కొత్త ధారావాహిక నవల

– మత్తి భానుమూర్తి

‘‘‌ప్చ్.. ‌పన్నాగమా? వాడి పిండాకూడా! అవతల కాకతీయ కాకులు ఇంకా స్కంధావారంలోనే ఉన్నాయి. ఏ క్షణమైనా మనపై దాడికి సిద్ధమౌతున్నట్లు వేగుల వార్త. యుద్ధానికి సన్నద్ధమవ్వాలి మహాప్రభో అంటే మహా ప్రధానిగారు చెవిన పెట్టరు. అసలు మహారాజులుంగారిని అనాలి. నెత్తిన బెట్టుకున్నారు. ప్చ్.. ‌వాడు చెప్పిందే వేదం.’’

గిర్రున వెనుదిరిగి బయటకు వెళ్లిపోయాడు.

వెచ్చని ఆనందాలు గణపతిదేవుని శరీరమంతా వ్యాపించాయి. కాకతీయ సైనికులు ఇంకా స్కంధావారంలోనే ఉన్నారు. అంటే యుద్ధ ప్రయత్నాల నుండి వెనుదిరగలేదు. ఓటమిని ఒప్పుకోలేదు. ఏ క్షణమైనా మళ్లీ యుద్ధం ఆరంభం కావచ్చు. అది తన కోసమే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తనను ఎందుకు చంపలేదో ఇప్పుడు అర్ధమయింది. అక్కడ స్కంధావారంలో కాకతీయ సైన్యం ఉన్నంత వరకూ ఇక్కడ తనను చంపలేరు. చంపితే మరుక్షణం దేవగిరి భస్మీపటలం అవుతుంది. ఒకరకంగా వీళ్ల పీకకు కాకతీయ ఖడ్గం..  పదునైన ఖడ్గం ఆన్చి ఉంది. గట్టిగా ఊపిరి పీల్చినా తెగుతుంది పీక!

నాన్నగారు వీరమరణం పొంది ఉండవచ్చు. కాని రేచర్ల రుద్రసేనాని పెద్దనాన్న నిద్రపోడు. అమ్మో అమ్మో.. ఒక్క చేత్తో వందమంది శత్రు సైనికులను ఆప గల మహాయోధ. అలాగే మహాప్రధాని వెల్లంకి గంగాధర నాన్నగారు విశ్రమించడు. ప్రతీకారంతో ఇద్దరూ రగిలిపోతుంటారు. పెదనాన్నగారితో అనేక యుద్ధాల్లో పాల్గొని ఆరితేరిన మహాయోధులు ఇద్దరూ. అదే సమయంలో గంగాధర నాన్నగారు యుద్ధతంత్ర మాంత్రికుడు కూడా. ఇద్దరూ ఏ క్షణమైనా దేవగిరిని సర్వనాశనం చేయగల యోధానుయోధులు.. రణరంగ విశారదులు.

నాన్న మహాదేవుడు, గంగాధరుడు, రేచర్ల రుద్రయ.. ముగ్గురు ఒకే ప్రాణంగా పెరిగిన స్నేహితులు.

‘‘నీకు ముగ్గురు నాన్నలు’’ అనేవారు పెదనాన్న.

నిజమే.. ముగ్గురిని యుద్ధశక్తి, రాజనీతి ప్రవీణులుగా కత్తులు సానబెట్టినట్లు సానబెట్టారు పెదనాన్న. నాన్న మహాదేవుని వీరమరణం వీరిద్దరికీ జీవితంలో మరచిపోలేని అవమానం. నాన్నతో ప్రాయోపవేశానికి కూడా వాళ్లిద్దరూ సిద్దమే. కాని తన కోసం.. కాకతీయ సింహాసనం కోసం.. కాకతీయ వంశం కోసం బ్రతికి ఉంటారు.

ఒకటి తథ్యం. వారు అక్కడ తిండి తినరు.. నీళ్లు తాగరు. నిద్రపోరు!! విస్ఫులింగాలై మండుతున్న వారి కన్నులు గణపతి ఊహించుకుంటున్నాడు.

కానీ, అనుమకొండలోనే కాదు కాకతీయ స్కంధావారంలోను ఏం జరుగుతున్నదో గణపతికి తెలియదు.

చెప్పేవారు ఎవ్వరూ లేరు. కాని రకరకాల ఆలోచనలతో కాలం గడుస్తున్నది. తనకు లభిస్తున్న గౌరవమో.. అగౌరవమో.. ఏదైనా కాకతీయులు యుద్ధంలో ఓడినా స్కంధావారం ఎందుకు తొలగించలేదో, అనుమకొండ వెళ్లలేదో! అనేక ప్రశ్నలు. తిరిగి దేవగిరిపై దాడి చేస్తారని వినవస్తున్న వార్తలకు ఇది వీళ్ల ప్రతిస్పందన మాత్రమేనని గణపతి ఊహించుకుంటున్నాడు. అవి కొంత ఉత్సాహాన్ని, ఉద్రేకాన్ని ఇస్తున్నాయి. కానీ అసలు అక్కడ ఏమి జరుగుతున్నదోనన్న ఆలోచనల తాకిడికి• సాంత్వన కూరుస్తూ ఓ మైకం అతన్ని ఆవరించబోతోంది.. త్వరలో! అదే ప్రేమ మైకం!!

                                                                                            *         *        *

కాకతీయ స్కంధావారం- ఓ మహావీరుడు ఓ  సాధారణ సైనికుడి చేతిలో ఓడిపోతే దిమ్మెరబోయి.. అవమానభారంతో కృంగిపోయి.. చావలేక చావురాక.. బ్రతకలేక.. శేషజీవితాన్ని ఎలా గడపాలో తెలియక.. కుమిలి కుమిలిపోతూ పిచ్చేక్కినట్లు ఉంటాడో, అలా ఉంది.

అందులో మధ్యగా కాస్త ఎత్తున సర్వ సైన్యా ధ్యక్షుడు రేచర్ల రుద్రయ సేనాని. సర్వసైన్యాధ్యక్షుడు బయటకు వచ్చి సైనికులకు, సేనానులకు, సేనాధి పతులకు, దళపతులకు ఏదైనా సందేశం ఇవ్వడానికి తగినట్లుగా స్కంధావారం మధ్యగా కాస్త ఎత్తుపై ఏర్పాటు చేస్తారు.

అవమానంతో రగిలిపోతున్న మృగరాజులా అటూ ఇటూ తిరుగుతున్నాడు రుద్రసేనాని. కళ్లు ఎరెర్రగా మండుతున్నాయి. మాటిమాటికి దవడ బిగుసుకుంటోంది. కళ్లముందు, కంటిలోనూ, భోజన పళ్లెరంలోనూ, నీటి పాత్రలోనూ.. ఎటు చూసినా, చూడకున్నా రేయింబవళ్లు అదే దృశ్యం.. ఒక్కటే దృశ్యం..

కాకతీయ మహారాజు మహాదేవులవారి నిర్జీవ శరీరం!!

పళ్లు పటపట కొరికాడు.. లక్షవసారి.

ఒక్క క్షణం, ఒక్క క్షణం.. కనీసం లిప్తకాలం దొరికినా సోదరుడిలా కలిసి పెరిగిన మహారాజును ప్రాణాలొడ్డి కాపాడుకునేవాడే.. ఎంత పని జరిగింది.. ఎంత అవమానం.. ఎంత దుర్భరం.. ఈ ఓటమి!!

యుద్ధక్షేత్రంలో నాలుగు నెలలనాడు జరిగిన సంఘటన కళ్ల ముందు కదలాడింది.

ఎవరో గావుకేక పెట్టారు. ‘‘మహారాజులు ఒరిగిపోయారు. అయ్యయ్యో.. కాకతీయకేతనం అవనతం అవుతోంది. మహారాజు.. మన మహారాజు మరణించినట్లున్నారు.. హమ్మో.. హమ్మో..’’

మతిపోయింది. చేతిలోని ఖడ్గం జారిపోయింది. పరుగుపరుగున కాకతీయ కేతనం క్రిందికి జారుతూ కనిపించినవైపుగా పరుగెత్తాడు. అప్పటికే చుట్టూ సేనానులు, దళపతులు, సైనికులు గుండెలు బాదుకుంటూ అటే పరుగులు పెడుతున్నారు.

నిజమే.. ఏది జరగకూడదో అదే జరిగింది. శవమై పడి ఉన్నాడు కాకతీయ మహారాజు మహాదేవుడు.

పరుగుపరుగున వచ్చి వాలాడు తను. యుద్ధ రంగంలో దూరంగా తనని  నిమగ్నుడిని చేసి ఇక్కడ మహాదేవుడ్ని నిర్జించారు. నిర్జీవుడైన మహారాజు, మిత్రుడు, సోదర సమానుడు అయిన మహాదేవుడ్ని చూసి బావురుమన్నాడు. మహారాజు శిరస్సును ఒడిలో జేర్చుకుని విలవిలలాడిపోయాడు.

‘‘రెండు ఘడియలు.. రెండే రెండు ఘడియలు కాపాడలేకపోయారా నీచులారా.. నేనే వచ్చి కాపాడు కునేవాడిని. మహారాజును పొట్టన పెట్టుకున్నాము కదరా! ఇప్పుడు అనుమకొండ ఎలా వెళ్లాలి! మహారాజు మృతదేహంతో వెళ్లి కాకతీయ ప్రజలకు ఏమి సమాధానం చెప్పాలి? పట్టపురాణి బయ్య మాంబాదేవి ముఖం ఎలా చూడాలి. ‘నువ్వుండగా నాభర్త నిర్జీవుడు అవడం ఏమిటి అన్నా..’ అని ప్రశ్నించే ఆమె చూపులకు ఎలా తట్టుకోవాలి?’’

కుమిలిపోయాడు ఈ అరివీర భయంకరుడు. మహాదేవుడి నిర్జీవ శరీరాన్ని చూస్తూ తల్లడిల్లి పోయాడు. శత్రువులను దూషించాడు. పరివేష్టించి ఉండాల్సిన ఎక్కటీల చంపలు వాయించాడు. కత్తి ఎత్తి నరకబోయాడు. చేతకాని కాకతీయ సేనానులపై, దళపతులపై, సైనికులపై అరచాడు. గావుకేకలు వేశాడు. గుక్క పట్టి ఏడ్చాడు.

యుద్ధభూమిలో తలో దిక్కున యుద్ధం చేస్తున్న మహామహా కాకతీయ వీరయోధులు పిల్లలమర్రి బేతిరెడ్డి, చెరుకు బొల్లయ, విరియాల సూరన, మల్యాల కాటయనాయడు, కామిరెడ్డి, విరియాల బేతరాజు, చౌండ.. మహారాజు ధ్వజకేతనం కూలడం చూసి పరుగుపరుగున అక్కడికి వచ్చారు.మహాసేనాని ఒడిలో రక్తసిక్త మహాదేవరాజు నిర్జీవ శరీరాన్ని చూసి దిగ్భ్రమతో కొన్ని లిప్తలు నిలబడిపోయారు. ఆపై ఆయన శరీరంపై పడి ఏడవసాగారు.

అప్పుడు గొణిగాడు దళపతి నాచన, ‘‘యువరాజు.. మన గణపతిదేవుడు..?’’

చివ్వున చూశాడు తను. ‘‘ఏడి.. యువరాజు ఎక్కడ?’’ కనుచూపులో ఎక్కడా కనిపించలేదు.

‘‘కనపడటం లేదు బహుశా శత్రువులు అపహరించుకు పోయారేమో సేనాని..’’

మరుక్షణం ఎక్కటి నాచన తల వొక్కవేటుతో తెగి ఆవలపడింది. తన కరవాల ప్రహారానికి మరో తల అందకుండా అందరూ నేలపై పడిపోయారు. ‘‘క్షమించండి మహాసేనాని.. క్షమించండి..’’

ఇప్పుడు అసలు సమస్య మహారాజు మరణించడం కాదు.

ఇప్పుడు కాకతీయ రాజ్యం ఏలిక లేని అనాథ రాజ్యం.

శత్రువులంతా తలో వైపు కమ్ముకుంటారు.

అటూ ఇటూ చూశాడు.

కాకతీయ మహారాజును చంపి యుద్ధంలో విజయం సాధించిన దేవగిరి మహారాజు జైత్రపాలుడు గాని, దేవగిరి సైన్యాధ్యక్షుడు జల్లన, ప్రధానమంత్రి బసవసురుడు.. ఏరి కనిపించరేం? మహాదేవుడి పార్ధివదేహాన్ని వదిలేసి వెళ్లి పోయారేం? మహాదేవుడి శిరస్సును ఖండించి కందుక క్రీడ ఆడటానికి ఎందుకు ఆసక్తి చూపలేదు?

కాకతీయ ఛత్ర కేతనాలను..ఇతర రాజరిక హోదాలను ఎందుకు స్వాధీనపరచుకోలేదు? యువరాజు గణపతి దేవుడ్ని తీసుకుని మాయమయ్యా రంటే వాళ్ల ఆలోచన ఏవిటి?

తనకు తనే ప్రశ్నలు వేసుకుని కాస్త తేరుకున్నాడు. సేనానులకు, దళపతులకు చెప్పాడు, ‘‘మహారాజు మహాదేవుల వారు వీరమరణం పొందారు. యువరాజు గణపతిదేవుడు కోటలో ఉన్నారు.. ఇదే అందరికి.. రాజధాని లోని సాధారణ ప్రజలందరికీ ఇదే చెప్పాలి.. రాజ్యమంతటా ఇదే తెలియాలి. అర్ధమైందా.. నేనన్నది విన్నారా.. ఏం చెప్పాలి?!.. యువరాజు కోటలో ఉన్నారు!! అని.. సరేనా..’’

అందరికి అర్ధమయింది. వాళ్లంతా సైనికులు. రాజు చనిపోయి, యువరాజు శత్రువులకు చిక్కాడంటే సాధారణ ప్రజల్లో కలిగే అలజడి, శత్రురాజుల్లో తొణికే రణోత్సాహం వారు అర్థంచేసుకోగలరు.

‘‘అలాగే మహాసేనాని..’’ అన్నారు.

కళ్లు తుడుచుకుని లేచి అందరిని మహాదేవరాజు శవం చుట్టూ నిలబెట్టి ప్రమాణం చేయించాడు తను.

‘‘మనం యువరాజు గణపతిదేవుని తోడ్కొని మాత్రమే తిరిగి అనుమకొండ వెళతాం. లేదా.. ఇక్కడే మరణిస్తాం. అప్పటి వరకూ స్కంధావారం విడిచి వెళ్లం. ఇది మహారాజు శ్రీశ్రీశ్రీ మహాదేవులవారి పార్దీవ శరీరంపై ఆన..’’ వంట్లో సలసలమండుతున్న రక్తం నిలువెల్లా పొంగుతుండగా.. అందరూ నిండు హృదయంతో, ముక్తకంఠంతో నినదించారు.

అనంతరం మహాదేవుని శరీరాన్ని భుజాన వేసుకుని స్కంధావారానికి చేరారు.

వార్తాహరుడు వాయువేగంతో వెళ్లి మహాప్రధాని గంగాధరమంత్రికి మహారాజు మరణం, యువరాజు అదృశ్యం వార్తలు వివరించారు.

రుద్రసేనాని తీసుకున్న నిర్ణయం కూడా చెప్పారు.

అ వెనకే మహారాజు పార్ధివ శరీరాన్ని అనుమ కొండకు రహస్యంగా తరలించి కర్మకాండ నిర్వహించవలసినదిగా గంగాధరమంత్రికి లేఖ రాసి పంపాడు. పట్టమహిషి బయ్యమాంబాదేవి, ఇతర అంతఃపుర రాణీ పరివారానికి తెలియజేయమని.. తమ చేతకానితనాన్ని క్షమించమని కోరుతున్నట్లుగా చెప్పమన్నాడు.

సైన్యమంతా తిరిగి అనుమకొండ రావడం అంటే అది యువరాజు గణపతిదేవునితోనేనని.. లేకుండా స్కంధావారాన్ని దగ్ధం చేసుకుని మరణిస్తామని, ఇది కాకతీయసైన్యమంతా ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయమని విస్పష్టంగా తెలియజేశాడు.

జరిగిన పరిణామాలు గంగాధరమంత్రిని హతాశుడిని చేశాయి. ఆయన కర్మకాండ జరిపించ వలసినదిగా శైవ గురువులకు, సంబంధిత నియోగా నికి వర్తమానం పంపి హుటాహుటిన స్కంధవారానికి వచ్చి రుద్రసేనానిని కలిశాడు.

కిం కర్తవ్యం??

జరిగిపోయింది సరే.. జరగాల్సింది ఏవిటి?? ఇప్పుడు రాజు లేని.. వారసుడు, పట్టాభిషిక్త యువ రాజు లేని రాజ్యం కాకతీయ రాజ్యం!

తీవ్ర తర్జనభర్జనలు జరిగాక తొలుత వెనువెంటనే జరగాల్సింది, ప్రకటించాల్సింది నిర్ణయించారు.

‘యువరాజు గణపతిదేవుడు క్షేమమేనని.. అనుమకొండ కోటలోనే భద్రంగా ఉన్నారని!’ లేకుంటే కాకతీయ రాజ్యం కకావికలమౌతుందని.. ప్రజలు గందరగోళమై మరిన్ని కొత్త సమస్యలు రావచ్చని యుద్దతంత్రజ్ఞులంతా ఏకీభావం వ్యక్తపరచారు.

గంగాధరుడు అంతే వేగంగా అనుమకొండకు వెళ్లి ఆ ప్రకటన చేశాడు.

మహాదేవుడు మరణించాడన్న దుఃఖం.. రేపటి బ్రతుకు బాగుపడడానికి యువరాజు గణపతిదేవుడు ఉన్నాడన్న భరోసా.. ఈ రెండు భావనల మధ్య ప్రజలంతా తల్లడిల్లిపోతూ ఒకరితో ఒకరు చర్చించు కుంటూ తమకు కలిగిన ఈ ఉపద్రవాన్ని ఉపశమింప జేయమంటూ కనబడిన దేవుడికల్లా మ్రొక్కసాగారు.

స్కంధావారంలో కత్తులు సానబెడుతున్న రేచర్ల రుద్రయ స్థితప్రజ్ఞుడైతే అనుమకొండలో బుర్రలు సానబెడుతున్న గంగాధరమంత్రి ఉద్దండుడు. ఓరుగల్లు నగర అధ్యక్షుడు ఇందులూరి పెదమల్లనను, నియోగాధిపతులను, బహాత్తర నియోగాధిపతి దమ్మ వీరను.. అందరిని హెచ్చరించాడు. ప్రజల దైనందినంలో ఎలాంటి ఒడుదుడుకులు ఉండరాదని ఆజ్ఞలు జారీ చేశాడు. రాజ్యమంతటా ఎక్కడా నిత్యావసరాల కొరత ఉండకూడదని వర్తక సమయాల శెట్టిలందరికి వర్తమానం పంపాడు. రాజ్యమంతా ప్రశాంతత ఉన్నా ఏదో నిగూఢమైన బాధ వ్యాపించి ఉంది.

బయటి శత్రువుల్లో గణపతి గురించిన సందేహాలు పెరుగుతున్నాయి. సామంతులు అనుమ కొండలో జరిగే తంతు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఏ క్షణమైనా స్వాతంత్య్రం ప్రకటించుకోవడానికి గోతి దగ్గర నక్కల్లా చూస్తున్నారు. ఇవన్నీ రుద్రసేనానికి, గంగాధరునికి తెలియని సంగతులు కావు.

దేవగిరిని దెబ్బ కొట్టి గణపతిని విడిపించి కాకతీయ సింహాసనంపై కూర్చోబెడితే చాలు.. ఈ అధములంతా తోక ముడుస్తారు.

ఇక్కడ మనకు సహకరించే మిత్రులెవరు? దేవగిరి శత్రువులెవరు??

రెండింటికి ఒక్కటే సమాధానం.. ద్వారసముద్రం రాజధానిగా హోయసల రాజ్యాన్ని పాలిస్తున్న బల్లాలదేవుడు.

దేవగిరికి తూర్పున అనుమకొండ ఉంటే నైరుతిగా హోయసల రాజ్యం ఉంది. హోయసల బల్లాలుడు మహాయోధుడు. దేవగిరి సేణువులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఇప్పటికే కొంత భాగాన్ని ఆక్రమిం చాడు. ఆయ నకు రుద్రదేవుడు, ఆయన తండ్రి ప్రోలరాజు (రెండవ) సామంతులుగా విశ్వసనీయు లుగా ఉండేవారు.

రుద్రసేనాని యుద్ధ  నైపుణ్యం ఆయనకు బాగా తెలుసు. ఎప్పుడూ ప్రశంసిస్తూ ఉంటాడు కూడా.

గంగాధరుని సలహా మీదట రుద్రయ స్వయంగా ద్వారసముద్రం వెళ్లి బల్లాలుని కాళ్లపై పడ్డాడు.

‘‘నువ్వేమీ దిగులు చెందవద్దు రుద్రా.. ఆ జైతుగి అంతు చూద్దాం. నేనున్నాను మీకు అండగా..’’ అభయమిచ్చాడు బల్లాలుడు. అంతేకాదు అప్పటి కప్పుడు మంచి సైన్యాధ్యక్షుడితో పెద్ద సైన్యాన్ని దేవగిరి సరిహద్దుల వద్ద స్కంధావారం ఏర్పాటు చేసుకుని ఉండమని పంపాడు.

ఆయనకు కృత్ఞతలు చెప్పి తిరిగి స్కంధావారానికి చేరాడు రేచర్ల రుద్రయ.

సైనికులంతా ఆయన అశ్వ శకటం వెంట పరుగులు పెట్టారు.. ఏమి శుభవార్త చెబుతాడో విందామని..

కాని ఏమీ చెప్పకుండానే నవ్వుతూ చేయి ఊపి గోల్లెనలోకి వెళ్లిపోయాడు.

అందరూ ఉసూరుమన్నారు. మహాదేవుని మరణం తర్వాత ఆయన కాస్త నవ్వుముఖం పెట్టడం ఇప్పుడే.

‘‘సర్వసైన్యాధ్యక్షులవారు కాస్త నవ్వారంటే.. శుభవార్తే కావచ్చు..’’

కాస్త ఊరడింపుగా అందరూ ఒకరినొకరు చూసుకున్నారు. మళ్లీ మామూలే.

లక్షలాది సైన్యం వేరు వేరు గొల్లెనలల్లోనూ ఆరుబయట.. ఈత చాపలు, మంచాలపై, నేలమీద దిగులుగా కూర్చుని మునగదీసుకుని పడుకుని, మాట్లాడలేక, మాటలు రాక, దిక్కులు చూస్తూ, ప్చ్.. అం‌టూ నిట్టూరుస్తూ.. కళ్లనీరు క్రుక్కుకుంటూ, శూన్యంలోకి చూస్తూ ఓ రుద్రదేవా.. కాకతమ్మా.. ఎంత అవమానం కలిగించారు దేవరా! అనుకుంటు న్నారు.

కొందరు బయట క్రిందపడి.. కొందరు చెట్ల నీడన.. మరికొందరు చేతులు వెనక్కట్టుకుని పచార్లు చేస్తూ.. తమ దళపతుల వంక.. సేనానుల వంక.. సేనాధిపతుల వంక.. మహావీరుల గొల్లెన తెరల వంక.. బయటకు పరుగెత్తే వార్తాహరుల వంకా.. గుర్రాలపై వేగంగా వచ్చి వడివడిగా సైన్యాధ్యక్షుల గోల్లెనలోకి వగరుస్తూ పరుగులు పెట్టె గూఢచారుల వంకచ చూస్తున్నారు.

వాళ్లు ఏదైనా శుభవార్త తెచ్చారేమోనని కళ్లలో ఆశల వత్తులు వేసుకుని.. వేగంగా వెళ్లి మరో సైనికుడితో తన ఆలోచనలను పంచుకుంటూ, దుఃఖాన్ని చెప్పుకుంటూ, ఆశలగోడు వెళ్లబోసు కుంటూ.. సైనికులంతా ఈసురోమని కనిపిస్తున్నారు.

సైనికుల వాలకాలు ఇలా ఉంటే గోల్లెనల్లో యుద్ధతంత్రజ్ఞులంతా.. రకరకాల ఆలోచనల్లో చర్చల్లో మునిగి తిండి తిప్పలు కూడా మరచి.. ఏమి చెయ్యాలో తోచక.. తోచిన ఆలోచన సరైనదో కాదో చెప్పలేక.. నమ్మలేక.. ఆత్మవిశ్వాసం సడలి.. వెర్రిచూపులు చూస్తూ ఎంత పని జరిగింది.. అని నిట్టూరుస్తూ?!!

ఇంతటి దీనావస్థలోనూ.. నిశ్చలమై వెలుగుతున్న ఆశల అఖండదీపం మహాసైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రయ!!

ఆ మహాదీపం వెలుగులో మిణుకు మిణుకుమంటున్న ప్రాణాలతో కత్తులు నూరుకుంటూ యుద్ధానికి సిద్ధమై ఉంది లక్షలాది సైన్యం. ఆయన ఊ అంటే చాలు దేవగిరిని భస్మీపటలం చేయగలరు. ప్రాణాలా.. అవి చీమల్లాంటివి.. ఉంటే ఎంత పొతే ఎంత??

స్కంధావారంలోని లక్షలాది సైనికులు.. కాకతీయరాజ్యంలోని కోట్లాది సాధారణ ప్రజలు తనవైపే ఆశగా చూస్తు న్నారని.. తనకు తిరుగులేని యుద్ద తంత్రం ఆదేశించమని ఆ రుద్రదేవుడిని ప్రార్ధిస్తున్నారని.. ఆయనకు తెలుసు. ఆయన ఎదురు చూస్తోంది కాకతీయరాజ్య మహాప్రధాని గంగాధరమంత్రి నుండి ముహూర్త సమయం!!

వందమంది ప్రధానులు, మంత్రులు, అమాత్యులతో కూడిన మంత్రిమండలే యుద్ధతంత్ర మండలి. దేవగిరిలో జరుగుతున్న ప్రతి తతంగం, ప్రతి ఎత్తుగడ, అక్కడ యువరాజు గణపతికి అందిస్తున్న అన్నపానీయాలు.. గౌరవ మర్యాదల సంగతులు.. మరుక్షణం ఇక్కడ స్కంధావారానికి, అక్కడ అనుమకొండ రాజప్రాసాదానికి చేరిపోతోంది. తదనుగుణంగా ఎత్తులు పైఎత్తులు రచిస్తూ తగిన సమయం కోసం అక్కడా ఇక్కడా లిప్తల కాలాన్ని కూడా వ్యర్ధపరచడం లేదు.

ఏక్షణమైనా దేవగిరిని ఓడించి లేదా వంచించి గణపతిదేవుడ్ని తోడ్కొని రావాలి.

అందుకు ప్రతి యోధుని రక్తం సలసలా మరిగిపోతోంది.

సంధ్యాకాలమయ్యింది.. ఈరోజు కూడా వ్యర్ధమా.. ప్చ్.. ‌నిస్పృహతో స్కంధావారం ఊగిపోతోంది.

అప్పుడు వచ్చాడు గొల్లెన నుండి బయటకు రుద్ర సేనాని..

(సశేషం)

About Author

By editor

Twitter
YOUTUBE