‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక
నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన
ఈరోజు కూడా దేవగిరి యువరాజు, యువరాణీ బృందం గణపతితో కలసి కబుర్లు చెబుతున్నారు. అందరూ చుట్టూ చేరి ఉన్నా కొందరు కాస్త ఆవతలగా.. కొందరు ఎక్కువ మాట్లాడకుండా.. కొందరు కేవలం బుగ్గలు సాగదీసి నవ్వినట్లు నవ్వకుండా నవ్వుతూ..
వారి మధ్య ఉన్న తేడాపాడాలు గణపతి గుర్తించాడు.
మహారాజు జైత్రపాలుని కుమార్తె సోము` సోమల.. పెద్దకొడుకు సింఘణ యాదవ, రెండవ కొడుకు కృష్ణభూపాలుడు, తర్వాతివాడు మహాదేవ రాజు. సోమలకు తల్లి చిల్లాదేవి పెద్ద అండ. కూతురు ఏమి చేసినా, కూతుర్ని ఎవరు తప్పుపట్టినా ఆమె ఉగ్రురాలైపోతుంది. మహారాజుగారు కూడా కూతురిని ముద్దు చేసినా తల్లి తర్వాతి స్థానమే.
ఇక ప్రస్తుత యువరాజు కాబోయే మహారాజు కాబట్టి సింఘణదేవుని మాటకు ఎదురులేదు.
ఇవన్నీ గణపతికి వివరించి చెప్పినవాడు కేయూరుడు.
కేయూరుడు ఆ యువకుల బృందంలో ఒకడు. బృందంతో కలిసికట్టుగా ఉన్నా యువబృందం గణపతిని విడిచి వీడ్కోలు తీసుకునే సమయంలో ఓయువరాజు నిత్యమూ చివరగా నిష్క్రమిస్తాడు. గణపతినే చూస్తూ వెళతాడు. ఇది గణపతి దృష్టిలో పడిరది. కాని తొందరపడి అతనిపై దృష్టి నిలపలేదు. కారణం ఒకరికి ప్రాధాన్యం ఇవ్వడం ఓ శత్రురాజుగా అతనికి పెద్ద ముప్పు. ప్రస్తుతం యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రంగానే ఉన్నాయి. కానీ అతను నిత్యమూ అలాగే ఆరాధనగా చూస్తూ నిష్క్రమిస్తు న్నాడు. పరిస్థితులన్నీ బేరీజు వేసుకోవడంలో గణపతి చాకచక్యమున్నవాడు. కాని అతనిలోని వీరత్వంతో కూడిన నిజాయితీ ఆ యువరాజును పలకరించేలా చేసింది. తెగించి ఓ రాత్రి అతనిని ఆగమని సైగ చేశాడు.
అతని ముఖంలో సముద్ర కెరటాల ఉద్వేగం ఉవ్వెత్తున పొంగి పొరలింది. నమ్మలేనట్లు చూసి గణపతి ప్రకటించిన మరో ఆహ్వానపు చిరునవ్వును గుర్తించి అందరితో పాటు బయటకు వెళ్లి మళ్లీ వచ్చాడు.
గణపతి వెనుతిరగగా దూరంగా వెనుక అనుస రించాడు. దూరంగా ఆ నడవా చివర నిస్తేజంగా వెలుగుతున్న కాగడా వద్ద కనిపించి కనిపించ కుండా నాగతిస్య! గణపతి ముఖంలో పెరిగిన ఆత్మవిశ్వాసం!!
‘‘రోజూ మీరు.. నన్ను చూస్తూ వెళుతున్నారు.. అదీ ఆఖరున. ఏమిటి ఇందులోని మర్మం యువరాజా?’’
మృదువుగా మెల్లగా లాలనగా అడిగాడు.
‘‘మీరు చెప్పింది నిజమే. కాని ఇందులో మర్మం ఏమీలేదు యువ రాజా. నాపేరు కేయూర.. కేయూర యాదవ.
నేను.. నేను రండాపుత్రను అంటే లంజ కొడుకును.’’ అన్నాడు తలవొంచుకుని.
చకితుడయ్యాడు గణపతి. అతని వంక తీక్షణంగా చూశాడు. అతడు ధరించినవి రాచదుస్తులే కాని, బాగా నాసిరకం. అవి కూడా అక్కడక్కడా చిరుగులు పట్టి రంగు వెలసిపోయి ఉన్నాయి. లిప్తకాలంలో కేయూర స్థితిని గ్రహించాడు గణపతిదేవుడు.
కేయూర చెప్పాడు. ‘‘నా తల్లి జైత్రపాలునికున్న ఉంపుడుకత్తెలలో ఒక్కతే. మహారాజుగారి పేరు ఉచ్చరించాను. క్షమించండి. ఆయనను నా తండ్రిగా సంబోధించే అర్హత నాకు లేదు. పసిప్రాయంలోనే అలా సంబోధించినందుకు నా చెయ్యి విరిచాడు సింఘణ..’’
ఎడమ చెయ్యి చూపాడు కేయూర. కాస్త వంకరగా ఉంది.
‘‘దీనికి తగిన ఔషధం ఇవ్వకుండా అడ్డుపడ్డారు మరికొందరు..’’
కేయూర చెబుతుంటే గణపతికి కళ్లు చెమ్మ గిల్లాయి. ఆప్యాయంగా అతని చెయ్యి నిమిరాడు.
‘‘రాజనగరిలో ఉంపుడుగత్తెల కొడుకులు ఎలా పెరుగుతారో మీకు తెలుసు. నేను చెప్పనక్కరలేదు. మరి ఇంతగా అవమానిస్తుంటే యుక్తవయసు వచ్చినవాడివి ఇక్కడ ఎందుకు ఉన్నావ్. బయటకు పోయి మరింత మంచి బ్రతుకు బ్రతకవచ్చు కదా అనొచ్చు మీరు. నేను బయటకు వెళ్లిన మరుక్షణం నా తల్లిని చంపేస్తారు యువరాజా!’’
‘‘ఎవరు ఎవరు..?’’ అప్పటివరకు నిరత్తరుడై వింటున్న గణపతి ఆదుర్దాగా ఆడిగాడు.
‘‘పట్టపురాణి వారు. మహారాజుగారికి నా తల్లి అంటే ఇప్పటకీి ఆరాధన. కారణం ఆమె గణిక. గొప్ప గాయనీమణి. పట్టపురాణి వారు నా తల్లిని అంతరంగిక మందిరంలో పరిచారికగా ఉంచుకుంది. మహారాజావారితో ఆమెకు పని ఉన్నప్పుడు మా అమ్మను రాజుగారి పడకమందిరానికి పంపుతుంది. అది ఆమె రాజకీయం. అందుకే నా తల్లి, నేను ఇంకా బ్రతికి ఉన్నాం.’’
అంతా విని కళ్లు మూసుకుని భారంగా నిట్టూర్చాడు గణపతి.
ఈ రాచకులీన వంశజులు మహిళల పట్ల ప్రవర్తించే ఈ కాముక దుర్మార్గాలు గణపతికి కొద్దిగా తెలుసు.
ఉంపుడుగత్తెలు అనే వర్గం రాచనగరిలో ఉండటం చాలా చాలా తక్కువ. వాళ్లను తొలుత తీవ్రంగా కామించి అనుభవించి నంతకాలం అనుభవించి మోజు తీరాక నిర్దాక్షిణ్యంగా చంపి వేస్తారు. పిల్లలను కూడా వదిలి పెట్టరు. ఈ రాచనగరిలో ప్రతి మహిళ వెనక ఓ కథ తప్పకుండా ఉంటుంది. పట్టపురాణి సహా.
అది వ్యవస్థ సృష్టించిన దుర్మార్గం. గణపతికి అందులో తను చెయ్యగలిగింది తక్కువని తెలుసు. అందుకే అడిగాడు, ‘‘నేనేమి చెయ్యగలను మిత్రమా?!’’ అని. తన గొంతులో ధ్వనించిన నిస్సహాయత కేయూర గుర్తిస్తాడని ఆయన భావించాడు.
కాని ఉహాతీతంగా కేయూర, ‘‘చాలు.. ఆ ఒక్కమాట చాలు. ఏమన్నారూ.. మిత్రమా అని కదా! అదే అదే నేను కోరుకుంటున్నది. మీరు నన్ను భవిష్యత్తులో కూడా మిత్రునిగానే చూడాలని.. మీరు మహారాజు అయ్యాక.. అయ్యాక ఏవిటి తప్పకుండా అవుతారు. నన్ను నా బాధల నుండి విముక్తుడిని చెయ్యాలని కోరుకుంటున్నా.’’
చాలా ఆశ్చర్యపోయాడు గణపతి.
దేవగిరిరాజ్యంతో తనకు భవిష్యత్తులో కూడా ముప్పు పొంచి ఉంటుంది. అప్పుడు తనకు కేయూర లాంటి మిత్రుల సహకారం అవసరం! కేయూర అవమానాలతో రాటుతేలినవాడు.
‘‘తప్పక మిత్రమా.. తప్పక నీకు తగిన గౌరవం కల్పిస్తాను. కాని నేను ముందు ఇక్కడి నుండి బయటపడాలి కదా..’’ ఫక్కున నవ్వుతూ చేతులు చాచి ఆత్మీయంగా కౌగలించుకున్నాడు.
అతని బాహువులలో ఆత్మీయంగా ఒదిగి ఆనందంగా కళ్లు మూసుకున్నాడు కేయూర.
* * * * *
ఇప్పుడు గణపతికి దేవగిరి సంగతులు, కుటుంబ ఊసులు చెప్పేవాడు నాగతిస్య కాక మరొకడు దొరికాడు.
నాగతిస్య చెప్పలేనివి అతనికి తెలియనివి కేయూర ఎన్నెన్నో చెబుతున్నాడు.
నాగతిస్యతో అన్నాడు గణపతి, ‘‘అబ్బబ్బ.. నీ కబుర్లన్నీ ఒట్టి దండగ. నాలుగేళ్లుగా ఇక్కడే ఉన్నాను యువరాజా! అని పెద్ద గొప్పగా చెప్పుకున్నావు కాని యువరాజుల పేర్లు కూడా నీకు తెలియదు. నాకు తెలుసు.’’ అన్నాడు రెచ్చిపోయి.
నిజంగానే తలవొంచుకున్నాడు నాగతిస్య. ‘‘అబ్బో.. అయితే గొప్పే. దేవగిరి యువరాజుల పేర్లు నాకెందుకు గాని మీకు ఎలా తెలిశాయో చెప్పండి చూద్దాం!’’ అన్నాడు తలొంచుకుని.
రహస్యంలా చెప్పాడు, ‘‘వీళ్లల్లో ఒకడు నాకు మంచి మిత్రుడయ్యాడు. వాడు నాకు అన్ని చేరవేస్తు న్నాడు నాగా!’’
గొప్ప సంగతి విన్నట్లు కళ్లు పెద్దవిచేసి చూస్తూ, ‘‘జాగ్రత్త జాగ్రత్త. ఆయన మీ నుండి సమాచారం లాగొచ్చు.’’
‘‘ఏడ్చినట్లుంది. నాకు ఏమైనా తెలిస్తే గదా.. వాడికి చెప్పడానికి?!’’
‘‘సరే సరే..’’ అంటూ ఎవరో వస్తున్నట్లు వడివడిగా వెళ్లిపోయాడు నాగతిస్య.
కానీ అటు తిరిగి అతడు నవ్వుకుంటూ వెళ్లడం గణపతి చూడలేదు.
కేయూరలాగా బృందం నుండి మరోకరు గణపతికి దగ్గరయ్యారు. ఈసారి యువరాజు కాదు యువరాణి!
ఆ అమ్మాయి కవ్వల.
ఆమధ్య గణపతికి అక్కాచెల్లెళ్లను చూపించి ఎవరు పెద్ద.. ఎవరు చిన్న.. అని బృందం ప్రశ్నిస్తే గణపతి తెల్లముఖం వేశాడు. ఆ ఇద్దరిలో ఒకరు కవ్వల.. నిజానికి ఇద్దరి పేరూ కవ్వలే.
ఇద్దరూ ఒక్కతీరులోనే ఉన్నారు కాని కాస్త కళ్ల మెరుపులో తేడా..
సోమల నుండి కాస్త ఎడంగా కనబడే యువ తుల్లో వీరిద్దరూ ఉంటారు. సంగతి ఏమో కాని ఇద్దరూ కలసి రావడం తక్కువ. ఒకరు వస్తే మరొకరు రారు. సోమల నుండి దూరంగా ఉండే అమ్మాయిలు సరైన దుస్తులు ధరించరు. ఆమె కంటే అందంగా కనిపించరు. ఆమె ముందు కిలకిలా నవ్వరు.
అంటే వాళ్లు ఆమె పరిచారికలకు ఎక్కువ.. సోదరీమణుల స్థాయికి తక్కువ.
అయితే ఈ కవ్వల కూడా కేయూర లాగే వెళుతూ వెళుతూ గణపతిని చూసి కాస్త బుగ్గలు సాగలాగుతుంది దినమూ. ఆ మాత్రానికే గణపతి పరమానంద భరితుడై ఆమెను తన ముఖ్య స్నేహితుల జాబితాలో పెట్టేసుకున్నాడు.
అందుకు కారణం ఉంది.
కాకతీయ రాజ్య ప్రాసాదంలో ఎందరో అమ్మ యిలున్నా గణపతి ఎవ్వరివంకా తలెత్తి చూసేవాడు కాదు.
ఓ రోజు పెద్దమ్మ పెదనాన్నగారి మీద రుసరుస లాడిరది.
‘‘వాడిని కాస్త మిత్రులతో తిరగనిస్తారా.. ఎంత సేపూ చంటిపిల్లాడిలా చంకలో లేదా భుజాలపై కూర్చోబెట్టుకుని.. యుద్ధాలు, కత్తులు, ఈటెలు లేకపోతే ఎవడి ముఖం చూసి ఎలాంటివాడో గుర్తించడం లాంటి రాజనీతి పాఠాలు.. ఇవేనా ఎప్పుడూ? వాడికీ వయసొస్తోంది. ఓ ఆడపిల్లతో మాట్లాడ్డం రాదు. కనీసం కన్నెత్తి చూడడు అని కుందాంబ కూతురు రుయ్యమ రుసరుసలాడిరది. నిజమే కదా.. ఎప్పుడూ రాచకార్యాలేనా.. వాడ్ని కాస్త స్నేహితులతో తిరగనివ్వండి..’’
అంత పెద్ద పాఠం తీసుకుంటే గాని పెదనాన్న గారు మారలేదు. తనను తేరపారి చూశారు.
‘‘నిజమే.. వీడికి మీసాలోస్తున్నాయి. మంచి యువరాణిని చూడు..’’ అన్నారు పరిహాసంగా.
‘‘మనమేమి చూడక్కరలేదు. వాడ్ని వదిలేస్తే వాడే చూసుకుంటాడు. నువ్వేమిట్రా గణా.. ఎంతసేపూ పెదనాన్నగారితో తప్ప ఎవరితో మాట్లాడవట. యువరాణులు, రాజులంతా నాకు ఫిర్యాదు చేస్తున్నారు.’’ అంటూ ఇద్దరిని తుక్కు తుక్కుగా వాయించేసింది.
అప్పట్నుంచి పెదనాన్నగారు తనను ఇతరులతో ముఖ్యంగా వయసొచ్చిన అమ్మాయిలతో మాట్లాడమన్నట్లు చెప్పకనే చెప్పి దూరం పెట్టారు. కానీ తనకు అమ్మాయిలను చూస్తేనే వణుకు వచ్చేది. తలెత్తితే వాళ్లంతా దోరనవ్వులతో ఉడికించేవారు. ముఖ్యంగా వరుస అయిన మేనత్త కూతుళ్లు.. ఆ వరసవాళ్లు.
ఆ సమయంలోనే యుద్ధాలు రావడం.. పెద నాన్న, నాన్నగారు ఇద్దరూ త్వరితంగా మరణిం చడం.. తను శత్రువులకు దొరికిపోవడం.. ఇక్కడ బందీ కావడం జరిగిపోయాయి.
ఇప్పుడు ఇక్కడ ఓ అమ్మాయి.. కొత్త అమ్మాయి తనను రెప్పార్పకుండా చూడటం గిలిగింతలు పెట్టినట్లుంది.
గణపతి కూడా రోజూ అందరూ వెళ్లేటప్పుడు ఎవ్వరికి అనుమానం రాకుండా క్రీగంట ఆమెనే చూస్తున్నాడు.
‘ఇంతకీ అమ్మాయి ఎవరో.. రాజవంశీకులలో జైత్రపాలునికి ఏమౌతుందో.. తర్వాత చూద్దాంలే!’ అనుకున్నాడు.
కానీ ఆ అమ్మాయి మాటిమాటికి గుర్తుకు రాసాగింది. పని పాటా లేదు కదా.. కూర్చున్నా ఆమె.. నిలబడినా ఆమె.. తింటున్నా ఆమె.. పడుకున్నా ఆమె.. నిద్ర పట్టడం లేదు. అలాగే చిరాకు రావడం లేదు. అదో రకం తియ్యగానే ఉంది.
కేయూరుడు దినమూ వ్యాహ్యాళి ముచ్చట్లు అయ్యాక అందరితో బయటకు వెళ్లి మళ్లా అక్కడున్న పరిస్థితులను బట్టి తిరిగి వచ్చి కారాగారం వరకు వెంట వస్తూ ఏవో కొన్ని ముచ్చట్లు చెబుతుంటాడు. అవన్నీ గణపతికి మహా ఇష్టం.
‘‘ఆ అమ్మాయి కవ్వల.. యువరాజా!’’ అన్నాడు ఉపోద్ఘాతంలా ఓ రోజు కేయూర.
ఎంతో ఆనందపడిపోయినా బయటకు తెలియ కుండా నిర్లిప్తంగా ముఖం పెట్టాడు.
‘‘ఎవరా అమ్మాయి..? కవ్వలా? అదేం పేరు?’’
‘‘తమరు ఆమెను నిక్కినిక్కి చూడటం నేను చూశాలే దేవరా. కవ్వల.. ఔను ఆమె పేరు కవ్వల. మజ్జిగ కవ్వంలా జుయ్ జుయ్ మని తిరుగుతుందని ఆ పేరు పెట్టాడు వాళ్ల తండ్రిగారు. ఆయన ఓ సేనాని. జైత్రపాల మహా రాజుగారి చిన్నాన్న. ఆయన కూతురి కూతురు ఈ కవ్వల. అంటే సోమలకు మేనత్త కూతురన్నమాట. పైగా అందగత్తె. సన్నగా జూకా మల్లెతీగెలా ఉంటుంది. అందుకే దూరం పెట్టింది సోమల. ఈమెకో చెల్లెలుంది. ఆమెను కూడా కవ్వలనే పిలుస్తారు. చిన్న కవ్వలన్నమాట. ఆమె నిత్యమూ ఇక్కడికి రాదు. ఆమె సోమల దాష్టీకాన్ని అంగీకరించే పిల్ల కాదు. కాస్త గట్టి పిండం.’’
అతని ప్రతి వాక్యం, పదం గణపతి గుండెల్లో రాసుకున్నాడు.
ఆమె నవ్వు! నవ్వినప్పుడు చొట్టలుపడే బుగ్గలు!! అబ్బ.. అలా సొట్ట బుగ్గలతో తనను చూసి ఓ ఆడపిల్ల నవ్వడం.. రాత్రి, పగలు మరుపు రావడం లేదు.
ఇక్కడే అబ్బాయిలు దెబ్బతింటారు. కళ్లు కనపడవు. బుర్ర పనిచేయదు. కాలూ చేతులు నియంత్రణలో ఉండవు. హద్దులు, నియమితి దాటటం ఈ దశలోనే జరుగుతాయి.
నూనూగు మీసాల గణపతి కూడా అలాంటి దశలోకి వచ్చేశాడు. ఎప్పుడూ ఎటో చూస్తూ నవ్వుకోవడం. ముఖమంతా ఏ సమయంలో చూసినా ఓ రసరమ్యగీతిక తారట్లాడుతూ కనిపిస్తోంది. నాగతిస్యను అస్సలు పట్టించుకోవడం లేదు. అతని సైగలు దూరంగా కనిపించినా చిరాకు కలుగుతోంది.
కేయూర ఇప్పుడు గణపతికి అత్యంత ఆప్తుడు.
ఎందుకంటే, ‘‘కవ్వలతో మాట్లాడతారా యువరాజా..!’’ అని అడిగాడు మరి.
గణపతి పరమానందభరితుడైపోయాడు. ‘‘మీరు ఊ అనండి. నే జూసుకుంటా.’’ అని కూడా అన్నాడు. ఈ కవ్వల విషయంలో గణపతి చిన్న చిన్న చిరు నవ్వులే తన భాషగా జీవిస్తున్నాడు. మౌనం అసలైన అంగీకారంగా తీసుకున్న కేయూర.. గణపతికి తన ప్రణాళిక చెప్పాడు.
‘‘అంతఃపురానికి దగ్గరగా ఉంది మీ కారాగారం. ఇక్కడినుండి అంతఃపుర ప్రధానద్వారం చాలా దగ్గర. సాధారణంగా మహిళా పరిచారికలు, ప్రతీహారులు, వంటవాళ్లు, కొట్టారువు ఉద్యోగులు మాత్రమే లోపలికి బయటకు తిరుగుతారు తప్ప లోపలి అంతఃపుర స్త్రీలు బయటకు రావడం తక్కువ. ఇక్కడ ఉండే మగ ద్వార పాలకులు కళ్లల్లో వత్తులు వేసుకుని తీక్షణంగా కాపలా కాయరు. కారణం వచ్చేపోయే వాళ్లు తక్కువ కాబట్టి. సాధారణంగా ఓ ద్వారపాల కుడు అతని దినసరి పనిగంటలు పూర్తయ్యేసరికి మరొకరు రావాల్సి ఉంటుంది. చాలాసార్లు వాడు రాక ముందే వీడు వెళ్లిపోతాడు. సాధారణంగా ఆ మధ్యకాలంలో కాపలాగా ఎవ్వరూ ఉండరు. ఆ సమయంలో కవ్వల బయటకు వస్తే.. అవతల.. ద్వారం ఉన్న నడవాకు కుడి ప్రక్క మిమ్మల్ని ఉంచిన కారాగార గది ఉంటే.. అచ్చం అలాగే ఆ నడవాకు ఎడమ ప్రక్క అలాంటి మరో గది ఉంది. అది ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది. అక్కడ మీరు ఆమెను కలిసి.. అయ్యా..! అదీ విషయం..’’
కేయూరుడు చెప్పినంత కచ్చితంగా మహా ద్వారానికి ఆవల గదిలో గణపతి ఎదుట కవ్వల ప్రత్యక్షమయ్యింది.
పొడవుగా నిటారుగా గోగుమొక్కలా ఎదిగి.. తోకచుక్కలా చురుగ్గా ఉన్న కవ్వల ప్రధాన ద్వారం తోసుకుని అడుగులో అడుగు వేసుకుంటూ బయటకు వచ్చి కేయూర చెప్పినట్లు ఎడమ వైపు గదిలోకి వెళ్లింది.
ఆమెను చూసి కొయ్యబారిపోయాడు గణపతి.
దినమూ ఆమె వ్యాయామం చేయడానికి తగినట్లు మగాడిలా పంచె కాసే పోసి కట్టి పైన ఏదో పిచ్చి కంచుకం తొడిగి నడుముకు వెలసిపోయిన ఎర్రటి ఉత్తరీయం చుట్టి ఓ మగ రాయుడిలా ఉంటుంది. అందరు ఆడపిల్లలు మగవారిలాగే.. చింపిరి జుత్తుతో, బొట్టు కాటుక లత్తుక లాంటివేమీ లేని జిడ్డు ముఖాలతో యుద్దకళల అభ్యాసానికి, వ్యాయామనికి వస్తారు.
కాని ఇప్పుడామె పచ్చపూల పరికిణీ కట్టుకుంది. బంగారురంగు వలిపట్టు కంచుకం తొడుక్కుంది. ఉద్వేగం వల్ల జనించిన చిన్నచిన్న నీటి బిందువులతో ముఖమంతా తామరాకులా చలిస్తోంది. ముక్కునున్న బుల్లి ముక్కెర ఎర్రెర్రగా మెరుస్తూ ఆమె తీవ్ర ఉచ్వాస నిశ్వాసాలకు పగలబడి నవ్వుతున్నట్లు మిలమిలలాడు తోంది. తలలో వెనగ్గా నాగారం తురిమి ముందువైపు పాపిటబొట్టు దాల్చింది. పెద్ద పెద్ద నీలాల కన్నులు భయ విస్మయాలు వెదజల్లుతుండగా.. మామిడిపండు లాంటి చుబుకం చూపుల్ని పట్టిలాగుతోంది.
బందీగా ఉండటంతో పెద్ద అలంకరణలేని గణపతి గ్రామీణ ప్రాంత దేవుడి విగ్రహంలా ఉన్నాడు. పైగా ఉద్వేగం వల్ల నోరు తుమ్మజిగురుతో అతికించినట్లు పెదవులు విడివడటం లేదు. రెప్పవేయడం మానేసిన కళ్లతో బెరుగ్గా ఆమెను చూశాడు. అతన్ని చూశాక ఆమె కాస్త బెరుకు తగ్గినదానిలా పలకరింపుగా పెదాలు సాగలాగింది. ఆ పెద్ద పెద్ద సొట్టబుగ్గలపై మెరుపు చిమ్మి గణపతి కళ్లలో పడిరది.
తను కూర్చున్న పల్యంకంపై కూర్చోమన్నట్లు కొంచం జరిగాడు. చటుక్కున కూర్చుందామే.
అప్పుడు ఒకరి శరీర పరిమళం మరొకరి నాసాగ్రానికి తాకుతోంది. ముక్కులు ఎగబీలిస్తే నోర్లు మరింత బిగిసిపోయాయి. ఒకరి సాన్నిధ్యం మరొకరికి స్వర్గధామంగా ఉంది. మాటలు లేవు. మౌనపు పరిమళమే భావాలను వేలార్చుతూ ఒకరు చెప్పాలను కున్నవి మరొకరికి భావార్ధ తాత్పర్య సహితంగా తెలిసిపోతున్నాయి.
ఆ మౌనంలో మునిగి అలా అలా.. అలాగే చాలాసేపు..
బయట ఎవరో అలికిడి..
చటుక్కున లేచి బయటకు వచ్చేసింది కవ్వల. ద్వారపాలకుని వందనం అందుకుని.. వాడు ద్వారం తెరచి వంగి నిలబడగా లోపలికి మాయమయ్యింది. ఆ గదికి మరో వైపున్న ద్వారం నుండి బయటపడ్డ గణపతి ముందు పెరడు వైపుకెళ్లి రెండు భవనాలు చుట్టి కారాగారం చేరాడు.
‘‘అబ్బబ్బ.. భలే భయమేసింది కేయూరా.. నా గురించి ఏమంది?’’ అడిగాడు గణపతి కేయూరను మర్నాడు.
అప్పటికే అందరూ వచ్చేసి ఆసనాలు వేస్తున్నారు. గణపతిని చూసి చేతులూపి మళ్లీ తమ పనిలో నిమగ్నమయ్యారు. గణపతి ప్రవేశించినట్లు గుర్తించిన కవ్వల చేయి ఊపకుండా తలొంచుకుని పశ్చిమోత్తాన మాసనం వేస్తోంది. ఆమెను చూసి గణపతి కూడా సిగ్గుగా తలోంచుకున్నాడు.
కేయూర ప్రక్కకు వచ్చి క్రింద కూర్చుని అడిగాడు గణపతి. లేచి ఆశ్చర్యంగా ముఖం పెట్టాడు కేయూర.
‘‘ఆమె కూడా ఇదే అడిగింది.. ఆయన నా గురించి ఏమన్నారూ అని..’’
‘‘ఏంటో సోదరా.. పెద్ద ఉపన్యాసం ఇద్దామని అనుకున్నా. కాని ఒక్కటంటే ఒక్కమాట వస్తే వొట్టు..’’
ఆసనం ఆపేసి ఆశ్చర్యంగా చూశాడు. ‘‘ఆమె కూడా ఇదే చెప్పింది యువరాజా..’’
తలెత్తి ఇద్దరిని చూశాడు కేయూర. ఇద్దరి ముఖాలలో సిగ్గు.. వొళ్లంతా తుళ్లింతల్లాంటి అలజడి..
ఆ వారంలోనే రెండవసారి మళ్లీ ఇద్దరికి ఏకాంతం కల్పించాడు కేయూర.
ఈసారి కాస్త.. చారెడు మాటలు..
‘‘మా అమ్మకు చెప్పా యువరాజా..’’
అమ్మకు చెప్పడం ఏవిటి.. వాళ్లమ్మకు తను తెలుసా? ఏం చెప్పింది..? ఇప్పుడు ఏమి అడగాలి..? ఏమి చెప్పావ్ అని అడగాలా..? ఎందుకు చెప్పావ్ అనాలా..?
కాస్త కదిలి ఏదో వింతధ్వని చేసి క్రిందికి చూస్తున్నాడు. ఆమె కాస్త అతని వైపు వంగింది అనుకుంటా. అత్తరు పరిమళం గణపతి బుగ్గలకు తాకింది. ప్చ్.. బందీ అంటే ఇక్కడ ముష్టివాడి కన్నా హీనం. లేకుంటే తనూ రకరకాల పన్నీరు వొళ్లంతా వోంపేసుకుని వచ్చి ఈ పిల్ల ప్రక్కన కూర్చునేవాడు. ‘అంతా నా ఖర్మ..!’
ఇంతకీ వాళ్లమ్మతో ఏమి చెప్పిందో ఈ పిల్ల చెప్పడం లేదు.
‘‘మీరు యువరాజులు.. చాలా బావున్నారని.. చెప్పా..’’ అంది నంగి నంగిగా.
ఉబ్బిపోయాడు. నిజానికి తను అందగాడే కానీ ఇప్పుడు మాసిన గెడ్డం, చిందరవందరగా ఉన్న తల, వాసన కొడుతున్న పంచె, అంగీ.. తోలు బొమ్మ లాటలో కేతిగాడులా ఉన్నాడు. అయినా ఈ పిల్లకు అందంగా ఉన్నానా.. అలా అని వాళ్లమ్మతో చెప్పిందా.. నిజమా.. నిజమే?!
ఆనందంతో అనేశాడు. ‘‘నేను కూడా అన్నానని మీ అమ్మగారితో చెప్పు..’’
ఆమె అర్ధం కానట్లు కళ్లు టపటపలాడిరచింది. అప్పుడాలోచించాడు.. ఏవిటి తను అన్నది?! తనకే అర్ధం కాలేదు.
‘‘ఇంత మహాయోధులు.. మా వాళ్లకు ఎలా చిక్కారు?’’
భుజాలు కొంత పొంగాయి. మళ్లీ వెనువెంటనే తగ్గిపోయాయి. చిక్కినమాట నిజమేకదా.. ఇంకేం యోధుడు.. నా బొంద!! ఏడవలేక గంభీరంగా నవ్వాడు. విషాదంగా తల పంకించాడు.
‘‘ఒక్కొక్కప్పుడు.. అదే ఒక్కొక్కప్పుడు.. అంటే ఒక్కొక్కసారి.. అంటే ఒక్కక్కప్పుడన్నమాట. దొరికి పోతుంటాం. అదంతే..’’
సంభాషణ ఏమీ బావోలేదని.. యుద్ధంలో ఓడి పోతున్నట్లు.. ఈ పిల్ల ముందు కూడా ఓడిపోతున్నట్లు వాసన..
తర్వాత ఏదేదో కాసేపు ఇలాగే ఇద్దరూ అర్ధం పర్ధం లేని మాటలు.. అప్పుడప్పుడు ఇకిలింపులు.. మధ్య మధ్య సకిలింపులు.. మర్నాడు కేయూరుని వద్ద తన గోడు వెళ్లబోసు కున్నాడు గణపతి.
‘‘సంభాషణ కంపు కొడుతోంది కేయూరా.. ప్చ్..’’
‘‘అరె. కవ్వల కూడా అచ్చం ఇలాగే అంది యువరాజా!’’
దిగులుగా కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్న గణపతితో అన్నాడు కేయూర.
‘‘ఇద్దరూ ఒక్కలాగే ఆలోచిస్తున్నారు యువరాజా! అంటే ఇద్దరూ ఒకే పడవలోనే ప్రయాణిస్తున్నట్లు..’’
‘‘అవును.. ఇద్దరం ఒక్కసారే బుడుంగున మునుగుతాం..’’ అన్నాడు విరక్తిగా గణపతి.
సున్నితంగా భుజం తట్టాడు కేయూర.
– (సశేషం)