడాన్ని ఇస్లాం అంగీకరించదని అతడు ప్రకటించాడు. అదే వైఖరీ నేటికీ ఉంది. వందేమాతర గీతం పాడడం ఇస్లాం విశ్వాసాలకు శుద్ధ వ్యతిరేకమని అంటున్నాయి జమ్ముకశ్మీర్‌ ‌ముస్లిం మత సంఘాలు.

అల్లా ఒక్కడే భగవంతుడు  అన్న తమ విశ్వాసానికి ఈ గీతంలో వ్యక్తమైన భావనలు వ్యతిరేకమని ఆ సంఘాలు చెబుతున్నాయి. అల్లా అనే సృష్టికర్తను విశ్వసించడం ఒక్కటే తమకు ముఖ్యమని మిగిలిన ఏ విషయాలూ తమకు అంగీకార యోగ్యం కావని తెగేసి చెబుతున్నాయి. వందేమాతర గీతం జన్మించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నవంబర్‌ 7‌న ఉత్సవాలు నిర్వహించాలంటూ నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ‌ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని  కశ్మీరీ ముస్లిం మత సంఘాలు లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ను కోరడం ఈ దృష్టితోనే. ఇలాంటి ఉత్సవం నిర్వహించమంటూ లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌సిన్హా, రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం పట్ల ముతాహిదా ఎ ఉలేమా (జమ్ముకశ్మీర్‌లోని ముస్లిం మత సంఘాల ఐక్యవేదిక) నాయకుడు మిర్వాయిజ్‌ ఉమర్‌ ‌ఫరూక్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశాడు. నవంబర్‌ 7‌న జమ్ముకశ్మీర్‌ ‌ప్రాంతం లోని అన్ని పాఠశాలలలో సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీతోత్సవాలు నిర్వహించాలని ఆ ఆదేశంలో పేర్కొన్నారు. వీటికి విద్యార్థులు, పాఠశాల సిబ్బంది కూడా హాజరు కావాలని ఆదేశించారు. ఇలా ముస్లిం బాలబాలికలను వందేమాతరం ఉత్సవాలకు హాజరు కావాలని ఆదేశించడం వారి విశ్వాసానికి అన్యాయం చేయడమే కాకుండా, అంగీకారయోగ్యం కూడా కాదని మిర్వాయిజ్‌ ఎక్స్ ‌ఖాతాలో వ్యాఖ్యానించాడు. ఇలాంటి చర్యలు ముస్లింలు మెజారిటీగా ఉన్న ప్రాంతం మీద ఆర్‌ఎస్‌ఎస్‌ ‌హిందూ భావజాలాన్ని రుద్దడం కోసం ఉద్దేశించినవేనని ఆయన విమర్శిం చాడు. కానీ వందేమాతర గీతం 1875లో జనం ముందుకు వస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ ‌యాభయ్‌ ఏళ్ల తరువాత ఆవిర్భవించింది.

About Author

By editor

Twitter
YOUTUBE