ఏకైక తెలుగు చక్రవర్తి

గుర్రాలపై నుండి తల త్రిప్పడం లేదు. ముఖంలో అదే చిరాకు.

అప్పుడు యువకులను తప్పుకుని ముందుకొచ్చాడో బలిష్టుడు. నడుముకు పంచె కాసే బిగించి గోచి పెట్టి ఉన్నాడు. వంగీ వంగకుండా వంగాడా బలిష్టుడు. బందీ ముందు వంగడం.. అదీ తమ యువరాజుల సమక్షంలో వంగాలో వద్దో తెలియని మీమాంసతో కాస్త వంగాడు.

అతనిని అశ్వశిక్షకుడుగా గుర్తించాడు గణపతి దేవుడు.

‘‘ఎవడ్రా.. ఇలాంటి నాసిరకం గుర్రాలను భావి యువరాజుల శిక్షణకు ఉపయోగిస్తున్నది? ఎవరు చెప్పారు నీకు వీటిపై శిక్షణ ఇవ్వవలసిదని.. ఇవి గాడిదల కంటే హీనం. సాధారణ సైనికులకే వీటిని ఉపయోగించకూడదు.

అలాంటిది భావి రారాజులయిన యువరాజుల శిక్షణకు వాడతావా.. మా రాజ్యంలో నయితే నీకు కొరత వేయించేవారు మా పెదనాన్నగారు.’’

గణపతి మాటలతో అతని కంటే యువరాజులే క్రోధంతో రెచ్చిపోయారు. అతన్ని చంపేస్తామన్నట్లు చూశారు.

వాడు భయంతో వణకుతూ, “క్షమించాలి యువరాజా.. గుర్రాల ఎంపిక నాది కాదు. ఇక్కడకు తోడ్కొని వచ్చిన గుర్రాలతో శిక్షణ గరపడమే నా పని.’’

‘‘సరే. నీ పని నువ్వు నిర్వహిస్తున్నావు. కానీ ఇవి నాసిరకం గుర్రాలని నీకు తెలుసా! తెలిస్తే పెద్దలకు తెలియ జేశావా? కనీసం యువరాజులకు అయినా చెప్పావా? అది కూడా నీ బాధ్యత కాదా?!!”

గణపతి ప్రశ్నలకు సదరు శిక్షకుడు వణకి పోతుంటే యువరాజులకు గణపతి మీద గౌరవం పెరుగుతున్నది.

అనంతరం అశ్వాల గుణగణాలు లక్షణాలు వాళ్లకు వివరించాడు గణపతిదేవుడు. గుర్రాలలో కూడా బ్రాహ్మణ, క్ష్రత్రియ, వైశ్య, శూద్ర రకాలుంటా యని.. గుర్రానికి జాతి చాలాముఖ్యమని.. వాటి రంగు, వన్నె పరిశీలించాలని, అలాగే ఒంటిపై ఉండే చుక్కలు, సుడులతో పాటు గుర్రం స్వరం కూడా పరిశీలించాలని.. చర్మం దళసరిగా ఉంటే పై నున్న వెంట్రుకలు మృదువుగా ఉండాలని.. కాలి గిట్టలు.. నడకలో కాళ్లు విసిరే పద్దతి.. పరుగులో వేగం.. ఆగడం.. చెప్పింది విని ఎటు తిరగమంటే అటు తిరగడం.. ఇవన్నీ ఉన్న గుర్రాన్నే యుద్ధానికి ఎంచుకో వాలి. అలా ఎంపిక చేసిన గుర్రాల పైనే యువరాజు లకు శిక్షణ ఇవ్వాలి. అప్పుడే యువరాజు అంతరంగా నికి తగినట్లు ఎలా మసలుకోవాలో ఆ గుర్రం ఆనతికాలంలోనే గుర్తిస్తుంది. అప్పుడే ఆ యువరాజు తనకు కావాల్సిన విధంగా దానిని మలచుకుని విజయమే లక్ష్యంగా యుద్ధం చేయగలుగు తాడు. అల్లాటప్పా గుర్రలపై నేర్చుకుంటే ఏమౌతుందో ఆలోచించండి..’’

అంతా నిశ్శబ్దం.. రెప్పవేయకుండా గణపతిదేవుడినే చూస్తుండిపోయారు.

‘‘ఎవరు మీ రాజ్యానికి అశ్వాలను అందించే విదేశీ వర్తకుడు? పిలిపించండి. ఏ దేశాలనుండి గుర్రాలను దిగుమతి చేసుకుంటున్నారు? సైన్యంలో కూడా ఇలాంటివే ఉన్నాయా? ఉంటే ఇప్పటికి అన్యాయంగా ఎంతో మంది సైనికులు దారుణంగా చనిపోయి ఉంటారు. రేపటికి అత్యుత్తమ జాతి గుర్రాలు.. ఓ వంద గుర్రాలు ఈ అశ్వశాలలో ఉండాలని ఆజ్ఞ ఇవ్వండి యువరాజా..’’ అన్నాడు అందరివంక చూస్తూ.

అతని చూపులో అందరిలో ఆజ్ఞ ఇవ్వగల అధికులెవ్వరో.. అన్న జిజ్ఞాస ఉంది.

అప్పుడొక యువరాజు ముందుకొచ్చాడు. ‘‘తప్పక ఆజ్ఞ ఇస్తాను గణపతిదేవా.’’ అన్నాడు.

ఈసారి గణపతి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఇప్పటివరకూ ఈ యువకులెవ్వరూ అతని పేరు ఉచ్చరించలేదు. అతని వంక గౌరవంగా ప్రశ్నార్ధ కంగా చూశాడు. మరో యువరాజు ముందుకొచ్చి చెప్పాడు.

‘‘యువరాజు సింఘణ భూపాలుడు.. జైత్రపాల మహారాజుగారి వారసుడు..’’

అనగా సదరు వారసుడు హుందాగా నవ్వి మీసం తిప్పాడు. గణపతిదేవుడు అతనిని ఆత్మీయంగా చూస్తూ అభివాదం చేశాడు.

‘వీడేనన్నమాట నా భవిష్యత్‌ శత్రువు.’ అనుకు న్నాడు కూడా.

అశ్వజాతిపై గణపతిదేవునికున్న సాధికారత అందరిని మంత్రముగ్ధులను చేసింది. మొత్తం యువ బృందమంతా అతని పాదాక్రాంతమయ్యారు. గణపతి వెనుదిరిగితే అంతా అతని వెనకే కదిలారు.

వీరందరికి ఆవలగా ఓ గుర్రంపై కూర్చున్న యువతి అతన్నే తీక్షణంగా చూస్తోందని గణపతి ఇతర యువరాజ బృందం గమనించలేదు.

=======

మరునాడు అక్కడ వందగుర్రాలు వరుస కట్టి ఉన్నాయి.

చూడగానే గణపతి కళ్లు మెరిశాయి. ‘‘చూశారా.. చూశారా.. యువరాజులారా.. దూరానికే అవి అద్భుతంగా గోచరించడం లేదూ..?” అంటూ వాటి దగ్గరగా వెళ్లి ఓ గుర్రాన్ని చూసి ఆనందంగా పిచ్చికేక పెట్టాడు. ‘ఇది.. ఇది.. నాకు కావాల్సిన గుర్రం.. ఇది రోహితం.. అంటే దేవతల అశ్వం. వీటి కోసమే అప్పట్లో యజ్ఞాలు చేసి రోహితాలను తేవలసినదిగా అగ్నిదేవుడ్ని ప్రార్ధించేవారట. మా పెదనాన్నగారు చెప్పారు. మరీ గుర్రాల కోసం యజ్ఞాలు చేస్తారా బడాయి కాకపోతే.. అనకండి. యుద్ధంలో గుర్రం సహకారం ఎంతో ఉంటుంది. కావాలంటే ఋగ్వేదం పఠించండి..’’

అంటూ హుషారుగా ఆ గుర్రాన్ని ఆప్యా యంగా చూసి సాటి వీరుడిని గౌరవించినట్లు వినయంగా వందనం చేశాడు. దాని నఖశిఖ పర్యంతం చూస్తూ అక్కడక్కడా చరుస్తూ మెల్లగా నిమురుతూ.. చర్మాన్ని రెండు వేళ్ల మధ్య పట్టి మెలి తిప్పుతూ దాని చుట్టూ తిరిగాడు. కాలిగిట్టల వరకూ పరిశీలించాడు. మధ్య మధ్య ఉత్సాహంతో ఈల వేశాడు. పొంగిపోయాడు. ఎగిరి దూకాడు.

హటాత్తుగా ‘‘జై కాకతమ్మ తల్లి’’ అంటూ ఓ అరుపు అరిచి రెప్పపాటు కాలంలో ఇనుప తీగేలా రaుమ్మని ఎగిరి దానిపై అధిరోహించి కళ్లాన్ని వడిసి పట్టి చల్‌ అంటూ రెండుకాళ్లతో దాని నడుము వద్ద సున్నితంగా తన్నాడు.

ఇదంతా లిప్తకాలంలో చేశాడు.

ఒక్క ఉదుటన ఆ అశ్వం ముందు కాళ్లపై ఆకాశమంత ఎగిరి అద్భుతంగా సకిలించి పరుగు లంఘించుకుంది.

దాని హోయలు చూస్తున్న దేవగిరి యువరాజులు కళ్లముందు మహాద్భుతం జరుగుతున్నట్లు రెప్ప వెయ్యక నిలబడి చూస్తున్నారు. ఆ అశ్వంపై గణపతి చేస్తున్న విన్యాసాలు గగుర్పాటుకు గురిచేస్తున్నాయి. ఒక్క క్షణం అశ్వం మాయమైపోతోంది. మరుక్షణం ఆకాశం నుండి ఊడి పడినట్టు ప్రత్యక్షమవుతుంది. ఒక్కోసారి నిలబడి చూస్తున్నవారి తలలను తాకుతూ ఎగిరి పోతోంది. మళ్లీ తిరిగి దూకుతోంది. అప్పుడప్పుడూ ఒక లయతో సకిలిస్తోంది. దానితో పాటే గణపతి కూడా అరుస్తున్నాడు ఉద్వేగంగా. మళ్లీ అప్పుడే పగలబడి నవ్వుతున్నాడు హాయిగా. అశ్వం కూడా తల తిప్పుతోంది అభినందనగా.

అప్పుడు జరిగింది ఇది.

గుర్రం హటాత్తుగా క్రింద పడిపోయింది. లాఘవంగా ప్రక్కకు దూకాడు గణపతి. గుర్రం అటూ ఇటూ దొర్లింది.

మళ్లీ చటుక్కున లేచింది. రెప్పపాటుకాలంలో గణపతి దానిపైకి ఎగిరి కూర్చున్నాడు. చూస్తున్న వారికి పిచ్చెక్కిపోయింది. గుర్రం పడటం.. గణపతి ఒడుపుగా ముందే దూకడం.. తిరిగి లేవగానే గణపతి దాని మీదకు లంఘించడం.. మళ్లీ ఎప్పటి లాగే స్వారీ కొనసాగించడం..

కలా నిజమా..

ఆ అశ్వంతో గణపతి చేసిన విన్యాసాలు ఆ యువరాజులను నిశ్చేష్టులను చేశాయి.

గణపతి దిగగానే అశ్వం కూడా ఏ మాత్రం అలసట లేకుండా మామూలుగా నిలబడి ఉంది. దానిని అభినందనగా.. గౌరవంగా మెడపై చరచి యువరాజులను చూసి నవ్వాడు గణపతి.

ఆ రోజునుండి దేవగిరి రాజ్య యువ నాయ కులంతా దాదాపు పాతికమంది.. పూర్తిగా గణపతి వెనకే తిరుగుతున్నారు. ఈ యువరాజుల అనుయా యులు, పరిచారికలు కూడా ఈ బృందం వెనుకే వస్తున్నారు. గణపతి ఆదేశంపై యువరాజులు అనుజ్ఞ ఇచ్చినవి చకచకా సిద్దం చేస్తున్నారు.

ఇప్పుడు గణపతి చెరసాల గది వద్ద దినమూ పెద్ద కోలాహలం.

అక్కడికి కొన్ని పల్యంకాలు, గణపతికో ప్రత్యేక పల్యంకం తెప్పించారు. వారంతా కూడా పల్యంకాల మీద, చాపల పైనా కూర్చుంటూ.. నిలబడుతూ.. ఎగిరి గంతులువేస్తూ గణపతితో కబుర్లు.. ముచ్చటే ముచ్చట్లు.

కాని యువ గణపతి రుద్రదేవుని నిర్మాణం. ఎక్కడా తన స్థానం మర్చిపోలేదు. అతనికి ఆమడ దూరంలో కనుచూపుమేరలో ఎప్పుడూ నాగతిస్య. ఇద్దరి చూపులు కలుస్తూ విడిపోతూ ఉంటాయి. భగవంతుడికి కూడా అనుమానం రాదు!!

‘‘గణపతిదేవా.. ఆ గుర్రం క్రింద పడినప్పుడు.. అంటే అది పడబోతున్నట్లు నువ్వు ఎలా గుర్తించావూ? ఎలా లిప్తకాలంలో ముందే ఎలా దూకేశావూ?” ఇలాంటివి ఒక్కోక్కడూ వంద ప్రశ్నలు!!

‘‘అది నా గొప్పదనం కాదు. ఆ అశ్వపు లక్షణం. అది ఎట్టి పరిస్థితుల్లోనూ క్రిందపడి ఉండిపోదు. తప్పకుండా లేచి తీరుతుంది. మీరు శిక్షణ పొందు తున్న అశ్వాలు పడిపోతే లేవవు. మిమ్మల్ని శత్రువు కత్తికి దగ్గరగా అందిస్తాయి.. అర్ధమైందా!’’

నిబిడాశ్చర్యంతో అందరిలో మౌనం!

వాళ్ల ఆశ్చర్య సంభ్రమాలు చూస్తుంటే గణపతి దేవునికి నవ్వొస్తున్నది. ఇవన్నీ రుద్రదేవ మహారాజులు తనకు చెప్పిన.. నేర్పిన.. నేర్పించిన చిన్నచిన్నపాఠాలని  వాళ్లకు తెలియదు. ఇలాంటివి చూస్తేనే దిగ్బ్రమతో నోరు వెళ్లబెడుతున్నారీ యువరాజులు. ఇక్కడ ఎంత అధమస్థాయి యుద్ధ శిక్షణ  గరపుతున్నారు?!

‘ఇలాంటి నాసిరకం వీరులపైనా కాకతీయులు ఓడిపోయింది!? అంతేకాదు తన తండ్రి మహాదేవ నాన్నగారిని పొట్టను పెట్టుకున్నారీ పిరికియోధులు..’

తండ్రి మరణం గుర్తురాగానే గణపతిదేవుని మనసంతా విషాదం నిండుకుంది.

దేవగిరి యువరాజులు కూడా యువగణపతి అసమాన ప్రతిభ, విషయ పరిజ్ఞానం చూసి యువరాజే ఇలా ఉంటే ఇక మండలేశ్వరులు, యువవీరులు, సేనానులు, దళపతులు, సేనాధిపతులు, మహా సైన్యాధ్యక్షులు వీర యోధులకు కొదవలేదని చెప్పే కాకతీయసైన్యం తమ సైన్యానికి ఎలా తలవంచింది అని వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు..

ప్రతి రాజ్యంలో ఇలాంటి యువరాజులు ఉండటం సాధారణం. ఇలాంటి యువ బృందాలు కాకతీయ రాజనగరిలో కూడా ఉన్నాయి. కాకతీయ యువరాజు బృందం కూడా చలాకీగా ఉత్సాహంగా ఉండే ప్రతిభావంతుల బృందం.

రుద్రదేవుల వారు అందరిని పేరుపేరునా గుర్తిస్తూ వారి వారి ఎదుగుదలను పరీక్షిస్తూ ఉండేవారు.

అందరిలోకి అగ్రతాంబూలం గణపతిదే. కాకతీయ యువరాజ బృందం కూడా మనసా వాచా కర్మణా గణపతిని తమ నాయకునిగా, తిరుగులేని యోధునిగా గుర్తించి గౌరవిస్తుంది. గణపతి కూడా అందరితో కలివిడిగా ఆప్యా యంగా ఉంటాడు.

దేవగిరి రాజనగరిలో వీళ్లను చూస్తుంటే అనుమకొండలోని తన తమ్ములు చెల్లెళ్లు గుర్తొచ్చారు అతనికి. తనే కాదు, వాళ్లు కూడా తన ఎడబాటును తలపోస్తూ ఉంటారు అనుకున్నాడు గణపతి.

ఇప్పుడు గణపతి పేరుకే ఓ బందీ. అతని నివాసం మాత్రం అదే గది. కాని దానికి బంధనాలు, తాళాలు లేవు.

అయితే ఆయన ఇచ్చారీతిగా తిరగడం లేదు. అతనిని అక్కడి నుండి మరో చోటుకు మార్చే ప్రయత్నం కూడా ఎవ్వరూ చెయ్యలేదు. మిత్రులైన యువకులు ఎలా ముచ్చట్లు చెప్పుకుంటారో అదే అనుబంధం వారి మధ్య ఏర్పడిరది.

కాని వ్యాయామశాలలో యుద్ధ శిక్షణలో గణపతి దేవుని జ్ఞానం ఎక్కువ.

సహజంగా అతను తన ప్రవర్తనతో వారి తప్పు లను సున్నితంగా ఎత్తి చూపుతూ గురువులు చెప్పిన వాటి కన్నా వారికి ఎన్నో యుద్ధ వ్యూహాల కిటుకులు చెప్తున్నాడు. ముచ్చట్లతో నవ్విస్తున్నాడు. అభిమానం వేలార్చుతున్నాడు. వాళ్లంతా అతని మాటలకూ, చెప్పే విశేషాలకూ.. ముగ్దులైపోతున్నారు.

ఆ సమయంలోనే ఓ ముచ్చట జరిగింది.

‘‘నువ్వు యువరాణులను పట్టించుకోవా?”

నాలుగైదు రోజుల తర్వాత ఓ కరకు కోకిల కంఠం యువకుల వెనగ్గా వినపడిరది. సాధారణంగా యువకులంతా ఉదయం దాదాపు అందరూ అటూ ఇటూగా ఒకే సమయానికి వ్యాయామశాలకు వస్తారు. అప్పటికే వ్యాయామం చేస్తూ ఉంటాడు గణపతి.

ఇక మొదలవుతాయి వ్యాయామ విన్యాసాలు.. కబుర్లు.. ఇక ఇకలు పకపకలు..

సాధారణంగా వ్యాయామశాలలో యువతులకు ఓ ప్రత్యేక ఆవరణ ఉంది. అక్కడ వాళ్లు వ్యాయామం చేసిన తర్వాత యుద్ధ విద్యల శిక్షణకు బయటకు వస్తారు. మొదటినుండి గణపతిదేవుడు యువతులకు కాస్త దూరంగానే ఉన్నాడు. వాళ్లూ గణపతికి కాస్త ఆవలగా మసలుతున్నారు. కాని ఓ చూపు ఇటు వేసి చూస్తున్నట్లు వారికీ వీరికీ తెలుసు. ఇప్పుడు ఇలా ఒకరు అడిగేసరికి గణపతిదేవుడే కాదు యువరాజులంతా గిరుక్కున తలతిప్పి చూశారు.

గుర్రాలపై పది పదిహేనుమంది యువతులు.. నాయకురాండ్రలా. అందరికి కాస్త ముందున్న యువతి చూపులకే ప్రత్యేకంగా ఉంది. రెప్పపాటులో గ్రహించాడు గణపతి. అశ్వంపై కూర్చున్నామె పట్టపు యువరాణి. బహుశా మహారాజు జైత్రపాలకుని కుమార్తె. ఆమె సౌందర్యవతి. మగరాయు డిలా దర్పంగా ఉంది. ఆమె చూపుల్లో కదలికల్లో అహంతో కూడిన హుందాతనం. ఆమె అందంగా, ఎక్కువ అందంగా ఉంది. స్నిగ్ధ గంభీరం కంటే ఉధృత గంభీరం.

దగ్గరగానున్న ఐదుగురు యువతులు సాధారణ అందగత్తెలయితే అశ్వం పైనున్న ఆమె ఎక్కువ అందగత్తె.

మిగిలినవారు కూడా మంచి అందగత్తెలే. కానీ ఆమెకు దగ్గరగా ఉన్నవారు మాత్రం అందగత్తెలుగా చెప్పడానికి తగరు. అంటే ఆమె అందగత్తెలను తనకు కాస్త దూరంగా ఉంచుతోందన్నమాట.

అలా భావించాడు గణపతి. ఆమె అలా భావిస్తోందని అతను అలా అనుకున్నాడు.

ఆమె అతన్ని నఖశిఖ పర్యంతం చూస్తోంది. తనొక బందీనని వాళ్లంతా రాచ కుటుంబీకులని గణపతి ఎప్పుడూ మర్చిపోలేదు. ఇప్పుడు యువతులు ముందుకొచ్చి పలకరించినా అతను కొంచం గంభీరం గానే స్పందిం చదలచుకున్నాడు.

‘‘చెప్పండి యువరాణి.. తమరికి నేనేమి చెప్పగలను?!!”

ఆ యువతుల ముఖాలలో అహం చల్లారిన భావన. ఆమె దగ్గరగా ఉన్నవారే కాదు కాస్త దూరంగా మసలుతున్న వారు కూడా తల తిప్పి అశ్వంపైనున్న యువతిని చూశారు.

ఆమె అశ్వం దిగి దగ్గరగా వచ్చింది. గణపతి భావరహితంగా కనురెప్పలు కదిపాడు. తమకంటే అధికుడు తమ ముందు వినయంగా ఒదిగి ఉండటం ఆ యువతి బృందాన్నంతా పరవశుల్ని చేస్తోంది. అది ఆ బృందపు హావభావాలను శరీర కదలికల ద్వారా వ్యక్తీకరిస్తోంది.

ఆమె ఇప్పుడు అందరిని.. యువరాజులను కూడా వెనక్కునెట్టి మొత్తం బృందపు నాయకురాలిగా గోచరిస్తొంది.

‘‘మేమంతా ఒకే బృందం. నువ్వొచ్చి మమల్ని విడదీశావు..’’ అన్నదామె గుర్రపు కళ్లెం విలాసంగా ఊపుతో.

‘‘నేనేమి కావాలని చెయ్యలేదు యువరాణీ!’’

మరేదో చెప్పబోతుండగా యువకులలో ఒకరు, “ఈ అడిగేదేదో వారం క్రిందటే అడగొచ్చుకదా సోమూ. మేమూ నేర్చుకుంటాం అంటే గణపతి నేర్పన న్నాడా?!” అన్నాడు.

ఇద్దరూ మాటా మాటా అనుకుంటున్నారు. ఇతరులు వినోదంలా చూస్తున్నారు. వాళ్ల మధ్య చిన్నగొడవ కూడా గణపతికి ఇష్టంలేదు. అంతిమంగా అది తనకు చెడే చేస్తుందని అతని భావన. వెంటనే మాట మార్చాడు. ఆమెతో అన్నాడు.

‘‘అశ్వపు కళ్లెం అలా తిప్పకూడదు. అశ్వం దిగాక కళ్లెం అలా వదిలేయకూడదు. ఇదిగో అక్కడ ఉంచాలి. లేకపోతే అది సాగిపోతుంది. మీ సూచనలు అశ్వం గ్రహించేది దీని వల్లనే కదా! మీ యుద్ధతంత్రాలు అర్ధం కావాలంటే ఈ తోలు కళ్లెం బిగుతుగా ఉండాలి..’’ వినయంగా వివరంగా చెప్పాడు.

సదరు యువతి ముఖం కందగడ్డ కాగా మిగిలిన యువతీయువకులు అందరూ ఘొల్లున నవ్వారు. ఏమాత్రం వినయం తగ్గలేదు ముఖంలో. కాస్త ఆలస్యంగానైనా ఆమె కూడా అందరితో గళం కలిపింది.

ఇప్పుడు యువతులు, యువకులు ఏకమై పోయారు. అందరూ గణపతి శిష్యులై పోయారు. యువతులు కూడా భక్తిగా అతను చెప్పేవి తుచ తప్పకుండా ఆచరిస్తున్నారు. అమ్మాయిలు కూడా బృందంలో కలసిపోవడంతో సరదాలు, అల్లరులు మరింత శోభాయమానంగా మారుతున్నాయి. యువ తులు చెరసాల వరకు రావడం లేదు కాని అవతల ఇవతల యువకులతో కలసి తిరుగాడుతున్నారు.

ఓ ఇద్దరు యువతులను పరీక్షగా చూసి గణపతి అన్నాడోరోజు.

‘‘ఆగండాగండి. మీరిద్దరూ అక్కాచెల్లెళ్లా?!”

అందరూ పగలబడి నవ్వారు ఆ ఇద్దరితో సహా. అందులో ఒకరు చెప్పబోతుండగా యువరాణి అన్నది, ‘‘అవును అక్కా చెల్లెళ్లే.. వారిలో అక్క ఎవరో.. చెల్లెలు ఎవరో చెప్పుకోవాలి?!!”

అందరూ నవ్వుతూ ‘‘ఆ.. గణపతీ ఇప్పుడు  చూపించు నీ తెలివి. ఎవరు అక్కో ఎవరో చెల్లెలో చెప్పాలి.’’

అందరూ కవ్విస్తున్నట్లు గోలగోలగా అరుస్తూ ఆ అమ్మాయిల చుట్టూ తిరుగుతూ వాళ్లను గణపతి వివరంగా చూడకుండా చప్పట్లు కొడుతూ ఉత్సా హంగా గంతులేస్తున్నారు. నిజంగానే గణపతి కొంచం అమోమయంలో పడిపోయాడు. మొదటిసారి యాదవ యువరాజ బృందం అతనిపై పైచేయి సాధించింది. అందరూ ఉత్సాహంగా గంతులు వేస్తున్నారు. అందరి మధ్య ఆ నూనె వాడు వచ్చి మెల్లగా అన్నాడు.

‘‘క్షమించాలి యువరాజా. కారాగారాధికారి వేంచేయుచున్నారు. బందీ ఇంత సేపు బయట ఉండటం తెలిస్తే వారు ఆగ్రహిస్తారు.’’

అందరిని వదలి వడివడిగా లోపలికి కదిలాడు. ప్రక్కనే వస్తూ, “నా పేరు నాగతిస్య’’ అన్నాడు.

‘‘చెప్పావ్‌ గా.. గూఢచారిని అన్నావు కదా!’’ అన్నాడు గణపతి.

‘‘ఎవరి గూఢచారినో చెప్పలేదు.. మీరు అడగలేదు.’’

చటుక్కున ఆగి పోయాడు. ‘‘అవునవును.. అడగ లేదు అడగలేదు..’’

‘‘నేను కాకతీయ గూఢచారిని యువరాజా! మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడటమే నా ఉద్యోగం.’’

‘‘చాలా సంతోషమోయ్‌’’

‘‘నేను నాలుగేళ్లుగా ఈ దేవగిరిలోనే ఉన్నాను. ఇటీవలే నన్ను నమ్మి రాజప్రాసాదంలో ఉద్యోగం ఇచ్చారు. రాత్రివేళ ఈ అంతర్వులో దీపాలకు చమురు పోయడం నా పని. రాత్రంతా మేలుకుని దీపాల వెంట తిరుగుతూనే ఉంటాను. పనిలో పనిగా ఎవరెవరు ఎక్కడున్నారూ.. ఎవరెవరు రాత్రి వేళ రహస్యంగా కలుసుకుంటున్నారు అనేవి నా దృష్టి దాటి పోవు యువరాజా! మీరు వెళ్లి విశ్రాంతి తీసుకోండి. మిమ్మల్ని ఎవ్వడూ ఏమీ చేయలేరు.’’

‘‘సంతోషం నాగతిస్యా. అక్కడ మన అనుమ కొండలోగాని.. మన స్కంధావారంలో గాని ఏమి జరుగుతుందో నాకేమీ తెలియడం లేదు. కాస్త నువ్వయినా నాకు చెప్పవా?!”

దీనంగా చిన్నపిల్లాడిలా అడిగాడు గణపతి. నాగతిస్య కాస్త చలించాడు కానీ జాలిగా ముఖం పెట్టాడు.

‘‘ప్చ్‌.. నాకూ ఏమీ తెలియదు యువరాజా! నాలుగేళ్లుగా ఇక్కడే ఉన్నాను కాబట్టి విషయాలు నా వరకు వచ్చే అవకాశాలు తక్కువ. ఇక్కడి విషయాలు అక్కడికి చేరవేయడమే నాకు తెలిసిన విద్య. అక్కడివి నాకేమీ తెలియదు.’’

అతడి గొంతులో ధ్వనించిన నిజాయితీ గణపతిని తాకింది. ‘పాపం.. అమాయకుడు..’ అన్నట్లు సానుభూతితో చూశాడు.

మౌనంగా నిష్క్రమించాడు నాగతిస్య.

కానీ నాగతిస్య అమాయకుడు కాదని.. అమాయకంగా జీవించే అరివీర భయంకర కాకతీయ యోధుడని గణపతికి దగ్గరలోనే అనుభవమయింది.

మరునాడు నాగతిస్య గణపతి కారాగారానికి కాస్త ఈవలగా అక్కడక్కడే తచ్చాడుతున్నాడు. అప్పటికి ఇంకా తెలవారలేదు. ప్రత్యూషం తెలుస్తున్నా ఆ రాజప్రాసాదంలోని కారాగారం వరకు ప్రవేశించ లేదు. బాగా తెల్లవారితే నూనె పోసే పని విర మించాల్సి ఉంటుంది. అప్పుడు ఆ కారాగారం వద్దకు కాపలా భటులు వచ్చేస్తారు. నాగతిస్య వెళ్లిపోవాలి. అందుకనే గణపతికి ఏదో చెప్పడానికి పెనుగులాడు తున్నట్లు.. ఏదో విచికిత్సలో ఉన్నట్లు తెలుస్తోంది. అతని కదలికలు ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కు పడుతున్నాయి.

కాగడాలలోకి నూనె తిత్తిని వంపుతూ తల తప్పి కారాగారం వంక చూస్తున్నాడు. ఇక ఆలస్యం చేయకూడదనుకున్నాడేమో చెంగున ఉడుతలా దూకి కారాగారం గుమ్మం తట్టి, “యువరాజా..’’ అన్నాడు గుసగుసగా.

ఆశ్చర్యంగా గణపతి జవాబుగా మూలిగాడు నిద్రలో ఉన్నట్లు. వెంటనే నాగతిస్య చటుక్కున కాస్త ఈవలికి వచ్చేశాడు.

గణపతి మెల్లగా శబ్దం రాకుండా ఓరగా తలుపు తీసి చూసి నాగతిస్యను గుర్తించాడు. నిద్రమత్తు వదలిపోయినట్లు చూసి అడుగులో అడుగు వేసుకుంటూ నాగతిస్య వైపుగా వచ్చాడు. ఆ వసారాలో గణపతి నడుస్తుండగా కాస్త వెనగ్గా నాగతిస్య అనుసరిస్తూ చెబుతున్నాడు.

‘‘మీరు.. తమరు కాస్త నియంత్రణలో ఉండాలి. మన స్కంధావారం అక్కడ ఉన్నంతకాలం మీకు ఏ హానీ జరగదు. కాని మన జాగ్రత్తలో మనం ఉండాలి యువరాజా..’’

చెళ్లున చరచినట్లయ్యింది. నిజమే కదా..

‘‘నాకు ఒక్క ముచ్చట అర్ధం కావడంలేదు. వీళ్లు మీకు ఇవ్వవలసినదాని కంటే ఎక్కువ స్వేఛ్చ ఇస్తున్నారని నా అనుమానం. అది.. అది.. ఎందుకో నేను గుర్తించలేక పోతున్నా. వాళ్లు ఆ కుర్రాళ్లు.. చురుకు రక్తం. మీపై ఎంత మోజు చూపిస్తున్నారో.. కాలం వికటిస్తే రేపు అంత శత్రుత్వం చూపుతారు.’’

మరి వెనుకనుండి మాటలేదు. తలవంచుకుని వింటూ ముందుకుపోతున్న గణపతి ఓ క్షణం ఆగి వెనక్కు చూశాడు. ఎవ్వరూ లేరు. అడుగుల సవ్వడి కూడా వినరానంత చురుగ్గా మాయమౌతాడు నాగతిస్య.

నాగతిస్య చెప్పినవన్ని గణపతికి తెలిసినవే అయినా తెలియనిది ఒక్కటే..

ఎందుకు ఎక్కువ స్వేఛ్చనిస్తున్నారు??

– మత్తి భానుమూర్తి

(సశేషం)

About Author

By editor

Twitter
YOUTUBE