‌భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

– భమిడిపాటి గౌరీశంకర్‌


‘‘‌వ్యాపార వర్గాల్లో ఇదో సాధారణమైన వార్త… కానీ… అంత అవసరమేమొచ్చింది నవీన్‌కి…’’ డాక్టర్‌ ‌రంగనాథం నాతో అన్నాడు.

‘‘కనుక్కుంటాను కానీ వాడి పరిస్థితి ఏమిటి…’’ అన్నాను నేను గాబరాగా రంగనాథంతో…

‘‘ఇబ్బంది ఏమీ లేదు.. అతను చాలా కాలిక్యు లేటెడ్‌. ఆత్మహత్యాయత్నంలో కూడా’’ అన్నాడు నవ్వుతూ.

డాక్టర్స్‌కి ఇవన్నీ సహజమే నేను వాడి పక్కన కుర్చీలో కూర్చున్నాను.. నిశ్శబ్దంగా డాక్టర్‌ ఇచ్చిన మందుల ప్రభావంతో మెల్లగా కళ్లు తెరిచాడు.. అతని ముఖంలో గూడు కట్టుకున్న విషాదపు నీడ…

‘‘తాగండి అన్నయ్యగారు’’ అంది నిర్మల కప్పుతో కాఫీ అందిస్తూ..

మెల్లగా వేడివేడి కాఫీ తాగుతూ.. చల్లని ఏ.సి. గది వాతావరణంలో కాస్త రిలాక్సయ్యాను.. వార్త నిర్మల ఫోన్లో చెప్పగానే… బెంగళూరు నుంచి విశాఖ పరిగెత్తుకు వచ్చాను..

‘‘అసలేమీ జరిగిందమ్మా’’ అన్నాను నిర్మల వైపు చూసి. ఆమె ముఖంలో నిర్లిప్తత… విషాదం. ఎప్పుడూ నవ్విస్తూ సరదాగా, ఏభై ఏళ్ల వయసులో కూడా… నలభై ఏళ్ల దానిలా తిరిగే నిర్మల… ఓ విషాదమూర్తిలా.

‘‘ఏమి చెప్పనన్నయ్య…వ్యాపారంలో నష్టం..అప్పులు…మీకు తె•లియనిదేముంది…!’’ అంది దుఃఖిస్తూ.. వస్తున్న కన్నీటిని చీర చెంగుతో తుడుచుకుంటూ..

నిర్మల… నిజమైన భార్య… ఆమె నా మిత్రుడిని పాడిస్తుంది.. నవ్విస్తుంది.. ఒంటరితనాన్ని పోగొడుతుంది. వర్షపు చినుకుల శబ్దాన్ని కలిసి వినిపిస్తుంది.. అన్నింటికన్నా ముఖ్యంగా అతనికి బతకడం నేర్పింది…ఆమెను అలా ఎలా చూడటం… నా మిత్రుడు మెల్లగా… పూర్తిగా కళ్లు తెరిచాడు. భార్య వంక , నా వైపు చూసాడు.. అతడి ముఖంలో నెర్వెస్‌ ‌నెస్‌.. ఏదో చెప్పాలనుకున్నాడు.. ‘‘వద్దులే తర్వాత మాట్లాడదాం..’’ అన్నాను నేను..

ఆమె కాఫీ కప్పులో పోసి, పక్కన కూర్చుని నెమ్మదిగా తాగించింది. అతని ముఖంలో ఇప్పుడు కాస్త ప్రశాంతత… ఏం తిన్నాం, ఏం చూశాం అన్నది ముఖ్యం కాదు.. మనసు విప్పి ఏం చెప్పుకున్నాం అనేది ముఖ్యం.. భార్యాభర్తలు ‘‘మా..ట్లా..డు.. కున్నారు’’ నిశ్శబ్దంగా మనసుతో..

                                                                                                   *         *        *

రాత్రి ఎనిమిది గంటల సమయం… ఆసుపత్రి గది… నిర్మలను ఇంటికి పంపించాను.. రేవతి.. నా భార్యకి ఫోన్‌ ‌చేశాను. రమ్మన్నాను. తను వస్తే నిర్మలకి తోడుగా ఉంటుంది. నేను వెళ్లి ఫ్రెషయి రావచ్చు.

నాకు… నా మిత్రుడు గోపాలానికి నాలుగు దశాబ్దాలకు పైగా స్నేహముంది. ఒకరినొకరు అన్నదమ్ములు లాగానే ఉంటాం. తిండికి లేని దశ నుంచి శ్రమించి పారిశ్రామికవేత్తలుగా ఎదిగాం. నాకు ఒక కొడుకు, కూతురు. పెళ్లిళ్లు అయి పోయాయి. అమెరికాలో సెటిల్‌ అయ్యారు. నాకు ‘అల్యూమినియం’ ప్రాసెసింగ్‌ ‌యూనిట్లు హైదరాబాదు, చిత్తూరు, బెంగళూరులో ఉన్నాయి. కన్స్ట్రక్షన్స్ ‌రంగంలో మా బాబు, అమ్మాయి ఉన్నారు. వారు జేఎన్టీయూలో ఎం.టెక్‌ ‌చేశారు. అలాగని జీవితమంతా సంతోషం అనుకునేరు. నా కష్టాలు నాకున్నాయి. నా మిత్రుడు గోపాలానికి ఆస్తులున్నాయి. కాకపోతే అతనికి ఇద్దరు కొడుకులున్నారు. ఆస్తి వారికి పంచేసి, ఇల్లు, కారు, బతకడానికి కావలసిన ఆస్తి ఉంచుకున్నాడు. వారు ఆస్తులను పెంచుకొనే క్రమంలో స్నేహితుల మాటలు నమ్మి, తండ్రికున్న కెమికల్‌ ‌ఫ్యాక్టరీ యూనిట్లను విస్తరించాలనుకొని నష్టాల పాలయ్యారు. అప్పులు పెంచేశారు. ఆస్తులు కరిగించేశారు. ఫ్యాక్టరీల పైన చేసిన అప్పులు, తీసుకున్న రుణాలు ఇప్పుడు గోపాలానికి మిగిల్చి కుటుంబాలతో జారిపోయారు.. పాపం గోపాలం..

కథంటే కావలసిన చోట ఆనందాన్ని అతికించవచ్చు. వద్దంటే విషాదాన్ని తీసేయవచ్చు. జీవితం అలా కాదు కదా. కానీ.. దుఃఖాలను దాటి.. మౌనంగా ఏడున్నర పదుల వయసులో నవ్వుతూ ఛాట్‌ ‌బండి నడుపుకునే దంపతులు నాకు తెలుసు. వారే.. సుబ్బయ్య దంపతులు. వైజాగ్‌ ‌రామకృష్ణ బీచ్‌లో రోజు సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది వరకు మాత్రమే ఉంటారు. పగటిపూట తన రెండు గదులు ఇంటి ముందు డెయిరీ పాల ప్యాకెట్స్, ‌పేపర్స్ అమ్ముతారు. మూడు వందల అరవై అయిదు రోజులు వారి ముఖంలో నవ్వు, సంతృప్తి . ఇప్పటికీ నాకశ్చర్యమే… పేదరికం ప్రశాంతతనిస్తుందా…? వారి గురించి మా గోపాలానికి చెప్పాలి… కాదు.. చాలామంది గోపాలానికి తెలియాలి..

డోర్‌ ‌బెల్‌ ‌రింగయింది… నర్స్.. ‌వచ్చి.. పల్స్, ‌టెంపరేచర్‌ ‌వగైరాలు చూసి వెళ్లింది. మళ్లీ నా ఆలోచనలు నా దగ్గరకు వచ్చాయి.

కిటికీలో నుంచి సముద్రం.. నల్లగా.. ‘‘అప్పు డప్పుడు సముద్రం శిఖరాల మీద నిలబడుతుంది. రోజుల తరబడి తీరపు గవ్వలని సైతం కదిలించదు’’ యండమూరి వారి అనువాదం గుర్తుకు వచ్చింది..

‘‘ఊ…ఊ…’’ వెనకనుంచి మా వాడి మూలుగు.. కుర్చీ వెనుకకు జరిపి.. వాడి మంచానికి దగ్గరగా వేశాను.. వాడు నా చేతిని తన చేతిలోకి తీసుకొని… ‘నా కొడుకులు నాకన్యాయం చేశార్రా.. నాకు చావు తప్ప నీవూ గుర్తుకు రాలేదు.. క్షమించు’ అన్నాడు.. అతడి కంటి నిండా నీరు..

‘‘ఏడవకు… జీవితానికి కామాలే కానీ ఫులుస్టాఫ్‌లు ఉండవు. మరణమే చివరిది.. నువ్వు దానిని కాస్త ముందు పేజీల్లోకి తెద్దామనుకున్నావు. కానీ.. ఓడిపోయావు. ఒక్కటి గమనించు పిల్లలు మన స్థిరాస్తి కాదు. వారి జీవనం కోసమే జీవిస్తున్న ప్రాణులు వారు. మీతోనే జీవిస్తున్నా, వారు మీ సొంతం కాదు. ఇది నేను చెప్పిన మాటలు కాదు. ఖలీల్‌ ‌జిబ్రాన్‌ ‌తన ప్రాఫిట్‌ ‌లో చెప్పినవి. ఇవి నాకూ వర్తిస్తాయి. ఊరడిల్లు.. ఎక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చాము గుర్తుకు తెచ్చుకో.. నేనున్నాగా.. సర్దుకుందాం సరేనా… హ్యాపీగా ఉండు.. నీ వ్యవహారాలు తేల్చిన తర్వాతనే నేను తిరిగి వెళ్తాను.. డోంట్‌ ‌వర్రీ..’’ అన్నాను. భరోసాగా.. కానీ.. నిజంగా నేను చేయగలనని కాదు.. ఓ స్నేహితునిగా అతనికో మానసిక భరోసా అవసరమయ్యే సమయమిది.. స్నేహమంటే దుఃఖ సమయంలో ఆనందాన్ని ఇవ్వడం ఆనంద క్షణాలను సమంగా పంచుకోవటం.

సమయం రాత్రి 9 గంటలు. రేవతి, నిర్మల కలిసి వచ్చారు. ఆడవారు అయస్కాంతం లాంటివారు.. ఎక్కడున్నా చటుక్కున కలుసు కుంటారు.. నాకు నవ్వు వచ్చింది..‘‘ఎందుకు నవ్వుతున్నారు.. ఇది నవ్వే సమయమా.. సందర్భమా..!!’’ అంది రేవతి ఎవరూ చూడకుండా డొక్కలో పొడిచి. గోపాలం చూశాడని నాకు, రేవతికి కూడా తెలుసు. ఇటువంటి సమయంలో రోగి చుట్టూ ఉన్న వాతావరణాన్ని సాధ్యమయినంతగా తేలిక పరచాలి. నిర్మల అత•ని పక్కన కూర్చోని చపాతిని ముక్కలుగా చేసి, కూరలో ముంచి తినిపిస్తున్నది. కానీ.. ‘‘ఒకరి కోసం మరొకరు జన్మించి జతగానే జీవించి, జీవితపు పుట్టల్ని మృత్యువు చించేస్తున్నా చివర వరకు జతగా అధ్యయనం చేయడం వివాహం. సాహా ఖలీల్‌ ‌జేబ్రాన్‌.. ‌వారిని అలా చూస్తుంటే నాకు గుర్తుకు వచ్చింది.

మరో అరగంటలో డాక్టర్‌ ‌రౌండ్స్‌కు వచ్చారు.‘‘ఓ రెండు రోజుల్లో డిస్చార్జ్ ‌చేసేద్దాం..’’అన్నాడు.

‘థాంక్యూ డాక్టర్‌’ అన్నాను..

‘‘ఎందుకు… బిల్లు తగ్గినందుకా…’’ అన్నాడు డాక్టర్‌..

‌మేమిద్దరం.. రాత్రుళ్లు.. తరచుగా.. విశాఖలో ఉంటే కలుస్తుంటాం.. జతగా ‘‘ఊగుతుంటాం’’… ‘‘బాకీ మీరు వదలరుగా’’ అన్నాను నర్మగర్భంగా.. నవ్వుతూ…

‘‘మీరు మారలేదు. గుడ్‌నైట్‌’’ అనేసి వెళ్లిపోయాడు..

నేను గోపాలం మంచం దగ్గరకు వచ్చి.. ‘‘డాక్టర్‌ ‌మాటలు విన్నావుగా..’’ అన్నాను..

‘‘నువ్వు డాక్టర్‌తో అన్న మాటలు కూడా’’ అన్నాడు సన్నగా నవ్వుతూ.. ‘‘మీరు రాగానే ఆయనకు నవ్వు కూడా వచ్చిందన్నయ్య’’ అంది నిర్మల.. ‘‘కాదమ్మా.. నీ నిశ్శబ్ద ఓదార్పు వలన’’ అన్నాను.

‘‘ఏంటో ఈయన వ్యాపారం లాగే మాటలు కూడా అర్థం కావు’’ అంది రేవతి వెటకారం నటిస్తూ..

 అందరం సన్నగా నవ్వుకొని… ఇద్దరు తెచ్చిన ఆహార పదార్థాలను తినేసాం.. ‘‘ఒక్క మాట గోపాలం.. మనం ఇంటికి వెళ్లిన తర్వాత ఒక్కసారి కోటేశ్వరరావు గారిని కలుద్దాం.. ఓ.కే.నా..’’

‘‘కోటేశ్వరరావు ఇంకా ఉన్నారా… ఆయన ఆత్మహత్య చేసుకున్నారని. ఐ.పీ. పెట్టేసారని విన్నాను.. విశాఖలోనే ఆయన ఉన్నారా..’’ అన్నాడు ఆశ్చర్యంగా…

‘‘సంతోషంగా ఉన్నారు.. చూపిస్తాను.. సరేనా…’’ అన్నాను..

                                                                                                   *         *        *

రెండు రోజుల తరువాత గోపాలం ఆసుపత్రి నుంచి డిశ్చార్జై ఇంటికి వచ్చేసాడు. ఈ లోగా నేను పోలీసులు, లాయర్లు, బ్యాంకులు, అప్పుల వాళ్లతో మాట్లాడి ఉంచాను. ఒక నెల రోజులలోపు అన్ని సెటిల్‌ ‌చేస్తానని చెప్పాను. గోపాలం కాకపోతే నేను బాధ్యత వహిస్తానని వారికి చెప్పాను. నా ఆర్థికస్థితి వారందరికీ తెలుసు కనుక ఒప్పుకున్నారు. బేసిగ్గా ‘మనిషి’ అంతో ఇంతో మానవత్వం, జాలి, దయ, సానుభూతి వంటి వాటితో కలిసి ఉంటాడు. కాకపోతే వాదనలతో ముందుకు వెళితే ‘ఈగో’ తిరగ బడుతుంది. మానవ సంబంధాలు ఈ పాయింట్‌ ‌దగ్గర దెబ్బతింటున్నాయి.

నాలుగు రోజులు అనంతరం…పరిస్థితులు మెల్లగా సర్దుకోసాగాయి. గోపాలం పిల్లలు కూడా ఫోన్లో మాట్లాడేరు. ముందు అతను కోపగించుకున్నాడు. కానీ.. నేను సర్ది చెప్పిన తర్వాత ‘‘దయచేసి మీరు మరి మా ఇద్దరి జీవితాల్లోకి రాకండి. మీరు నేర్పిన పాఠం గొప్పది’’ అని సరిపెట్టాడు. నిర్మల నిర్ల్లిప్తంగా ఉండిపోయింది.

‘‘మనం ఒకసారి కోటేశ్వరరావు గారిని కలుద్దామా’’ అన్నాడు. ఓ రోజు గోపాలం.. ‘‘సరే.. సాయంత్రం ఆరుకు వస్తాను. వెళదాం’’ అన్నాను..

కారు రామకృష్ణ బీచ్‌ ‌దిశగా నడుపుతున్నాను. గోపాలం ఏదో ఆలోచనలో ఉన్నాడు.. మెల్లగా రామకృష్ణ మఠం ఆలయం ఎదురుగా… సముద్రం చూస్తూ ఆపాను. వాతావరణం మబ్బుపట్టి ఉంది. వీకెండ్‌ ‌కాదు.. జనం పల్చగా ఉన్నారు. కారులో నుంచి ఇద్దరం దిగాం. గట్టుమీద యువతీయువకులు జంటలు జంటలుగా ‘దగ్గరగా’ కూర్చుని.. ఈ ప్రపంచం మొత్తం ‘మనిద్దరమే’ అన్నంతగా ఉన్నారు.. నాకు నవ్వొచ్చింది.. బహుశా వారికి పెళ్లి కాలేదనుకుంటా. ఇంకా ప్రేమికులే..

 ‘‘ఏంటి ఇక్కడ కారాపావు. అసలు ఈ దారిలో కోటేశ్వరరావు గారి మేడ లేదుగా..’’ గోపాలరావు అనుమానం.

 ‘‘ఆయన పది అయితేగాని ఫ్రీకారని తెలిసింది. ఈలోగా… ఇక్కడ సుబ్బయ్య అనే ముసలాయన ఛాట్‌ ‌బండి పెట్టారు. పదిహేను రూపాయలే.. దా.. తిందాం’’ అన్నాను..

ఇద్దరం… సుబ్బయ్య ఛాట్‌ ‌బండి దగ్గరకు వెళ్లాం. అక్కడ చాంతాడంత క్యూ ఉంది.. ముసలి, ముతక, పిల్లలు అందరూ ఉన్నారు. కానీ.. సుబ్బయ్య మంచాయన.. పెద్దవారికి వేగంగా ఇస్తున్నాడు. అతని భార్య కూడా ఏ మాత్రం విసుగు, చిరాకు లేకుండా ఆడవారికి, పిల్లలకు అందిస్తున్నారు.. ఏడున్నర పదుల పైగా వయసులోనూ వంగని విల్లులా ‘స్టిఫ్‌’ ‌గా ఉన్నారు. కాలం నేర్పిన పాఠాలు.. జీవితం చెప్పిన జ్ఞాపకాలు కారకాలై ఉండవచ్చు… వారిని నిటారుగా ఉంచాయి. గోపాలం.. రెండు చాట్‌లు అడిగాడు. 30 రూపాయలు ఇచ్చాడు. సుబ్బయ్య ముఖంలో నవ్వు… అతన్ని ఆకర్షించింది.కొద్దిసేపు ఆలోచనలో పడేసింది..

‘‘తీసుకున్నావా..’’ అన్నాను గోపాలం దగ్గరకు వెళ్లి

‘ఏం బాబు గారు బాగున్నారా’’ అన్నాడు సుబ్బయ్య.

‘‘అయ్యో.. నేను మీ కన్నా అన్నింటా చిన్నవాడిని.. నన్ను బాబుగారు అని పిలవద్దు’’ అన్నాను సుబ్బయ్యతో…

‘‘మీరు కస్టమర్‌.. ‌దేవునితో సమానం అలానే పిలుస్తాను’’ అన్నాడు సుబ్బయ్య… నవ్వుతూ

‘‘చాట్‌ ‌బండివాడితో గౌరవ మర్యాదల చర్చ అవసరమా…?మనం డబ్బులిస్తాం.. అతడు సరుకిస్తాడు అంతే..’’ గోపాల ముఖంలో అసహనం

నేను నవ్వి ఊరుకున్నాను… ఒకసారి సుబ్బయ్య కథ తెలుసుకుందాం అనుకున్నాను.వెళ్లి అడిగాను.. వాడిది నీ వంటి కథే… అంటే పిల్లలు వదిలించు కున్నారు’’. పూర్వాశ్రమంలో సుబ్బయ్య కూడా బాగా డబ్బున్న వాడేనట. కానీ.. పిల్లలను నమ్మి వారి పేరున ఆస్తి రాసి, వారిచే ఇంటి నుంచి గెంటి వేయబడ్డారు ఆ ముసలి దంపతులు. ఒకసారి ఆయనే నాకు చెప్పాడు’’ పిల్లల్ని ప్రేమించే ప్రయత్నం తప్పు కాదు. వారు తిరిగి ప్రేమను ఇవ్వాలన్న నిబంధనే మహా పాపమని’’ ఇది కూడా ఆయన ఎక్కడో చదివినదేనట. అవమానం, ఆకలి, వేదన, నిస్సహాయత, దుఃఖం- ఇవన్నీ సోపానాలు దిగితే కిందకు వెళతాం. ఎక్కితే పైకి వెళతాం. సుబ్బయ్య ఎక్కిన మనిషి.

‘‘ఏంటి చాట్‌ ‌బండి నడుపుకుంటూనా మీదికి ఎక్కిన మనిషి’’ గోపాలం గొంతులో చిన్నచూపు.

‘‘నీకో విషయం చెప్పనా.. సమస్యల్ని చిరునవ్వుతో సాధించిన వాడే తన లక్ష్యాన్ని చేరుకుంటాడు. సుబ్బయ్య కథలో నీతి అదే.. చంద్రుని వెన్నెల ఆవల విపరీతమైన ఎండ ఉంటుందని ఈ మధ్య శాస్త్రజ్ఞులు అంటున్నారు. కానీ.. మనకు ‘శశి’ చల్లదనమే కావాలి..

చాట్‌ ‌పూర్తయింది.. కప్పులు పారేశాం.. గట్ల మీద కూర్చున్న జంటలు మెల్లగా చీకటి ప్రదేశాలలో సర్దుకుంటున్నారు. ‘‘పద సమయం తొమ్మిది కావస్తున్నది.. వెళదాం.. మరో నాలుగయిదు రోజులలో ఇవన్నీ సర్దుకుంటాయి. పూర్వపు జీవితం కావాలనుకోకు. భయం వదిలి… కొత్త జీవితం ప్రారంభించు.. సుబ్బయ్యల’’ అన్నాను నవ్వుతూ… అతడు నవ్వాడు. ఇద్దరం కారెక్కాం. నేను స్టార్ట్ ‌చేసాను.

‘‘నేను కూడా బెంగుళూరు వెళ్లాలి. రేవతి కూడా తొందర పెడుతున్నది.. మరో రెండు రోజులు ఉండగలను.. అంతే’’ అన్నాను.

‘‘పోనీ ఈ రెండు రోజులు మా ఇంట్లోనే ఉండవచ్చు కదా నీవు, రేవతి’’ గోపాలం అర్ధింపు.

‘‘మా బావమరిది ఇక్కడ ఉన్నాడని నీకు తెలుసుగా.. రేపు అంతా నీతోనే ఉంటాను సరా’’ అన్నాను వాడిని ఊరడిస్తూ..

వాడింటి దగ్గర వాడు దిగాడు… లోపలికెళుతున్న వాడు ఆగి…

‘‘అవును కోటేశ్వరరావు గారి దగ్గరకు వెళదామన్నావు. నాకు ఆయనను చూడాలని ఉంది.. పోనీ రేపు వెళదామా…’’ అన్నాడు.

‘‘ఎందుకు రేపు … చూపించాను కదా’’ అన్నాను సీరియస్‌గా

‘‘ఎవరిని.. ఆ చాట్‌ ‌బండి సుబ్బయ్యనా?’’

‘‘అతని అసలు పేరు కోటేశ్వరరావు. ఇండస్ట్రీయలిస్టు’’.. నేను కారును ముందుకురికించాను.

వచ్చేవారం కథ..

వయసుమళ్లిన వలపు

– పెనుమాక నాగేశ్వరరావు

About Author

By editor

Twitter
YOUTUBE