‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో 

ప్రథమ బహుమతి పొందిన రచన

మత్తి భానుమూర్తి

వాళ్లిద్దరూ తననే చూస్తున్నారు.. బహుశా చెల్లి కాబోలు జరిగింది ఏదో కథలు కథలుగా వర్ణించి అబ్బురంగా కళ్లు పెద్దవి చేసి చెబుతోంది. అక్క విస్మయంగా వింటోంది. కానీ దూరానికయినా ఆమె ముఖంలో తొణుకుతున్న సన్నని అసంతృప్తి సెగ సూటిగా గణపతిని తాకుతోంది.

దొరికిపోయినట్లు తలవంచుకుని దూకుడుగా ముందుకు వెళ్లిపోతున్నాడు.

మరికాసేపటికి వెళ్లి వెళ్లి ఎక్కడో ఆగాడు. ఎటు చూసినా కులీనులే. స్త్రీ పురుషులు.. యువతీ యువకులు. ఎవరి గుంపులలో వాళ్లు.. ముచ్చట్లలో సరదాలలో మునిగి తేలుతున్నారు. తననెవ్వరూ పట్టించుకున్నట్లు లేదు. ఒక్కసారి కాస్త విశ్రాంతిగా ఊపిరి పీల్చి దీర్ఘంగా విడిచి తలవెనక్కు తిప్పి కవ్వలలున్న గుంపు వైపు చూశాడు.

సంభ్రమం!! అక్కడ గుంపులేదు. ఇద్దరు కవ్వలలు లేరు. కేవలం ఒక్క కవ్వలే. గణపతినే చూస్తోంది.

భావరహితంగా.. తన వైపు చూస్తాడా లేదా అన్నట్లు.. చూశాడు. గతుక్కుమన్నాడు.

ఆమె నడుంపై చేతులుంచి కోపం అభినయి స్తోంది. ఇదొక కొత్త అనుభవం. కోపంతో ఊగిపో తోందా.. కోపం వచ్చినట్లు అభినయిస్తోందా.. భయపడాలా? ముచ్చటపడాలా.. ఆమె అలాగే సత్యభామలా చూస్తోంది. అటూ ఇటూ చూస్తూ మెల్లమెల్లగా ఆమెవైపు వెళ్లాడు. ఆమె మరింత ముందుకు కదిలింది. వెనగ్గా వెళ్లక తప్పడం లేదు. ఇదేదో మధురంగానే ఉందే.. మెల్లమెల్లగా వెళ్లి వెళ్లి ఎవ్వరికంటా పడకుండా మరో కుడ్యం వద్ద ఆగి వెనుక నున్న చీకటిలో కలిసిపోయింది. అరె ఏమైంది.. ఇప్పటివరకు కనపడింది. ఇంతలో మాయమై గబగబా దగ్గరకు వెళ్లాడు. ఆమె డీ కొట్టినట్లు తగిలింది.

మరి మాట రాలేదు. అతని నోటిని తన నోటితో మూసేసింది కవ్వల.

చేతిలోని నూనె తిత్తి అలాగే జారిపోకుండా పట్టుకోవడం.. ఇటు ఆమె గాఢ చుంబనాలు భరించడం.. శరీరమంతా చెప్పలేని కంపనాలతో ఊగి పోయింది. కళ్లు మూసుకుపోయాయి. కాని అలౌకిక నేత్రమేదో తెరుచుకున్నట్లు.. ఏవేవో అపురూప ప్రపంచపు ఇంద్రధనుస్సుల కాంతి వలయాలు.. వర్ణ సమ్మిశ్రమాలు.. తాకీతాకకుండా.. కనిపించి కనిపించ కుండా చుట్టూ పల్లటీలు కొడుతున్నట్లు.. శరీరమేదో మత్తెక్కి ఊగిపోతున్నట్లు..

‘‘మళ్లీ నన్ను వదలి దాని జోలికి వెళ్లావో..?!’’

‘‘నేనెప్పుడు దాని.. చ ఛ.. ఆమె జోలికి వెళ్లను మహారాణీ! ఆమెను నువ్వు అని.. చఛ.. మీరు అనుకుని పొరబడ్డాను. అది మా తప్పుకాదు మన్నించండి అని అడగడానికి. అది మీ పితృపాదుల నిర్వాకం. ఇద్దరిని ఒక్కలా వారు కనబట్టి మాకీ దురవస్థ..’’ కళ్లు మూసుకునే అనేశాడు.

‘‘అమ్మో.. వాడు చూసేశాడా.. కొంపమునిగింది దేవుడో..’’ అరచినట్లు అనేసి ఎటో వెళ్లిపోయింది.

అప్పుడు సుప్తచేతన నుండి చేతనావస్థకు వచ్చాడు బందీ గణపతి.

కళ్లు తెరచి బాహ్య ప్రపంచం.. పెళ్లిబాజాలు.. తూర్యరావ విరావాలు తెలుస్తుండగానే దగ్గరగా తెలిసిన మనిషి ఒకరు స్పష్టమయ్యారు.. గుండె కొట్టుకోవడం మానేసింది.

‘వీడేవిటి ఇక్కడున్నాడు?!’

                                                                                                 *    *    *

మందడి కాటయ నేతృత్వంలో ‘కాకతీయం’ మెరుపుదళమంతా విజయవంతంగా మొదటి దశ పూర్తిచేసుకుని మొత్తం రెండువేలమంది దేవగిరి కోటలోకి ప్రవేశించారు. కోటచుట్టూ దేదీప్య మానంగా వెలిగిపోతున్న బాణసంచా వెలుగుల మధ్య ఎవరు కోట గోడలపైకి ఎక్కుతున్నారో పైనున్న సైన్యానికి కనిపించడం లేదు. ఉడుములకు చుట్టిన పెద్ద పెద్ద మోకులను పట్టి అలవోకగా పైకి ఎగబ్రాకారు. క్రింద మొసళ్ల నోట్లో సహకార దళం సిద్దం చేసుకున్న మాంసఖండాలను వేస్తే అవి నోరు మూసుకోగా వాటిపై నుండి లంఘించి దూకేసి కోట గోడలను చేరి ఉడుముల సాయంతో కోట పైకి చేరిపోయారు. కిక్కురుమనకుండా శత్రువును చంపడం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య.

మొత్తం రెండు వేలమంది కోటలోకి దిగిపోయారు.

సహకార దళం కోట బయట మొత్తం చుట్టేసి సిద్ధంగా ఉన్నారు. లోపలినుండి ఎలాంటి పదార్ధం, శవం లేదా క్షతగాత్రుడైన దళ సభ్యుడు పైనుండి బయటపడితే లిప్తలకాలంలో వాటిని అందుకుని మాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

కోట లోపల అన్ని వైపుల నుండి దిగిన వీరులు వెనువెంటనే వాళ్లు దిగిన చోట కళ్లు తిప్పి చూస్తూ ఉన్న పరిస్థితిని అవగాహన చేసుకున్నారు. తర్వాత దేవగిరి సైనిక ముద్రలున్న బట్టలను భుజాలకు కట్టుకున్నారు. ఇప్పుడు దేవగిరి సైన్యానికి, కాకతీయ దళానికి తేడా పట్టుకోవడం కష్టమే. కొందరి వద్ద మారు వేషానికి తగిన మీసాలు, గెడ్డాలు.. వగైరా ఉండగా అందరి దుస్తులపై దేవగిరి సైనికుల దుస్తులపై ఉండే యాదవ కేతనం చిహ్నాలున్నాయి.

కోట చుట్టూ అనేకానేక ద్వారాలు న్నాయి. అక్కడ మాత్రమే దేవగిరి భటులు కొంత అప్రమత్తంగా ఉన్నారు. కానీ ఇప్పుడు సమయం అర్ధరాత్రి కావడంతో వాళ్లూ కొంత నిమిత్తమాత్రంగా కనిపిస్తున్నారు. ద్వారానికి ద్వారానికి మధ్య దళం వెళ్లిపోవడానికి, బందీలను క్షేమంగా పంపించడానికి తగిన ప్రదేశం ఎంచుకుని అక్కడ ఏర్పాట్లు చేసుకున్నారు. కోట లోపల వీళ్ల ఏర్పాట్లకు తగినట్లు కోట బయట సహకారదళం సర్వసన్నద్దమై ఉంది.

 ఇక్కడ మందడి కాటయ ఇచ్చే ఆదేశాలేమీ ఉండవు. అంతా మృత్యువుతో చలగాటం. ఎవరికీ వారే శిక్షణ పొందిన విధంగా మునుముందుకు సాగిపోతున్నారు. ఒక్కరొక్కరుగా.. ఇద్దరు ముగ్గురుగా.. పరుగులెత్తుతూ నిర్దేశిత లక్ష్యం వైపుగా మౌన కెరటాల్లా ఉవ్వెత్తున వెళ్లిపోతున్నారు.

మొదటగా తమ దారికి అడ్డంగానున్న కాగడాలను, దీపాలను ఆర్పుకుంటూ శిక్షణలో చెప్పుకున్న ప్రదేశాలను గుర్తిస్తున్నారు. ప్రతి వారూ భగభగమండే ఎంత పెద్ద కాగడానయినా ఆర్పేయ గలరు. అవసరమయిన చోట నిప్పును పుట్టించే రాళ్లు దుస్తులలో ఉన్నాయి.

దేవగిరి కోట అంటే చిన్నది కాదు అదొక మహా నగరం. రెండువేలమందున్న దళం అక్కడ చీమల్లా.. కాకపోతే గండు చీమల్లా పాకుతూ పోతున్నారు.

కోట లోపలి ఓ రెండు రాజభవనాల మధ్య నున్న విశాల మండపంలో ఈ వివాహ వేడుక జరుగుతోంది. మహారాజు మొదలుకుని ప్రధాన రాజకుటుంబీకులు , నియోగ ప్రభువులు అక్కడున్నారు కాబటి నిఘా, జాగరూకత మరింత ఎక్కువగా ఉంది. కాని వివాహ సంబరాలు ఎప్పుడూ కాస్త చురుకును తగ్గిస్తాయి. అదే ఇక్కడ వర్తి స్తుంది. చాలా చోట్ల ఉన్న కాపలాదారులు ముఖ్యంగా వివాహ మండపం దగ్గరలో ఉన్న భవనాలు, ఉద్యానవనాలు, గుడులు వద్ద ఉన్న కాపలా భటులు ఒక్కచోట చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒకరిద్దరు వెళ్లి పెళ్లి పందిట్లో అతిథులకు అందిస్తున్న భక్ష్యాలు, తీపులు, పులుపులు, కారాలు తెచ్చుకుని అందరూ గుంపుగా కూర్చుని తింటున్నారు.

దూరంగా ఎక్కడో విసిరేసినట్లున్న భవనాల వద్ద, ఆ ప్రాంతాలలో.. కాపలాదారులు హాయిగా కూర్చుండి విశ్రాంతిగా కనిపిస్తున్నారు. ఏ మాత్రం అప్రమత్తంగా లేరు. వారిపై హఠాత్తుగా విరిచుకు పడితే ఎదిరించేలా లేరు.

దళం లక్ష్యం చెరసాలలు.

లోపల పది పదిహేను చెరసాలలున్నాయి. కాకతీయ బందీలే వెయ్యికి పైగా ఉన్నారు. ఇక దొంగలు, హంతకులు వంటి కఠిన శిక్షలు అనుభవిస్తున్నవారు ఎందరున్నారో.. వారందరికి తగిన కారాగారాలు ఎన్ని ఉన్నాయో.. కారాగా రాలను వెదుకుతూ పోతున్నారు. కొందరు కొన్ని చెరసాలలను గుర్తించారు. చెరసాల కాపలా భటులు.. ఆరు బయట పచ్చికలో పరుండి దూరం నుండి గాలిలో తేలివస్తున్న వివాహ మేళ తాళాలు వింటున్నారు.

మెరుపు వీరులు మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ కారాగారాలలోకి ప్రవేశించారు. లోపలికి వెళ్లి అక్కడున్న వాతావరణం చూసి నిర్ఘాంతపోయారు. ఆ కారాగారంలో ఉన్న సగంమంది బ్రతికి ఉన్నరో లేదో తెలియదు. కొందరు ఏదో మగతలో పడి ఉన్నారు. కాలు చెయ్యి కదపలేని స్థితిలో చాలామంది ఉన్నారు. కారణం ఆ చెరసాలల్లో పరిస్థితి అంత దుర్భరంగా ఉంది. భయంకరమైన దుర్గంధం. ముక్కు పుటాలు పగిలిపోతున్నాయి. వెళ్లిన వారిలో కొందరు వాంతులు చేసుకున్నారు. చెరసాల చుట్టూ పాములు, జెర్రులు, తేళ్లు పాకుతున్నాయి. అవి లోపలికి బయటకు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. పగలు రాత్రి కూడా వెలుతురు ఉండదు. బలిష్టంగా దగ్గర దగ్గరగా కట్టిన రాతి గోడలు. తలెత్తితే పైన రాయి తగులుతుంది.

చెరసాలలో మూత్రశాలలు వేరుగా లేవు. బందీలక• మల విసర్జన, భోజనం వేరు వేరు కావు.

విసర్జించిన మలం ఆ పంచేల్లో గడ్డకట్టి అలాగే ఉంది. ఎప్పుడో ఒకసారి మొత్తంగా చెరసాలలను కడుగుతారు. అప్పుడే బందీలను కూడా కడగడం. అదే స్నానం చేయడం. సాధారణంగా అంటు వ్యాధులు ఇక్కడి నుండే పుట్టి రాజ్యమంతా వ్యాపిస్తాయి. అప్పుడు ఈ చెరసాలను మొత్తంగా తగలబెట్టేస్తారు.

తిండి అనేదేదో ఆకుల్లో, మట్టి పాత్రల్లో తెచ్చిపెట్టి పోతారు. అవి సరిగా తినలేక వదిలేస్తే.. మిగిలిన పదార్ధాలను కుక్కలు, పిల్లులు తిన్నంత తిని వదిలేస్తాయి. వాటిపై చీమలు, పురుగులు, జెర్రులు పాకుతుంటాయి. మళ్లీ రాత్రి ఆ మట్టి గిన్నెల్లోనే భోజనం లాంటిది.

ఆ జీవచ్చవాల నుండి కాకతీయ బందీలను గుర్తించడం కష్టమని దళానికి అర్ధమైపోయింది. అందరిని ఎత్తి బయటకు తీసుకుపోదామని నిర్ణయించుకున్నారు. అందుకు మందడి కాటయ అనుమతి తప్పనిసరి. ఆయనకు పరిస్థితి విన్నవించారు.

‘‘అనుమకొండ తీసుకుపోయినా వీళ్లంతా మళ్లీ యుద్ధానికి పనికిరారు. బ్రతికినంత కాలం జీవచ్చ వాలుగా కాలం వెలిబుచ్చాల్సిందే..’’ అన్నాడొకడు. అతని మాటల్లో ‘వీళ్ల కోసం మన శ్రమ వృధా’ అన్న ధ్వని వినపడింది. కాటయకు అర్ధమైంది కాని అతడు చాలా వినమ్రుడైన యుద్ధవీరుడు. అప్పగించిన కార్యం పూర్తిచేయడమే అతనికి తెలిసిన ధర్మం.

‘‘మనకు అప్పగించిన పని మనవారిని అనుమకొండకు తీసుకుపోవడం..’’

నిర్ణయాలు, చర్చలు.. లిప్తల కాలంలోనే పూర్తిచెయ్యాలి.. చేశారు.

అనంతరం కాకతీయ బందీలను అందరిని బయటకు తీయడం మొదలయ్యింది.

దాదాపు యాభై కారాగారాలలో కాకతీయ సైనికులున్నారు.

ఓ కారాగారం వద్ద అనుకోకుండా చిన్న సంఘటన జరిగింది.

ఆరోజు కోటలోని మొత్తం సైనికులకు.. ముఖ్యంగా రాత్రి పనిలో ఉన్నవారికందరకూ వివాహ మందిరం నుండే భోజనం పంపిణి చేశారు. కాపలా, గూడాచార సైనికులు.. ఎక్కడి వారికక్కడికే భోజనం అందించారు వివాహ భోజనశాల ఉద్యోగులు.

ఈ కారాగారం వద్ద నున్న నలుగురు కాపలా సైనికులకు భోజనం తీసుకుని వస్తోన్న మహిళను ఆ చీకటిలో ఓ దళ వీరుడు డీ కొట్టాడు. ఆమె చేతిలోని భోజన పళ్లెరం దబ్బున క్రింద పడిపోయింది. ఆమె కంగారుపడి అతనిని తిట్టింది. అతడు నోర్మూసుకుని ఊరుకుంటే సరిపోయేది. అతడు కూడా, ‘‘నోర్మూసు కుని పొ..’’ అన్నాడు విసుగ్గా.

ఆమె వెళ్లిపోయేదల్లా ఆగిపోయింది.

ఆమె మాట్లాడేది మరాఠా తెలుగు (తెలుగుంమ రాఠి) కాగా దళ సభ్యుడు మాట్లాడేది తెలుగన్నడ భాష. (తెలుగుంకన్నడ). ఆమె చటుక్కున ఆగిపో యింది. అతన్ని పరయివాడుగా, కాకతీయుడుగా గుర్తించింది.

‘‘ఆగు ఆగు ఎవరు నువ్వూ.. ఏ రాజ్యం.. చెప్పు చెప్పు..’’ అని వెంటాడింది.

తప్పు గ్రహించిన అతను మాట్లాడకుండా వేగంగా చీకట్లో అదృశ్యమయ్యాడు.

కీడు శంకించిన ఆమె బిగ్గరగా అరిచింది. ‘‘కాకతీయ సైన్యం కోటలోకి ప్రవేశించింది..’’

అంతే.. కోట మొత్తం అప్రమత్తమయ్యింది.

నిజ పోరు మొదలయింది.

                                                                                                 *    *    *

 ఆ సమయానికి పెళ్లి మండపంలోనున్న కాకతీయ యువరాజు.. తన కోసం మెరుపుదళం కోటలోకి ప్రవేశించి ఘర్షణకు సిద్ధమైనదని తెలియని యువ గణపతి.. దీపరక్షకుడిగా తెలకవాని వేషంలో నూనె నింపుతూ తనను ఆకర్షించిన కవ్వల కోసం పడరానిపాట్లు ఆనందంగా పడుతున్నాడు.

కేయూరుడు..

కాస్త దూరంగా నిలబడి బిక్కు బిక్కుమంటూ దీనంగా చూస్తున్నాడు. పెళ్లికి కూడా మంచి దుస్తులు ధరించలేని అతని దీనజీవనం గుర్తొచ్చి జాలిగా చూశాడు గణపతి. కాని ఇక్కడ కేయూరుడు తనను గుర్తించాడు.. తనతో మాట్లాడాలని తపనతో చూస్తున్నాడు.

అతనితో మాట్లాడితే పెళ్లి మందిరంలో ఉన్న ఇతర యువరాజులు కూడా తనను గుర్తించవచ్చు. చేతితో నూనెతిత్తిని సరిగా పుచ్చుకుని కేయూరుడిని చూడనట్లు అటు తిరిగి మరో వైపుకు వడివడిగా వెళ్లి పోతున్నాడు గణపతి. కానీ కేయూరుడు గణపతిని వేగంగా వెంబడిస్తూ ముందుకు వెళ్లి ఆపాడు.

గణపతి ఏదో అనేలోగా కేయూరుడు చెప్పాడు. ‘‘క్షమించండి యువరాజా.. కవ్వలను యువరాజు సింఘణ ఆశిస్తున్నాడు. ఆమెను వివాహమాడాలన్న కోరికను పెద్దల వద్ద ప్రతిపాదించినట్లు తెలిసింది. మీరు.. మరి మీరు.. ఇక్క డ మీరు బందీ. అయినా తెగించి కవ్వల కోసం మారువేషంలో ఇక్కడివరకు వచ్చేశారు. తెలిస్తే మీ ప్రాణాలు..’’

‘‘ఆపు.. ఆపు కేయూరా..’’ పళ్ల బిగువునా అన్నాడు కోపాన్ని తొక్కిపెట్టి గణపతి.

కేయూరుడు చెప్పిన వార్తతో గణపతిని ఆవరించిన మాయతెర ఏదో తొలగినట్లుయింది. అతనిలో అప్పటివరకు అణచి పెట్టుకున్న వీరత్వం, ధీరత్వం తిరిగి ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి.

ఇప్పుడేం చెయ్యడం??

ఎలా కవ్వలను తన స్వాధీనంలోకి తీసు కోవడం.. వెనక్కు వంగి ఆమెను కళ్లతో వెదికి చూసి కేయూరునితో ఏదో చెప్పబోయాడు.

కాని అప్పటికే కేయూరుడు భయంతో వణుకు తున్నాడు.

‘‘ఇక్కడ.. ఇక్కడే.. గూడచారులున్నారు యువ రాజా..’’ అంటూ వణకుతున్న కళ్లతో అంతా పరికిస్తున్నాడు.

కేయూరుని మాటలు వింటూనే దూరంగా తన వైపే చూస్తున్న కవ్వలను దగ్గరగా రమ్మన్నట్లు చేయి ఊపి ఆమె వైపే కదిలి అతిథులను తొలగించుకుంటూ వెళ్ల సాగాడు. గణపతి వేగాన్ని చూసిన కవ్వల అటూ ఇటూ చూసి మరో కుడ్యం చాటుకు వెళ్లింది. అక్కడకే వేగంగా చేరాడు గణపతి. ఏదో అనబోయాడు. ఇప్పుడామె ఉత్సాహంగా లేదు. ఉత్సాహమే కాదు, స్నేహపూర్వక దరహాసం ముఖంలో మాయ మయింది. చాలా ఉదాత్తంగా.. దీనంగా ధ్యానంగా తదేకంగా అతనినే చూస్తూ అంది.

‘‘నన్ను.. నన్ను పెళ్లి చేసుకుంటారా.. యువరాజా??’’

నిర్వీణ్ణుడయ్యాడు గణపతి. ఆమె అలా ఓ రాజకుమారుడ్ని అడిగే విధంగా నిజమైన గొంతుతో.. సూటైనప్రశ్న వేసింది.

అప్పటివరకూ ఉన్న హాస్యం.. అల్లరితనం.. గంతులు, చిందులు.. చిలిపితనం మంత్రం వేసినట్లు మాయమయాయి. అప్పుడతనికో సందేహం కలిగింది. సింఘణ ఆమెను కోరుతున్నట్లు.. కవ్వలకు తెలిసిందేమో..

ఏదో నిర్దిష్టంగా చెప్పబోయాడు. ఆమె వేగంగా అతని చెయ్యి పుచ్చుకుని ఎటో లాక్కూపోతూ అంది.

‘‘అక్కడ వేగులున్నారు.. సింఘణ నియ మించాడు..’’

వాళ్లు తమను గుర్తించి అనుసరిస్తున్నట్లు ఆమె గుర్తించింది.

చటుక్కున ఆమెను ఆపి అడిగాడు గణపతి, ‘‘కేయూర నీకేమైనా చెప్పాడా?..’’

ఆమె భీతహరిణలా వణికిపోతోంది. ఓ వేటగాడు తనను వెంబడిస్తున్నట్లు తెలిసిన జింకపిల్ల చూపు అది. ఆమె వణికిపోతోంది. అతని కళ్లలోకి దీనంగా చూస్తోంది. రక్షించు ప్రియమిత్రుడా.. అన్నట్లుంది ఆమె చూపు. మళ్లీ అతన్ని లాక్కు పోతోంది. దూరంగా నిలబడి వాళ్లనే చూస్తున్నాడు కేయూర.

అప్పుడు జరిగిందిది.

కవ్వల వేగంగా గుంజుతూ గణపతిని లాగేసరికి అతని చేతిలోని నూనెతిత్తి గొట్టం మూత ఊడి నూనె జివ్వున పైకెగసి ఆమడదూరం వరకూ మండపం అంతా చిమ్మింది. లిప్తలకాలంలో అక్కడున్న దీపాలు భగ్గున మండి కుడ్యాలకున్న జలతారు, పట్టువస్త్రాలు తగలబడుతూ.. మంటలు మరింత ప్రజ్వరిల్లి ఎగసిపోతున్నాయి.

మండపంలోని అతిథులంతా ఒక్కసారిగా త్రుళ్లిపడి మంటలను గుర్తించి పిచ్చికేకలు పెట్ట సాగారు. క్షణక్షణానికి వేగంగా విస్తరిస్తున్న మంటలు మండపం పైకప్పు వరకు వెళుతూ మండపాన్ని చుట్టేస్తూ కిక్కిరిసి ఉన్న రాజకుటుంబీ కులను భయ బ్రాంతులకు గురిచేస్తున్నాయి. అలా అలా అగ్నిదేవుడు నాలుకలు చాస్తూ మండపం అన్ని వైపులకు వేగంగా విస్తరిస్తున్నాడు.

అప్పటికే జనమంతా బయటకు పరుగులు పెడుతున్నారు.

ఈ హఠాత్పరిణామాలను ఏమాత్రం ఊహించని గణపతి, కవ్వల ఒకరిచేతిలో మరొకరి చెయ్యి ఉండగా మంటలను చూస్తూ.. అప్పటికే హాహాకా రాలు మిన్నుముట్టుతున్న మండపం నుండి ఓ వైపుగా పరుగు తీశారు.

వెనుదిరిగినప్పుడు దూరంగా తమనే చూస్తోన్న కేయూరుని దగ్గరకు వెనగ్గా దీపమహిళ రావడం ఆ లిప్తలో కంటపడింది. ఇద్దరూ వేగంగా పరుగు లంఘించుకుని మండపం బయటకు వచ్చేశారు.

మండపం బయట ఇద్దరూ గట్టిగా హత్తుకుని.. నిలబడిపోయారు.

బయట పరిస్థితి మరోలా ఊహాతీతంగా ఉంది. అంతా నిద్రపోయే సమయం కాబట్టి కోట అంతా ప్రశాంతంగా నిర్మానుష్యంగా ఉండాలి కానీ అలాలేదు.

ఆ అర్ధరాత్రి కారుచీకటిలో ఎవరెవరో వేగంగా పరుగులు పెడుతున్నారు. అరుపులు, హాహాకారాలు, మసక వెలుతురులో కత్తుల మెరుపులు, దూసుకు పోతున్న బరిసెలు.. సకిలిస్తూ ఎగిరి దూకుతున్న గుర్రాలు..

గణపతి బుర్ర చురుగ్గా ఊహించింది.

‘ఇది మా వాళ్ల మెరుపుదాడి కాదు కదా..’

                                                                                                 *    *    *

ఓ చెరసాల వద్ద ఓ మహిళా ఉద్యోగి కాకతీయ మెరుపువీరులను గుర్తించి గావుకేకలు వేయడంతో మెరుపుదాడి యుద్ధ రూపు తీసుకుంది. అప్పటికే మొత్తం నలభై రెండు చెరసాలలున్నట్లు గుర్తించి మెరుపు వీరులందరూ ఆయా చెరసాలలను పంచు కున్నారు. కాకతీయ బందీలను మోసుకుని బయటకు తీసుకురావడం కొందరు చేస్తుంటే వారిని కొందరు చేతులపై పండబెట్టుకుని కోట అంచున ఏర్పాటు చేసిన మంచెల వద్దకు చేరుస్తున్నారు. మంచెల పైకి కొందరు చేరిస్తే కొందరు విజయ వంతంగా కోట బయటవైపు క్రిందికి దించుతున్నారు.

కోట లోపల కొన్ని కొన్ని అతి ముఖ్యమైన కూడలలో మంచి యోధులయిన మెరుపు వీరులు ఆయుధాలపై చేతులుంచి రాబోయే ఏ విపత్కర పరిణామానికయినా సిద్ధమై ఉన్నారు. వారికి దగ్గరగా ఉన్న భవంతుల చాటుగా మరి కొందరు చీకట్లో పొంచి ఉన్నారు.

ఆ మహిళ అరుపులతో దేవగిరి సైన్యం అప్రమత్త మయ్యారు. కొందరు మెరుపువీరులు వారిని చుట్టు ముట్టి దాడి చేశారు. అది ఊహించిన పరిణామమే కాబట్టి మెరుపు వీరులు నిర్దాక్షిణ్యంగా వారిని చంపేశారు. అయితే అప్పటికే కాకతీయుల మెరుపు దాడి వార్త పెళ్లి మండపంలో ఉన్న మహారాజు క్షేత్రపాలునికి, సర్వసైన్యాధ్యక్షుడు జెల్లన సేనానికి చేరింది. మహారాజుకు ఏమీ కాదని హామీ ఇచ్చి సైన్యానికి వెంటనే ఆ కాకతీయ ముష్కరులపై విరుచు కుపడి అందరిని మట్టుపెట్టవలసినదిగా దేవగిరికోట రక్షణ దళనాయకుడు భృంగదేవునికి ఆజ్ఞ ఇచ్చాడు. కోట రక్షణ సైన్యం మొత్తంగా కోట లోపలికి రావలసినదిగా బయట దండోరా వేయించాడు భృంగదేవుడు.

About Author

By editor

Twitter
YOUTUBE