శాలివాహన 1947 శ్రీ విశ్వావసు కార్తిక శుద్ధ త్రయోదశి – 03 నవంబర్ 2025, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
అర్హులకు మాత్రమే ఓటు హక్కు ఉండాలి. చట్టబద్ధంగానే ఓటింగ్ జరగాలి. అప్పుడే ప్రజాస్వామ్యానికి రక్షణ. ఈ ధ్యేయంతో సాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) రెండో దశకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఈ శుభ వార్తను అక్టోబర్ 27న కేంద్ర ఎన్నికల సంఘం దేశానికి తెలియచేసింది. తొలిదశలో బిహార్‌లో ఎస్‌ఐఆర్‌ను దిగ్విజయంగా పూర్తి చేశారు. కాంగ్రెస్, ఆర్‌జేడీ, కమ్యూనిస్టులు, డీఎంకే ఇతర అమాంబాపతు రాజకీయ పార్టీలు ఇందుకు ప్రతిబంధకాలు కల్పించాలని చూసినా, కోర్టుల జోక్యంతో బిహార్‌లో ఎస్‌ఐఆర్ పూర్తయి, ఇప్పుడు ఎన్నికలు కూడా జరగబోతున్నాయి.
రెండవదశలో తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఎస్‌ఐఆర్‌ను ఎన్నికల సంఘం చేపట్టబోతున్నది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, చత్తీస్‌గఢ్, గోవా, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలోను, కేంద్ర పాలిత ప్రాంతాలు అండమాన్ నికోబార్, పుదుచ్చేరి, లక్షద్వీప్‌లలోను ఎస్‌ఐఆర్ కొన్ని రోజులలోనే ప్రారంభం కాబోతున్నది. నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 వరకు క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమం చేపడతారు. డిసెంబర్ 9న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తెలియచేశారు. అస్సాంలోను ఈ సవరణ చేపట్టవలసి ఉన్నది. కానీ అక్కడ పౌరసత్వానికి సంబంధించి కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. ఈ పౌరసత్వ గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి అక్కడ ఈ పని వాయిదా పడిరది. రెండోదశ చేపట్టిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. మొత్తం 51 కోట్ల మంది ఓటర్లు ఈ సవరణ ప్రక్రియ పరిధిలోకి వస్తారు. వచ్చే సంవత్సరమే శాసనసభ ఎన్నికలకు వెళ్లబోతున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరిలలో కూడా ఎస్‌ఐఆర్ చేపట్టబోతున్నారు.ఆ మూడు రాష్ట్రాలు కూడా ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగానే ఉన్నాయి.
బీజేపీ ప్రభుత్వ హయాంలోనే ఎస్‌ఐఆర్ ప్రక్రియ కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించడం లేదు. ఇది 1951 నుంచి అమలవుతున్నది. 1952లో జరిగిన మొట్టమొదటి సాధారణ ఎన్నికల కోసం దీనిని చేపట్టారని అనుకోవాలి. అంటే అంతకు ముందు జరిగిన ఓటర్ల నమోదును ఆనాడు కూడా సవరించారనే అర్ధం. ఆ ప్రకారం స్వతంత్ర భారతదేశంలోనే ఎనిమిది పర్యాయాలు ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ జరిగింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం దీనిని దాదాపు అన్ని విపక్షాలు వివాదాస్పదం చేశాయి. కానీ ఇది రాజ్యాంగం నిర్దేశించిన ప్రక్రియ. అర్హులకు ఓటు హక్కు స్థిరపరచడం, అనర్హులను జాబితాల నుంచి తొలగించడమే ఎస్‌ఐఆర్ ప్రధాన లక్ష్యమని ఎన్నికల కమిషన్ ఆది నుంచి చెబుతూనే ఉన్నది.
కానీ భారత విపక్షాల వైఖరికి కుక్క తోక కంటే వంకర ఎక్కువ. రాజకీయ పార్టీ వలె కాకుండా రాజకీయ నిరుద్యోగుల ఆవాసంగా ఉన్న కాంగ్రెస్ ఎస్‌ఐఆర్ విషయంలో మితిమీరి రగడ సృష్టించే ప్రయత్నం చేస్తున్నది. ప్రథమ దశలో మాదిరిగానే రెండో దశలోను రగడ సృష్టికి ప్రయత్నం చేసే సూచనలే కనిపిస్తున్నాయి. తొమ్మిది రాష్ట్రాలలో, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఓట్ చోరీకి ఎన్నికల సంఘం మళ్లీ సన్నాహాలు చేస్తున్నదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖెరా అప్పుడు నోరు పారేసుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అయితే ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమంటూ కాంగ్రెస్ పాటకే వంత పాడుతున్నారు. బీజేపీకి సాయపడే క్రమంలోనే ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను చేపడుతోందని స్టాలిన్ తేల్చి పారేశారు.తొలిదశ ఎస్‌ఐఆర్ వేళ బిహార్‌లో మహిళలు, మైనారిటీలు, ఎస్‌సీ, ఎస్టీల ఓట్లను అడ్డంగా తొలిగించేశారని ఆయన ఆరోపణ. మరి దీని పై కోర్టుకు ఎందుకు వెళ్లలేదు? మొదట ఎన్నో డాంబికాలు పలికినా ఎస్‌ఐఆర్ ఆగదని తెలిసిన తరువాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక్క కలం పోటుతో 500 మంది అధికారులను బదలీ చేశారు. వీరంతా టీఎంసీ రాక్షస పాలనకు అనుకూలరు. కాబట్టి బదలీ ఉద్దేశం అనూహ్యమేమీ కాదు.
ఎస్‌ఐఆర్ ప్రజాస్వామ్యానికి జవజీవాలను ఇస్తుంది. రాజ్యాంగం ప్రకారం ఈ దేశ ప్రజాప్రతినిధులను ఎన్నుకునే హక్కు ఎవరికి ఉన్నదో, వారి ఓటు హక్కుకు రక్షణ కల్పించడమే ఎస్‌ఐఆర్ ధ్యేయం. కానీ కుటుంబ పాలనను స్థిరపరుచుకోవాలన్న కోరికతో, చిరకాలం పదవిలో తిష్ట వేయడమే ధ్యేయంగా ప్రజాస్వామ్యాన్ని చెప్పులా వాడుకుంటున్న ప్రబుద్ధులే ఎస్‌ఐఆర్ మీద విమర్శలు గుప్పించడం పెద్ద వైచిత్రి. అసలు ఎస్‌ఐఆర్ ప్రక్రియ మీద తామంతా చేసిన అల్లరి కేవలం తమాషా అని, రకరకాల విన్యాసాలతో బీజేపీని ఇబ్బంది పెట్టడమే తమ ధ్యేయమని, అందులో ఎస్‌ఐఆర్ వ్యతిరేక అల్లరి ఒకటి మాత్రమేనని స్వరాజ్ ఇండియా పార్టీ పేరుతో బతికేస్తున్న యోగేంద్ర యాదవ్ ఒక ఇంటర్వ్యూలో గుట్టు విప్పేశారు. అయినా వీళ్ల మాటలు జనం నమ్మవలసిన అవసరం ఉందా? టూల్‌కిట్ ముఠా అంతా కలసి ఈ తమాషా సృష్టించారని తేలిపోయింది. అందులో రాహుల్‌ది కీలకపాత్ర. వీళ్లు మాట్లాడుతున్నది అక్రమ వలసదారుల ఓట్ల గురించే. అంటే రొహింగ్యాలు, పాకిస్తాన్ నుంచి చొరబడినవారే. నాడు అంత రగడ సృష్టించి, తీరా ఎన్నికల వేళ బిహార్ వైపు కన్నెత్తి చూడకపోవడం రాహుల్ వంటి చిల్లర నాయకుడికే చెల్లుతుంది. కుటుంబ పాలన, దేశ విచ్ఛిన్నం, వేర్పాటువాదం ఆసరాగా పబ్బం గడుపు కుంటున్న శక్తులు, పార్టీలే ప్రజాస్వామ్య ప్రక్రియ పునరుద్ధరణకు అడ్డు పడుతున్నాయి. దీనిని జాతి గమనించాలి. ఎస్‌ఐఆర్ రెండోదశ దిగ్విజయంగా పూర్తి కావడానికి సహకరించాలి.