‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన

-మత్తి భానుమూర్తి

ఓ ‌బుల్లి రెక్కల గుర్రం..

దాని చుట్టూ తిరుగుతూ ఎగురుతూ ఆడుకుంటూ బుజ్జి బుజ్జి తూనీగలు.. గుంపులు గుంపులు మబ్బులచాటు నుండి బయటకు వచ్చి నన్ను తొంగి చూసి భలే నవ్వాయి. ఆ వెనగ్గా.. మరేమో.. రెక్కల ఏనుగులు, రెక్కల కోతులు, రెక్కల జింకలు, పెద్దపెద్ద రెక్కల పాములు.. వాటి వెంట.. మీద.. చుట్టూ.. బుల్లి బుల్లి రెక్కల పిట్టలు.. ఆ వెనగ్గా మరేమో దేవతలు, అప్సరసలు, యక్ష కిన్నెర కింపురుషులు.. వాళ్లకూ బుజ్జి బుజ్జి రెక్కలున్నాయి. భలే భలే.. నన్ను చూసి ముచ్చటపడుతూ రెక్కలు విసనకర్రల్లా విప్పి టపటపలాడిస్తూ క్రింది కొచ్చి నా బుగ్గలు సాగలాగి ముద్దెట్టుకుని మళ్లీ కిలకిల నవ్వుతూ ఎగురుతూ పైకి వెళ్లి మళ్లీ క్రిందికి వంగి.. నన్ను చూస్తూ నవ్వుతున్నారు. అలా కిందికి పైకి.. కిందికి పైకి..మళ్లీ మళ్లీ.. నాకు భలే నవ్వొస్తోంది. నోట్లో వ్రేలు పెట్టుకుని పగలబడి నవ్వుతున్నానన్నమాట..

ఎక్కడో పై ఎత్తున రాజప్రాసాద అంతరాలయం. ఆకాశంలా అందనంత ఎత్తులో..

అక్కడ చిత్రించిన ఏవో కలగాపులగపు అద్భుత చిత్రాల మనోహర దృశ్యం అది. దూరంగా దగ్గరగా పైన క్రిందా చుట్టూ పరివేష్టించి భవనమంతా.. లోపలా బయటా వేదమంత్ర మాధుర్యం చెవులనే కాదు శరీరమంతా క్రమ్ముకుంటోంది.

రాజప్రాసాదానికి ముందున్న విశాల ప్రాంగణంలోని ఉద్యానవనమంతా హోమగుండాలే. వాటి చు ట్టూ ఎందరెందరో మహామహా మునివర్యులు.. సోమయాజులు.. వేదవేదాంగ పండితులు.. శైవ మఠాధిపతులు.. వారి ఉద్వేగభరితమైన వేద పఠనంతో కలగలిసి హోమగుండాల నుండి వెలువడుతున్న పొగ ఆకాశంలో శివ నృత్త విన్యాసాలను సృష్టిస్తోంది..

కాస్త ఈవలగా ప్రాంగణ పీఠంపై బంగారు ఊయలలో నేను.. నా ప్రక్కగా క్రింద పెద్దమ్మ సమేత పెదనాన్నగారు, అమ్మ సహితంగా నాన్నగారు ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు. వారి చుట్టూ మహా రుషులు, పండితులు, విప్రోత్తములు, పురోహితులు.. దాదాపు వందమంది ఏకకంఠంతో మంద్రంగా ఏవేవో పఠిస్తున్నారు. ఏదో పవిత్రకార్యం. అందరూ కళ్లు విప్పార్చి చూస్తున్న అపురూప కార్యం ఏదో జరుగుతోంది.

పెదనాన్నగారు చూపు ఆ మొత్తం కార్యాన్ని నిర్వహిస్తున్న పెద్దలు శైవ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ ధ్రువేశ్వర పండితులపై ఉన్నది. ఆయన పద్మాసన స్థితిలో పూర్తి యోగముద్రలో.. అర్ధనిమీలిత నేత్రాలతో మంద్రస్థాయిలో గొంతెత్తి మంత్రం పఠిస్తుంటే చుట్టూ పరివేష్టితులైన శివయోగులు ఆ మంత్రాన్ని తిరిగి జపిస్తున్నారు. ఆ మంత్ర లయకు తల ఊపుతున్నట్లు బంగారు ఊయల మెల్లగా ఊగుతోంది. చుట్టూ పరివేష్టించిన పరిచారికలు మృదువుగా ఊపుతున్నారు. లేచారు పెద్దమ్మ. ఊయల వద్దకు వచ్చి నా మీదికి వంగారు. నన్ను ఎత్తుకుని వొడిలోకి తీసుకున్నారు. పెదనాన్నగారికి అందించారు. ఆయన దగ్గరగా అదుముకుని ముద్దుపెట్టుకున్నారు. మీసాలు గరుగ్గా తగిలాయి. ఆ స్పర్శ ఏదో బావుంది. దగ్గరగా కనిపిస్తున్న ఆ కళ్ల తడిలో మాధుర్యం.. స్రవంతిలా ప్రసరిస్తూ ప్రవహిస్తోంది. ఆవల ఈవల ఎవరో నవ్వులు.. ఊసులు.. ముచ్చట్లు.. మురిపాలు. మొత్తంగా అచ్చోట ఏదో మధురిమ.. మాతృత్వ మహనీయత..

కనులు కదిపి చూశాను. అమ్మ, నాన్నగారు..

మరింత మురిపంగా నన్నే చూస్తున్నారు. నాకే నవ్వొచ్చి కిలకిలా నవ్వాను. నా కాళ్లూ చేతులూ ముద్దుగా కదిలాయి. నా కాళ్లకున్న బంగారు అందియలు.. చేతులకున్న బంగారు కడియాలు గరగరలాడాయి.

అందరూ పెళ్లున నవ్వేశారు. అందరిని నవ్వించి ఆనందింపజేసినందుకు నాకెంతో ఉల్లాసమయ్యింది. నా కాళ్లూ చేతులూ మరింత మరింత ఊపి కదిపి కదలి కదలి నవ్వుకున్నాను. రానురానూ నాచుట్టూ ఆత్మీయత మరింత పెరుగుతోంది. అనురాగం నన్ను చుట్టేస్తోంది.. పెనవేసుకుంటోంది.

నేను చేతులు మారుతున్నాను. ఎవరెవరో నన్ను ఎత్తుకుంటున్నారు.

వేద మంత్రోచ్చాటన.. మేళతాళాలు.. గలగలలు.. నవునవ్వులు.. ఎందరెందరో.. సతీసమేతులై మహా మహా నాయకులు, వీరాధివీరులు.. విచ్చేస్తు న్నారు. అంతా.. నా చుట్టూ.. అంటే అమ్మానాన్న, పెద్దమ్మ పెద్దనాన్నల చుట్టూ పరివేష్టుతులౌతున్నారు. మందిరమంతా నిండి పోతోంది.

అదేదో నాకు తెలియని నా సంరంభం!!

నన్ను అమ్మానాన్నలకు అందించారు పెదనాన్న. అమ్మ నన్ను అందుకుంది. ఆమె కళ్లలో చెప్పరాని, చెప్పలేని అనిర్వచనీయ భావనల ఉధృతి. కాస్త దుఃఖం కాస్త సంతోషం ఏకకాలంలో ముప్పిరిగొని కనిపిస్తున్నాయి. కారణం ఆమె తడిసిన కన్నులు నా కనులకు అత్యంత దగ్గరగా..

 అప్పుడే పురోహితుడు అమ్మకు పురమా యించాడు.

‘‘చిరంజీవిని రుద్రదేవులకు అందించండమ్మా..!’’

అందించింది అమ్మ. నేను మళ్లీ పెదనాన్నగారి వొడిలోకి చేరుకున్నాను.

అప్పుడు తెలిసింది.. నన్ను పెదనాన్నగారికి దత్తత ఇస్తున్నారు.

అందుకే అమ్మ కన్నుల్లో అన్ని భావసందడులు.. నేను ఆమెకు దూరమౌతున్నానా.. కన్నపేగును మరొకరికి రాజు అయినా చక్రవర్తి అయినా.. ఇచ్చేస్తోంది ఓ తల్లి!

ఆమె కన్నులలో కళ్లు పెట్టి నవ్వాను. ఆమెకు అర్ధమైంది.. ‘‘నేనెప్పుడూ నీ బిడ్డనేనమ్మా..’’

ఆమె కళ్లనుండి రెండు బాష్పాలు. బాధతోనా! ఆనందంతోనా! ఈ ప్రపంచంలో ఏ దేవుడూ చెప్పలేడు.

దగ్గరగా మంత్రఘోష పెరుగుతోంది.

నమక చమకాలతో రుద్రుడ్ని అర్చిస్తూ..

దగ్గరగా కిర్రుకిర్రు మంటూ శబ్దాలు.. చెవులు చిల్లులు పడేలా..

నిద్ర నుంచి దిగ్గున లేచాడు గణపతిదేవుడు.

                                                                                         *        *       *

పునాది: కారాగార బందీ

చెరసాల గది ఇనుప తలుపులు తీశాడెవరో.

కల చెదిరింది. సుషుప్తి లాంటి మగతలో ఓ సన్నివేశం. కలా, నిజమా.. ప్చ్..

‌భారంగా కళ్లు మూసుకున్నాడు గణపతిదేవుడు. కల.. ఓ అనంతానంత ఆనంద మహాదానంద సంగమాల మధ్య తానొక ఊయలలో పట్టుబట్టల దొన్నెలలో పవ్వళించినవేళ.. అందరూ తనను ముద్దు చేస్తున్న సంరంభం! తనను పెదనాన్నగారు దత్తత తీసుకుంటున్న సంప్రదాయ చారిత్రాత్మక ఉత్సవ సంబరం!! కాకతీయ వంశ చరిత్రలో ఓ అద్వితీయ మలుపు..

కళ్లు నులుముకున్నాడు పదిహేడేళ్ల నూనూగు మీసాల కాకతీయ భవిష్యత్తు.

యాదవ రాజ్య రాజధాని దేవగిరి చెరసాలలో బందీ!!

అలవాటులేని నేల పడక ఇబ్బంది పెడుతోంది. కదలి వొత్తిగిల్లి చూశాడు. ఆకుల దొన్నెలో ఏవో తినుబండారాలు లోపలికి తోసి మళ్లీ కారాగారపు తలుపులు వేసేశారు. ఆ తలుపుల కిర్రుకిర్రు శబ్దాలు భరించలేక చెవులు మూసుకున్నాడు గణపతిదేవుడు.

ఆకలి.

ఈ కారాగార ఉద్యోగులకు బందీల ఆకలి తెలుసేమో.. సమయానికి తినడానికి ఏదో తెచ్చి పడేశారు. లేచి ఆ ఆకుల దొన్నెను దగ్గరకు లాక్కున్నాడు గణపతి. కాస్త జొన్నకూడు.. ఏవో రెండు వ్యంజనాలు. అందులోనే మరో చిన్నదొన్నెలో పెరుగు లాంటిది.

గబగబా తిన్నాడు. రుచి పచి కాస్త తెలుస్తోంది. అప్పుడే ఓ సంశయం కలిగింది. నిన్ననే ప్రక్కగదిలో ఓ బందీ అరుస్తూ అన్నమాటలు గుర్తొచ్చాయి. ‘‘ఈ కూడు కుక్కలు కూడా తినవ్‌.. ఇదేమి కూడు?’’

‘‘అవును మరి.. నువ్వు మహారాజు కొడుకువి కదూ.. పంచభక్ష్య పరమాన్నాలు పెడతారు నీకు..’’

ఇరువైపులా మాటలు.. తర్వాత ఏవో అరుపులు.. తిట్లు.. కాసేపటికి కొరడా దెబ్బలు.. వాడు ఏడుస్తూ అరుస్తున్నాడు, ‘‘ఈ కూడు కంటే ఈ కొరడా దెబ్బలే నయం.’’

అంటే కూడు అంత నీచంగా ఉందన్నమాట.

మరోసారి తనచేతిలోని ఆకుల దొన్నెలోకి చూశాడు. పెట్టిన కూడు కుక్కలు కాదు మనుషులు తినేదే పెట్టారు. పైగా రెండు భక్ష్యాలు వేశారు. ప్రక్కన గడ్డ పెరుగు. అబ్బో.. నిజంగానే తనను మహారాజు కొడుకుగా గుర్తించారు కాబోలు!

నిత్యమూ ఇలాంటి భోజనమే పెడుతున్నారు. కొండొకచో వేడివేడిగా కూడా పెడుతున్నారని గుర్తించాడు. ముద్ద చేసి కాకతమ్మను తలచుకుని కళ్లకద్దుకుని తిన్నాడు.

ఆకలి తీరింది. మూలనున్న కుండ ఒంపి చేతులు, మూతి కడిగి ఉత్తరీయంతో తుడుచుకున్నాడు. మెల్లగా ద్వారం దగ్గరకు వెళ్లి బయటకు చూశాడు. సన్నని నడవా.. రాతిగోడలు తప్ప ఏమీ కనబడదు. మరి కాసేపట్లో కొరడా దెబ్బలు, హాహాకారాలు వినిపిస్తాయి. శిక్షల అమలు.. ఈ కారాగారంలో ఎక్కువ మంది పట్టుబడిన కాకతీయ సైనికులే. ఎందుకు రోజూ కొరడాదెబ్బలు కొడతారో తెలియదు. వారి బాధామయ అరుపులు వింటుంటే తననే కొట్టిన బాధ. రోజూ ఇదే సన్నివేశం.

తిరిగి నేలపై జారగిల పడ్డాడు. కళ్లు మూసుకున్నాడు.

కలలు.. ఊహు.. అవి కలలు కాదు. చిన్ననాటి సంఘటనలు.. తల్లి గర్భంలో మస్తిష్కం ఏర్పడి బయటి ప్రపంచం పొడగట్టిననాటి నుండి అన్నీ ఈ చిన్న మస్తిష్కంలో పదిలమౌతున్నట్లు.. తనకే తెలుస్తోంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు అభిమన్యుడు ఇలాగే విని చివరికి ఎవరూ తోడు రాకున్నా ఒక్కడిగా పద్మవ్యూహాన్ని ఛేదించడానికి యుద్దంలో దూకినట్లు.. అమ్మ చెప్పింది.

అమ్మ కడుపులో నుండి బయటకొచ్చాక విన్నవి కూడా మరింత వివరంగా అన్ని గుర్తుంటాయి.. గుర్తొస్తాయ్‌.

‌కలో వాస్తవమో తెలియని సంఘటనల దృశ్యాల సంగమ సందడి..

అలాంటిదే ఈరోజు కలలోకి వచ్చిన సంఘటన. తనను పెదనాన్న గారు దత్తత తీసుకున్నారు. పొత్తిళ్లలో బిడ్డగా ఉయ్యాలలో పవళించి ఉండగా.. జరిగిన తతంగం..

అబ్బ!! ఆ సంఘటన ఎంత బావుంది!?

ప్చ్.. ఇలాంటి భయానక జీవితఘట్టంలో అలాంటి మధుర సన్నివేశాలు కలలుగా రావడం ఎంత బావుందో..

పెదనాన్నగారు ఎంత ముద్దు చేసేవారు.. అనురాగం నిండిన చూపులతో తడి కళ్లతో రెప్పలార్పకుండా తనన చూస్తుండేవారు. కొలువుకు వెళ్లేవారు కాదు. తన నవ్వుల కొలువే ఆయన ప్రపంచం అనేవారు.

పెద్దమ్మ నుండి లాక్కునేవారు. కళ్లెర్ర జేసేవారు పెద్దమ్మను సైతం. అమ్మ, నాన్నగారు ఆ దృశ్యాలను మనోజ్ఞంగా వీక్షించేవారు. ఆయన వేలు అందుకుని తన నోట్లో పెట్టుకోవడం.. పళ్లు లేని లేత నోటితో తను ఆయన వేలును చప్పరించడం.. ఆయన పులకింతతో పగలబడి నవ్వడం..

కిరుర్రు శబ్దాలు మళ్లీ. జ్ఞాపకాల మల్లెల మాలల కదలికలను ఎవరో మళ్లీ భగ్నం చేశారు.

అర్ధనిమీలిత నేత్రాలలో గతాన్ని చూసుకుంటున్న గణపతి తల తిప్పి చూశాడు.

ద్వారం నిండుగా ఓ జంట.. పెద్దమ్మ పెదనాన్నగారు కాదు కదా. అమ్మానాన్న గారేమో?! చటుక్కున లేచి నిలబడ్డాడు. కాదు. మరెవరో జంట.

 ఆహార్య, ఆభరణాలను చూస్తే మహారాజులో.. మంత్రి పుంగవులో..

ఇద్దరూ వివరంగా పరీక్షగా కళ్లు విప్పార్చి నఖశిఖ పర్యంతం చూస్తున్నారు.

‘‘పెద్దవారో చిన్నవారో మిత్రులో శత్రువులో.. నువ్వు నమస్కరించాలి అనిపిస్తే నమస్కరించు..’’ పెదనాన్న చెప్పిన పాఠాలు కంఠోపాఠం!!

చేతులు జోడించి నమస్కరించాడు. పని చేసింది. ఇద్దరి ముఖాలలో లిప్తకాలంలో వెయ్యోవంతులో దరహాస చంద్రికల కాంతి!! ప్రతిగా ఆమె.. మరింత ఆపేక్షగా చూస్తూ.. చేతులు జోడించింది. మనస్కరించలేదేమో ఆయన సంశయించాడు.

ఆయన దేవగిరి మహారాజు జైత్రపాలుడు. ఆమె అతని భార్య చిల్లాదేవి..

ఆయన దాదాపు పెదనాన్నగారు రుద్రదేవుల వారి వయసు కావచ్చు. కదిలి వెనుదిరిగాడు. ఆమె చూపు తిప్పుకుని ఆయన్ను అనుస రించింది. మలుపులో మళ్లీ చూసింది.

అదృశ్యం. మళ్లీ కిరుర్రు శబ్దాలు. తిరిగి నేలపై వాలాడు.

అది దేవగిరిరాజ్యంలోని దేవగిరి నగరంలో చెరసాల. అందులో ఓ సాధారణ బందీల గదిలో బందీగా ఉన్నాడతను…

కాకతీయ యువరాజు గణపతిదేవుడు. పదిహేడేళ్ల నూనూగు మీసాల యువకుడు. జైతుగి అని పేరుపడిన జైత్రపాల మహారాజు పరిపాలిస్తున్న దేవగిరి రాజ్యంపై కాకతీయ మహారాజు మహాదేవుడు ఈ ఏడాది దండయాత్ర చేశాడు.

ఇది శకవర్షం 1119 (క్రీ.శ.1198). కాని కాకతీయులు పరాజయం చవిచూశారు. మహారాజు మహాదేవుడు చనిపోయాడు. అంతేకాదు, యువరాజు గణపతిదేవుని బంధించి తీసుకుపోయి చెరసాలలో ఉంచారు.

దాదాపు పక్షంరోజులు దాటుతోంది.

చుట్టూ చెరసాలలో ప్రతిక్షణమూ వినవస్తోన్న ఏడుపులు, అరుపులు.. కొరడా శబ్దాలు.. తప్ప బయట ప్రపంచం తెలియదు. తొలిసారి కారాగారవాసం తెలుస్తోంది. తనను కొట్టడంలేదు. ఏదో తిండి పెడుతున్నారు. అది నోటికి పోతోంది. కాలకృత్యాలకు తీసుకుపోతున్నారు.

చెరసాలలో బంధించాక తొలిసారి ఓ రాజోచిత వస్త్రధారణ కలిగిన పెద్దలెవరో రావడం ఇదే. ఇప్పటివరకూ వచ్చి న వారంతా కత్తులు కటారులతో వచ్చిన యుద్దయోధులే.. సైన్య నాయకులు లేదా కారాగార అధికారులు!

మరికాసేపటికి మళ్లీ కిరుర్రు శబ్దాలు.. తలతిప్పి చూశాడు. ఈసారి కారాగార అధికారులనుకుంటా.. లోపలికొచ్చారు. తీక్షణంగా లేదు చూపు. కాస్త ప్రసన్నత తాకుతోంది. ముందున్న పెద్ద అధికారి సైగ చేశాడు. వెనుకనున్న సైనికులు ముందుకొచ్చి చేతులకు గొలుసు సంకెలలు వేశారు. ముందున్నాయన కదిలాడు. గణపతిని కదలమన్నట్లు సౌజ్ఞ చేసి. అందరూ కదిలారు.

గణపతి కూడా కదిలాడు. కారాగారం లోపలి దారులన్నీ ఇరుకిరుకు. పెనుచీకటి. కడుపులో దేవేటట్టు పచ్చి నెత్తురు వాసన.. ఏదో తెలియని భయానక వాతావరణం.

మార్గమంతా చిన్న చిన్న గదులు.. నిండా బందీలు..

అందరూ చూస్తోంది గణపతిదేవుని వంకే!!

కాకతీయ యువరాజుగా పట్టాభిషక్తుడైన పదిహేడేళ్ల గణపతిదేవునికి కారాగారం క్రొత్త. అందులోని బందీలు.. వారి చూపులు మరింత కొత్త. అందుచేత తను కూడా వాళ్లను నిశితంగా చూస్తూ పోతున్నాడు. పోయి పోయి రాజప్రసాదంలోకి.. అందుండి తీసుకుపోయి పోయి ఓ గదిలో ఉంచి మళ్లీ దాని ద్వారాలు మూసి వెళ్లిపోయారు. మాటలు లేవు. కాకపొతే కరుకుదనం తగ్గి వినయం ఓ పిసరు హెచ్చినట్లు గుర్తించాడు గణపతి. గది అంతా వివరంగా చూశాడు. ఇది మరో కారాగారం. కాకపొతే కాస్త వసతులు హెచ్చు. మంచి తల్పం, ఒకటో రెండో పల్యంకాలు.. ఎంతైనా రాజప్రసాదంలోని కారాగారం కదా!

తనతోపాటు వెయ్యిమందికి పైగా కాకతీయ సైనికులను బంధించి తెచ్చినట్లు కాపలా భటులు చెప్పుకుంటుంటే విన్నాడు. వాళ్లనందరినీ కూడా ఈ రాజప్రాసాదపు కారాగారాలలోకి తరలిస్తారా.. ప్చ్.. ‌తరలించకపోవచ్చు.

తల్పంపై కూర్చున్నాడు. మెత్తని దూది పరుపు. దానిపై పరిచిన విలువైన వస్త్రాలు.. కుడ్యాలకు వ్రేలాడుతూ విలువైన తెరలు.. వినయంగా మౌనంగా.. రక్షణ భటుల్లా.. కొండొకచో స్నేహితుల్లా..

‘‘తొందరపడకు. ఆలోచించు. అంతకు ముందు విను. విన్నాక కాస్త మౌనం. అందులో వేగంగా ఆలోచన. అప్పుడే ఓ అవగాహనకు రావాలి. ఇవన్నీ లిప్త కాలంలో నిర్వహించాలి. చావో రేవో..’’

ఆ రోజు వ్రేలు పట్టుకుని యుద్ధ శిక్షణ శాలలో తిరుగాడుతూ పెదనాన్న చెప్పిన మాటలు..

ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చినట్లు??

ఎవరో తలుపులు తీశారు. హమ్మయ్య కిరుర్రు శబ్దాలు లేవు. మెత్తగా వినయంగా తెరుచుకున్నాయి. లోపలికి వచ్చారొక వ్యక్తి. సైనికయోధుని ఆహార్యం. నడుముకు వ్రేలాడుతున్న ఒర. ఆజానుబాహువు. చూపుల్లో క్రూరత్వం కలగలిసిన హుందాతనం, అధికార దర్పం. వెంట నలుగురైదుగురు భటులు.

వారిలో ఒకడు ముందుకు వచ్చి చెప్పాడు. ‘‘దేవగిరి రాజ్య సర్వసైన్యాధికారి శ్రీ జల్లన సేనానులవారు..’’

మళ్లీ పెదనాన్న గుర్తొచ్చారు. లేచి నమస్కరించాడు గణపతిదేవుడు.

ఆ పెద్దాయన.. జల్లన సేనాని కూడా చేతులు జోడించాడు.

‘‘శుభాశీస్సులు! కౌమారంలో ఉన్నావు. నేను నీ ప్రవర్తనను పరిశీలించ మన్నాను. కాని ఎప్పుడూ బెదిరి కంటనీరు పెట్టుకున్నట్లు మా కారాగార ఉద్యోగులు చెప్పలేదు. శత్రువుల చేత చిక్కిన చిన్న పిల్లవాడివి. అభిషిక్తుడైన కాకతీయ యువరాజువి. నిన్ను సంహరించడం మాకు చాల చిన్నపని. కాని అది అవసరమా అని మహారాజులవారు తర్జనభర్జన పడుతున్నారు. కానీ నిన్ను ఇప్పటివరకూ పరీక్షిస్తున్నామే కానీ నీపై ఎలాంటి చర్య తీసుకోలేదు. ఎందుకో తెలుసా..?’’ ఆపాడు.

అప్పుడు నిజంగానే భయం వేసింది గణపతికి. చంపలేదు. కొరడాదెబ్బలు కొట్టలేదు. చర్మం వలిపించలేదు. కళ్లు పెరికించలేదు. నిజమే!! కొంపదీసి ఇప్పుడు మొదలెడతారేమో.. అదే చెబుతున్నాడీ రణపిపాసి!!

నిజమే.. తనెందుకు భయపడటం లేదు? అది పెదనాన్న గారి పెంపకం!

అదే చెప్పాడు. ‘‘మా పెదనాన్నగారు కాకతీయ మహామండలేశ్వరులు రుద్రదేవులు నాకు చెప్పిన సుభాషితాలు అనుకుంటున్నాను మహాసేనాని..’’

స్పష్టంగానూ వినయంగానూ చెప్పడం గణపతిదేవుని ప్రత్యేకత.

‘‘లెస్స.. లెస్స పలికితివి యువరాజా. మీ పెద తండ్రిగారు మహా మేధావి. యుద్దానికి దండెత్తి వెళ్లడం.. ఓడిపోయే పరిస్థితి వస్తే వెంటనే ఆ రాజ కుటుంబం లోని అబ్బాయికో అమ్మాయికో తన కుటుంబంలోని వారిది ఓ పేరు చెప్పి ఓ కత్తికి తాళి కట్టించేసి కత్తు కలుపుకోవడం.. అదే ఆయన చాణక్యం. అది పీఠభూమి రాజ్యాల్లో సాగింది కాని తీరాంధ్రంలో, ఈ ఆగ్నేయ, ఉత్తర, ఈశాన్య రాజ్యాలతో కుదరదు. అది ఆయనకు క్షుణ్ణంగా తెలుసు కనుకే కత్తి పడేసి ప్రశాంతంగా కన్నుమూశాడు. కాని మీ తండ్రి రెచ్చిపోయి వచ్చివచ్చి మాపై కత్తి ఝుళిపించి ఏదో సాధించబోయాడు.. కాని చేతకాక మట్టి కరిచాడు.’’

దవడ కండరాలు బిగుసుకున్నాయి. గెలిచినవాడి వాక్యం రసాత్మక సుభాషితం! ఒప్పుకోక చస్తామా!

‘‘రెచ్చగొడితే రెచ్చిపొతే నీకూ ఓ సాధారణ సైనికుడికి తేడా ఏముంది! కనుక రెచ్చగొట్టినప్పుడు ప్రశాంతంగా వినడంలోనూ కనురెప్పల కదలికల మధ్య శత్రువును ఎలా నరకాలో ప్రణాళిక రచించడంలోనూ విజయం ఉంది.’’

పెదనాన్న తన కోసం పూర్తిగా బాటలు పరిచాడు. ఎక్కడ గుట్ట ఉన్నదో.. ఎక్కడ రక్కెసపోదలు.. ఎక్కడ రాళ్లు రప్పలు.. పొదలు ముళ్లూ ఉంటాయో దృశ్యాదృశ్యంగా చిన్నప్పుడే వివరించాడు కదా..

కళ్లు మూసుకున్నాడు.

‘‘ఓహ్‌. ‌మౌనం మంచి సమాధానం! రుద్రదేవుడి శిక్షణ కాబోలు. నిన్ను తన వారసుడుగా తీర్చిదిద్దుతున్నట్లు మాకు వర్తమానం ఉందిలే.’’

భావరహితం ఉత్తమం!! వింటున్నట్లుగా ఉంచాడు ముఖం.. చిరునవ్వులో పావువంతు తగిలించాడు.

‘‘నిన్ను సాధారణ కారాగారం నుండి ఈ రాజప్రాసాద చెరసాలకు ఎందుకు మార్చమన్నారో.. ప్చ్.. ఆ ‌పిచ్చోడికి తప్ప ఎవ్వరికీ తెలియదు..’’

చిరాకుగా ముఖం పెట్టి వెనుదిరిగాడు. మళ్లీ ఇటు తిరిగాడు.

‘‘ఎందుకు మార్చారో చెప్పాడా వాడు?!’’

‘‘లేదు దేవరా. ఏదో పన్నాగంలా..’’

వాడు చెబుతుంటే ఆపమన్నట్లు చెయ్యెత్తాడు జల్లన సేనాని.

(సశేషం)

About Author

By editor

Twitter
YOUTUBE