భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

– ఎమ్‌. ‌విజయ శ్రీముఖి


‘‘‌శాన్వీ…’’ పిల్చింది రేవతి.

‘‘………………’’

‘అబ్బబ్బ…ఒట్టి బద్ధకం పిల్లయిపోయింది.. తిండి తినమనికూడా పిలవాలా? ఏదైనా అంటే మళ్లీ అలుగుడొకటి చిన్నపిల్లలాగ ‘గొణుక్కుంటూ కూతుర్ని భోజనానికి పిలవడానికి ఆమె గది దగ్గరకు వెళ్లింది రేవతి.

గదిలో లైట్‌ ‌లేదు. ‘అప్పుడే నిద్రా?’ అని అనుకుంటూ కర్టెన్‌ ‌తొలగించ బోయింది.. లోపల నుండి మెల్లగా మాటలు వినిపించే సరికి మౌనంగా కర్టెన్‌ ‌వెనుకే ఆగింది.

‘నాకు భయంగాఉందే సత్యా..’ అంటోంది శాన్వి మెల్లగా, మంచం మీద అటుతిరిగి పడుకుని.

రేవతి నొసలు ముడిపడినాయ్‌!

‘‌శాన్వీకి భయమా! దేనికి? ఏదైనా ఉంటే నాతోనో, వాళ్ల డాడీతోనో చెప్పవచ్చును కదా? మాకు తెలియకుండా స్నేహితురాలితో చెప్పుకునేంత రహస్య భయం..ఏమై ఉంటుందబ్బా?’

అక్కడే ఆగి ఆలకించ సాగింది రేవతి.

‘నీకేం చెప్పడం తేలికే..ఇది ఎవరికీ చెప్పలేదు, చెప్పుకోలేను కూడా. పోలీస్‌ ‌రిపోర్ట్ ఇద్దామా? అమ్మో..ఊరూ నాడూ అల్లరి.

ఇంట్లోగానీ తెలిసిందో…నన్ను చంపేస్తారు. అలాగని ఎంతకాలం ఇలా దాచిపెట్టి భయపడుతూ బతకను? ఏం చేయాలో అర్థం కావడం లేదు, తల పగిలిపోతోంది… ఆఫీసుక్కూడా వెళ్లబుద్ధి కావడం లేదు సత్యా…నాకు చావొక్కటే మార్గం…’

శాన్వి సన్నగా ఏడుస్తోంది…

రేవతికి ఏమీ అర్థంకాక, అయోమయంగా ఆందోళనగా వింటోంది.

‘…నువ్వన్నట్లు ఆ పనే చేసినా పోయినవి తిరిగిపొందగలనా? ఇంట్లో పరిస్థితి ఏంటి?

‘బయటపడితే బైటెలా తిరగాలి?’ సన్నగా ఏడుస్తూనే అడుగుతోంది శాన్వి.

వింటూనే ఉంది రేవతి

‘…ఏంటీ? ఇంట్లో చెప్పనా? ఇంకేమైనా ఉందా? డాడీ నన్ను చంపేసి పాతరేస్తారు. ఆయనసలే ముక్కోపి. వాళ్లకు చెప్పాక, సిగ్గుతో తిట్లతో ఆ బాధపడే బదులు చావడమే నయం…’

కూతురు మాటలు వింటున్న రేవతికి గుండె దడదడలాడుతోంది.

‘పోయినవి పొందగలనా?’ అంటోంది…

‘ఏం పోగొట్టుకుంది? పెళ్లిగాని పిల్ల.. చావే నయం అనుకుంటుంది అంటే..’ మాకు చెప్పటానికి ఇష్టపడటం లేదన్నమాట?

ఇందుకేనా ఇరవై రోజులుగా ముభావంగా అదోలా ఉంటోంది? ఏమిటంటే ఆఫీస్‌లో పనెక్కువగా ఉందని చెబుతోంది.. మాట్లాడుతూనే ఇటు తిరగబోతున్న శాన్విని చూసి, అప్పుడే వస్తూ ఉన్నట్లుగా కర్టెన్‌ ‌తొలగిస్తూ అడిగింది రేవతి

‘‘ఎన్నిసార్లు పిలవనమ్మా నిన్ను? డాడీ, తమ్ముడు తినేసారు. ఇంక మన మిద్దరం ఉన్నాం. తొందరగా లేచి రా!’’

గుమ్మంలోనే నిలబడి చెప్పింది రేవతి చిరుచీకట్లో ఉన్న శాన్విని చూస్తూ.

శాన్వి చటుక్కున ఫోన్‌ ఆఫ్‌ ‌చేసి, తల్లి చూడ కుండా కళ్లు తుడుచుకుంటూ,

‘‘తలనొప్పిగా ఉందమ్మా… తినాలనిలేదు, నువు తినేసెయ్‌’’ అం‌ది లేచి కూర్చుంటూ

‘‘ఈమాట ఇందాకేచెబితే నేనూ వాళ్లతో పాటే తినేదాన్నికదా? ఒక్కదాన్ని కూర్చుని తినలేను. ఒక్కముద్ద అన్నంలో వేడిగా పాలుపోసి పెడతాను. ఆకలి, తలనొప్పీ రెండూ తగ్గుతాయ్‌. ‌లేచి రా!’’

తనేం విననంత మామూలుగా చెప్పింది.

‘తనదగ్గరకూడా దాస్తోంది. గట్టిగా నిలదీస్తే అసలుదాచి అబద్ధాలు చెబుతుందేమో.. ఈ కాలం పిల్లలకు రోషం, ఆవేశం ఎక్కువ. పెద్దవాళ్లు ఏదైనా చెబితే వినే ఓపిక, ఆలోచించే సహనం లేకుండా పోయాయి..ఆలోచిస్తూ వెళ్లిపోయింది రేవతి.

వెళ్లక తప్పదని లేచివెళ్లింది శాన్వి.

*      *       *

భోజనాలు అయిన తర్వాత వంటగదిని సర్దేసి శాన్విగదికి వచ్చింది రేవతి.

‘‘నిద్రపోయావా?’’ పిల్చింది కూతుర్ని

‘‘ఏంటమ్మా?’’తలుపు తీసింది శాన్వి

‘‘ఈపూట నేను నీతోపాటు ఇక్కడే పడుకుందా మని వచ్చాను’’ చెప్పింది.

‘‘ఎందుకు?’’

అనుమానంగా అడిగింది శాన్వి

‘‘రాత్రంతా నాకు కలల్లో మా అమ్మే శాన్వీ!

ని•్ర లేచిన దగ్గర్నుంచి పదేపదే మా అమ్మ గుర్తొస్తూనే ఉందీ వేళెందుకనో…’’

కూతురు పక్కనే మంచంమీద కూర్చుంటు చెప్పింది రేవతి.

‘‘ఎందుకనమ్మా? నిన్ను డాడీ ఏమన్నా అన్నారా? ఆయనేదైనా కోప్పడినప్పుడే

నీకు అమ్మమ్మ గుర్తొచ్చేది’’ చిన్నగా నవ్వుతూ అడిగింది శాన్వి

ఆధారం దొరికినట్లైంది రేవతికి. ఆ మాటతో ముందుకు సాగొచ్చునను కున్నదామె.

‘‘నేను పడుకుంటే నీకేమైన ఇబ్బందా?’’ ఒకప•క్క పడుకోబోతు కూతుర్ని అడిగింది

‘‘ఇబ్బందేమి లేదమ్మా…పడుకో’’ తను అవతలికి జరిగి, తల్లికి మరింతగా చోటిచ్చింది శాన్వి.

‘‘ఎంత జాగ్రత్తగా ఎన్నిచేసినా.. మీ నాన్నకి నా పొరపాట్లు ఏవో కొన్ని కనిపిస్తూనే ఉంటాయి. మనుషులన్నాక ఏదో ఒక పొరపాటు పడకుండా ఉండటానికి మనం ఏమైనా దేవతలమా? సరిపెట్టుకో వడమో, ఇక మీదట అలా చేయొద్దనో చెప్పాలి. అంతేగాని మనసుకి బాధకలిగేలా అంటే ఎలా ఉంటుంది? ఛ..ఏం జీవితం? అని అనిపించదూ?’’ అడిగింది రేవతి.

‘‘ఇంతకీ దేనిగురించి ఏం అన్నారు?’’ అడిగింది శాన్వి.

ఆమె ప్రశ్న విననట్లుగానే చెప్పసాగింది… ‘‘ఇదివరకైతే ఇలా మనసు బాగా లేనపుడు ఏదైనా సమస్య వచ్చినపుడు మా అమ్మకి చెప్పుకునేదాన్ని. తల్లి తర్వాత తల్లి కూతురే కదా? అందుకనే నీ దగ్గరకు…’’

తల్లి చెప్పేది వింటోంది శాన్వి

‘‘మా అమ్మ నీలాగా చదువుకుని ఉద్యోగం చేయడం కాదు కదా, కనీసం నాలాగా కాలేజీ గడప కూడా తొక్కలేదు. ఐతేనేం? తన అనుభవంతో సమస్యని అర్థం చేసుకుని మంచి సలహానో, పరిష్కారమో చెప్పి ఊరడించేది. అప్పుడు నా మనసంతా భారం దిగి తేలికపడేది’’

‘‘…………………’’

‘‘… ఇప్పుడెవరికి చెప్పుకోను? చుట్టాలకో, ఇరుగుపొరుగు వాళ్లకో అన్నీ చెప్పుకోలేం. చెబితే అల్లరయి పోతామని భయం’’

‘‘ఇంతకీ ఏమన్నారమ్మా డాడీ?’’

తల్లి బాధేంటో అర్థంకాలేదు శాన్వికి.

‘‘మనసు వికలమైనప్పుడు.. మనది తప్పు అయినా, ఒప్పైనా కడుపులో పెట్టుకునేది కన్నవాళ్లే. బిడ్డలకు తల్లి, తండ్రిని మించిన శ్రేయోభిలాషులు ఎవరూ ఉండరు కదా..’’

‘‘అసలు డాడీ ఏమన్నారో చెప్పలేదు’’

అడుగుతూనే ఆలోచిస్తుంది శాన్వి ‘ఇందాక సత్యతో తన మాటలు విన్నదా? అని లీలామాత్రంగా అనుమానం వచ్చినా అప్పుడప్పుడు తండ్రి విసుక్కున్నా, లేదా ఈమెకే ఆయనమీద కోపం వచ్చినా తనకి ఫిర్యాదు చేయడం అలవాటే అనుకుంది.

‘‘నాకు ఇంటి మీద, మీ మీద అశ్రద్ధ ఎక్కువై ఏదీ పట్టించుకోవడం లేదని తిట్టారు. అవన్నీ ఏం చెప్పనులే…’’ మాటలను తేల్చేసింది రేవతి.

‘‘నువు పట్టించుకోకపోతే మా అందరికీ వేళకన్నీ ఎలా అమిరిపోతున్నాయిట? ఏదో విసుగులో అరుస్తూ ఉంటారులే గానీ, నీ మీద డాడీకి చాలా ప్రేమ ఉందమ్మా!’’ చిన్నగా నవ్వుతూ చెప్పింది శాన్వి.

‘‘ఏం ప్రేమో! అంతేలే, నీవన్నట్లు చికాకులో అరిచి ఉంటారు. చూసావా? నీకు చెప్పుకో బట్టేకదా మనసు తేలికై, మామూలైనాను. లేకపోతే, ‘నన్నన్నారు.. నన్ను తిట్టారు.. ఛీ ఛా…అనుకుంటూ ఏడుస్తూ ఉండేదాన్ని’’ రేవతి నవ్వేసి, ప్రక్కకుతిరిగి పడుకుంది.

శాన్వి కూడా పడుకుంది.

*      *       *

ఓ అర్ధగంట గడిచింది…

రేవతి నిద్రపోలేదు. అతిమెల్లని కదలికలు నిట్టూర్పుల ద్వారా కూతురు కూడా నిద్రపోలేదని ఆమెకు తెలుస్తూనే ఉంది.

‘‘నామూలాన ఫ్రీగా పడుకోలేక పోతున్నావ్‌ అనుకుంటాను. సరిగా పడుకో, నే వెళ్తాను’’ అంటూ లేవబోయింది.

‘‘వద్దమ్మా.. ఉండు పడుకో..’’ అని క్షణమాగి

‘‘అమ్మా..నీకో విషయం చెప్పాలి…’’ మెల్లగా అంది శాన్వి.

‘‘ఏమిటో చెప్పరా…’’

ఇటుతిరిగితే తనని చూస్తూ చెప్పలేదని.. అటుతిరిగి పడుకునే అడిగింది రేవతి.

కొన్ని క్షణాలతర్వాత మెల్లగా చెప్పసాగింది శాన్వి…

‘‘మొబైల్స్‌లో వాట్సాప్‌, ‌ఫేస్బుక్‌ ఇన్‌స్టాగ్రామ్‌లు అందరూ చూస్తూ ఉంటారు కదా

అలాగే నేనూ…’’ ఆగింది శాన్వి.

‘‘…………’’ వింటుంది రేవతి

‘‘..అలా చూస్తూ చూస్తూ అప్పుడప్పుడేవో కొన్నింటికి కామెంట్స్ ‌పెట్టే క్రమంలో నాకు ఒకతను పరిచయం అయ్యాడమ్మా…’’

‘హమ్మా… అనుకున్నంతా అయ్యింది’ మనసులో అనుకున్న రేవతి పైకి మాత్రం… ‘‘సహజమే! చూస్తూ చదువుతూ దేనికో దానికి స్పందిస్తాం కాబట్టి, ఎవరో ఒకరు పరిచయమవుతారు. ఇప్పుడు మీకు ఫోనుల్లో. అప్పట్లో మాకు పత్రికల్లో. ఐతే?’’

‘‘ఆ పరిచయం స్నేహంగా మారింది… నాల్గు నెలలు గడిచేసరికి మరి కొంచం..’’ ఆగింది శాన్వి.

ఊపిరి బిగబట్టింది రేవతి

‘‘అలా మరింత.. క్లోజ్‌గా… ఫ్రెండ్సయ్యాం. తను ఒకసారి మా ఆఫీస్‌కి వచ్చి కలిశాడు రెస్టారెంట్‌కి వెళ్లాం అమ్మా…’’

‘‘తనేం చేస్తాడు? ఉండేదెక్కడ?’’

‘‘ఉండేది ఈ సిటీలోనే. ఎమ్‌.‌బి.ఎ. చేసి, జాబ్‌ ‌కోసం చూస్తున్నానని.. అందాక ఒక కార్పొరేట్‌ ‌కాలేజీలో ఎ.ఓ.గా చేస్తూన్నాను అని చెప్పాడు…’’

‘‘……………’’

‘‘తనకి మంచి జాబ్‌ ‌వచ్చే వరకు మా ప్రేమను, పెళ్లి చేసుకుందామనే విషయాలు ఇద్దరి ఇళ్లలో చెప్పొద్దు అని అనుకున్నాము…’’ చెబుతోంది శాన్వి…

‘అప్పుడే అంతవరకీ వెళ్లారా!’

అనుకుంది రేవతి

‘‘ఎప్పుడన్నా సరదాగా సినిమాకో, షికారో వెళ్దామనేవాడు. రానంటే నిష్టూ రంగా మాట్లాడేవాడు. ఎదురు చెప్పలేక… ఒకటి రెండుసార్లు పార్కుకి వెళ్లా’’

‘వాడు గోతిలో దూకమంటే దూకుతావా?’

అనలేదు రేవతి, అనుకుంది లోలోన.

‘‘..చెప్పు’’ అంది పైకి.

‘‘ఒకసారి ఏదో జాబ్‌ ‌కోసం ఇంటర్వ్యూకి వెళ్లానని.. మంచి జాబ్‌ ‌కనుక ఐదు లక్షలు డిమాండ్‌ ‌చేస్తున్నారని ఒక మధ్యవర్తి ద్వారా తెలిసి, అప్రోచ్‌ అయ్యానని.. ఐదు కాదు మూడు లక్షలిస్తానని రిక్వెస్ట్ ‌చేసి చివరికి ఒప్పించానని అన్నాడు…’’

ఏమేం వినాల్సి వస్తుందోనని భయంగా వింటోంది రేవతి.

‘‘…నేను కార్పోరేట్‌ ‌కాలేజీలో జాబ్‌ ‌చేస్తూ లక్ష వరకు కూడబెట్టుకున్నాను శాన్వీ.. ఇంకా రెండు లక్షలు కావాలి. ఎవర్నడగను? అడిగితే ‘లంచానికా?’ అని ఇవ్వకపోగా ఎద్దేవా చేస్తారు. నీవు సర్దగలవా?’ అని అడిగాడు. జాబ్‌ ‌వచ్చాక నీబాకీ తీర్చిన తర్వాతే మనపెళ్లి నన్ను నమ్ము’ అన్నాడమ్మా’’

‘‘అంత డబ్బు పెద్దవాళ్లకు తెలియకుండా నేనెక్కడ తేను? అనలేదా నువ్వు?’’

సాధ్యమైనంత మెల్లగా అడిగింది రేవతి

‘‘నాకు జాబ్‌ ‌వచ్చిన ఈ సంవత్సరం నుండి నా శాలరీ నా పేరుతోనే బ్యాంక్‌లో వేసుకోమని చెప్పారు కదమ్మా డాడీ నువ్వు కూడా…’’ అంది

‘‘అన్నామని అవి తీసి ఇచ్చేశావా?’’ కంగారుగా అడిగింది రేవతి

‘‘నేను తొందరగా జాబ్‌లో చేరితే మనం మేరేజీ చేసుకుని హేపీగా సెటిల వుదాం.. అన్నాడని…’’ మళ్లీ ఆగింది శాన్వి.

చివుక్కున లేచికూర్చున్న రేవతి కూతురు శాన్వి గొంతులో దుఃఖం,కళ్లల్లో బెదురు చూసి తనని తాను సంబాళించుకుంటూ

‘‘ఎందుకంత తొందరపడ్డావ్‌? ఒక్కమాట మాతో… కనీసం నాతో కూడా చెప్పాలని నీకు తోచలేదా?’’ అడిగింది.

‘‘…మీ ఇంట్లో నువ్వూ, మా ఇంట్లో నేనూ అప్పుడే చెప్పొద్దు. నాకు జాబ్‌ ‌వచ్చాక అదీ, మనపెళ్లి గురించి ఒకేసారి చెబుదాం సర్ప్రైజ్‌ ‌చేద్దాం… అన్నాడని…’’ ఆగింది శాన్వి.

‘‘సరే, ఇప్పుడు ఏమంటాడు?’’ విసుగు ధ్వనించింది రేవతి గొంతులో.

‘‘…………….’’ మాట్లాడలేదు శాన్వి .

‘‘నిన్నేనమ్మా’’ మళ్లీ అడిగింది రేవతి

‘‘..అతను.. అతను…అడ్రస్‌ ‌లేడమ్మా… మొబైల్‌ ‌నంబర్‌ ‌కూడా పని చేయడం లేదు అతను పని చేస్తున్నానని నాకు చెప్పిన కార్పోరేట్‌ ‌కాలేజీకి నేను, సత్య వెళ్లి ఎంక్వయిరీ చేశాం…

ఆ పేరుగల వాళ్లెవరూ అక్కడ లేరనీ, ఉన్న వాళ్లంతా గత మూడేళ్లుగా ఎవరూ మారలేదని చెప్పారు. తను ఉన్నానన్న రూమ్‌ అ‌డ్రస్‌కి వెళ్తే… అదీ అబద్ధమనే తేలింది… ఇంత సిటీలో ఎటునుండి వచ్చేవాడో ఏమో…’’ ఏడుస్తుంది శాన్వి.

‘‘మీ స్నేహం ఎన్నాళ్ల నుండి?’’

‘‘నాలుగు నెలల నుండి. ఇరవై రోజులుగా సిమ్‌ ‌మార్చి అడ్రస్‌ ‌లేడు’’ చెప్పింది శాన్వి

హతాసురాలైంది రేవతి.

భోజనానికి పిలవడానికి వచ్చినప్పుడు సత్యతో ‘చచ్చిపోవాలనిపిస్తోంది..’ అని చెప్పడం గుర్తొచ్చింది. అంటే..? అంటే..?

పోయినవి కేవలం డబ్బులేనా? లేక… ఇంకేవేవో ఆలోచనలతో వణికి పోయింది రేవతి.

‘‘ముక్కూ ముఖం తెలియనోళ్లు. సోషల్‌ ‌మీడియాలో పరిచయాలు.. అవి పెరిగి స్నేహాలు… అవి కూడా ముదిరి ప్రేమలు!

డబ్బు, మనసులు ఇచ్చేసుకునేంత వెర్రి!’’ కటువుగానే అంది రేవతి.

‘‘నాకు తెల్సమ్మా… ఇది తెలిస్తే డాడీ నన్ను చంపేస్తారనీ…’’ దోసిలిలో ముఖం దాచుకుని ఏడుస్తోంది.

‘‘మీరు చదివిన చదువులు ఉద్యోగానికి, చాటింగ్‌ ‌లకు మాత్రమే పని కొస్తున్నాయ్‌…అం‌తకు మించిన జ్ఞానాన్ని, నిగ్రహాన్నివ్వలేక పోతున్నాయ్‌.. ఆవేశంలో డబ్బు మనసు శీలం… అన్నీ.. అన్నీ కోల్పోయి ఏడుస్తూ కూర్చోవడం..’’

రేవతికి విపరీతమైన కోపం వచ్చేసింది, లాగిపెట్టి చెంపలు వాయకొట్టాలని ఉంది.

‘‘అమ్మా… వాడి మాటలు నమ్మి డబ్బుని మాత్రమే ఇచ్చాను.అంతే, నమ్మమ్మా… ఇంతకుమించి నేను వివరంగా చెప్పలేను’’ వెక్కుతూనే అంటుంది శాన్వి. అర్థమైంది రేవతికి. లోలోన చిన్న ఊరట. కూతురి ఏడుపుతో నిస్సత్తువ కమ్మింది.

‘‘నీకు.. నాన్నకు.. చెప్పలేక మీ మొహాలు చూడలేక, నేను చచ్చి పోవాలను కున్నాను అమ్మా…’’

కూర్చున్న శాన్వి కదిలి కదిలి ఏడుస్తోంది.

ఇందాక ఎవడినో ప్రేమ పేరుతో నమ్మేసి, లక్షలు తగలెట్టేసిందని కలిగిన ఆవేశం, ఆగ్రహం…’’ చచ్చిపోవాలనుకున్నానమ్మా’’ అనే మాటతో చల్లారి పోయాయి.

రేవతి కూతుర్ని దగ్గరకు తీసుకుంది.

‘‘ఇదంతా మీ స్వయంకృతాపరాధమే.

మీరు అంతర్జాలపు ఉబలాటాలతో ఊగి పోతున్నారు. అక్కడ ప్రేమ, అందం, నమ్మకం, డిగ్రీలు లాంటి నకిలీ మాటలకు అందమైన రంగుల పూతతో ‘ఇంద్రచాపం’లా మురిపించే వాళ్లు ఉంటారు! మాటలతో మైమరిపించే మాయగాళ్లు మాటువేసుకుని ఉంటారు. మగపిల్లలే కాదు, కొంతమంది ఆడపిల్లలు కూడా ఆ కోవలో ఉంటున్నారు…’’

‘‘…………….’’

‘‘మాయగాళ్ల మాటల్లో మాధుర్యం ఎక్కువ. మీరటు ఆకర్షితులైపోయి.. వాళ్ల జాలంలో చిక్కాక, మీకా ఇంద్రచాపంలో అగుపించిన రంగులన్నీ కరిగి కరిగిపోతూ కనుమరుగవుతాయ్‌..

ఇం‌క జీవితాంతం కురిసేది మీ కన్నీళ్లే!’’

‘‘………….’’

శాన్వి తల్లి ఒళ్లో ఉన్నా ఇంకా వెక్కిపడుతూనే ఉంది.

‘ఇలాంటప్పుడే కదా కన్నవాళ్లం బిడ్డల పొరపాట్లో, తప్పులో అనునయంగా అడిగి క్షమించి, దారిచూపాలి. పెద్దవాళ్లం కూడా ఆవేశపడితే… పిల్లలు తీసుకునే తీవ్రమైన తొందరపాటు నిర్ణయాలతో జీవితాంతం కుమిలి పోవాలి’ మనసులో అనుకుంది రేవతి.

‘‘నీ దగ్గరున్న వాడి నంబర్‌, ఉం‌టే ఫొటో ఇవ్వు. తెల్లారాక నేను డాడీకి నెమ్మదిగా చెబుతాను… పోలీస్‌ ‌కంప్లయింటా.. ఏంటి అనేది మేము చూసు కుంటాం’’

‘‘………………..’’

‘‘పసిపిల్లలప్పుడు కాపాడుకోవాల్సింది పోయి, మిమ్మల్ని ఈ వయసులో ఇలాంటి అంతర్జాల ఆకర్షణల నుండి కాపాడటమే కన్నవాళ్లకు కష్టంగా మారింది. సరే, ఇంక నువు మంచినీళ్లు తాగిపడుకో’’ పక్కనున్న మంచినీళ్ల బాటిల్‌ అం‌దిస్తూ చెప్పింది రేవతి. మౌనంగా తలూపి, తల్లి అందించిన మంచి నీళ్లు తాగింది. భారం దిగిపోయినట్లుగా తల్లిమీద ఒక చెయ్యేసుకుని పడుకుంది శాన్వి.

వచ్చేవారం కథ..

నారీ రక్షిత రక్షితః

– మంగు కృష్ణకుమారి

About Author

By editor

Twitter
YOUTUBE