భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీలో ద్వితీయ హుమతి పొందిన రచన
రచయిత్రి పరిచయం
ఆంధప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా కురబలకోటకు చెందిన డాక్టర్ లక్ష్మీ రాఘవ హైదరాబాద్‌లో వనితా మహా విద్యాలయలో జంతుశాస్త్ర విభాగంలో రీడర్‌గా పదవీ విరమణ పొందారు. మొదటి కథ ఆంధ్రసచిత్ర వార పత్రికలో (1966) ప్రచురితమైంది. రెండు వందలకు పైగా కథలు రాశారు. తొమ్మిది కథా సంపుటాలు వెలువరించారు. వాటిలో రెండు కన్నడంలోకి తర్జుమా అయ్యాయి. రచనా వ్యాంసంగతో పాటు కళపై ఆసక్తి గల ఆమె కొన్ని చిత్రకళా ప్రదర్శనలు నిర్వహించారు.
– డా. లక్ష్మీరాఘవ
‘‘రామ్మా నందితా! ఊ నీ గురించే ఆలోచిస్తున్నా..’’ నవ్వుతూ ఆహ్వా నించాడు శంకరరావు.
‘‘చెప్పండి అంకుల్.. ఈ రోజు నేను తీరికగా ఉన్నాను..’’ అని అతని టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుంది నందిత.
వాళ్లు మాట్లాడుతూ ఉంటే తన గది నుండే గమనిస్తూ సంతోషపడ్డాడు రాకేశ్. ఒక గంట తరువాత నందిత వెళ్లి పోయింది. ఆ రోజు సాయంకాలమే నందితను తన క్లినిక్‌లో కలిశాడు.
‘‘మీ నాన్న గురించిన బెంగ అక్కరలేదు రాకేశ్. ఇప్పుడు ఆయన ఇంకో ప్రపంచంలో తొంగి చూడాలని అనుకుంటున్నాడు.. మీ అమ్మ పోయిన బాధలో మొదట కొన్ని నెలలు ఆయన మానసికంగా ఆవేదనలో ఉండిపోతున్నాడని నీవు కంగారు పడి ఉండవచ్చు. కానీ ఆయన ధోరణి ఇప్పుడు మారింది..’’
‘‘నందితా! ఆయన ప్రొఫెసర్ ఉద్యోగం చేసిన ప్పుడు రీసర్చ్ పేపర్స్ కోసం ఎంత సీరియస్‌గా పని చేసేవారో నాకు తెలుసు. అమ్మ చనిపోయిన మూడు నెలలు నాన్న స్తబ్దతను చూసి భయపడ్డా. డాక్టర్ దగ్గరికి వెడదామంటే..’ ‘వద్దు.. వాళ్లు నిద్రకు మాత్రలు ఇస్తారు’ అన్నారు. అసలే ఆయన సబ్జక్ట్ కెమిస్ట్రీ. ఏమందు దేనికి పనిచేస్తుందో తెలుసు. అందుకే నీదగ్గరికి వచ్చాను… నిన్ను నాన్నకు పరిచయం చేశాక కాస్త మెరుగనిపిస్తోంది..ఆయనకు నీ వృత్తి తెలియకపోవడంతో ఫ్రీగా ఉంటున్నాడు. కానీ ఈమధ్య మరీ గంటల తరబడి గదిలొనే కూర్చుని ఏమి చేస్తున్నాడో తెలియటం లేదు. నా దగ్గర దాస్తున్నాడు.. అందుకే ..’’ రాకేశ్ మాటల్లో ఆరాటం తెలుస్తూంది నందితకు.
‘‘ఎక్కువగా ఆలోచించకు రాకేశ్. త్వరలో నీ ప్రశ్నలకు సమాధానం చెబుతా… ప్రస్తుతం మీ నాన్నకు ‘ఎవరికీ చెప్పనని మాట ఇచ్చా..’అన్న నందిత మాటలకు ఆశ్చర్యపోతూ
‘‘అదేంటి.. నీవు కూడా నాతో చెప్పకుండా …’’
‘‘అవును. నేను నీకు ఎంత ఫ్రెండ్ అయినా సైకాలజిస్ట్‌ని … నీవు మీ నాన్నను నా క్లయింట్ గా అప్పగించావు… కొద్ది రోజుల్లో నీకు వివరంగా చెబుతాను. వింటే నీవే ఆశ్చర్యపడేలా …’’నందిత నవ్వుతూ అన్నా రాకేశ్‌కు మనసు కొద్దిగా బాధ కలిగింది. కానీ మాట్లాడే పరిస్థితి లేదని ఊరు కున్నాడు.
ఒక వారం రోజుల తర్వాత నందిత క్లినిక్‌కు రమ్మంది. ఆఫీసు నుంచి నేరుగా వెళ్లాడు.
‘‘ఈ రోజు నీకు మీ నాన్న గురించి చెప్పే సమయం వచ్చింది…’’
‘‘త్వరగా చెప్పు ప్లీజ్..’’ముందుకు వంగి నందిత ముఖంలోకి చూస్తూ అన్నాడు.
‘‘నీవు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఎంత ముందుకు వెళ్లావో నాకు తెలియదు కానీ కెమిస్ట్రీ చదివిన మీ నాన్నగారు మనిషికి సంబంధించిన భావనల ప్రభావాన్ని తన ఆలోచనలతో ఎంతో ముందుకు నడిపించారు..’’
‘‘అదేంటి?నాకు అర్థం కావటం లేదు..’’ భయంగా చూశాడు రాకేశ్.
‘‘నాకూ అలాగే అనిపించింది మొదట కానీ ఆ ఆలోచన వెనుక ఉన్న తపన అర్థం చేసుకున్నా.. ఎన్నో ఏళ్ల అనుబంధం వారిది. భార్యను పోగొట్టు కున్నాక చాలా బాధ పడ్డారు. బయటకు చెప్పుకోవడం ఇష్టం లేదు… ఆయన స్తబ్దత నిన్ను కంగారు పెడుతోందని తానే ఇంకోవిధంగా ఆలోచన చేసి ఒక రీసర్చ్‌లాగా ఎన్నో తెలుసుకుని.. చివరకు అది ఎంత వరకూ సమంజసం అన్న భావన కలిగాక అంతా ఒక కథ లాగా రాశారు…’’
‘‘కథనా ???’’ రాకేశ్ నోరు మూత పడలేదు కాస్సేపు.
‘‘అవును కథే! అలాగ ఎందుకు అంటే రీసర్చ్ పేపర్ కన్నా ఒక కథ అందరినీ చేరుతుంది. ఎందు కంటే కథకు ఒక ముగింపు ఇవ్వచ్చు. ఆయన రాసిన విధానం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను రాకేశ్..’’ అంటూ ఒక ఫైల్ తీసి అతని చేతిలో పెట్టింది.
‘‘మొదట నీవు చదువు అర్థం అవుతుంది.. అతని లో ఒక రీసెర్చ్ బుర్రనే కాకుండా మంచి కథకుడు ఉన్నాడు. అతను నార్మల్‌గా ఉండాలంటే ఇదే ఆలోచనలతో ఎన్నో రాయచ్చు.. అది ఊహానే కాదు ముందుకు జరగబోయేది ఇదేనేమో అని అనిపించేంతగా ఆదరిస్తారు..’’ అంటూ లేచి నందిత ‘‘పూర్తి చదివాక చెప్పు..’’ అని లేచింది..
‘‘అన్నట్టు ఈ ఫైల్ తిరిగి నాకే ఇవ్వు.’’అని హెచ్చరించింది.
ఇంటికి వచ్చిన రాకేశ్ ఆ రాత్రి చదవటం మొదలు పెట్టాడు..కథ శీర్షికే ఆసక్తిని పెంచింది!
‘‘చివరి జ్ఞాపకం’’
భార్య సుజాతను యూనిట్ బయట నుంచి చూస్తున్నాడు శంకర్. ఐసీయూ లో ప్రత్యేక విభాగం అది. అక్కడ పేషంట్ ను ఎప్పుడైనా చూడటానికి అనుమతి ఉంది.
ఆక్సిడెంట్ జరిగి ఐదు రోజులు..కారులో ఇద్దరూ ఉన్నా ఆక్సిడెంట్ అయినప్పుడు సుజాత వైపున ఉన్న భాగం పక్కకు పడి తల భాగం బాగా దెబ్బతింది. తను చిన్న గాయాలతో రెండు రోజుల్లోనే తేరు కున్నాడు. సుజాతను చాలా విధాలుగా మానిటర్ చేస్తూ ట్రీట్మెంట్ ఇస్తున్నారు.శంకర్ ఎక్కువ భాగం హాస్పిటల్‌లోనే గడుపుతున్నాడు.. ముప్పై ఏళ్ల కాపురం.. ఎందుకో సుజాతని ఇలా చూడటానికి కావటం లేదు. కళ్లలో నీరు తిరిగింది.. తుడుచుకో బోతూ ఉండగా భుజం మీద చేయి పడింది. వెనక్కి తిరిగితే కొడుకు రాకీతో బాటు అతని చిన్ననాటి స్నేహితుడు అనంత్..చిన్నగా తల ఉపాడు అనంత్. తర్వాత విజిటర్స్ రూమ్‌లోకి వెళ్లారు.
రాకీ ‘‘నాన్నా, నేను ఆఫీసుకి వెళ్లాలి. మీరు అనంత్‌తో మాట్లాడండి..’’అని చేయి తట్టి వెళ్లిపోయాడు.
‘‘అంకుల్! మీరు ఒకసారి నా లాబ్‌కి రావాలి..’’ అన్నాడు అనంత్ అభ్యర్థనగా.
‘‘ఎక్కడికీ పోవాలనిపించదు అనంత్. నీకు తెలుసు మా గురించి..’’గొంతు గద్గమైంది.
‘‘తెలుసు అంకుల్.. అందుకే మిమ్మల్ని రమ్మంటు న్నాను.’’
‘‘సరే వస్తాను. నేను వచ్చినప్పుడు నీవు ఫ్రీగా ఉంటావో లేదో..’’
‘‘అదేం లేదు. మీరు రావాలి అంతే ..’’ భరోసాగా అన్నాడు.
అతను వెళ్లాక శంకర్‌కి కుతూహలం పెరిగింది. దానికి తోడు మార్పు కోసమైనా అనంత్‌ను కలవాలని మరురోజే అతని లాబ్‌కి వెళ్లాడు.
అక్కడ వివిధ రకాల సిస్టమ్‌లు ఉన్నాయి.
‘‘ఇన్నిటితో పనిచేస్తావా?..’’ఆశ్చర్యంగా అడిగాడు.
‘‘అవును అంకుల్. మీరు కూర్చోండి. టీ తాగుతూ మాట్లాడుకుందాం’’ అని రిలాక్స్ చేశాడు.
‘‘మీకు నేను చేస్తున్న రీసెర్చ్ గురించి చెబుతాను..’’
‘‘నాకెందుకు??’’
‘‘ఆ ప్రశ్న నేను చెప్పింది విన్నాక అడుగుదురు గానీ..’’ అని మొదలు పెట్టాడు
‘‘అంటే..’’ అతని ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా మొదలు పెట్టాడు అనంత్.
‘‘మీరెప్పుడైనా ‘‘మెమరీ క్లౌడ్ టెక్నాలజీ’’ గురించి విన్నారా?’’
‘‘పేరు విన్నాను కానీ దాని మీద అంత దృష్టి పెట్టలేదు.’’
‘‘ఇప్పుడు నేను చేస్తున్నరీసర్చ్ దాని మీదే. కొంచెం శ్రద్ధగా వినండి’’
‘‘నేను ఇప్పుడు వినాలా?’’ అనాసక్తిగా చూశాడు.
‘‘అవును.మీకే ఉపయోగపడుతుంది’’ అనంత్ మాటలకు మౌనంగా కూర్చున్నాడు.
‘‘మెమరీ క్లౌడ్ టెక్నాలజీ ఒక అద్భుతం. అది కేవలం యంత్రాల ఆవిష్కరణ కాదు, మనసుల రక్షకురాలు. మనిషి మెదడులోని ప్రతి జ్ఞాపకాన్ని, ప్రతి భావాన్ని ప్రత్యేక న్యూరో-స్కానర్ సేకరించి, క్వాంటం సర్వర్లలో భద్రపరుస్తుంది. దాంతో ఒక మనిషి శరీరం లేకపోయినా, అతని స్వరం, ఆలోచన, ఆప్యాయత అంతా అదేవిధంగా హోలోగ్రామ్ రూపంలో మళ్లీ ప్రత్యక్షమవుతాయి. నిజానికి మరణాన్ని ఆపలేము కానీ ప్రేమను ఎప్పటికీ మాయమవకుండా కాపాడు కోవచ్చు..’’
‘‘అవునా?? ఇంకొంచెం వివరణ కావాలి’’ అతనిలోని ప్రొఫెసర్ మేల్కొన్నాడు.
‘‘తప్పకుండా, మీలాంటి వారికే పూర్తిగా తెలియాలి..
కొన్నేళ్లుగా వైద్య విజ్ఞానంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. వాటిలో అతి గొప్పది మెమరీ క్లౌడ్ టెక్నాలజీ. ప్రత్యేక న్యూరో-స్కానర్ ద్వారా మానవ మెదడులోని న్యూరాన్ల జ్ఞాపకాలు, భావోద్వేగ ముద్రలు అన్నీ చదివి, వాటిని క్వాంటం-డిఎన్‌ఏ సర్వర్లలో ఎన్‌కోడ్ చేస్తారు. ఈ విధంగా భద్రపరిచిన జ్ఞాపకాలు కేవలం మనసు చిత్రాల్లా కాకుండా, ఆ వ్యక్తి ఆలోచన, మాటల తీరును కూడా పునరావృతం చేస్తాయి. ఆ డేటాను హోలోగ్రామ్ లేదా డిజిటల్ రూపంలో చూపిస్తుంది.అది కేవలం స్మృతుల భాండాగారం కాదు, ఒక కొత్త జీవన విస్తరణ అనే భావనను వస్తుంది ఎందుకంటే హోలోగ్రామ్ రూపం చనిపోయిన మనిషిని మళ్లీ ప్రత్యక్షంగా చూస్తున్నట్టే అనిపిస్తుంది….’’
‘‘నిజంగా??’’ శంకర్ ఆశ్చర్యంగా అన్నాడు.
‘‘అంకుల్, ఇది నిజం’’
శంకర్ వెంటనే అనంత్ చేయి పట్టుకుని ‘‘అయితే సుజాతకి ఏమైనా అయినా జీవితాంతం ఇలా ఉంచుకోవచ్చునా??’’ ఆర్తిగా అడిగాడు.
‘‘అదే చెప్పబోతున్నాను. ఆంటీ ఆరోగ్యం చాలా ఆందోళన కలిగిస్తూ ఉది. అలాటప్పుడు ఈ పరిస్థితిలో ఆమెను మెమరీ క్లౌడ్‌లో నమోదు చేసుకుంటే, ఆమె హోలోగ్రామ్ రూపంలో తిరిగి మీతో మాట్లాడగ లదు..’’
‘‘ఇంకోసారి చెప్పు అనంత్’’ ఆతృత అంతా మాటల్లోనే తెలుస్తూంది.
‘‘సుజా ఆంటీ శరీరం మృతి చెందవచ్చు. కానీ ఆమె మనస్సు మాత్రం డిజిటల్‌గా నిలిచి ఉంటుంది. తన జ్ఞాపకాలను, భావాలను పంచుకునేలా చే•య్యచ్చు’’ అనంత్ ఆపాడు.
శంకర్ మళ్లీ అనంత్ చేయి పట్టుకున్నాడు
‘‘టెక్నాలజీలో ఇంత ఊహించలేని స్థాయి వస్తుందనుకోలేదు అనంత్. నీ పేరు సాక్షిగా ‘‘అనంతం’’ అన్న పదానికి నిర్వచనంలా నిలిచావు..’’ అంటూ నమోదు చేయడానికి పక్రియ ఎలా మొదలు పెట్టాలో తెలుసుకున్నాడు.
రెండురోజులు వరసగా అనంత్‌ను కలిశాడు.
* * *
వారం రోజుల్లో సుజా కొద్దిగా కొలుకున్నట్టు కనిపించినా లాభం లేక పోయింది. శంకర్, రాకీ చాలా బాధ పడ్డారు..
అన్ని కార్యక్రమాలూ ముగిశాక అనంత్ చెప్పిన రోజు శంకర్ మెమరీ క్లౌడ్ సెంటర్‌కు వెళ్లాడు.
అనంత్ ఆయనను ఒక పారదర్శక గదిలో కూర్చోబెట్టాడు
కంట్రోల్ ప్యానెల్ ఆన్ చేశారు.
ఒక కాంతి వెలిగింది.
అకస్మాత్తుగా ఎదురుగా సుజాత రూపం హోలోగ్రామ్‌గా ప్రత్యక్షమైంది.
అదే చూపు, అదే స్వరం, అదే ప్రేమ !!!
అప్రయత్నంగా ‘‘సుజా ‘‘ అన్నాడు ఆశ్చర్యంగా.
‘‘ఎలా ఉన్నారు?’’ఆమె స్వరంలో మాట వినబడిన ఆ క్షణంలో, మృతితో వేరుపడిన దూరం అతనికి మాయం అయింది…
వెంటనే రాకీ, అనంత్‌లతో మాట్లాడి హోలోగ్రామ్ ఏర్పాట్లు ఇంట్లోనే చేసుకున్నాడు.
రోజుకోసారి భార్యతో మాట్లాడేవాడు. వారి జ్ఞాపకాలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ ‘‘జీవితం తిరిగి వచ్చింది’’ అనుకునేవాడు.
ఒక్కోసారి రాత్రిళ్లూ ఆ హోలోగ్రామ్ పక్కన కూర్చుని నిద్రపోయేవాడు.
కానీ కొన్నిరోజుల తర్వాత అతను ఒక వింత గమనించాడు.
‘‘రాకీ ప్రొమోషన్ చాలా సంతోషకరమైన విషయం కదా’’ అని ఒక రోజు సుజాత అనడంతో అతనికి సందేహం వచ్చింది.. ఇది సుజాత ఆలోచనా? లేక హోలోగ్రామ్ తెలివా?? అని ఎందుకంటే
ముందురోజే ఈ విషయం రాకీ చెప్పడం, తను ఆలోచించడం గుర్తుకు వచ్చింది.అంటే… సుజాత గతాన్ని మాత్రమే కాదు… ఇప్పటి వ్యక్తిగత ఆలోచనలు కూడా ముందుగానే తెలిసినట్టుగా ఎలా మాట్లాడు తుంది?తనకు సంబంధించిన భవిష్యత్తు విషయాలను కూడా ఊహించగలదా??
రెండు రోజుల్లో ఆ ఊహ నిజమవడంతో అతనికి ఆశ్చర్యం వేసింది.
అతను వెంటనే కంపెనీని ప్రశ్నించాడు.
వారు గంభీరంగా సమాధానమిచ్చారు ‘‘మెమరీ క్లౌడ్ కేవలం జ్ఞాపకాలను నిల్వ చేయదు. అది × సాయంతో ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అంటే మీ భార్య హోలోగ్రామ్ ఇప్పుడు ఒకకొత్త చైతన్యంపొందింది.’’
అప్పటి నుంచీ హోలోగ్రామ్‌ల తీరును గమనించ సాగాడు.
ఒక రోజు రాకీ ఆఫీసులో కొత్తగా వచ్చిన శ్రీజ అనే అమ్మాయి గురించి చెప్పాడు.. క్రమంగా రాకీ దినచర్యలో మార్పులు, మాటల్లో ఎక్కువగా శ్రీజ ప్రస్తావన రావటం గమనించాడు. రాకీ గురించిన విషయం సుజాతతో పంచుకోవాలనిపించింది.
‘‘రాకీకి పెళ్లి వయసు వచ్చింది..’’అన్నాడు
‘‘తెలుసు మీరు అదే ఆలోచిస్తున్నారు కదా. శ్రీజ మంచి అమ్మాయే కానీ రాకీకి అన్ని విధాలా సరిపోతుందా చూడాలి..’’
‘‘అదే నేను రాకీని అడుగుతున్నాను. ఆమెను ఇంటికి తీసుకుని వద్దామంటే ప్రాజెక్ట్ అయిపోనీ అన్నదని చెప్పాడు.’’
‘‘అలా అయితే ఆ అమ్మాయికి తన పని మీదే ఎక్కువ మక్కువ ఉన్నట్టు. రాకీకి ప్రేమగా చూసుకునే అమ్మాయి కావాలి. మరోసారి ఆలోచించండి.’’
‘‘అలా ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు అందరూ మొదట ఆలోచించేది కెరీరు గురించే కదా..’’
‘‘కెరీరు ముఖ్యమైనా జీవితం ఆనందంగా ఉండటానికి అన్ని విధాలా తోడుగా, ప్రేమతో ఉండే అమ్మాయి కావాలి.. కావాలంటే బోలెడు మంది క్యూ కడతారు రాకీకి.’’ గంభీరంగా వినిపించింది సుజాత గొంతు.
ఆరోజు మొదటి సారిగా శంకర్ తనుఈ క్లౌడ్ హోలోగ్రామ్ అధీనంలోనే ఉండి స్వతంత్రంగా ఆలోచించలేక పోతున్నాడా? అన్న అనుమానం వచ్చింది.
సుజాతతో తన జ్ఞాపకాలు శాశ్వతంగా ఉండటం కోసం ఇలా హొలోగ్రామ్‌లో ఉండాలనుకు న్నాడు. ఇప్పుడు సుజాత కృతిమ మేధస్సు పెరిగి కొత్త చైతన్యంతో రాకీ జీవితానికి కూడా చుక్కానిగా మారితే ఎంతవరకూ సమంజసం? తన జ్ఞాపకాలు ముఖ్యమా? భవిష్యత్తు నిర్ణయాలపై అభిప్రాయాలు ముఖ్యమా? ఇవి మనశ్శాంతిని ఇస్తాయా??
రాత్రంతా నిద్ర పట్టలేదు..
భార్య జ్ఞాపకాలే తనకు అజరామృతం కావచ్చు కానీ టెక్నాలజీ ఎంతో అద్భుతంగా ఎదిగిందని! చనిపోయిన వాళ్లతో ఇలా జీవించడం ప్రకృతి వ్యతిరేకం కాదా? మనిషి మరణం నిజమని అంగీక రించకపోతే, జీవితం విలువే కోల్పోతుంది.
తెల్లారుజామున ఆలోచనలకు ఒక స్పష్టత వచ్చింది.
మరుసటి ఉదయం శంకర్ హోలోగ్రామ్ ముందు నిలబడి….‘‘సుజా! నువ్వు నా గుండెలో శాశ్వతంగా ఉంటావు. కానీ మేము ఇప్పుడు ముందుకు సాగాలి అంటే వియోగం తప్పదు. క్షమించు’’
సిస్టమ్‌ను ఆపేసాడు.
హోలోగ్రామ్ కాంతి క్రమంగా మాయమైంది.
గదిలో నిశ్శబ్దం..
ఆ క్షణాన అతను హోలోగ్రామ్‌ను విడిచి పెట్టాడు.. కానీ ఆమె జ్ఞాపకం శాశ్వతంగా అతనిలోనే ఉంది.
ఇన్ని రోజులూ మరణానికి ఒక సాంకేతిక ప్రత్యామ్నాయం లభించింది అనుకున్నా, హొలో గ్రామ్ గతాన్ని దగ్గర చేసినా..నిజమైన జీవితం ప్రస్తు తాన్ని అంగీకరించడం, భవిష్యత్తును నిర్మించడం… అంతే..
ఆ భావనతో అతని హృదయంలో ఒక నిండుదనం!
* * *
కథ చదివాక రాకేశ్ కుర్చీలో వెనక్కి వాలి హాయిగా చిరునవ్వు నవ్వుకున్నాడు.
నాన్న తన మనసులో భావనల మార్పిడి ఎంత అందంగా మలచుకున్నాడో స్పష్టంగా తెలుస్తూంది.
నాన్న ఆలోచన ఒకవ్యక్తిగత అనుబంధం నుంచి స్వతంత్రత దిశగా వెళ్తుంది.
అంటే… ‘మరణాన్ని అంగీకరించడం, ప్రస్తుతం బ్రతకడం’ అన్న సూత్రాన్ని అనుసరించగలడు.ఎంత టెక్నాలజీ పెరిగినా మానవ విలువలు ఎప్పటికీ మెరుస్తూనే ఉంటాయి.
రాకీకి ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది..ఈ విశ్లేషణకు సహకరించిన నందితకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు మనసులోనే…