సంపాదకీయం

శాలివాహన 1947 శ్రీ విశ్వావసు కార్తిక బహుళ త్రయోదశి – 17 నవంబర్‌ 2025, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


దాదాపు దశాబ్దకాలంగా పేలుళ్ల మాట వినపడకుండా భద్రత మధ్య ఉన్న దేశంలో నవంబర్‌ 10 ‌సాయంత్రం, 6.50 ప్రాంతంలో జరిగిన పేలుడు జాతిని ఉలిక్కిపడేటట్టు చేసింది. కారులో అమర్చిన ప్రాణాంతక పేలుడు సామగ్రి పేలి 12 మంది చనిపోయారు, 20 మంది వరకు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరగక తప్పదు. అంత తీవ్ర స్థాయి పేలుడు. పది అగ్నిమాపక యంత్రాలు వచ్చి, సమీపంలోని కార్ల మంటలు ఆర్పవలసి వచ్చింది. పేలుడు తీవ్రత, తీరుతెన్నులు అనూహ్యంగా, పాత వాటికి భిన్నంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఎర్రకోట నుంచి ఏటా ఆగస్ట్ 15 ‌సందర్భంగా ప్రధాని ప్రసంగించే చోటుకు సమీపంలోనే, ఒకటో నెంబర్‌ ‌గేటు దగ్గర పేలుడు సంభవించింది. ఈ పేలుడు వెనుక జైషే మహమ్మద్‌ ఉ‌గ్ర సంస్థ ఉందన్న అనుమానాలు వినిపిస్తున్నా, పాకిస్తాన్‌ ‌హస్తం గురించి స్పష్టం కావలసి ఉంది. ఇప్పుడు ప్రజల ఎదురు చూపు దానికే. దాని పాత్రే నిజమైతే పర్యవసానాలు తీవ్రంగానే ఉంటాయి. భూటాన్‌లో ప్రధాని ఇచ్చిన ప్రకటనలో ‘కుట్రదారులు’ అన్న పదం ఉపయోగించారు. అమెరికా, ఇరాన్‌, ‌భూటాన్‌, శ్రీ‌లంక తదితర దేశాలు ఈ పేలుడు కుట్రను ఖండించి, మృతుల కుటుంబాల వారికి సానుభూతి ప్రకటించారు.

హరియాణా రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఒక తెల్ల హ్యుండాయ్‌ ఐ20 ‌కారు 10వ తేదీ ఉదయం 8 గంటల ప్రాంతంలో ఢిల్లీలో ప్రవేశించింది. చాలాచోట్ల చక్కర్లు కొట్టి, మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఎర్రకోట మెట్రోస్టేషన్‌ ‌దగ్గర సుహేరీ మసీదు వద్ద ఆగింది. సాయంత్రం 6.20 ప్రాంతంలో ట్రాఫిక్‌ ‌సిగ్నల్స్ ‌దగ్గరకు నెమ్మదిగా చేరుకున్నాక పేలుడు సంభవించింది. పుల్వామా, జమ్ముకశ్మీర్‌లతో సంబంధం ఉన్నవారే దీనికి పాల్పడ్డారని అర్ధమవుతూనే ఉంది. ఆ కారు ఏడు చేతులు మారింది, చివరికి పేలుడుకు ఉపయోగపడింది. ఇప్పటి వరకు వినిపించిన పేర్లను బట్టి ఇది ముమ్మాటికీ ఉగ్రదాడేనన్న అనుమానం కలగకమానదు. పుల్వామాకు చెందిన ఒక డాక్టర్‌ ఇం‌దులో కీలకం. జైష్‌, అన్సార్‌ ‌గజ్‌వత్‌ ఉల్‌హింద్‌ ఉ‌గ్రవాద సంస్థతో సంబంధాలు కలిగిన ఏడుగురు వ్యక్తులు, వారి వద్ద నుంచి 2900 కిలోల బాంబు తయారీ పదార్థాలు హరియాణాలో స్వాధీనమైన కొన్ని గంటలకే ఈ విస్ఫోటం సంభవించింది. ఇది ప్రతీకారమనే ఎక్కువమంది అనుమానిస్తున్నారు. హరియాణా లోని ఫరీదాబాద్‌ ‌కేంద్రంగా ఈ వ్యూహమంతా అమలయిందని అనుకోవచ్చు. ఆ బాంబు తయారీ పదార్థాలను ఎక్కడెక్కడ అమర్చవలసి ఉంటుందో విధ్వం సకులకు సమాచారం అందవలసిన తరుణంలో అరెస్టులు జరిగాయి. ఆ విధంగా పెద్ద విపత్తు నుంచి దేశం బయటపడింది. వైట్‌కాలర్‌ ఉ‌గ్రభూతంగా చెబుతున్న ఈ కుట్రలో ఎక్కువ మంది వైద్యులు. కేసు జాతీయ దర్యాప్తు సంస్థ చేతికి ఇచ్చారు. ఢిల్లీ దాడికి బాధ్యుడు పుల్వామాకు చెందిన డాక్టర్‌ ఉమర్‌ ‌మహమ్మద్‌ అని, ఐఎస్‌ఐ ‌పథకంతో జైషే నిర్వహించిందని జమ్ముకశ్మీర్‌ ‌మాజీ పోలీసు డైరెక్టర్‌ ‌జనరల్‌ ఎస్‌పీ వైద్‌ ‌నిర్మొహమాటంగా ప్రకటించారు. దీనిని బట్టి కశ్మీర్‌ ఉ‌గ్రవాదం కొత్త పుంతలు తొక్కుతున్నదని దీనితో జాతీయ భద్రతకు పెను ముప్పేనని ఆయన హెచ్చరించారు కూడా. అమోనియం నైట్రేట్‌ ‌ఫూయిల్‌ ఆయిల్‌, ‌డిటొనేటర్ల సాయంతో ఈ పేలుడు జరిపారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఇలా ఉండగా, హైదరాబాద్‌ ‌కేంద్రంగా బట్టబయలైన మరొక ఉగ్రకుట్ర గగుర్పొడిచే అంశాలను వెల్లడించింది. హైదరాబాద్‌ ‌వైద్యుడు అహమ్మద్‌ ‌మొహియుద్దీన్‌ ‌సయ్యద్‌ను గుజరాత్‌ ‌యాంటీ టెర్రరిస్ట్ ‌స్క్వాడ్‌ అరెస్టు చేయడంతో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. విధ్వంసం కోసం ఢిల్లీ, అహమ్మదాబాద్‌ ‌లలోని పలు జనసందోహం ఉన్న ప్రదేశాలతో పాటు, క్నోలోని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యాలయాలపై కూడా ఇతడి ముఠా రెక్కీ నిర్వహించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. మొహియుద్దీన్‌ ‌సయ్యద్‌కూ, ఇస్లామిక్‌ ‌స్టేట్‌ ‌ఖొరాసన్‌ ‌ప్రావిన్స్ ఉ‌గ్రసంస్థ నాయకుడు ఖదీజాతో సంబంధాలు ఉన్నట్టు ముందే తేలింది. రైసిన్‌ అనే విష పదార్థం ద్వారా ఎక్కువ మారణకాండ సృష్టించాలన్నదే వీళ్ల పథకం. ఆ విషాన్ని మంచినీరు, ఆలయాలలో ఇచ్చే ప్రసాదాల ద్వారా విరజిమ్మాలని ఆ పథకం ఉద్దేశమని తేలింది. హైదరాబాద్‌లో ఒకరు, ఢిల్లీ తాజా పేలుళ్ల ఘటనలో అరెస్టయిన ఎనిమిది మందిలో ముగ్గురు వైద్యులే కావడం బాధ కలిగించే విషయం. వీరిలో డాక్టర్‌ ‌షాహిన్‌ అనే మహిళా డాక్టర్‌ ఉన్నారు. ఈమెను లక్నోలో అరెస్టు చేశారు. ఢిల్లీ పేలుడు వెనుక ఉన్నట్టు భావిస్తున్న ఆ వైద్యులందరినీ ఉగ్రవాదం వైపు మళ్లించినవాడు ఇర్ఫాన్‌ అహమ్మద్‌ అనే ఒక మత గురువు.

ముస్లిం ఉగ్రవాదానికి ఉన్న రూపు, తత్త్వం, తీవ్రత ఘటన ఘటనకు మారుతున్నాయి. ఒకప్పుడు అవిద్యతో కొందరు ముస్లింలు ఉగ్రవాదాన్ని ఆశ్రయిస్తున్నారని బుద్ధితక్కువ మేధావులు నిరంతరం నమ్మించే ప్రయత్నం చేశారు. అది తప్పని తేలిపోయింది. ఢిల్లీ, అలీఘడ్‌ ‌ముస్లిం విశ్వవిద్యాలయాల నుంచి నేరుగా కశ్మీర్‌లో ఉగ్రవాదానికి వెళ్లినవారు ఉన్నారు. మరి ఇప్పుడు! ముస్లిం వర్గానికి చెందిన వైద్యులు ఉగ్రవాద కార్యకలాపాలలో నేరుగా పాల్గొన్నారు. ఒక మతానికీ, ఉన్నత విద్యకీ ఇంతకు మించి సిగ్గుచేటయిన విషయం మరొకటి ఉంటుందా? దేశంలో వాతావరణం మారాలి. ఆలోచనా విధానం మారాలి. ఇది ప్రభుత్వ వైఫల్యం, నిఘా వర్గాలు నిద్ర పోతున్నాయా? అంటూ విరుచుకు పడేవారు ఇలాంటి నరహంతక రాక్షస క్రీడలు ఆపాలని ఉగ్రవాద ముఠాలకు కూడా ఒక మాట చెప్పరేమి? మంచినీటిలో, ఆలయాలలో పంచే ప్రసాదాలలో విషం కలిపి, ఎక్కువ సంఖ్యలో మరణాలు సంభవించేటట్టు చేయాలనుకునే ద్రోహులను ఏమనాలి? వారిని కాపాడుతున్నవారినీ, వారి ఓట్ల కోసం ఎంత దిగజారి మాట్లాడడానికైనా వెనుకాడని వారినీ ఏమని పిలవాలి?

About Author

By editor

Twitter
YOUTUBE