భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
– పెనుమాక నాగేశ్వరరావు
‘‘ఇదిగో …మిమ్మల్నే…!’’
‘‘ఏమిటే గొడవ!’’
ఽపిలిస్తేనే గొడవంటే ఎలా?’’
‘‘ఈ టైం లో ఎందుకు పిలిచిచావని?’’
‘‘వస్తేగా తెలిసేది’’
‘‘వస్తున్నా… వస్తున్నా!’’
‘‘త్వరగా!’’
‘‘సరే…సరే..నన్ను కంగారు పెట్టకు మరి!’’
‘‘కంగారెందుకు’’
‘‘ఎందుకంటే ఏం చెప్పేది? లుంగీయేనా బిగించుకోవాలా వద్దా?’’
‘‘మీ ఇష్టం’’
‘‘అందుకే….’’
‘‘ఏమిటి…అందుకే’’
‘‘నీకు చెలగాటం……..’’
‘‘చాల్లే సంబడం…రండి త్వరగా…’’
ఇదిగో ఈ పళ్లెం తీసుకోండి’’
‘‘ఏం పళ్లమే …ఈ బట్టలేమిటి……నా కోసం కొన్నావా?’’
‘‘…. దసరా పండుగేమన్నా కదూ…… అల్లుడుగారు ఇప్పుడు వస్తారు. ఇంకో మూడు గంటల్లో తిరుగు ప్రయాణమట. ఈ బట్టలు ఆయనకివ్వండి. నేను అమ్మాయికి ఈ బట్టలు ఇస్తాను’’ అంటూ మరో పళ్లాన్ని తన చేతుల్లోకి తీసుకుంది కుసుమ.
‘‘ఈ రోజు వాళ్ల పెళ్లి రోజు కదండీ….! అతనికి సెలవు లేదట. ఆఫీసు పని పూర్తి చేసుకుని బయలుదేరాడట. మళ్లీ రేపు ఉదయం వెళ్లాలట. ఈ రోజు అర్ధరాత్రికే తిరిగి బయలుదేరుతాడట …అదీ విషయం’’ చెప్పింది కుసుమ.
‘‘ఏమే! నాకు తెలీక అడుగుతాను… పెళ్లిరోజు బానే వుంది. బట్టలు పెడదాం. బానే వుంది. అతను ఈ రాత్రివేళ ఇంత పొద్దుపోయిన తరువాత రావటం ఏమిటి? తినే వేళా కాదు, పడుకునేవేళా కాదు. ఈలోగా ఆఫీసు వాళ్లు ఫోన్ చేయరని గ్యారంటీ ఏమీలేదు. ఎందుకు వచ్చినట్టు,ఎందుకు వెళుతున్నట్టు! ’’ ‘‘చాల్లే….అతను చేసేది మీలాగా కోర్టులో టైపిస్టు ఉద్యోగం కాదు. సాఫ్ట్‌వేర్ …….ఆ ఉద్యోగాలంతే. వాళ్లకు తీరికే వుండదు.’’
‘‘సరే నా ఉద్యోగం సంగతి ఎందుకులే….. ఆ రోజులు మళ్లీ వస్తాయా!’’
‘‘అవునవును……పెళ్లిరోజంటూ, రోజూకంటే ఓ అరగంట ముందే బయలుదేరి సైకిల్ బెల్ మోగించుకుంటూ ఇంటికి వచ్చేవాళ్లు. పంచభక్ష్య పరమాన్నాలతో సుష్టుగా భోజనం చేసి, ఓ అరగంట కునుకు తీసి ఆనక తీరిగ్గా సైకిలెక్కి ఆఫీసుకు వెళ్లేవాళ్లు. అడిగేవారా పెట్టేవారా? మనం ఆడింది ఆట, పాడింది పాట.’’ అని కొంటెగా భర్త వైపు చూసింది.
* * *
‘‘మళ్లీ సాయంత్రం అయిదో గంట కల్లా ఆగమేఘాలమీద ఇంటికి వచ్చి స్నానం చేసి టింగు రంగడిలా తయారయ్యి, నన్ను తొందరపెట్టి ఏ సినిమాకో ,పార్కుకో తీసుకు వెళ్ళేవాళ్లు’’ అంటూ సిగ్గుపడిపోయింది కుసుమ.
‘‘ఆ తరువాత విషయం కూడా చెప్పు మరి’’ అంటూ భార్య కళ్లల్లోకి చూశాడు శేఖరం.
‘‘ఇంకా నయం. ఇప్పుడు ఆ ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చుంటే అల్లుడుగారు వచ్చేస్తారు. పదండి ముందు హాల్లోకి’’ అని నెట్టినంత పని చేసింది.
‘‘ఆ నాటి ఆ హాయీ కల కాదోయి నిజమోయి..’’ నిద్రమత్తు వదిలిన శేఖరం కూనిరాగం తీసుకుంటూ హాల్లోకొచ్చి సోఫాలో కూర్చున్నాడు. చేతిలో వున్న బట్టల పళ్లాన్ని టీపాయ్ మీద పెట్టాడు.
‘‘అబ్బా….ఆపండి స్వామీ మీ కూని రాగాలు… అమ్మాయికి వినబడితే బాగుండదు’’ బుంగమూతితో అన్నది కుసుమ.
‘‘ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం. నీ బుంగమూతి చందం …..’’ ఊరుకోలేదు శేఖరం
‘‘మీకు దండం పెడతా, పాటలు ఆపండి’’ అంటూ రెండు చేతులూ జోడించింది కుసుమ.
సరిగ్గా అప్పుడే కారు హారన్ మోగింది. కూతురు సరళ గదిలో నుంచి బయటకు వచ్చి, వడివడిగా వరండాలోకి నడిచింది. అలసిన ముఖంతో బలవంతపు నవ్వుతో దర్శనం ఇచ్చాడు అల్లుడు కుమార్. ఉభయకుశలోపరి అయింది. మంచినీళ్లు తాగినట్లు నటించాడు. శేఖరం దంపతులు ఇచ్చిన బట్టలు అందుకుని, నాలుగు అక్షింతలు నెత్తిన చల్లించుకుని వడివడిగా కూతురు, అల్లుడూ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. కుసుమ దంపతులు వాళ్ల గదిలోకి వెళ్లి లైటు వేసుకుని కూర్చున్నారు.
‘‘అదిగాదే … ఈ ఉన్న రెండు,మూడు గంటలైనా కాస్తంత సరసం, అచ్చటా ముచ్చటా ఏమన్నా వుంటయ్యా. అంత టైము వుండదా?’’ అడిగాడు భార్యే కదా అని.
కస్సుమని లేచింది కుసుమ. ‘‘మీరేం మాట్లాడు తున్నారో అర్థమవుతుందా? అరవై దాటినా ఇలాంటి సందేహాలు, మీరూను…. తినటానికి, పడుకోవటానికే వాళ్లకి టైము ఉండటం లేదంటుంటే..’’ చిరుకోపం ప్రదర్శించింది కుసుమ.
ఽఅలాంటి ఉద్యోగాలు చేయకపోతే ఏం పోయిందట!’’ అన్నాడు శేఖరం.
ఽఇదిగో మీరు ఈ చాదస్తపు మాటలు మాట్లాడటం ఆపేయండి బాగుంటుంది’’
ఽచాదస్తం మాటలా! అన్నం తినటానికి టైము లేకుండా, మొగుడూపెళ్లాలు ముద్దుముచ్చట్లు తీర్చుకోవటానికి టైము లేకుండా, పిల్లల్ని కనటానికి అసలే టైము లేకుండా చేసే ఉద్యోగాలు ఉండటం కన్నా ఊడటమే నయం. కడుపు నిండా తిండి,, కంటి నిండా నిద్ర పోనీయని ఉద్యోగాలు ఎందుకు… ఊళ్లో వాళ్లకి చెప్పుకోవటానికీ, లక్షలకి లక్షలు బ్యాంకుల్లో దాచుకోవటానికీ తప్ప ఎవరికైనా సుఖము, సంతోషము ఉంటున్నాయా?’’ ఒకింత ఆవేదనతోనే అని వెనక్కి వాలి పడుకున్నాడు.
‘‘మీకు తెలీదులెండీ…. మీ రోజుల్లో లాగానే కుదరాలంటే కాదు. ఇప్పటి కాలంలో ఉద్యోగాలు ఇలానే ఉంటున్నై. వాళ్ల తిప్పలు వాళ్లవి!’’
‘‘గంతకు తగ్గ బొంతలు’’ గోణిగినట్లుగా అన్నాడు
‘‘గంతలూ లేవు, బొంతలూ లేవు. వాళ్లు వస్తారు, మీరు మాట్లాడకండి’’ హెచ్చరించింది కుసుమ.
కిక్కురుమనకుండా కూర్చున్నాడు కాసేపు.
‘‘అవునే… మన మొదటి మేరేజ్ డే కి మీ నాన్న నాకు పేంటు, షర్టు కాకుండా, పంచెలచాపు పెట్టాడేంటే!’’ బ్రహ్మానందం స్టైల్లో అడిగాడు శేఖరం.
ఽఅందుకేగా ఆరోజు నానా యాగీ చేశారు’’
‘‘నేనా! నానా యాగీ చేశానా! ఏవే. కావాలని అంటున్నావ్ కదూ! నాకు గుర్తున్నంత వరకూ ఆ రోజు పాపం ఎందుకు ఈ పిచ్చి మాస్టారు ఇవన్నీ పెట్టటం అనుకుని ఆ తర్వాత ఆయన మనింటికి వచ్చినప్పుడు ఉగాది పండుగ వంకన మళ్లీ ఆ పంచెల చాపు ఆయనకే పెట్టినట్లు గుర్తు నాకు’’ అన్నాడు శేఖరం.
‘‘అవునండి.. మా నాన్న ఆ విషయం ఎన్ని సార్లు అనుకున్నారో….మిమ్మల్ని ఎంత పొగుడుకున్నారో!’’ సంతోషం తో పొంగిపోతూ అన్నది కుసుమ.
‘‘ఓ.కే..ఓ.కే ..నువ్విప్పుడు ఆ విషయం పొడిగించకు…ఎలాంటి రోజులోయ్ అవి!’’ అంటూ కుసుమ భుజం మీద ఆప్యాయంగా చేయి వేశాడు శేఖరం.
‘‘మమ్మీ… ఆయన వెళుతున్నారు’’ కూతురి పిలుపుకి ఇద్దరూ గదిలోంచి బయటకు వచ్చారు
‘‘వెళ్లొస్తా మామయ్యగారూ!’’ అంటూనే హడావిడిగా బయటకు నడిచాడు అతగాడు. అంతలోనే ఫోన్ మోగనే మోగింది. ఓ చేతిలో బ్యాగు, మరో చేతిలో సెల్లు, కళ్లతోనే భార్యకు వీడ్కోలు చెప్పి కారెక్కాడు అల్లుడు. కారు గేటు దాటంగానే లోపలికి నడిచింది సరళ.
‘‘అది కాదమ్మా…కనీసం ఈ ఒక్క పూటైనా ఉండి వెళితే బాగుండేది కదా అల్లుడుగారు’’ అన్నాడు శేఖరం.
రేపు ఉదయాన్నే జి.యం.తో మీటింగ్ ఉందట డాడీ. లేకపోతే ఉండేవాళ్లే’’ సమాధానం చెబుతుండగానే ఫోన్ వచ్చింది ఆమెకు. బహుశా అల్లుడు గారి దగ్గరినుంచే అయివుంటుంది అనుకుంటూ కుసుమ వెనుకాలే తమ గదిలోకి నడిచాడు మవునంగా శేఖరం.
మంచం మీద పడుకున్న కుసుమ గోడ గడియారం వంక చూసింది. ‘అబ్బో రెండున్నారా!’ అనుకుని నిద్రకుపక్రమించబోయింది.
తలుపు గడియ వేసి బెడ్ లైటు ఆపేసి ట్యూబ్ లైటు ఆన్ చేశాడు
‘‘ఇదేం చోద్యం! బెడ్ లాంప్ ఆపి పెద్ద లైటు వేసారూ!’’ కళ్లు చిట్లించుకుంటూ అడిగింది
‘‘ఏంలేదోయ్… ఓ సారి నీ ముఖం చూడాలనిపించీ…’’
‘‘చూసింది చాలు! ఆ లైటు తీసేసి పడుకోండి’’
పెద్దగా నవ్వాడు శేఖరం.
విస్తుపోయి చూసింది కుసుమ. ఽఏమైందండీ అలా నవ్వుతున్నారు?’’
‘‘నువ్వు అలా అనగానే నాకో జోక్ గుర్తుకు వచ్చింది. వింటే నువ్వూ నవ్వాపుకోలేవు.
‘‘ఇప్పుడే నవ్వాలా?’’
అదే మరి.. ముందు విను…. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న బల్బు కనిపెట్టింది ఎవరో గుర్తుందా?’’
పూర్తిగా గుర్తు లేదుగాని….ఎడిసన్ అని గుర్తు
‘‘అబ్బో…నీ జ్ఞాపక శక్తి గొప్పది. సరే …అసలు విషయం ఏమిటంటే ఆ ఎడిసన్ గారు కొన్ని నెలలు కాదు సంవత్సరాలు పరిశోధనలు చేసి చేసి అలసి సొలసి చివరికి ఈ బల్బు కనిపెట్టాడుట. మన అదృష్టమో ఆయన అదృష్టమో ఆ బల్బు కూడా ఇలాగే అర్ధరాత్రి ఏ రెండుకో రెండున్నరకో వెలిగిందట మొదటిసారి. ఆ ఆనందం పట్టలేక ఉబ్బితబ్బిబ్బవుతూ భార్యని తట్టి లేపాడట ఎడిసన్ మహానుభావుడు. అబ్బా వెలిగితే వెలిగింది ఆర్పేసి పడుకోండి, నాకు నిద్ర వస్తున్నది అనేసి పక్కకు తిరిగి పడుకుందట ఆ ఇల్లాలు. ఆమె కూడా నీలానే చాలా అందగత్తెట.’’ అని భార్య కళ్లల్లోకి చూశాడు కొంచం బిడియంగా వచ్చే నవ్వుని బిగపట్టుకుంటూ పడుకుంది కుసుమ.
‘‘ప్రతి పురుషుడి విజయం వెనుకా ఓ స్త్రీ వుంటుంది అంటారు ఇదేనా?’’ అడిగాడు.
పగలబడి నవ్వింది కుసుమ. నవ్వే అందాన్ని నాజూకుగా హత్తుకున్నాడు శేఖరం.
నిద్ర పట్టీ పట్టనట్లుండగానే తెల్లవారిపోయింది. కుసుమ లేచి ఇంటి పనుల్లో లీనమైపోయింది. ఆ తరువాత ఓ గంటకి లేచిన శేఖరం కాలకృత్యాల పనిలో పడ్డాడు.
అంతలోనే కాఫీ కప్పుతో తన వైపే నడిచి వస్తున్న కుసుమని తనివి తీరనట్లు చూడసాగాడు. రాత్రంతా ప్రశాంతంగా నిద్రించిన ముఖం మరింత తేటగా ఉంది.
‘‘ఏమిటా చూపు…..’’ గుస గుసగా అన్నది కాఫీ కప్పు అందిస్తూ.
‘‘ఏం లేదోయ్. ముఖారవిందం రాత్రిపూట ఒకలా, ఉదయం పూట ఒకలా ఎందుకు కనబడుతుందా అని శోధిస్తున్నాను.’’
అవునా!… ఇవ్వాళ మధ్యాహ్నం కూడా చూడండి. అప్పుడింకోలా కనబడుతుందేమో కనిపెడు దూరు గాని, ఆయనెవరూ.. ఎడిసన్‌లాగా!’’ అంటూ కాఫీ కప్పుతో ఎదురుగ్గా కూర్చుంది కుసుమ.
‘‘అవును నిజమే. ఈ ఆలోచన నాకెందుకు రాలేదబ్బా!’’
‘‘కాఫీ తాగడం మొదలెట్టండి… ఇంకా ఎన్నెన్ని ఆలోచనోస్తాయో!’’
‘‘అవును కదూ’’ అంటూ కాఫీ సిప్ చేశాడు. ఘుమఘుమ లాడుతోంది వాసన.
కాఫీ తాగుతూ లైటు వేసి ఉన్న కూతురు గదిలోకి చూశాడు శేఖరం.
ఎప్పుడు లేచిందో, లాప్‌టాప్ ముందు కూర్చుని వర్క్ ఫ్రం హోంలో భాగంగా పనిచేసుకుంటున్న కూతుర్ని చూసి పెదవి విరిచాడు శేఖరం. నిద్రచాలని ఆమె కళ్లలో ఎరుపు దూరానికి కూడా కనిపిస్తున్నది.
తనకీ కాఫీ తాగాలనిపించింది కాబోలు. హఠాత్తుగా లేచి బ్రష్ పట్టుకుని సింక్ వైపు అడుగులు వేసింది.
‘‘ఏమ్మా…! ఉదయాన్నే లాప్‌టాప్ ముందు కూర్చున్నావ్!’’ అడిగాడు శేఖరం.
‘‘అవును డాడీ….. రాత్రి ఆయన వచ్చి వెళ్లాడు కదా! వేస్ట్ అయిన రెండు గంటల పని ఇప్పుడు పూర్తి చేసుకున్నాను’’ అవలింతను ఆపుకుంటూ వెళ్లింది అమ్మాయి.
అవాక్కయ్యాడు శేఖరం. ‘భార్యాభర్తలు కలసి ఉన్న రెండుగంటలూ వేస్టా!’ స్వగతంలో అనుకోవాల్సిన మాటలు గొణుక్కున్నట్లు అనేశాడు.
‘‘ఇష్!’’ అంటూ తన నోటిమీద వేలేసుకున్నది కుసుమ.
‘‘నువ్వు ఏమైనా అనుగాని, మనసులో మాట చెబుతున్నా కుసుమా… ఈ కాలం పిల్లలకి సరసం లేదు, శృంగారం లేదు, మాటల్లేవు, పాటల్లేవు, పలవరింతలు, పులకరింతలు, పలకరింపులూ లేవు. లేపు. టాపులు, డెస్కు టాపులు, స్మార్ట్‌ఫోన్లు, వర్క్ ఫ్రమ్ హోములు, ఇంక్రిమెంట్లు, బెటర్మెంట్లు. ఏ వయసుకా ముచ్చట అన్నది మర్చిపోతున్నారు. యాంత్రిక జీవితాలయిపోయినై పాపం’’
‘‘రోజులట్లా ఉన్నై.’’ అన్నది కుసుమ.
వచ్చేవారం కథ..
ఇంద్రచాపం
– ఎమ్.విజయ శ్రీముఖి