‘‘ఆరు గంటలే కదా అయ్యింది, రాత్రి పది గంటల దాకా చెయ్యాల్సిన పని ఉంది. మరి ప్రమోషన్‌ ‌కావాలి కదా!’’ (అందరి పనులు నాకే చెప్తున్నప్పుడు, మరి అందరి జీతాలు నాకే ఇవ్వాలి కదా!)

‘‘మణికా, బయట చిన్న పడింది, మేము వెళ్లొస్తాం. అప్పటిదాక ఏదైనా పనుంటే నువ్వు చూసుకో’’. (ఆహా! పని దొంగలు ఎలా అవ్వాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సిందే!)

‘‘ఈ పని త్వరగా పూర్తి చేసిన మనకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన నా టీంకి ఈరోజు పార్టీ ఇస్తున్నాను.’’ (నాతో రతింబగల్లు పని చేయించుకొని, వీళ్ళు క్రెడిట్‌ ‌తీసుకున్నారు. ఛీ!)

‘‘మణికా, మేము పార్టీకి వెళ్తున్నాం. బాస్‌ ‌నిన్ను ఇక్కడే ఉండి పని చూసుకున్నారు, ఇది నువ్వైతేనే సరిగ్గా చెయ్యగలవని ఆయన అన్నారు!’’

(మీరు నా మంచితనాన్ని చేతగానితనం చేసేసారు.)

‘‘మేడం, అనుకోకుండా చెయ్యి తగిలింది, ఏం అనుకోకండి! బస్సులో చాలా మంది ఉన్నారు కదా, ఇరుగ్గా ఉంది.’’ (కానీ ఇది బస్సు ఖాళీగా ఉన్నప్పుడు కూడా ప్రతిరోజూ జరిగే విషయమే).

ఇవన్నీ నేను రోజు వింటున్న మాటలు. కాదు… కాదు… ఇవి నేను రోజు ఎదుర్కొంటున్న సమస్యలు. అలాగే మౌనంతో ఆగినపోయిన సమాధానాలు. కారణం, రాష్ట్రాలు దాటుకొని వచ్చిన నాకు ఉద్యోగం చాలా అవసరం, ఒంటరినైన నాకు స్నేహితులు అవసరం, అన్నంటికన్నా ఎక్కువ గొడవలు అంటే భయం. అందరితో మంచిగా మెదులుకొని కలిసుందాం అనుకుంటే, వీళ్లు మాత్రం అలుసుగా అవసరానికి వాడుకుంటున్నారు. లోపల ఆత్మగౌరవం ఇలా ఉండటానికి ఒప్పుకోవట్లేదు. కానీ భయం దాన్ని కప్పేస్తూ వస్తుంది. నాలో నాకే రోజు సంఘర్షణ.

ఇది నా అందవిహీనమై జీవిత గాథ.

మీకు నా కథ చెప్తున్నప్పుడు ఫోన్కి నోటిఫికేషన్‌:

‘‘‌చరిత్ర & వారసత్వ మ్యూజియం – ఈరోజు ఉచిత ప్రవేశం.’’

అలా ఏదో తారసపడి క్లిక్‌ ‌చేశాను, తర్వాత కొంత కొత్త గాలి తగులుతుందని వెళ్ళాను.

మ్యూజియం హాల్లో చల్లని గాలి, నిశ్శబ్దం. గోడలపై తేలియాడే నీడలు.

అక్కడే, ఒక గాజు పీటలో మెరిసే కత్తి, చిన్న కవచం.

పక్కన శాసనం:

‘‘రాణి లక్ష్మీబాయి – ఝాన్సీ.

బ్రిటిష్‌ ‌దండయాత్రలో, కుమారుడిని వెనుక కట్టుకొని, గుర్రం మీద యుద్ధరంగంలోకి దూసుకెళ్లిన ధీరనారి.’’

‘‘ఆవిడ ఒక్కరే అంతమందిని ఎదిరించారా!’’ అని విస్మయంలో మనసులో మాట బయటకి అనేశాను.

ఆ మాటలు విని, దగ్గర్లో నిల్చున్న మ్యూజియం గైడ్‌ ‌చెప్పాడు•

‘‘అవునండి, అదే నిజం. ఆమె ధైర్యం వల్లే లక్షలాది భారతీయ హృదయాలు మేల్కొన్నాయి. బ్రిటిష్‌ ‌వాళ్లు కూడా ఆమెను ‘ద బ్రావెస్ట్ ఆఫ్‌ ‌ద రెబెల్స్’ అని సంబోధించారు.

గైడ్‌ ‌మాటలతో పాటు పటాలలో మెరిసిన దృశ్యాలు

పతి మరణం తరువాత, ఒంటరిగా మిగిలినా వెనుకడుగు వేయని రాణి.

డాక్టిన్‌ ఆఫ్‌ ‌లాప్స్ ‌కింద రాజ్యాన్ని చేజార్చే ప్రయత్నం.

ప్రజలను తన చుట్టూ చేర్చి: ‘‘ఝాన్సీ నేను వదులుకోను’’ అని గర్జించిన ధైర్యవాక్యం. యుద్ధరంగంలో స్వయంగా గుర్రం మీద కత్తి పట్టి దూసుకెళ్లిన దృశ్యం.

నా చెవుల్లో ప్రతిధ్వనించింది

‘‘నేను నా ఝాన్సీని వదులుకోను…’’

నా హృదయంలో ఆ మాటలు అగ్నిని రగిల్చాయి.

ఆ రాత్రి ఇంట్లో, తలుపులు మూసుకొని ముందు నిలబడ్డాను.

‘‘నిజానికి నేను నా సొంత ఝాన్సీని వదిలేస్తున్నానేమో… నా స్వప్నాలు, నా ఆత్మగౌరవం, నా ధైర్యం అన్నీ.’’ ఆ నిమిషం నాతో నేను వాగ్దానం చేసుకున్నాను.

‘‘రేపటి నుంచి మార్పు. ఇక వెనుకడుగు లేదు.’’

తరువాతి రోజు నుంచి అంతా మారిపోయింది.

నేను ఎదిరించిన తీరు బాస్‌లో, నా తోటి ఉద్యోగస్తులలో మార్పు తీసు కొచ్చింది.

అలా అని రాత్రికి రాత్రే అందరూ మంచిగా మారిపోయారు అనను. నన్ను తేలికగా తీసుకోవడం మానేశారు. అందరికీ సమానంగా పనులు ఇవ్వడం మొదలుపెట్టారు.

నేను బస్సులో అందరి ముందు కొట్టిన చెంప దెబ్బ తర్వాత అతను వేరే ఎవరితో అలా ప్రవర్తించకుండా చేసింది.

ఇలా ఒక వారం గడిచింది.

సాయంత్రం నేను తిరిగి మ్యూజియంకు వెళ్లాను.

కత్తి ముందు నిలబడి పలికాను-

‘‘రాణి, మీరు నా రక్తంలో అగ్నిని మేల్కొలిపారు. మీరు రాజ్యాన్ని రక్షించుకున్నట్లే, నేను నా గౌరవాన్ని రక్షించుకుంటాను.’’

గాజులో మెరిసిన ఉక్కు, నా కళ్ల్లల్లో ప్రతిబింబమైంది. అది కత్తి కాదు. అది ఆమె కొత్త ఆత్మస్థైర్యం.

ఇప్పుడు అద్దంలో చూసుకున్న నాకు కొత్త వ్యక్తి కనిపిస్తుంది, ఆత్మస్థైర్యంతో జీవితం విసిరే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న మణికా… ‘మణికర్ణిక’!

భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

– డా. ఎం. ప్రణతి

About Author

By editor

Twitter
YOUTUBE