‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన

దేవగిరి రాజ్యం సహ్యాద్రి పర్వత పాదాల క్రింద ఆగ్నేయంగా ఉన్న అనేక పీఠభూమి గ్రామాలను కలుపుకుని ఓ రాజ్యం ఏర్పడింది. అటు ఉత్తరాది వారికీ ఇటు దక్షిణాది వారికీ.. ఇద్దరికి సంబంధించిన రాజ్యంగా ఓ వెలుగు వెలుగుతోంది. జైత్రపాలుడు కాకతీయ రుద్రదేవుడినే ముప్పుతిప్పలు పెట్టి అతని చావుకు కారకుడిగా గుర్తింపున్నవాడు. రుద్రదేవుని తమ్ముడు మహాదేవుని ప్రత్యక్షయుద్ధంలో సంహరించి అతని కొడుకు అభిషిక్త యువరాజు గణపతిదేవుని పట్టి తన కారగారంలో బంధించిన ప్రతిభాశీలి.. గొప్ప యోధుడు.

కాకతీయులతో శత్రుత్వం వల్ల గత పదేళ్లుగా ఆందోళన కలిగించే పరిస్థితుల మధ్య జీవిస్తున్నారు ప్రజలు. యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. అందుకే జైత్రపాలుడు తాను చేస్తున్న యుద్ధాలు ప్రజలలో భయాందోళనలు సృష్టించకుండా, రాజ్యం క్షేమంగా, ప్రశాంతంగా ఉన్నట్లు నమ్మించడానికి ఈ వివాహం ప్రజలంతా చర్చించుకునేలా అట్టహాసంగా చేస్తున్నాడు. అతని నిర్ణయాలు కొన్ని  పెద్దలలో కలవరపాటు కలిగిస్తుంటాయి. ఇది కూడా అలాంటిదే. ‘ఇంత ఉత్కంఠ యుద్ధ పరిస్థితులలో ఈ వివాహ సంబరాల ఎందుకు’ అని యోధులంతా చిరాకు పడుతున్నా జైత్రపాలుడు పట్టించుకోకుండా వివాహ సంబరాలు అట్టహాసంగా జరిపిస్తున్నాడు.

నాగతిస్య వల్ల గణపతి ఆ వివాహ మందిరం లోకి విజయవంతంగా ప్రవేశించాడు. దీపాలకు నూనె పోసేవాడి రూపంలో నాగతిస్యదే మురికిపంచె, జిడ్డు ముఖం, ముఖంపై అక్కడక్కడా పులిపిరి కాయలు, ఓ కన్ను యుద్ధంలో దెబ్బతిన్నట్లు పైన గాటు.. అడ్డదిడ్డంగా ఉన్న జుట్టు.. మొరటుగా పెరిగిన గెడ్డం, కాస్త వంకరగా చెయ్యి.. మరో చెయ్యి నూనె తిత్తికున్న తోలుగొట్టం మీద ఉంచాడు.

నూనె తిత్తిపై చేయి ఎప్పుడూ ఉండాలో.. నూనె ఎలా కాగడాపైనా.. దీపంలోకి వంపాలో.. అంతా నేర్పి పంపించాడు నాగతిస్య.

ప్రదర్శన కళల పట్ల కొంత ఆసక్తి, అనురక్తి ఉన్న గణపతి తను వాలకం లాంటి కళను ప్రదర్శిస్తు న్నట్లు భావిస్తూ ఆనందంతో మురిసిపోతూ ఆ అమ్మాయిని వెదుకుతున్నాడు.

అప్పటికే పెళ్లి సంబరాలు ఉధృతస్థాయికి చేరడంతో మంగళవాద్య విరావాలతో మందిరం హోరెత్తిపోతోంది. ముఖ్యంగా దీపాలంకరణ ఎంత బాగా చేశారంటే వేయిస్తంభాల ఆ విశాలమందిరం మొత్తంగా నేలపై పడిన సూది కూడా స్పష్టంగా కనిపిస్తోంది.

పెద్దలు, పిన్నలు ఆడ మగ మహారాజులు, మహారాణులు.. ఎందరెందరో మండలాధీశులు.. వారి వారి శ్రీమతులు, పిల్లలు, కుర్రాళ్లు, యువతులు..

ఓ అరగంట వెతగ్గా వెతగ్గా కనిపించింది కవ్వల..

మిత్రులలో కబుర్లతో పెట్రేగిపోతోంది. చేతిలోని నూనె తిత్తిని మరచి అలా కళ్లప్పగించి చూస్తుండి పోయాడు.

ఓ మెరపుతీగెకు పట్టు లంగా ఓణి సింగారించి నట్లుంది. ఓ ఉరుముకు నవ్వు అద్దినట్లుంది. దీర్ఘ కుంతలాలున్న ఓ నక్షత్రానికి వజ్రాల పాపిటబొట్టు.. కెంపుల నాగారంతో కేశాలంకరణ చేసినట్లుంది. లత్తుక పరవశంతో ఆమె పాదాలకు అద్దుకుని ప్రణమిల్లినట్లుంది. గోరింటాకు ఆమె అణువణువునా పూచి పండినట్లుంది. చూస్తుండగానే ఆమె ఉదయ సంధ్యాకాశంలా క్షణక్షణం వన్నెచిన్నెల వలయాలతో విశ్వమంతా విస్తరించి అతని ప్రపంచమయి పోయింది.

గణపతిని కవ్వల గుర్తించలేదు. ఆమె మిత్రురాళ్లతో మంగళతూర్య విరావాల మధ్య గొంతెత్తి అరుస్తూ ఆడిపాడుతోంది. ఓ రాచకన్నేగా ఆమె.. పరిచారికలు, ద్వారపాలకులు, చేటికలు, దీపాలు మోసేవారు, వాటిల్లో నూనె పోసేవారు.. తదితర అతి సాధారణ బానిసల్లాంటి పనివారుల వంక చూడటం జరుగదు.

గణపతికి అ సంగతి తెలుసుకాని తాను.. గణపతిని కదా.. చూడకపోతే ఎట్లా.. అదిగో ఇటే చూస్తోంది. అవును.

నన్నే చూస్తోంది. అదే ప్రేమంటే.. మారువేషంలో ఉన్నా గుర్తించాలి. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయి పోయాడు. చెయ్యి ఊపు దామనుకున్నాడు. రెండు చేతులు ఖాళీ లేవు. మళ్లీ మాయమై పోయిందామె. ఓ దీపం మోసే మహిళ.. దీపకాంత ఒకరు దగ్గర కొచ్చి స్నేహపూర్వకంగా నవ్వింది. ఆమెను పట్టించు కోకుండా కవ్వల కోసం వెదకసాగాడు. దీపకాంత వదిలి వెళ్లలేదు.

‘‘మీసకట్టు బావుంది.. ఏ వూరు?’’ అందా దీపం.

అంటూనే దూరంగా చూసి గబగబా వెళ్లి పోయింది. అటు చూశాడు. ఓ మగాడు గుర్రుగా చూస్తున్నాడు.

తన మీసకట్టుపై కవ్వల చేసిన వ్యాఖ్య గుర్తొచ్చింది గణపతికి. ముసిముసిగా నవ్వొచ్చింది.

అప్పుడే దూరంగా కవ్వల!! అబ్బ.. కవ్వల కనిపించింది.

వేగంగా వెళ్లబోయి ఇప్పుడు తను మారువేషంలో ఉన్నట్లు గుర్తొచ్చి ఉత్సాహం హెచ్చి.. బాగా నటిస్తున్నం దుకు ఆనందం మరింత హెచ్చి హెచ్చి.. రెండు మూడు దీపాలలో నూనె ఒంపుతూ కవ్వల కనిపించిన వైపుగా.. దగ్గరగా వెళ్లాడు.

ఓ పెళ్లిమండపంలో ఇలా మారువేషంలో తను.. పెళ్లి ఆహ్వానితురాలిగా ధగధగలాడిపోతున్న కవ్వల.. తన్మయత్వంలో ఏదో అనబోయాడు. కాని ఆమె కొత్తగా.. రోతగా.. చూసింది. బెదిరింది. ఎటో వెళ్లబోయింది. ఆమె భటులకు చెబితే కొంప మునుగుతుంది. గబుక్కున మీసం మీద చెయ్యి వేసి తనను గుర్తించమన్నట్లు మీసాన్ని నాలుగైదుసార్లు దువ్వాడు. ఆమెకు సందేహమేదో కలిగినట్లుంది. వెనుదిరిగి దగ్గరగా వచ్చి ముఖంలోకి వివరంగా చూసి గుర్తించినట్లు వెర్రిగా చూసింది. ఆనక విశాలంగా భారీగా నవ్వింది. అతని ముఖంలో వందదీపాలు గప్పున వెలిగాయి. ఏదో అనబో యాడు. ఆమె సిగ్గుగా నవ్వి ముంగురులు సవరించు కుంటూ క్రీగంట చూస్తూ ముసిముసి కలిపిన నవ్వులతో అంది.

‘‘నేను.. నేను.. చిన్నకవ్వలను యువరాజా.. అక్క అదుగో అక్కడుంది.’’

గతుక్కుమన్నాడు. ఆమె మాయమైంది.

గడబిడ అయిపోయాడు. అప్పుడే అసలామే.. పెద్ద కవ్వల కనిపించింది.

ముప్పిరిగొన్న ఆలోచనలతో నిలబడిపోయాడు.

మరో కవ్వల.. కవల చెల్లెలు చిన్నకవ్వల ఉన్నదని అప్పుడు గుర్తొచ్చింది. అయితే ఈరోజు ఇద్దరూ ఒకేలాంటి దుస్తులతో ఉన్నారు. కదిలి పెద్ద కవ్వల ఉన్న వైపున్న దీపాలలో నూనె వంపుతూ ఆమె దగ్గరగా వెళ్లాడు. ఆమె కూడా రోతగా చూసింది. ఆమెకు కూడా అర్ధమయ్యేలా మీసం ప్రత్యేకంగా తిప్పాడు.

కారణం.. ‘‘నీ మీసం భలేగా ఉంది. నాకు నచ్చింది..’’ అన్నదో రోజు. అదిప్పుడు ఉపయోగ పడింది.

పెద్ద కవ్వల గుర్తించింది. లిప్తలకాలంలో కళ్లు పెద్దవి చేసి భయం ప్రకటించింది. మెల్లగా అక్కడ పరివేష్టితమై ఉన్న మిత్రురాళ్లను వదిలి కాస్త అవతలగా చీకట్లోకి వెళ్లింది. ఆమె వెంటనే వెళ్లాడు.

‘‘అమ్మో ఎంత తెగువ.. ఎంత ధైర్యం.. ఎవరైనా గుర్తిస్తే..నరికి చంపేస్తారు.’’ అంది గుసగుసలాడినట్టు.

రొమ్ము విరిచి ఓ చిరునవ్వు విసిరాడు. ‘‘నన్నా.. హు.. దగ్గరలో మా కాకతీయ గూఢచారులున్నారు. నాకేం భయం?!’’ అనేశాడు.

‘‘వాళ్లను మా గూఢచారులు గుర్తించినా నువ్వే చస్తావ్‌.’’ అం‌ది.

లోలోపల చిన్నగా వణుకొచ్చింది.

ఆమె అంది మళ్లీ ‘‘ఇది ఎంత ప్రమాదమో గుర్తించావా.. ఎందుకొచ్చావ్‌??’’

‘‘‌నీకోసమే. నీకోసం ఏవైనా చేస్తాను కవ్వలా..’’ అన్నాడు. మాటలో అనుకోకుండా నిజాయితీ ధ్వనించింది.

ఆమె కూడా నిజాయితీగానే స్పందించింది. బుగ్గల్లో మెరుపు గణపతికి కనిపించింది. ఏదో అనబోయి చటుక్కున వడివడిగా వెళ్లి మిత్రబృందంలో కలిసింది.

కొడిగట్టిన దీపం నూనే పీల్చినట్లు వేడిగా ఓ నిట్టూర్పు విడిచాడు. మొత్తంగా ఆమెను కలవడటం ఆమెతో మాట్లాడటం.. చాలు. వచ్చిన పని అయ్యింది.

అప్పుడే నాగతిస్య గుర్తొచ్చాడు. అతడు నిర్దేశించిన సమయం దాటిపోతోంది. తిరిగి వెళ్లిపోదామా అనుకున్నాడు. కాని చరిత్రలోని అందరు ప్రేమికుల్లాగే గణపతి కూడా ఇక్కడే తప్పటడుగు వేశాడు. అదే ఓ పీడకలలా జీవితమంతా వెంటాడింది.

                                                                                                    *           *           *

దేవగిరి కోట..

రాచనగరిలో రాజవంశీయుల వివాహ వేడుక అట్టహాసంగా జరుగుతోంది. అప్పటికే మహావీరులుగా గుర్తింపు పొందిన కాకతీయ సోదరులు రుద్రదేవుడు, మహాదేవుడు.. ఇద్దరినీ వీర స్వర్గానికి పంపిన మహావీరునిగా జైత్రపాలుని, గొప్ప సైన్యం కలిగిన రాజ్యంగా దేవగిరిని రాజ్యాలు శ్లాఘిస్తున్నాయి. అవతల కాకతీయ సైన్యం యుద్ధక్షేత్రం వద్దనే ఉన్నదన్న ఎరుక జైత్రపాలునికి ఉన్నది కాని సాధారణ ప్రజలకు లేదు. మహారాజు గారింట మ్రోగుతున్న పెళ్లిబాజా లతో ప్రజలంతా మమేకమై కోట లోపలా బయటా సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా బయట కోట నీడలో.. కోట చుట్టూ అనేకమంది పంచములు, అస్పృశ్యులు చిన్నచిన్న ఇళ్లు నిర్మించుకుని బ్రతుకు వెళ్లబుచ్చుతున్నారు. వారందరికి బాణసంచా ఎవరు ఇచ్చారో ఏమో, కోటలోని పెళ్లి వేడుకను మించి బాణసంచా ఉధృతంగా కాలుస్తున్నారు.

కోట పైభాగాన ఉన్న కాపలా భటులు కూడా ఉత్సాహంతో బాణసంచా వెలుగుల్లో చిందులు వేస్తున్నారు.

లోపల, బయటా బాణసంచా వెలుగుల్లో దేవగిరికోట వెలిగిపోతోంది.

ఆ హడావిడిలో కోట గోడలపైకి ఎగబ్రాకుతున్న కాకతీయ వీరులను ఎవ్వరూ గుర్తించడం లేదు. కాస్త కనిపించినా గమనించే స్థితిలో లేరు. అప్పటికే కోట చుట్టూ నిర్మించిన కందకాలను, వాటిల్లోంచి ఎగురుతున్న మొసళ్లను విజయవంతంగా దాటేసి కోట బురుజులపైకి ఎక్కేశారు.

ఆ బురుజులపైనున్న దేవగిరి సైనికులూ పెళ్లి వైభవాన్ని తిలకిస్తూ చిందులు వేస్తూ దగ్గరగా వచ్చిన కాకతీయ సైనికులను గమనించడంలేదు. మరికొన్ని గంటలలోనే వారిని అతి సునాయాసంగా మట్టు బెడుతూ అత్యంత చురుకుగా కోటలోపలికి ప్రవేశిస్తున్నారు కాకతీయ ప్రత్యేక మెరుపు దళం.

గత అరుమాసాలుగా రూపొందించిన అద్భుత ప్రణాళిక ‘కాకతీయం’.

ఈ మెరుపుదాడికి మందడిగా మల్యాల కాటయను నియమించాడు. మందడి కాటయ ఈ ప్రత్యేక కార్యానికి కావలసిన దళ సభ్యులుగా ఎక్కటి, ఒంటరి సేనానుల నుండి రెండువేల మందిని తనే ఎంపిక చేసుకున్నాడు. రాజస్థానీ రాజ్యయోధ శిక్షకులను పిలిపించుకుని ప్రత్యేక శిక్షణ ఇప్పించాడు. దళ సభ్యులు నిప్పుల్లో నిలబడి కబుర్లు చెప్పగలరు. నీళ్లల్లో ఈదుతూ భోజనం చేయగలరు. శత్రుయోధుల శరీరంలో కోరుకున్న భాగాన్ని చేతులతో విరిచి తోలు వలిచి పచ్చి మాంసాన్ని తినగలరు. నవ్వు, ఏడుపూ, జాలి, దయ లేవు వాళ్లకు. రాతి గోడలు, ఇనుప తలుపులు.. చేత్తో తోసి నడిచిపోతారు. రెండు భవనాల ఎత్తు ఎగరగలరు. నాలుగుతాళ్ల లోతునుండి పైకి రాగలరు. వీళ్లను తాకినా.. వీళ్లు తాకినా ఎదుటివాడే చస్తాడు.

ఒక్కముక్కలో, ఆ దళం ఏకకాలంలో మృత్యుం జయులు.. మృత్యువులు.

దళం పూర్తిగా సన్నద్దులయ్యేలోగా దేవగిరి కోటలోని అంగుళం అంగుళం పూర్తిగా ఎలా ఉంటుందో చిత్రాలు తయారు చేయించాడు రుద్ర సేనాని. కోట గోడ నుండి ఏ భవనం ఎక్కడుంది.. వాటి మధ్య దూరం.. దారులు, వీధులు, భవనాలు, అందులో ప్రతి గది.. ద్వారం, మలుపులు.. ఏ నడవా ఎటు వెళుతుంది.. ఎక్కడ మలుపు తిరుగు తుంది.. బయటకు ఎంత దూరాన ద్వారం ఉంది.. మధ్య మధ్య ఉద్యానవనాలు.. నీటితోట్టెలు, పశువులకోష్టాలు.. అందులోని గుర్రాలు, ఏనుగులు.. తదితరాలు.. వాటి మేత కోష్టం.. ఏ చిన్న వివరణ  వదిలి పెట్టలేదు. ఇవన్నీ పగలు ఎలా చూడగలమో రాత్రి, సంధ్యవేళ, మసక వెలుగులో.. ప్రత్యూష వేళ.. వెలుగుల్లో, చీకట్లలో స్పష్టంగా చూడగలరు.

యువరాజు గణపతిదేవులవారిని క్షేమంగా బయటకు తీసుకుని పోవడం ఆ దళం ప్రధాన లక్ష్యమైతే దాదాపు దేవగిరి చెరసాలలో మగ్గుతున్న వెయ్యిమంది కాకతీయయోధులను తప్పక విడిపించి రక్షించి దేవగిరి కోట దాటించాలి.. ఇది రెండవ లక్ష్యం.

‘‘పరిస్థితి అనుకూలించకపోతే నువ్వు చనిపో! కాని మన సైనికుడు తిరిగి కోట దాటాలి.’’

ఇది మందడి కాటయ నిర్ణయం.. ఆదేశం.. ఆజ్ఞ!!

మొన్నటి యుద్ధంలో వెయ్యిమంది కాకతీయ యోధులను బందీలుగా తీసుకుపోయి ఖైదు చేశారు. వారిని తర్వాతి యుద్ధాలలో రథాలకు ముందు కడతారు. అశ్వికులకు ముందు కూర్చుండ బెట్టి శత్రువులకు ఎరగా అందిస్తారు. శత్రువులు వీళ్లను చంపగానే వాళ్లను దేవగిరి సైనికులు చంపేస్తారు.

ఏది ఏమైనా అందరిని.. ఒక్క కాకతీయ సైనికుడిని కూడా వదలకుండా రక్షించాల్సిందే.

మొత్తం బందీలుగా పోయిన కాకతీయ సైనికుల పేర్లతో పట్టిక తయారు చేయించాడు మందడి కాటయ. ఒక్కరికి ఇద్దరిద్దరు దళవీరులను కేటా యించాడు. ఈ కార్యంలో దళసభ్యులు చనిపోతే పోవచ్చు. కానీ లక్ష్యం సాధించి తీరాలి. అంటే ఒకరిద్దరు దళసభ్యుల ప్రాణాలు పోయినా బందీలు ఎవ్వరూ చావకూడదు!!

ఇక ఆయుధాలు కూడా ప్రత్యేకించి తయారు చేయించాడు. రక్షణ పరికరాలు.. శిరస్త్రాణాలు, కవచాలు, నడుం పటకాలు, కత్తులు, ఖడ్గాలు, బాకులు, బరిసెలు, ధనుస్సు, బాణాలు.. శరీరమంతా ఆయుధాలే. ఇనుప తెర లోపలుంటే పైన తోలు దుస్తులు..

‘‘నువ్వే ఒక ఆయుధానివి. నీకు కత్తులు, కటారులు ముఖ్యం కాదు. రక్షణ కవచాలు, శిరస్త్రాణాలు, బరిసెలు ముఖ్యం.’’

ఇక గుర్రాలు, ఏనుగులు.. అస్సలు ఏమీ చెయ్యలేవు. వాటిని ఎత్తి ఆవలెయ్యగలరు. లేదూ దారి తప్పించగలరు. నిర్వహణ అంతా రాత్రి పూటే జరుగుతుంది. కాబట్టి అందరూ పగలుకంటే రాత్రివేళ స్పష్టంగా అన్నీ చూడగలరు.

ఈ వివాహ వేడుక వేళే కార్యం నిర్వహించాలని ముందే నిశ్చయమైంది.

ఈ శిక్షణ అంతా అనుమకొండ శిక్షణా కేంద్రాల వద్ద జరిగింది. స్కంధావారం వద్ద సంప్రదాయ యుద్దానికి సిద్ధమౌతున్నట్లు శత్రు గుఢచారులు భావించేలా వాతావరణం ఉంటుంది. ఎక్కువగా సంధి విగ్రహి కనిపిస్తాడు.

అంటే చర్చల కోసం దేవగిరికి పంపుతున్నట్లు వైరి శిబిరం వేగులు భావిస్తారు. అసలు కార్యం అనుమకొండలో రహస్యంగా యుద్ధ ప్రాతిపదికన పూర్తయ్యింది.

ప్రధాన దళానికి సహకారం కోసం సహాయ దళబృందాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ల లక్ష్యాలు వాళ్లకు నిర్దేశించి పంపారు. రెండు మాసాల ముందే వాళ్ల కార్యక్రమం మొదలయ్యింది. దేవగిరి కోట చుట్టూ ఉన్న వెలివాడల్లో.. అడవుల్లో నివశిస్తూ కోట చుట్టూ నివశిస్తున్న వారిని బాగా ఆకట్టుకున్నారు. ఈ పెళ్లి సందర్భంగా రాజుగారు పంపారంటూ వీళ్లే బాణసంచా చాలా చాలా ఇచ్చారు. ఆ రాత్రి వాళ్లు కోట చుట్టూ ఆ బాణసంచాతో కళ్లు మిరిమిట్లు గొలిపేలా.. ఆ వెలుగులో ఎవరు ఏమి చేస్తున్నారో తెలియనంత సంబరాలలో మునిగితేలారు.

ఈ సందట్లో మెరుపుదళం కోటపై కాపలా సైనికులను చప్పుడు కాకుండా సంహరించి కోటలోకి దిగిపోయింది.

అక్కడితో ‘కాకతీయం’ తొలి దశ విజయ వంతంగా పరిపూర్ణమయ్యింది.

ప్రత్యంగుళం అత్యంత జాగరూకతతో రూపొం దించిన ‘కాకతీయం’లో అతి ముఖ్యమైన అంశం మర్చిపోయారు.

                                                                                                    *           *           *

వెళ్లాలా వద్దా..

గొప్ప మీమాంసలో పడిపోయాడు గణపతిలోని ప్రేమికుడు.

అదిగో! అక్కడుంది కవ్వల.. సగం వెనక్కు తిరిగిన కవ్వల.. అబ్బ ఎంత బావుంది.. ఎరెర్రగా పూచిన మందార మొక్కలా. వదిలి వెళ్లబుద్ధి కావడంలేదు. కాసేపు ఆగి వెళదాం. అక్కడ నాగతిస్య తనకోసం ఎదురు చూస్తున్నాడేమో.. అటు తిరిగి నిలబడినా తల తిప్పి ఓరగా తననే చూస్తోంది కవ్వల. ఒక్కసారి.. మరొక్కసారి కలిసి.. రెండు మూడు మాటలు మాట్లాడేసి మూడు అడుగులు వెనక్కు వేసి గిర్రున తిరిగేసి వెళ్లిపోదాం.

బావుంది బావుంది.. అలాగే చెయ్యవచ్చు….

ఆలోచనలు ఆగిపోయాయి.. కవ్వల చూడడం ఆపేసింది.

చూపుల విరితూపులు, చూపులతో చంపడం అని కవివరేణ్యులు రాస్తారు. చదివాడు గాని ఇప్పుడే చస్తోంటే అనుభవమౌతోంది. అదేవిటి.. అటు ఆ చీకట్లోకి.. నవ్వుతూ చూస్తూ.. వెళుతూ ఇటే చూస్తూ.. నరాలు జివ్వున లాగేశాయి. గబగబా చేతిలోని నూనెతిత్తిని ఎక్కడైనా దూరంగా గిరాటేసి పరిగెడదాం అనుకున్నాడు గణపతి. దగ్గరగా నూనె పీపా లాంటి ఆ దీపసుందరి.. నోటిలో పైట గుడ్డ పెట్టుకుని తననే చూస్తోంది. ఏవిటా చూపుకు ఆర్ధం?!!

వెర్రిగా అటూ ఇటూ చూస్తున్నాడు. ఏమి చెయ్యాలో తోచనట్లు..

అప్పుడు చూశాడు ఆ పీపాసుందరిని మరోసారి. ఆమె దీపస్తంభం క్రిందపెట్టి ప్రక్కనున్నామేతో ముచ్చట్లు చెబుతోంది. వందలకొద్దీ ఉన్న దీపాలలో ఆమె దీపం మోయకుండా దించి ప్రక్కన పెట్టడం.. ఓహ్‌.. ‌మనం కూడా నూనె తిత్తిని కాసేపు ప్రక్కన పెట్టవచ్చన్న మాట..

అప్పుడే కవ్వల ఎటో వెళుతూ తనను కూడా రమ్మన్నట్లుగా, కుడిచేయి అలవోకగా పైకెత్తి గాజులను సవరించుకుని అటూ ఇటూ చూసి చేతిని అరమూసి రమ్మన్నట్లు పిలుస్తూ కళ్లలో కొంత అంగారం కలిపిన చిరుకోపంతో మళ్లీ భంగిమ, అభినయం మార్చి కవ్విస్తున్నట్లు చూస్తూ.. అబ్బ.. పిచ్చెక్కిపోయింది గణపతిదేవునికి.

చటుక్కున ఆ నూనే తిత్తితోనే కవ్వల వైపుగా వడివడిగా వెళ్లి అక్కడున్న దీపాలలో నూనె వంపుతూ మళ్లీ ఆమెను అయోమయంగా చూశాడు.

అక్కడున్న కుడ్యాన్ని కొబ్బరిమట్టలతో, పూల మాలలతో అలంకరించడంవల్ల ఆ కుడ్యం వెనుక చీకటిగా ఉంది. అక్కడకు వెళ్లి ఆగింది కవ్వల.

ఆ మదుగులో కబుర్లు చెప్పుకోవచ్చు. విరహమంతా తొలగిపోతుంది. మళ్లీ ఎప్పుడు ఎలా కలుసుకోవచ్చో ఆమె చెప్పవచ్చు. అక్కడే వంగి నూనెతిత్తిని క్రింద పెట్టి లేచాడు. కవ్వల గబుక్కున తగిలింది. తక్కువ చీకటి వల్ల ఆమె దగ్గరగా.. మరింత దగ్గరగా.. వంగి లేచినప్పుడు ఆమె శరీర మంతా గణపతి శరీరానికి తాకుతూ.. రెండు పూలమొక్కలు గాలికి ఊగుతు.. తాకుతూ.. వెనక్కు జరుగుతూ.. భలే.. జడివానలో ఒకే ఛత్రంలో ఇద్దరుంటే.. అలా.. పదిరోజులుగా విరహంతో ఆమె నామమే జపిస్తూ ఆమె రూపమే ఊహిస్తూ.. ఆమె కోసం చావును ఎదిరించి.. వచ్చిన వాడికి.. ఆమె అత్యంత సమీపంలో ప్రత్యక్షమైతే.. ఉద్వేగంతో చటుక్కున దగ్గరకు లాక్కున్నాడు.

ఊహాతీతమ్‌!! ఆమె చటుక్కున దూరంగా తోసేసి.. ‘‘నేను నేను.. చిన్న కవ్వలను.. మీ కవ్వల చెల్లెలును.’’

వెళ్లి దూరంగా పడినట్లు.. సరాసరి దీపంపై పడినట్లు.. కొయ్యబారిపోయాడు.

ఆమె మాయమైంది.

అక్కడే.. మరికాసేపు ఆ కుడ్యాన్ని పట్టుకుని అలాగే ఉండిపోయాడు.

ఏవిటి జరిగింది! ఎంత ఘోరం జరిగింది!! ఆమెను అలా లాక్కోవడం అంటే ఆమెను గాఢంగా చుంబించేవాడా?

చుట్టూ మేళతాళాల హోరు ఏమాత్రం తగ్గడం లేదు. ఆ హోరుతో సంబంధం లేకుండా తను తన ధోరణిలో తన భావనల్లో.. తన ప్రపంచంలో..

సరే సరే.. జరిగిందేవిటి.. ఇద్దరూ ఒకేలాంటి దుస్తులు.. ఒకేలాంటి అలంకరణ.. ఏవిటిది.. ఎంత తప్పు జరిగిపోయేది.. కవ్వల తనను క్షమించేదా.. అయినా ఈ పిల్లకు బుద్ధిలేదా.. ఈ మహాతల్లీ కవ్వలేనట!!

మరి రెండునిమిషాల తర్వాత కదిలి నూనెతిత్తి సరిచేసుకుని పట్టుకుని ముందుకెళ్లి దీపాలలో నూనె పోసుకుంటూ సాగిపోతున్నాడు. దిమ్మెక్కిన బుర్ర సాధారణ స్థితికి చేరాలి ముందు.

కానీ ఆ అవకాశం లేదు. కాస్త ఆవల ఆ అమ్మాయిల బృందం.. అందులో ఇద్దరు అక్కా చెల్లెళ్లు.. ఒకేలా! ఇద్దరు కవ్వలు!!

-మత్తి భానుమూర్తి

About Author

By editor

Twitter
YOUTUBE