సంపాదకీయం

శాలివాహన 1947 శ్రీ విశ్వావసు కార్తిక బహుళ షష్ఠి – 10 నవంబర్‌ 2025, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


దేశం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా కుటుంబం విరగబడి త్యాగాలు చేసిందని చెప్పుకునేవారు మన ప్రజాస్వామిక వ్యవస్థలో ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తారు. కుటుంబ పాలన లేదా వంశ పారంపర్య పాలన.. బ్రాండ్‌ అంబాసిడర్లుగా చిరకాలంగా విలసిల్లుతున్నవారు మాత్రం గాంధీ-నెహ్రూ కుటుంబం వారే. అంతటి ఘనకీర్తి ఆధునిక ప్రపంచంలో ఎవరికీ లేదు. భారత పరిపాలన వారి జన్మహక్కు అనే భావనను ఆ కుటుంబం తరతరాలుగా నమ్ముతున్నది. జాతి జనుల చేత నమ్మించాలనీ చూస్తోంది. దేశంలో కుటుంబ పాలనలకీ, వంశ పారంపర్య ఏలుబడులకీ కావలసినన్ని ఉదాహరణలే ఉన్నా, గాంధీ-నెహ్రూ కుటుంబం అందుకు నమూనాగా నిలిచిపోతుంది. ఈ విషయం బిహార్‌ ఎన్నికల నేపథ్యంలో చర్వితచర్వణంగా చర్చకు వచ్చింది. ఈ చర్చను ఈసారి లేవదీసినవారు బీజేపీ లేదా ఆర్‌ఎస్‌ఎస్‌, ఇతర కాంగ్రెసేతర పక్షాలేవీ కావు. కాంగ్రెస్‌ ప్రముఖుడు, ఎంపీ శశిథరూర్‌ అక్షరబద్ధం చేసినవి.

కుటుంబ పాలన, ఆ ఆలోచన దేశ ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా పరిణమించిందని థరూర్‌ నీళ్లు నమలకుండా చెప్పేశారు. ప్రజాస్వామ్యాన్నీ, దేశాన్నీ వారసుల పాల్జేయకుండా, కాస్త ప్రతిభవైపు దృష్టి సారించవలసిన సమయం వచ్చేసిందని ఆయన ఇటీవల రాసిన ఒక వ్యాసంలో ఎలాంటి శషభిషలు లేకుండానే అభిప్రాయ పడ్డారు. ప్రాజెక్ట్‌ సిండికేట్‌ పోర్టల్‌కు రాసిన ఆ వ్యాసం శీర్షికే, భారత రాజకీయాలంటే కుటుంబ వ్యవహారం. ఇది కాంగ్రెస్‌ పార్టీకి ఎక్కడ తగలాలో అక్కడే తగిలేసింది. ఈ వయోధిక వృద్ధ పార్టీని అంటకాగుతున్న సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్‌లకి కూడా కాస్త అంటి ఉండవచ్చు. ఇప్పుడు ఆర్‌జేడీ కుటుంబం, దాని వెనకే తోక ఊపుకుంటూ కాంగ్రెస్‌ కుటుంబం బిహార్‌ ఎన్నికలే అవకాశంగా అధికారం కోసం తలకిందులుగా తపస్సు చేస్తున్నాయి.

చిత్రంగా, దేశంలో రాజ్యాంగ వ్యవస్థలనీ, ప్రజాస్వామ్యాన్నీ అధికార బీజేపీ ఛిద్రం చేస్తోందని తీరిక లేకుండా గగ్గోలు పెట్టే ఇండీ కూటమిలోనే కుటుంబ దుకాణాలు ఎక్కువ. రాజకీయ అధికారం తమ కుటుంబ జన్మహక్కు అన్న ధోరణికి నెహ్రూ కూడా అతీతుడు కాదు, ఆద్యుడేనని థరూర్‌ చెబుతున్నారు. ఇందిర, రాజీవ్‌ ఇద్దరూ దేశాన్ని ఉద్ధరించారు. ఇప్పుడు రాహుల్‌ వరసలో ఉన్నారు. భారత్‌ను కొన్ని క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కించినవారిగా ఘనత సాధించిన కాంగ్రెస్‌ ప్రధానులను సైతం రాహుల్‌ తృణప్రాయంగా చూస్తారు. ఈయన అసమర్ధత ఏనాడో తిరుగులేకుండా రుజువైంది కాబట్టి, ప్రియాంకా గాంధీ వాద్రా అనే రెండు ఇంటిపేర్ల గాంధీ – నెహ్రూ కుటుంబ వారసురాలిని కూడా ముందు జాగ్రత్త కోసం వరసలో నిలబెట్టారు. భారత రాజకీయాలను ఈ కుటుంబం కొన్ని దశాబ్దాల పాటు మర్రిచెట్టులా కమ్మేసిందన్న భావనను కూడా థరూర్‌ వ్యక్తం చేశారు. నిజానికి దేశం మీద కుటుంబ పాలన రుద్దిన గాంధీ`నెహ్రూ వంశాన్ని విమర్శిస్తూనే రాజకీయ రంగంలో స్థానం సంపాదించుకున్న కొన్ని పార్టీలు చివరికి కుటుంబ పాలననే ఆయా ప్రాంతాల మీద కూడా రుద్దాయి. సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌జేడీ, కశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌, బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌, శివసేన (ఉద్ధవ్‌), డీఎంకే, బిజూ జనతాదళ్‌ కుటుంబ పాలనను సుస్థిరం చేసుకునే కృషిలోనే ఉన్నాయి. వీరిలో చాలామంది రెండోతరం వారు ముఖ్యమంత్రు లయ్యారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌లో అయితే మూడో తరం వారు కూడా ముఖ్యమంత్రి పీఠం ఎక్కి ఆనందించారు. ఎన్‌డీఏలో లోక్‌జనశక్తి పార్టీ కూడా అలాంటిదే అంటారు థరూర్‌. ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగ రక్షణ గురించి, ఆఖరికి హక్కుల గురించి సదా చీదర చిమ్మే ఈ పార్టీలేవీ మహిళలను మాత్రం ముందు వరసలో నిలబెట్టవు. కృత్యాద్యవస్థ మీద పదవులు అప్పగించినా పగ్గాలు మాత్రం పురుషుల చేతిలోనే ఉంటాయి.

ఘనత వహించిన మన ప్రజాస్వామ్య వ్యవస్థలో కుటుంబ పాలన ఇంత దృఢంగా తిష్టవేయడానికి గల కారణాలను కూడా థరూర్‌ చక్కగా చెప్పారు. మొదటి తరం నేతను ఆరాధించిన తీరులోనే ఆయన కొడుకును ఆరాధించడానికి నిజం చెప్పాలంటే కొత్త బానిసత్వాన్ని వెంటనే నెత్తికెక్కించుకోవడానికి పార్టీ శ్రేణులు సదా సంసిద్ధంగా ఉంటాయట. పార్టీ నిధులన్నీ మొదటి తరం నేత సొంత ఆస్తి తరహాలోనే కొడుకు ఖాతాలోకి వచ్చి పడతాయి. ఈ దేశ ప్రధాని పీఠం మీద గాంధీ`నెహ్రూ కుటుంబీకులు తప్ప వేరొకరు ఆసీనులు కావడం ఘోర అపచారం అన్నట్టే రాహుల్‌ మాటలు, చేతలు ఉంటాయి. ఈ క్రమంలో ఇతర ప్రధానుల సామాజిక నేపథ్యాలతో విమర్శలకు దిగడానికి సిగ్గుపడరు.

మధ్యయుగాల ఆలోచనలను దాటని ఆ కుటుంబ పాలకులను మెప్పించడా నికి పార్టీల తైనాతీలు, తోకలు, చెమ్చాలు వేసే కుప్పిగంతులు తీరు మరీ జుగుప్సాకరం. ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించాలంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వీరంగం వేయడం అలాంటిదే. ఈ ఖర్గే కుమారునితో కర్ణాటకలో ఇదే మాట అనిపించి, కోర్టు చేత లెంపకాయ వేయించుకున్న కాంగ్రెస్‌, తండ్రి చేత మళ్లీ ఇప్పుడు అదే కూత కూయించింది. అనుభవజ్ఞుడైన పెద్ద ఖర్గేకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, కాంగ్రెస్‌ అధ్యక్షునిగా ఆ పార్టీలో తన మాటకు ఉన్న విలువ ఏపాటిదో, నిజంగా నిర్ణయాలు తీసుకునేది ఎవరో ఒక్కసారి జాతికి చెబితే బావుటుంది. కాంగ్రెస్‌ను పతనం చేసే గుత్తాధిపత్యం గాంధీ-నెహ్రూ కుటుంబా నికి మాత్రమే ఉంది, ఇతరులెవరు దాని కోసం ప్రయత్నించినా చూస్తూ ఊరుకోం అన్నట్టే ఉంటారు, సోనియా, రాహుల్‌, రెండు ఇంటిపేర్ల ప్రియాంక వాద్రా గాంధీ. థరూర్‌ చెప్పిన కుటుంబ పాలనను రోడ్డు మీదకు విసిరి, ప్రతిభకు పట్టం కట్టండి అన్న అభిప్రాయాన్ని ఇక ఎవరైనా గౌరవించవలసిందే. గాంధీ`నెహ్రూ కుటుంబం బాధ నుంచి భారత్‌కు విముక్తి కల్పించాలన్న థరూర్‌ పిలుపు స్వాగతించదగినది.

About Author

By editor

Twitter
YOUTUBE