వృత్తాంత పత్రిక. వృత్తాంతం అంటే సమాచారం.
సమాచారాన్ని విస్తరించి అందించేదే పత్రిక.
‘వృత్తాలు’ పేరుతో తెలుగులో ఒక పత్రిక ఉండేది. అదీ 1838లో. అది నడిచింది మటుకు మూడేళ్లే! ప్రచురణ స్థలం మద్రాసు.
తెలుగులో వెలువడిన తొలి పత్రికల్లో అదొకటి.
వృత్తాంతిని అనే మరో పత్రికా తెలుగులో వస్తుండేది!
అనంతర క్రమంలో వనితల పత్రికలూ వెల్లివిరిశాయి.
వాటి పేర్లు : హిందూ సుందరి, సువర్ణలేఖ, సావిత్రి, వివేకవతి, అనసూయ, గృహలక్ష్మి, వాసవి, భారతి; శారద, కళావతి.
ఇవన్నీ మహిళల పేర్లే కదా. కొన్ని పత్రికలకు సంపాదకత్వం వహించిందీ పడతులే!
పత్రికలు అనగానే – జాతీయ స్థాయిన పత్రికా దినోత్సవ సందర్భం తలపులోకి వస్తుంది. ఇదే నవంబరు 16న.
స్త్రీల కోసం స్త్రీలు నిర్వహించిన పత్రికలెన్నో.
వాటి విశేషాలు ఎప్పుడు తలచుకున్నా కొత్తగా ఉంటుంటాయి.
మాటలు, రాతలు. వీటితోనే భావాల వ్యక్తీకరణ.
నూట అరవై సంవత్సరాలకు పైగా చరిత్ర తెలుగు పత్రికలకు ఉంది. అక్షర సంపదలే అవన్నీ.
మరి స్త్రీల కోసం రూపుదిద్దుకున్న మొదటి పత్రిక ఏదంటే, పలు అభిప్రాయాలు వినవస్తుంటాయి.
హిందూ సుందరి పత్రికలో మొదటగా వచ్చిన కథ అచ్చమాంబ రాసిందే. ఆ కథ పేరు ‘ధన త్రయోదశి’, మనందరికీ తెలిసిన ధన్వంతరి త్రయోదశి. దీపావళి ఆరంభానికి సూచిక.
ఆమె రాసిన మరో కథ ‘దంపతుల ప్రథమ కలహము.’ ప్రచురణ పై భాగంలో పద్య / శ్లోక సంబంధ సందేశం ఆ పత్రికలో కనిపించేది. శ్రీ సంభావిత అని ప్రారంభం.
ఇక – కథా రచనలో ఒక భాగం మచ్చుకు.
‘నీవు నీ భర్త చెప్పిన పనిని జేయ తత్పరురాలవై యుండినచో – నాతడును నీ మాటను విని నిన్ను గౌరవించును, మనమితరులను మన్నింపనిచో వారు మాత్రము మననేల మన్నింపనెంతురు?’
లలిత భీతిల్లి ‘అమ్మమ్మా!’
పార్వతమ్మ : ‘నీవింత భయపడనక్కరలేదు, నీ పెనిమిటి తప్పక వచ్చును. ప్రథమ కలహమునందే సంసారమును విడుచు ముంగోపులగువారు బహుకొద్ది మంది. కాని – ఇదే ప్రకారము కలహములింకను జరుగుచుండినచో నొకదిన మంతపని కాక మానదు. ఇట్లు కాకుండుటకై కదా నేను నీకింతగా బోధించినది.’
లలిత : నీవన్న మాట నిజమే.
…ఇలా తేలిక పదాలతో, అంతా తెలిసే రీతిలో రచనలు సాగుతుండేవి.
రచనాశక్తి ఎంత ఉన్నతంగా ఉండేదో ఇప్పటికీ మనకు ఇట్టే అవగతమవుతుంది, ఎటువంటి శ్రమా లేకుండానే.
మరల నెన్నడును వారికిట్టి కలహము జరుగక, వారు సుఖముగనుండిరి. ఇందువలన వారి ప్రథమ కలహమే యంత్యకలహమయ్యెను – అని ముగుస్తుంది కథ. భావస్పష్టతకు ఇదొక నిదర్శనం.
హిందూ సుందరి పత్రికకు అప్పటి తొలి రోజుల్లో సంపాదకులుగా ఉన్న మహిళామణులు రమాబాయమ్మ, శాంతాబాయమ్మ. ఈ ఇద్దరి నిర్వహణలోనే పడతులెందరో రచనలు సాగించారు.
ముద్రణ పనులను సైతం వనితలే చేపట్టిన సందర్భాలున్నాయి.
సావిత్రి అనే పత్రికకు నిర్వాహకురాలు లక్ష్మీనరసమాంబ. తెలుగుతోపాటు మరికొన్ని భారతీయ భాషల్లోనూ నిపుణ.
స్త్రీల విద్యాభివృద్ధి కోసమే పత్రికను వెలువరిస్తున్నట్లు ఆ రోజుల్లోనే ప్రకటించారామె. విద్యాభిమానులంతా ముందుకు రావాలని పిలుపునివ్వడమూ ఆమె నేతృత్వానికి తార్కాణం.
లోకబాంధవి అనేది లక్ష్మీనరసమాంబ రచన.
అబలా సచ్చరిత్ర రత్నమాల (అచ్చమాంబ)ను తన పత్రికలో ప్రచురించింది నరసమాంబగారే. నిరంతర ప్రోత్సాహకురాలు.
‘మహిళాకళాబోధిని’ పుస్తకాన్ని నరసమాంబ రాసినపుడు,
ఆమె వయసు 15. మరి కొన్నేళ్లకే విద్యార్థినీ సమాజాన్ని స్థాపించారు.
నీతి కథావల్లరి అంటూ ప్రబోధక రచన, నాటికకు సైతం ప్రచురణ అవకాశం కలిగించారామె. కథ, గద్యగ్రంథం, పద్యకావ్యం, మరెన్నో పక్రియల్లో నిష్ణాతురాలు.
స్త్రీలతోపాటు బాలికల వికాసానికి ఉపకరించిన పత్రిక ‘అనసూయ’. సంపాదకురాలు వెంకటరత్నమ్మ. పత్రికను స్థాపించిన కాలం – ఇప్పటికే శతాబ్దికి పైమాట. వ్యాసాల రూపంలో ఎంతో భావ విస్తరణ చేయగలిగారామె. వ్యాసాలతోపాటే పాటల రచనల్లోనూ దిట్ట.
పెద చెరువు గట్టునా భేరి మోగింది
పెళ్లివారొచ్చారు పెదవీధిలోకి!
అంటూ మొదలుపెట్టి –
పానకపు కావిళ్లు భుజాన పెట్టి
అని కొనసాగించి –
పెళ్లమ్మ మా ఇంట్లో, పెళ్లి మా ఇంట్లో!
పేరైన సీతమ్మ పెళ్లి మా ఇంట్లో
పెళ్లి పెళ్లనగానే పెరిగె బుగ్గల్లు!
అంటూనే ముక్తాయించిన రీతి ఎంతో ఆకట్టుకుంటుంది. ఆసక్తికరమైన ఈ గీతిక ప్రచురణ రీత్యా ఏడున్నర దశాబ్దాలను ఏనాడో పూర్తి చేసుకుంది. ప్రచురించింది ‘చందమామ’ పత్రికలో. ‘ఆడపిల్లల పాటలు’ అనేది శీర్షిక.
ఆనాడు అనసూయ పత్రికలో ఎన్నో రచనలు వెలువడ్డాయి. పురుషులూ అనేక సారస్వత ప్రయోగాలు చేసి, పత్రికను మరింత ప్రాచుర్యానికి తెచ్చారు. వారిలో దేవులపల్లివారూ ఉన్నారు.
ఎవరు ఏది రాసినా స్త్రీ విద్యను ప్రోత్సహించడమే నాటి ఏకైక లక్ష్యం.
ఇంటి నిర్వహణ, చారిత్రక అంశాల అవగాహన.
ఈ లక్ష్యాల సాధనకూ అనసూయ పత్రిక అంకితమైంది. కొన్ని సామాజిక దురాచారాల మీదా కదనభేరి మోగించింది.
వెంకటరత్నమ్మ మరింత ప్రత్యేకత – అప్పటి ‘నవ్యసాహితీ సమితి’లో వనితగా ఏకైక సభ్యత్వం!
- స్త్రీలు ఎక్కడ ఉన్నత స్థితిలో ఉంటారో అక్కడే అభ్యున్నతి.
- తెలియనితనాన్ని నివారించడమే సాహిత్యం పని.
- అవకాశం ఇచ్చి చూడండి, ఏ రంగంలోనైనా వనితలే ముందుంటారు.
- బాలికల పాఠశాలల్లో చదువు చెప్పాల్సింది ఉపాధ్యాయినులే తప్ప, ఉపాధ్యాయులు కాదు. బోధన అర్హతను స్త్రీలకు మాత్రమే ఆయా విద్యాలయాల్లో కలిగించాలి ప్రభుత్వం.
- మహిళా ఉపాధ్యాయులే బోధనలో మిన్నగా ఉంటారు. వారి సేవలను వినియోగించెకోవడం పాఠశాలల మీద ఆధారపడి ఉంటుంది.
శత సంవత్సరాల చరిత్ర నిండిన పత్రిక ‘గృహలక్ష్మి’. స్త్రీల రచనా వ్యాసంగానికి తోడు, సారస్వత సాంస్కృతిక రంగాల మేటిదనాన్ని స్వర్ణకంకణంతో సత్కరిస్తూ వచ్చిన సంస్థ. వరలక్ష్మమ్మ మొదలు ఏటా ఈ ప్రదానాలు. తొలి సంచికలో ప్రధానంగా ఉన్నవి; మాలతీలత, దయార్ద్ర హృదయ; శారద లేఖలు గురించి; ఆలోచనకు సంబంధించి. అదేవిధంగా ఒక సంచికలో ‘ఆంధ్ర వనిత’ శీర్షికన పద్య సమర్పణకు మచ్చుతునక ఇది. మెచ్చుకోవాల్సిందే.
కలము చేబూని సాహితీ గరిమ జూపు
వీణజేబట్టి గానంబు వినికి సేయు
సమరరంగాన కత్తితోసాము జేయు
అతుల చాతుర్య కలిత ఈ ఆంధ్ర వనిత!
‘గృహలక్ష్మి ఇంకను నభివృద్ధినందుట యెట్టిదన, స్త్రీల పత్రికయైన గృహలక్ష్మి పూర్తిగా స్త్రీల నిర్వాహకత్వములోనికి వచ్చి, స్త్రీల పోషణచే జీవించుచు దాదాపు స్త్రీల రచనలే నలంకృత యై నిరంతరము స్త్రీల యభివృద్ధికై కృషి చేయునదిగానై పోవలెను. భగవదనుగ్రహము వలన గృహలక్ష్మి కట్టి కళ్యాణ దినములనతి కాలములో చేకూరుగాకయని వాంఛించెదను’. ఈ ఆకాంక్ష అలనాటు కనుపర్తి వరలక్ష్మమ్మది.
తదుపరి కాలంలో – ఆంధ్రలక్ష్మి (వెంకటరమణమ్మ), ఆంధ్ర మహిళ (దుర్గాబాయమ్మ), తెలుగుతల్లి (సత్యవతీదేవి), తెలుగుదేశం (రాజ్యలక్ష్మి), వనిత (అబ్బూరి ఛాయాదేవి), నూతన (రత్నమాల), వసుధ (రంగనాయకమ్మ), స్త్రీ స్వేచ్ఛ (మల్లాది సుబ్బమ్మ); అదే వరసన లోహిత, మాతృక; ఆహ్వానం (సామ్రాజ్యలక్ష్మి) చూపు (కాత్యాయని), తర్జని (వనజ), మహిళా విజయం (కాశీరత్నం), మహిళా స్వయంప్రభ (ఉదయలక్ష్మి), భూమిక (సత్యవతి) సంపాదకత్వ పత్రికలు వనితా చేతనను అక్షరీకృతం చేశాయి.
మహిళామార్గం, చైతన్యమానవి, నవోదయం, మానుషి పత్రికలూ తమవంతు పాత్రను ఎంతగానో నిర్వర్తించాయి. రచయిత్రులు / కవయిత్రులు సంపాదకులుగా ఉన్న, ఉంటున్న పత్రికలు స్త్రీ రచనా శక్తిని ఎంతైనా ప్రస్ఫుటించేవే. ఇంతకుముందూ మరెన్నో పత్రికలు వనితల రచనలను సమధికంగా ప్రచురించి అక్షరశారదను అర్చించాయి. కళాత్మకతను ప్రాచుర్యానికి తెచ్చి స్త్రీ కలం బలాన్ని ఆవిష్కరించాయి.
అటూ ఇటుగా వంద వసంతాల క్రితం ‘భారతి’ పత్రికలో వెలువడిన కథ ‘శాంతి’. రచయిత్రి – లక్ష్మి. ఇందులోని కొన్ని వాక్యాలు అప్పుడే కాదు – ఇప్పుడూ అక్షర శాసనాలు. ‘భగవంతుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యములనిచ్చి ఆచంద్రార్కము వర్ధిల్లజేయుగాత! కలం అంటే అక్షరజనని. ఆ లేఖినికి నమస్సులు అర్పిస్తుంది నిఖిల అవని.
జంధ్యాల శరత్‌బాబు
సీనియర్ జర్నలిస్ట్