‘వృత్త పత్రమే నామ ఛపేగా పహనూంగా

స్వాగత సుమహార్‌ ‌చోడ్‌ ‌చలో యహ క్షుద్ర భాననా’

(స్వరాజ్య సంగ్రామంలో ఆహుతి అయితే భారతమాత చరణాల వద్ద పుష్పంలా రాలిపోతాం. స్వాతంత్య్రం ఖాయమయితే స్వతంత్ర దేశంలో స్వేఛ్ఛ అనుభవిద్దాం. అంతేగానీ, ఈ సంగ్రామంలో పాల్గొన్న ధన్యులుగా ఒక్క రూపాయి కూడా ప్రతిఫలం కోరం) ఆ హిందీ ప్రతిజ్ఞను ఆరోజులలో అటల్‌ ‌బిహారీ వాజపేయి, పండిట్‌ ‌దీనదయాళ్‌ ఉపాధ్యాయ వంటి మహామహులెందరో చిత్తశుద్ధితో చేశారు. అలాంటి వారిలో ఒకరు ఇంతకాలం మన మధ్యనే మౌనంగా జీవన పోరాటం సాగించి కన్నుమూశారు. ఆయనే బుద్ధవరపు వేంకటరత్నం.

బుద్ధవరపు సుబ్రహ్మణ్యం-బాపనమ్మ దంపతు లకు నవంబరు 17,1925న తూర్పు గోదావరి జిల్లా నాయకంపల్లిలో వేంకటరత్నం జన్మించారు. సామర్లకోట బోర్డు హైస్కూల్‌, ‌రాజమండ్రి గవర్న మెంటు ఆర్టస్ ‌కాలేజీలలో చదువుకున్నారు. చిన్ననాటి నుంచే దేశభక్తి భావాలు అంకురించాయి. భారతమాత అంటే ఆరాధన. ఫిబ్రవరి 7,1957వ తేదీన సూర్యమ్మతో (తటవర్తి వారి ఆడపడుచు) వివాహం.

1936 నాటి మాట. కాకినాడ పిఠాపురం మహారాజా కళాశాల, ఉన్నత పాఠశాల రఘుపతి వేంకటరత్నంనాయుడు ఆధ్వర్యంలో నడిచేవి. అప్పుడు బుద్ధవరపు వేంకటరత్నం ఏడవ తరగతి చదివేవారు. రఘుపతి వేంకటరత్నం నాయుడు కళాశాలకు ఎదురుగా ఉన్న బ్రహ్మసమాజ మందిరంలో 10-15 ఏళ్ల విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు. తాను మూడు ముఖ్య విషయాలు అక్కడే నేర్చుకున్నానని గుర్తు చేసుకుంటూ ఉండేవారు వేంకటరత్నం. అవి- కథలు చెప్పడం (చెప్పడమే, రాయడంకాదు), వ్యాస రచన, సభా పిరికిని పోగొట్టుకుని ఉపన్యాస కళను అభ్యసించడం. ఇవే పదేళ్ల తర్వాత ఎంతో ఉపకరించి, పేరు తెచ్చిపెట్టాయనేవారు.

వేంకటరత్నం తండ్రి సుబ్రహ్మణ్యం గురించి చెప్పుకోవాలి. ఆయన సైన్యంలో పనిచేశారు. 1917లో మొదటి ప్రపంచయుద్ధంలో పాల్గొన్నారు. రెండవ ప్రపంచ యుద్ధకాలానికి సైన్యంలోనే ఉన్నా రైల్వే విభాగంలో పనిచేశారు. సుబ్రహ్మణ్యం ప్రభుత్వ కొలువులో చేరేవరకు వంశ పారంపర్యంగా వచ్చిన యర్రమిల్లి (గండేపల్లి మండలం) కరణీకం (పదేళ్లు) చేశారు. తరువాత వెంకటరత్నం పినతండ్రి సుబ్బరాజు 20 ఏళ్లు చేశారు. బీఏ పూర్తి చేసిన తరువాత 1946లో అప్పటి పెద్దాపురం ఆర్‌డీఓ ‘రావుసాహెబ్‌’ ‌బుద్ధవరపు పాపరాజుపంతులు ఆ కరణీకం వేంకటరత్నంకు అప్పగించారు. రూ.5.25పై జీతానికి చేరిన వేంకటరత్నం కరణీకం పోయేంతవరకు అంతే జీతానికి పనిచేశారు. అటు కరణీకం, ఇటు ఆర్‌ఎస్‌ఎస్‌కు సేవలు అందించారు.

1940వ దశకంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌లో (ఆర్‌ఎస్‌ఎస్‌)‌లో చేరిన వేంకటరత్నం, 1942 నాటి క్విట్‌ ఇం‌డియా ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పట్లో రాజమండ్రిలో సత్తిరాజు విశ్వనాథం, ఇందుకూరి విశ్వనాథరాజు, ఊలపల్లి రామచంద్రమూర్తి, దినవహి వీర్రాజు, తాకిరాజు బాలవెంకటశేషగిరి రావు, సత్యవోలు వెంకట భాస్కర ఉమామహేశ్వర వర ప్రసాదమూర్తి, ప్రయాగ సుబ్రహ్మణ్యం సంఘంలో వారి సహచరులు. 1942-1946 మధ్య నండూరి రామమోహనరావు (ఎడిటర్‌, ఆం‌ధ్రజ్యోతి), కూచిమంచి సత్యసుబ్రహ్మణ్యం (ఎడిటర్‌, ఆం‌ధ్ర జనతా, ఆంధప్రభ, కోస్తావాణి), వేంకటరత్నం రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో బీఏ వరకు సహాధ్యాయులు. ముగ్గురూ వాడ్రేవు వారి ఉచిత విద్యార్థి వసతిగృహంలో ఉన్నారు.

 1944 నుంచి సంఘ ప్రచారక్‌గా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంఘ శిక్షకులకు శిక్షణ శిబిరాలు నిర్వహించారు (అప్పట్లో వేంకటరత్నం నేతృత్వంలో విశాఖలో జరిగిన శిబిరంలో వారి నుంచి సంఘ మూల సిద్ధాంతాలు, నియమాలు నేర్చుకున్నానని నగర బీజేపీ ప్రముఖులు, మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌స్టాండింగ్‌ ‌కమిటీ చైర్మన్‌గా వ్యవహ రించిన వెంపరాల రామకృష్ణారావు ఓ సందర్భంలో ఈ వ్యాసకర్త వద్ద ప్రస్తావించారు). 1948లో ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధించిన సమయంలో వేంకటరత్నం విజయవాడ, కైకలూరు జైళ్లలో ఉన్నారు. బందరు కోర్టులో న్యాయపోరాటం చేసి బయటకు వచ్చారు.

 దీనదయాళ్‌ ఉపాధ్యాయ సంపాదకత్వంలో ‘రాష్ట్రధర్మ’ మాసపత్రికకు తోడుగా ఇతర భారతీయ భాషల్లో ఏకకాలంలో సంఘ పత్రికలు తీసుకురావా లని తలచినప్పుడు తెలుగులో ‘జాగృతి’కి వేంకట రత్నం సంపాదకులయ్యారు. మాచిరాజు హనుమంత రావు గారు పబ్లిషర్‌. ‌హిందీలోనే ‘పాంచజన్య’ వారపత్రిక ఎడిటర్‌గా వాజపేయి నియమితు లయ్యారు. 1949లోనే వ్యవస్థాపక సంపాదకులుగా శతావధాని చెళ్లపిళ్ల వేంకటశాస్త్త్రి, ‘దేశభక్త’ కొండ వెంకటప్పయ్య పంతులు, ఉన్నవ లక్ష్మీనారాయణ, విశ్వనాథ సత్యనారాయణ, అడివి బాపిరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, జటావల్లభుల పురుషోత్తం, మధురాంతకం రాజారాం, వంటి ప్రముఖుల చేత సందేశాలు తెప్పించారు. కొందరి చేత కథలు, వ్యాసాలు రాయించారు.

స్వతంత్ర భారత రెండో ప్రధాని లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రి, రెండవ రాష్ట్రపతి ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణ పండితులను కలుసుకున్న నాటి జ్ఞాపకాలని ఆయన అపురూపంగా చెప్పేవారు. 1966లో లాల్‌ ‌బహదూర్‌శాస్త్రి హైదరాబాదు వచ్చినప్పటి మాట. వేంకటరత్నం ‘కృష్ణాపత్రిక’ ఉప సంపాదకుడు. తాను, సంపాదకులు ముదిగొండ సుబ్రహ్మణ్యశర్మ ‘కృష్ణాపత్రిక’ను తీసుకెళ్లి శాస్త్రి గారికి అందించారు. పత్రికను అందుకున్న శాస్త్రిగారు స్వాతంత్య్ర సమరంలో ఎందరో యువకులక• స్ఫూర్తినిచ్చి ప్రోత్సహించిన పత్రిక అన్నారట. సర్వేపల్లి రాధాకృష్ణ పండితులు రాష్ట్రపతిగా ఉన్నరోజుల్లో వేంకటర్నతం, ఆయన తమ్ముడు హనుమంతు రావూ న్యూఢిల్లీ వెళ్లినప్పుడు వారిని చూసేందుకు వెళ్లారు. ఆయనే స్వయంగా వచ్చి ‘మీరు విశాఖపట్నం బుద్ధవరపు వారా?’ అని అడిగారట. వెంటనే ‘కుతుకులూరు బుద్ధవరపు వారం’ అన్నారట వేంకటరత్నం. ‘కాకినాడలో కూడా బుద్ధవరపు వారి ప్రత్యేకతను చాటుతూ బుద్ధవరపు వారి సందు ఉంది’ అని గుర్తు చేసుకున్నారట. ‘ఏమయినా పని ఉందా’ అని ప్రశ్నించారటాయన. ‘కేవలం తమను చూడాలనే వచ్చాం’ అన్నారట సోదరులు.

 సమరయోధుడిగా, స్వయంసేవకుడిగా, పాత్రి కేయుడిగా, కథ, నవలల రచయితగా, వివిధ పత్రికలలో ధారావాహికలు రాసిన రచయితగా, స్వాతి కాలమిస్ట్‌గా విశేష సేవలు అందించారు బుద్ధవరపు వే•ంకటరత్నం. 1942 నుంచి 1969 వరకు వారి కథలు, ధారావాహిక నవలలు, వ్యాసాలు భారతి, సారంగి, ఆంధ్రపత్రిక, ఆంధప్రభ, ఆంద్రజ్యోతి పత్రికలలో అచ్చయ్యాయి. 50 నుంచి 60 వరకు కథలు రాశారు. భారతి మాస పత్రికలో గ్రంథ సమీక్షలు చేసేవారు. ‘శండిల’ కలం పేరుతో రచనలు చేసేవారు. విశేషమేమంటే.. ఆంధ్రపత్రిక సచిత్ర వార వత్రిక 18-3-1953 నాటి సంచికలో వారు రాసిన ‘కరిణీకం’ పెద్ద కథలో కరణాల లౌక్యం గురించి చెప్పకనే చెప్పేరు. 1949-50లలోనే వే•ంకటరత్నం కథలు రేడియోలో ప్రసారమయ్యాయి.

ఎమర్జెన్సీలో (1975) వేంకటరత్నం గారిని కాకినాడ జైలులో నిర్భంధించారు. కానీ వారం తరువాత విడుదల చేశారు. ఆంధ్ర రాష్ట్ర గ్రామోద్యోగుల సంఘం కార్యదర్శి (1956-87)గా 30 ఏళ్ల• సేవలు అందించారు. వంశ పారంపర్య కరణాల వ్యవస్థ రద్దు నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ ‌వద్దకు రాష్ట్ర గ్రామోద్యోగుల సంఘం కార్యదర్శిగా తాను, ఆనాటి సంయుక్త కార్యదర్శి ద్రోణంరాజు సత్యనారాయణ చర్చలకు వెళ్లి గ్రామాలలో ఆ వ్యవస్థ అవసరం గురించి వాదించారు. కనీసం ప్రత్యా మ్నాయ వ్యవస్థ ఏర్పాటు వరకు కరణం, మునసబు లను కొనసాగించాలని చేసిన విజ్ఞప్తి ఫలించలేదు. తరువాత తీసేసిన కరణాలలో అర్హులైన వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా వీఏఓలుగా తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించినా వే•ంకటరత్నం మళ్లీ ఆ వ్యవస్థ జోలికి పోలేదు. హైదరాబాద్‌ ‌వచ్చి పూర్తి స్థాయి పాత్రికేయ వృత్తిని కొనసాగించారు. అప్పటి వరకు స్వయంసేవకుడిగా సేవలు అందిస్తూ, కరణీకం చేస్తూ పాత్రికేయ వృత్తిని ప్రవృత్తిగా ఎంచుకున్న వే•ంకట రత్నం పూర్తి సమయం పాత్రికేయుడిగా జీవనయాత్ర ప్రారంభించారు. ఆంధప్రభలో, న్యూస్‌ ఏజన్సీలలో రెహనుమా-ఏ-దక్కన్‌, ‌సియాసత్‌, ‌సాగే దక్కన్‌, ‌హమారా ఆవామ్‌ ఉర్దూ దిన పత్రికలలో రిపోర్టర్‌గా పనిచేశారు. 2007వ సంవత్సరానికి ఉత్తమ తెలుగు రచయితకి ఇచ్చే బహుమతిని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వేంకటరత్నంకు ఇచ్చింది.

జనవరి 1, 2006న పనులు ముగించుకుని తిరిగి వస్తూండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలు తీసి వేయవలసి వచ్చింది. ఆ ప్రమాదంలోనే నాలుక చీలి ముక్కలైనా, మాట ముచ్చట అంతంత మాత్రమే అయినా (అనర్గళంగా ఉపన్యాసాలు ఇవ్వడమే కాకుండా పండిట్‌ ‌దీనదయాళ్‌ ఉపాధ్యాయ, వాజపేయి వంటి పెద్దలు ఆంధ్ర రాష్ట్ర పర్యటనలో ఆ నేతల హిందీ ప్రసంగాలను తెలుగులోకి అనువదించిన గంభీర గళం వారిది) మొక్కవోని ధైర్యంతో జీవించారు. అప్పటికి చాలాకాలం క్రితమే వారి శ్రీమతి కన్నుమూశారు. ఆ పరిస్థితులలో పాత్రికేయ వృత్తికి స్వస్తి చెప్పక తప్పలేదు. దాదాపు రెండు దశాబ్దాలు మంచానికే పరిమితమయ్యారు. వే•ంకటరత్నం ఒక యోగి. కష్టాలను అనుభవిస్తున్నా బయటకు వ్యక్తం చేయని స్థితప్రజ్ఞులు.

– బీఎస్‌ ‌రామకృష్ణ, (సీనియర్‌ ‌జర్నలిస్ట్)


ప్రాంతీయ భాషలలో పత్రికలు తేవాలని నిర్ణయించిన పూజ్య గురూజీ, తెలుగు పత్రిక సంపాదకత్వ బాధ్యతను బుద్ధవరపు వేంకటరత్నం గారికి అప్పగించారు. ఆయన వారి నమ్మకానికి అనుగుణంగా పత్రికను తీర్చిదిద్దారు. సంపాదకత్వ బాధ్యత తొలుత కొంత భారమనిపించినా, పరమపూజ్య గురూజీ ప్రోత్సాహంతో నిభాయించుకొచ్చారు. అనంతరం కాలంలో ప్రధాన మంత్రిగా సేవలు అందించిన అటల్‌ ‌బిహారీ వాపేయ్‌ ‌సంపాదకత్వంలో ‘పాంచజన్య’, దీనదయాళ్‌ ఉపాధ్యాయ మార్గదర్శనంలో ‘రాష్ట్రధర్మ’ ఏక కాలంలో ప్రారంభమయ్యాయి. పూజ్య గురూజీ అడుగుజాడల్లో నడిచిన సంపాదకత్రయం తమ ప్రతిభను చాటుకున్నారు. వారికి ఇదే నా నివాళి..

– వి. భాగయ్య, అఖిల భారత కార్యకారిణి సభ్యులు, ఆర్‌ఎస్‌ఎస్‌


‌పరమ పూజనీయ గురూజీ ప్రేరణతో 1940వ దశకంలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ ‌సంఘ్‌లో చేరిన బుద్ధవరపు వేంకటరత్నం, గురూజీ ఆదేశాల మేరకు ‘జాగృతి’ జాతీయ వారపత్రిక వ్యవస్థాపక సంపాదకుడిగా బాధ్యతలు స్వీకరించారు. పత్రిక రచనలో ఏ మాత్రం అనుభవం లేని తాను అంత పెద్ద బాధ్యత నిర్వహించగలనా? అని సందేహించినప్పుడు ప్యూ గురూజీ భుజం తట్టారు. ఆ ధైర్యంతోనే తమ కర్తవ్యాన్ని విజయవంతంగా నిర్వహించారు. జాగృతితోపాటు ఆంధ్రపత్రిక, భారతి వంటి ప్రముఖ పత్రికలకు ‘శండిల’ కలం పేరుతో ఆనేక రచనలు చేశారు.

– పి. వేణుగోపాల్‌రెడ్డి, జాగృతి పూర్వ సంపాదకులు


జాగృతి వ్యవస్థాపక సంపాదకుడు బుద్ధవరపు వేంకటరత్నం పత్రికా రచయితే కాదు..స్వరాజ్య సమరయోధుడు కూడా. ఆయన క్విట్‌ ఇం‌డియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. సంపాదకత్వం బాధ్యతలు చేపట్టక ముందు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రచారక్‌గా సేవలు అందించారు. భండారు సదాశివరావుతో కలసి పత్రికను తీర్చిదిద్దారు. తన చేతుల్లో పురుడు పోసుకొన్న పత్రిక 75 ఏళ్ల వేడుకను చూచిన ఏకైక సంపాదకుడు వేంకటరత్నం గారే కావచ్చు. పూజ్య గురూజీతో అడుగులు వేసి, ఈ తరంతో •జీవించిన సంపాదక శిఖరం ఒరిగిపోయింది.

– సిహెచ్‌ ‌సంజీవ, అధ్యక్షులు, జాగృతి ప్రకాశన్‌ ‌ట్రస్ట్

‌వేంకటరత్నం 1948 నుంచి 1957 వరకు సంపాదకులుగా వ్యవహరించారు. ఈయనను అరెస్టు చేసిన తరువాత భండారు సదాశివరావు కొద్దికాలం ఆ బాధ్యతలు చూశారు. తరువాత ఆయన కూడా అరెస్టయ్యారు.


నాతో ఓనమాలు దిద్దించారు

ఇలాంటి సమయం ఇలా వస్తుందని నేను అసలు ఊహించలేదు. బాగా గుర్తు. మార్చి 22, 1986. ‘సమయం’ అనే దినపత్రికకు ఎంపికయిన వారంతా ఆ రోజు మొదటిసారి ఆజామాబాద్‌ (‌హైదరాబాద్‌) ‌కార్యాలయానికి వెళ్లాం. పరిచయ కార్యక్రమం జరిగింది. పత్రిక అధిపతి మేచినేని కిషన్‌రావు, ఎడిటర్‌ ‌పన్యాల రంగనాథరావు, న్యూస్‌ ఎడిటర్‌ ‌నిడమర్తి రాజశేఖర్‌, ‌వారి పక్కనే ఒక పెద్దాయన. మల్లెపువ్వులా పంచె లాల్చీ. మిగిలిన వారిని పరిచయం చేశాక కిషన్‌రావు చెప్పారు- ఇక్కడ మీకు మూడు నెలలు శిక్షణ ఇస్తారు. అది తృప్తికరంగా లేకపోతే, సమయం ఇంకాస్త పెరుగుతుంది. ఆ శిక్షణ అంతా మన చీఫ్‌ ‌సబ్‌ ఎడిటర్‌ ‌బుద్ధవరపు వెంకట రత్నం గారు ఇస్తారు అన్నారు, ఆయనను చూపుతూ. అదే ఆయన ప్రథమ దర్శనం. ఆ బృందంలో నేనూ ఉన్నాను. కాబట్టి పత్రికా రచనలో వెంకటరత్నం గారి దగ్గరే నేను ఓనమాలు దిద్దాను. మూడు మాసాల శిక్షణ. నిత్యం పాతకాలం ప్రధానోపాధ్యాయుడు గుర్తుకొచ్చేవారు. జాగృతి వారపత్రిక వ్యవస్థాపక సంపాదకులు వారేనని నాకు ఆరోజు తెలియదు. అలాగే, అది జరిగిన 32 సంవత్సరాల తరువాత వారు నిర్వహించిన బాధ్యతను నేను తీసుకుంటానని కూడా ఏనాడూ అనుకోలేదు. ఆయన కథకుడు. అందుకే కథ గురించి ఆ శిక్షణలో మాకు చాలా చెప్పారు. అలాగే పుస్తకాలు, ప్రముఖు పత్రికా రచయితల ప్రతిభ ఇలా ఎన్నో విషయాలు చాలా హాయిగా చెప్పేవారు. కానీ భాష విషయం వచ్చేసరికి ఎక్కడ లేని కరుకుతనం కనిపించేది. ఒక్క జ్ఞాపకం గురించి: శిక్షణలో ఉన్న మమ్మల్ని సాయంత్రం బయటకు పంపి, ఏదైనా ఒక వార్త కథనం, వార్త సేకరించి, రాత్రి ఇంటి దగ్గరే రాసి మరునాడు తీసుకుని రమ్మనేవారు. నేనూ మరో ఇద్దరు ముగ్గురు కలసి త్యాగరాయ గానసభకు వెళ్లాం. ప్రఖ్యాత రచయిత ఆత్రేయకు సత్కారం. వార్తా కథనం రాసి వారికి చూపించాను. అసలు హెడ్డింగ్‌ ‌చూడగానే భగ్గు మన్నారు. ‘ఏమిటీ శీర్షిక? ఏమిటిది? ఇదేం ధోరణి? ఓ పని చేయండి! 120 పాయింట్‌లో (పతాక శీర్షికల అక్షరాల పరిమాణం) పెట్టి (పేజీ) పైన పెట్టించండి!’ అన్నారు, ముఖం పక్కకు తిప్పేసుకుని. నేను ఖిన్నుడనయ్యాను. తరువాత న్యూస్‌ ఎడిటర్‌ ‌గారికి చూపిస్తే, దానికి వేరే కారణం ఉందిలే అన్నారు. ఇంతకీ ఆ శీర్షిక, ‘రంగస్థల రచయిత గానే మరణిస్తా!’. కానీ కథల గురించి వివరిస్తున్న ప్పుడు నేను ఆయన దృష్టిలో పడ్డాను.ఆయన కథల పేర్లు చెప్పి, రచయితలు ఎవరో చెప్పమనేవారు. నేను ఎక్కువ పేర్లు చెప్పాను. నాకో ఇతివృత్తం చెప్పి, రాసి తీసుకు రమ్మన్నారు. ఓ ఆదివారమంతా కూర్చుని రాసి చూపించాను. ఆయన ముఖంలో కొద్దిపాటి తృప్తి.

జాగృతిలో బాధ్యతలు తీసుకున్న తరువాత వారిని కలిశాను. హైదరాబాద్‌లోనే అలకాపురిలో ఉన్నారు, కొడుకు శ్రీనివాసరావుగారితో. సీనియర్‌ ‌స్వయంసేవక్‌ ‌పున్నారావుగారూ, జాగృతి సహోద్యోగి వినోద్‌ ‌సహకారంతో సాధ్యమైంది. మంచం మీద నుంచి లేచి కూర్చోగలరు. దిగలేరు. అలాంటిది, కొడుకూ, కోడలూ, మనుమడూ ఉద్యోగాలకు వెళ్లిపోతే మళ్లీ సాయంత్రం వరకు వెనకగదిలో ఒంటరితనం. నేనో కథని ఈ వాక్యాలతో మొదలుపెట్టాను, అవి సరిగ్గా వారి స్థితిని అద్దంలో చూపిస్తాయి, ‘నేనూ.. నా చుట్టూ మౌనం. మౌనం.. దాని చుట్టూ నేను’. ‘సమయం’ పత్రికలో ఉన్న ఆ ఐదు మాసాల (మూడు మాసాల శిక్షణ, రెండు మాసాలు పత్రిక పని, తరువాత మూతపడింది)లో ఎప్పుడూ మల్లెపువ్వులా కనిపించిన ఆయనలో చాలా మార్పులే చూశాను, భౌతికంగా. రోడ్డు ప్రమాదంలో ఒక కాలు పోయింది. ఇంకేదో కారణంతో నాలుక కొంత కత్తిరించారు. దాదాపు తొంభయ్‌ ఐదేళ్ల వయసులో ఈ పరిస్థితి. బహుశా ఆయన జీవితంలోని అద్భుత జ్ఞాపకాలూ, స్థిరచిత్తం ఆయనను ఒంటరితనం నుంచి రక్షించి ఉండాలి. అటల్‌ ‌బిహారీ వాజపేయి, దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ వంటివారి సాన్నిహిత్యం మరి!

 కొన్ని పళ్లు, పంచె ఉంచిన సంచి వారి చేతిలో పెట్టి, శాలువ కప్పి పాదాలకు నమస్కరించబోయాను. తీవ్రంగా ప్రతిఘటించారాయన. మీ నాన్నగారికీ, అమ్మగారికీ తప్ప వేరే ఎవరికీ పాదాభివందనం చేయవద్దు అన్నారు, ముద్ద ముద్ద మాటలతో. మనం పెట్టే నమస్కారం కూడా మనలోని పరమాత్మకే చెందుతుంది. అందరిలోను పరమాత్మ ఉన్నాడు కదా అన్నారాయన. ‘ఈ వృత్తి మీ భిక్ష’ అన్నాను. కాదు, పరమాత్ముడి దీవెన అన్నారు. ఇది జరిగిన తరువాత సంవత్సరం వరకు ఏదో ఒకటి, కొన్ని వాక్యాలే, రాసి పంపేవారు. ప్రతి ఉత్తరానికి చివర ఒకటే ముగింపు, ‘రాయలేకపోతున్నాను. వేళ్లు కలాన్ని పట్టి ఉంచడం లేదు.’ తరువాత మరొక రెండుమూడు సార్లు కలిశాను. జాగృతి 75 ఏళ్ల సందర్భంగా వెలువరించిన ప్రత్యేక సంచిక తీసుకుని మళ్లీ అంతా వెళ్లాం. సంతోషించా రనే అనిపించింది.

ఆయన మౌనం విధించుకున్న జ్ఞాపకాల ఝరి. వారి జీవితం స్వతంత్ర భారత చరిత్ర పరిణామాలు, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రస్థానం అనే రెండు ఒడ్లను తాకుతూ సాగింది. రచనలు, పాటలు, సంఘటనలు, సమకాలికుల వివరాలు- ఏవీ ఆయన మరచిపోలేదు.

1948 డిసెంబర్‌లో జాగృతి మొదలయింది. మొదటి సంచికతోనే నిషేధానికి గురైంది. గాంధీజీ హత్య పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మీద నిషేధం ఉంది. అయినా ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన కొందరు వ్యక్తులు స్థాపించిన పత్రికకు మీరు అనుమతి ఎలా ఇచ్చారు? ఇప్పుడు ఎందుకు నిషేధించారు? అని జిల్లా కలెక్టర్‌ను ప్రశ్నించారట వే•ంకటర్నతం. మళ్లీ జనవరిలో పున:ప్రారంభమైంది. జాగృతి స్థాపన ధ్యేయాన్ని అక్షరం పొల్లు పోకుండా నిర్వర్తించినవారు వెంకటరత్నం. చాలా పిన్న వయసులోనే సంపాదకుడి బాధ్యత చేపట్టారు. తూర్పు, పశ్చిమ, కృష్ణాజిల్లాల ప్రచారక్‌గా పని చేస్తున్న వే•ంకటరత్నంకు ఒక ఉత్తరం వచ్చింది. అది సాక్షాత్తు రెండో సర్‌సంఘచాలక్‌ ‌పరమపూజనీయ గురూజీ నుంచి. తెలుగు భాషలో ‘మన’ పత్రిక స్థాపించాలని సూచన. దానికి సంపాదకత్వ బాధ్యతా మీదే అంటూ ఆదేశం కూడా. కొన్ని ప్రాంతీయ భాషల మాదిరిగానే తెలుగులోనూ పత్రిక ప్రారంభం కావాలన్న ఆశయం గురూజీది. కారణం- గాంధీజీ హత్య పేరుతో సంఘం మీద వెల్లువెత్తుతున్న అబద్ధాలకు సాధ్యమైనంత మేర, శక్తి మేరకు సమాధానం చెప్పడమే. చీకటిని తిడుతూ కూర్చోకుండా చిరుదీపం వెలిగించే ప్రయత్నం. అలా స్వతంత్ర భారతదేశ తొలితరం పత్రికా రచయితలలో ఒకరిగా వే•ంకటరత్నం నిలిచారు.ఎన్నో ప్రతికూలతల మధ్య పత్రికను నిర్విఘ్నంగా నడిపిన కలం యోధుడు కూడా ఆయనే.

గాంధీజీ హత్య, కాందిశీకుల సమస్య, కశ్మీర్‌ ‌సమస్య, పాకిస్తాన్‌ ‌యుద్ధం, నెహ్రూ ప్రభుత్వం, జనసంఘ్‌ ‌పనితీరు వంటి అన్ని అంశాలను వేంక టరత్నం సమర్ధవంతంగా విశ్లేషించారు. సాహిత్యానికి వారు ఇచ్చిన ప్రాధాన్యం విశేషంగా ఉంటుంది. ప్రధానంగా చారిత్రక కథలకు పెద్ద పీట వేశారు. స్వయంగా ఆయనే ఎన్నో కథలు రాశారు. గొప్ప గొప్ప అనువాదాలు అందించారు. ఒకపక్క ప్రతి కూలత, మరొక పక్క వనరుల లేమి, ఉన్న వనరులైనా అందుబాటులో లేని ఆ కాలంలో ఆయన జాగృతిని అక్షరాలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భారతి, ఆంధ్ర సచిత్రవార పత్రిక, ఆంధప్రభ వారపత్రిక, చందమామ, యువ వంటి పత్రికలు రాజ్యమేలుతున్న కాలంలో గొప్ప దీక్షతో జాగృతిని ఆయన వెలువరించిన తీరు అభినందనీయం.

– డా. గోపరాజు నారాయణరావు, సంపాదకుడు, జాగృతి

About Author

By editor

Twitter
YOUTUBE