‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన
సుకవీంద్ర బృంద రక్షకుడెవ్వడనిన వీ
డను నాలుకకు దొడవైన వాడు
చిత్త నిత్య స్థితి శివుడెవ్వడనిన వీ
డను శబ్దమునకర్థమైన వాడు
దశ దిశా విశ్రాంత యశుడెవ్వడనిన వీ
డని జెప్పుటకు బాత్రమైనవాడు
సకల విద్యా కళాచరణుడెవ్వడనిన వీ
డని చూపుటకు గుఱియైన వాడు
మనుమసిద్ధి మహేశ సమస్త రాజ్య
భార దౌరేయడభిరూప భావభావుడు
కొట్టారువు కొమ్మనామాత్యు కూర్మిసుతుడు
దీన జనతా నిధానంబు తిక్క శౌరి!
విక్రమసింహపురం, రాజ పేరోలగం
పొందికైన అందమైన ఆర్భాటాలేవీ లేని చక్కటి సమావేశ మందిరం.. మనుమ వంశీయులైన మహారాజుల ఘనమైన వారసుడు మనుమసిద్ధి భూపాలుడు సింహాసనాన్ని అధిష్టించి ఉన్నాడు. మందిరం వివిధ కార్యార్ధులై వచ్చినవాళ్లతో కిటకిటలాడుతోంది.
మనుమసిద్ధి కుమారుడు, యువరాజు తిక్క కుమారుడు చురుకైనవాడు. తండ్రి మనుమసిద్ధి మహారాజు మంత్రులను సైన్యాధ్యక్షులను దగ్గరగా కూర్చోపెట్టుకుని ఏదో దీర్ఘంగా చర్చిస్తుండగా యువరాజు దైనందిన పాలనా వ్యవహారాలను ఇష్టంతో నిష్టతో తండ్రి తరఫున.. నియోగుల సహాయంతో నిర్వహిస్తున్నాడు.
అప్పటికి రెండవ జాము గడచింది.
మనుమసిద్ధి, మంత్రులతో పాటు యువరాజు తిక్క కుమారుడు కూడా మాటిమాటికి దూరంగా మహాద్వారం వంక చూస్తున్నారు. కాసేపటికి వారందరి నిరీక్షణ ఫలించింది. ఎదురుచూస్తున్న ఆ మహాపురుషుడు ద్వారం వద్ద ప్రత్యక్షమయ్యాడు.
కొట్టారువు తిక్కనామాత్యుడు!!
‘దైవం మానుష రూపేణా’ అన్నట్లుంటాడు తిక్కన. శ్రీకాళహస్తిలో కొలువైన శ్రీకాళహస్తీశ్వరుని అసలు నామం తిరుకాళత్తిదేవుడు. ఆ స్వామిపేరు పిల్లలకు పెట్టుకోవడం ఆ రాజ్యాలలో సర్వసాధారణం. దానిని సాధారణంగా తిక్క, తిక్కన, తిక్కయ, తిక్కప.. అంటూ పిలవడం, పలకడం విక్రమసింహపురివాసులకు అత్యంత ఇష్టం.
వెలనాడు రాజ్యవాసులు కొట్టారువు భాస్కరమంత్రి మనుమడు, కొమ్మనామాత్యుని కుమారుడు. ఆయన బలం సాహిత్యం. మహోన్నత పండితమూర్తి ఆయన. అదే సమయంలో ఆయన మహాయుద్ధ తంత్రజ్ఞుడు. నిజమైన మంత్రి పుంగవుడు. ఈ రాచరిక పాలన విశారదత్వం ఆయనకు తాతతండ్రుల నుండి సంక్రమించింది. కొన్ని తరాలుగా ఆయన తాతముత్తాతలు రాజ్యోద్యోగులు. గొప్ప గొప్ప పదవులను నిర్వహించిన వారు. వాటి ద్వారా మహారాజుల నుండి గొప్ప గౌరవ పురస్కారాలు పొందినవారు.
తిక్కన, మనుమసిద్ధి బాల్యస్నేహితులు. కలసి చదివారు. కలసి స్నేహపరిమళాలను ఆఘ్రాణిస్తూ ఎదిగారు. ఆయన రాజయ్యాడు. ఈయన పండిత ప్రకాండుడయ్యాడు. మామా.. అంటే అల్లుడూ అని కొంటెగా మొదలైన సరదా సరస సంభాషణలను నిజం చేస్తూ, అల్లుడూ నేనో కావ్యం రాస్తున్ననోయ్ అంటే అది నాకు ఇవ్వవా మామా.. అంటే నిజంగానే దానిని మిత్రునికి అంకితం చేసి మనుమసిద్ధి నామాన్ని అజరామరం చేశాడు మిత్ర కవిపండితుడు తిక్కనార్యుడు.
ఆయనను విక్రమసింహపురి రాజ్యానికి మహామంత్రి అంటారు తెలియనివారు, దూర రాజ్యాలవారు. పాలకుడైన మహారాజుకు సర్వం తానైనవాడు తిక్కన. అందుకే మహారాజుకే కాదు రాజ్యానికి, ప్రజలకు కూడా ఆయనే సర్వం. రాజ్యానికి మామ.. స్నేహితుడు.. మిత్రుడు.. కవి పండితుడు. విక్రమసింహపురానికి ఏ కష్టం వచ్చినా రాజుతో పాటుగా స్పందించి మార్గం వెదుక్కుంటూ వెళ్లి సామదాన భేదదండో పాయాలతో విజయవంతంగా పరిష్కరించి మిత్రుడు మనుమసిద్ధినే కాదు విక్రమ సింహపురి రాజ్యాన్ని కూడా కాపాడుతూ వస్తున్నాడు తిక్కనార్యుడు.
ఆయన దగ్గరకు వస్తున్నకొద్దీ మందిరంలోని సమస్త జనులు పెద్దలూ పిన్నలు కూడా లేచి నిలబడి వినమ్రంగా వంగి నమస్కరిస్తున్నారు. ఆయనను అర్ధనిమీలిత నేత్రాలతో నడిచే దైవాన్ని చూస్తున్నట్లు చూస్తున్నా రు. యువరాజు తిక్క పరుగున వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించి ఆయన ఆశీర్వదించే లోపే వెనక్కి వెళ్లి పోయాడు. అతని చురుకును చూసి మధురంగా నవ్వుకుంటూ మనుమసిద్ధి దగ్గరగా వెళ్లాడు తిక్కన.
అందరూ లేచి నిలబడగా.. రాచరిక హోదాను, మిత్రత్వాన్ని కాపాడుతున్నట్లు సింహాసనం నుండి లేవకుండా మధురంగా నవ్వుతూ ఆప్యాయతతో చూస్తున్నవాడు మనుమసిద్ధి మహారాజు మాత్రమే.
దగ్గరకు వచ్చాక ప్రక్కనున్న సమున్నతాసనం చూపి, ‘‘ఆసనం అలంకరించు మామా..’’ అన్నాడు.
అక్కడ ఉన్న తోటి మంత్రులను, నియోగులను ‘‘విష్ణు రూపాయ నమశ్శివాయ..’’ అంటూ పలుకరించి నవ్వుతూ ఆసీనుడయ్యాడు తిక్కన.
‘‘ఆలస్యానికి కారణం!’’ అన్నాడు మనుమసిద్ధి. తిక్కన ఆరోగ్యం గురించిన కుశల ప్రశ్న అది.
‘‘ఓ సమాచారం తేవాల్సిన ఆశ్వికుని కోసం ఎదురుచూపులు మహారాజా! వస్తే రాజసభకు పంపమని అనుచరులకు చెప్పి వస్తున్నాను. ఆ.. ఏవిటి చర్చ?’’ అన్నాడు వర్తమానంలోకి వస్తూ.
మనుమసిద్ధి తాను చెప్పకుండా ప్రక్కనే ఉన్న అంతరంగిక వ్యవహారాల నియోగ మంత్రి కేసి చూశాడు. ఆయన గొంతు సవరించుకుని చెప్పడం ప్రారంభించాడు.
‘‘మనకు పాండ్య రాజుల నుండి, చోళ రాజుల నుండి వస్తున్న వత్తిడి తమకు తెలియంది కాదు తిక్కనార్యా! నిన్న కూడా రెండు రాజ్యాల సంధి విగ్రహిలు వచ్చారు. వాళ్ల నుండి బేరాలు రాయ బేరాలూ.. మీకు తెలియంది కాదు కదా..’’ నవ్వాడు అమాత్యుడు. అందరూ ఆయన నవ్వులో పాలుపంచు కున్నారు.
ఒకప్పుడు వేంగీ రాజ్యానికి కప్పాలు కడుతూ రాజరాజనరేంద్రునికి సామంతరాజ్యంగా ఉన్న విక్రమసింహపురి ఆయన తరం ముగిశాక సామంత హోదాను వదిలించుకుని కప్పాలు కట్టడం మానేసింది.
ప్రస్తుతం చోళ రాజ్య వంశం పూర్తిగా నిర్వీర్య మయ్యింది. పాండ్యులు చోళులను తీవ్రంగా అణచివేసి తమిళ రాజ్య ప్రాంతాలలో ప్రచండశక్తిగా ఎదుగుతున్నారు.
పాండ్యులు కూడా నెల్లూరుకు స్నేహ హస్తం ఆహ్వానిస్తున్నారు.
దక్షిణావర్తంలోనే కీలకస్థానంలో ఉంది విక్రమ సింహపురి రాజ్యం. ఇటు దిగువ చోళ, పాండ్య, పల్లవ రాజ్యాలు.. పైన అతి సస్యశ్యామలమై ధనవంతమైన తెలుగు రాజ్యలలోకి వెళ్లాలంటే నెల్లూరును ముందు దాటాలి. దాటాలి అంటే జయించాలి. అది అత్యంత క్లిష్టమైన అంశం. అందుకు అనేకానేక కారణాలు. అన్నిటిని మించి నెల్లూరుకు పెట్టనికోట తిక్కనామాత్యుని చాణక్యం.
నిజానికి తెలుగునాట చిన్నరాజ్యాలలో అత్యంత ధనికరాజ్యం విక్రమ సింహపురి. సముద్రతీర రాజ్యాలు, నదీ తీర రాజ్యాల వారు ఎప్పుడూ భాగ్య వంతులే. అటు నది, ఇటు సముద్రమూ కలిగిన రాజ్యాలైతే చెప్పేదేముంది! మిత్రులకు, శత్రువులకు కూడా అసూయ కలిగించే ధన ధాన్యరాశులలో తుల తూగుతుంటాయి.
తమిళులు అనాది కాలం నుండి నెల్లూరును తమ ఉత్తరాది రాజ్యంగా భావిస్తారు, చెప్పుకుంటారు. వేంగి వరకు తమరాజ్యంగా చెప్పుకునేవారు. ఇప్పుడు భాషారాజ్యాల భావనలు స్పష్టమయ్యాక వేంగి వరకు తమిళ రాజ్య భాగంగా ప్రకటిస్తున్నారు.
‘మీరు తెలుగువారా.. తమిళులా’ అని నన్నయ ప్రశ్నించినప్పుడు రాజరాజనరేంద్రుడు తాను తమిళుడనని స్పష్టం చేశాడని.. అందువల్లనే నన్నయ భారతాంధ్రీకరణ ఆపివేశాడని తిక్కన చెబుతుంటాడు. వేంగి రాజ్య మహా ప్రధాని వజ్జియ ప్రెగ్గడ తిక్కనా మాత్యునికి దగ్గరి బంధువు.
‘‘సరే సరే.. మామా.. మీ అభిప్రాయం ఏవిటో సెలవివ్వండి..’’ అన్నాడు మనుమసిద్ధి తిక్కన నుద్దేశించి.
‘‘మన మిత్రులంతా ఏమంటున్నారు?’’ అన్నాడు తిక్కన.
‘‘ఏముంది.. మన మంత్రిమండలిలో సగంమంది చోళ సామంతులుగా ఉందామని.. మిగిలిన సగంమంది భవిష్యత్తు పాండ్యులది కాబట్టి పాండ్యుల స్నేహహస్తం అందుకుందామని అంటున్నారు..’’ అన్నాడు. తిక్కన అందరిని పరికించి చూశాడు. రెండు వర్గాలు ఆయన అభిప్రాయం కోసం రెప్పవేయకుండా చూస్తున్నాయి.
అప్పుడే మహాద్వారం నుండి భటుడు తిక్క కుమారుడి దగ్గరకు వచ్చి, తిక్కనార్యుని కోసం ఆయన అనుచరుడు వచ్చాడని విన్నవించగా తిక్క వెళ్లి తిక్కనకు చెప్పాడు.
చటుక్కున కదిలిన తిక్కన, ‘‘అతన్ని లోపలికి పంపండి… వెంటనే..’’ అన్నాడు.
ఆయన మాటల్లోనూ, ముఖంలోనూ కదలాడుతున్న ఉత్సుకత అందరికి తెలుస్తోంది.
అనుచరుడు తిక్కన దగ్గరకు వచ్చి చెప్పాడు.
‘‘కాకతీయ యువరాజు గణపతిదేవుల వారిని దేవగిరి రాజ్యంలో కారాగారంలో ఉంచిన మాట వాస్తవమే మహామాత్యా.. ప్రస్తుతం ఆయనను సాధారణ కారాగారం నుండి రాజప్రాసాదంలోని ఓ గదిలో ప్రత్యేక బందీగా ఉంచారు. కాకతీయ సైన్యం యుద్ధభూమిలోని వారి స్కంధావారంలోనే ఉంది. ఏ క్షణమైనా యువరాజు కోసం సైన్యం దేవగిరిపై విరుచుకుపడే అవకాశం ఉంది.’’
అప్పటివరకూ కాస్త స్తబ్దుగా కనిపించిన తిక్కనార్యుడు, శబ్దమేదో విన్న సింహంలా దిగ్గున లేచాడు ఆసనం మీద నుంచి. వ్రేలికి ఉన్న ఉంగరం తీసి ఆ వార్తాహరునికి అందించాడు.
‘‘గొప్ప శుభవార్త చెప్పావ్.. చాలు! దేవగిరిలో ఏం జరుగుతున్నదో ఎప్పటికప్పుడు నాకు తెలియాలి..’’
‘‘అలాగే మహామాత్యా..’’ అతడు ఉంగరాన్ని కళ్లకద్దుకుని గాలిలో తేలుతూ బయటికి పరుగెత్తాడు.
తిక్కనవైపు అందరూ నోళ్లు వెళ్లబెట్టి చూస్తున్నారు.
అప్పుడన్నాడాయన.
‘‘హమ్మయ్య. ఇక దిగులు లేదు. త్వరలో తెలుగు భాషా సామ్రాజ్యం ఏర్పడబోతోంది. మనం చోళునికో, పాండ్యునికో సామంతులుగా ఉండనక్కరలేదు. వాళ్లకు దోచిపెట్టిందీ వాళ్లు అధికారికంగా దోచు కున్నదీ చాలు. తెలుగు సామ్రాజ్యంలో భాగమౌదాం. తెలుగు సామ్రాజ్యాధినేతకు సామంతులుగా ఉందాం.’’
‘అవతల చోళులా పాండ్యులా అనే తలలు బద్దలుకొట్టుకుంటుంటే మధ్యలో ఈ తెలుగు సామ్రాజ్యం ఏమిటి! కాకతీయ రాజ్యాన్ని దేవగిరి జైత్రపాలుడు జయించాడని.. యువరాజు గణపతి దేవుని బంధించి పట్టుకుపోయాడని వార్తలు విన్నాం కదా.. ఈయన గారు అనేదేవిటో అర్థంకావడం లేదు’ అని అందరూ గొణుక్కుంటున్నారు.
‘‘ఆ.. సిద్ధీ! తప్పక తెలుగు సామ్రాజ్యం ఏర్పడ బోతోంది. ఇప్పుడు నాకు నమ్మకం కుదిరింది. రాసి పెట్టుకోండి. మన తెలుగు సామ్రాజ్యాధినేత కాకతీయ గణపతిదేవుడు. తమిళుడో, కన్నడిగుడో, రాష్ట్ర కూటుడో, మరాఠీయుడో కాదు. స్వచ్ఛమైన పదహార ణాల తెలుగువాడు. సామ్రాజ్యాన్ని స్థాపించగల దమ్మున్న తెలుగువాడు.’’
ఈసారి మనుమసిద్ధి కూడా నోరు తెరిచాడు.
‘‘ఏం అర్థంకాలేదా! ఇప్పుడు చెప్పనా.. తర్వాత చెప్పనా??’’
ఏమనాలో తెలియని అయోమయంలో విక్రమసింహపురి మంత్రాంగవేత్తలు ఉండిపోయారు. దాచుకోలేని ఉత్సాహంతో తన ఊహల్లోని భవిష్యత్ తెలుగు సామ్రాజ్యాన్ని అర్ధనిమీలిత నేత్రాలలో దర్శిస్తూ చెప్పసాగాడు తెలుగు సామ్రాజ్య ద్రష్ట తిక్కనా మాత్యుడు.
ఆయన ఊహల్లోని సామ్రాజ్యస్రష్ట శ్రీశ్రీశ్రీ కాకతీయ గణపతిదేవ చక్రవర్తి!
మొట్టమొదటి తెలుగు సామ్రాజ్యాధినేత!!
* * *
దేవగిరి రాజ ప్రాసాదంలోని కారాగారం.
అనుమకొండలో, కాకతీయ స్కంధావారంలో జరుగుతున్న సంఘటనలు గణపతికేమీ తెలియదు. కాని ఇక్కడ తనను సాధారణ చెరసాల నుండి ఈ రాజప్రాసాద చెరసాలకు మార్చడం వంటి పరిణా మాలపై వాటి ప్రభావం ఉన్నదని భావిస్తున్న గణపతి మౌనంగా కారాగారవాసం అనుభవిస్తున్నాడు. అతనికి కనిపించేది చెరసాల ముందుగా అటూ ఇటూ తిరుగాడే కాపలా భటులు, ఊడ్చి కడిగి శుభ్రం చేసే పనివారు, రాత్రివేళ దీపాలకు నూనె పోస్తూ తెల్లవార్లూ అటూ ఇటూ తిరుగాడే దీప రక్షకులు. అందరిని చూసి చూసి అందులో ఒకరిద్దరిని గణపతి గుర్తుపడతాడు కూడా. అందులో ఒకడు అప్పుడప్పుడు గణపతిని చూస్తూ కాస్త నవ్వు ముఖం పెడతాడని గణపతి ఓ వారం తరువాత గుర్తించాడు.
దినమూ కాలకృత్యాలు తీర్చుకుని లోపలికి వచ్చే వేళ అతడు దీపాలు ఆర్పేసి వెళుతుంటాడు. అప్పుడు లిప్త కాలంలో వినయంగా వంగి నమస్కరించి వడివడిగా వెళతాడు. అతడు చూపిస్తున్న వినయం గణపతిలో సందేహాలను రేపింది. వీడు గూఢచారి కాదు కదా, అనుకున్నాడు.
ఓరోజు అదే అడిగాడు.‘‘ నువ్వు మరీ నా దృష్టిలో పడటానికి యత్నిస్తున్నావ్. కొంపదీసి గూఢచారివి కాదు కదా?’’ అన్నాడు గుసగుసగా.
వాడు అంతే వినయంగా, ‘‘అవును యువరాజా.. నేను గూఢచారినే. నాగతిస్య నా పేరు..’’ అంటూ వెళ్ళిపోయాడు. నోరు తెరిచాడు గణపతి.
ఆ రోజు..
ఉదయం లేచేటప్పటికి పొద్దెక్కింది. ఎప్పటిలా ప్రక్కకు ఒత్తిగిల్లి గుమ్మం వైపు చూశాడు. చిత్రంగా చెరసాల గది తలుపులు పూర్తిగా తీసి ఉన్నాయి. అక్కడ కాపలా భటులు ఎవ్వరూ కనిపించలేదు.
బయటకు వచ్చాడు గణపతి.
అడ్డుకున్న వాళ్లెవ్వరూ లేరు. బహిర్భూమికి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుని మళ్లీ తన గదికి తిరిగి వచ్చాడు. అప్పుడొచ్చాడో భటుడు. ఆకుల దొన్నె కాకుండా వెండి పళ్లెరంలో తినుబండారాలు తెచ్చాడు.
‘‘నేను బందీని కదా! మీ రాజ్యంలో బందీలకు ఇంత గౌరవమర్యాదలా.. ఏమిటీ వింత?’’ అన్నాడు గణపతి.
భటుడు సమాధానం చెప్పకుండా ముసిముసిగా నవ్వాడు.
‘‘జట్టు చూడు! పిట్టలు గూడు కట్టుకుంటాయి. అంతలా పెరిగింది. ఈ గడ్డం చూడు.. పిచ్చుక గూడు లాగే ఉంది. కాస్త క్షురకుడిని ఏర్పాటు చేసిపెట్టు మిత్రమా పుణ్యం ఉంటుంది.’’ అన్నాడు.
వాడు వేగంగా వెళ్లి క్షురకుడితో వచ్చాడు. అతను క్షురకర్మ నిర్వహించి శిరోభారం తగ్గించిపోయాడు.
బయట ఉన్న బావి వద్ద స్నానించాక గణపతి ప్రశాంత శరీరుడయ్యాడు.
మరి కొంతసేపటికి మరొక భటుడు వచ్చాడు. కొత్త వస్త్రాల దొంతర.. చేతిలో.
గణపతిదేవునికి అర్ధమయ్యింది. అయినా అడి గాడు కొంటెగా, ‘‘ఎవరికీ అలంకరణ మహాభటా?’’
వాడు సిగ్గుపడి, ‘‘తమరికే..’’ అన్నాడు.
అందుకుంటూ ‘‘ధరించమంటావా..’’ అన్నాడు. అప్పటికి వాడు కొంచం తెప్పరిల్లాడు.
‘‘ధరించి తమరు వ్యాహ్యాళికో వ్యాయామానికో.. ఇష్టపడితే.. తీసుకువెళ్లమని మహాసేనానుల ఆజ్ఞ.’’
నిజంగానే ఆశ్చర్యపోయాడు. అంతలోనే నవ్వు కున్నాడు. ‘ఇక్కడంతా ఆశ్చర్యమే కదా..’ అనుకుంటూ క్రొత్త పంచె, అంగీ మార్చుకుని, ఉష్ణీషం (తలపాగ గుడ్డ) చుట్టుకోకుండా పైన వల్లెవాటుగా వేసుకుని, ‘‘సేనానుల ఆజ్ఞను శిరసావహిద్దాం..’’ అంటూ ఆ భటుడికి గౌరవసూచికంగా వంగి చేయి చూపుతూ దారి చూపాడు. వాడు సిగ్గుతో అటూ ఇటూ చూసి ఆనందంగా ముందుకు సాగాడు. వెనక గణపతి.
భటునిలోని ఉత్సాహం వెనుకనున్న గణపతికి తెలుస్తోంది.
‘‘అవునూ భటదేవా.. మనం ఈ మార్గం ఎక్కడికి పోతుంది?’’
భటుడు వెనుదిరిగి మరింత స్నేహ ప్రకటనతో, ‘‘వ్యాయామ స్థలికి యువరాజా! కేవలం మా యువ రాకుమారుల కోసమే నిర్మించిన వ్యాయామశాల..’’ అన్నాడు.
గతం కంటే వినయం తగ్గి స్నేహభావన పెరిగింది.
‘‘మీరు నాబోటి బందీలనూ యువరాజా అని సంబోధించడం.. మాకెక్కువ మక్కువ పెంచు తున్నది..’’
‘‘సంతోషం యువరాజా! మా మహానాయకులు తమ సంభాషణల్లో మిమ్ములను యువరాజులుగారు అనే సంబోధించుచున్నారు.’’ అన్నాడు మరింత చనువుగా.
‘‘అటులనా.. ప్చ్..ఏవిటో మీరు మీ మర్యాదలు.. అయినా మరొక్క సందేహం.. క్రొత్త వస్త్రములు తొడిగించి మీరు వ్యాయామానికి తీసుకువెళ్లడం మీ రాచ మర్యాదయా?’’
భటుడు నాలిక కరచుకున్నాడు. ‘‘క్షమించండి యువరాజా. అలా అయితే వ్యాహ్యాళికి వెళదామా?!’’
‘‘అబ్బెబ్బే.. ఏదో అనాలని అన్నాను. మాకు వ్యాహ్యాళి అయినా వ్యాయామమయినా ఒక్కటే.’’
ఈసారి భటుడు తెల్లముఖం వేశాడు. రెండూ ఒక్కటే ఎలా అవుతుందో అర్ధం కాలేదు.
అప్పటికే ఇద్దరూ రాచనగరులోని వ్యాయామ శాలకు చేరుకున్నారు.
విశాలమయిన వ్యాయామశాల ప్రాంగణం. కొందరు వ్యాయామం.. కొందరు గుర్రపు స్వారీ.. కొందరు గజ యుద్ధ రీతుల అధ్యయనం చేస్తున్నారు. గణపతిదేవునిలో కూడా వ్యాయామ ఉత్సాహం పెచ్చరిల్లింది. ఒళ్లు విరుచుకున్నాడు. భటుడు కాస్త ఆవలకు వెళ్లాడు.
వ్యాయామం చేస్తున్నట్టే ఉన్నా, వారంతా గణపతిని చూస్తున్నారు.
అంతా యువకులే. భటుని మాట గుర్తొచ్చింది. అంతా రాచనగరు రాజకుటుంబాల యువకులే వ్యాయామం, యుద్ధవిద్యలు నేరుస్తున్నారు. దూరంగా చూశాడు గణపతి. అక్కడ కొందరు యువతులు కూడా ఉండటం అతని చూపును దాటిపోలేదు.
దాదాపు ఆరు మాసాలుగా చెరసాలలో ఉండటం వల్ల వ్యాయామమూ లేదు. యుద్ధ శిక్షణ లేదు. మళ్లీ ఇక్కడ ఇప్పుడు ఆ వాతావరణంలో కాస్త సేద దీరుతున్నాయి మనసు శరీరమూ. దగ్గరగా ఉన్న మందిర కుడ్యానికి జారగిలబడ్డాడు. ఒకరిద్దరు యాదవ యువవీరులు దగ్గరగా వచ్చారు. వారి చూపుల్లో, కదలికల్లో గణపతి పట్ల చిన్న చూపు.. హేళనతో కూడిన చిరునవ్వు. సింహాన్ని బంధించి తెచ్చిన వేటగాడి కొడుకుల్లా..
కదిలి వ్యాయామం చేస్తూ మల్లయుద్ధ పట్లు పడుతున్న ఇద్దరు యువకుల వద్దకు వేగంగా వెళ్లాడు గణపతి.
ఒకడి మొలకున్న అంగవస్త్రం కాస్త స్థానభ్రంశం చెందుతున్నట్లు కనిపిస్తోంది. చటుక్కున వంగి ఆ అంగవస్త్రం సరిచేశాడు. వాడు సిగ్గుతో ముడుచుకుపోయాడు.
‘‘క్షమించండి యువరాజా! అవతల యువతులు ఉన్నారని కాస్త చనువు తీసుకున్నాను..’’ అన్నాడు గణపతి.
అప్పటికే గణపతి వైపుగా యువకులంతా దూసుకు వచ్చారు. కాని జరిగింది చూసి ఆగిపోయారు. దాదాపు పాతిక అడుగుల దూరం నుండి అతని అంగవస్త్రాన్ని చూసిన గణపతి నిశిత దృష్టిని వాళ్లు గ్రహించారు. అప్పటికే దగ్గరగా వచ్చిన అశ్వికులను చూశాడు. ఓ యువరాజు స్వారీచేస్తున్న అశ్వాన్ని చూస్తూ ‘‘ఆగు ఆగు! యువరాజా. ఇది.. ఈ అశ్వం..’’ అన్నాడు గణపతి. ఆ యువరాజు కోర మీసం తిప్పాడు.
‘‘మాదే. మేము రోజూ అశ్వయుద్దాన్ని అభ్యాసం చేసేది దీని పైననే.’’ అన్నాడు. మళ్లీ కోరమీసం తిప్పాడు.
‘‘దిగండి! దీని స్థానం యుద్దభూమి కాదు..’’
‘‘మరి..?’’
‘‘దగ్గరలో ఏదైనా దిగుడు బావి ఉంటే అక్కడకు పంపండి.’’
‘‘ఎందుకు?’’
‘‘ఈ గుర్రం బావిలో నీళ్లు తోడటానికి బాగా ఉపయోగపడుతుంది. దీనిని అధిరోహించి యుద్ధభూమికి వెళ్లిన వాడిని శత్రువు ముందు పడేసి పోతుంది.’’
ఆ యువరాజు మ్రాన్పడిపోయాడు. ఈ సంభాషణ వింటున్న యువ కుమారులంతా తమ తమ అశ్వాలతో అక్కడకు వచ్చారు. దగ్గరకొచ్చిన ఒక్కొక్క గుర్రాన్ని వివరంగా చూస్తున్నాడు గణపతి. చూస్తున్న కొద్దీ అతని ముఖం రంగులు మారుతోంది.
‘‘చ ఛ.. అబ్బెబ్బే.. ఇదేమి గుర్రం.. ఇది కూడా నాసిరకపు గుర్రమే. ఇది జబ్బుతో బాధపడుతోంది. దాని ముఖం చూశారా.. దీని సుడి చండాలం. దాని నడక అసహ్యంగా ఉంది. అది కూడా అధమ జాతి గుర్రం. ఇవన్నీ యుద్ధాశ్వాలు కాదు. పెంటలు ఎత్తే బళ్లను లాగడానికి సరిపోతాయి..’’
ముఖం అత్యంత రోతగా పెట్టుకుని ఒక్కొక్క గుర్రాన్ని పరిశీలిస్తూ గణపతి చెబుతుంటే ఆ యువ యోధులంతా మాటలు రాక రెప్పవేయకుండా దిగ్బ్రమతో చూస్తున్నారు.
తమ గుర్రాలు గొప్పవేనని గణపతికి చెప్పాలని అనుకున్నా, వాళ్లకు గుర్రాల లక్షణాలు, సంబంధిత అంశాలు అస్సలు తెలియవు. ఉన్న గుర్రాలపైకెక్కి స్వారీ చేస్తూ అభ్యాసం చేయడం తప్ప అసలు గుర్రాల గురించిన సమాచారం వారి వద్ద లేదు. ఇప్పుడు గణపతిదేవుడి మాటలు విన్న తర్వాత గణపతినే కాదు తమ తమ గుర్రాల వైపు కూడా కాస్త పరిశీలనగా చూస్తున్నారు. ఇవన్నీ తెలియాలి అనే జ్ఞానం కూడా వారికి లేదు. ఎవ్వరూ చెప్పగా వినలేదు. రకరకాల ముఖ కవళికలతో గణపతిదేవుడు ఒక్కొక్క గుర్రాన్ని పైనా క్రిందా, ముఖం, కాలిగిట్టలు, శరీరపు రంగు, దాని పైనున్న వెంట్రుకల మృదుత్వం.. ఇలా అశ్వశాస్త్రం తెలిసినవాడిలా పరీక్షిస్తున్నాడు. ప్రతి గుర్రపు జాతి, రంగు, సుడులు, నడక చూస్తూ.. వీపుపై చరుస్తూ పరిశీలించడం వారినందరినీ సంభ్రమంలో ముంచేసింది.
‘‘అసలు మీరు సేవణ రాజ్యపు యువయోధులేనా.. రేపు దేవగిరి తరఫున యుద్ధం చేయవలసినవారేనా.. అలాంటి మీరు అధిరోహించేది ఇలాంటి గుర్రాలనా?! ఎవరు.. ఎక్కడ.. మీ అశ్వశిక్షకుడు.. పిలిపించండి..’’
(సశేషం)