– మద్దాలి లతామూర్తి
భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతి పొందిన రచన
హైదరాబాద్ శివార్లలో ఒక విశాలమైన ఆశ్రమం. మధ్యాహ్న సమయం. వసంతకాలం. పచ్చని తోటలో విద్యార్థులు వలయంగా కూర్చొని ఉన్నారు. వారి ముందున్నారు ఆచార్య వశిష్టశర్మ. ఆయన తెల్లని వస్త్రధారణతో, నిశ్చలమైన కాంతితో కనిపిస్తున్నారు. ఆ వలయంలో కూర్చున్నవారిలో ఉత్తేజ్, ఇపిత, ధ్రువ, శాన్వి అనే నలుగురు విద్యార్థులు ప్రత్యేకంగా ఉత్సాహంగా ఉన్నారు. వారు నేటి కొత్త తరానికి ప్రతినిధులు.
‘‘ఆచార్యా! ‘‘మన పూర్వికులు యుద్ధాలు,వ్యాధులు, కాలుష్యాలతో జీవించేవారని పుస్తకాల్లో చదివాం. కానీ మన కాలంలో ఇవన్నీ ఎందుకు లేవు? మనిషి ఇలా ఎలా మారిపోయాడు?’’ఉత్తేజ్ అడిగాడు.
ఆచార్యుడు చిరునవ్వు చిందించాడు.
‘‘అదే మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు నివసిస్తున్న ఈ కాలం మానవ చరిత్రలో ఒక అద్భుత యుగం. కానీ ఇది ఒక్క రోజులో రాలేదు. ఎన్నో వైఫల్యాలు, అనుభవాలు, త్యాగాలు మానవుడిని ఇక్కడికి తీసుకువచ్చాయి.
నేడు భూమి రూపమే మారిపోయింది. పూర్వం కాలుష్యంతో ఊపిరి పీల్చలేని స్థితిలో ఉన్న నగరాలు ఇప్పుడు ఆక్సిజన్ తోటలతో కళకళలాడుతున్నాయి. వాహనాలన్నీ శబ్దరహితంగా గాలిలో తేలుతూ ప్రయాణిస్తున్నాయి. కాంక్రీటు అడవుల మధ్యన కృత్రిమ మేధస్సుతో రూపొందించిన పారదర్శక కట్టడాలు, సూర్యకాంతిని అడ్డుకోకుండా విద్యుత్తుగా మార్చి మనిషికి సాయపడుతోంది.
ఒకప్పుడు పొగమంచుతో కప్పిఉండే ఆకాశం ఇప్పుడు నీలమణిలా మెరిసిపోతోంది. కాలుష్యంతో నిండిన నదులు, సముద్రాలు మళ్లీ వజ్రాల్లా నిర్మలంగా ప్రవహిస్తున్నాయి. పక్షులు గాలిలో గీతాలాపన చేస్తూ, మానవాళి సాధించిన మహా విజయానికి సాక్ష్యం చెబుతున్నాయి.
ఈ మార్పునకు మూలం మానవ మేధాశక్తి. కానీ అది కేవలం యంత్రాలకు పరిమితం కాలేదు. 21వ శతాబ్దపు మధ్య నాటికి మనుషులు బయో-న్యూరల్ నెట్వర్క్ ద్వారా తమ మేధస్సును విస్తరించుకున్నారు. ఆలోచనలు కేవలం మాటల్లో కాక, శుద్ధ శక్తి తరంగాలుగా ప్రసరించసాగాయి. ప్రపంచంలోని శాస్త్రవేత్తల, కవుల, రైతుల, కార్మికుల ఆలోచనలు ఒకే వేదికపై కలుస్తూ, సామూహిక మేధస్సుగా మారాయి.
భూమి తిరిగి పచ్చదనంతో కళకళలాడుతూ ఉండాలనే కలను నిజం చేసేందుకు అగస్త్య అనే ఒక శాస్త్రవేత్త జీనో-టెరాఫార్మింగ్ అని సాంకేతికతను ఆవిష్కరించాడు. దీనివల్ల భూమి వాతావరణాన్ని, మట్టిని, నీటిని స్వయంచాలకంగా శుభ్రపరిచే జీవకణాలు ఉత్పత్తి అయ్యాయి. ఇవి వ్యాధులను తొలగించడమే కాదు, అడవులను మళ్లీ విస్తరింప జేశాయి.’’
‘‘మరి ‘వ్యర్థాలు’ అని ఉండేవని, వాటివల్ల భూమికి హాని కలిగేదని చదివాం కదా ఆచార్యా, ఇప్పుడు మాకు అటువంటివేమీ కనిపించడం లేదు?’’ ఉత్సుకతతో అడిగింది శాన్వి.
‘‘మంచి ప్రశ్న, ఆనాడు ప్రజలు శక్తి కోసం ఇంధనాలను మండించేవారు. దానితో వచ్చే వ్యర్థాలు గాలిని, నీటిని కలుషితం చేసేవి. కానీ ఇప్పుడు ప్రతి ఇంటిగోడ ఒక శక్తి ఉత్పత్తి యంత్రం. వ్యర్థ పదార్థం అనే పదం మానవ భాష నుంచి మాయం అయిపోయింది. ప్రతిదీ పునరుపయోగం అవుతోంది. సహజ ఇంధనాలు మాత్రమే వాడుతుండటం వల్ల కూడా ఈ వ్యర్థాలు మాయమయ్యాయి’’
గురువు గారు చెప్పిన మాటలు అర్థం కావడంతో తృప్తిగా తల పంకించారు ఆ శిష్యులు.
‘ఆచార్యా! మా తల్లిదండ్రులు నిజమైన మనుషులు కాదని మాకు తెలుసు. మేము రోబోల గర్భంలో పుట్టాం. అలా ఎందుకు జరిగింది? మేమిప్పుడు మనుషులమా? లేక యంత్రాలమా?’’ ఇపిత ఆసక్తిగా అడిగింది.
ఆచార్యుడు కాసేపు ఆలోచించి…
‘‘21వ శతాబ్దం చివర్లో మానవులు వివాహం, పిల్లలు అన్న ఆలోచనల నుంచి దూరమయ్యారు. స్త్రీలు కూడా పురుషులతో సమానంగా, కాదు..కాదు ఇంకా కాస్త ఎక్కువగానే చదువుకుని ఉద్యోగాలు చేస్తుండటంతో, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం వంటి అదనపు బాధ్యతలు తలకు మించిన భారంగా భావించారు. ఉద్యోగం, స్వేచ్ఛ, ఆనందజీవనమే ముఖ్యమని భావించారు. దాంతో జనాభా క్షీణించింది. ప్రపంచ నేతలంతా కంగారు పడ్డారు. అది అలాగే కొనసాగితే భవిష్యత్తులో మానవజాతి అంతరించి పోయే అవకాశం ఉంది. ముఖ్యంగా యువత అనేది లేకుండా, మొత్తం జనాభాలో వృద్ధులే ఉంటే అభివృద్ధి అనేది శూన్యంగా మారుతుంది.
అందువల్ల అన్ని దేశాల్లోనూ సహజంగా పిల్లలను కనాలనుకొనేవారికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఆర్థిక సహాయాలు అందించాయి. ఐనా పెద్దగా ప్రయోజనం కలుగలేదు. కనుక నేతలంతా కలిసి శాస్త్రవేత్తలను దీనికి పరిష్కారం చూపవలసిందిగా ఆదేశించారు. శాస్త్రవేత్తలంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. రోబోలు మనుషుల్లా గర్భాన్ని ధరించి పిల్లలకు జన్మనివ్వాలి. అప్పటికే రోబోలు మానవ సేవకులుగా కాక మానవ మిత్రులుగా మారాయి. అవి పొలాల్లో రైతులతో కలసి పంటలు పండిస్తూ, చికిత్సలో డాక్టర్లకు సహాయం చేస్తూ, విద్యలో గురువులకి తోడ్పడుతున్నాయి.
ప్రపంచ సాంకేతిక రాజధాని హైదరాబాద్ నగరంలో గ్లోబల్ లైఫ్ సైన్స్ కాన్ఫరెన్స్ జరిగింది. ప్రపంచ మీడియా, శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఒకే వేదికపై ఉండగా భారతదేశానికి చెందిన న్యూరా నెట్వర్క్ సంస్థకు చెందిన డాక్టర్ రామ్ ఉత్సాహంగా ప్రకటించారు.
‘‘ఇకపై మహిళలు గర్భధారణలో కష్టపడవలసిన అవసరం లేదు. ‘సరోగట్రాన్’ అనే మా ఈ హ్యూమనాయిడ్ రోబోలు స్త్రీల వలెనే తమ గర్భంలో శిశువులను సురక్షితంగా పెంచుతాయి. దీని వల్ల ప్రసవ నొప్పి, ఆరోగ్య సమస్యలన్నీ తప్పించవచ్చు. ఇకమీదట ప్రసవం అనేది బాధాకరమైనది కాదు. మా సరోగట్రాన్లు గర్భాన్ని మోస్తాయి. మీ శిశువును రక్షిస్తాయి, మీ బిడ్డ సురక్షితమైన, శాస్త్రీయమైన మార్గంలో ఆరోగ్యంగా జన్మిస్తుంది. మహిళలు గర్భధారణ కోసం తమ ఉద్యోగం, ఆరోగ్యం, అందం ఏదీ కోల్పోవలసిన పనిలేదు.’’ అని ప్రకటించారు.
మానవ అండాన్ని, శుక్రకణాన్ని శాస్త్రీయ పద్ధతిలో ఈ రోబో గర్భంలో ప్రవేశపెడితే, తొమ్మిది నెలల తర్వాత ఆరోగ్యవంతమైన బిడ్డను ప్రసవించ గలదు. దాని శరీర నిర్మాణం మానవ స్త్రీకి సమానంగా ఉంటుంది. కానీ అది బాధను అనుభవించదు, అలసట ఎరుగదు, మానవ ప్రసవంలో లాగా మాతా శిశు మరణాల ప్రమాదం ఉండదు.
ఈ ప్రయోగం విజయవంతం అవడంతో వయసు పెరిగి, లేదా ఆరోగ్య సమస్యల వల్ల, ఉద్యోగ బాధ్యతల రీత్యా పిల్లలను కనలేని దంపతులకు ఒక వరంగా మారింది. అలా మీలో కొందరు సహజంగా జన్మించారు. ఆ సంఖ్య సరిపోదు కనుక ఎక్కువ మంది రోబోల గర్భంలో పెరిగారు.
అంతేకాకుండా శాస్త్రవేత్తలు ఈ రోబో కడుపులో పెరిగే పిల్లల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. తన గర్భంలో పెరుగుతున్న ప్రతి బిడ్డ చెవులకు మహాభారతం, భగవద్గీత, రామాయణం వంటి పవిత్ర గ్రంథాలను వినిపించడంతో పాటు ఒక అమ్మలా ఆ శిశువుతో మాట్లాడుతూ, మానవ సహజమైన ప్రేమ, అనుబంధాలు ఆ బిడ్డకు కలిగేలా ఆ రోబో తల్లి ప్రవర్తిస్తుంది. మధురమైన సంగీతం, స్ఫూర్తిదాయకమైన కథలు వినిపిస్తుంది. ఆ ధ్వనులు మిమ్మల్ని మనుషుల కంటే ఎక్కువగా తీర్చిదిద్దాయి. ఇలా పిల్లలు మతం, జాతి, భాష అనే గోడలు దాటి, ప్రపంచ మానవ విలువలతో పుట్టారు. మీరు అందరూ ఆ తరానికి ప్రతినిధులు. అందుకే మీరందరూ ఇంత సమతుల్యంగా ఉన్నారు. పుట్టిన తర్వాత పిల్లల సంరక్షణ బాధ్యత అంతా ప్రభుత్వాలే వహిస్తున్నాయి. ప్రత్యేక కేంద్రాలలో వారికి పోషణ, ప్రేమ, విద్య అన్నీ సమానంగా లభిస్తున్నాయి. కనుక ఇప్పుడు మీ తరం పిల్లలకు ధనిక పేద తారతమ్యం కూడా లేదు.’’
ఇషిత కళ్లలో మెరుపులు మెరిసాయి.
‘‘అంటే, మా రక్తంలో శాస్త్రం, మా హృదయంలో ధర్మం ఉంది కదా, ఆచార్యా?’’
ఆచార్యుడు తల ఊపాడు.
‘‘అదే మానవజాతి విజయం.’’
ధ్రువ తన ప్రశ్న వేశాడు..‘‘ఆచార్యా! పాఠశాలలు, కళాశాలలు మాయమై, ఆశ్రమాలు మాత్రమే ఎందుకు ఉన్నాయో చెప్పండి.’’
‘‘ఎందుకంటే…. పూర్వం పాఠశాలలు కేవలం పుస్తకాల జ్ఞానం ఇచ్చేవి. కానీ మనిషి అంతరిక్షంలోకి వెళ్లినా, భూమిని రక్షించలేకపోయాడు. అందుకే మానవజాతి మళ్లీ ప్రాచీన భారతీయ విద్యా విధానాన్ని ఎంచుకుంది -ఆశ్రమ విద్యావ్యవస్థ.
ఇక్కడ మీరు కేవలం పాఠ్యాంశాలు మాత్రమే కాదు, యోగ, సంగీతం, సాహిత్యం, ప్రకృతి సంరక్షణ, సాంకేతికత, నీతి, విలువలు అన్నింటినీ నేర్చు కుంటారు. అంతే కాకుండా ఇక్కడ వివిధ వృత్తుల శిక్షణ కూడా పొందవచ్చు. ఎవరికి నచ్చిన అంశాల్లో వారు ప్రావీణ్యం సాధించడానికి అవకాశం ఉంది. దానివల్ల నిరుద్యోగం అనేది ఉండదు. జ్ఞానం ఒక చేయి, ధర్మం మరో చేయి. ఈ రెండు చేతుల మీదే మానవ నాగరికత నిలబడి ఉంది.
ప్రపంచానికి ఒకే భాషగా సంస్కృతం ఎంపికైంది. ఇంగ్లీష్ శాస్త్ర భాషగా నిలిచినా, సంస్కృతమే జ్ఞానం, సంస్కృతి, విలువల భాషగా పరిగణన పొందుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఒకే విద్యావిధానాన్ని అమలు చేయడం ద్వారా మీ తరం వారికి ఎక్కడైనా జీవించ గలిగే అద్భుతమైన అవకాశం ఉంది.’’
శాన్వి మెల్లగా అడిగింది:
‘‘అప్పుడు యుద్ధాలు? సరిహద్దులు? కులం, మతం అనే తేడాలు?’’
ఆచార్యుడు దూరంగా సూర్యాస్తమానాన్ని చూశారు.
‘‘అవి ఒకప్పుడు మానవుణ్ణి చీల్చాయి. కానీ 21వ శతాబ్దం చివర్లోనే మానవులు గ్రహించారు మానవు లంతా ఒకే కుటుంబం, కలిసి ఉంటే అద్భుతాలు సాధించవచ్చు, కలహిస్తే వినాశనం తప్పదు అని.
ఇప్పుడు దేశాల మధ్య సరిహద్దులు ఉన్నా, వాటి మధ్య యుద్ధం ఉండదు. విభేదాలు వస్తే శాంతి సైన్యాలు పరిష్కరిస్తాయి. కులం, మతం అన్నవి మానవ విలువల కింద లయమయ్యాయి. ప్రతి బిడ్డ ఒకే పాఠం నేర్చుకుంటుంది ‘వసుదైవ కుటుంబకం’ సంస్కృతం ప్రపంచ భాషగా మారింది. అన్ని దేశాల ప్రజలు ఒకే భాషలో సంభాషిస్తారు. కాబట్టి భేదాభి ప్రాయాలు తగ్గాయి.
మరో విద్యార్థి విశ్వనాథ్ ముందుకు వచ్చాడు, ‘‘ఆచార్యా మనిషి ఆయుష్షు 120 ఏళ్లు అని చెప్పారు. అది ఎలా సాధ్యమైంది?
‘‘అది శాస్త్రం మహిమ,’’ అని ఆచార్యుడి సహాయక రోబో జవాబిచ్చాడు.
‘‘జన్యువులను సరిదిద్దే చికిత్సల వల్ల వ్యాధులు పోయాయి. కొత్త అవయవాలు తయారు చేయ గలిగాం. వృద్ధాప్యం కూడా కష్టంగా కాకుండా, ఆనందంగా గడిచేలా మారింది. మానవుడు శరీరాన్ని శాస్త్రంతో కాపాడుకుని, ఆత్మను ఆధ్యాత్మిక తతో పోషించుకుంటున్నాడు.’’
ఆచార్య వశిష్టశర్మ అందుకున్నారు, ‘‘అంతేకాదు, మనిషి తన తప్పును తెలుసుకున్నాడు. ప్లాస్టిక్ నిషేధించాడు. సౌరశక్తి, వాయుశక్తి వినియోగించాడు. ప్రతి నగరానికి పక్కనే ఒక పచ్చని అడవి తప్పనిసరి చేశాడు. లంబ కృషి (వెర్టికల్ ఫార్మింగ్) వల్ల ఆహారం సమృద్ధిగా లభిస్తోంది. వ్యవసాయం కేవలం సేందియ్ర పద్ధతిలో, గో ఆధారితంగా మాత్రమే జరుగుతోంది. ప్రకృతి మనిషిని క్షమించింది. మనిషి ప్రకృతిని ఆలింగనం చేసుకున్నాడు. అందువల్లనే మనిషి ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాడు.
సాయంత్రపు గాలి మరింత చల్లబడింది. విద్యార్థుల కళ్లలో ఉత్సాహం.
ఆచార్యుడు చివరగా అన్నాడు:
‘‘పిల్లలూ ఈ మార్పులు కేవలం శాస్త్రం వల్లే రాలేదు. మానవుడు తన అంతరాత్మను, ఆధ్యాత్మి కతను గుర్తించాడు. శాస్త్రం అతన్ని ఆకాశమంత ఎత్తుకి తీసుకెళ్లింది. కానీ యోగం, ధ్యానం అతన్ని లోతైన శాంతిలోకి నడిపించాయి.
అందుకే ఈ 2150 సంవత్సరం -ఒక సువర్ణయుగం.
మీరు ఈ భూమికి కొత్త సంస్కృతి సృష్టించబోయే సంతతి, జ్ఞానం మీ బలం, ధర్మం మీ మార్గం.’’
ఆ మాటలు విన్న విద్యార్ధుల కళ్లలో వెలుగులు మెరిశాయి.
ధృవ మెల్లగా అన్నాడు:
‘‘ఆచార్యా, మేము కొత్త మానవ యుగానికి ప్రతినిధులం.’’
ఆశ్రమం నిశ్శబ్దంలో మునిగింది. ఆకాశంలో నక్షత్రాలు ఒక్కొక్కటిగా వెలిగాయి. మానవజాతి భవిష్యత్తు కూడా అలా ప్రకాశవంతంగా వెలుగు తోంది.