కొన్ని దశాబ్దాల క్రితం రుతువుల క్రమంలో స్థిరత్వం, సమతుల్య రుతు ప్రభావం ఉండేది. ఈ మధ్యకాలంలో, ముఖ్యంగా గత 2,3 దశాబ్దాలలో వాతావరణంలో విపరీత మార్పులు సంభవించి రుతుధర్మంలో విపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫలితమే- అకాల వర్షాలు, విపరీత మైన వరదలు, భీకర తుపానులు. ఊళ్లు, నగరాలు, నదీపరీవాహక ప్రదేశాలు, పీఠభూములు అనే తేడా లేకుండా అన్ని చోట్లా వరదలతో జనజీవనం అతలాకుతలమవుతోంది. ఊళ్లు, నగరాలు మునిగిపోవడమే కాదు ఆస్తి, పంటల, ప్రాణ నష్టాలు సంభవిస్తున్నాయి. ప్రకృతి ప్రకోపంతో పాటు మానవ తప్పిదాలు కూడా ఇందుకు ముఖ్య కారణాలుగా పేర్కొనవచ్చు. ఒకప్పుడు వర్షాకాలంలోనే నదులు, జలాశయాలు, పెద్ద పెద్ద కాలువలు ఉన్న చోట్లలో వరదలు వచ్చేవి. ఆస్తి, ప్రాణనష్టాలు కూడా అంతంత మాత్రంగానే ఉండేవి. ఇప్పుడు నగరాలకూ ఈ బెడద పెరిగింది. ప్రతిచోటా అతి వర్షాలు, తుపానులు, వరదలతో జనజీవనం స్థంభించిపోతున్నది. శాస్ట్రీయ దృక్కోణం (సైంటిఫిక్ వ్యూ)లో సమస్యను పరిశీలిస్తే సామాజిక దృక్కోణంలో విశ్లేషించుకుని నష్ట నివారణ చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది.
ప్రకృతి ప్రకోపాలకు నిర్దిష్ట కారణాలు ఉన్నాయనే వాతావరణ పరిశోధన విభాగం అంచనా. దేశంలో అధిక భూభాగం తూర్పున బంగాళాఖాతం, పశ్చిమం లో అరేబియా సముద్ర తీరం ఉన్నాయి. ముఖ్యంగా బంగాళాఖాతంలో అల్ప పీడనాలు ఎక్కువ. అరేబియా సముద్రంలో తుపానులు వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి. కాబట్టే మన దేశానికి తుపానుల ద్వారా వానలు, వరదలు వచ్చే అవకాశాలు ఎక్కువే నని వాతావరణ విభాగం పేర్కొంటోంది. ఆ సముద్రాల వల్ల ప్రభావితమయ్యే రాష్ట్రాలను తుపాను ప్రభావిత రాష్ట్రాలు (సైక్లోన్ హాట్ స్పాట్స్) అంటారు. పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఆంధప్రదేశ్‌లను మేజర్ హాట్ స్పాట్స్ అంటారు కూడా. సాధారణంగా అధిక తుపానులు బంగాళాఖాతంలోనూ, కొద్ది సంఖ్యలో అరేబియా సముద్రంలోనూ సంభవిస్తూ ఉంటాయి. 2024 సంవత్సరంలో బంగాళాఖాతంలో మూడు, అరేబియా సముద్రంలో ఒకటి తీవ్ర తుపానులు వచ్చిన సంగతి ఇక్కడ గుర్తు చేసుకోవాలి.
తుపానులతో సంబంధం లేకుండా వర్షా కాలంలో దేశంలోని అన్ని ప్రాంతాలలోను వర్షాలు సాధారణంగా, సమానంగా పడకుండా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ, కొన్నిప్రాంతాల్లో తక్కువగానూ పడుతున్నాయి. అధిక వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వస్తున్నాయి. ఉదాహర ణకు 2024లో సెంట్రల్ పెనిన్సులార్ ఏరియాస్‌లో ఎక్కువగానూ ఈశాన్య ప్రాంతాలలో తక్కువగానూ వర్షాలు నమోదయినాయి. విపరీత వాతావరణ పరిస్థితులను చూస్తే, 2024 సంవత్సరంలో 274 రోజులలో దాదాపు 255 రోజులు ఈ విపరీత వాతావరణ పరిస్థితుల వల్ల భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు పడి దాదాపు 1900 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని వాతావరణ శాఖ పేర్కొన్న ట్లుగా నివేదికలు చెబున్నాయి. అలాగే తుపానుల సంఖ్య చూస్తే 2024లో 12 సంభవించాయి. ఇది సరాసరి ఒక సంవత్సరంలో నమోదైన 11.2 తుపానుల కంటే ఎక్కువే. వీటిలో 4 అత్యంత తీవ్రమైనవని చెప్పారు.
వాతావరణంలో మార్పులను గమనించి మనకు సూచించే శక్తి సామర్ధ్యాలను భారత వాతావరణ పరిశోధన విభాగం గణనీయంగా అభివృద్ధి పరచుకొంది. ఇవి అత్యాధునికమైనవి, దేశంలో తయారైనవి కూడా. దీనినే ‘‘డెసిషన్ సపోర్ట్ సిస్టం అండ్ మల్టీ మోడల్ ఎన్సెంబ్లె ఫోర్ కాస్టింగ్ సిస్టం’’ అంటారు. దీనిద్వారా వాతావరణంలోని తీవ్రతర మార్పులను కచ్చితంగా నిర్ధారించి సరైన, తగిన సూచనలను ప్రభుత్వానికి, ప్రజలకు ఇవ్వడంలో వాతావరణ విభాగం కీలక పాత్ర పోషిస్తోంది. తద్వారా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఆస్తి, ప్రాణనష్టాలు తగ్గించడానికి లేదా నివారించడానికి వీలవుతోంది. ఒక్కొక్కసారి వాతావరణ విభాగం అంచనాలు తప్పవచ్చు. అయితే ఈ వ్యత్యాసాలు అనుమతించిన పరిధుల (వితిన్ అక్సెప్టబుల్ మార్జిన్ అఫ్ ఎర్రర్) లోనే ఉండడం మన వాతావరణ విభాగం ఉత్తమ కుశలతా ప్రమాణాలను వెల్లడిస్తున్నది. దీనిద్వారా వాతావరణ విభాగం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, ఇతర సంబంధిత సంస్థలతో అనుసంధానమై వాతావరణ సంబంధ విపత్తుల గురించి ముందే హెచ్చరికలు (అలెర్టస్), సైక్లోన్స్, హెవీ రైన్స్‌టైమ్స్‌లో ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయడం వల్ల ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు, సహాయక చర్యలు తీసుకోవడానికి వీలుపడుతోంది. అయినా ఒక్కొక్కసారి తీవ్ర నష్టాలు తప్పడం లేదు. దీన్ని ప్రకృతి ప్రకోపంగా పరిగణించ వచ్చు. అయితే వాతావరణంలో విపరీత మార్పులకు పెరుగుతున్న వాతావరణ కాలుష్యం ఒక కారణమని అంగీకరించాలి. దానివల్ల సముద్రంలో ఉష్ణోగ్రతలు పెరిగి, తుపానులు, వానలు, వరదలు సంభవించి, ప్రకృతి ప్రకోపానికి ఒక ముఖ్య కారణం.
తుపానులూ, తత్సంబంధిత వర్షాలూ, వరదలూ ప్రపంచ దేశాల సముద్రతీరాలలోను సంభవిస్తాయి. కాబట్టి ప్రపంచం దృక్పధం (గ్లోబల్ వ్యూ) ఎలా ఉందో గమనించాలి. వాటిని భూమిపైకి ప్రయాణించే ఉష్ణ మండల తుపానులు (ల్యాండ్ ఫాలింగ్ ట్రాపికల్ సైక్లోన్స్) అంటారు. ఇవి ఎక్కువగా దేశాలకు ఉత్తరంలో ఉన్న సముద్రం వల్ల వస్తాయి. మన దేశానికి తూర్పు ఉత్తరాన, పశ్చిమ ఉత్తరాన రెండూవైపులా సముద్రం ఉండటం వల్ల ఉష్ణ మండల తుపానులు (ట్రాపికల్ సైక్లోన్స్) ఎక్కువే. అంచనాల ప్రకారం ప్రపంచంలో సంభవించే ల్యాండ్ ఫాలింగ్ ట్రాపికల్ సైక్లోన్స్‌లో దాదాపు 5 శాతం మన దేశంలోనే సంభవిస్తాయట. విపరీత వానలు, వరదలు తీర ప్రాంత భూమిమీద సంభవించడం ఈ ట్రాపికల్ సైక్లోన్‌ల ప్రత్యేకత.
వర్షాలు, తుపానుల గురించి చెబుతుంటే వినిపించే పేర్లు ఎల్ నినో-లా నినో. వీటి ప్రభావాలు (ఎఫెక్టస్) ఏమిటి? ఎల్‌నినో అంటే వర్షభావ పరిస్థితులు. దీనివల్ల భూమి ఉపరితలం నుంచి వేడి గాలులు వీచి సముద్రాల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. తద్వారా సముద్ర పీడనాల్లో మార్పులు సంభవించి తుపానులు, వర్షాలు, వరదలు వస్తున్నాయి. ఈ ఎల్‌నినోలకు పెరుగుతున్న వాతావరణ కాలుష్యం దోహదం చేస్తోందని అంచనా. అలాగే లానినో అంటే కొన్ని ప్రాంతాల్లో అతి శీతల పరిస్థితులు ఏర్పడి అధిక వర్షపాతం ఏర్పడడం. మనదేశంలో ఎల్‌నినో, లా నినో పరిస్థితులు కూడా విపరీత వాతావరణ విపత్తు లేర్పడడానికి కారణాలుగా భావించవచ్చు.
కరుగుతున్న హిమనీ నదాలవల్ల క్లౌడ్ బరస్ట్, వానలు, వరదలు కూడా మన దేశంలో సంభ వించడం ఈ మధ్య కాలంలో పరిపాటి అయింది. ఇలా అనేక కారణాల వల్ల మన దేశంలోని వివిధ ప్రాంతాలు ఆకస్మిక -అత్యధిక వర్షపాతంతో వరదలకు నెలవుగా మారింది. అత్యధిక వర్షపాతం తద్వారా వచ్చే వరదల సమస్యను ఎలా అధిగామించవొచ్చునన్నదే ఇప్పుడు ప్రశ్న. ఈ సమస్యను ఎలా ఆధిగమించడం అన్నది మనకు పెను సవాలు. దీనిని రెండు విధాలుగా ఎదుర్కొనవచ్చు అన్నది ఒక అభిప్రాయం.
మన పురాణాల్లో అగస్త్యుడు సముద్రాన్ని ఔపొశన పట్టినట్లు, పరశురాముడు సముద్రాన్ని గీత గీసి వెనుకకు పంపినట్లు, శ్రీరాముడు సముద్రాన్ని ఎండబెట్టేస్తానని బెదిరించినట్లు ప్రస్తావనలు ఉన్నాయి. అంటే వారు ప్రకృతి మీద సముద్రం మీద పూర్తి నియంత్రణ కలిగిన శక్తిమంతులు. ఈ కలియుగంలో అంతటి శక్తిమంతులను ఊహించలేం. మనం ప్రకృతిని శాసించలేం కాబట్టి ప్రకృతిని గౌరవించి కాలుష్యం తగ్గిస్తే కొంతవరకు ఈ ఆకస్మిక తుపానులు, వరదలు తగ్గించవచ్చు. ఇంతకు మించి మనం వాతావరణాన్ని నియంత్రించలేం. మరి రెండో పద్ధతి ఏమిటి?
మనం భవిష్యత్తులో ప్రణాళికాబద్ధంగా గ్రామాలు, పట్టణాలు, నగరాలు నిర్మించుకుంటే ఇంకా ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో సమూల మార్పులు చేసి ఆకస్మిక వర్షాలు, వరదలు వచ్చినా ఆ నీరు పరిసరాలను ముంచేయకుండా మనం ఏర్పరచిన మార్గా గుండా ప్రవహించి దగ్గరలోని నదుల ద్వారా సముద్రం లో కలిస్తే ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఆస్తి, ప్రాణనష్టాలను తగ్గించినవారం కాగలము. లేదా నివారించిన వారం కూడా కాగలం. ఇక్కడ ప్రస్తావించిన కొన్ని ఉదాహరణలు సమస్యను అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడవచ్చు.
గత కొద్ది సంవత్సరాలుగా హైదరాబాదు -సికింద్రాబాద్ జంటనగరాలలో ఏ కొద్దిపాటి వర్షం పడినా రోడ్లు జలమయమవడం, డ్రైనేజీలు పొంగి మురికి కూపాలుగా మారడం, కాలనీలు మునిగి పోవడం, కార్లు, బైకులు కొట్టుకుపోవడం చూస్తున్నాం. దీనికి కారణం జనాభా పెరగడం, చెరువులు-కుంటల విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడం. నిజానికి జనాభా పెరిగితే దానికి అనుగుణంగా ఈ జలాశయాల విస్తీర్ణత, నగర డ్రైనేజీ వ్యవస్థ పెరిగి ఉండాల్సింది. కాని పరిస్థితి తారుమారయింది. అందుకే వర్షమొచ్చినపుడు కాలనీలు మునిగిపోవడం, సామాన్య ప్రజలు సర్వం కోల్పోవడం జరుగుతోంది. మూసీ నది పరిస్థితి గమనిస్తే ఒక నాటి విస్తీర్ణమెంత, ఈనాటి విస్తీర్ణమెంత? మూసీని రెండువైపులా ఆక్రమించి, మధ్యలో బస్టాండ్లు కట్టి విస్తీర్ణం తగ్గిస్తే ప్రక్క కాలనీలు మునగక ఏమౌతుంది? ఇలాంటి మానవ తప్పిదాలు జరుగుతుంటే మౌనం వహించి ప్రకృతిని నిందిస్తే ఏమి లాభం? అలాగే 2024లో విజయవాడ బుడమేరు పొంగి పలు కాలనీలు ఊహించని పరిమాణంలో మునిగి పోలేదా? ప్రజలు సర్వస్వం కోల్పోలేదా? బుడమేరు పొంగినపుడు వరదలను తట్టుకోవడానికి ఉన్న వరదమైదాన ప్రాంతం ఆక్రమణలకు గురై ఈ దుస్థితి రాలేదా? ఇది మానవ తప్పిదం కాదా? నిన్న, మొన్న వచ్చిన మొంథా తుపాను ఫలితంగా హన్మకొండ-వరంగల్ పూర్తిగా మునిగిపోలేదా? దీనికి అసంబద్ధ పట్టణీకరణ కారణం కాదని చెప్పగలరా? ఇలా ఎన్నో ఉదాహరణలున్నాయి.
ఇవే పరిస్థితులు దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో ఉన్నాయి. ఇలా పరిశీలిస్తే ప్రకృతి వైపరీత్యాలకు దీటుగా జరుగుతున్న మానవ తప్పిదాలు వరద పరిస్థితులు తీవ్రతరం కావడానికి మూలం కాదా అనే ప్రశ్న తలెత్తుతుంది? నానాటికీ పెరుగుతున్న ఆకాశహర్మ్యాలు, మెట్రో ఫ్లైఓవర్లు (ఈమధ్య ఫ్లైఓవర్ ల మీదకూడ వరదలొస్తున్నాయి) విశాలమైన రోడ్లు, పుట్టగొడుగుల్లా వెలుస్తున్న మాల్‌లు, అవసరం ఉన్నా లేకపోయినా నిర్మిస్తున్న గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్‌ని చూస్తూ మనం అభివృద్ధి పథంలో దూసుకు పోతున్నామని మురిసిపోతున్నాం. కాని వీటి మధ్యలో నీరు ఇంకాల్సిన భూభాగం లుప్తమవడం, వర్షపునీరు పారి దూరప్రాంతాలకు తీసుకెళ్లే నాలాలు క్రుంగి, కృశించి, అదే నీరు మురికితో కలిసి అవే ఆకాశహర్మ్యాల ప్రాంతాలలో, విశాలమైన-అందమైన రోడ్లమీద, కాలనీలలోకి, గేటెడ్ కమ్యూనిటీల్లోకి ప్రవేశించినపుడు విపత్తు నిర్వహణగా తూతూ మంత్రంగా చర్యలు చేపడితే ఏమిలాభం? కాబట్టి ఇప్పటికైనా సమగ్ర ప్రణాళికలను చేపట్టి, జలాశయాలను విస్తరించి, నీటి/మురుగు కాలువలను విస్తరించి వర్షపునీరు సునాయాసంగా దూరప్రాంతాలకు తరలిపోయేటట్లు చర్యలు తీసుకోవాలి. పట్టణాలను ప్రణాళిక బద్ధంగా విస్తరించే చర్యలు, కొత్త గ్రామాలూ, పట్టణాలూ ప్రణాళికాబద్ధంగా నిర్మించే ఆలోచనలూ ఉంటే అకాల, ఉధృత వర్షాలతో వచ్చే వరదలనుండి మనలను మనం కాపాడుకోగలం. ఈ సమూల మార్పుకై వేచి చూద్దాం.
‘‘సర్వే జనాః సుఖినోభవంతు’’
మహావాది రామకృష్ణ