ఆయన ఒక్క వాక్యంతో ఎన్నో నిర్జీవమైన బ్రాండ్లను మార్కెట్‌లో నిలబెట్టారు. కేవలం 60 సెకన్లలో బోల్డన్ని కథలు చెప్పగలిగారు. ఆ కథలతో నవ్వించారు, ఆశ్చర్యపరిచారు, అప్పుడప్పుడు కళ్లు చెమర్చేలా మన జీవితాన్ని అద్దంలో చూపించారు. ఆయన కథా వస్తువు లన్నీ ఇరుకు మధ్యతరగతి ఇళ్లలోంచి, వారి పెద్ద పెద్ద కలల్లోంచి, చిన్న చిన్న ఆనందాల్లోంచి పుట్టుకొచ్చినవే. ఆయనే పీయూష్‌ ‌పాండే. ఓగిల్వీ ఇండియా చీఫ్‌ ‌క్రియేటివ్‌ ఆఫీసర్‌గా, ఎగ్జిక్యూటివ్‌ ‌చైర్మన్‌గా (2019-21) విధులు నిర్వర్తించి భారతీయ వాణిజ్య ప్రకటనల రంగాన్ని పెన్నుతో మలుపు తిప్పారు.

పీయూష్‌ ఎవరో చాలా మందికి తెలియక పోవచ్చు కానీ క్యాడ్‌ ‌బరి, ఏషియన్‌ ‌పెయింట్స్, ‌ఫెవికాల్‌ ‌వంటి బ్రాండ్ల పేర్లు చెప్తే వాటి యాడ్లు ఇప్పటికీ గుర్తొస్తాయంటే అది ఆయన ఘనతే. 1982లో ఓగిల్వీతో మొదలైన పీయూష్‌ ‌ప్రస్తానం 2025 దాకా నిర్విఘ్నంగా సాగింది. మొదట ఒక క్లయింట్‌ ‌సర్వీసింగ్‌ ‌ట్రైనీగా చేరినప్పటికీ ఆయన కళాదృష్టి, రచనాపటిమ చూసి క్రియేటివ్‌ ‌డిపార్టు మెంట్‌లోకి తీసుకున్నారు. అలా అంచెలంచెలుగా చీఫ్‌ ‌క్రియేటివ్‌ ఆఫీసర్‌ ‌స్థాయికి ఎదిగారు. గత నాలుగు దశాబ్దాలుగా పదుల సంఖ్యలో క్రియేటివ్‌ ‌డైరెక్టర్లను తయారుచేసి డజన్లకొద్దీ బ్రాండ్లను నిర్మించారు. సగటు క్రియేటివ్‌ ‌డైరెక్టర్‌లాగా పీయూష్‌ ఏనాడూ అవార్డుల వెంట పరిగెత్తలేదు. ఎంత కీర్తి సంపాదించుకున్నప్పటికీ తన డిజిగ్నేషన్లను పక్కన పెట్టి తనని తానూ ‘మినిస్టర్‌ ఆఫ్‌ ‌ఫన్‌’‌గా పిలుచుకునే వారు. అందుకే ఆయన జీవితాన్ని, భారతీయతను, రచననూ అంతగా ప్రేమించి ఆస్వాదించగలిగారేమో అనిపిస్తుంది. ఒక విధంగా ఓగిల్వీ వంటి అంత ర్జాతీయ సంస్థ దృష్టికోణాన్ని, విధి విధానాలను భారతీయతకు తగినట్టు తర్జుమా చేసి ఒక పుష్కరం నిరాటంకంగా ‘ఏజెన్సీ ఆఫ్‌ ‌ది ఇయర్‌’‌గా నడిపారు.

‘గ్రాస్స్ ‌రూట్స్’ అర్థం పర్థం తెలిసిన కాపీరైటర్‌

‌నేడు ఏఐ అనేక రంగాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ప్పటికీ అది కొన్ని పనులు మాత్రం చేయలేదనిపిస్తుంది. అందులో మొదటిది పీయూష్‌లా మట్టి వాసనున్న కాపీ రాయడం. కాపీ అంటే (వాణిజ్య ప్రకటనల భాషలో) సామాన్య జనాలకు బ్రాండ్‌ ‌గురించి లేదా దాని తాలూకు వస్తువు గురించి సరళంగా, కళాత్మ కంగా చెప్పే రచన. అది రాయాలంటే పాండిత్యం ఉన్న సామాన్యుడికి మాత్రమే సాధ్యం. ఈ పాండిత్యం ఆయన రాసిన ‘అబ్‌ ‌కీ బార్‌ ‌మోదీ సర్కార్‌’ (2014 ‌బీజేపీ ఎన్నికల క్యాంపైన్‌) ‌హెడ్‌ ‌లైన్‌లో కనిపిస్తుంది. ఆ ఎన్నికల్లో మోదీని దేశం ఎదురుచూస్తున్న అతి ముఖ్య అభ్యర్థిగా నిలబెట్టడానికి ఎంతో తోడ్పడింది. సామాన్యుల్లోకి పార్టీ అభిమతాన్ని తీసుకెళ్లడానికి ఒక వారధి అయ్యింది.

పీయూష్‌ ‌క్రికెటర్‌. ‌రంజీ ట్రోఫీకి కూడా ఆడారు. కానీ ఆర్థిక సమస్యల వల్ల ఉద్యోగం వెతుక్కోవలసొ చ్చింది. జైపూర్‌లో పుట్టిపెరిగి, ఢిల్లీలో ఎంఏ (హిస్టరీ) పూర్తి చేసి కొద్ది రోజులు కన్‌‌స్ట్రక్షన్‌ ‌రంగంలో, అనంతరం కలకత్తాలో టీ టేస్టర్‌గా పని చేసి యాదృచ్ఛి కంగా ప్రకటనల రంగంలోకి అడుగుపెట్టారు. క్రికెటర్‌గా ఉన్న రోజుల్లో మ్యాచ్‌ల కోసం దేశం అంతా రైళ్లలో జనరల్‌ ‌కోచ్‌లో తిరుగుతూ భారత దేశాన్ని దర్శించానని ఒక ఇంటర్వ్యూలో నెమరేసుకున్నారు. ఆయన ఆ రైళ్లలోనే సామాన్యుల హావభావాలు, వారి భాష, వేషం చూశారు. ఇంకా చెప్పాలంటే 80ల్లోనూ, 90ల్లోనూ భారత్‌లో తొలగి పోతున్న పేదరికం, నిర్మితమవుతున్న మధ్య తరగతికి ఆయన సాక్షి. అదే ఆయనకు ట్రైనింగ్‌. ఆ అనుభవాలే ఆయన్నొక అసామాన్య సామాన్యుడిలా తీర్చిదిద్దాయి. బ్రాండ్లకు మాట సాయం చేసిన ఆయన కలమే లీడర్లకు కూడా ఆ పని చేసి పెట్టిందనడం అతిశయోక్తి కాదు.

మారుతున్న కాలానికి మాటలు నేర్పిన కలం

పీయూష్‌ ‌కాపీరైటర్‌గా మొదట్లో పనిచేసిన ప్రాజెక్టుల్లో ముఖ్యమైనది ‘మిలే సుర్‌ ‌మేరా తుమ్హారా’ (1988) అనే గీతం. సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, లోక్‌ ‌సేవా సంచార్‌ ‌పరిషద్‌ ‌పర్య వేక్షణలో, పండిట్‌ ‌భీంసేన్‌ ‌జోషి సంగీత దర్శ కత్వంలో జాతీయతా భావాలు, ఐక్యతను పెంపొం దించడానికి ఈ గీతాన్ని రూపొందించారు. ఆ సమయానికి ఓగిల్వీలో ఎంతోమంది కాపీరైటర్‌ ‌లు ఉన్నప్పటికీ, పెద్దగా లేకపోయినప్పటికీ అది రాసే అదృష్టం ఆయనకే దక్కింది. అది విడుదలైన తర్వాత ఆ గీతం ఎంతో ప్రాచుర్యం పొంది ఆయనకు ఉన్నట్టుండి గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఇక తొంభైల్లో భారతదేశంలో చోటుచేసుకున్న ఆర్ధిక సరళీకరణతో అడ్వర్‌టైజింగ్‌ ‌రంగంలో రెండు పెను మార్పులు జరిగాయి. అందులో మొదటిది కొత్త బ్రాండ్ల స్థాపన, రెండవది టెలివిజన్‌ ‌రాక. ఈ రెండింటికీ బాగా అవసరమైన అడ్వర్‌టైజింగ్‌ ‌రంగంలో అప్పుడప్పుడే క్రియేటివ్‌ ‌డైరెక్టర్‌గా ఎదుగు తున్నారు ఆ రోజుల్లో పీయూష్‌. అప్పటినుంచి 2010 దాకా నిరాటంకంగా ఆయన రాసిన ప్రచార ప్రకటనలు, ఆయన ఆధ్వర్యంలో వచ్చిన ఎన్నో యాడ్లు చరిత్రలో నిలిచిపోయాయి.

ఆయన ఐడియాలు ఎంత బలమైనవంటే ఒకసారి ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఆనంద్‌ ‌మహీంద్రా పీయూష్‌ ‘ఎం-‌సీల్‌’ ‌బ్రాండ్‌కు రాసిన యాడ్‌ ‌చూసి ‘‘నువ్వు ఇంత మంచి యాడ్‌ ‌రాసి ఈ బ్రాండ్‌కు కొత్త లైఫ్‌ని ఇస్తావని తెలిస్తే నేను అసలు దాన్ని అమ్మి ఉండేవాడిని కాదు’’ అని అన్నారట (అంతకు మునుపు ‘ఎం-సీల్‌’ ‌మహీంద్రా కంపెనీల్లో ఒకటి).

కొన్ని వందల ప్రచార ప్రకటనలు రాసిన పీయూష్‌ ఆయన మనసుకు దగ్గరైన, ఇష్టమైన ఒకటి ఎంచుకో మంటే తడబడకుండా పోలియో వైరస్‌ ‌నిర్మూలనకు భారత ప్రభుత్వంచేపట్టిన కార్యక్రమానికి రాసిన ‘‘దో బూంద్‌ ‌జిందగీ కే’’ (నిండు జీవితానికి రెండు చుక్కలు) అనే ప్రచార ప్రకటన ఆయనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని చెప్తారు. ఆ ప్రచార ప్రకటనకు అమితాబ్‌ ‌బచ్చన్‌ అయితే బావుంటుంది సూచించింది కూడా ఆయనే. ఎందుకని అడిగితే దేశం మొత్తం బచ్చన్‌ ‌లాంటి పెద్ద మనిషి తిడితేనే పడతారు లేకపోతే మాట వినరు అని  అంటారు.

ఇల్లే ఆడిటోరియం

తొమ్మిది మంది సంతానంలో పీయూష్‌ ఎనిమిదవవాడు. ఆయనకొక తమ్ముడు. తండ్రి రాజస్థాన్‌ ‌కో-ఆపరేటివ్‌ ‌బ్యాంకులో పనిచేసేవారు. పీయూష్‌ ‌తన బాల్యం చాలా ఆహ్లాదంగా కళాకారుల మధ్య జరిగిందని ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకు న్నారు. ఇంట్లో ప్రతి ఒక్కరికి సంగీతం, నాట్యం, కవిత్వం, నాటకం వంటి ఏదో ఒక కళపై ఆసక్తి ఉండేదని, రోజూ వాటికి సంబంధించిన చర్చలు, సాధనలు జరుగుతుండేవని, అవి చూస్తూ పెరిగానని చెప్పుకొచ్చారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆయనతో పాటు తోబుట్టువులందరూ కళాకారులుగా రాణించారు. ఆయన సోదరి ఇలా అరుణ్‌ ‌ప్రఖ్యాత బాలీవుడ్‌ ‌గాయని. మరో సోదరి రామా పాండే ప్రఖ్యాత రంగస్థల నటి. ఇక సోదరుడు ప్రసూన్‌ ‌పాండే ప్రపంచ ప్రఖ్యాత యాడ్‌ ‌ఫిలిం డైరెక్టర్‌.

‌ప్రత్యేకంగా ఏమీ చదవనప్పటికీ, ఇండస్ట్రీలో ఏ గాడ్‌ ‌ఫాదర్‌ ‌లేనప్పటికీ ఆయన దేశం గర్వించదగ్గ కాపీరైటర్‌గా ఎదగడానికి కావలసిన ప్రతిభను తన కుటుంబం, పరిసరాలు తనకు తెలియకుండానే తనకు ధారపోశాయని ఒకానొక సందర్భంలో పీయూష్‌ ‌చెప్పారు.

అరుదైన అవార్డులు

ఓగిల్వీకి వరల్డ్ ‌వైడ్‌ ‌చీఫ్‌ ‌క్రియేటివ్‌ ఆఫీసర్‌గా పని చేసిన పీయూష్‌కు ప్రత్యేకంగా గుర్తింపు అవసరం లేదు. ఆయన కొన్ని దశాబ్దాలు స్టార్‌ ‌కాపీరైటర్‌ ‌గా ఏలారు. కానీ ఆయన్ను వరించిన అవార్డులు ఆయన్ని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలని చెప్తాయి. ఆయన కాపీలాగే ఆయన అవార్డులు కూడా విలక్షణమైనవే. పీయూష్‌ ఆసియా ఖండంలో లయన్స్ ఆఫ్‌ ‌సెయింట్‌ ‌మార్క్ (‌కేన్స్ ‌లయన్స్, 2018) అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి. ఆయన ఈ అవార్డును తన సోదరుడు ప్రసూన్‌ ‌పాండేతో కలిసి అందుకున్నారు. అడ్వర్‌టైజింగ్‌ ‌రంగంలో ఇద్దరు సోదరులు ప్రపంచం లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అవార్డును పంచు కోవడం ఇదే మొదటిసారి. 2024లో లండన్‌ ఇం‌టర్నేషనల్‌ అవార్డస్ ఎల్‌ఐఏ ‌లెజెండ్‌ ‌పుర స్కారంతో ఆయన్ను సత్కరించింది. పీయూష్‌ ‌కేన్స్ ‌లయన్స్, ‌క్లియో జీవనసాఫల్య పురస్కారం వంటివి ఎన్నో అందుకున్నాడు. 2016లో భారత ప్రభుత్వం అడ్వర్‌టైజింగ్‌ ‌రంగానికి ఆయన అందించిన సేవలను గుర్తిస్తూ పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది.

పీయూష్‌ ‌పాండే 24 అక్టోబర్‌, 2025‌న కన్ను మూశారు. ఆయన చివరిగా ఓగిల్వీ సంస్థకు చీఫ్‌ అడ్వైజర్‌గా విధులు నిర్వర్తించారు. భారతీయ అడ్వర్‌టై జింగ్‌ ‌రంగానికి, ఓగిల్వీకి పీయూష్‌ అం‌దించిన విశిష్ట సేవలకు నివాళిగా ఆ సంస్థ ‘చీఫ్‌ అడ్వైజర్‌’ అనే పదవిని శాశ్వతంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. తద్వారా ఆ స్థాయి ఉన్నవారు ఇప్పుడు ఎవరూ లేరు, ఇక రారు అని చెప్పకనే చెప్పింది.


యాడ్ ముత్యాలు

‌క్యాడ్‌బరి డైరీ మిల్క్: ‘‘‌కుచ్‌ ‌ఖాస్‌ ‌హై హమ్‌ ‌సబ్‌ ‌మే’’, ‘‘పప్పూ పాస్‌ ‌హో గయా’’

ఏషియన్‌ ‌పెయింట్స్: ‘‘‌హర్‌ ‌ఘర్‌ ‌కుచ్‌ ‌కహ్‌తా హై’’ (ప్రతి ఇల్లు ఒక కథ చెప్తుంది)

ఫెవికాల్‌: ‘‘‌ఫెవికాల్‌ ‌కా మజ్‌బూత్‌ ‌జోడ్‌’’, ‘‘‌తోడో నహీ జోడో’’

వోడాఫోన్‌/‌హచ్‌: ‌ది ‘‘పగ్‌’’ (‌చీకా), ‘‘జూజూస్‌’’

‌పాండ్స్: ‘‘‌గూగ్లీ వూగ్లీ వూష్‌’’

‌లూనా మోపెడ్‌: ‘‘‌చల్‌ ‌మేరీ లూనా’’

క్యాన్సర్‌ ‌పేషెంట్స్ ఎయిడ్‌ అసోసియేషన్‌: ‌ధూమపాన వ్యతిరేక ప్రచారం

గుజరాత్‌ ‌టూరిజమ్‌: ‘‘‌కుచ్‌ ‌దిన్‌ ‌తో గుజారియే గుజరాత్‌ ‌మే’’

ది హిందూ: ‘‘స్టే ఎహెడ్‌ ఆఫ్‌ ‌ది టైమ్స్’’

సత్య, యాడ్‌ ‌కన్సల్టెంట్‌

About Author

By editor

Twitter
YOUTUBE