గళమెత్తిన గతం
‘సస్యానందము (వర్షశాస్త్రము)’` కీ॥శ॥ 1356లో దోనయామాత్యుడు అనే పండితుడు ఈ గ్రంథం రాశాడు. ‘దాదాపు 660 సంవత్సరాల నాడు ఆంధ్ర సాహిత్య భూమిపై కురిసిన తొలి తొలకరి తేనెజల్లు ఈ సస్యానంద వర్షశాస్త్రము’ అన్నారు ఈ పుస్తకానికి పీఠిక రాసిన ఉన్నం జ్యోతివాసు.
మన పూర్వులు ‘డిగ్రీలు లేనట్టి’ వారు కావచ్చు. కానీ ప్రకృతితో వారు మమేకమైన తీరు శాస్త్రీయమే. గాలి గట్టిగా వీస్తే మబ్బులు చెదిరి, వానదేవుడు ముఖం చాటేస్తాడని, గాలి వలననే ఆకాశం ఉరుముతుందని, అన్నిటికి గాలే కారణమని తెలుసుకున్నారు. వాతావరణ మార్పులను మనుషులకన్నా ముందు జంతువులే పసిగడతాయని ఆధునిక శాస్త్ర పరిశోధనలు చెబుతాయి. కుక్కలు, నక్కలు వంటి జంతువులు 20 హెర్ట్‌జులు తరచుదనం కన్నా తక్కువ తరచుదనం (ప్రీక్వెన్సీ) గల ధ్వనులను వినగలవు. కుక్కలు సూర్యోదయానికి, సూర్యాస్తమయానికి కొంచెం ముందుగా అరవకుండా ఉంటే పైరులకు అవసరమైనంత వర్షంగా కురుస్తుందని దోనయ్య కవి చెప్పాడు. (సస్యానందము 3`26) దీన్ని శాస్త్రవేత్తలు నిర్ధారించాలి.
భారతీయుల ప్రధాన వృత్తి వ్యవసాయం, దానికి వర్షమే ఆధారం. వర్షాలు బాగా పడితే పంటలు బాగా పండుతాయి. పంటలు పుష్కలంగా పండితే ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారు. వానల రాకపోకలు అందరికీ అవసరం. కాని వాన రాకడ, ప్రాణం పోకడ అన్నారు. అందువలన గార్గ్య సంహిత, మిహిర సంహిత, లల్ల సంహితల సారాన్ని గ్రహించి వానల గురించి ప్రజలు తెలుసుకోవడం కోసం సస్యానంద గ్రంథ రచనకు దోనయ సంకల్పించాడు. దాని వెనుక ఉదాత్తమైన సామాజిక స్పృహ ఉంది.
పూర్వకవులు ‘కృషి’ (వ్యవసాయం) ప్రపంచాన్ని కొంత ప్రదర్శించారు. ఆనాడు మెరక ప్రాంత వ్యవసాయ బావులపై ఆధారపడి ఉండేది. దిగుడు బావుల నుండి నీటిని ఏతాములతోనూ మోటలతోనూ తోడేవారు. ‘సింహాసన ద్వాత్రింశిక’లో కొరవి గోపరాజు ఇలా ప్రస్తా వించాడు. ‘కాలమెడ జేసిన నేతములెత్తి కాల్వలుంబాయలు గోళ్లు నూతులును బావుల రాట్నములున్ జలార్థమై చేయగ’ (6`70).
చెంచులు, కొండజాతి వారు సంచారజాతులు అడవులను నరికి, చదునుచేసి పోడు వ్యవసాయం చేశారని భోజ రాజీయము (6`242)లో వివరించాడు. వారు పొట్టి కందులు, అనుములు పండిరచారు. పంటలకు దృష్టి (దిష్టి) దోషం కలుగకుండా దిష్టి పిడతలను పెట్డడం, ఎద్దు తలలు, ఏనుగు తలలు (దంతాలతో పాటు) నిలిపేవారని ధూర్జటి కాళహస్తీశ్వర మహత్మ్యము వలన తెలుస్తుంది.
ఏనుగుల తలలు కొమ్ములతో నారబములకు దృష్టి దోషము వాయం
గా నెత్తుదు రెఱుకలు దమ చేనికి బసరంబు తలల చెలువం బెసగన్
(కాళహస్తీశ్వర మహాత్మ్యము 3-8)
ఆనాడు పొలాలు కొలవడానికి ‘కేసరి పాటిగెడ’ అనే కర్రను కొలబద్దగా వాడినట్లు ప్రత్తిపాడు శాసనంలో ఉంది. మడికి సింగన తన సకల నీతి సమ్మతము (1`99)లో కృషి ప్రపంచము (రైతులు చెల్లించే పన్ను)ను గురించి వివరించాడు. గనులపైన, పశువులపైన, బండ్లు మొదలైన వాహనాలపై పన్ను, ఉద్యాన వనాలపై వసూలు చేసే పన్ను, వ్యాపారంపై పన్ను. దీన్ని బట్టి 14వ శతాబ్దంలో పన్నుల విధానం తెలుస్తున్నది.
మనిషి ప్రకృతికి ఒదిగి ఉండాలి. దానిపై ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తే అది మనిషి వినాశనానికి దారి తీస్తుందని చెబుతుంది పర్యావరణవాదం. ప్రకృతిని రక్షించే బాధ్యత మనిషిదేనన్న నిర్ధారణకు రావడం పర్యావరణ స్పృహలోనికే వస్తుంది.
పాండువులు ద్వైతవనంలో ఉండగా ధర్మరాజుకు ఓ రోజు కల వస్తుంది. ‘‘ద్వైత వనంబున ధర్మ రాజుండొకనాడు నిద్రింపగా తద్వనే చరంబు’’ సీస పద్యంతో అడవిలోని జంతువులన్నీ వచ్చి ఇలా మొరపెట్టుకుంటాయి. అయ్యా మీరు నిత్యం మమ్మల్ని వేటాడి చంపడం వలన మా జాతుల ఉనికి పూర్తిగా నాశనమై పోతున్నది. కాబట్టి మీరు వేరే చోటికి వెళితే మేము బ్రతకగలం అంటాయి, మరుసటి రోజే ధర్మరాజు వేరే చోటికి బయలు దేరతాడు. ఇది వన్యప్రాణ రక్షణను గుర్తు చేస్తుంది.
భాగవత గ్రంథంలో శ్రీకృష్ణుడు బృందావనం అవతల గోవుల్ని మేపుతుంటారు. తనతో ఉన్న గోపబాలురు ఆ ఎండను తాళలేక నీరసించి పోతున్నారు. వెంటనే దగ్గర్లోగల విశాలమైన చెట్టు నీడకు చేరుకున్నారు. ఆ సందర్భంలో చెప్పిన పద్యం.
‘‘అపకారంబులు సేయ నెవ్వరికి నేకాంతంబులందుండునా
………………………
నుపకారంబులు సేయు నర్దులకు నీయుర్వీజముల్ గంటిరే (10-1-850)
ఈ చెట్లు ఎవరికి అపకారం చేయవు. ఏకాంతంగా ఉంటాయి, ఎండ, చలి, వానల నుండి ప్రజలను కాపాడుతాయి. వారికవసరమైన బెరడు, గంధం, జిగురు, బూడిద, చిగుళ్లు, తేనె, పూలు, పండ్లు, నీడను ఇచ్చి ఆదుకుంటాయని వృక్షతత్త్వ బోధనను ఒక మిత్రునిగా చేశాడు. ఇది పురాణ ఇతిహాసాలలో కనిపించే పర్యావరణ సందేశం.
కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశికలో చింతచెట్టు వస్తువుగా ఆరు కంద పద్యాలు రాశాడు.
‘‘చింతమది లేక మనుజులు చింతించిన కొలది చెవులు చేకూర్చుచుని / శ్చింతులుగా నొనరించెడు చింతకు సరిగలదే లోక చింతామణి / చింతచెట్టు స్వభావం, వైశిష్ట్యం చెప్పడమే ఇక్కడ కవి లక్ష్యం.
ఈ మహాగ్రంథాలన్నీ సంస్కృతంలో ఉండడం వల్ల సామాన్యులకు ఈ శాస్త్రాలు అందని మానిపండ్ల య్యాయి. నన్నయ్యభట్టు తన భారతానువాదానికి ఆమోదం పొందిన తరువాత సామాన్యుల కోసం తెలుగుకవులు శాస్త్ర గ్రంథాలను కూడా అను వదించడం ప్రారంభించారు. కమ్మనాడులో పావు లూరి మల్లన తొలిసారి మహావీరాచార్యుని సార సంగ్రహ గణితాన్ని తెలుగులోనికి అను వదించాడు.
వ్యవసాయ శాస్త్రం మీద సంస్కృతంలో మంచి గ్రంథలు వచ్చాయి. పరాశరుడి ‘కృషి సంగ్రహ’ ప్రసిద్ధ వ్యవసాయ గ్రంథం. ఇందులో ఎడ్లు వాటి లక్షణాలు, గోమయాన్ని ఎరువుగా మార్చడం, నాగలి సామాగ్రి, ఏరుకట్ట సామాను, దుక్కి దున్నే పద్ధతి, విత్తనాలు చల్లడం, ఎరువులు వేయడం, పైరు కోయడం, ధాన్యం నూర్చి తూర్పారబట్టి కైలు చేయడం, పాతర్లలలో, గాదెలలో పురుగు పట్టకుండా ధాన్యం నిల్వ చేయడం, తెగుళ్ల నివారణ, మొదలైన విషయాలు ఉన్నాయి.
అటు తర్వాత కాలంలో తిరుమల భట్టారకుడు (1470-1530) కాలం, (ఇతడు అప్పకవికి పెద్ద తాత) కాలామృతము, అయ్యల భాస్కర జంట కవులు (1550-1610) రెట్టమత శాస్త్రము, కాకునూరి అప్పకవి (1610-1670) కాలా బాలార్నవము, చరిగొండ హొన్నయ్య (1660-1720) జ్యోతిష్య రత్నాకరము గ్రంధాలను రచించారు. మిగిలిన ఎన్నోగ్రంథాలు మద్రాసు ప్రాచ్య లిఖిత భాండా గారంలో వ్రాతప్రతుల రూపంలో ఊపిరి పీలుస్తు న్నాయి. వీటన్నింటిలో దోనయామాత్యుడి ‘సస్యానందము’ గ్రంథానికి పూర్వం చాలా ప్రసిద్ధి ఉంది. తాత్పర్యం లేనిదే ఈ గ్రంథం అర్ధం కాదు, కాబట్టే సంగ శేషాచల శాస్త్రి ఎంతో శ్రమించి తాత్పర్యాలు రాశారు. ఈ నేపథ్యంతో సస్యానందము పరిశీలిద్దాం.
‘సస్యానందము’లో నాలుగు అధికరణాలున్నాయి, 232 గద్య పద్యాలు ఉన్నాయి. ఇది మూడుసార్లు అచ్చయింది. 1891, 1915, 1921 లలో నిడదవోలు వెంకట్రావు వ్యాసం ‘సస్యానందము` దోనయామాత్యుడు’ ‘భారతి’ పత్రికలో (1946 జూన్) వెలువడినాక చాగంటి శేషయ్య ఆంధ్ర కవితరంగిణిలో కాస్త చోటు కల్పించారు. ఆపై సమగ్రాంధ్ర సాహిత్యంలో ఆరుద్ర పీట వేశారు. కానీ వీటిని సాహిత్య చరిత్రకారులు చిన్న చూపు చూశారు. ఇప్పటికి సాముద్రికం రాసిన అన్నయ్య, పశువైద్యం కర్త నారయ్య, ఆయుర్వేదార్ధ సంగ్రహం రచయిత వేదయ్య సాహిత్య చరిత్రలో చోటు దొరకని దురదృష్టవంతులు.
దోనయ్య నియోగి, పరమశివభక్తుడు. రుద్రమ్మ` మాచిరాజు తల్లిదండ్రులు. కావ్య సాహిత్యం కన్నా శాస్త్ర పాండిత్యాన్నే ఆయన అమితంగా ప్రేమించాడు. ముఖ్యంగా జ్యోతిష్యశాస్త్ర పారంగతుడయ్యాడు. నడిచే విజ్ఞాన సర్వస్వమయ్యాడు. తన వద్దకు వచ్చే పండిత పామరులకు శాస్త్ర సందేహాలను తీర్చేవాడు.
ఈ సంవత్సరం వర్షాలు పడతాయా? ఈ సంవత్సరం ఏ పంటలు వేస్తే లాభిస్తుంది? అంటూ తన వద్దకు వచ్చే రైతులకు గ్రహగతులను లెక్కించి మరీ సలహాలిచ్చేవాడు. ఆయన సస్యానందము రాసిన నాటికి శ్రీనాథుడు పుట్టలేదు. నాచన సోముడు, ఎర్రన సాహిత్యాకాశంలో సూర్యచంద్రులుగా ప్రకాశిస్తున్న కాలం.
సస్యానంద కావ్య రాత ప్రతులలో గ్రంథ రచనా కాలాన్ని చెప్పిన పద్యం ప్రకారం శాలివాహన శకం 1278 (కీ॥శ 1278G78R1356). తన కావ్యాన్ని శ్రీశైల మల్లికార్జునుడిని సంబోధిస్తూ చెప్పాడు. అయితే అవతారికలోని రెండవ పద్యంలో సింహాచల ప్రస్తావన ఉంది, ‘నాదరమున సింహశైలమున తద్దయ వేడ్కచరింపుచున్న సుందర జలదంబు ధాత్రికి’ అని. దాని అర్ధం పాపాలు అనే పెద్ద పెద్ద కొరవులను అణచి, దుఃఖమనే కార్చిచ్చును చల్లార్చి, చక్రకాంతులనే మెరుపులు మెరుస్తూ ఉంటే నిత్యం ప్రేమతో సింహాచలంలో పూజలందుకొంటున్న సుందరేశ్వరు డనే మేఘము ఈ భూమికి తన కృపామృతాన్ని వర్షించుగాక`అని ఆ పద్య తాత్పర్యం. తాను రాస్తున్నది వానల శాస్త్రం గనుక స్వామిని మబ్బుతో పోల్చడం ఔచితీ శోభితంగా ఉంది. దీన్నిబట్టి (1-34, 46; 4-24, 26) ఈ నాలుగు పద్యాలలో ‘‘వాన గురియు సిద్ధవయి పురారీÑ చిత్సరోజ భృంగÑ సిద్దలింగ’’ అని సంభోదించడాన్ని బట్టి, సిద్ధవటం శ్రీశైలానికి దక్షిణ ముఖద్వారము, కడప జిల్లాలో ఉంది. కాబట్టి అక్కడి వాడైన కావచ్చునంటున్నారు. సాహితీవేత్తలు.
‘సస్యానందము’లో మేఘ నిర్ణయము, ధాతు ప్రకారము, గర్భకాలము, ద్రోణ ప్రకారము, ద్రోణ ప్రమాణము, చంద్ర యోగము, ఫల పక్షియోగము అన్న అధ్యాయాలు ఉన్నాయి. ఆషాడ లక్షణము, వాయు ప్రకారము, శ్రావణమాస గర్భము, గ్రహణోత్పాతము, మేఘ లక్షణము, శుక్రోదయాస్త లక్షణము, గ్రహచార లక్షణము, బుధోదయ లక్షణము, గ్రహయుద్ధము, గ్రహాధికార దేశములు, వర్ష ప్రశ్నోత్తరము గురు సంచారము కూడా వివరించారు. గురు సంచారం ఈ గ్రంథానికే తలమానికమైంది. గురుడు (బృహస్పతి) శుభకరుడు. సూర్య కుటుంబం లోని గ్రహాలన్నిటి కన్నా గురువు ఘన పరిణామమే హెచ్చని మన రుషులు చెప్పిన సత్యాన్ని ఖగోళ పరిశోధనలు రుజువు చేశాయి.
గురువు ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తే ఒక్కొక్క ఫలితం ఉంటుంది. గురువు మేషరాశిలో ప్రవేశిస్తే ఆ సంవత్సరం వర్షాలు బాగా కురుస్తాయి. నవధాన్యాలు పండుతాయి. వర్షం కారణంగా వ్యాధి కారక సూక్ష్మజీవులు ప్రబలి మేకలు గొర్రెలు చనిపోతాయి. గురువు వృషభరాశిలో ప్రవేశిస్తే ఆ సంవత్సరం వర్షాలు పడవు. కరవు వస్తుంది. శిశువులు పశువులు నశిస్తాయని దోనకవి వివరించాడు (సస్యా నందం 4-43, 44). గురువు మిథునంలో ఉంటే ఆ సంవత్సరం పశువులకు భీతి కలుగుతుంది. వర్షాలు బాగా పడతాయి. స్త్రీలకు సంతానం కలుగుతుందని దోనయ్య చెప్పాడు. (4-45) గురువు కర్కాటకంలో ఉన్నప్పుడు, ఆ సంవత్సరం ప్రజలు తిండి లేక ఊళ్లు పట్టిపోతారని దోనయ్య వివరణ (4-46). నాలుగు లేక ఐదు గ్రహాలు గాని ఒకే రాశిలో చేరితే ఘోర యుద్ధాలు జరుగుతాయి. అందుచేత గ్రహశాంతి చేయడం మంచిదని విశదీకరించాడు (4-29, 30).
వర్షపాతాన్ని ఆధునిక శాస్త్రవేత్తలు మిల్లీమీటర్లు, సెంటీ మీటర్ల ప్రమాణంతో కొలుస్తున్నారు. కాని ప్రాచీన శాస్త్రవేత్తలు ద్రోణ ప్రమాణంతో కొలిచారు. 63 అంగుళాల ముఖ వృత్తంగల ఒక కలశాన్ని తీసుకొని ఆరు బయట వర్షంలో ఉంచాలి, వర్షం వెలిశాక అందులో నీరు 4 తూములుంటే ఒక ద్రోణం వర్షం కురిసిందని అర్ధం. రెండు తూములుంటే అరద్రోణం వర్షం కురిసిందని అర్ధం. (2-31).
రాబోవు సంవత్సరం ఎంత వాన కురుస్తుందో తెలుసుకోవాలంటే పుష్యమాసం పున్నమినాడు ప్రదోష సమయంలో పలిమెడు దూది నాగలికి తగిలించి ఆరు బయట పెడతారు. మరునాడు పొద్దున్నే పిండాలి. ఆ దూది నుండి ధారగా నీళ్లు కారితే వచ్చే సంవత్సరం వానలు పుష్కలంగా కురుస్తాయి. కొన్ని చుక్కలు కారితే మధ్యరకం వానలు కురుస్తాయి. మంచుకు దూది సగం కూడా తడవకపోతే వానలు కురవవు, అనావృష్టి ఏర్పడుతుందని దోనయ్య వివరణ (1-42). దీనిని తూల పరీక్ష అంటారు. చాగంటి శేషయ్య ప్రయోగాత్మకంగా చేసి దీనిలో వాస్తవ మున్నదని కనుగొన్నారు (ఆంధ్రకవి తరంగిణి 4వ సంపుటి 1-45).
‘మేఘ సందేశం’లో మహాకవి కాళిదాసు ‘ఆషాఢస్య ప్రథమ దివసే’ అన్న శ్లోకంతో మేఘుడు కావ్యంలోకి ప్రవేశిస్తాడు. 365 రోజులలో ఆషాఢ శుద్ధ పాడ్యమి మృగశిరా నక్షత్రంతో కూడి ఉన్నప్పుడు దట్టంగా మబ్బులు పడతాయో, ఆ యేడు తొలికారు పంటలు బాగా పండుతాయని దోనయ్యకవి చెప్పాడు (సస్యా 2-45). అలాగే ఆషాడ శుద్ధ పాడ్యమి నాడు సూర్యుడు అస్తమించే కాలంలో పడమట వైపు దట్టంగా మబ్బు పడితే ఆ సంవత్సరం కరవు ఉండదని బృహస్పతి ఆచార్యుని మతమని చెప్పాడు (2`46). యక్షుడు తన కరవు దీరా సందేశం చెప్పి పంపించే మబ్బు కాబట్టి క్షేమదాయకమైన ఆషాడశుద్ధ పాఢ్యమి మేఘాన్ని కాళిదాసు ప్రవేశపెట్టాడు. ఈ కవితా శిల్ప రహస్యాన్ని అర్ధం చేసుకోవడానికి తోడ్పడిన దోనయకు కృతజ్ఞతలు చెప్పాలన్నారు ఆరుద్ర.
దోనయ్య గోనయ్య అయ్యాడు. పూర్తిగా కవియే మారిపోయాడు. తడక మళ్ల వేంకటకృష్ణారావు గ్రంథాన్ని పరిష్కరించి (జూలై 10, 1891) మొదటి సారి ముద్రించారు (పువ్వాడ సూర్యనారాయణ బ్రదర్స్, చెన్నపురి, వర్తమాన తరంగిణి ముద్రక్షర శాలలో ముద్రణ). పరిష్కర్తకు దొరికిన వ్రాతప్రతిలో నాల్గవ పాదం ఇలా ఉంది.
‘‘గోనయ్య నామధేయుడ వికుంఠ చరిత్ర రసైకలోలుడన్’’ (1-12)
నిడదవోలు వేంకటరావు 1946 జూన్‌లో భారతి పత్రికలో సస్యానందము` దోనయామాత్యుడు’’ అని పరిశోధనా వ్యాసం రాశారు. దాని ఆధారంగా దీనిని గోనయ్యను దోనయ్యగా మార్చారు. చాగంటి శేషయ్య కూడా నిడదవోలు వారినే సమర్ధించారు.
శాలివాహన సంవత్సరాన్ని ఎనిమిది చేత గుణించి దానిని తొమ్మిది చేత భాగించినప్పుడు వచ్చే శేషాన్ని బట్టి మేఘాలను (వర్షపాతమును) నిర్ణయించాడు దోనయ్య. శేషము 1 వస్తే ఆవర్తమేఘ మనియు, 2 వస్తే సంవర్త మేఘము, 3 వస్తే పుష్కర మేఘము, 4 వస్తే ద్రోణ మేఘము, 5 వస్తే కాల మేఘము, 6 వస్తే నీలి మేఘము, 7 వస్తే కారుమేఘము, 8 వస్తే గౌనీ మేఘము, శేషము రాకుండిన తమము, మేఘమనియు మేఘమును కనిపెట్టాలని అన్నారు.
శునం వాహ శునం నర: శునం కృషతులాంగలం / శునం వరత్రా బద్యంతాం శున మష్ట్ర ముదిఙ్గయ (ఋగ్వేదం)
(ఎడ్లు సుఖముగా లాగుగాక, మనుషులు సుఖముగా పనిచేయుదురు గాక,
నాగలి సుఖముగా దున్నుగాక, ములుకోలు సుఖముగా తోలుగాక)
– డా. కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు